“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, ఫిబ్రవరి 2014, శనివారం

సాధనా సమ్మేళనం - కోటప్పకొండ-2

ఉదయం అంతా కొండ ఎక్కి దిగాంకదా మధ్యాన్నం నిద్రపోదామని అనుకున్నాం గాని నిద్ర రాలేదు.ఊరకే రిలాక్స్ అవుతూ ఉన్నాము. సాయంత్రం నాలుగువరకూ రామన్నగారు ఏదో మాట్లాడుతుంటే వింటూ ఉన్నాను.నాలుగుకు లేచి పక్కరూం తలుపు తట్టినాను.మదన్ తలుపు తెరిచాడు.

'తయారవ్వండి బయటకు వెళ్లి టీ త్రాగుదాం' అని చెప్పి గదికి వచ్చి కూచున్నాను.

కాసేపట్లో మదన్ రాజూ తయారై వచ్చారు.

మదన్ ఇలా అన్నాడు.

'సార్.త్రికూటం గురించి ఉదయం మనం మాట్లాడుకున్నదానినీ,గొల్లభామ కధనీ కలిపి ఇందాకటి నుంచీ ఆలోచిస్తే నాకు ఒక విషయం అనిపిస్తున్నది.' అన్నాడు.

'ఏంటది చెప్పు.' అడిగాను.

'కొండకొమ్ము అంటే సహస్రారం కదా.అక్కడ ఉన్న శివుడిని గొల్లభామ రోజూ పాలతో ఆరాధించేది.కుండలిని శిరస్సుకు చేరినప్పుడు దేహంలో అమృతస్రావం జరుగుతుందని మీరు చెప్పినారు కదా.లలితాసహస్రంలో 'కులామృతైకరసికా'అని నామం ఉన్నది కదా.పాలతో ఆరాధించడం అంటే ఇదేనేమో.

తరువాత,శివుణ్ణి నేలకు రమ్మని ఆమె పిలిచింది.అంటే,తన దేహంలోని భౌతిక స్థాయికి భగవంతుని దివ్యచైతన్యాన్ని దిగిరమ్మని సాధకుడు చేసే విజ్ఞప్తిగా దీనిని తీసుకోవచ్చు.' అన్నాడు.

మదన్ చెప్పిన ఈ మాటలతో నాకు చాలా సంతోషం కలిగింది.

'అవును.అరవిందుల యోగం అదేకదా.' అన్నాను.

మదన్ కొనసాగించాడు.'కాని సాధకుని దేహం ఇంకా మలినాలతో కూడుకుని ఉన్నందున,ఇంకా సిద్ధంగా లేనందున,దివ్యచైతన్యం పూర్తిగా క్రిందివరకూ దిగిరాలేక,మధ్యవరకూ వచ్చి ఆగిపోయింది.అంటే అనాహతం వరకూ దిగివచ్చింది.అంటే సాధకుడు ఇంకా సాధన చెయ్యవలసిన అవసరం ఉన్నది.'

'అద్భుతమైన వివరణ ఇచ్చావు మదన్.చాలా బాగుంది.' అభినందించాను.

ఇలా మాట్లాడుకుంటూ బయటకు వచ్చి కాసేపు అక్కడే ఉండి,గొల్లభామ గుడివైపు నుంచి క్రిందకు వెళ్ళే మెట్లదారి గుండా రోడ్డు వద్దకు దిగడం ప్రారంభించాము.దారిలో కోతులు గుంపులు గుంపులుగా ఎదురయ్యాయి. వాటికి కూడా సరిహద్దులూ రాజ్యాలూ ఉన్నాయి.గ్రూపులు ఉన్నాయి.ఏ గ్రూపు సరిహద్దులో ఆ గ్రూపు ఉంటుంది.పొరపాటున వేరు గ్రూపు కోతి సరిహద్దు దాటి ఈ ప్రదేశంలోకి వస్తే యుద్ధం అయిపోతుంది.


