“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

6, డిసెంబర్ 2018, గురువారం

మీ ఫిలాసఫీ ఏంటి?

మొన్నొక వ్యక్తినుంచి ఇలా ఈ - మెయిల్ వచ్చింది.

'నేను మీ గ్రూపులో చేరుదామని అనుకొని మీకు ఇంతకు ముందు ఫోన్ చేశాను. మీరేమో పంచవటి గ్రూపు మీ శిష్యులకే పరిమితం అని చెప్పారు. నేను ప్రస్తుతం మీ శిష్యుడిని కాగలనో లేదో చెప్పలేను. కానీ అసలంటూ మీ ఫిలాసఫీ ఏంటో తెలుసుకోవాలని ఉంది. అందుకే మీ గ్రూపులో చేరుదామని అనుకున్నాను. అది కుదరలేదు. మీ ఫిలాసఫీ ఏంటో చెప్తారా?'

అతనికి ఇలా మెయిల్ ఇచ్చాను.

'నా ఫిలాసఫీ చాలా సింపుల్. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడమే నా ఫిలాసఫీ.'

అతని నుంచి ఇలా రిప్లై వచ్చింది.

'అది ఆధ్యాత్మికత ఎలా అవుతుందో నాకర్ధం కావడం లేదు. లోకంలో అందరూ చేస్తున్నది అదేగా? మరి అందరూ ఆధ్యాత్మికులు అవుతున్నారా?'

అతనికి ఇలా జవాబిచ్చాను.

'మీకు విషయం సరిగా అర్ధం కాలేదు. మీరేకాదు. లోకంలో చాలామంది ఇదే అవగాహనా రాహిత్యంతో ఉన్నారు. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడమే అసలైన ఆధ్యాత్మికత. అయితే, మీరన్నట్లు లోకంలో అందరూ చక్కగా వాళ్ళవాళ్ళ జీవితాలను ఎంజాయ్ చేస్తున్నారా? అంటే లేదనే జవాబు వస్తుంది. ఎంజాయ్ చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. దానికోసం ఎక్కడెక్కడో వెదుకుతున్నారు. ఆ క్రమంలో ఎన్నో చికాకులకు, అసహనాలకు, అశాంతికి, భయానికి, బాధలకు, నిరాశలకు, నిస్పృహకు గురౌతున్నారు. అంతే ! మరది ఎంజాయ్ మెంట్ ఎలా అవుతుంది? అసలు సంగతి అది కాదు.

నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న వారు మాత్రమె తమ జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చెయ్యగలుగుతారు. మిగతావారు అలా చేస్తున్నామన్న భ్రమలో బ్రదుకుతూ ఉంటారంతే. అసలైన ఎంజాయ్ మెంట్ అంటే ఏమిటో వాళ్లకు తెలియదు. వాళ్లకు తెలిసినదే నిజమన్న భ్రమలో ఉంటూ ఉంటారు.

వివేకానందస్వామి రెండవసారి అమెరికా యాత్రా సమయంలో ఒక క్రైస్తవ మత బోధకునితో ఆయనకిలా సంభాషణ జరిగింది. అతని పేరు Robert Ingersoll అనుకుంటాను సరిగా గుర్తులేదు.

అతనిలా అన్నాడు.

'మీ వేదాంతం మీద నాకు నమ్మకం లేదు. జీవితంలో నా ఫిలాసఫీ ఒకటే It is to squeeze the orange dry. I want to enjoy my life.'

దానికి వివేకానంద స్వామి ఇలా జవాబిచ్చారు.

