“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, జనవరి 2017, మంగళవారం

శనీశ్వరుని రాశి మార్పు - ధనూరాశి ప్రవేశం - ఫలితాలు

26-1-2017 గురువారం నాడు, పూర్వాషాఢ నక్షత్ర పరిధిలో మధ్యాన్నం 2 గంటల 07 నిముషాలకు శనీశ్వరుడు రెండున్నరేళ్ళుగా తానుంటున్న వృశ్చికరాశిని వదలిపెట్టి ధనూరాశిలోకి ప్రవేశించ బోతున్నాడు. ఈ రాశిమార్పు ఎందరి జీవితాలలోనో పెనుమార్పులు తీసుకు రాబోతున్నది. ఈరోజు మన రిపబ్లిక్ డే కూడా.

ఎవరు నమ్మినా నమ్మకపోయినా, మనిషి జీవితం మీద గ్రహప్రభావం ఉండటం నిజమే. దీనివల్ల మనిషి జీవితంలో అనేక మార్పులు చేర్పులు కలగడమూ నిజమే.

జ్యోతిశ్శాస్త్రంలో శనీశ్వరుని కర్మకారకునిగా భావిస్తారు. అంటే - సామాన్యంగా మనిషి చేసే రోజువారీ కర్మ గాని, అతను బ్రతకడం కోసం చేసే వృత్తి గాని ఈయన ఆధీనంలోనే ఉంటుంది. శనీశ్వరుని ప్రభావానికి గురికాని వ్యక్తి  ఈ భూమిమీద ఎవడూ ఉండడు.రాజులైనా బంటులైనా ఆయన చెప్పినట్లు వినవలసిన వారే.

జాతకంలో శనీశ్వరుని స్థితిని బట్టి ఆ జాతకుని వృత్తిలోని ఎగుడు దిగుళ్ళను తేలికగా గ్రహించవచ్చు. ప్రస్తుతం 26 తేదీన జరుగబోతున్న ఈ గోచారం, ద్వాదశ రాశులను ఎలా ప్రభావితం చేస్తుందో స్థూలంగా చూద్దాం.

నక్షత్ర ఫలితం:--
నక్షత్రాధిపతి అయిన శుక్రుడు (వింశోత్తరీ దశా రీత్యా) కేతువుతో కలసి శనిరాశి అయిన కుంభంలో ఉన్నందువలన - అనేకమంది భార్యాభర్తలు విడిపోవడం జరుగుతుంది.వీరిలో కొంతమంది విడాకులు తీసుకుంటారు.మరికొందరు అలా తీసుకోకుండానే విడివిడిగా ఉండటం ప్రారంభిస్తారు. వీరు గాక ఇంకా ఎంతోమందికి అభిప్రాయ భేదాలు వచ్చి మానసికంగా వారిమధ్యన అగాధాలు ఏర్పడటం జరుగుతుంది. దీనికి నిదర్శనంగా ఎంతోమంది కుటుంబాలలో ఇప్పటికే గొడవలు తారాస్థాయికి చేరుతూ ఉండటాన్ని గమనించండి.

అలాగే - స్నేహితులు గాని, కుటుంబ సభ్యులుగాని,సంస్థలుగాని, మిత్రరాజ్యాలు గాని, చాలాకాలంగా కలిసున్నవారు - వారి మధ్యన విభేదాలు వచ్చి విడిపోవడం తప్పకుండా జరుగుతుంది.

వార ఫలితం :-- 
వారాధిపతి మరియు హోరాధిపతి అయిన గురువుపైన శుక్రోచ్చరాశియగు మీనం నుంచి కుజుని దృష్టి వల్ల,శని గోచారం జరుగుతున్న ధనుస్సు గురురాశి కూడా కావడం వల్ల - అనేకులలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువైపోతుంది.కానీ అది ప్రాక్టికల్ గా శుద్ధంగా ఉండకుండా, ఉత్తగా గ్రంధాలు చదవడం,వాద ప్రతివాదాలు చేసుకోవడంతోనే అదంతా అంతమౌతుంది.అనవసర మాటలవల్లా,ఆడవారి వ్యవహారాల వల్లా,గురువులకు చెడ్డపేరు రావడం,వారిపైన విమర్శలు మేధోపరమైన దాడులు జరగడం చూస్తారు.గురువులకు ఖర్మ ఎక్కువౌతుంది.

ఈ సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.గమనించండి.

మేషరాశి
దూరపు వ్యక్తులు దగ్గరౌతారు.దూరపు ప్రాంతాలకు బదిలీలు అవుతాయి.కొత్త ఉద్యోగాలు వస్తాయి.జీవితంలో కొత్త మలుపులు ఎదురౌతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.తండ్రికి, గురువుకు లేదా పెద్దలకు గండకాలం.

వృషభరాశి
అష్టమశని ప్రారంభం అవుతుంది.దీని ఫలితంగా మానసిక వత్తిడి, క్రుంగుబాటు, నలుగురితో విరోధం, అనవసర మాటలు ఎక్కువౌతాయి.అనేక కష్ట నష్టాలు చుట్టు ముడతాయి.

మిథునరాశి
దూరప్రాంతాలకు మార్పు ఉంటుంది. పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడటం జరుగుతుంది. విరక్తితో ఇల్లు వదలి వెళ్ళిపోతారు.లేదా అలాంటి ఆలోచనలు కలుగుతాయి. చుట్టు పక్కల వారితో మాటా మంతీలో అభిప్రాయ భేదాలవల్ల పరస్పర సంబంధాలు దెబ్బ తింటాయి.

