“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, సెప్టెంబర్ 2012, శనివారం

కర్మయోగి మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) జాతకం

లోకంలో ఒక విచిత్రం మనకు ప్రతిరోజూ కనిపిస్తుంది. చాలామంది యోగం గురించి సనాతనధర్మం గురించి లెక్చర్లు ఇస్తారు.కాని వాటిని నిత్యజీవితంలో ఆచరించేవారు బహుతక్కువ   ఉంటారు.ఎందుకంటే వాటిని గురించి చెప్పడం చాలా తేలిక.ఆచరించడం మాత్రం బహుకష్టం. అందులో కర్మయోగం మరీ కష్టం.లోకంలో ఉంటూ,సమాజంతో మెలుగుతూ నిత్యజీవితంలో అనుక్షణం యోగస్తితిలో నిలిచి ఉండటమే  కర్మయోగం.స్వార్ధంతో నిండిన మనుషుల మధ్య నిస్వార్ధంగా జీవించడమే కర్మయోగం.దీనిని అనుష్టించిన వారు పురాణకథల్లో మాత్రమె మనకు కనిపిస్తారు.అలాంటివాళ్ళు ప్రస్తుతం మన మధ్యన ఉంటారా?అనుకుంటాం.ఉన్నారు.నవీనకాలంలో ఈ కుళ్ళుసమాజపు మధ్యన నివసిస్తూ కూడా ఆదర్శమయమైన జీవితాన్ని గడపి కర్మయోగాన్ని నిత్యజీవితంలో అనుష్టించిన మహనీయుల్లో ఒకరు మాధవసదాశివ గోల్వాల్కర్.రాష్ట్రీయ స్వయంసేవకసంఘ్ కు ఒక దిశనూ దశనూ కల్పించిన మహనీయుడు గురూజీ.

ఈయనను 'గురూజీ' అంటూ గౌరవంతో అభిమానంతో ప్రతి ఒక్క RSS కార్యకర్తా పిలుచుకుంటాడు. మనమూ అలాగే పిలుద్దాం. ఆ పేరుకు ఆయన నూటికి నూరుపాళ్ళూ అర్హుడు. చాలామందికి RSS అనగానే అదేదో మత సంస్థ అని అనిపిస్తుంది. ఆ సంస్థ యొక్క ముఖ్యనాయకుల గురించి వారి దేశభక్తిపూరిత జీవితాల గురించి మనకు అవగాహన లేక అలాంటి భావనలు కలుగుతాయి. అందుకే గురూజీ వంటి మహనీయుల జీవితాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ఆయన యొక్క విశిష్ట జాతకాన్నీ, ఉత్తేజకర జీవితాన్నీ పరిశీలిద్దాం.


19-2-1906 ఉదయం 4.30 గంటలకు  నాగపూర్ లో గురూజీ జన్మించారు. ఆయన జాతకచక్రాన్ని ఇక్కడ చూడవచ్చు. విశిష్టవ్యక్తుల జాతకాలు విశిష్టంగానే ఉంటాయి.ఒక తపోమయుడైన కర్మయోగి యొక్క జాతకంలో ఉండే గ్రహస్తితులు ఇందులో మనకు కనిపిస్తున్నాయి.

లగ్నం ధనుస్సుకూ మకరానికీ మధ్య లగ్నసంధిలో పడింది. సహజ నవమస్తానానికీ కర్మస్తానానికీ మధ్యలో పడటంతో ఒక ప్రబలమైన సంకేతం వెలువడింది. కర్మరంగంలో ఉంటూ ధార్మికమైన బలంతో జీవించే వ్యక్తి జాతకం ఇక్కడ కనిపిస్తున్నది. 

కుటుంబస్థానంలోని సన్యాసయోగం వల్ల ఈయనకు సంసారపు ఖర్మ లేదని అర్ధమౌతున్నది. సప్తమాధిపతి చంద్రుడు ద్వాదశంలో చేరడం కూడా దీనికి బలం చేకూరుస్తున్నది. సుఖస్థానాధిపతి కుజుడు దానికి ద్వాదశంలో చేరడం కూడా ఇదే సూచిస్తున్నది. సప్తమంలో రాహువు యొక్క స్తితికూడా దీనినే సూచిస్తున్నది.మకరంలోని లగ్నకేతువువల్ల వైరాగ్యంతో కూడిన ఆధ్యాత్మికత సూచింపబడుతున్నది.

మంత్రస్థానంలో గురువుయొక్క స్తితితో ఉత్తమగురువువద్ద మంత్రోపదేశం పొందగలడు అని సూచన ఉన్నది.గురూజీ స్వయానా అఖండానందస్వామికి ప్రియశిష్యుడు మాత్రమేగాక స్వామియొక్క చివరిరోజులలో ఆయన దగ్గర ఉండి నిరంతరమూ ఆయనకు సేవచేసిన పవిత్రాత్ముడు.ఆయన వద్ద మంత్రోపదేశాన్ని పొందిన అదృష్టవంతుడు.  

