“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, ఫిబ్రవరి 2018, సోమవారం

మేమూ యోగా చేస్తున్నాం !

నిన్న శ్రీదేవి చావు మీద పోస్ట్ వ్రాశాక యధావిధిగా కొన్ని మెయిల్స్ వచ్చాయి. అందులో ఒకరు ఇలా అన్నారు - యోగా చెయ్యక శ్రీదేవి చనిపోయింది అని మీరన్నారు. అది తప్పు. ఆమె రోజూ యోగా చేస్తుంది. అయినా సరే ఎందుకు చనిపోయింది?'

' యోగా చేస్తోంది కనుకే అలా చనిపోయింది. యోగినిలా బ్రతికితే ఇంకోలా చనిపోయి ఉండేది.' అని అతనికి క్లుప్తంగా మెయిల్ ఇచ్చా. 

ఇతని మెయిల్ చూచాక యధావిధిగా నాకు మళ్ళీ నవ్వొచ్చింది. ఈ మధ్యన నాకు ఎవరిని చూచినా తెగ నవ్వొస్తోంది. ఒకరు నన్ను పొగిడినా నవ్వొస్తోంది. తిట్టినా నవ్వొస్తోంది. మనుషులనూ వాళ్ళ అజ్ఞానపు తీరుతెన్నులనూ చూస్తుంటే విపరీతమైన నవ్వొస్తోంది. నేను నవ్వుతుంటేనేమో వాళ్ళకు కోపం ఇంకా పెరిగిపోతోంది. ఏం చేస్తాం ?

ఈ మెయిల్ చూచాక ఎప్పుడో జరిగిన ఒక  సంఘటన నాకు గుర్తొచ్చింది. కొన్నేళ్ళ క్రితం ఒకాయన నాతో ఇలా అన్నాడు.

'మీరేదో  యోగా గురించి తెగ చెబుతుంటారు. ఒక్క మీరే యోగా చెయ్యడం   లేదు. మేమూ యోగా చేస్తున్నాం. మీరే పెద్ద గొప్ప అనుకోకండి.'

యధావిధిగా నేను నవ్వేసి ఊరుకున్నాను.

కాసేపు అదీఇదీ మాట్లాడాక ఆయన తన కష్టాల సోది మొదలు పెట్టాడు. కొడుకు సరిగా చదవడం లేదనీ, పదహారేళ్ళకే కూతురు ఎవడితోనో లవ్వులో పడిందనీ, భార్య తన మాట వినడం లేదనీ చెప్పుకొచ్చాడు.

అంతా మౌనంగా విని చివరకు ఇలా  అన్నాను.

'నువ్వు   అబద్దం చెబుతున్నావు.'

అతను బిత్తరపోయాడు. 'లేదు నేను చెప్పేవి నిజాలే.  నా భార్యా పిల్లలవల్ల నాకు మనశ్శాంతి కరువైంది.' అన్నాడు.

'నేననేది అది కాదు. అవన్నీ నిజాలే. కాదనడం లేదు. నువ్వు రోజూ యోగా చేస్తున్నది అబద్దం.' అన్నాను.

'లేదు. అది కూడా నిజమే. ప్రతిరోజూ గంటసేపు చేస్తాను.' అన్నాడు.

'నువ్వు  చేస్తున్నది యోగా కాదు' అన్నాను.

అతను అయోమయంగా చూచాడు.

'ఇంకో విషయం చెప్పనా? 'యోగా' చేసేది కాదు. చేయించబడేది' అన్నాను.

అతను అయోమయంగా చూచాడు.

'కాస్త అర్ధమయ్యేలా చెప్పు' అన్నాడు.

అప్పుడిలా వివరించాను.

'లోకంలో చాలామంది యోగా చేస్తున్నామని భ్రమిస్తూ ఉంటారు. ఆసనాలనేవి యోగా కాదు. అవి యోగంలో మొదటి  మెట్టు మాత్రమే. యోగంలో 'మనో నిగ్రహం' లేదా మైండ్ కంట్రోల్ అనేది అతి ముఖ్యమైన మెట్టు. నువ్వు చేసే ఆసనాలనేవి ఆ పైమెట్టు ఎక్కడానికి పనికొచ్చే మొదటి మెట్టు మాత్రమే. దానిపైన ఎనిమిది మెట్లున్నాయి. అవి ఒదిలేసి రోజుకి ఒక అరగంటో గంటో ఆసనాలు చేస్తూ 'యోగా' చేస్తున్నామన్న భ్రమలో ఉంటారు అందరూ. అదే నాకు నవ్వు తెప్పించే అంశం.

