“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

7, జూన్ 2011, మంగళవారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం- తత్త్వం- 4

మనిషి జీవితం చాలా చిత్రమైనది. అన్నీ తెలిసి కూడా తప్పులు చెయ్యటం మనిషి బలహీనత. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అతని నైజం. కానీ ఈలోపల జరగాల్సినవి జరిగిపోతుంటాయి. కాలమూ ప్రకృతీ దేనికోసమూ ఆగవు. మనిషి ఒకపని మొదలుపెడతాడు. దాని ఫలితం తాను ఆశించినట్లే వస్తుందని అనుకుంటాడు. చాలా సార్లు అలాగే జరుగుతుంది . కాని చాలా సార్లు అలా జరుగకపోవచ్చు కూడా. అటువంటప్పుడు నిరాశ పడకుండా దాన్ని జీర్ణించుకున్నవాడే నిజమైన మానవుడు. కొత్తదనాన్నీ మార్పునూ స్వాగతించలేనివాడు నిరాశకు లోనుగాక తప్పదు.


జిడ్డు క్రిష్ణమూర్తిలోకి మైత్రేయను దించి తీసుకొచ్చి తద్వారా లోకాన్ని ఉద్దరించాలని అనీబెసంటూ లేద్బీటరూ అనుకున్నారు. మైత్రేయ వచ్చినపుడు అతను చెప్పబోయేది  అంతా కొత్తగా ఉంటుందనీ పాతవాటిని అతను తిరస్కరించే అవకాశం ఉందనీ  వాళ్లకు తెలుసు. ఆ తిరస్కరణ లోకంవైపు ఉంటుందని వాళ్ళనుకున్నారు. అలాగే మైత్రేయబోధ  లోకాన్ని విమర్శించింది. కాని తనవాళ్ళ పద్ధతుల్ని కూడా అంతే తీవ్రం గా విమర్శించింది. లోకాన్ని విమర్శిస్తే వాళ్లకు బాధ లేదు. ఎందుకంటే లోకం చీకటిలో ఉందని వాళ్ళకూ తెలుసు. కాని  ఆ తిరస్కరణ తాము అప్పటిదాకా నమ్ముతున్న నమ్మకాలవైపు కూడా గురిపెట్టబడుతుందని  వాళ్ళు ఊహించలేదు. అదే వాళ్లకు మింగుడు పడలేదు.


అహం అనేది నిర్మూలన అవ్వటం మహాకష్టం. ఎంతటి మహానుభావులకైనా అది ఏదో ఒక రూపంలో ఉండనే ఉంటుంది. ఒక సంఘటన జరిగినప్పుడు దాని తీరు కూడా మనం ఆశించిన రూపంలోనే ఉండాలని కోరుకోవడం బలహీనత అవుతుంది. కృష్ణమూర్తి లోకి మైత్రేయ దిగి వచ్చినపుడు ఆ అవతరణ అనేది వీళ్ళు ఆశించిన రీతిలో జరుగలేదు. అక్కడే వీళ్ళలో అనుమానం ఏర్పడటానికి దోహదం చేసింది. పైగా అప్పటివరకూ వాళ్ళు అనుభవిస్తున్న అధికారాలూ, ఆధ్యాత్మిక పదవులూ అన్నీ హుష్ కాకీ అయ్యే ప్రమాదం తలెత్తింది. అందుకే మైత్రేయ దిగిరావడం అబద్దం అనీ, కృష్ణమూర్తి భ్రమలో ఉన్నాడనీ వాళ్ళు అనుకున్నారు. మైత్రేయ దిగిరావటం నిజమేననీ  వాళ్ళు భ్రమ పడుతున్నారని కృష్ణమూర్తి అనుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా భ్రమకు అతీతులేమీ కాదని ఇప్పుడు లోకం అనుకుంటున్నది. వీళ్ళిద్దరూ కూడా తమను తాము మోసం చేసుకుని , ఒకరినొకరు మోసం చేసుకుని, లోకాన్ని కూడా మోసం చేసారని తెలిసినవాళ్ళు అనుకుంటున్నారు.


