“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

20, నవంబర్ 2017, సోమవారం

పంచరు - రిపేరు

ఈ రోజుల్లో యోగసాధన అనేది ఒక ఫేషన్ అయిపోయింది. నేను చెబుతున్నది మామూలు యోగాసనాల గురించి కాదు. ప్రాణాయామ, ధ్యాన, ధారణాది క్రియలతో కూడిన హయ్యర్ యోగా గురించే నేను చెబుతున్నాను.

హయ్యర్ యోగాను ఎవరు బడితే వారు చెయ్యకూడదు. ఎందుకంటే దానివల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. దానివల్ల మానసికంగా ప్రాణికంగా చాలా మార్పులు మనిషిలో కలుగుతాయి. వాటిని ఆ గురువు సరిచెయ్యలేకపోతే ఆ సాధకుని పరిస్థితి చాలా దారుణంగా తయారౌతుంది.

యోగాసనాలను కొంచం అటూ ఇటూగా తప్పుగా చేసినా పెద్ద హాని ఏమీ జరగదు. ఎందుకంటే అవి శరీర పరిధిని దాటి పైకి పోవు. కానీ హయ్యర్ యోగిక్ క్రియలతో ఆటలాడితే మనిషికి మెంటల్ వస్తుంది. ఎందుకంటే అవి సూటిగా సెంట్రల్ నెర్వస్ సిస్టం మీదా, మెదడు మీదా ప్రభావం చూపిస్తాయి.కనుక వాటిని సరియైన గురువు పర్యవేక్షణలో ఎంతో నిష్టగా చెయ్యవలసి ఉంటుంది. అలా కుదరనప్పుడు వాటి జోలికంటూ అస్సలు పోకుండా మామూలు యోగాసనాలను ఒక వ్యాయామంలాగా చేసుకోవడమే మంచిది. కనీసం హెల్త్ అయినా బాగుంటుంది.

ఈ విషయం నేను ఎప్పటినుంచో నేనెరిగిన వారికి చెబుతూనే ఉన్నాను. కొంతమంది నమ్మారు. చాలామంది నమ్మలేదు. కానీ ఈ మధ్యన నాకెదురౌతున్న కేసులు చూస్తుంటే నేను చెబుతున్నది నిజమే అని అందరూ నమ్ముతున్నారు.

ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను.

మొన్నీ మధ్యన కోయంబత్తూర్ నుంచి ఒక ఫోనొచ్చింది. దాని సారాంశం ఏమంటే - ఒక 26 ఏళ్ళ అమ్మాయి, ఇంకా పెళ్లి కాలేదు, గత రెండేళ్ళ నుంచీ సద్గురు జగ్గి వాసుదేవ్ గారి దగ్గర శాంభవీ మహాముద్ర, శక్తి సంచాలన క్రియలు దీక్ష తీసుకుని పట్టుగా సాధన చేస్తోంది. తత్ఫలితంగా ఆ అమ్మాయి శరీరంలో చాలా మార్పులు వచ్చేశాయి.

తను బాగా చదువుకున్నది. గూగుల్ లో ఉద్యోగం కూడా చేస్తోంది. కానీ ఈ మార్పుల వల్ల ఉద్యోగం మానెయ్యవలసిన పరిస్థితి వచ్చేసింది. మానేసింది. తన సాధనా ఫలితంగా ఈ మార్పులు తనలో కలిగాయని ఇంకా కలుగుతున్నాయని నాకు చెప్పింది.

ఆ మార్పులేంటో వినండి మరి !!

> తన ఒంట్లో ఎడమ వైపు అంతా తనకు స్పర్శ పోయింది. అసలు తన శరీరం ఎడమ భాగం ఉందో లేదో కూడా తనకిప్పుడు స్పృహ లేదు. కుడివైపు మాత్రమే ఫీల్ ఉన్నది.

> టైం సెన్స్ అనేది ఈ అమ్మాయికి పూర్తిగా పోయింది. ఇప్పుడు టైమెంత? అని అడిగితే ఎండను చూచో రాత్రిని చూచో ఇది ఉదయం అనో, మధ్యాన్నం అనో, లేదా సాయంకాలం అనో మనం చెప్పగలం. కానీ ఈ అమ్మాయి ఏమీ చెప్పలేని స్థితిలో ఉంది.