కర్కాటకరాశి
ఇంటిలో గొడవలు పెరుగుతాయి. చర్చలు జోరుగా జరుగుతాయి. శత్రుబాధ, పోరు మిక్కుటంగా ఉంటుంది. కానీ చివరకు అంతా మంచే జరుగుతుంది.

సింహరాశి
రహస్య ప్రేమ వ్యవహారాలు,స్నేహాలు పెరుగుతాయి. ఇంకొందరిలో ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువౌతుంది.నిర్లిప్తతా వైరాగ్యమూ పెరిగిపోతాయి.నెగటివ్ థింకింగ్ ఎక్కువై నీరస పడిపోతారు.ఏం చెయ్యాలో అర్ధంకాని సందిగ్ధ పరిస్థితి ఎదురౌతుంది.ధైర్యం సన్నగిల్లుతుంది.

కన్యారాశి
అర్దాష్టమ శని మొదలౌతుంది.ఇష్టంలేని ఉద్యోగాలు చెయ్యవలసి వస్తుంది.చదువు లేదా ఉద్యోగ రీత్యా ప్రాంతపు మార్పు ఉంటుంది.ఇంటిలో మనశ్శాంతి కరువై పోతుంది. కుటుంబ వ్యవహారాలు చీకాకును సృష్టిస్తాయి.మనసు డిప్రెషన్ లో పడుతుంది.

తులారాశి
ఏడున్నరేళ్ళుగా వీరు పడుతున్న ఏలినాటి శని వదలి పోతుంది.కనుక వీరిని విజయాలు వరిస్తాయి.వెలుగు కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల కనిపిస్తుంది.మాట చెల్లుబాటవుతుంది.తరచూ ప్రయాణాలు ఊపందుకుంటాయి. అయితే వాటిల్లో ప్రమాదాలు జరిగే సూచన కూడా ఉన్నది.

వృశ్చికరాశి
వీరికి ఏలినాటి శని మూడవ పాదం మొదలైంది. కనుక ఇంటివారితో, స్నేహితులతో అనవసర మాటల వల్ల గొడవలు అవుతాయి. ఒకటి చెబితే ఇంకొకటిగా అర్ధం చేసుకోబడుతుంది. ఇది మనస్పర్ధలకు దారితీస్తుంది.కంటి రోగాలు బాధిస్తాయి. డబ్బు నష్టపోతారు.

ధనూరాశి
అందరిలోకీ ఈ రాశివారు బాగా నష్టానికి గురౌతారు.ఎందుకంటే వీరికి ఏలినాటిశని రెండోపాదం మొదలౌతుంది.అన్ని రంగాలలో వీరిని దురదృష్టం మొదలౌతుంది.మానసికంగా క్రుంగిపోయి ఒంటరివారౌతారు.అనవసర ఊహల వల్ల వాస్తవానికి దూరంగా జరిగి అంతర్ముఖులౌతారు.దీనివల్ల సమాజంతో వీరి సంబంధాలు దెబ్బతింటాయి. స్వయంకృతాపరాధాలు ఎక్కువౌతాయి.

మకరరాశి
వీరికి ఏలినాటి శని మొదలౌతున్నది.కనుక కష్టాలు మొదలౌతాయి. జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఎదురౌతుంది. జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి.వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆస్పత్రి ఖర్చులతో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతుంది. కుటుంబ నేపధ్యంలో నష్టాలు కష్టాలు ఉంటాయి.మానసిక చింత వెంటాడుతుంది.ప్రేమ వ్యవహారాలలో, భార్యాభర్తల గొడవలలో మనసు చాలా డిప్రెషన్ కు గురౌతుంది.

కుంభరాశి
వీరికి అంతా లాభంగా ఉంటుంది.రహస్య ప్రేమ వ్యవహారాలు మొదలౌతాయి.స్నేహితులు ఎక్కువౌతారు.అయితే దీనివల్ల ఇంటిలో మనస్పర్ధలు గొడవలు జరుగుతాయి.జీవిత భాగస్వామితో మానసికంగా దూరం పెరుగుతుంది.వ్యాపారం కలిసి వస్తుంది.సంఘంలో మంచి పేరు వస్తుంది.ధనానికి లోటు ఉండదు.అంతా లాభసాటిగా ఉంటుంది.

మీనరాశి
వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది.అయితే 'ఏది ఎలా జరిగితే అలా జరుగుతుందిలే' అనే ఒక విధమైన నిర్లిప్త ధోరణి ఎక్కువౌతుంది.ఇంటిలోనూ వృత్తిపరంగానూ అనేక మార్పులను చూస్తారు.ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న ఇంటిని వదలి దూర ప్రాంతాలకు పోవలసి వస్తుంది.తనవారితో విరోధం కలుగుతుంది.వృత్తి పరంగా మార్పులు ఉంటాయి.
---------------------------------------
ఇవన్నీ స్థూలఫలితాలు మాత్రమే.ఎందుకంటే ప్రపంచ జనాభాను పన్నెండు రాశులుగా విభజిస్తూ ఈ ఫలితాలను అంచనా వెయ్యడం జరుగుతుంది.కనుక ఇవి బ్రాడ్ ఇండికేషన్స్ మాత్రమే. వ్యక్తిగత జాతకాలతో సమన్వయం చేసుకుని గోచార ఫలితాలను అర్ధం చేసుకోవాలి.

దానిని బట్టి తగిన రెమెడీస్ పాటించడం వల్ల చెడు ఫలితాలను నివారించుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.