అఖండానందస్వామి శ్రీరామకృష్ణుల ప్రధాన శిష్యులలో ఒకరని,శ్రీరామకృష్ణ సంప్రదాయపు తృతీయఅధ్యక్షుడని, ఆత్మజ్ఞానాన్ని పొందిన సద్గురువని చాలామందికి తెలియదు.అత్యున్నత బ్రహ్మానుభూతిలో నిరంతరం నిమగ్నమైన తన వైరాగ్యపూరిత మనస్సును, సోదరుడైన వివేకానందస్వామి ఆజ్ఞమేరకు కిందకు దించి, 'శివభావే జీవసేవ' అన్న మహత్తరమైన రామకృష్ణుని ఉపదేశం మేరకు తన జీవితాన్ని భరతదేశ సమాజోద్ధరణకు సమిధలా అర్పించిన మహనీయుడు అఖండానందస్వామి.ఆయన శిష్యుడవడం వల్ల గురూజీకూడా రామకృష్ణ సంప్రదాయ పరంపరలోని మహనీయుడయ్యాడు. శ్రీరామకృష్ణుని అనుగ్రహాన్ని పొందిన ధన్యుడయ్యాడు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. తానువాడే కమండలాన్ని తన అంత్యసమయంలో ఆశీర్వాదపూర్వకంగా గురూజీ కిచ్చారు అఖండానందస్వామి.అది చివరివరకూ గురూజీవద్ద ఉండేది. అఖండానందస్వామి గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ చూడవచ్చు.తర్వాతి పోస్ట్ లో స్వామి యొక్క మహత్తరమైన జీవితాన్ని స్పర్శిద్దాం.

గురూజీ జాతకంలో పంచమంలో ఉన్న గురువు నవమాన్నీ లగ్నాన్నీ తన ప్రత్యెక ద్రుష్టులతో వీక్షించడమే కాక, సప్తమ దృష్టితో సహజాష్టమమైన వృశ్చికాన్ని చూస్తున్నాడు. ఈ వీక్షణ కూడా గురూజీ యొక్క నిగూఢమైన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సూచిస్తున్నది.

యువకునిగా ఉన్నపుడే తీవ్రవైరాగ్యభావాలతో నిండి రామకృష్ణమఠంలో చేరుదామని గురూజీ తలపోశారు. కాని అఖండానందుల దివ్యదృష్టికి గురూజీ భవిష్యత్తు విభిన్నంగా స్పష్టంగా గోచరించింది.భారతదేశ సమాజోద్ధరణకు తన జీవితాన్ని సమర్పించమనీ, సౌశీల్యపూరిత జీవనాన్ని గడుపుతూ,దేశభక్తిని భారతపౌరులలో నింపుతూ,ఉన్నతమైన భారతదేశాన్ని నిర్మించే దిశగా మార్గనిర్దేశనం చేస్తూ ఒక కర్మయోగిగా జీవించమనీ ఆయన ఆదేశాన్నిచ్చారు. ఆ ఆదేశాన్ని తూచా తప్పకుండా తన జీవితమంతా గురూజీ పాటించారు.వివాహం చేసుకోకుండా ఉండిపోయి అత్యున్నత సన్యాసధర్మాలకు అనుగుణంగా ఒక కర్మయోగిగా ప్రపంచంలో జీవించారు.గురువుకు తగిన శిష్యుడనిపించుకున్నారు.

లగ్నారూడం అయిన మీనంలో నవమాదిపతి అయిన కుజుని స్థితీ, పంచమంలో రాహువుయొక్క స్తితీ ఈయనకున్న ఆధ్యాత్మికస్థాయిని సూచిస్తున్నాయి.ధార్మికమైన బలాన్ని పునాదిగా ఇచ్చి,అదేసమయంలో మాతృదేశ పునరుద్ధరణకోసం బహుముఖమైన ప్రణాళికలో   జీవితమంతా విశ్రాంతిలేని కర్మరంగంలో ఆయన్ను నడిపించింది ఈ గ్రహయోగం.

శనిబుధుల కలయిక వల్ల గురూజీ జాతకంలో వైరాగ్యపూరితభావాలు దర్శనమిస్తున్నాయి.చంద్రగురువుల షష్టాష్టకంవల్ల తన జీవితమంతా అతినిరాడంబర జీవితాన్ని గడుపుతాడు అన్న సూచన కనిపిస్తున్నది. ఆయనయొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని  కళ్ళకు కట్టినట్లు చూపించే ముఖ్య ఘట్టాలనూ, గురువైన అఖండానందస్వామి యొక్క భావాలు ఆయనకు ఎలా మార్గనిర్దేశనం చేశాయో వివరించే ప్రయత్నాన్ని వచ్చే పోస్ట్ లో చేస్తాను.

