“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, ఫిబ్రవరి 2024, గురువారం

ఉడుంభిళా హోమం చేస్తున్నాం. చూచి తరించండి.

'నమస్తే  గురూజి. ఫలానా స్వామి ఈ మధ్యనే పెద్ద యాగం ఒకటి చేశాడు' అన్నాడు అన్నామలై భక్తితో బద్దలైపోతూ.

అన్నామలై అంటే నా శిష్యుడే. తమిళనాడు బీజేపీ లీడర్ అనుకునేరు. కాదు. ఇతని పేరు సుబ్బారావు. అన్నామలై అని పేరు మార్చుకున్నాడు. ఎందుకో  నాకైతే తెలీదు. పేరు మార్చుకున్నప్పటినుంచీ తిరువణ్ణామలై లో ఉంటున్నాడు.  అంతకుముందు ఉద్యోగం చేసేవాడు, 

'ఎన్నాళ్ళు చేస్తావ్ వెధవ ఉద్యోగం? మానెయ్' అని నేనే చెప్పాను. మానేశాడు.

నేను మాత్రం చక్కగా రిటైరయ్యేదాకా ఉద్యోగం వెలగబెట్టాను. కానీ అందర్నీ మాత్రం ఉద్యోగాలు మానిపిస్తుంటాను. అది నా హాబీ. 

' ఆ తర్వాతేం చెయ్యాలి? అని తనూ అడగలేదు.

తను అడగలేదు గనుక నేనూ చెప్పలేదు.

ప్రస్తుతం తిరువణ్ణామలై లో కొండకి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. మిగతా సమయంలో ఏం చేస్తాడో నేనడగను. తను చెప్పడు.

మన సబ్జెక్ట్ లోకి వచ్చేద్దాం.

'ఏంటి స్వామీజీ హోమం చేశాడా? అందులో వింతేముంది? గౌరవనీయులైన నేటి స్వామీజీలు చెయ్యగలిగింది అంతే కదా. చెయ్యనీ' అన్నాను.

'దానివల్ల లోకకల్యాణం అవుతుందని ఆయన భక్తులందరూ తెగ నమ్ముతున్నారు' అన్నాడు.

'ఇప్పటికి అయిన కల్యాణాలు చాల్లే. కొత్త కొత్త కల్యాణాలెందుకు?' అన్నాను.

'అదేంటి గురూజీ. అలా తేలిగ్గా తీసేశారు. కొన్ని కోట్ల ఖర్చు అయింది  ఆ హోమానికి' అన్నాడు కోపంగా.

'ఏం నీ చెయ్యి కూడా కాలిందా హోమంలో?' అడిగాను.

'ఆబ్బె లేదు. నా దగ్గరేముంది బూడిద?' అన్నాడు అన్నగారి స్టైల్లో.

'పోనీ అంతంత పెద్ద మాటలు ఎందుకులేగాని. ఆ హోమంతో హమాస్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపమను. ఆ తర్వాత లోకకల్యాణం సంగతి చూడొచ్చు' అన్నాను.

' కళ్యాణం చేయడం తేలిక, యుద్ధం ఆపడం కంటే' అన్నాడు సీరియస్ గా.

'అంతేలే. ఆ తర్వాత ఎలాగూ మొదలయ్యేది యుద్ధమేగా' అన్నాను.

'సరే గురూజీ. ఇదంతా ఎందుకు? మనం కూడా ఒక పెద్ద హోమం చేద్దాం' అన్నాడు.

'ఎవరో వాత పెట్టుకుంటే మనం కూడా పెట్టుకోవాలా నీకసలు బుద్దుందా?' అరిచాను కోపంగా.

'కాదు కాదు గురూజీ. ప్లీజ్. మనం పాపులర్ కావాలంటే ప్రస్తుతం ఇదొక్కటేమార్గం' అన్నాడు.

'ముందు పాపులర్, ఆ తర్వాత బాటా, ఆ పైన అంబాసిడర్. ఈ గోల మనకెందుకు చెప్పు. ఏం పాపులర్ కాకపోతే నష్టం ఏంటి?' అన్నాను విసుగ్గా.

'ప్లీజ్. నాకోసం కాదనకండి. కావాలంటే మీ పేరుమీద  ఇంకొక నాలుగు ప్రదక్షిణాలు చేస్తా కొండకి' అన్నాడు ఉక్రోషంగా.

నిజంగా చేస్తాడేమో అని తెగ భయమేసింది. ఆ పాపం నాకెందుకులే అని ఇలా చెప్పాను.

