Stall Number : 186
Dates : 2-1-2026 to 12-1-2026
Timings : 2 Pm - 9 Pm
Venue : Indira Gandhi Municipal Corporation Stadium, Vijayawada.
Stall Number : 186
Dates : 2-1-2026 to 12-1-2026
Timings : 2 Pm - 9 Pm
Venue : Indira Gandhi Municipal Corporation Stadium, Vijayawada.
దీనిలో పంచవటికి 186 స్టాల్ నంబర్ కేటాయించబడింది. యధావిధిగా మా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
హైద్రాబాద్ బుక్ ఫెయిర్ లో మా స్టాల్ వందలాదిమందికి జ్ఞానదాహార్తిని తీర్చింది. మేము అనుకున్నదానికంటే ఎక్కువగా ప్రజాదరణను పొందింది. ఎంతోమంది సందర్శకులు మావాళ్లు చెప్పినది శ్రద్దగా విని, మా దారిని అర్ధం చేసుకోగలుగుతున్నారు.
సందేహసుందరాలు, విజ్ఞానప్రదర్శకులు, యూట్యూబ్ యూనివర్సిటీ పట్టభద్రులు, పాత అభిమానులు, అహంకారపూరిత వాదనాపరులు, ఈ విధంగా ఎన్నిరకాల మనుషులు మా స్టాల్ ను సందర్శించినప్పటికీ, నిజమైన జిజ్ఞాసువులు, ఆలోచనాపరులు, సాత్త్వికులు కూడా వారిలో చాలామంది ఉన్నారు. వారిదే అసలైన ప్రయోజనం.
హైద్రాబాద్ రంగస్థలాన్ని వదలి, ఇప్పుడు విజయవాడ ప్రాంతప్రజలకు అసలైన ఆధ్యాత్మికవెలుగులను చూపించడానికి 'పంచవటి' వస్తున్నది. మీకు జిజ్ఞాస ఉంటే, ఇక్కడకూడా మా సంస్థ ముఖ్యసభ్యులను మీరు కలుసుకోవచ్చు. మీమీ సందేహాలను తీర్చుకోవచ్చు.
ఈ లోపల మూడు క్రొత్తపుస్తకాలు ప్రింట్ చేయబడుతున్నాయి. విజయవాడ స్టాల్లో లభిస్తాయి. అవి,
1. శ్రీ గోరక్ష వచనసంగ్రహము
2. ధ్యానబిందూపనిషత్తు
3. నాదబిందూపనిషత్తు.
నా రచనలను, భావజాలమును, సాధనామార్గమును అభిమానించే జిజ్ఞాసువులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను.
గతంలో యురేనస్ చారం గురించి వ్రాస్తూ, రాబోయే మూడేళ్లు భారత ఉపఖండానికి అతి గడ్డుకాలమని, సంక్షోభాలు, కుట్రలు, విప్లవాలు, యుద్ధవాతావరణం ఉంటాయని వ్రాశాను. పరిస్థితులు ఏ విధంగా నానాటికీ మారుతున్నాయో గమనిస్తే నేను వ్రాసినది జరుగుతున్నదా లేదా అర్ధమౌతుంది.
బాంగ్లాదేశ్ లో సంక్షోభాన్ని సృష్టించి, ఇస్లామిక్ తీవ్రవాదరాజ్యాన్ని స్థాపించి, ఒకవైపు పాకిస్తాన్ ఒకవైపు బాంగ్లాదేశ్ కలసి ఇండియాను చక్రబంధంలో ఇరికించి దాడిచేయాలని ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి.