(సశేషం)  
read more " కర్మయోగి మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) జాతకం "

27, సెప్టెంబర్ 2012, గురువారం

కాలజ్ఞానం -14

రచ్చరచ్చ చేస్తుంది రాబోయే పౌర్ణమి
కుతంత్రాల కుమ్ములాటలతో   
మోగుతుంది హింసధ్వని 
చవితి నుంచి సప్తమి లోపు 

అందరికీ స్వార్ధమే పరమార్ధం 
ఎవరిక్కావాలి దేశసంక్షేమం 
దుశ్శాసన పర్వంలో 
ప్రధమ సమిధ న్యాయం

ప్రమాదాల పరంపరలు 
వెల్లువెత్తే అగ్నికీలలు 
కల్లోలం అనివార్యం 
అంతా ఘోరకలిప్రభావం 
read more " కాలజ్ఞానం -14 "

23, సెప్టెంబర్ 2012, ఆదివారం

కాలజ్ఞానం-13

ధర్మం వికటంగా మారుతుంది 
అతివల గతి సంకటమౌతుంది 
ఒక ముసలం తలెత్తుతుంది 
సంకటస్తితిని సృష్టిస్తుంది 

ఈశానుని శాసనం 
ఇక్కట్లను పెంచుతుంది 
విషకూపపు ఉచ్చులో 
విలాసాలు ముగుస్తాయి 
read more " కాలజ్ఞానం-13 "

17, సెప్టెంబర్ 2012, సోమవారం

పాకలపాటి గురువుగారి జాతకం - కొన్ని విశేషాలు

ఎక్కిరాల భరద్వాజగారి పుస్తకం చదివినవారికి పాకలపాటి గురువుగారు సుపరిచితులే. ఆయన జాతకాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఎందుకంటే, తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నట్లు, చూస్తే మహనీయుల జాతకాలే చూడాలి. వారున్నా సరే, లేకున్నా సరే. మామూలు మనుషుల జాతకాలు చూస్తే వాటిలో స్వార్ధం నీచత్వం తప్ప ఔన్నత్యం ఏముంటుంది?

పాకలపాటి గురువుగారి  అసలుపేరు దామరాజు వెంకట్రామయ్యగారు. పాకలపాటివారికి చాలా పేర్లున్నాయి. నర్శీపట్నం ఏజన్సీ ప్రాంతాలలోని కోయవాళ్ళు ఆయన్ను అనేక పేర్లతో  పిలిచేవారు. వాటన్నిటిలో 'రామయోగి' అనే పేరుతో ఆయన్ను పిలవడం నాకిష్టం. అందుకే ఈ వ్యాసంలో ఆయన్ను అదే పేరుతో పిలుస్తాను.

ఆయన గుంటూరుజిల్లా బ్రాహ్మణులు.శ్రీవత్స గోత్రోద్భవులు. దామరాజువారు ఇప్పటికీ గుంటూరు ఒంగోలు చుట్టుపక్కల ఉన్నారు. వారిలో ఎవరికైనా ఇటువంటి మహర్షి ఒకాయన వారివంశంలో పుట్టాడని తెలుసో లేదో మరి. రామయోగి జన్మతేదీ  11-6-1911. ఆరోజున జ్యేష్ట పౌర్ణమి. ఏలూరు దగ్గరలోని ఒక గ్రామంలో ఆయన జన్మించారు. జనన సమయం మనకు సరిగ్గా తెలియదు. కాని వారి ముఖవర్చస్సును బట్టి, ఎప్పుడూ నలగని బట్టలువేసే వారి అలవాటును బట్టి, తులా లగ్నం అయి ఉండవచ్చు అని ఊహిస్తున్నాను. అష్టమ బుధుడివల్ల కూడా ఈ ఊహ బలపడుతున్నది. ఏదేమైనా ఈ వ్యాసం ఉద్దేశ్యం వారి జననకాల సంస్కరణ కాదు గాబట్టి లగ్నాన్ని అంతగా లెక్కించపనిలేదు.

చంద్రలగ్నం వృశ్చికం అయింది. ఈరాశి చంద్రునికి నీచరాశి అని మనకు తెలుసు. ఆత్మకారకుడు సూర్యుడయ్యాడు. కనుక ఈ రెంటినుంచి స్థూలంగా జాతకాన్ని పరిశీలిద్దాం. నాడీశాస్త్ర రీత్యా చూస్తే, ఆరవనెలలో తేలుకుట్టి వీరి తల్లి మరణించడమూ, తొమ్మిదవ ఏట తండ్రి  మరణించడమూ ఖచ్చితంగా సరిపోతున్నాయి. చాలామంది వృశ్చికరాశి జాతకులకు తల్లి చిన్నతనంలోనే మరణిస్తుంది. దీనివెనుక ఒక నిగూఢమైన కర్మరహస్యం దాగిఉన్నది. కుటుంబస్థానాధిపతి గురువు వక్రించి శత్రుస్థానంలో కేతుగ్రస్తుడై ఉండటమూ, సుఖస్థానాధిపతి నీచలో రాహుగ్రస్తుడవటమూ వల్ల  వివాహం లేకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నాడు. గురువు పంచమాదిపతి కూడా అవడం వల్ల, ఇదే యోగం సంతానం లేకుండా చేసింది. 

