“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, ఫిబ్రవరి 2014, బుధవారం

మంచి చాన్స్ మిస్సయింది

మొన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువైన శ్రీశ్రీరవిశంకర్ మంగళగిరికి ఒక ప్రత్యెక రైలులో వచ్చినారు.ఆ రైలుకు సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ చూచే బాధ్యతలో నాకూ భాగం ఉన్నది.ఆ ఏర్పాట్లు అన్నీ యధావిధిగా చేసినాము.ఒక వెయ్యిమంది వాలంటీర్లు ఆయన్ను రిసీవ్ చేసుకోడానికి వస్తారని తెలిసింది.మంగళగిరికి వెళ్ళి అక్కడ ఆ నిర్వాహకులతో మాట్లాడి స్పెషల్ రైలును ఏ ప్లాట్ ఫాం మీదకు తీసుకోవాలి?వగైరా విషయాలు చర్చించడానికి ఒకరోజు ముందుగా ఇంకొక అధికారి మంగళగిరికి వెళ్ళి ఆ పనులు చూచినారు.

'గురూజీ వచ్చేరోజున తెనాలి నుంచి ఆయనతో కలసి స్పెషల్ రైల్లో మనం ప్రయాణం చెయ్యవచ్చు.మంచి అవకాశం.ఆయన్ని దగ్గరగా చూడవచ్చు. పక్కనే కూచుని మాట్లాడవచ్చు.మీరూ రండి.మీకు ఆధ్యాత్మికం అంటే ఇష్టం కదా.' అని ఒక అధికారి నన్నూ అడిగారు.

నేను నవ్వేసి -'ప్రత్యేకించి ఆయన్ను చూడాలని నాకేమీ లేదు.ఉద్యోగబాధ్యత లలో భాగంగా రావలసి వస్తే వస్తాను.' అని జవాబిచ్చాను.

అనుకున్నట్లే ఆరోజు రానే వచ్చింది.మా విభాగం నుంచి ఇద్దరు అధికారులు వెళ్ళి రవిశంకర్ గారితో కలిసి తెనాలి నుంచి మంగళగిరివరకూ ప్రయాణం చేస్తూ వచ్చారు.ఆయన వారికి శాలువాలు కప్పి సత్కరించారు.వారిని ఆశీర్వదించారు.వారితో చక్కగా మాట్లాడారు.మంగళగిరి వచ్చాక ఆయన తన శిష్యులతో కలసి దిగి హాయ్ లాండ్ కు వెళ్ళిపోయాక మా వాళ్ళు తిరిగి వచ్చారు.

'మీరూ వచ్చినట్లయితే బాగుండేది.మీకూ శాలువా కప్పి గురూజీ సత్కరించేవారు.మీతోనూ క్లోజ్ గా మాట్లాడేవారు.మేము ఆయనతో కలసి ఒక గంట సేపు ప్రయాణం చేసినాము.చాలా బాగుంది.' అని నా కొలీగ్ అధికారి ఒకాయన అన్నారు.

'అందుకే నేను రాలేదు.' అని నేను జవాబిచ్చాను.

ఆయన అర్ధం కానట్లు ముఖం పెట్టినాడు.

'నేను వచ్చినట్లయితే మీకూ ఆయనకూ ఇబ్బంది అయ్యేది' అన్నాను.

'మనకు స్పెషల్ పాసులున్నాయి.కావాలంటే హాయ్ లాండ్ లోని మీటింగ్ కి మీరు వెళ్ళి రండి.'అని రెండు పాసులు నాకు ఇవ్వబోయాడు.

పక్కనే ఉన్న ఇంకొకాయన అందుకొని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' చాలా మంచిది.మీరు మీటింగ్ అటెండ్ అయితే బాగుంటుంది.' అన్నాడు.

నేను నవ్వేసి ' నా ఆర్ట్ ఆఫ్ లివింగ్ నాకుంది.ఇంకా కొత్తవి అవసరం లేదు.నా ఆర్ట్ నాకు చాలు' అన్నాను.

'ఆయనేం చెబుతాడో వినొచ్చు కదా?' అని సందేహం వెలిబుచ్చాడు.

'అసలు లివింగే ఒక ఆర్ట్.మళ్ళీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏముంది?మీకు అవసరమైతే మీరు వెళ్ళి రండి' అని పాసులు ఆయనకే ఇచ్చేశాను.

'మీకు ఎవరూ గిట్టరెంటి సార్?' అని అడిగాడు.

'గిట్టకపోవడం అంటూ ఏమీ లేదు.దాహం తీరినవాడికి మంచినీళ్ళెందుకు?'అని నేను జవాబిచ్చాను.

'గురూజీని దగ్గరగా చూచే అదృష్టం ఎంతమందికి కలుగుతుంది?' అని ఒకాయన అన్నాడు.

'మీరు ఎంత దగ్గరగా చూచారు?' అడిగాను.

'ఆయన పక్కనే కూచుని ప్రయాణం చేశాము' అన్నారు.

'మరి ఆ కాస్త దూరం మాత్రం ఎందుకు? ఇంకా దగ్గరగా వెళ్ళకపోయారా?' అడిగాను.

'అదేంటి సార్? అలాగంటారు?' అన్నాడు.

'అబ్బే ఏమీ లేదు.దగ్గరగా చూడటమే పరమావధి అయితే ఆ కాస్త దూరం మాత్రం ఎందుకు?ఇంకా దగ్గరగా వెళితే బాగుండేది కదా అనేదే నా అభిప్రాయం '- అన్నాను.

నేను ఏ ఉద్దేశంతో అంటున్నానో వారికి అర్ధం కాలేదు.

'ఏంటో మీరు మాట్లాడేది చాలాసార్లు మాకు అర్ధం కాదు.ఏదేమైనా మీరు మంచి  చాన్స్ మిస్ చేసుకున్నారు.' అని ఇదంతా వింటున్న ఒకాయన అన్నాడు.

'నాకొక మిసెస్ ఆల్రెడీ ఉంది.కొత్తకొత్త మిస్సులు అవసరం లేదు.'అని నవ్వుతూ జవాబిచ్చాను.

అదీ వాళ్లకు అర్ధం అయినట్లు నాకనిపించలేదు.

ఈయనతో మాటలు అనవసరం అనుకున్నారో ఏమో వాళ్ళ పనిమీద వాళ్ళు వెళ్ళిపోయారు.

మొత్తం మీద ఒక మంచి చాన్స్ మిస్సయింది.అది నాకో,గురూజీకో,పక్కన చూచేవారికో మాత్రం నాకర్ధం కావడం లేదు.