“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

5, నవంబర్ 2009, గురువారం

వివేకానంద స్వామి జాతకం( చివరి భాగం)


20-6-1899 నాడు స్వామి రెండవసారి విదేశాల యాత్రకు బయలుదేరాడు. లండన్, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్,సాన్ ఫ్రాన్సిస్కోలు స్వామి పాదధూళితో పవిత్రములయ్యాయి.అక్కడ తన శిష్యులనూ భక్తులనూ కలుసుకొని వారికి ఆత్మానందాన్ని కలిగించాడు.


ఏప్రిల్ 1900 లో సాన్ ఫ్రాన్సిస్కోలో వేదాంతసొసైటీని స్థాపించాడు. జూన్ లో న్యూయార్క్ లో యోగవేదాంత క్లాసులు చెప్పి అక్కడనుంచి యూరోప్ పర్యటనకు బయలుదేరాడు.పారిస్,వియెన్నా, కాన్స్టాంటినోపుల్, గ్రీస్,కైరో లు పర్యటించి 9-12-1900 తేదీన బేలూర్ మఠానికి చేరుకున్నాడు.

స్వామి తన రెండవసారి చేసిన విదేశీయాత్రలో గమనించిన విషయాలతో ఒక విధమైన నిర్లిప్తతా భావాన్ని పెంచుకున్నాడు.క్షీరభవాని ఆలయంలో స్వామికి ఇంతకూ ముందే ఒక ఇంద్రియాతీత అనుభవం కలిగింది.అక్కడ ఆలయం ధ్వంసం చేయబడిన స్థితిలో ఉండటాన్ని చూచి స్వామి ఆవేదనాపూరితుడై "నేనే గనుక తురుష్కులు ఆ ఆలయాన్ని ధ్వంసం చేస్తున్న సమయంలో ఉండి ఉంటే నా ప్రాణాలు బలిచ్చి అయినా దాన్ని ఆపి ఉండేవాడిని కదా"అని తలపోస్తాడు.అదే క్షణంలో ఆయనకు జగన్మాత మాటలు వినిపించాయి."నాయనా ఎందుకు బాధ పడుతున్నావు? నువ్వు నన్ను రక్షిస్తున్నావా? లేక నేను నిన్ను రక్షిస్తున్నానా? నేను తలచుకుంటే ఇదే క్షణంలో ఇక్కడ ఏడు అంతస్తుల బంగారు దేవాలయాన్ని నిర్మించుకోగలను.ధ్వంసరచన కూడా నా సంకల్పమే. కాబట్టి బాధ వదలి పెట్టు" అన్న జగన్మాత యొక్క దివ్యవాణి విన్న స్వామి అచేతనుడైనాడు. 

ఆక్షణం నుంచీ స్వామి ఆలోచనావిధానంలో గొప్ప మార్పు వచ్చింది. ఇంతకాలం కర్మవీరునిగా జీవితాన్ని గడిపిన స్వామిలో దాగిఉన్న సహజజ్ఞానీ భక్తుడూ బయటకు వచ్చారు.ఆక్షణం నుంచి తన చివరిరోజు వరకు స్వామి అంతర్ముఖంగా జీవితాన్ని గడిపాడు. ఇంతవరకూ తనతో పని చేయించిన శక్తి జగన్మాతయే.తాను నిమిత్త మాత్రుడు. అన్న భావాలు ఆయనలో ముప్పిరి గోన్నాయి.

ఇక రెండవసారి ఆయన చేసిన విదేశీయాత్రలో మితిమీరిన విలాసాలు వైభోగాలు సుఖాలలో తేలుతున్న అమెరికా యూరోప్ జనజీవనాన్ని చూచిన స్వామి మనస్సులో తీవ్ర వైరాగ్యభావాలు తిరిగి ముప్పిరి గోన్నాయి. యువకునిగా తీవ్రవైరాగ్యపూరిత జీవనాన్ని గడపి బ్రహ్మసాక్షాత్కారాన్ని తన ఇరవైమూడవ ఏట పొందిన స్వామిలోని మహాజ్ఞాని మళ్ళీ మేల్కొన్నాడు. ఆయనకు ఈలోకం అంటే క్రమేణా ఒక విధమైన ఏవగింపు కలిగింది. మాయా మోహితులై చరిస్తున్న మనుషులను చూచి ఆయనకు జాలి, జుగుప్స ఒకేసారి కలిగాయి.