సౌదీ అరేబియాతో పాకిస్తాన్ దోస్తీ, ఆసిమ్ మునీర్ ను సర్వసైన్యాధిపతిని చేయడం, కోర్టుపరిధినుండి అతడిని జీవితకాలంపాటు తప్పించడం ఇవన్నీ ఈ ప్లాన్ లోనే భాగాలు. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ను, బాంగ్లాదేశ్ లో హసీనాను దిక్కులేనివాళ్లుగా చేయడం కూడా ఈ కుట్రలో భాగమే. వీరిద్దరూ ఇండియా చెప్పినట్లు వినేవాళ్ళు. అందుకే వీరిద్దరినీ తప్పించారు. ఇమ్రాన్ ఖాన్ దొరికిపోయి జైలుపాలయ్యాడు. హసీనా పారిపోయి ఇండియాకు వచ్చి తలదాచుకున్నది.
పాకిస్తాన్ కేంద్రంగా, ఇండియాపై దాడిచేసే కుట్ర వేగంగా రూపుదిద్దుకుంటున్నది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
ఇప్పుడు మరొక భారతద్వేషి తారిక్ రహమాన్ రంగప్రవేశం చేశాడు. ఇతను గత 17 ఏళ్లుగా ఎక్కడెక్కడో ఉండి ఇప్పుడు ఎన్నికల ముందు దేశానికి తిరిగి వచ్చాడు. ఎందుకిదంతా అనేది చిన్నపిల్లలకి కూడా అర్థమౌతుంది.
ఈ నేపథ్యంలో బాంగ్లాదేశ్ జాతకచక్రం ఏమంటున్నదో చూద్దాం.
దీనికి 16-12-1971 న స్వతంత్రం వచ్చింది. సమయం సాయంత్రం 5 గంటలు. ఆ సమయానికి ఢాకాలో వేసిన జాతకచక్రం ఇలా ఉంటుంది.
ఈ దేశానికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఏమీ ఉండదని, మిడిల్ ఈస్ట్, అమెరికాల చేతులలో కీలుబొమ్మగా మారి వాటికి తందానతాన అనే విధంగా తయారౌతుందని దీనిని బట్టి అర్ధమౌతుంది.
ఈ దేశానికి చంద్రమహర్దశ 2023 లో మొదలైంది. అప్పుడే అక్కడ కుట్రలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం చంద్ర-రాహుదశ ఏప్రియల్ 2025 నుండి సెప్టెంబర్ 2026 వరకూ ఉన్నది. ఇది గ్రహణదశ. చంద్రుడు నీచస్థితిలో ఉన్నాడు. రాహువు శపితయోగంలో ఉన్నాడు. దీనివల్ల ఈ దేశానికి తీవ్రమైన గ్రహణం పడుతుంది. ప్రస్తుతపరిస్థితి సరిగ్గా ఇదే. అయితే, ఇది అసలు డ్రామాకు మొదలు మాత్రమే. అసలైన కధ 2026-29 మధ్యలో ఉంటుంది.
ఆ సమయంలో గోచారయురేనస్ సరిగ్గా రోహిణీనక్షత్రం పైన సంచరిస్తాడు. భారత ఉపఖండానికి తీవ్రమైన గడ్డుకాలం అదే కాబోతున్నది.
ఆ సమయంలో బాంగ్లాదేశ్ జాతకంలో చంద్ర - గురు, చంద్ర - శనిదశలు జరుగుతాయి. ఇవి దృఢకర్మదశలు గనుక, ఆ దేశం ఇంకా తీవ్రమైన సంక్షోభంలో పడుతుంది. దానివెనుక పాకిస్తాన్ హస్తం ఉంటుంది. పాకిస్తాన్ వెనుక చైనా, టర్కీ, ఖతార్ మొదలైన దేశాలుంటాయి. ఇండియా చక్రబంధంలో ఇరుక్కుపోతుంది. వెరసి మనదేశంలో కూడా తీవ్రమైన గడ్డుపరిస్థితులు ఉంటాయి. మొత్తం భారతఉపఖండంలో యుద్ధవాతావరణం, అల్లర్లు, జననష్టం భారీస్థాయిలో ఉంటాయి. వీటి ప్రభావం షేర్ మార్కెట్లతో సహా అన్ని రంగాలపైనా పడుతుంది. ఇండియా అతలాకుతలమయ్యే ప్రమాదం గట్టిగా ఉన్నది.