రామయోగి జాతకంలో గురువు వక్రించి ఉండటం చూడొచ్చు. అందువల్ల వారికి ప్రత్యేకంగా శిష్యులంటూ ఎవరూ లేరు. వారి విధానం వారితోనే అంతరించిందని ఊహించవచ్చు. వారివల్ల లోకానికి, ముఖ్యంగా కొండ కోనల్లో నివసించే కోయప్రజలకు ఎంతో మేలు చేకూరినప్పటికీ ఆధ్యాత్మికంగా వారి సాధనా విధానం పరంపరగా ఇతరులకు సంక్రమించడం జరగలేదనిపిస్తుంది. దీనికి కారణం వారి జాతకంలోని గురువక్రత. 

శని నీచలో ఉండటం వీరి జాతకంలో ఇంకొక విశేషం. అందువల్ల వీరికి ఈలోకంలో కర్మానుబంధం బలంగా ఉందని సూచిస్తోంది. అందుకే జీవితమంతా అడవులలో గడిపి కొండ కోయజాతులకు మార్గదర్శకుడయ్యాడు. శేషకర్మను సూచించే రాహువు శనితో కలసి ఉండటం దీనినే సూచిస్తున్నది. వీరిద్దరూ మేషరాశిలో కలవడం వల్ల ఇంకొక కర్మ రహస్యం ప్రకటితం అయింది. మేషం కొండ కోనల్లో తిరుగుతుంది. ఎక్కడో కొండల పైకెక్కి మేత మేస్తుంది. అలాగే ఈయన కూడా ఎక్కువగా కొండకోనల్లోనే సంచరించాడు. ఈయన కర్మస్థానం కూడా కొండకోనలే అయ్యాయి.

వక్ర గురువు, కేతువుతో కలవడం వల్ల వీరిది నిగూఢమైన ఆధ్యాత్మిక సిద్ధి అని సూచన ఉన్నది. అంటే ఆ సిద్ది యొక్క ఫలితాలు మాత్రమె జనులకు దర్శనమిస్తాయిగాని ఆ సిద్ధి ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. వారి జీవితం అలాగే గడిచింది. పదమూడేళ్ళ వయసులో జ్ఞానాన్వేషణలో  ఇల్లువదలి వెళ్ళిన ఆ పిల్లవాడు ఏ గురువుల వద్ద ఏఏ విద్యలు అభ్యసించాడో, ఏఏ సాధనలు చేశాడో ఎవరికీ తెలియదు.కొన్నేళ్ళ తర్వాత ఒక సిద్ధపురుషునిగా సమాజానికి దర్శనం ఇచ్చినపుడే వారిగురించి అందరికీ తెలిసింది. దేశంలో వారు తిరగని అడవీ, ఎక్కని పర్వతమూ, దర్శించని సిద్ధపురుషులూ లేరు అంటే అతిశయోక్తి కాదు. కాని, వారి సిద్ధి వారితోనే అంతరించింది.

చంద్రుని నుంచి మంత్రస్థానంలో కుజుడు ఉండటంవల్లా, ఆయన తన అష్టమదృష్టితో గురుకేతువులను వీక్షిస్తూ ఉండటం వల్లా రామయోగి యొక్క సాధన మనకు దర్శనం ఇస్తున్నది. ఈయనకు ప్రబలమైన నిగూఢమైన మంత్రసిద్ధి ఉన్నది అన్నవిషయం దీనివల్ల తెలుస్తున్నది. అంతేగాక నీచచంద్రునివల్లా, పంచమకుజునివల్లా, నవమశుక్రునివల్లా  ఇది తీక్ష్ణమైన స్త్రీ దేవతా మంత్రసిద్ధి అన్నవిషయం తెలుస్తున్నది.

జలతత్వరాశులు సమృద్ధికి సూచన.చంద్రకుజశుక్రులు ఒకరికొకరు కోణస్తితిలో జలతత్వరాశులలో స్తితులై ఉండటం వల్ల ఈయనకు అక్షయసిద్ధి ఉన్నది అన్న విషయం సూచితం. ఈయన సంకల్పిస్తే నలుగురికి వండిన వంట నాలుగొందలమందికి సరిపోయి ఇంకా మిగిలేది. ఇదొక అద్భుతమైన సిద్ధి. గాయత్రీ దివ్యశక్తిలో గల సమృద్ధిబీజాక్షరాలు ఈయనకు సిద్ధించాయి. కారకాంశ నుంచి ద్వాదశాదిపతి రవి అవడము ఆయనకు గల గాయత్రీ సిద్ధిని సూచిస్తున్నది. సింహరాశి మీదగల రాహుశనుల దృష్టివల్ల అందులోని ప్రచండమైన బీజాక్షరాలు కొన్ని ఆయనకు సిద్ధించినట్లు సూచనప్రాయంగా తెలుస్తోంది. అవేమిటో కూడా మనం ఇంకొంత విశ్లేషణతో గ్రహించవచ్చు. కాని దానిని బహిర్గతం చెయ్యటం సబబు కాదు.ఈ సిద్ధివల్లనే  ఎక్కడెక్కడినుంచో తెలియకుండా అనుకున్న సమయానికి ఆయనకు అన్నీ సమకూడేవి.  