లెడ్ బీటర్ కు కొన్ని అతీత శక్తులు ఉండేవని ఒక రూమర్ అప్పట్లో ఉండేది . మైత్రేయ యొక్క తెజస్సునూ, విభవాన్నీ, దివ్యత్వాన్నీ అతను దర్శనం పొందానని చాలాసార్లు చెప్పాడు. అవన్నీ కృష్ణమూర్తిలో కనిపించక పోయేసరికి అతను మైత్రేయ యొక్క అవతరణను అనుమానించాడు. మానసికంగా కృష్ణమూర్తిలో వచ్చిన మార్పును అతనూ గమనించాడు. కాని కృష్ణమూర్తి శరీరంలో మైత్రేయ దిగివచ్చిన దివ్యలక్షణాలు  లేవని లేద్బీతర్ భావించాడు.     

అసలు కృష్ణమూర్తి సాధనే విచిత్రంగా సాగింది. శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ లోకాలలో విహరించే సాధనతో అది ప్రారంభం అయింది. అప్పటికే కృష్ణమూర్తికి కొంత అక్కల్ట్ లక్షణాలు ఉండేవి. అతనిలో ఒక వేకేంట్ లుక్ ఉండేది. అతని కళ్ళు ఎప్పుడూ ఏదో స్వప్నలోకం లో దేన్నో చూస్తున్నట్లుగా ఉండేవి. దీనికి కారణం ఆయనది మూలా నక్షత్రం కావడం అని, ఇంకా ఇతర జ్యోతిష్య పరమైన కారణాలనూ మనం ఇంతకూ ముందే అనుకున్నాం. ఎవరైనా ఒకటి రెండుసార్లు పిలిస్తేగాని అతను ఈ లోకంలోకి వచ్చేవాడు కాదు. దియసఫీ ఇనిషియేషన్స్ అతనికి ఇవ్వబడ్డాయి. అతను చాలా మార్మిక సాధనలు చేసినవాడే. కాని వాటివల్ల అతనికి పెద్ద ఉపయోగం కలగలేదని ఆయనే కొన్నిసార్లు చెప్పాడు. జ్ఞాన మార్గంలో నడిచిన వారితో ఇదే చిక్కు. మెట్లన్నీ ఎక్కి పైకి వచ్చి ఆ మెట్ల వల్ల ఉపయోగం లేదని చెప్పటంలోని ఔచిత్యం ఏమిటో మరి?  


కృష్ణమూర్తి సాధన అంతా బుధుని ఆధీనంలో నడిచింది. ఈయన జాతకంలోని నవమాధిపతి బుధుడు పంచమంలో మిత్రక్షేత్రంలో ఉంటూ మంచి బలంగా ఉన్న సూర్యుని నక్షత్రంలో ఉన్నాడు. కనుక ఈయన సాధనా బోధనా అంతా బుద్ధి స్థాయిలో జరిగాయి. అందుకే ఈయన బోధనలు ఇంటలేక్చువల్ మనుషులకే అర్ధం అవుతాయి కాని మామూలు మనుషులకు విసుగ్గా ఉంటాయి. డ్రైగా ఉన్నట్లు  అనిపిస్తాయి.


1909 లో గురుదశ మొదలైనప్పుడు ఈయన సాధన కూడా మొదలైంది. 1909 - 1911 వరకూ  గురు/రాహు జరిగింది. గురువు సప్తమంలో ఉన్నాడు. కనుక ఈయన విదేశీ గురువుల చేతుల్లో పడ్డాడు.  ఈ సమయంలోనే ఈయనకు మొదటి రహస్య దీక్ష ఇవ్వబడింది. 1911 -1921 పదకొండేళ్ళ పాటు ఈయన సాధనా చదువూ సాగాయి. 1920 -23 వరకూ ఈయనకు గురువులో బుధ అంతరం నడిచింది. అప్పుడే ఈయన సాధనలో ఒక విచిత్రమైన అనుభవాన్ని పొందాడు.