తీవ్రవాదఇస్లాం చేతిలో చిక్కుకున్న దేశాలకు సర్వనాశనం తప్ప వేరేదారి అంటూ ఏదీ ఉండదు. అది బాంగ్లాదేశ్, పాకిస్థాన్ల విషయంలో మళ్ళీమళ్ళీ ఋజువౌతున్నది, ఈ దేశాలతో సరిహద్దులున్నందుకు ఈ కర్మను మనం కూడా పడవలసి వస్తున్నది.
దీనిని తప్పించడం అసాధ్యం. రాబోయే మూడేళ్లు చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజులుగా మిగలబోతున్నాయి.
మీరే చూడండి ముందుముందు ఏం జరుగనున్నదో !
నిన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.
' బుక్ ఫెయిర్ లో ఎవరో అడిగితే మీ నంబర్ ఇచ్చాము' అని శిష్యులన్నారు.
' అలా ఎందుకిచ్చారు?' అడిగాను ఏదో జరిగిపోయినట్టు బాధపడిపోతూ.
'మీతో అర్జెంట్ గా ఏదో చర్చించాలట. అందుకిచ్చాము. కాకపోయినా, మీ నంబర్ పాత పుస్తకాలలో ఉందిగా' అని మావాళ్లు జవాబిచ్చారు.
' సర్లే' అని ఆ సంగతిని అంతటితో వదిలేశాను.
సాయంత్రానికి ఎవరో ఫోన్ చేశారు.
'హలో మీరేనా ?' అన్నది ఒక గొంతు.
' ఆ నేనే' అన్నాను.
' మీ బుక్స్ కొన్ని చదివాము ' అన్నది గొంతు సూటిగా టాపిక్ లోకి వస్తూ.
' అలాగా ' అన్నాను.
'మేముకూడా కొన్నిబుక్స్ ప్రింట్ చేయించాము. వాటిని మీకు పంపిద్దామనుకుంటున్నాము' అన్నది.
' ఎందుకు?' అడిగాను.
' చదువుతారని. క్రొత్త విషయాలు తెలుస్తాయి కదా మీక్కూడా ' అన్నది గొంతు.
' ఏ టాపిక్ మీద మీ పుస్తకాలు?' అడిగాను.
' బుద్ధుడి మీద ' అన్నది స్వరం.
' మీ దగ్గరే ఉంచుకోండి. ఉపయోగపడతాయి' అన్నాను.
బుద్ధుడి గురించి గత ఏభైఏళ్లుగా చదువుతూనే ఉన్నాను. ఆయనగురించి క్రొత్తగా తెలుసుకునేది ఏమీలేదు.
' ఏం? బుద్ధుడంటే మీకు పడదా?' అడిగింది స్వరం కించిత్ హేళనగా.
'ఓహో అలా అర్థమైందా నా మాట?' అనుకుని, ' అవును. గతంలో మా మధ్య విభేదాలేమీ లేవు. ఈ మధ్యనే కాస్త చెడింది' అన్నాను.
అవతలనుండి కాసేపు నిశ్శబ్దం.
'హలో' అంది మళ్ళీ స్వరం.
' చెప్పండి లైన్లోనే ఉన్నాను' అన్నాను.
'ఎందుకు తేడాలొచ్చాయి మరి?' అడిగింది స్వరం. పక్కనుంచి ఎవరో నవ్వుతున్నారు.
'నామీద బుద్ధుడికి చాడీలు చెప్పాడు. ఆయన నమ్మేశాడు. అప్పటినుంచీ నాతో మాట్లాడటం లేదు' అన్నాను.
'మీమీద చాడీలా? ఎవరా చెప్పినది?' అన్నది స్వరం.
' ఇంకెవరు? జీసస్' అన్నాను.
మళ్ళీ నిశ్శబ్దం.
