“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

29, మార్చి 2013, శుక్రవారం

గుడ్ ఫ్రైడే

సాయంత్రం ఒక స్నేహితుడు కనిపిస్తే ఇలా అడిగాను.

'ఏంటి నీరసంగా ఉంది మొహం?'

'ఇవాళ గుడ్ ఫ్రైడే కదా అందుకని సాయంత్రం మూడు తర్వాత భోజనం చేశాను అందుకే కొంచం నీరసంగా ఉంది.'

తను క్రిస్టియన్.

అప్పుడు నేనిలా చెప్పాను.

'నేనూ మూడు తర్వాతే భోజనం చేశాను.అదీ చాలా మితంగా తిన్నాను.'

'అదేంటి నువ్వెందుకు అలా చెయ్యడం?' అన్నాడు.

'ఈ రోజు గుడ్ ఫ్రైడే కనుక.' చెప్పాను.

అతని ముఖంలో అనుమానం కదలాడింది.

'అదేంటి నువ్వు హిందువ్వి కదా?'

చిరునవ్వు నవ్వాను.

'నీ ప్రశ్నకు కాసేపాగి జవాబిస్తానుగాని ఒక మాటడుగుతాను చెప్పు.నీవు ఎన్నేళ్ళ నుంచి ఇది పాటిస్తున్నావు?' అడిగాను.

'దాదాపు పది పదిహేను ఏళ్ళ నుంచి'చెప్పాడు.

'అయితే విను.నాకు పదిహేనేళ్ళ వయసున్నప్పటి నుంచి నేనిది పాటిస్తున్నాను.'చెప్పాను.

అతని ముఖంలో ఆనందం కదలాడింది. 'చాలా మంచిది' అన్నాడు.

'దేనికి మంచిది?' అడిగాను.

'మంచి జరుగుతుంది' అన్నాడు తను.

'మంచి కోసం ఆశపడి నేనిది చెయ్యడం లేదు' చెప్పాను.

తను మళ్ళీ అనుమానంగా చూచాడు.

'మరెందుకు చేస్తున్నావు' అడిగాడు.

'జీసస్ అంటే నాకిష్టం కనుక చేస్తున్నాను. ఆయన ఆరుగంటల పాటు సిలువ మీద ఉండి మధ్యాన్నం మూడు గంటలకు మరణించాడని క్రైస్తవులు నమ్ముతారు.అంటే ఉదయం తొమ్మిదికి ఆయన్ను సిలువ వేస్తె సాయంత్రం మూడుకు చనిపోయాడు.కాని నేనిది నమ్మను.ఆయన శిలువ మీద మరణించలేదని తర్వాత కూడా చాలాఏళ్ళు బతికే ఉన్నాడనీ నేను నమ్ముతాను.కాని సాయంత్రం మూడు వరకు ఆయన యమయాతన పడ్డాడు.మనకిష్టమైన వాళ్ళు బాధపడుతుంటే మనం భోజనం ఎలా చెయ్యగలం? అందుకే మూడువరకూ ఏమీ తినను. ఆ తర్వాతే ఏదన్నా తింటాను.' చెప్పాను.

'నీవు బైబుల్ చదివావా? అడిగాడు.

'చదివాను.రాజమండ్రిలో ఆరో తరగతి చదివే రోజులలో మొదటిసారి మొత్తం న్యూ టెస్టమెంట్ అంతా చదివాను. ఆతర్వాత కూడా చాలాసార్లు చదివాను.ఇప్పటికీ తరచుగా రిఫర్ చేస్తూ ఉంటాను.' 

'మరి నీవు క్రైస్తవ మతం తీసుకోవచ్చు కదా?'

'వచ్చిన చిక్కేమిటంటే బైబుల్ తో బాటుగా ప్రపంచంలోని ముఖ్యమతాల అన్ని గ్రంధాలూ అంతే శ్రద్ధతో చదివాను. అందుకే బైబుల్లో నాకేమీ ప్రత్యేకత కనిపించలేదు. క్రైస్తవులు నమ్ముతున్నట్లు అదొక ప్రత్యేక దైవగ్రంధమూ కాదు. క్రీస్తు ఒక్కడే దేవుని కుమారుడూ కాదు. నన్ను క్రైస్తవం లోకి మార్చాలని పరిచయస్తులు చాలామంది ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నించారు.కాని నాతో చర్చలో కూచున్న తర్వాత వాళ్ళ పూర్వీకుల మతం అయిన హిందూమతంలోకి వారే మారేప్రమాదం ఉన్నదన్న విషయం గ్రహించి ఆ ప్రయత్నం మానుకున్నారు. ' చెప్పాను.