తనలోని పంచకోశాలనూ ఒకే స్పందనలో నిలబెట్టాలని ఆయన ప్రయత్నం చేసాడు.  దానికి ఆధారంగా బుద్ధి స్థాయిలో ఉన్న బలీయమైన ఆకాంక్షను కనిపెట్టాలని ప్రయత్నించాడు. మైత్రేయనూ, మాస్టర్స్ నూ సేవించడమే దాని ఆకాంక్ష అని తెలుసుకున్నాడు. అదే స్పందనతో మిగిలిన తన అన్ని శరీరాలనూ ఏకీకృతం చెయ్యాలని మూడు వారాలు ప్రయత్నించాడు. నిరంతరమూ రోజంతా కూడా మైత్రేయ రూపాన్ని మనస్సులో నిలుపుకుంటూ ధ్యానించాడు. దానిఫలితంగా ఒకరోజు  అతనికి ఒక విచిత్ర అనుభవం కలిగింది.


గురువూ బుదుడూ ఈయన జాతకంలోని  విమ్శాంశ కుండలిలో లాభస్తానంలో ఉండటం చూడవచ్చు. అందుకే ఈయనకు అంతరిక అనుభవం ఈ సమయంలో కలిగింది.  1922 ఆగస్టులో కాలిఫోర్నియాలోని ఒజై లో ఉన్నప్పుడు ఒకరోజున ఈయనకు ఈ అనుభూతి కలిగింది. అప్పుడు ఆయనకు గురు దశలో, బుధ అంతరంలో, సూర్యుని విదశ జరిగింది. సూర్యుడు చంద్ర లగ్నాత్ మంత్ర స్థానంలో ఉచ్చ స్తితిలో బలంగా ఉండటం చూడవచ్చు.ఒకరోజున హటాత్తుగా మెడవేనుక వెన్నులో తీవ్రమైన నొప్పి మొదలైంది. అది పెరిగి పెరిగి తీవ్ర స్థాయికి చేరింది. అతనిలో ఆలోచించడానికీ, పనిచెయ్యడానికీ, కనీసం నిలబడటానికీ ఓపిక నశించింది. స్పృహ కోల్పోయి అలా పడి ఉండేవాడు. కాని చుట్టూ జరుగుతున్నది ఆయనకు తెలుస్తూనే ఉండేది. ఇలా ఉండగా ఒకరోజున మధ్యాన్నం పూట ఆయనకు ఈ అనుభవం కలిగింది.


రోడ్డు నిర్మాణం చేస్తున్న ఒక కార్మికున్ని ఆయన చూచాడు. రోడ్డూ, కార్మికుడూ, అతని చేతిలోని పారా, పగల గొట్ట బడుతున్న రాయీ అన్నీ తానే అని అనుభూతి చెందాడు. చెట్లూ, కొండలూ, పక్షులూ, గడ్డీ, పురుగులూ, అన్నీ తనలో భాగాలైనట్లూ, తానే అన్నింటిలో ఉన్నట్లూ అనుభవం కలిగింది. దూరంగా పోతున్న ఒక కారును చూచాడు. కారూ తానే, డ్రైవరూ తానే, ఇంజనూ తానే, టైర్లూ తానే, రోడ్డూ తానే. కారు దూరంగా పోతుంటే తననుంచి తానే దూరంగా పోతున్నాడు. ఇటువంటి స్థితిలో రోజంతా ఉన్నాడు. సాయంత్రానికి మళ్ళీ దేహస్పృహ  పోయింది. 


ఇంకోన్నాళ్ళకు తన వెన్నులో ఏదో ఒక బంతి లాటిది కదిలి పైదాకా వచ్చి తలవేనుక నుంచి రెండు భాగాలుగా చీలి ఒకటి కుడివైపూ ఒకటి ఎడమ వైపూ  వచ్చి మళ్ళీ కనుబొమల మధ్యన కలిసినట్లు ఆయనకు ఒక అనుభవం కలిగింది. ఆపుడు ఆయనకు ఒక వెలుగు లాటిది కనిపించింది. దానిలో మైత్రేయను దర్శించానని ఆయన చెప్పాడు.