'సరే. అయితే విను మనం చెయ్యబోయే హోమం మామూలుగా ఉండదు. కళ్ళు గిర్రున తిరగాల్సిందే' అన్నాను.

'ఎవరికీ?' అడిగాడు అనుమానంగా.

'చేసేవాళ్ళకి. ఎందుకంటే హోమం చేసిన పదిరోజులూ కటిక ఉపవాసం ఉండాలి. నీళ్లు మాత్రం బిందెలు బిందెలు తాగొచ్చు, అయితే, బాత్రూంకి మాత్రం పోకూడదు' అన్నాను.

'అప్పుడు కళ్ళు తిరగడం ఒక్కటే జరిగి ఆగదేమో?' అన్నాడు.

'ఏం జరిగినా సిద్ధపడేవాడే ఇందులోకి దిగాలి' అన్నాను.

' ఒకే. మరి చూసేవాళ్ళకి ఏమౌతుంది?' అడిగాడు. 

'ఇదేం హోమమో తెలిస్తే వాళ్ళకీ తిరుగుతాయ్ కళ్ళు' అన్నాను.

'త్వరగా చెప్పండి గురూజీ. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా' పెద్దగా అరిచాడు.

'దానిపేరు ఉడుంభిళా హోమం' అన్నాను.

'ఆమ్మో. వినడానికే భయమేస్తోంది. ఏదో క్షుద్రహోమంలాగా ఉందే?' భయపడ్డాడు.

'అర్భకుడా ! పేరుకే భయపడేవాడివి, ఇక డొనేషన్స్ ఎలా కలెక్ట్ చేస్తావురా?' గర్జించాను.

'డొనేషన్సా? అదేంటి గురూజీ?' నసిగాడు అయోమయంగా.

'మరి ఏమీ లేకుండా హోమం ఎలా అవుతుందిరా అమాయకుడా? అందులో ఇది ఆషామాషీ హోమం కాదు.  ఉడుంభిళా హోమం. పదికోట్లు అవుతుంది' అన్నాను.

'ఏంటి డబ్బులే?' గుడ్లు తేలేశాడు.

'కాదు గులకరాళ్లు' అన్నా నవ్వుతూ. 

'అలా కాదు గురూజీ. ఇంకో మాట చెప్పండి. ఇప్పుడే టీవీలో ఆ హోమం చూశాను. నేను తట్టుకోలేను. ఎలాగైనా హోమం చేసే తీరాలి' బ్రతిమాలాడు. 

'ఏంటి బిడ్డా బేరం చేస్తున్నావ్? సంతమార్కెట్లో సన్నజాజులు అమ్ముకునేదానిలాగా కనపడుతున్నానా? బేరాల్లేవ్. పదికోట్లు అంతే. కావాలంటే కమీషన్ క్రింద ఒకటి తీస్కో' అన్నాను కోపంగా.

'సరే గురూజీ. ఇది బాగుంది. ఆ డబ్బుతో ఒక కారు కొనుక్కుని కార్లో చేస్తా ప్రదక్షిణాలు' అన్నాడు సంతోషంగా.

'డబ్బుకోసమే కదురా నీ ప్రదక్షిణాలు. అది వచ్చాక కూడా మళ్ళీ అవేనా?  ఎదురుగా ఉంటే, ఒకే కిక్కుతో కిర్గిస్థాన్ పంపి ఉండేవాడిని నిన్ను'  అనేశాను.

' సర్లే ఏదో ఒకటి చేసుకోండి. ఇంతకీ మన హోమం వివరాలు చెప్పండి' అడిగాడు.

'విను బిడ్డా. ఈ హోమాన్ని రామాయణకాలంలో కుంభకర్ణుడు చేశాడు' అన్నాను.

'ఆ తర్వాత తిని గుర్రు పెట్టాడా?' అడిగాడు మహా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని.

'మూర్ఖుడా ! ఎగతాళి చెయ్యకు. తాళి తెగిపోతుంది' అన్నాను.

'ఎవరిదీ? నాదా, కుంభకర్ణుడిదా?' అడిగాడు రోషంగా.

'ఆవేశంలో జెండర్స్ మర్చిపోతున్నావ్ బిడ్డా. మీది కాదు, మీ ఆడోళ్ళది' అన్నాను. 

'అమ్మో గురూజీ. వద్దు శపించకండి. చెప్పండి' అడిగాడు వినయంగా.

'అలా రా దారికి. ఆ కాలంలో కుంభకర్ణుడు చేశాడు. ఇప్పుడు మనం చేస్తున్నాం. మధ్యలో ఎవరూ లేరు' అన్నాను.