ఇదే ఆలోచనా పరంపరలో మునిగిఉన్న స్వామికి ఒకనాడు ఈ భూమిపైన తన పని పూర్తి అయిందని, తాను వచ్చిన కార్యం పరిసమాప్తి అయిందన్న దర్శనం కలిగింది.ఆక్షణం నుంచి తన స్వస్థానానికి చేరుకోవడానికి స్వామి సంసిద్దుడయ్యాడు. ప్రపంచం ఎన్నటికీ మారదు.అది కుక్కతోక వంకర వంటిది. ఎందరు మహాత్ములు ప్రబోధించినా మానవ మనస్తత్వం అంత తేలికగా మారదు. మాయామోహం తేలికగా వదలదు.ఈలోకంలో మనం ఎందుకు పుట్టాము అన్న విషయం తెలుసుకొని దానిని పూర్తి చేసి మనం నిష్క్రమించాలి.మళ్ళీ ఇంకే లోకంలోనో ఇంకే పాత్రగానో మన పని మొదలౌతుంది. ఇదొక నిరంతర యాత్ర. 

సాధారణ మానవులకున్న కర్మ బంధాలు జీవనమరణాలు స్వామి వంటి ఆజన్మ సిద్ధపురుషులకు ఉండవు.కాని వారికీ జన్మలు తప్పవు.ధర్మ స్తాపనార్థం భగవంతుడు ఆడే లీలా నాటకంలో స్వామి వంటివారు పాత్రదారులు.ఆయనతో వారు రావలసిందే. తమ పని ముగించుకొని తిరిగి పోవలసిందే. 

ఇంతకాలం స్వామిని ఊపిరి సలపని కర్మలో ఉంచిన జగన్మాత తన ఆటను మార్చింది.తిరిగి తన స్వరూపజ్ఞానాన్ని స్వామికి అందించింది.శ్రీ రామకృష్ణులు చాలా సార్లు చెప్పారు"ఈ లోకంలో నీవు చెయ్యవలసిన పని ఉంది. అంతవరకు నీవు మళ్ళీ నిర్వికల్ప సమాధిని అందుకోలేవు.దానిని పెట్టెలో పెట్టి తాళం వేశాను.నీ పనిని పూర్తీ చేసిన రోజున ఆ తాళం తెరుస్తాను" ఆయన ఇంకా అనేవారు."నరేంద్రుడు ఆజన్మ ముక్తపురుషుడు. జగన్మాత తన పని కోసం అతడిని మాయాబంధాలలో ఉంచింది.అది పూర్తి అయిన మరుక్షణం అతడు తానెవరో తెలుసుకొంటాడు.అది గుర్తు తెచ్చుకొన్న మరుక్షణం అతడు ఈలోకంలో ఉండటానికి ఇష్టపడడు. యోగబలంతో శరీరత్యాగం చేసి తన స్వధామానికి చేరుకొంటాడు" 

స్వామి మొదటి విదేశీయాత్రకు రండవ విదేశీయాత్రకు చాలా అంతరాన్ని గమనించాడు.మొదటిసారి కన్నా ఈసారికి మనుషులలో ఇంద్రియదాస్యం, భోగ లాలసత ఎక్కువ కావటాన్ని ఆయన గమనించాడు.కాల ప్రభావాన్ని గురించీ,ధర్మం క్షీణించటం తిరిగి ఉద్దరింపబడటం,దేశాలు జాతులు వీటిమధ్య యుద్దాలు, నాగరికత పెరిగి తరగడం,దేశాలు కొన్ని సంపన్నములుగా కొన్ని బీదవిగా మారటం వీటి మధ్యగల కర్మసంబంధాలు ఇత్యాది చరిత్ర సంఘటనలపైన తీవ్ర ఏకాగ్రతతో ఆలోచనలో మునిగిన స్వామి కళ్ళముందు రాబోయే 5000 సంవత్సరాల ఘటనలు దృశ్యాలుగా కనిపించాయి. 

కాని ఆయన వాటిలో కొన్ని మాత్రమె సూచనాప్రాయంగా తెలియ జేశాడు.ఇంకొక 50 ఏళ్ళలో మన దేశానికి స్వాతంత్రం వస్తుందనీ, రష్యాలో విప్లవం వస్తుందనీ,భవిష్యత్తులో చైనా సూపర్ పవర్గా మారుతుందనీ ఆయన తన శిష్యులతో సంభాషణలలో,వారికి వ్రాశిన ఉత్తరాలలో చెప్పాడు. ఇంకా వివరాలు కావలసిన వారు Complete Works of Swami Vivekananda,Vivekananda His second visit to the West-New discoveries, అన్న పుస్తకాలు చూడండి. 

ఈ దివ్యదృశ్యాలు ఆయన ఆలోచనలో తీవ్రమార్పులు తెచ్చాయి. ఈ లోకం ఒక చక్రభ్రమణం. కుక్కతోక వంకర వంటిది.ఇక్కడ చరిత్ర పునరావృతం అవుతూ ఉంటుంది.నాగరికత,సంపద,ధర్మం అన్నీ చక్రభ్రమణంగా పెరిగి,తరిగి,మళ్ళీ పెరుగుతూ ఉంటాయి.ఇదొక ఇంద్రజాలం.ఈజాలం నుంచి మనిషి బయటపడి ఈనాటకంలో తన పాత్ర ఏమిటో తెలుసుకొని అది పూర్తిచేసి తన ఇంటికి చేరాలి. 