యోగం అనేది ఒక జీవన విధానం. It is a way of life. నీ జీవితం మొత్తం యోగపరంగా ఉండాలి గాని ఆసనాలొక్కటే చేస్తే నువ్వు యోగివి కాలేవు. నువ్వు చెప్పిన నటులే కాదు, హాలీవుడ్ నటీ నటులు కూడా రోజూ యోగా చేస్తారు. కానీ వాళ్ళెం యోగిక జీవితాలు గడపరు. మిగతా వ్యాయామాల లాగే అది  వాళ్లకు ఒక వ్యాయామం అంతే.

నువ్వు నిజంగా యోగపరమైన జీవితాన్ని గడిపితే నీకు శరీరం మీద అంత మోజు ఉండదు. మేకప్ మీద శ్రద్ధ అసలే ఉండదు. వయసు ముదిరిపోతున్నదనీ, అందంగా కనపడాలనీ, దానికోసం నానా సర్జరీలు చేయించుకోవాలనీ నీకస్సలు అనిపించదు. నువ్వు చెబుతున్న కుటుంబ సమస్యలూ, డబ్బు సమస్యలూ నీ మనస్సును తాకను కూడా తాకలేవు. నీ మానసిక ప్రశాంతతను ఏదీ చెదరకొట్ట లేదు.

అసలు - నువ్వు చెప్పిన సినిమా నటులు చేసేది యోగా కాదు. అది ఒక వ్యాయామం అంతే. యోగా చెయ్యడం వేరు. యోగజీవితం గడపడం వేరు. ఈ రెంటికీ నక్కకూ దేవలోకానికీ   ఉన్నంత భేదం  ఉంది. కాకపోతే యోగా చెయ్యడం వల్ల ఒళ్ళు కాస్త కండిషన్ లో ఉంటుంది. అంతే. పిచ్చిపిచ్చి అల్లోపతీ మందులు వాడితే అదీ పోతుంది.

ఒక  విషయం చెబుతా విను. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా హైదరాబాద్ సత్యనారాయణ గోయెంకా గారి దగ్గర విపస్సాన  ధ్యానంలో కోర్స్ చేశారు. కానీ వాళ్ళకేం ఒరిగింది? వాళ్ళేం బుద్ధత్వాన్ని పొందలేదే? మరి ఈ ధ్యానం వల్లనే సిద్ధార్ధుడు బుద్ధుడయ్యాడు. కానీ ఆ ధ్యానాన్ని కోర్సుగా చేసిన అందరూ బుద్ధులు కావడం లేదుగా? అందుకే నేను చెప్పేది ఏమంటే -- ఫ్యాన్సీగా కోర్సులు చెయ్యడం కాదు. దానిని ఒక జీవనవిధానంగా మార్చుకుని ప్రతిరోజూ ప్రతి క్షణమూ అలా బ్రతకాలి. అప్పుడే నువ్వు యోగంకానీ ధ్యానం కానీ చేస్తున్నట్లు. లేకపోతే నీ జీవితంలోని మిగతా నటనల్లాగే ఇదీ ఒక నటన. అంతే !

ఆ విధంగా బ్రతుకుతూ అప్పుడు చెప్పు 'మేమూ యోగా చేస్తున్నాం అని' - అప్పుడు నమ్ముతాను. కానీ ఒక విచిత్రం చెప్పనా? నువ్వు నిజంగా అలా బ్రతికితే, అసలు ఇంకొకరికి చెప్పవలసిన పనే నీకు రాదు. అప్పుడు నా దగ్గరకొచ్చి ఇలా నీ సమస్యలను ఏకరువు పెట్టవు.

అసలు నువ్వన్న మాటలోనే అహంకారమూ, అసూయా నిండి ఉన్నాయి. ' నువ్వు మాకేమీ చెప్పనక్కర లేదు. మేమూ యోగా చేస్తున్నాం' అన్న మాటలోనే నువ్వేంటో నాకు తెలిసిపోయింది. నువ్వేమీ అనుకోకపోతే ఒకమాట చెబుతాను. నీలాంటి వాళ్ళు జీవితమంతా యోగా చేసినా 'యోగాన్ని' మాత్రం అర్ధం చేసుకోలేరు. అందుకోలేరు'. - అని   ముగించాను.

'ఇందాక అన్నావ్ కదా ! యోగా అంటే చేసేది కాదు. చేయించబడేది. అని.' అదేంటో కూడా అర్ధమయ్యేలా చెప్పు.' అన్నాడు.

'ఇప్పుడొద్దులే. ముందు ఇప్పటిదాకా  చెప్పినదాన్ని జీర్ణించుకో. అది ఇంకోసారి ఎప్పుడైనా చెబుతాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి చెబితే అజీర్తి చేస్తుంది నీకు'   అన్నా మళ్ళీ నవ్వుతూ.

మీరుకూడా ఆలోచించుకోండి మరి ! మీరు కేవలం ఉత్త యోగా చేస్తున్నారో లేదా  నిజమైన యోగజీవితాన్ని గడుపుతున్నారో?