ఇకపోతే ఇలాటి అనుభవాలు ఆయనకు జీవితమంతా కలుగుతూనే ఉండేవి. కాకపొతే ఈ ప్రాసెస్ అనేది తరువాత కాలంలో ఇంత ఉధృతంగా ఉండేది కాదు. అయితే ఇటువంటి ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలు కలిగినంత మాత్రాన  ఆయన్ను ఒక రుషితో పోల్చడానికి లేదు. ఇదే ఈయన జీవితంలోని విచిత్రం. ఎందుకంటే ఈ అనుభవాలు కలిగిన తర్వాత ఎన్నో ఏళ్లకు ఆయన ఒకరికంటే ఎక్కువ స్త్రీలతో రహస్య సంబంధాలు నేరిపాడని తరువాత లోకానికి వెల్లడైంది. ఇందులో నిజానిజాలు దేవుని కెరుక. కాని చాలామంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు. ఈ స్త్రీలలో రోసలిన్ అనే అమ్మాయి, తన మిత్రుడైన రాజగోపాల్ భార్య కావడం ఇంకా దారుణమైన విషయం.


కనుక కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు కలిగినంత మాత్రాన మనిషి పవిత్రుడై పోతాడనీ, రుషి గా మారతాడనీ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. విశ్వామిత్రుడు అంత తపశ్శక్తి సంపన్నుడై ఉండీ మేనక అందం ముందు దాసోహం అన్నాడు. ఇక , మొన్నటి ముక్తానందలూ, నిన్నటి రజనీషులూ, ఈనాటి నిత్యానందలూ సరే సరి. స్త్రీ వ్యామోహానికి లొంగని అసలు సిసలు మహనీయుల పేర్లు చెప్పాలంటే శ్రీ రామకృష్ణ, రమణ మహర్షి, వివేకానంద, షిర్డీ సాయిబాబా మొదలైన వాళ్ళ పేర్లే చెప్పాలి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తత్వవేత్త జిడ్డు కి కూడా ఒక రహస్య జీవితం ఉందని తెలిస్తే అది దిగ్భ్రాంతిని కలిగించక మానదు.


ఇంద్రియ వ్యామోహాలకు పూర్తిగా అతీతుడై ఆత్మానుభూతిలో అనుక్షణం ఉండటాన్నే జీవపరిణామంలో  అత్యుత్తమ స్థాయిగా  భారతీయ వేదాంతం అభివర్ణించింది. దానికి తక్కువ అయిన దేనినీ భారతీయులు గోప్పతనంగా పరిగణించరు. ఇక్కడే ఉత్త పండితులకూ, నిజమైన మహాత్ములకూ తేడా అనేది కనిపిస్తుంది. ఒకడు వేదాలను బట్టీ పట్టవచ్చు. కాని అతనికి ఆత్మానుభవం లేకపోతే అది ఔన్నత్యం కిందికి రాదు. గొప్ప వేదాంతాన్నీ, తత్వ శాస్త్రాన్నీ బోధిస్తూ ఒకడు మంచి ఉపన్యాసాన్ని ఇవ్వవచ్చు. కాని అతను స్వయానా తన ఇంద్రియ ఆకర్షణలకు అతీతుడు కాకపోతే అతని పాండిత్యం అంతా ఎందుకూ పనికిరాని చెత్త అవుతుంది.


ఈ కోణంలో చూచినపుడు, జిడ్డు స్థాయి జర్రున దిగజారి పోతుంది. దానికి కారణం ఏమిటో, ఇటువంటి పరిస్తితి ఎందుకు రావలసి వచ్చిందో దానికి గల జ్యోతిష్య కారణాలేమిటో వచ్చే పోస్ట్ లో చూద్దాం.