చలో నిజనికేతనే ...ఓ మన్... చలో నిజనికేతనే (ఓ మనసా నీ నిజస్థానానికి చేరుకో. సంసారమనే విదేశంలో విదేశీయుని వేషంలో ఎందుకు వృధాగా పరిభ్రమిస్తున్నావు) అని తాను శ్రీరామకృష్ణుని సన్నిధిలో యువకునిగా పాడిన పాట-దానికి గురుదేవుడు చలించి పరవశించి సమాధిస్థితిలోకి పోవటం ఆయన స్మృతిలో మెదిలింది.

చివరిరోజులలో స్వామి పూర్తి అంతర్ముఖ జీవితాన్ని గడిపాడు.బయటకు మామూలుగానే ఉన్నప్పటికీ ఆయన మనస్సు ఏదో ఉన్నతలోకాలలో ఎప్పుడూ విహరిస్తూ ఉండేది.చూచేవారికి ఆయన ఈ ప్రపంచానికి చెందని వానివలె కనిపించాడు.ఏదో వేరే దివ్యభూమికల నుండి చూచిపోవడానికి ఇక్కడకు వచ్చిన యాత్రికునివలె ఆయన కనిపించేవాడు.ఆయన మనస్సు నిరంతరం అఖండ చిత్స్వరూప పరబ్రహ్మానుసంధానంలో ఉండేది.

కల ముగిసింది.సత్యం తెలిసింది.కర్మ వదిలింది.ఆయన స్వస్థానం దేవతలకు కూడా అతీతమైన సప్తఋషి మండలం.అక్కడ తేజోమయ అంతరాళంలో మహాశూన్యమధ్యంలో ఏకాకిగా నిరాధారశూన్యంలో ఆసీనుడై నిరంతరపరబ్రహ్మలీనుడైన మహర్షి పుంగవుడే తాను.క్షీణిస్తున్న ధర్మాన్ని ఉద్ధరించేపనిలో భగవంతుడైన శ్రీరామకృష్ణుని లీలానాటకంలో పాత్రధారిగా కొంతకాలం ఆకలిదప్పులకు మాయామోహాలకు నిలయమైన ఈభూమిపైన తన పాత్ర పోషించాడు. అజ్ఞాన నిద్రామోహితులైన జనులను మేల్కొలిపి వారి స్వస్వరూపాన్ని వారికి తెలిపే దివ్యమైన ఋషిప్రణీతమైన వేదాంతజ్ఞానాన్ని మ్లేచ్చభాషలో పలికి ప్రపంచాన్ని జాగృతం చేసే అమృతవాణిని వినిపించాడు.

తన గురుదేవుడు తనకిచ్చిన పని పూర్తయింది.జగన్మాత ఇన్నాళ్ళూ తనని విద్యామాయతో కప్పి దేశాలు తిప్పి తన చేత ధర్మప్రచారం చేయించింది. బిడ్డ తన పనిని చక్కగా నెరవేర్చాడు. జగన్మాత సంతోషించింది. కప్పిన మాయను తొలగించింది. ఆయన కళ్ళెదుట తన స్వస్థానం దర్శనమిచ్చింది. తన లోకం రమ్మని పిలిచింది. ఆకలి దప్పులు జరామరణాలు కుళ్ళు కుత్సితాలు మాయామోహాలు లేని దివ్యసీమ ఆయన్ను ఆహ్వానించింది. తానెవరో ఆయనకు తెలిసింది.

గురుదేవుడు తానిచ్చిన మాటను నిలుపుకున్నాడు.పెట్టె మూత తెరిచాడు. తనదైన నిర్వికల్ప సమాధి కరతలామలకమై మళ్ళీ అందింది. నలుదిక్కులూ నిండి ఘోషిస్తున్న తేజోమయ బ్రహ్మసాగరం కళ్ళెదుట సాక్షాత్కరించింది. అది అమృత సాగరం. అందులో దూకి తాను కరిగి తన అస్తిత్వాన్ని కోల్పోవాలి. కాని తాను నశించడు. లేకుండా పోడు. స్వల్పమైన దేహభ్రాంతి వదలి జగత్తంతా తానె నిండి ఉన్న బ్రాహ్మీస్థితి కలుగుతుంది. అదే తన స్వస్థానం. 