ఇద్దరు ముగ్గురు కలసి ఏదో మాట్లాడుకుంటున్నట్లు శబ్దాలు వినవచ్చాయి.
కాసేపలా అయ్యాక, ' మీతో ఒక విషయం చర్చించాలి. టైముందా?' అంది స్వరం.
' లేదు' అన్నాను.
' పోనీ ఎప్పుడు వీలౌతుందో చెప్పండి. అప్పుడే చేస్తాం' అన్నది.
' ఎప్పటికీ వీలు కాదు' అన్నాను.
' అదేంటి? అంత బిజీనా? అడిగింది.
' అవును' అన్నాను.
' మీరు రిటైరయ్యారుగా. ఏం చేస్తుంటారు మరి?' అడిగింది.
' చర్చికెళ్తుంటాను' అన్నాను.
' నిజంగానా? అక్కడేం చేస్తారు?' అడిగింది.
మళ్ళీ పక్కనుంచి నవ్వులు వినిపించాయి.
' చర్చిలో చర్చిస్తూ ఉంటాను' అన్నాను.
' అర్ధం కాలేదు' అన్నది.
' చర్చిల్ అని ఒక పాస్టరున్నాడు. అతను నా ఫ్రెండ్. అతనితో చర్చించడానికి వెళుతూ ఉంటాను' అన్నాను.
మళ్ళీ సైలెన్స్.
'మేం బుద్ధుడి గురించి మాట్లాడదామని ఫోన్ చేశాము' అప్పటికి అసలువిషయంలోకి వచ్చింది స్వరం.
'ఈమధ్య ఆయన కనపడటం లేదు. ఎక్కడున్నాడో నాకు తెలీదు. టీవీలో యాడ్ ఇవ్వండి' అన్నాను.
ఫోన్ కట్ అయిపోయింది.
కాసేపు చూశాను మళ్ళీ ఫోనొస్తుందేమో అని. రాలేదు.
'విషయం లేకుండా ఎందుకు ఫోన్ చేస్తారో నాకు? అవతల చర్చికెళ్ళాలి. లేటయితే మళ్ళీ ప్రభువుకు కోపమొస్తుంది' అని విసుక్కుంటూ దగ్గరలోని ఊరి చర్చివైపు హడావుడిగా బయల్దేరాను.
Happy World Meditation Day అంటూ నిన్న ఒక శిష్యురాలు మెసేజి పంపింది.
Meditation has no special day అని తనకు రిప్లై ఇచ్చాను.
అది హైలెవల్ యోగుల స్థాయి. మనలాంటి మామూలు మనుషులకు అలా కుదరదు కదా !
ఇలా ఏదో ఒక రోజును అనుకోవడం ఆరోజున గ్రీటింగ్స్ చెప్పుకోవడం లోకుల అలవాటు. సరే మనమెందుకు కాదనడం, ఎంతో కొంత మంచిదేగా !
జూన్ 21 న వరల్డ్ యోగా డే అన్నారు. డిసెంబర్ 21 ని వరల్డ్ మెడిటేషన్ డే అంటున్నారు. లోకాచారం ప్రకారం అలాగే కానిద్దాం. మొదటిదేమో వేసవి అయనాంతం. రెండవది శీతాకాలపు అయనాంతం. అయితే ఈ వర్గీకరణ ఉత్తరార్ధగోళానికి మాత్రమే వర్తిస్తుంది. దక్షిణార్ధగోళానికి వ్యతిరేకం అవుతుంది.
డిసెంబర్ 21 ని వరల్డ్ మెడిటేషన్ డే గా మన దేశం సూచించింది. అనేక దేశాలు ఒప్పుకున్నాయి. UNGA (United Nations General Assembly) ఆమోదముద్ర వేసింది.
