“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, డిసెంబర్ 2017, సోమవారం

కలబురిగి కబుర్లు - 4 (బుద్ధవిహార్)







కలబురిగిలో చూడదగిన ప్రదేశాలు ఏమున్నాయని మావాళ్ళను అడిగాను. ఏవేవో గుళ్ళూ గోపురాలూ చెప్పారు. వాటికి పోవాలని నాకేమీ అనిపించలేదు. కానీ ఒక ప్రదేశం మాత్రం చూడాలనిపించింది. అదే, గుల్బర్గా యూనివర్సిటీ వెనుకగా ఊరికి దూరంగా ఉన్న ' బుద్ధ విహార్ '. ఎనిమిదేళ్ళ క్రితం కర్నాటక అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో దీనిని రూపకల్పన జరిగింది.

దీనిని 2009 లో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, దలైలామాలు ప్రారంభించారని చెబుతున్నారు. గుల్బర్గాలో 'పాటిల్' అనేవాళ్ళ హవా ఎక్కువ. ఎక్కడ చూచినా ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళే ఉంటారు. బిజినెస్ లో, ఉద్యోగాలలో వీళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు.

దాదాపు 70 ఎకరాల విశాలమైన కొండప్రాంతంలో ఇది కట్టబడింది. ఊరికి దూరంగా నిశ్శబ్ద వాతావరణంలో ఈ ప్రాంగణం ఉన్నది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక పెద్ద ధ్యానమందిరం ఉంది. ఇందులో బుద్ధుని విగ్రహం ఉన్నది. ఫస్ట్ ఫ్లోర్ లో బుద్ధుని ఆలయం ఉన్నది. ఇందులో కూడా బుద్ధుని విగ్రహంతో బాటు పక్కన ఇద్దరు ప్రధానశిష్యుల విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళు సారిపుత్ర, మౌద్గల్యాయన అని వాళ్ళ విగ్రహాల తీరును బట్టి అనుకున్నాను. ఈ విగ్రహాలు థాయిలాండ్ విగ్రహాల పోలికలతో ఉన్నాయి.

ఈ బుద్ధవిహార్ బయట, అంబేద్కర్ తన అనుచరులతో బౌద్ధమతంలోకి మారుతున్న లైఫ్ సైజ్ విగ్రహాలు ఉన్నాయి. 

ఈ బుద్ధ విహార్ కు దగ్గరలోనే కనగనల్లి అనే ఒక గ్రామం ఉన్నది. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలోనే ఈ గ్రామంలో కమలముని అని ఒక ప్రసిద్ధ బౌద్ధభిక్షువు ఉండేవాడని చరిత్ర చెబుతున్నది. అప్పట్లోనే ఇది ఒక ప్రసిద్ధ బౌద్ధ కేంద్రంగా ఉన్నదన్నమాట.

క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం ప్రాంతంలోనే కర్నాటకలో జైన మతం విలసిల్లిందన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే చంద్రగుప్త మౌర్యుడు తన గురువైన భద్రబాహువుతో కలసి కర్నాటకలోని శ్రావణబెలగొలకు వచ్చి అక్కడే తపస్సులో తనువు చాలించాడన్నది చరిత్రలో రికార్డ్ కాబడిన విషయం. అక్కడున్న చంద్రగిరి అనే కొండకు ఆ పేరు  ఈయన నుంచి వచ్చినదే. కానీ బౌద్ధం కూడా అప్పుడే కర్నాటకలో ఉన్నదన్న విషయం ఇప్పుడే విన్నాను. బహుశా కమలముని అనేవాడు జైనముని అయ్యిఉండవచ్చు. వీళ్ళు బహుశా పొరపాటు పడుతూ ఉండవచ్చు. ఎందుకంటే అలాంటి పేర్లు బౌద్దులలో ఉండటం అరుదు.

అప్పుడప్పుడు వస్తున్న టూరిస్టుల వెకిలి గోల తప్ప మిగతా సమయాలలో చాలా ప్రశాంతంగా ఉందిక్కడ. ఊరికి చాలా దూరంగా ఉన్నది గాబట్టి సాయంత్రం అయిదుకల్లా దీనిని మూసేస్తారు. స్టాఫ్ తప్ప ఇక్కడ రాత్రంతా ఎవరూ ఉండరు. కానీ గెస్టులకోసం కొన్ని రూములు కనిపించాయి. వాటిల్లో ఉండే అవకాశం దొరికితే రాత్రంతా అక్కడ ఉండి ధ్యానంలో కాలం గడపొచ్చు అన్న ఆలోచన చాలా సంతోషాన్నిచ్చింది. ఈసారి ఆ ప్రయత్నం చెయ్యాలి.

పక్కనే ఉన్న ఒక పెద్ద భవనంలో ఒక బుద్ధిస్ట్ లైబ్రరీ కూడా ఉన్నదన్న విషయం విన్నప్పుడు మాత్రం కలబురిగికి వచ్చిన తర్వాత కలిగిన ఆనందాలలో కెల్లా గొప్ప ఆనందం కలిగింది. కానీ నేను వెళ్ళినప్పుడు అక్కడేవో రిపేర్లు జరుగుతూ ఉన్నందున లోనికి అనుమతించలేదు.

రాబోయే మూడేళ్ళలో ఇక్కడకు చాలాసార్లు రావలసి ఉంటుంది గనుక, ఈసారి వచ్చినప్పుడల్లా, నా లగేజిని మా అమ్మాయి రూములో పడేసి, రోజంతా ఈ లైబ్రరీలో మకాం వేసి ఇందులోని బౌద్ధగ్రంధాలను (ఇప్పటిదాకా నేను చదవనివంటూ కనిపిస్తే) మొత్తం జీర్ణం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చి అక్కడనుంచి బయలుదేరి వెనక్కు వచ్చాను.