మళ్ళీ అనుమానంగా చూచాడు.

చిరునవ్వు నవ్వి ఇలా చెప్పాను.

'నేను బైబుల్ మాత్రమె తరచుగా చదవను. భగవద్గీత కూడా తరచుగా చదువుతాను.అదికూడా పారాయణంగా కాదు.అర్ధం చేసుకుంటూ చదవడానికి ప్రయత్నిస్తాను.అలాగే ఇంకా చాలా మతాల మూలగ్రంధాలు అప్పుడప్పుడూ చదువుతాను.జీసస్ ను గౌరవిస్తాను కూడా. కాని అంతమాత్రం చేత నేను క్రైస్తవమతం పుచ్చుకోవలసిన అవసరం నాకేమీ కనిపించదు.

నేను హిందూమతంలోకి కాలక్రమంలో చొప్పించబడిన అనేక ఆచారాలను సూటిగా విమర్సిస్తాను కూడా, కానీ నేను పక్కా హిందువునే. మహనీయులైనవారు మతాలకు అతీతులని నా నమ్మకం.హిందూమతంలోని అందరు ప్రవక్తలనూ నేను గౌరవిస్తాను.కాని మతం మారడంలో నాకు నమ్మకం లేదు.అలా మారుతూ పోతే ప్రపంచంలోని అన్ని మతాలూ రోజుకొకటి చొప్పున జన్మంతా మారుతూనే ఉండాలి. నువ్వంటే నాకు గౌరవం అయినంత మాత్రాన నేను మీ ఇంటికి వచ్చి కదలకుండా తిష్ట వేసుకుని కూచోవాల్సిన పనిలేదు.నా ఇంట్లో నేనుంటూ నిన్ను అభిమానించవచ్చు.

పైగా, జీసస్ వంటి ప్రవక్తలు చెప్పినవాటిని మతపిచ్చిగాళ్ళు చాలా వక్రీకరించారని నా విశ్వాసం.ఈ నమ్మకం ఓల్డ్ టెస్టమెంటూ,న్యూ టెస్టమెంటూ,హిందూ,బౌద్ధ,ఇంకా అనేక మతగ్రంధాలు పరిశీలనగా చదివిన మీదట నాకు కలిగింది.ఈ మతాల కేంద్ర సూత్రాలలో (core concepts) ఏమీ తేడాలు లేవు.అన్నీ దాదాపుగా ఒక్క విషయాన్నే రకరకాల కోణాలలో చెబుతున్నాయి.కాకపోతే చిన్నచిన్న తేడాలున్నాయి.ఆ తేడాలు ఆయా మతాలు పుట్టిన దేశాలు,ఆయా కాలాలు,అప్పటి సామాజిక పరిస్తితుల వల్ల కలిగాయి.కాని వీటి సారం (essence) మాత్రం ఒకటే.ఈ విషయం నాకు బాగా అర్ధమైంది.కనుక ఎవరైనా సరే మతం మారడం అంటే నాకు పిచ్చిపనిగా కనిపిస్తుంది.

పైగా లోకులు పాటించే మతాలంటే నాకు అస్సలు నమ్మకం లేదు. అవి ఉత్తుత్తి పైపై వేషాలని నా నమ్మకం.అసలైన మతం వేషంలోనూ నమ్మకంలోనూ మతం మారడంలోనూ లేదు.ఆచరణలో ఉంది. జీవితంలో విలువలను ఆచరించడానికి మతంతో పనిలేదని నా ఇంకో నమ్మకం. అందుకే గుడ్ ఫ్రైడే ఉపవాసం ఉండి ఆఫీస్ లో పని చేసుకుని ఇప్పుడు ఇంటికెళ్ళి వేదోక్తంగా సాయంకాల సంధ్యోపాసన చెయ్యబోతున్నాను.' చెప్పాను.

ఈసారి అతని ముఖంలో అనుమానం కనిపించలేదు.అయోమయం కనిపించింది.

'చివరిగా ఒకమాట. నిజమైన హిందువే అన్ని మతాలను ఏమాత్రం ద్వేషభావం లేకుండా అర్ధం చేసుకోగలడు. భక్తితో శ్రీరామునీ, పరమశివునీ, శ్రీకృష్ణునీ, జగన్మాతనూ, ఇంకా మిగతా దేవతలనూ నేను పూజిస్తాను. ఇదే నిజమైన మతమనీ, ఇటువంటి ఉదార స్వభావాన్ని ఇవ్వడమే ఈదేశపు సంస్కృతి యొక్క గొప్పదనమనీ నా నమ్మకం మాత్రమె కాదు.అనుభవం కూడా' అని ముగించాను.