> శరీరం అంతా కరెంట్ పాసవుతున్నట్లుగా ఫీలింగ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ షాకులు కొడుతున్నట్లుగా ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది.

>ఆకలి నశించింది. ఏదీ తినాలని అనిపించదు. బలవంతాన టైముకు తినడమే.

> నిద్ర తగ్గిపోయింది. రాత్రిలో మూడు గంటలు నిద్రపోతే సరిపోతుంది. తెల్లవారుజామున మూడు నాలుగుకు అదే మెలకువ వచ్చేస్తుంది. ఇక నిద్ర పట్టదు.

> ఏ పనీ చెయ్యాలనిపించదు. నీరసంగా నిస్సత్తువగా ఉంటుంది. ఎప్పుడూ పడుకొని ఉండాలనిపిస్తుంది.

ఈ లక్షణాలు చెప్పి తనిలా అడిగింది.

'మీ ఇంగ్లీష్ బ్లాగ్ నేను చూచాను. అందులో ఒకచోట మీరు 'ఒక మనిషిని చూస్తేనే అతని ఆధ్యాత్మిక స్థాయి ఎంతటిదో నాకు తెలిసిపోతుంది' అని వ్రాశారు. అది చదివి మీకు ఫోన్ చేస్తున్నాను. నా పరిస్థితి ఇలా ఉంది.మీరు నాకేమైనా సాయం చెయ్యగలరా?'

నేనామెను ఇలా అడిగాను.

'చూడమ్మా. నీకు దీక్షనిచ్చిన గురువు బ్రతికే ఉన్నాడు. మీ ఊళ్లోనే ఉంటాడు కదా. ఆయన్ను వెళ్లి కలువు. నీ పరిస్థితి చెప్పు. సరిచెయ్యమని అడుగు. అదే సరియైన పద్ధతి. అంతేగాని దీక్ష ఒకరి దగ్గరా, కరెక్షన్ ఇంకొకరి దగ్గరా పనికిరాదు.' అన్నాను.

'మీరు నాకు సాయం చెయ్యలేరా?' అడిగింది నీరసంగా.

పాపం ఒక ఆడపిల్ల అలా అడుగుతుంటే బాధనిపించింది. సామాన్యంగా ఒక గురువు దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు మనం జోక్యం చేసుకోకూడదు. అది ఆధ్యాత్మిక లోకపు నియమాలకు విరుద్ధం అవుతుంది. ఆయన బ్రతికి లేకుంటే అది వేరే విషయం. కానీ ఆయన జీవించే ఉన్నప్పుడు మనం కల్పించుకోకూడదు. ఎక్కడ పంచర్ పడిందో అక్కడే రిపేరు జరగాలి. అంతేగాని ఒకచోట పంచరూ ఇంకోచోట రిపేరూ పనికిరావు. కానీ ఈ అమ్మాయి దీనంగా అడుగుతుంటే మనసొప్పక ఇలా చెప్పాను.

'సరేనమ్మా చేస్తాను. నీవు గుంటూరుకు వచ్చి మా కుటుంబంతో కలసి మా ఇంట్లో మూడు రోజులుండు. నీ పరిస్థితి బాగు చేస్తాను. నీకు పెళ్లి కాలేదని అంటున్నావు. నా దగ్గరకు వస్తున్నానని మీ అమ్మానాన్నలతో  చెప్పి, వారి పర్మిషన్ తీసుకుని రా. చెప్పకుండా రావద్దు. నేనూ నా భార్యా స్టేషన్ కు వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటాము. మళ్ళీ భద్రంగా మూడ్రోజుల తర్వాత రైలెక్కిస్తాము.' అన్నాను.

'చెబితే మా వాళ్ళు ఒప్పుకుంటారో లేదో?' అంది ఆ అమ్మాయి.

'చెప్పకుండా నువ్వు రావద్దు. అది మంచి పద్ధతి కాదు. చెప్పి, వాళ్ళు ఒప్పుకుంటేనే రా. లేకుంటే రావద్దు.' అని ఖండితంగా చెప్పాను.

