“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

16, డిసెంబర్ 2010, గురువారం

ముక్కోటి ఏకాదశి

రేపే ముక్కోటి ఏకాదశి.

సనాతన ధర్మం అనబడే హిందూమతంలో మహోన్నతమైన రహస్యాలు దాగున్నాయి. మన గుడ్డిగా చేస్తున్న వ్రతాలు-పూజలకూ, ఖగోళ గమనానికీ, జ్యోతిష్యసూత్రాలకూ, యోగసాధనకూ సంబంధాలున్నాయి. హిందూ మతంలోని అతి గొప్పదైన విషయం ఇదే. పిండాండానికీ-బ్రహ్మాండానికీ, దీనిలో-దానిలో ఉన్న అన్నింటికీ మన మతంలో సమన్వయం కనిపిస్తుంది.

విశ్వంతో పోలిస్తే మానవుడు ఒక అణువైనప్పటికీ, ఈ అణువులోనే మళ్లీ ఆ విశ్వం అంతా దాగుంది. ఎలా దాగుంది అన్న రహస్యాన్ని మన గ్రంధాలు విప్పిచెప్పటమేగాక, ఏం చేస్తే రెంటికీ చక్కని సమన్వయం సాధించవచ్చో వివరించాయి. మానవుడు బాహ్య-అంతరిక స్థాయిలలో సమన్వయాన్ని సాధించగలిగితే అతని జీవిత గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. కాని అందరూ అంతరిక సాధన చెయ్యగలరా? అంటే, అర్హత అంత త్వరగా అందరికీ రాదు అనే చెప్పాల్సి వస్తుంది.

అంతరిక యోగసాధన చెయ్యలేనివారు నామజపం చెయ్యవచ్చు. లేదా బాహ్యపూజ చెయ్యవచ్చు. సరిగ్గా చేస్తే అన్నీ ఒకే ఫలితానికి దారి తీస్తాయి. కారణమ్? అంతరికం బాహ్యం ఒకే మూలంపైన ఆధారపడిఉన్నాయి అన్నదే ఇక్కడి రహస్యం. బాహ్యం అంతరికాన్ని ప్రభావితం చేస్తుంది. అంతరికం బాహ్యానికి ఆధారాన్ని కల్పిస్తుంది. చివరకు, రెండూ వేరువేరుకావు ఒకటే అన్న సత్యస్ఫూర్తి కలుగుతుంది.

రేపు ఉపవాసం ఉండి విష్ణుపూజ,స్మరణ చెయ్యాలని మన పురాణాలు చెబుతున్నాయి. రేపు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని దానిద్వారా వెళ్ళడం ద్వారా మానవునికి విష్ణు దర్శనం కలిగి తద్వారా మోక్షం కలుగుతుందని చెబుతూ దీనిని మోక్ష- ఏకాదశి అని పిలిచాయి. దీనినే ఉత్తర ద్వార దర్శనం అనికూడా అంటారు.

తిరుమల ఏడుకొండలలోని ఏడవకొండమీద శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు. మనలోపల ఉన్న సప్త చక్రాలలో ఏడవదైన సహస్రదళపద్మం మీద ఆయన నారాయణునిగా శయనించి ఉన్నాడు. యోగపరిభాషలో మానవుని తలభాగం ఉత్తరం, కాళ్ళవైపు భాగం దక్షిణం. భౌగోళిక ఉత్తరంలో అయస్కాంత దక్షిణ ధృవం ఉంది. అందుకే ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవద్దని అంటారు.

ఈరోజున ఉత్తరద్వారం తెరుచుకుంటుంది అంటే అర్ధం- సహస్రదళపద్మానికి వెళ్ళేదారి సునాయాసంగా తెరుచుకుంటుంది అని. రోజున నారాయణుడు ఉత్తరద్వారాన్ని తెరిచి తన ద్వారపాలకులైన జయవిజయులను లోనికి అనుమతించాడని పురాణాలు చెబుతాయి.