డిసెంబర్ 21, మార్చి 21, జూన్ 21, సెప్టెంబర్ 21 - ఈ నాలుగూ భూగోళానికి ముఖ్యమైన రోజులు. ఏమంటే, ఈ రోజులనుంచీ ఋతువులు మారుతాయి. వ్యవసాయపరంగా, వ్యాపారపరంగా, వ్యవహారపరంగా అనుకూల/ప్రతికూల మార్పులు భూవాతావారణంలో వస్తాయి. అతిప్రాచీనకాలం నుండీ ఈరోజులను పండుగలుగా చేసుకోవడం భూమిపైన అనేక దేశాలలో అనేక సంస్కృతులలో ఆచారంగా ఉన్నది.
ఉదాహరణకు, భూమ్మీద అందరూ చేసుకుంటున్న క్రిస్మస్ పండుగ కూడా అంతకంటే ఎంతో ప్రాచీనమైన డిసెంబర్ 21 ని క్రైస్తవం కబ్జా చేసినదే. ఆరోజున గాని, 25 న గాని జీసస్ పుట్టాడనడానికి ఏవిధమైన ఆధారాలూ ఎక్కడా లేవు.
అయితే, ఈ తేదీలలో పుట్టిన మహనీయులు, జ్ఞానోదయాన్ని పొందిన మహనీయులు చాలామంది చరిత్రలో ఉన్నారు. ఉదాహరణకు శారదామాత డిసెంబర్ 22 న, అంటే ఈరోజున, జన్మించారు.
మహనీయులు జన్మిస్తూనే ఉంటారు. కొన్నాళ్ళుండి పోతూనే ఉంటారు. మనమూ అంతే. కాకపోతే, పండుగలూ పార్టీలూ చేసుకోవడం కాకుండా, ఈ తేదీలవల్ల మనకు సత్యమైన ఉపయోగమేమిటి అన్నది ప్రశ్న !
ఏమీ లేదు.
ఆయా తేదీలను తమ వ్యాపారానికి అనుగుణంగా వాడుకోవడం తప్ప మనుషులు నిజంగా చేస్తున్నదేమీ లేదు. కారణం? వారిలో చిత్తశుద్ధి లేకపోవడమే. దేనినైనా, పార్టీ చేసుకోవడానికి మాత్రమే వాడుకోవడం వారికి తెలిసిన విద్య.
మెడిటేషన్ డే కూడా అంతే !
జూన్ 21 ఒక్కరోజున కాసేపు మొక్కుబడిగా యోగా చేసి 'మనం కూడా ఏదో ఉద్ధరించాం' అనుకోవడం ఎంతటి భ్రమో, డిసెంబర్ 21 ఒక్కరోజున కాసేపు కళ్ళుమూసుకుని కూచోడం కూడా అంతే. యోగాభ్యాసమైనా, ధ్యానమైనా నీ జీవితవిధానంగా మారిపోవాలి. లేదంటే, ఊరకే మెసేజిలు పంపుకోవడం, పార్టీలు చేసుకోవడం తప్ప శరీరానికైనా మనస్సుకైనా వేరే ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.
జీవనవిధానమూ, ఆలోచించే తీరూ మారితే తప్ప యోగమైనా, ధ్యానమైనా. శాశ్వతఫలితాలు చూపించవు. అయితే, చాలామంది మనుషులకు చేతకానిదే అది !
పోనీలే ఇన్నాళ్ళకైనా అంతర్జాతీయంగా కనీసం ఒక గుర్తింపు వచ్చింది. చీమయాత్రలో ఒక అడుగు ముందుకు పడింది.
సంతోషం !
వాస్తవాలెలా ఉన్నా, కాస్త పాజిటివ్ గా నటిద్దాం !
నిన్న మా సెక్రటరీ మూర్తి ఫోన్ చేశాడు. తనేదో పనిమీద గుంటూరు వెళ్ళాడు. అక్కడ నుండి ఫోన్.
'ఒకాయన మిమ్మల్ని కలవాలంటున్నాడు' అన్నాడు.
'ఎవరాయన?' అడిగాను.