'మూడ్రోజులలో మీరు నా పరిస్థితి బాగు చెయ్యగలరా అసలు?' అడిగింది ఆ అమ్మాయి అనుమానంగా.

ఈ అమ్మాయికి నిజాయితీ లేదనీ, శ్రద్ధ లేదనీ నాకు అర్ధమై పోయింది. ఊరకే నెట్లో చూసి నాలుగు రాళ్ళు విసురుతోంది. అంతే.

'చూడమ్మా. బాగు చేస్తానని నేను గ్యారంటీ ఇవ్వలేను. ప్రయత్నం చేస్తాను. కానీ ఒక షరతు. నువ్వు నా మార్గాన్ని అనుసరించాలి. నేనేమీ మాయమంత్రాలు ఉపయోగించను. నీ ప్రస్తుత పరిస్థితి ఎందుకొచ్చిందంటే, మీ గురువు గారు నేర్పిన అభ్యాసాలను నువ్వు చెయ్యడం వల్ల వచ్చింది. అవి ఆయన ఎలా నేర్పారో, నువ్వు సరిగా చేస్తున్నావో లేదో నాకు తెలీదు. అదంతా నాకనవసరం.

నీకు నా హెల్ప్ కావాలంటే, ముందు నువ్వు సద్గురు దగ్గర నేర్చుకున్న అభ్యాసాలు వెంటనే మానుకోవాలి. నేను చెప్పిన అభ్యాసాలు చెయ్యాలి. అంటే నువ్వు నా మార్గంలోకి వచ్చి నా శిష్యురాలిగా మారాలి. నేను చెప్పినట్లు వినాలి. అప్పుడు నీ బాధలు నయం చెయ్యగలను. అంతేగాని ఏదో మంత్రం వేసి నీ బాధలను నేను మాయం చెయ్యలేను. నీకిష్టమైతే రా.' అన్నాను.

ఆ అమ్మాయి కాసేపు ఆలోచించింది.

'మీదే మార్గం?' అడిగింది.

'నాదీ యోగమార్గమే. అయితే నా మార్గం ప్రస్తుతం నువ్వు అనుసరిస్తున్న దానికంటే విభిన్నంగా ఉంటుంది. అదంతా ఎలా ఉంటుందో నీకు వివరించి చెప్పడం ఫోన్లో సాధ్యం కాదు. నా బ్లాగు పూర్తిగా చదువు. నీకు కొంత ఐడియా వస్తుంది.' అని చెప్పాను.

'నేను మా గురువుకు అన్యాయం చెయ్యలేను. ఆయన్ను విడిచి పెట్టలేను.' అంది.

'సంతోషం అమ్మా. నీ గురుభక్తి బాగుంది. ఆయన్ను విడిచి పెట్టమని నేనూ చెప్పడం లేదు. ఆయన్నే అనుసరించు. ఆయన్నే కలిసి నీ సమస్యలు వివరించు.అదే మంచి పని. అదొక్కటే నీకున్న మార్గం.ఎందుకంటే - ఆయన నీకేం నేర్పించారో నాకు తెలీదు. వాటిని నువ్వెలా చేస్తున్నావో అసలే తెలీదు. ఆయన చెప్పినది నీకు సూటవక పోయినా ఇలా జరిగే అవకాశం ఉంది. లేదా ఆయన చెప్పిన దాన్ని నువ్వు సరిగ్గా చెయ్యకపోయినా కూడా ఇలా జరగొచ్చు. సరిగ్గా చేస్తున్నా కూడా జరగోచ్చు. ఏది ఏదైనా దీనిని సరి చెయ్యవలసింది నీకు దీక్షనిచ్చిన గురువే. కనుక ఆయన్నే కలువు.' అని చెప్పాను.

'కానీ ఆయనిప్పుడు మాకందే స్థాయిలో లేరు. మామూలు మనుషులకు ఆయన ఇంటర్వ్యూ ఇప్పుడు దొరకదు. ఆయన శిష్యులో, ఆ శిష్యుల శిష్యులో మాకు చెబుతారు. వారినే మేం కలవాలి.' అంది.