బేలూర్ మఠంలో స్వామి గడపిన చివరిరోజులలో రాత్రంతా ఆయన గదిలో ధ్యానంలో ఉండేవాడు. నిశీధిలో ఎందుకో నిద్రలేచిన సోదర సంన్యాసులు కరెంటు లేని ఆరోజుల్లో ఆయన గదిలోనుంచి తలుపు సందులలోనుంచి బయటకు చిమ్ముతున్న దివ్యమైన కాంతిని చూచి భయపడేవారు.

స్వామి తన చివరిరోజులలో స్వభావంలో ఒక దేవతగా రూపాంతరం చెందాడు. అఖండమైన దయా స్వభావం, కరుణ, మానవ తప్పిదాలను సంకుచిత స్వభావాలను చిరునవ్వుతో ఆదరించి ప్రేమను పంచగల దివ్యమైన దేవతా స్వభావం ఆయనను ఆవరించింది. ఆయన సమక్షంలో ఒక విధమైన జంకు, భయం, అదే సమయంలో కన్న తల్లి వద్ద కలిగే చనువు, ప్రేమ, లోకాన్ని లెక్క చెయ్యని ధైర్యం ఒకేసారి కలిగేవి ఆయన శిష్యులకు.

1901 లో హిమాలయాలలోని మాయావతి, తూర్పు బెంగాల్, అస్సాం పర్యటన చేసాడు. 1902 జనవరి పిబ్రవరి బుద్ధ గయ, వారాణసిలలో గడిపి మార్చికి బేలూర్ మఠానికి చేరుకున్నాడు. జూన్ చివరిలో ఒకనాడు తన శిష్యుని పంచాగం తెమ్మని వరుసగా తిధులు చదవమని వింటూ ఉన్నాడు. జూలై నాలుగో తేదీ వద్దకు వచ్చేసరికి ఇక చాలు అని చెప్పాడు. అది ఎందుకో స్వామి దేహత్యాగ అనంతరం మాత్రమె వాళ్లకు అర్థం అయింది. 

జూలై నాలుగవ తేదీన సాయంత్రం వరకూ అతిసహజంగా గడపి సాయంత్రం వ్యాహ్యాళికి కూడా వెళ్లి వచ్చాడు. తరువాత రాత్రి దాదాపు ఎనిమిది గంటల సమయంలో నేలపైన పడుకొని కొద్దిసేపు జపమాలతో జపం చేసాడు. తరువాత కొంతసేపు నిశ్శబ్దం. ఒక విధమైన గురక లాగా వినవచ్చింది. స్వామి చిన్న నిట్టూర్పు వదలి నిద్రలోకి జారుకున్నాడని విసనకర్రతో విసురుతున్న శిష్యుడు తలచాడు. పొద్దున్న చూస్తె ముక్కులోనుంచి రక్తం కారి ఉంది. మెదడులో నరాలు చిట్లడం ద్వారా మరణం సంభవించింది అని డాక్టర్లు అనుకున్నారు.

స్వామి తన యోగబలంతో ఇచ్చామరణ వరంతో శరీరమంతా నిండి ఉన్న ప్రాణాన్ని ఊర్ధ్వగామినిగా లాగి బ్రహ్మ రంధ్రం ద్వారా ప్రాణాన్ని వదలిపెట్టి దేహాన్ని విడచి తన స్వస్తానమైన సప్తర్షిమండలానికి చేరుకున్నాడు అని మహాయోగులైన బ్రహ్మానందాది సోదర శిష్యులు గ్రహించగలిగారు. ఏమీ జరుగనట్లు,ప్రతిరోజూ నిద్రలోకి జారుకున్నట్లు, అతి మామూలుగా శరీరాన్ని స్వామి వదలిపెట్టిన తీరు అత్యద్భుతం.

స్వామి వంటి మహాయోగిని, ధర్మోద్దారకుని, కారణజన్ముని కన్న భరతమాత ధన్య. నవీన యుగంలో వేదకాలపు ఋషుల యోగ వేదాంత విజ్ఞానాన్నితాను ఆచరించి, సాధించి, ఇతరులకు ప్రబోధించి పవిత్రమైన ధన్యమైన జీవితాన్ని గడపి మన మతం యొక్క నిజమైన తత్వాన్ని మన కళ్ళెదుటే నిరూపించిన దివ్యమూర్తి స్వామి వివేకానందుని వారసులుగా గర్విద్దాం.

వెలలేని నిధి అయినట్టి సనాతన ధర్మాన్ని ఆచరించి జన్మ సాఫల్యాన్ని పొందుదాం. ఋషి ఋణం తీర్చుకుందాం. అప్పుడే ఇటువంటి మహనీయుల పుట్టుకకు సార్ధకత కలుగుతుంది. మానవ జన్మ ఎత్తినందుకు మనకూ సార్ధకత కలుగుతుంది.