'తెలీదు. మీగురించి తన ఫ్రెండ్ చెప్పాట్ట. ఏదో పనిమీద ఒంగోలుకు వస్తున్నాడట. పనిలో పనిగా ఆశ్రమానికి వచ్చి మిమ్మల్ని చూచిపోతాడుట' అన్నాడు.
'మన పుస్తకాలు ఏవైనా చదివాడా? మన భావజాలం తెలుసా?' అడిగాను.
'పెద్దగా చదవలేదన్నాడు' అన్నాడు.
'మరెందుకు రావడం?' అడిగాను.
'ఊరకే మిమ్మల్ని ఒకసారి చూచిపోదామని వస్తున్నాట్ట' అన్నాడు.
'రావద్దని చెప్పు. ఊరకే చూచిపోవడానికి ఇది పబ్లిక్ పార్కు కాదు. నేనేమీ దేవుణ్ణీ కాదు. అలా ఊరకే చూచిపోవడం వల్ల తనకేమీ ఒరగదు. నాకేమో టైం వేస్టు. దానిబదులు, వచ్చినపని చూచుకొని, ఒంగోల్లో గుళ్ళూ గోపురాలూ చూచి వెనక్కు వెళ్ళడం మంచిది' అన్నాను.
'అతనికేం చెప్పమంటారు?' అడిగాడు.
'ఏముంది? గురువుగారు కలవరు. మీరు వచ్చినా ఉపయోగం లేదు. రావద్దు. అని సూటిగా చెప్పు' అన్నాను.
'బాగుండదేమో?' అన్నాడు.
' బాగున్నా బాగుండకపోయినా ఉన్న సత్యాన్ని చెప్పడం మంచిది' అన్నాను.
'సరే' అని మూర్తి ఫోన్ పెట్టేశాడు.
సరియైన ఆధ్యాత్మికమార్గంకోసం ప్రయత్నం చేసేవారికి మాత్రమే ఇక్కడకు వచ్చినా, నన్ను కలిసినా ఉపయోగం ఉంటుంది. ఊరకే చూచిపోదామని వచ్చేవారికి, పుణ్యంకోసం వచ్చేవారికి, కాలక్షేపంకోసం వచ్చేవారికి, కబుర్లకోసం చర్చలకోసం వచ్చేవారికి ఏమాత్రమూ ఉపయోగం ఉండకపోగా, నా టైము వారి టైము రెండూ వేస్టు అవుతాయి.
ఆశ్రమం ఇటువంటివారికోసం కాదు.
ఊరకే చూచిపోయేవారు మాకక్కర్లేదు. ఇక్కడే ఉండిపోయేవారు, సాధనామార్గంలో నడిచేవారు మాక్కావాలి. అప్పుడే వారి జీవితానికి సార్ధకత ఉంటుంది. నిజమైన సాధకులకు దారిని చూపించి, వారిని సత్యమార్గంలో నడిపించానన్న సంతృప్తి నాకూ ఉంటుంది. ఈ రెండూ లేనపుడు వృధాకాలక్షేపం తప్ప ఇంకేమీ జరగదు.
అందుకే అటువంటివారిని ఆశ్రమానికి రావద్దని చెబుతూ ఉంటాను. అంత్యనిష్టూరం కంటే ఆదినిష్టూరం మేలు కదూ !
నేటి నుండి హైద్రాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ మొదలౌతున్నది
దానిలో పంచవటి స్టాల్ సిద్ధమయింది.
డిమాండ్ ను బట్టి, ఈ ఏడాది క్రొత్తగా 11 పుస్తకాలను ప్రింట్ చేయడం జరిగింది. అవి స్టాల్లో అందుబాటులో ఉన్నాయి. పాఠకుల సూచనలమేరకు పుస్తకాల ధరలను గణనీయంగా తగ్గించడం జరిగింది.
గమనించండి.