'పోనీ వారినే కలువు. ఎవరైనా సరే, ఆయన చెప్పిన అభ్యాసాలే కదా మీకు నేర్పించేది?' అన్నాను.

'అలా కాదు. మా గురువు ఇప్పటికే కొన్ని కాంట్రవర్సీలలో ఇరుక్కున్నారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా ఆయన దగ్గరకు వెళ్లి, మీరు చెప్పినవి చేసినందువల్ల మాకిలా అవుతోంది అని చెబితే, అది పబ్లిసిటీ అయితే, ఆయనకింకా చెడ్డపేరు వస్తుంది. అది నాకిష్టం లేదు.' అంది.

ఈ అమ్మాయి లాజిక్ ఏంటో నాకర్ధం కాలేదు.

'నీ జనన వివరాలు నీకు తెలిస్తే చెప్పమ్మా?' అడిగాను.

' తెలుసు' అని జనన తేదీ, సమయం, పుట్టిన ఊరు చెప్పింది.

వెంటనే పక్కనే ఉన్న లాప్ టాప్ లో జాతక చక్రం ఓపన్ చేశాను. చూస్తూనే విషయం మొత్తం అర్ధమైంది. ఈ అమ్మాయి జాతకంలో ఆధ్యాత్మిక యోగాలున్న మాట వాస్తవమే. అయితే పురోగతికి ప్రతిబంధకాలు కూడా గట్టిగానే ఉన్నాయి. వాటిని అధిగమిస్తేనే గాని ఈ అమ్మాయి ఆధ్యాత్మికంగా ఎదగలేదు.

'చూడమ్మా. ముందుగా నీకు కావలసింది ఏమిటి? నీ ఆరోగ్యం బాగు పడటమా? లేక మీ గురువుకు మంచి పేరు రావడమా? అది తేల్చుకో ముందు' అన్నాను.

'రెండూ కావాలి' అంది ఆ అమ్మాయి మొండిగా.

ఇది జరిగేపని కాదని నాకర్ధమైపోయింది. 'సరేనమ్మా. ఈ విషయంలో నీకు సాయం చేద్దామని ముందుగా అనుకున్న మాట నిజమే. కానీ ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకున్నాను. నేను నీకేమీ సాయం చెయ్యలేను. సారీ! నీకు తోచిన ప్రయత్నాలు చేసుకో. ఎందుకంటే, ఎక్కడ పంచర్ అయిందో అక్కడే రిపేర్ కూడా జరగాలి. కానీ ఒక్క మాట విను. ఇవే అభ్యాసాలు ఇంకొన్ని నెలలు గనుక ఇలాగే చేశావంటే నువ్వు మెంటల్ హాస్పిటల్లో తేలతావు. అసలే చిన్నపిల్లవి. ముందు ముందు పెళ్లి కావాలి. జీవితం బోలెడంత ఉంది. బాగా ఆలోచించుకొని ఏ అడుగైనా వెయ్యి' అన్నాను.

'ఓకె. థాంక్స్' అని కరుకుగా అని ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి.

ఇలాంటివాళ్ళు ఈ మధ్యన చాలామంది కనిపిస్తున్నారు. జస్ట్ ఫోన్ కాల్ తో వీళ్ళకన్నీ అయిపోవాలి.బస్సు టికెట్లూ, రైలు టికెట్లూ, సినిమా టికెట్లూ. బ్యాంకు పనులూ వగైరాలన్నీ ఇప్పుడలాగే ఫోన్ మీదే అవుతున్నాయి కదా. అలాగే ఆధ్యాత్మికం కూడా ఫోన్లోనే అయిపోవాలి. ఊరకే ఫోన్ చెయ్యగానే వీళ్ళ సమస్యలన్నీ సాల్వ్ అయిపోవాలి. ఈ విధంగా ఆశిస్తున్నారు. ఇదొక సామూహిక గ్రహప్రభావం. వేలాది లక్షలాది మందిని ప్రభావితం చేసే ఇలాంటివన్నీ ఔటర్ ప్లానెట్స్ అయిన యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ల ప్రభావం వలన జరుగుతూ ఉంటాయి. 