రమణమహర్షి జీవితంలో కూడా కోతులతో ఆయనకు అనుబంధం కనిపిస్తుంది.అక్కడ కూడా కోతి గ్రూపులు ఉండేవి.ఒక కోతి,గ్రూపుయుద్దంలో గెలిచి రాజు అయినప్పుడు మహర్షి వద్దకు వచ్చి ఆశీస్సులు తీసుకుంటుంది. అలాగే వాటికి ఏదైనా బాధ కలిగినప్పుడు ఆయనవద్దకు వచ్చి వాటి బాధను చెప్పుకునేవి.వాటి భాషా,పద్ధతులూ,అలవాట్లూ మహర్షికి బాగా తెలుసు. ఇదంతా ఆయన జీవితం చదివితే తెలుస్తుంది.

అడవినీ చెట్లనూ కోతులనూ గమనిస్తూ దాదాపు 650 అడుగులు క్రిందకు దిగి రోడ్డు మీదకు చేరుకొని అక్కడ ఉన్న టీ స్టాల్లో బజ్జీలు తిని టీ త్రాగి నెమ్మదిగా మళ్ళీ అదే మెట్లదారి గుండా గెస్ట్ హౌస్ దగ్గరకు ఎక్కడం ప్రారంభించాము.


'మదన్.ఉదయం నీవు అడిగినదానికి ఇంకా చెప్తా విను.ఆలోచన పుట్టడం బ్రహ్మతత్వం.అది కొంతసేపు కొనసాగడం విష్ణుతత్వం.లయించడం రుద్రతత్త్వం.ఇవే త్రికూటములు.ఈ మూడు ప్రక్రియలూ ఒకదాని ఆధారంతో జరుగుతాయి.ఆ ఆధారమే బ్రహ్మం.అదే త్రికూటేశ్వరుడు.' అన్నాను.


అర్ధమైందని మదన్ కళ్ళతోనే సూచించాడు.

తిరిగి మెట్లెక్కుతుండగా మార్గమధ్యంలోనే చీకటి పడింది.అమావాస్య ముందు రోజులేమో మినుకుమినుకు మంటున్న నక్షత్రాలు తప్ప ఏ కాంతీ లేదు.చిమ్మ చీకట్లో అడవిమధ్యలో కొండ మెట్లెక్కుతూ మెం నలుగురమూ దయ్యాల్లా నిలబడి ఉన్నాము.అప్పటివరకూ గంతులేస్తున్న కోతులన్నీ చెట్లమీదకు చేరుకొని మౌనంగా నిద్రకుపక్రమిస్తున్నాయి.

'కాసేపు కూచుందాం' అన్నాను.


చీకట్లో ఆ మెట్లమీద అందరం పక్కపక్కనే కూచున్నాము.కాసేపు ఆ మౌనాన్నీ,చీకటినీ,శీతాకాలపు చల్లదనాన్నీ,చుట్టూ ఉన్న అడవినీ ఆస్వాదిస్తూ ఉండిపోయాము.

నిశ్శబ్దాన్ని భేదిస్తూ రామన్నగారు ఒక సందేహం వెలిబుచ్చారు.


'శర్మగారు.మనస్సును శరీరం నుంచి విడదియ్యడం సాధ్యమేనా?'


'సాధ్యమే.యోగంలో ఇది చాలా చిన్నపని.సాధన మొదటి స్థాయిలలో ఉన్నవారికే ఈ శక్తి వచ్చేస్తుంది.దానికి పెద్దపెద్ద స్థితులేమీ అవసరం లేదు. రమణమహర్షి చేతికి కేన్సర్ పుండు వస్తే మత్తుమందు లేకుండానే ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు.మనస్సును వేరు చెయ్యగలిగారు కనుకనే ఇది సాధ్యం అయింది.