ఆత్మకారకుడైన సూర్యునినుంచి చూచినపుడు, పంచమాధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉండటమూ, నవమాదిపతీ యోగకారకుడూ అయిన శని నీచలో రాహువుతో కలసి ద్వాదశస్తితుడై ఉండటమూ ఇదే భావాన్ని బలపరుస్తున్నాయి. కనుక ఈయనకు కొండమంత్రాలూ కోయమంత్రాలూ మొదలైన రహస్యక్షుద్రమంత్రాలు కూడా తెలుసన్న విషయం ద్రువపడుతున్నది. అంతేగాక ఈ క్షుద్రమంత్రాలు తెలిసిన కోయవారిని ఆయన ఎదుర్కొనవలసి వస్తుంది అనికూడా సూచన ఉన్నది. చంద్రలగ్నాత్ షష్ఠమంలో శనిరాహువుల స్తితికూడా ఇదే సూచిస్తున్నది.

ఇవన్నీ ఆయన జీవితంలో జరిగాయి.'మర్లపులి' అన్న క్షుద్రవిద్యను రామయోగి తన జీవితంలో ఎదుర్కొని,దానిని ప్రయోగించిన కోయమంత్రగాళ్లను తన శక్తితో నిర్వీర్యులను చేశాడు. 'మర్లపులి' అనేది పగలు మనిషిలా అడివిలో తిరుగుతూ రాత్రిళ్ళు పులిగా మారి మనుషులను చంపుతూ ఉండే క్షుద్రశక్తి. కోయలలోని కొందరు మహామంత్రగాళ్ళు దీనిని ప్రయోగించడంలో సిద్ధహస్తులు. పంచమంలో కుజుడు శని నక్షత్రంలో ఉండటం,ఆ శని నీచలో రాహువుతో కలసి శత్రుస్థానంలో ఉండటం వల్ల ఇటువంటి క్షుద్రశక్తులతో ఆయన డీల్ చెయ్యవలసి వస్తుంది అని సూచన ఉన్నది.

నవాంశచక్రంలో శని ఉచ్ఛస్త్తితికి వచ్చి ఉన్నాడు. గురువు నీచస్తితిలోకి పోయాడు. జాతకంలో గురువు నీచస్తితిలో ఉన్న గురువులవల్ల లోకానికి ఉపదేశపరంగా ఏమీ మేలు జరగదు. వారివల్ల భౌతికమైన ఇతర ప్రయోజనాలు కలుగుతాయిగాని సాధనాపరంగా వారినుంచి శిష్యులకు ఏమీ దొరకదు. సత్యసాయి జాతకంలో కూడా గురువు నీచస్తితిలో ఉన్న విషయం గమనార్హం. అందుకే ఆయనవల్ల కూడా లోకానికి మేలు జరిగిందిగాని ఆయన సాధనా విధానం ఏమిటి అన్న విషయం గుప్తంగా ఉండిపోయింది. అది పరంపరగా ఉపదేశపూర్వకంగా తర్వాతి తరాలకు అందదు. రామయోగి జాతకంలో కూడా అదే జరిగింది.

రామయోగి వల్ల అనేక వందల కోయగూడేలకు ఎంతో మేలు జరిగింది. ఉత్త మాటలు చెప్పే నేటి నాయకులకంటే ఆయన తన మౌనమైన జీవితంద్వారా, నిస్వార్ధమైన సేవద్వారా ఎన్నో వందల కోయ, చెంచు, గూడేలకు మనం ఊహించలేనంత మేలు చేశాడు. కాని ఆయన సాధన తర్వాతితరాలకు అందలేదు. దానికి కారణం,అర్హతగల తగిన శిష్యులు ఆయనకు లభించకపోవడమే అని నా ఊహ. లోకుల బుద్ధిహీనత వల్ల చాలామంది గురువులకు ఇదే గతి పడుతూ ఉంటుంది. అందుకే ఈ నాగరికలోకంతో విసిగి ఆయన జీవితమంతా పట్నాలవాసన సోకని అడవుల్లో కోయవారితోనే ఉండిపోయాడు.చివరకి అక్కడే మరణించాడు.