'ఇంద్రజిత్తు నికుంభిలా హోమం చేశాడని రామాయణంలో చదివాము. మరి కుంభకర్ణుడు ఇలాంటి హోమం చేసినట్టు ఎక్కడా లేదే?' అన్నాడు అనుమానంగా.

'ఏంటి అనుమానిస్తున్నావా? చేశాడు. కానీ, వాల్మీకి వ్రాయడం మర్చిపోయాడు. అలా మర్చిపోయానని నిన్న రాత్రి నాకు కలలోకొచ్చి చెప్పాడు. ఎన్నని గుర్తుపెట్టుకోగలడు పెద్ద వయసులో?' అరిచాను కోపంగా.

'వాల్మీకి మర్చిపోయాడా? భలే ఉంది గురూజీ. అయినా, ఇలాంటి హోమాలు ఎందుకు గురూజీ? కాస్త సాత్వికంగా  మంచిగా ఉండేవి చెయ్యవచ్చు కదా ? రాక్షసులు చేసినవి ఎందుకు?' అడిగాడు భయంగా.

'దేవతల రోజులు పోయాయి బిడ్డా.  ఇప్పుడు అందరూ రాక్షసులే. కనుక రాక్షస హోమాలే చెయ్యాలి. నేటి కాలంలో భజనలు, పూజలు, హోమాలు, ప్రార్ధనలు ఏవైనా రాత్రిపూటే బిడ్డా.  మన పురాణాల ప్రకారం రాత్రిళ్ళు పూజలు చేసేది రాక్షసులే. అందుకే నేటి రాక్షసకాలానికి రాక్షసహోమాలే కావాలి గాని, సాత్వికహోమాలు పనికిరావు.  సాత్విక హోమాలకు డొనేషన్లు రావు బిడ్డా. అందుకే ఇలాంటి భయంకరహోమాలు చెయ్యాలి. జనాన్ని భయపెట్టాలి. అప్పుడే డబ్బులు రాల్తాయి. అవి కూడా మాలాంటి సర్వసంగపరిత్యాగులైన స్వామీజీలే చెయ్యాలి, వాటికి డొనేషన్లు ఇచ్చి మీలాంటివారు తరించాలి. మేము అన్నీ వదిలేసి సన్యాసం స్వీకరించింది ఎందుకు? ఇలాంటి హోమాలు చెయ్యడానికే కదా ! అంతే, మారు మాట్లాడకు' అన్నాను వీరావేశంతో ఊగిపోతూ.

'సరే స్వామీ. మీ అంతటివారు చెప్పాక తప్పుతుందా? శాంతించండి. ఇంతకీ ఏ దేవతకు ఈ హోమం?' అడిగాడు.

'ఏ దేవతేమిట్రా మూర్ఖుడా? ఉడుంభిళా దేవత. పేరులోనే ఉందిగా' అన్నాను.

'ఆమె ఎలా ఉంటుంది గురూజీ? ' అన్నాడు.

'పక్కా నాటు క్షుద్రదేవతలాగా ఉంటుంది. నక్క మొహం, కోతి శరీరం, పులిగోళ్ళు, ఏనుగు తొండం, డైనోసార్ తోక, ఒంటినిండా ఎలుగుబంటి బొచ్చు, పదికాళ్ళు, నలభై చేతులు ఉంటాయి బిడ్డా' అన్నాను.

'ఎవడు సార్ ఈ ఆకారాన్ని మొదటిసారి ఊహించిన దరిద్రుడు? వాడి మైండు అంత కుళ్లిపోయిందన్నమాట?' అడిగాడు అన్నామలై.

'అది నేనే' అని చెప్పడానికి ప్రిస్టేజి అడ్డొచ్చింది.

'ఏమో మరి? నాకేం తెలుసు? మన శాస్త్రాలలో అలా చెప్పబడి ఉంది. ఏ శాస్త్రాలు? అని మాత్రం అడక్కు. నాకూ తెలీదు. ఏదేమైనా మనం హోమం చేసే తీరాలి. నువ్వు పదికోట్ల పనిమీదుండు' అన్నాను తెలివిగా.

'అదికాదు గురూజీ. చక్కగా రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు ఇలాంటి శాంతస్వరూపాలు మనకు ఉండగా, ఇటువంటి క్షుద్ర ఆకారాలున్న దేవతల పూజలు, హోమాలు ఎందుకు గురూజీ? నాకు భయమేస్తోంది. నేను చెయ్యను' అన్నాడు.