జయవిజయులంటే ఇడా పింగళానాడులు. సామాన్యంగా రెండూ భ్రూమధ్యంలో ఉన్న ద్విదళ ఆజ్ఞాపద్మం వరకే వెళతాయి. ఇవి గుమ్మంవరకూ వెళ్లగలవుగాని సహస్ర దళ పద్మంలోనికి వెళ్ళలేవు. కనుకనే వీటిని ద్వారపాలకులు అని యోగపరిభాషలో అంటారు. ఇడానాడి చంద్రనాడి ఇది చంద్రునికి సూచిక. పింగళానాడి సూర్యనాడి ఇది సూర్యునికి సూచిక. కనుక అగ్నిస్వరూపమైన సుషుమ్నలోనికి రెండూ లయించిన స్థితినే జయవిజయులను ఉత్తరద్వారంగుండా నారాయణుడు లోనికి రానిచ్చాడని మార్మికభాషలో చెప్పారు. ఏకాదశి రోజున అది జరిగింది. అప్పుడు వైకుంఠం అనే స్థితి కలుగుతుంది. కుంఠితము కానిది వైకుంఠం. అంటే నిశ్చలము, స్థిరము, నాశనములేనిది అయిన స్థితి. ఉచ్చ్వాస నిశ్వాసములతో నిత్యం చంచలంగా ఉండే మనస్సు పరబ్రహ్మానుసంధానంద్వారా నిశ్చలత్వాన్ని పొంది అఖండ సచ్చిదానంద స్థితిలో లీనంకావడమే ఇడాపింగళా రూపులైన జయవిజయులు ఉత్తరద్వారం గుండా వైకుంఠప్రవేశం చెయ్యటం అంటే అర్ధం. అంటే రోజున సాధనకు అనువైన స్పందనలు, ఈ స్థితిని సులభంగా ఇవ్వగల ప్రభావాలు ప్రకృతిలో అధికంగా ఉంటాయి. దైవస్వరూపమైన గ్రహాలు-ప్రకృతీ కూడా రోజున భగవద్దర్శనానికి బాగా సహాయపడతాయి.

ఇది అంతరిక విషయం. ఇక బాహ్యంగా కనిపించే సూర్యచంద్రుల విషయం గమనిద్ధామా? ఎందుకంటే బాహ్యంగా ఉన్నదే అంతరికంగా ఉన్నదన్న సూత్రం మీదనే యోగమూ-తంత్రమూ నిర్మితమైనాయి మరి.

సూర్యుడు నిరయన ధనురాశిలో సంచరించే సమయంలో ఏకాదశి వస్తుంది. సమయంలో సూర్యుడు మూలా నక్షత్రంలో ఉంటాడు. మూలా నక్షత్రం గాలాక్టిక్ సెంటర్ కు దగ్గరగా ఉన్న నక్షత్రమండలం. దీనినే విష్ణునాభి అని పిలుస్తారు. నాభిలోనుంచే సృష్టికర్త అయిన బ్రహ్మ జన్మించాడని మన పురాణాలు చెపుతున్నాయి. ఇదంతా మార్మికపరిభాష. దీన్ని కొంచం అర్ధం చేసుకుందాం.

నిరవధికశూన్యంలోనుంచి మొదటగా సృష్టి జరిగిన ప్రదేశం మూలా నక్షత్రమండల ప్రాంతంలోనే ఉంది. కనుకనే దీనిని విష్ణునాభి అంటూ, ఇది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని స్థానంగా అలంకారిక మార్మికభాషలో చెప్పారు. మన గ్రహమండలానికి సూర్యుడే శక్తిప్రదాత. సూర్యుడు ఇక్కడినుంచి పుట్టినవాడే. కనుక, సూర్యుడు తనకు శక్తినిస్తున్న మరియు తాను పుట్టిన విష్ణునాభి అనే మహాశక్తికేంద్రం ఉన్నటువంటి మూలానక్షత్రమండల ప్రాంతం మీదుగా ప్రతి ఏడాదీ ఇదే సమయంలో సంచరిస్తాడు. వెలుగును శక్తిని ఇచ్చేటటువంటి సూర్యుడు సమయంలో మూలశక్తియైనటువంటి మూలానక్షత్రప్రాంతంలో సంచరిస్తూ లోకానికి శుభంకరమైన ధర్మస్వరూపమైన ఆధ్యాత్మిక వెలుగును ఇస్తాడు.