పాతకాలంలోని రుష్యాశ్రమాలు అందుకే కొండకోనల్లో ఉండేవి, సిటీల మధ్యలో ఉండేవి కావు. మనుషుల మధ్యన ఉండే పెంపుడుజంతువులకు మనుషులకొచ్చే రోగాలు వచ్చేటట్లే, సమాజం మధ్యలో ఉండే ఆశ్రమవాసులకు కాలక్రమేణా వారికి తెలీకుండానే నిమ్నస్థాయి పోకడలు కలుగుతాయి.అందుకనే అడవుల్లో ఉండే సాధువులకూ సిటీలలో ఉండే సాధువులకూ చాలా తేడా ఉంటుంది. ప్రతి సాధువూ హిమాలయాలకు పోవాలని ఆశించేది కూడా మానవసమూహంలోని స్వార్ధపరత్వాన్ని భరించలేకే. అడవిప్రజలు అమాయకులు. మనంత స్వార్ధం వారికుండదు. అందుకే, కల్లాకపటం ఎరుగని ఆ అడవుల్లోని కోయవారిది 'రుషికులం' అని ఆయనన్నాడు.

'అర్హత గలవారు లభిస్తే మేము మరణం తర్వాతగూడా ఉపదేశించగలం' అన్న ఆయన మాటలు అక్షరసత్యాలు. అవెప్పుడూ నా చెవుల్లో గింగురుమంటూ ఉంటాయి. మానవుల అజ్ఞానాన్ని చూచి అటువంటివారు పడే వేదన దుర్భరంగా ఉంటుంది.కాని వారాశించే స్థాయి శిష్యులు వారికి దొరకరు.'నాదగ్గరకోచ్చిన ఇన్నివేలమందిలో ఒక్కడుగూడా శిష్యుడన్నవాడు నాకు కనిపించలేదు'అని షిర్డీసాయిబాబా కూడా అంటారు.అందుకే చాలామంది సద్గురువులు నిరాశతో మరణిస్తారు.ఇది తప్పదు. ఆధ్యాత్మిక లోకంలో అందుకే ఇద్దరే అదృష్టవంతులు ఉంటారు.సద్గురువు దొరికిన శిష్యుడూ,సచ్చిష్యుడు దొరికిన గురువూ వీరిద్దరే అదృష్టవంతులు.అదలా ఉంచి, రామయోగికున్న అద్భుతమంత్రశక్తుల కోణంలో  ఆయన జనన సమయాన్ని కొంచం పరిశీలిద్దాం.

మధ్యాన్నం ఒంటిగంటన్నర లోపుగనక ఆయన జననం జరిగి ఉంటే, కారకాంశ సింహం అవుతుంది. ఆ తర్వాత అయితే కన్య అవుతుంది. ఇటువంటి జాతకాల్లో జైమినిసూత్రాల సహాయం తీసుకోవాలి. ఒక జాతకంలో ఉండే మంత్రసిద్ధియోగాలను గురించి వివరిస్తూ జైమినిమహర్షి 'శుభేzనుగ్రాహక:' అంటారు. కారకాంశనుంచి పంచమనవమాల మీద శుభగ్రహదృష్టి గనుక ఉంటే ఆ జాతకుడు మంత్రవేత్త అవడమే గాక, తన శక్తులతో లోకానికి ఉపకారం చేస్తాడు. రామయోగి అదే చేశాడు.తన జీవితంలో ఎన్ని వేలమందికి ఆయన నిస్వార్ధంగా ఉపకారం చేశారో లెక్కే లేదు. సింహ కారకాంశ అయితే ఇది జరుగదు. కనుక కన్యా కారకాంశ మాత్రమే సరైనది. అపుడు మాత్రమే, మకరం మీద శుక్రదృష్టీ, వృషభంలోని రవిబుధులమీద పూర్ణచంద్రదృష్టీ ఉంటుంది. కనుక ఆయన కారకాంశ కన్య అనేది నిశ్చితం. అంటే ఆయన పుట్టినది మధ్యాన్నం 1.30 తర్వాత అయి ఉండాలి. అందులో కూడా 2.30 నుంచి 4.30 లోపు అయి ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలోనే తులా లగ్నం నడిచింది. ఈ విధంగా ఇంకా సూక్ష్మ గణనం చేసి ఆయన జనన సమయాన్ని రాబట్టవచ్చు. కాని ప్రస్తుతం అంతటి సూక్ష్మ పరిశీలన అవసరం లేదు. 

'సమే శుభ దృగ్యోగాద్ధర్మ నిత్యసత్యవాదీ గురుభక్తశ్చ' అన్న సూత్రం కూడా కన్యా కారకాంశకే సరిగ్గా సరిపోవడం చూడవచ్చు. పైగా కారకాంశ సింహం అయితే శునకములవల్ల భయం ఉంటుంది.రామయోగి అడవిలోని పులులూ సింహాలతో ఆటలాడుకున్న అమిత ధైర్యవంతుడు.ఆయన చెయ్యెత్తి ఆగమంటే పులి ఆగిపోయేది. ఎవరైనా గూడెం ప్రజలోచ్చి 'అయ్యా! పులొచ్చి మా పశువుల్ని ఎత్తుకుపోతున్నదయ్యా' అని మొరపెట్టుకుంటే ఆ దిక్కుకు చూచి 'ఇకరాదులే పో' అనేవాడు. ఆ గ్రామం చాయలకు మళ్లీ పులి వచ్చేది కాదు.అటువంటి శక్తి సంపన్నుడ్ని శునకములేమి చేయగలవు? కనుక ఆయనది సింహ కారకాంశ కాదు,కన్యాంశ మాత్రమే  అని తెలుస్తున్నది.

