అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

24, ఫిబ్రవరి 2026, మంగళవారం

నీవే నేను

పసిపాపలా నిద్రిస్తున్న

నీ ముద్దుమోమును చూస్తూ


కనురెప్ప వాల్చలేక

నిద్రకు దూరమయ్యాను


ప్రేమ తప్ప ఏమీ తెలియని

మమత తప్ప ఏమీ ఎరుగని


నీ అమాయకపు మనసును గమనిస్తూ

గుండె కరిగి నీరయ్యాను


కరిగిపోతున్న కాలాన్ని 

కళ్ళెదురుగా చూస్తూ


గమ్యంలేని పయనాన్నీ

గతిలేని మన బ్రదుకులనూ


నిస్సహాయంగా పరికిస్తూ

నిశ్చేష్టుడనై నిలుచుండిపోయాను


గతజన్మల మన కథలన్నీ

వరుసగా చదువుకొని


విధి ఆడే వింతాటను తలచి 

కన్నీరుమున్నీరయ్యాను


తమ స్వార్థం కోసం 

ఇతరులను బలిచేసిన వాళ్లనూ

 

ఇతరుల స్వార్థం కోసం 

తాము బలైపోయిన వాళ్ళనూ


ఎందరినో చూచి

మనసు స్థంభించి  శిలనయ్యాను


అదుపులేని ఆవేశాలనూ 

వెర్రివైన వ్యామోహాలనూ


బాధ్యత లేని మనుషులనూ

భయంతో సాగే బ్రతుకులనూ


అన్నింటినీ చూస్తూ 

బ్రదుకుతీరు అర్ధంకాని వెర్రినయ్యాను


ఎన్నో రూపాలలో ఎన్నో సందర్భాలలో

ఎప్పటినుంచో ఎదురొస్తూ


అన్నింటినీ నేర్పిస్తూ

అనుక్షణమూ ఆదుకున్న

 

నిన్ను చివరకు గుర్తించి

మాటరాక మూగనయ్యాను


చేయవలసిన పనులు

చెందవలసిన గనులు


చేరవలసిన చోటు

పోరవలసిన పోరు


అసలంటూ ఏవీలేవన్న 

అంతిమసత్యం తెలిసిరాగా


నాలో నేనై 

అన్ని నేనులూ నేనై

నీవే నేనయ్యాను