మాసంలో ఏకాదశినాడు, సూర్య చంద్రులు ఒకరికొకరు పంచమ నవమ స్థానాలలో ఉంటారు. ఇవి కోణస్థానాలు కనుక అత్యంత శుభప్రదమైనవి. ఇక చంద్రుని స్తితి చూద్దాం. రాశులలో మొదటిదైన మేషంలో చంద్రుడూ, ధర్మ స్వరూపమైన నవమ స్థానంలో నారాయణ స్వరూపుడైన సూర్యుడూ ఉంటారు. మేషం తలకు సూచిక కనుక తలలో ఉన్న సహస్రదళపద్మం సూచింపబడుతున్నది. తెల్లని పాలవంటి శుక్లపక్ష ఏకాధశినాటి చంద్రునికి సూచికగా పాలసముద్రంమీద శయనించి ఉన్న మహావిష్ణువు ( సర్వవ్యాపకమైన మహాశక్తిస్వరూపం ) సూచింపబడుతున్నాడు. రోజున సూర్యుడు మూలశక్తిస్థానంలో ఉంటాడు. చంద్రుడు దానికి పంచమ కోణంలో ఉండి కోణదృష్టితో ఆయన్ను చూస్తుంటాడు. అంటే మనస్సుకు సూచిక అయిన చంద్రుని దృష్టి ఈరోజున మూలానక్షత్రస్థితుడైన ఆత్మసూర్యునిపైన ఉండటం వల్ల, ఏం సూచింపబడుతున్నది? మానవుని యొక్క మనస్సు రోజున సమస్త చరాచరసృష్టికర్త అయిన దైవంమీద సులభంగా నిమగ్నం కాగలదు అన్న ప్రకృతిమాతయొక్క వరం మనకు దర్శనమిస్తున్నది. అంతేకాదు. సూర్యుని కోణ దృష్టికూడా చంద్రునిపైన ఉండటంవల్ల మూలానక్షత్రప్రాంతపు మహాశక్తి సూర్యుని వేడిమిద్వారా వచ్చి అది చంద్రునిపైబడుతున్నది. అంటే భగవంతుని ప్రసన్నదృష్టి కూడా ఈ రోజున అత్యంత దయాపూరితంగా మానవుల అందరిమీదా ప్రసరిస్తుంది. దీనినే వైకుంఠపు ఉత్తరద్వారం తెరుచుకోవటం, నారాయణుని దర్శనం కలగటం అని మార్మికభాషలో చెప్పారు.

ఆత్మకారకుడైన సూర్యనారాయణుడు ధర్మస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. మన: కారకుడైన చంద్రుడు శిరోస్థానమైన మేషంలో ఉండి సూర్యుని చూస్తున్నాడు. ఇది సమయంలో ప్రకృతిలో జరిగే ఒక అమరిక. అంతరికంగా ఇది ఒక అత్యంతమార్మికసూచన. దీని అంతరార్ధం యోగులకు విదితమే.

ఖగోళంలో జరిగే అమరికవల్ల మానవునిలోపల కూడా రొజున విష్ణుసాన్నిధ్యాన్ని సులభంగా పొందగలిగే స్పందనలు ఉంటాయి. మానవుని సాధనకు విశ్వంలోని వాతావరణం ఈరోజున చాలా అనుకూలంగా ఉంటుంది. మనస్సు తేలికగా భగవధ్యానంలో నిమగ్నం కాగలుగుతుంది. కనుక యోగులైనవారు రోజున సాధనను తీవ్రతరం చేస్తే అనుకూలంగా ఉన్న గ్రహ అయస్కాంత ప్రభావంవల్ల ఉత్తరద్వారం అనబడే అజ్ఞా-సహస్రదళపద్మముల మధ్యనున్న రహస్య ద్వారం తెరుచుకొని కుండలిని సహస్ర దళ పద్మం అనబడే వైకుంఠాన్ని చేరగలుగుతుంది. ఇదే మోక్షం పొందటం అంటే.

మూలాధారం నుంచి సహస్రదళం వరకూ వ్యాపించి యున్న కుండలినీ శక్తిమీద పవళించి ఉన్న మహాశక్తి స్వరూపాన్నే మన పురాణాలు-- ఆదిశేషుడనబడే మహాసర్పంపైన శయనించి ఉన్న మహావిష్ణువుగా మార్మికభాషలో చెప్పాయి. ఆ సర్వేశ్వరుని కరుణ ఈ రోజున ఇతోధికంగా మానవులకు లభించగలదు. ఇదే ముక్కోటి ఏకాదశి యొక్క రహస్య ప్రాశస్త్యం. మరి రేపటిని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఇక మనమీద అధారపడి ఉంది.