పై గణితాన్ని బట్టి ఆయన లగ్నం తులాలగ్నమని తేలింది.కనుక మొదట్లో ఆయన ముఖవర్చస్సును బట్టి మనం ఊహించిన తులాలగ్నం సరియైనదే. అప్పుడు ఆరూఢలగ్నం మకరం అవుతుంది. అక్కణ్ణించి పంచమంలో రవిబుధులు వారిపైన పూర్ణచంద్రుని దృష్టి ఉండటం చూడవచ్చు. దీనినిబట్టి   ఈయన మంత్రసిద్ధి కల్గిన మహానుభావుడని, ఆ శక్తితో లోకానికి నిస్వార్ధమైన మేలు చేసిన యోగియని తెలుస్తున్నది. ఇటువంటి మహానుభావులు ఈనాటికీ మన దేశంలో పుడుతూ ఉండటంవల్లే ఈదేశం పుణ్యభూమి అనిపించుకోగలుగుతున్నదన్నమాట వాస్తవం.


ఇకపోతే, ఆయన 6-3-1970 శివరాత్రి రోజున మహాసమాధి చెందారు. ఆ సమయానికి గురువూ శనీ జననకాల స్థానాలలోకి వచ్చి ఉన్నారు. ఎందుకంటే అప్పటికి  ఆయనకు 60 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఎవరికైనా షష్టిపూర్తికి ఈ గ్రహస్తితి వస్తుంది. అది వింత కాదు. కానీ ఆ సమయానికి గోచార గురువు 12 డిగ్రీల పైకి వచ్చి, జననకాల గురువు పైన సంచరించాడు. జననకాల గురువు కూడా 12 డిగ్రీలమీదే ఉన్నాడన్న విషయం గుర్తిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, మరణ కాలానికి మళ్లీ గురువు వక్రించి ఉన్నాడు. ఖచ్చితంగా జననకాల స్తితిలోకి వచ్చి ఉన్నాడు. ఇదొక నిగూఢ కర్మరహస్యం. ఆయన పొందిన సిద్ధికి ఇదొక సంకేతం.దాని వివరం ఏమిటో నేను బ్లాగుముఖంగా  వివరించదలచుకోలేదు.అది మనకు అప్రస్తుతం కూడా.

అతీతసిద్దులున్న మహర్షులూ, జ్ఞానసంపన్నులైన మహానుభావులూ పురాణాల కట్టుకథలని, కల్పితాలని మనం అనుకుంటాం. అలాంటి వారు అసలు పుడతారా?అనుకుంటాం.వారు పుట్టినది నిజమే.మన మధ్యన తిరిగినదీ నిజమే. వారు వస్తారు వెడతారు. మనం మాత్రం ఇలాగే ఉంటాం. అలాంటివారు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మన దేశంలో ఉంటూనే ఉంటారు. ఇదే మన దేశపు నిజమైన అదృష్టం.
read more " పాకలపాటి గురువుగారి జాతకం - కొన్ని విశేషాలు "

9, సెప్టెంబర్ 2012, ఆదివారం

కాలజ్ఞానం -12

శుద్ధ ఏకాదశి వరకూ 
తప్పవు యమబాధలు 
జరుగుతాయి ఎన్నో 
అంతిమ యాత్రలు 

కర్మ ఒక స్థాయి దాటితే 
అక్కరకు రాదు ధనం
మారకపోతే జనం 
తప్పదు నిత్యప్రళయం 

కృష్ణ చవితి తప్పక 
సృష్టిస్తుందొక వెలితి 
కళాకారులు సాహితీవేత్తలు 
కడతారిక ప్రయాణాలు 

భీభత్సం ప్రత్యక్షం 
భయోత్పాతం సహజం 
అధర్మం మితిమీరితే 
ఎక్కడికక్కడే పుడుతుంది 
వినాశనకారి ముసలం
read more " కాలజ్ఞానం -12 "

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

31-8-2012 పౌర్ణమి ప్రభావం

అమావాస్యా పౌర్ణమీ మనుష్యులను అమితంగా ప్రభావితం చేసేమాట అక్షరాలా నిజం. కారణమేమంటే, మానవ లోకాన్ని శాసించే రెండు ముఖ్య గ్రహాలు సూర్యుడు చంద్రుల మధ్యన ఒక ప్రత్యెక అమరిక ఆ సమయంలో ఏర్పడుతుంది. అమావాస్య నాడు వారిద్దరి కంజంక్షన్ (కలయిక), పౌర్ణమి నాడు వారిద్దరి ఆపోజిషన్(సమసప్తకం) జరుగుతాయి.కనుక ఆ రెండురోజులూ చాలా విధాలుగా మనుష్యులు ప్రభావితం అవుతారు. గమనిస్తే ఇది అక్షర సత్యం అని తేలుతుంది.