సదాశివ బ్రహ్మేంద్రసరస్వతి జీవితంలో ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది.ఆయన ధ్యానంలో ఉండి ఒళ్ళు తెలియని స్థితిలో నడుచుకుంటూ వెళుతూ ఒక ముస్లింరాజు గుడారంలోకి అడుగుపెట్టాడు.కోపించిన ఆ ముస్లిం కత్తిదూసి స్వామి చేతిని నరికేస్తాడు.చెయ్యి తెగి కింద పడిపోయిందన్న స్పృహ కూడా లేకుండా స్వామి అలా నడచి వెళ్ళిపోతూనే ఉంటారు.అతను భయపడిపోయి స్వామి కాళ్ళమీద పడి ప్రార్ధిస్తే,అప్పుడు స్వామి స్పృహలోనికి వచ్చి తెగిపోయిన చేతిని అతికించుకుని ఏమీ జరగనట్టుగా నడచి వెళ్ళిపోతారు.ఇవన్నీ రికార్డ్ కాబడిన సంఘటనలు.

కానీ ఇంతకంటే పై స్థాయి కూడా ఉన్నది.జిల్లెళ్ళమూడి అమ్మగారు ఇలా అనేవారు."సుఖం దేవుడిస్తుంటే, కష్టం ఎవరిస్తున్నట్లు?"

ఇది మీరడిగిన స్థాయి కంటె పైది.ఏదైనా భగవంతుని వరమే అనుకున్నపుడు ఇంక బాధ ఏముంటుంది?మనస్సును శరీరం కంటె వేరు చెయ్యవలసిన అవసరం ఏముంటుంది?బాధనుంచి దూరంగా పారిపోవలసిన పని ఏముంటుంది?

శ్రీరామకృష్ణులకు గొంతు కేన్సర్ వచ్చింది.నయం చేసుకొమ్మని భక్తులు ప్రార్ధించారు.ఆయన ఏమీ జవాబు చెప్పలేదు.రోజుల తరబడి భక్తులు వేడుకోగా చివరకు 'నా మనస్సును ఈదేహం మీద ఏకాగ్రం చెయ్యలేను' అని ఆయన చెప్పినారు.

భక్తులు అప్పటికీ ఆయన్ను వదలలేదు.

అలా కొన్నాళ్ళు గడిచినాక 'నా చేతిలో ఏమీలేదు.అంతా అమ్మ ఇచ్ఛ' అని ఆయన చెప్పినారు.

అయితే 'అమ్మనే అడగండి.' అని భక్తులన్నారు.ఎంత ప్రార్ధించినా ఆయన వినడం లేదని చివరకు వివేకానందస్వామిచేత కూడా అడిగించినారు.

విసిగిస్తున్న భక్తులతో చివరకు ఆయన ఇలా అన్నారు.

'అమ్మ ఇలా చెప్పింది.ఇందరి నోళ్ళతో తింటున్నావు కదా? ఒక్క నోటితో తినకపోతే ఏం?'

ఇది మన ఊహక్కూడా అందనంత అత్యున్నతమైన స్థాయి.ఇక్కడ మనస్సును దేహంనుంచి వేరుచేసే అవసరం ఏమీ ఉండదు.కర్మనుంచి పారిపోవడం ఉండదు.ఏం జరిగినా అది దైవంనుంచే వచ్చిందని స్వీకరించేవారికి తిరస్కరించడానికి ఏమి మిగిలి ఉంటుంది?అప్పుడు మనస్సూ దేహమూ ఒకటే అవుతాయి.ఇలాంటి స్థితిలో ఉన్నవారు సోకాల్డ్ మహిమలను చూచి నవ్వుతారు.జరిగేది అంతా మహిమే అని వారికి తెలుసు. కనుక ప్రత్యెక మహిమలను,సిద్ధులను వారు లెక్కచెయ్యరు.

జిల్లెళ్ళమూడి అమ్మగారిని ఎవరో అడిగారు.

'అమ్మా?మీరుపదేశించే మంత్రం ఏమిటి?'

'సరే మంత్రం.'అన్నారు అమ్మ.