మొదటిభాగంలో లాగానే దీనిలోకూడా నూరుజాతకాల విశ్లేషణలతో జలుబు నుండి ఎయిడ్స్ దాకా అనేకరకాలైన వ్యాధులను జాతకాలలో ఎలా గుర్తించాలో వివరించాను. 2022 లో మొదటిభాగం విడుదల అయినప్పటినుండి, తెలుగుపుస్తకం కోసం అనేకమంది జ్యోతిషవిద్యార్థులు, తెలుగుయూనివర్సిటీ నుండి M.A.జ్యోతిషం కోర్సు చేసినవారు, చేస్తున్నవారు అడుగుతున్నారు. ఇప్పటికి ఇది విడుదల అవుతున్నది.
2026 లో, ఇంకొక నూరు జాతకాలతో వైద్యజ్యోతిషం మూడవభాగాన్ని విడుదల చేస్తాను. ఈ విధంగా పదిభాగాలను వ్రాయాలన్నది నా సంకల్పం. మానవజాతిని బాధపెడుతున్న సమస్తరోగాలను జాతకపరంగా ఎలా గుర్తించాలో మొత్తం వెయ్యిజాతకాల విశ్లేషణలతో వివరించే ఈ గ్రంధాలు ప్రపంచ జ్యోతిషచరిత్రలోనే అరుదైన రీసెర్చిగా మిగిలిపోతాయి.
ఈ గ్రంధాన్ని ప్రచురించడంలో తోడ్పడిన నా శిష్యులందరికీ ఆశీస్సులందిస్తున్నాను. ఈ పుస్తకంకూడా జ్యోతిషాభిమానులను ఎంతగానో అలరిస్తుందని భావిస్తున్నాను.
ప్రస్తుతానికి ఈ బుక్ ఇక్కడ లభిస్తుంది.
నేను విజయవాడలో సర్వీసులో ఉన్నరోజుల్లో నాతోపాటు పనిచేసిన కొలీగు ఒకడుండేవాడు. మంచివాడు. కాస్త అమాయకుడు కూడా. పాపం ఏదో రోగంతో 2000 లోనే అర్ధాంతరంగా చనిపోయాడు. అప్పటికి సర్వీసు ఇంకా పాతికేళ్ళు మిగిలుంది.
వాళ్ళది విజయవాడ వన్ టౌన్ చిట్టినగర్. అదలా ఉంచితే, వాడు భూతంగా మారి తిరుగుతున్నాడని ఈ మధ్యనే కొందరు ఫ్రెండ్స్ చెప్పారు. నేనైతే నమ్మలేదు. కానీ మంత్రతంత్రాలపైన బాగా రీసెర్చి చేసిన ఒక ఫ్రెండ్ గాడు చెబితే ఏమోలే అనుకున్నాను. ఆ సంగతి అంతటితో విని వదిలేశాను.
ఈ మధ్యన ఆశ్రమం దగ్గర పొలిమేరచెట్లలో దిగాలుగా కూచుని కనిపించాడు. అప్పుడు నమ్మక తప్పలేదు.
' ఏంటి ఇక్కడ కూచున్నావ్?' అంటూ నేనే పలకరించాను.
' గుర్తుపట్టావన్నమాట ! మర్చిపోయావేమో అనుకున్నా' అన్నాడు
' ఎలా మర్చిపోతాను? ఇన్నేళ్ల తర్వాత ఇలా కనిపించినా నీలో మార్పేమీ లేదు' అన్నాను.
' కనీసం నువ్వైనా హెల్ప్ చేస్తావని నీ దగ్గరకి వచ్చాను' అన్నాడు.
' రా మాట్లాడుకుందాం' అంటూ ఆశ్రమంలోకి దారితీశాను.
టీ త్రాగుతూ, ' ఇప్పుడు చెప్పు నీ కధ' అన్నాను.