హయ్యర్ యోగక్రియలను అభ్యాసం చెయ్యాలంటే ముందుగా మన దేహాన్ని మన మనస్సును దానికి తగినట్లుగా తయారు చేసుకోవాలి. ఆహారంలో మార్పులు తెచ్చుకోవాలి, వ్యవహారంలో మార్పులు తెచ్చుకోవాలి. జీవన విధానంలో మార్పులు రావాలి. మాటలో చేతలో అన్నిట్లో మార్పులు రావాలి. ఆ విధంగా భూమిని సిద్ధం చేసిన తర్వాత హయ్యర్ యోగ క్రియలనే విత్తనాలు నాటితే అవి చక్కగా ఫలించి మంచి పండ్లను కాస్తాయి. అలా కాకుండా రెండునెలలు మూడునెలల కోర్సులలో ఫాన్సీగా కొన్ని టెక్నిక్స్ నేర్చుకుని అభ్యాసాలు చేస్తూ, ఆహార విహారాలలో మనిష్టం వచ్చినట్లు ఉంటూ ఉంటే, ఇలాంటి బాధలే కలుగుతాయి.

ముందే చెప్పినట్లు, ఈ క్రియలు మన నాడీ వ్యవస్థ మీద అమితమైన ప్రభావం చూపిస్తాయి. ఆ మార్పులు హటాత్తుగా వస్తే శరీరం ఆ ఇంపాక్ట్ ను తట్టుకోలేదు. అలా తట్టుకోవాలంటే, శరీరాన్ని ముందుగా తయారు చెయ్యాలి. దానికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది. అది ఒక్కరోజులో ఒక్క నెలలో జరిగే పని కాదు. కొన్నేళ్ళు పడుతుంది. అదంతా చెయ్యకుండా డైరెక్ట్ గా ఈ క్రియలు చేస్తే, ఎలా ఉంటుందంటే, అదాటున కరెంట్ ప్లగ్గులో వేలు పెట్టినట్లు ఉంటుంది. లేదా, మొదటి రోజునే ఫుల్ బాటిల్ ఎత్తి గడగడా త్రాగినట్లు ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ను శరీరం తట్టుకోలేదు. దేన్నైనా శరీరానికి నిదానంగా అలవాటు చెయ్యాలి. యోగాభ్యాసమైనా అంతే. అందుకే, దానిని చిన్న వయసులోనే మొదలుపెట్టాలి అంటారు. అదికూడా సమర్ధుడైన గురువు పర్యవేక్షణలోనే ఇదంతా చెయ్యవలసి ఉంటుంది. ఏదో దీక్ష ఇచ్చేసి ఆ తర్వాత గురువు జంప్ అయి పోతే ఆ శిష్యుల గతి ఏమిటో ఆ దేవుడికే తెలియాలి !!

ఇవన్నీ తెలీకుండా నేడు చాలామంది హయ్యర్ యోగాతో ఆటలాడుతున్నారు. దాని ఫలితాలు ఇలా ఉంటున్నాయి. ఆయా గురువులకూ ఆయా శిష్యులకూ ఉన్న కార్యకారణ సంబంధాలను బట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. శిష్యుల ఖర్మ బాగుంటే బయట పడతారు. లేదంటే ఒళ్ళు గుల్ల చేసుకుని ఏ పిచ్చాసుపత్రిలోనో తేలతారు.

శారదామాత జీవించి ఉన్నపుడు ఇలాంటి ఒక సంఘటన జరిగింది. ఒకాయన ఇలాగే ఎక్కడో ప్రాణాయామాలు నేర్చుకుని ఊపిరి బిగబట్టి కుంభకం చేస్తూ ఉండేవాడు. దాని ఫలితంగా ఆయనకు విపరీతమైన తలనొప్పి మొదలైంది. ఎప్పుడూ తలలో 'ఝుం' అంటూ హమ్మింగ్ సౌండ్ వినిపిస్తూ ఉండేది. దాని ఫలితంగా నిద్రకూడా పట్టేది కాదు. పిచ్చేక్కే స్టేజిలో ఉన్నపుడు ఎవరో అమ్మ గురించి చెబితే వెళ్లి అమ్మను ప్రార్ధించాడు.