'నా ఫిలాసఫీ కూడా అదే. కాకుంటే నువ్వు చేస్తున్నానని అనుకుంటున్నావు. కానీ చెయ్యలేవు. ఎందుకంటే, నీ జీవితం అయిపోతున్నది, కాలం నీ చేతులోనుంచి జారిపోతున్నది, ఈ మానవజన్మ పోతే మళ్ళీ రాదన్న ఆదుర్దా నీలో ఉంది. భయం నీలో ఉంది. ఆ క్రమంలో నువ్వు పక్కవాడి నోటి దగ్గరది కూడా లాక్కుని తినే ప్రయత్నం చేస్తావు. నేనలా చెయ్యను. ఎందుకంటే, నేనీ శరీరాన్ని కాదని నాకు తెలుసు. ఇది పోయినా నేను ఉంటాను. నాకు భయం లేదు. బాధ లేదు. ఆదుర్దా లేదు. ప్రక్కవాడిని నేను మోసం చెయ్యను. వాడిది కూడా లాక్కొని నేను తినాలని అనుకోను. అలా తినకపోతే నేనేదో కోల్పోతానన్న భయం నాలో లేదు. నేనలా కోల్పోయేది ఏదీ లేదని నాకు తెలుసు. కనుక నా జీవితంలో పరుగు ఉండదు. ఇంకొకడితో పోటీ ఉండదు.

కనుక నా మనసు ప్రశాంతంగా ఉంది. అందులో కల్లోలం లేదు. అందులో అశాంతి లేదు. కనుక జీవితాన్ని నీకంటే నేనే ఎక్కువగా ఎంజాయ్ చెయ్యగలను. ఈ నిబ్బరం వేదాంతం వల్లనే వస్తుంది. That is why I can squeeze the orange really dry, in a way much better than you can'.

వివేకానందస్వామి చెప్పినదానినే నేను చెబుతున్నాను. చెప్పడమే కాదు ఆచరిస్తున్నాను. నా శిష్యుల చేత ఆచరింపజేస్తున్నాను.

నిజమైన ఆధ్యాత్మికులు మాత్రమె జీవితాన్ని భయం లేకుండా, ఆదుర్దా లేకుండా, అసూయ లేకుండా, అభద్రతాభావం లేకుండా, మోసం లేకుండా, కపటం లేకుండా, స్వచ్చంగా ఎంజాయ్ చెయ్యగలరు. నిజమైన ఎంజాయ్ మెంట్ ఏంటో వారికే తెలుస్తుంది. ఆధ్యాత్మికత అనే పునాది లేనివారి జీవితాలు టెన్షన్ తోనే గడిచి టెన్షన్ లోనే ముగిసిపోతూ ఉంటాయి. దాన్నే వాళ్ళు ఎంజాయ్ మెంట్ అనుకుంటూ ఉంటారు. అదే మాయంటే!

నా శిష్యుడు కాకుండా మీరు నా ఫిలాసఫీని తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నారు. అంటే, మీకు కమిట్ మెంట్ అంటే భయమన్న మాట ! ఒక బయటివ్యక్తిగా ఉంటూ, లోపలవన్నీ చూద్దామని తెలుసుకుందామని మీ ప్రయత్నం. ఈ ప్రయత్నం వల్ల మీకేమీ ఒరగదు. విషయం ఏదో కాస్త అర్ధమైనట్లు మీకు అనిపించవచ్చు. కానీ ఆ అనిపించడం వల్ల మీకేమీ దక్కదు. లోపలకు అడుగువేసి, నాతో అడుగులు కలిపి నడిస్తేనే మీరు అనుకుంటున్నది మీకు దక్కుతుంది.

మళ్ళీ చెబుతున్నాను. జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చెయ్యడమే నా ఫిలాసఫీ. ఈ సందర్భంగా జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు ఒకటి నాకు గుర్తొస్తున్నది.

'అన్నీ అనుభవిస్తూ, అన్నింటికీ అతీతంగా వెళ్ళడమే సంసారం'

అదెలా సాధ్యమౌతుందో, ఆ మార్గంలో నడిస్తేనే అర్ధమౌతుంది. ఊరకే నా వ్రాతలు చదివితే అర్ధంకాదు. ఒకవేళ అలా చదవాలనుకుంటే ముందుగా నేను వ్రాసిన, వ్రాస్తున్న పుస్తకాలను బాగా చదవండి. నా భావాలను బాగా అర్ధంచేసుకోండి. ఆ తర్వాత మా గ్రూపులో చేరేది లేనిది నిశ్చయం చేసుకోవచ్చు' -  అంటూ ముగించాను.

ఈ భూమ్మీద మనకొక జీవితం ఇవ్వబడింది. అది కొన్నాళ్ళే ఉంటుంది. దానిని సరిగ్గా జీవించడాన్ని మించిన ఫిలాసఫీ ఇంకేముంటుంది?