'ఏం లేదు. ఈ భూతంజన్మ నుండి విముక్తి కోసం వెతుకుతూ ఒక గురూజీని కలిశాను. ఆయనొక ఉపాయం చెప్పాడు. నాలాంటి భూతాన్నొకదాన్ని తెచ్చుకుంటే మా ఇద్దరికీ భూతశుద్ధివివాహం చేయిస్తానన్నాడు. అప్పుడు మాత్రమే మాకు ఈ జన్మనుండి విముక్తి కలుగుతుందట. నాకు నమ్మకం కలగలేదు. పాత ఫ్రెండ్ వి, అందులోను ఇప్పుడు గురూజీవయ్యావు కదాని సెకండ్ ఒపీనియన్ కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చా' అన్నాడు.
' భూతశుద్దా? వివాహంతోనా? దీనికి సెకండ్ ఒపీనియనా?' అన్నాను అయోమయంగా.
భూతం బిక్కముఖం వేశాడు.
'అసలు భూతశుద్ధి అనేది ఉందా? లేదా?' అడిగాడు నిరాశగా.
' ఉంది. కానీ అది వివాహంతో రాదు. వివాహంతో ఉన్నది కాస్తా పోతుంది' అన్నాను.
' మరెలా?' అడిగాడు భూతం.
' ధాతుశుద్ధి ఉంటే భూతశుద్ధి జరుగుతుంది. ఇవి రెండూ ఉంటే చిత్తశుద్ధి వస్తుంది. అప్పుడు శివానుగ్రహం లభిస్తుంది. నీకు విముక్తి దొరుకుతుంది. నాకు తెలిసినంతవరకూ అదీ ప్రాసెస్. అయితే ఇది పెళ్లితో రాదు. సాధనతో వస్తుంది. సరియైన గురువును అనుసరిస్తూ, సరియైన దిశలో సాధనచేస్తే, నీ అదృష్టం బాగుంటే ఈ జన్మలో రావచ్చు. లేకపోతే అనేకజన్మలు పట్టవచ్చు' అన్నాను టీ సిప్ చేస్తూ.
' అబ్బో అంత లాంగ్ ప్రాసెస్ అయితే కష్టమే. అవన్నీ ఎప్పుడు జరగాలి? ఎప్పుడు నాకు మోక్షం సిద్ధించాలి? దీనికంటే భూతశుద్ధివివాహమే బెటర్. అసలిదంతా లేకుండా సింపుల్ గా పని జరగాలంటే ఎలా?' భూతం ఏడ్చినంత పని చేశాడు.
' ఒకమార్గం ఉంది' అన్నాను.
'ఏంటది?' అడిగాడు ఉత్సాహంగా.
'దేహశుద్ధి ప్రయోగం అని ఒకటుంది. దానిని చేస్తే, భూతశుద్ధివివాహంతో పనిలేకుండానే నీకు మోక్షం వచ్చేస్తుంది. చేయమంటావా?' అడిగాను మంత్రదండంపైన చెయ్యివేస్తూ.
'ఒద్దులే. ఇప్పటికే చాలామంది చేతిలో అయింది. కానీ మోక్షం మాత్రం రాలేదు. నీ ఉపాయం కంటే, ఆ గురూజీ చెప్పినదే బాగుంది. నాకు నచ్చిన భూతాన్ని వెతుక్కుంటా. దొరికాక ఆయన్ను కలుస్తా' అన్నాడు.
'సరే. ఆ పనిమీదుండు. మళ్ళీ ఈ ఛాయలకు రాకు' అని ఉచ్చాటనామంత్రాన్ని జపించాను.
ఫ్రెండ్ భూతం కెవ్వున కేకేసి మాయమైపోయింది.
ఆ విధంగా భూతానికి దేహశుద్ధి చేసే బాధ నాకు తప్పింది. ఎంతైనా పాతఫ్రెండ్ కదా ! చూస్తూచూస్తూ నేనుమాత్రం ఎలా చెయ్యగలను ! ఏదో మాటవరసకన్నాను. నిజమనుకుని పారిపోయింది.
పిచ్చిభూతం !