ముఖ్యంగా వీటి ప్రభావం మూడో రోజున చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటికి ముందు మూడు రోజులూ తర్వాత మూడు రోజులూ, ఆరోజుతో కలిపి మొత్తం అయిదు రోజులు గమనిస్తే భలే విచిత్రాలు కనిపిస్తాయి. అంతా తన చేతిలోనే ఉందని విర్రవీగే మనిషి, నిజానికి కనిపించని శక్తుల చేతిలో ఒక కీలుబొమ్మ అని, ప్రకృతి ఎలా ఆడిస్తే అలా ఆడే ఒక తోలుబొమ్మ అనీ అర్ధమౌతుంది.

మొన్న 31-8-2012 శుక్రవారం రోజున పౌర్ణమి. దానికి ఒకరోజు ముందు గుజరాత్ లో రెండు IAF హేలీకాప్టర్లు గాలిలో గుద్దుకొని 9 మంది హరీమన్నారు. మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ ను రోడ్డుమీదే ఎవరూ పాటించరు. ఇక గాలిలో మాత్రం ఎందుకు పాటించాలి అనుకున్నారో ఏమో? రూల్స్ పాటించకపోవడం అనేది భారతీయ మనస్తత్వంలో ఒక భాగంగా మారినట్లుంది.

అదలా ఉంటే, వాయుయానప్రమాదాలలో వాయుతత్వరాశులు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. అలాగే వాయుతత్వగ్రహం అయిన శని తన ప్రభావాన్ని అమితంగా చూపిస్తుంది. యంత్రాలకు కారకుడైన కుజుడు తన పాత్రను పోషిస్తాడు. పౌర్ణమి కనుక చంద్రసూర్యుల ప్రభావం ఎలాగూ ఉంటుంది. ప్రస్తుత ప్రమాదానికి వెనుక ఉన్న గ్రహస్తితులను గమనిద్దాం.

మిధునం,తులా,కుంభం ఈ మూడూ వాయుతత్వరాశులు. ప్రస్తుతం శుక్రుడు మిధునంలో ఉంటూ విలాస వాయువాహనాలను సూచిస్తున్నాడు. అంటే విమానాలు అని సూచన. హెలికాప్టర్ కూడా విలాస వాయువాహనమే. 

శని ఉచ్చస్తితిలో బలంగా ఉండి, ఇంకొక వాయుతత్వరాశి అయిన తులలో ఉన్నాడు. అదీగాక తన బద్ధశత్రువైన కుజునితో కలిసి ఉన్నాడు. కనుక వాయుయాన ప్రమాదాలు సూచితం.

చంద్రుడు ఈరోజున మరో వాయుతత్వరాశి అయిన కుంభంలో ప్రవేశించి అక్కడే ఉన్న నెప్ట్యూన్ తో ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ లోకి వచ్చాడు. అంతేగాక తులలో ఉన్న శనితో కోణద్రుష్టిలోకి వచ్చాడు. అగ్నితత్వగ్రహమైన సూర్యుడు అగ్నితత్వరాశి అయిన సింహంలో ఉంటూ ఈ చంద్రునికి నెప్ట్యూన్ కు ఎదురుగా ఉన్నాడు.

అందుకే వాయువులో ప్రయాణం చేసే వాహనాలు (హెలికాప్టర్లు) గుద్దుకొని నేలకూలి మంటలు రేగి వాటిలో ఉన్న అందరూ సజీవ దహనం అయ్యారు. ఎయిర్ ఫోర్స్ వాహనాలకు కుజుని కారకత్వం పనిచేసింది. శనికుజుల కలయిక వల్ల ప్రేలుడు సంభవించింది.

శుక్రుడూ,శనికుజులూ,చంద్ర నెప్త్యూన్లూ ఒకరినొకరు కోణదృష్టిలో వీక్షిస్తున్నారు. దీనికి తోడు పౌర్ణమి ప్రభావం అగ్నికి ఆజ్యం పోసింది.   

ఈ గ్రహప్రభావం అనేకమంది వ్యక్తిగతజీవితాలలో కూడా పనిచేసింది.నిన్నరాత్రి దీనివల్లే నా ఆధ్యాత్మికమిత్రుడు ఒకాయన గుంటూరులో మరణించాడు. ఆయన మాస్టర్ సి.వీ.వీ. కల్ట్ కు చెందినవాడు. మాస్టర్ ఈ.కే. గారి శిష్యుడు. ఆయన ఆత్మ శాంతించుగాక అని ప్రార్ధిస్తున్నాను.

నిత్యజీవితంలో జరిగే అనేక సంఘటనలకు ఈ విధంగా గ్రహప్రభావం కారణంగా పనిచేస్తుంది.
read more " 31-8-2012 పౌర్ణమి ప్రభావం "