జీవితంలో ప్రతిదానికీ 'సరే' అనగలిగితే అంతకంటే గొప్ప ఆధ్యాత్మికస్థితి ఇంక ఏమీ లేదు.

'Saying Yes to life' అనే ఉపన్యాసంలో రజనీష్ కూడా ఇదే అంటాడు.

"Theism is saying yes to life with all its imperfections, as it is, saying yes to it with no conditions, with no strings attached."

రజనీష్ ఇచ్చిన ఈ నిర్వచనం కంటె ఆధ్యాత్మికతకు గొప్ప నిర్వచనం ఇవ్వడం చాలాచాలా కష్టం.మహానీయులందరూ దీనినే చెప్పినారు ఆచరించినారు. చాలామంది దీనిని ఉపన్యాసాలలో చెబుతారు.కాని ఆచరించినవారే నిజమైన యోగులు. వారే ధన్యులు.దీనిని చెప్పడం చాలా తేలిక.ఆచరణ బహుకష్టం.

శ్రీరామకృష్ణుల శిష్యులైన తురీయానందస్వామి జీవితంలో ఒక సంఘటన జరిగింది.స్వామి పూరీ క్షేత్రంలో ఉన్నపుడు కంటి సంబంధమైన ఏదో బాధ వస్తే,డాక్టర్ ఐ డ్రాప్స్ వేసుకొమన్నారు.అవి వెయ్యడానికి స్వామికి పరిచారకునిగా స్వామి శర్వానంద అని ఒక సేవకస్వామి ఉండేవారు.ఒకరోజున పొరపాటుగా ఆ మందుబదులు అక్కడే ఇంకొక సీసాలో ఉన్న డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ ను స్వామి కంటిలో వేశాడు సేవకుడు.

కన్ను మొత్తం కాలిపోయినంత బాధ కలిగింది స్వామికి.అది యాసిడ్ కాబట్టి కాలి ఉండవచ్చు కూడా.కాని ఆ సేవకుడిని ఒక్కమాట కూడా అనలేదు.విషయం గ్రహించి సేవకుడు భయంతో ఒణికిపోయాడు. అతన్ని స్వామే ఓదార్చారు.

While staying at Puri, Swami Turiyananda consulted a doctor, who diagnosed that he had diabetes and his treatment was started there. Although Turiyananda’s health slightly improved in Puri, he had some trouble with eyes. The doctor prescribed eye drops.

One morning, as soon as his attendant, Sharvananda, put eye drops in his eyes, he cried out:“I think you have given me the wrong medicine. See what you have used!” The attendant was shocked when he discovered that it was diluted nitric acid. Filled with remorse and fear, he began to tremble and cry while someone else washed the acid out of the swami’s eyes.Turiyananda remained calm and composed.He never uttered a single word to scold his attendant. He was a perfect embodiment of forbearance.

He later consoled his attendant: “You see, as soon as you put the drops in my eyes, I felt a terrible burning sensation covering my whole body. I thought: ‘O Mother, what can I do if You want to take away my eyes? May your will be done!'

అదీ అసలైన పరమహంస స్థితి.'కళ్ళు పోవడమే అమ్మ నిర్ణయం అయితే పోనీ' అన్నటువంటి సంపూర్ణ శరణాగతి అది.నిజమైన దేహాతీతస్థితి అంటే అదే. మీరడిగిన స్థితి కంటె ఇది చాలాచాలా పై స్థితి.నేడుకూడా చాలామంది 'శ్రీశ్రీశ్రీ 108 పరమహంస పరివాజకాచార్య'అంటూ ఇంకా ఏవేవో బిరుదులు తగిలించుకుంటున్నారు.లేదా వాళ్ళ శిష్యులు తగిలిస్తున్నారు.బిరుదులు ఊరకే తగిలించుకుంటే చాలదు.'బలభీమ' అని బిరుదు పెట్టుకుంటే చాలదు. భీముడికి ఉన్న బలం మనకి కూడా ఉన్నప్పుడే ఆ బిరుదుకి సార్ధకత.