'భయపడుతున్నావా? బద్దలైపోతావ్ జాగర్త, మన దగ్గరకి రావడమే గాని, పోవడం నీ చేతుల్లో లేదు బిడ్డా. ఇంత చేతకానివాడివి నన్నెందుకు నిద్రలేపావు మరి? నువ్వు చేసి తీరాల్సిందే.' ఉరిమాను.

'నిద్రలేపడమేంటి గురూజీ?' అడిగాడు భయంభయంగా.

'అంతేమరి. నన్ను లేపడం,  ఉడుంభిళను లేపడం రెండూ ఒకటే, ఆమె నాలోనే ఉందిరా. లేచాక మాకు శాంతి జరగాల్సిందే' అన్నాను. 

'సరే గురూజీ. మీ భయంతో ఒప్పుకుంటున్నాను. ఇంకొక్క సందేహం' అడిగాడు.

' త్వరగా ఏడువ్' అన్నాను.

'ఈ హోమం చేస్తే ఏం జరుగుతుంది?' అడిగాడు భయంభయంగా.

'ఏం జరిగేదేంటిరా అమాయక శిఖామణి? లోకకల్యాణం జరుగుతుంది' అన్నాను యమా సీరియస్ గా.

'ఎన్నిసార్లు జరుగుతుంది స్వామీ లోకకల్యాణం?' అడిగాడు తెగించి.

'వెధవ కళ్యాణమేగా ఎన్నిసార్లైనా జరుగుతుంది' అన్నాను.

'అదికాదు. గురూజీ. ఎవరేం  చేసినా, 'లోకకల్యాణం కోసమే' అంటున్నారు. అదేమో జరుగుతున్నట్టు ఎక్కడా కనపడటం లేదు. 'ఏసు త్వరగా వచ్చుచున్నాడు' అని కిరస్తానీలు రెండు వేల ఏళ్ళనుంచీ చెబుతున్నట్లే ఇదికూడా ఉంది. ఆయనేమో అడ్రస్ లేడు. అదేవిధంగా,  అసలు లోకకల్యాణం అనేది ఉందా?' అన్నాడు ఏడుస్తూ. 

'పాపం ఇంతగా ప్రాధేయపడుతున్నాడు, ఎక్కువగా ఏడిపించడం మంచిది కాదు, నిజం చెప్పేద్దాం' అనిపించింది.

గొంతు  తగ్గించి, ' చూడు బిడ్డా. అసలు నిజం ఇప్పుడు చెబుతున్నా విను. లోకకల్యాణం కాదు, లోటస్ పాండూ  కాదు. నీకూ నాకూ అవుతుంది కళ్యాణం' అన్నాను.

షాకయ్యాడు ఆ మాటకి.

'అదేంటి గురూజీ. ఈ మాట చాలా దరిద్రంగా ఉంది' అన్నాడు.

అతని డౌటు నాకర్ధమైంది.

'అది కాదురా దరిద్రుడా ! నీకూ నాకూ విడివిడిగా అవుతుంది. అంటే మన పంట పండుతుందని అర్ధం. ప్రదక్షిణాలు ఎక్కువై నీ మతి మలేషియా అయిపోయింది. హోమానికి మహా అయితే నాలుగు కోట్లు అవుతుంది. మిగతా ఆరు కోట్లు మనకేగా. మన లైఫు సెటిలైపోతుంది. లేకపోతే, మనల్ని నమ్ముకున్నవాళ్ళకి వేరే ఆశ్రమాలు కట్టించి ఇవ్వవచ్చు. అలా జరుగుతుందన్నమాట మన కళ్యాణం' అన్నాను.

'ఆమ్మో ఉడుంభిళా హోమంలో ఇంత ఉడుంపట్టు ఉందన్న మాట" అన్నాడు.

'ఉందో లేదో నువ్వే చూద్దువుగాని, ముందు డొనేషన్ల పని మీదుండు' అన్నాను.

'ఓకే గురూజీ. కానీ నా వాటా ఒక కోటి సరిపోదు. ఇంకోటి కూడా చూడండి' అన్నాడు.

'సర్లే. ఏదోకటి ఏడుద్దువుగాని, ముందిది ఏడువ్' అన్నాను.

అన్నామలై ఫోన్ పెట్టేశాడు.

నేను ఈజీచైర్లో వెనక్కు వాలి, 'జై ఉడుంభిళా' అని అరుస్తూ తృప్తిగా కళ్ళుమూసుకున్నాను.