'అవన్నీ ఎందుకు నాయనా? ఆపెయ్యి. మూడ్రోజులు ఇక్కడే నా దగ్గర జయరాంబాటిలో ఉండు.అన్నీ సర్దుకుంటాయి.' అని శారదామాత అన్నారు. అలాగే మూడ్రోజుల్లో ఏమీ చెయ్యకుండానే అతనికి తలనెప్పీ ఆ ధ్వనీ అన్నీ మాయమై పోయాయి.

జిల్లెళ్ళమూడి అమ్మగారి జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇలాగే పిచ్చిపిచ్చి ప్రాణాయామాలూ, యోగసాధనలూ చేసి ఇలాంటి సమస్యలు తెచ్చుకున్న కొందరు అమ్మను సహాయంకోసం అర్ధిస్తే - 'జిళ్లెల్లమూడిలో కొన్ని రోజులుండండి. అదే తగ్గుతుంది.' అని అమ్మ చెప్పేవారు. వారలాగే, సాధనలన్నీ ఆపేసి, హాయిగా వేళకు తింటూ, అమ్మ సమక్షంలో ఉన్నంతమాత్రాన అవన్నీ సర్దుకునేవి. ఇలా ఎంతోమందికి జరిగింది.

యోగశక్తిని మించిన దైవశక్తితో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. అందుకే సరియైన గురువు పర్యవేక్షణ లేకుండా హయ్యర్ యోగా ను ఎవరూ అభ్యాసం చెయ్యకూడదని, అలా చేస్తే పిచ్చెక్కే ప్రమాదం ఉందనీ మనవాళ్ళు అంటారు. అందులో చాలా నిజం ఉంది.

1970 వ దశకంలో చాలామంది మన ఇండియన్ గురువులు యూరప్ లోనూ అమెరికాలోనూ అడుగుపెట్టి ఇలాంటి హయ్యర్ యోగ క్రియలను అక్కడ తెల్లవాళ్ళకు నేర్పించారు. వారేమో వారి ఆహారపు అలవాట్లు మానుకోరు. విచ్చలవిడిగా మాంసం తినడం, త్రాగడం, సెక్సూ మానుకోరు. అదే సమయంలో ఈ హయ్యర్ యోగక్రియలను అభ్యాసం చేసారు. అలా చేసి చాలామంది మెంటల్ గా డిరేంజ్ అయ్యి పిచ్చాసుపత్రిలో చేరి అక్కడే చనిపోయారు. ఇలా జరిగినవాళ్ళు వందల సంఖ్యలో ఆయా దేశాలలో ఉన్నారు. ఓషో శిష్యులలో కూడా అనేకమంది ఇలాగే యోగక్రియలతో ఆటలాడి దెబ్బతిన్న వాళ్ళున్నారు. 

యమనియమాలు అభ్యాసం చెయ్యకుండా, నియమిత జీవనం గడపకుండా, కుంభక సహిత ప్రాణాయామమూ, ధారణా, ధ్యానాది హయ్యర్ యోగ క్రియలను అభ్యాసం చెయ్యడం ప్రమాదకరం. అది మన నెర్వస్ సిస్టం ను మనమే ధ్వంసం చేసుకున్నట్లు అవుతుంది. కానీ ఇదంతా ఎవరు వింటారు? ఖర్మ బలంగా ఉన్నప్పుడు ఎవరూ వినరు. అప్పుడిలాగే ఉంటుంది మరి !!

కుండలినిని పాముతో ఎందుకు పోల్చారో తెలుసా? కుండలినీ యోగం త్రాచుపాముతో చెలగాటం లాంటిది. సరిగ్గా ఆడించడం తెలియకపోతే దాని కాటు తినక తప్పదు.

'చెప్పలేదండనక పొయ్యేరు. జనులార మీరు తప్పుదారిన బట్టి పొయ్యేరు.' అని బ్రహ్మంగారు ఊరకే పాడలేదుగా !! కలియుగంలో జరిగే అనేక మాయలలో ఇదొక ఆధ్యాత్మికమాయ గామోసు. మనమేం చెయ్యగలం?