'నేనడిగేది అదికాదు.మీరు ఆసనసిద్ధిని గురించి పంచవటిలో ఒకసారి చెప్పినారు.మూడు గంటలు కదలకుండా ఒకే ఆసనంలో కూచుంటే అది ఆసనసిద్ధి అని అన్నారు కదా?' రామన్న గారు అడిగారు.

'అవును.' అన్నాను.

'ధ్యానంలో ఉన్నపుడు కొన్నిసార్లు కాళ్ళు తిమ్మిర్లు వస్తుంటాయి.ఇంకొన్ని సార్లు ఒళ్ళు బాగా నెప్పులు పుడుతుంది.లేదా ఏదో దురద వస్తుంది.లేదా ఏ దోమో ఇంకొకటో కుడుతుంది.కొన్నిసార్లు గీరుకోకుండా నిగ్రహించుకోవడం వీలవుతుంది.కాని ఇంకొన్నిసార్లు అలా నిగ్రహించుకోవడం సాధ్యం కాదు. అలాంటప్పుడు మనస్సును దేహంనుంచి వేరు చెయ్యగలిగితే ఫలితం ఉంటుంది కదా?'

'మీరు అడుగుతున్నవి ధ్యానాభ్యాసంలో చాలామొదట్లో వచ్చే ఆటంకాల గురించి.అవి సాధన మొదట్లో వస్తాయి.కాని అభ్యాసంమీద క్రమేణా అన్నీ సర్దుకుంటాయి.సాధన చేస్తూచేస్తూ ఉంటే పురోగతి అదే ఉంటుంది.ఆపితే ఆగిపోతుంది.అందుకే ఎలాంటి పరిస్తితిలోనూ సాధనను ఆపరాదని నేనంటాను.

'యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశ:
ఇంద్రియాణీంద్రియార్దేభ్య: తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా:'

'తాబేలు తన అవయవాలను ఎలా లోనికి ముడుచుకుంటుందో అదే విధంగా ఇంద్రియాలను యోగి నిగ్రహిస్తాడు'. అని గీతలో చెప్పబడింది. పతంజలిమహర్షి దీనినే ప్రత్యాహారం అన్నారు.ఈ స్థాయికి వస్తే మనస్సును దేహంనుంచి విడదియ్యడం సాధ్యమే అని అనుభవంలో తెలుస్తుంది.ఇవన్నీ చర్చించే విషయాలు కావు.సాధన చేసి అనుభవంలో గ్రహించవలసిన విషయాలు.' అన్నాను.

ఇలా మాట్లాడుకుంటూ మళ్ళీ 650 అడుగులు కొండనెక్కి బ్రహ్మశిఖరం వద్దకు చేరుకున్నాము.కొద్దిసేపు అక్కడే రోడ్డుచప్టా మీద కూచుని తేరుకున్నాక, హోటల్లో ఆహారం తిని గదులకు చేరాము.

మేము ఉన్న గదుల డాబామీదకు వెళ్ళిచూస్తే కింద ఉన్న ఊళ్లు దూరంగా ఉన్న నక్షత్రాలలాగా కనిపిస్తున్నాయి.అంతా నిశ్శబ్దం. చుట్టూ చీకటి ఆకాశం.చల్లని గాలి వీస్తున్నది.ధ్యానం చేసేవారికి ఇది చాలామంచి వాతావరణం.ఇలాంటి వాతావరణంలో మనస్సు అప్రయత్నంగా ధ్యాననిమగ్నతను పొందుతుంది.అలా పొందాలంటే క్షణక్షణానికీ చలిస్తూ రకరకాల సందేహాలను రేకెత్తించే మనస్సును నిశ్చలం చేసే కిటుకు తెలియాలి.

ఉదయమే లేచి విష్ణుశిఖరం వద్దకు వెళదామని నిశ్చయించుకుని ధ్యానానికి/నిద్రకు ఉపక్రమించాము.

(ఇంకా ఉంది)