అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

27, సెప్టెంబర్ 2018, గురువారం

మార్జాలోపాఖ్యానం - 'నా పిల్లి ఎక్కడుంది?' - ప్రశ్నశాస్త్రం

నిన్న మధ్యాన్నం క్యాంప్ కు వెళుతున్నాను. ట్రెయిన్ నడికూడి దగ్గర ఉండగా ఒక ఫోనొచ్చింది.

'నా పేరు ఫలానా. మా స్నేహితుడూ నేనూ మీ బ్లాగ్ రెగ్యులర్ గా చదువుతూ ఉంటాం. మా స్నేహితుడికి ఒక సమస్య వచ్చింది. మీతో మాట్లాడాలంటే భయపడుతున్నాడు. అందుకని నేను ధైర్యం చెప్పి మీకు ఫోన్ చేయిస్తున్నాను. ఇదుగోండి మా ఫ్రెండ్ మాట్లాడతాడు.' అంటూ ఒకాయన ఫోన్లో చెప్పాడు.

అతని ఫ్రెండ్ ఫోనందుకుని - 'నాకొక పెంపుడు పిల్లి ఉండేది. పద్దెనిమిది నెలల క్రితం అది ఎటో వెళ్లిపోయింది. అది ఇప్పుడు ఎక్కడుందో చెప్పగలరా? అదసలు బ్రతికుందా లేదా?' అని ప్రశ్నించాడు.

నాకు ఆశ్చర్యమూ, జాలీ రెండూ ఒకేసారి కలిగాయి.

'చెబితే ఏం చేస్తావు నాయనా?' అడిగాను.

'వెళ్లి దానిని తెచ్చుకుంటాను. అదంటే నాకు చాలా ప్రేమ' అన్నాడు.

'ఏం నీకెవరూ లేరా?' అడిగాను.

'అందరూ ఉన్నారు. అమ్మా నాన్నా అందరూ ఉన్నారు. కానీ నాదగ్గర ఎవరూ లేని సమయంలో అదే నాతో ఉండేది. అందుకే అదంటే నాకు చాలా ఇష్టం' అన్నాడు.

సమయం చూచాను. మధ్యాన్నం 12.12 గంటలయింది. శుక్రహోర నడుస్తోంది. ప్రస్తుతం మనం మహాలయ పక్షాలలో ఉన్నాం. అంటే, ఇవి పితృదేవతల రోజులు. ప్రాచీన సాంప్రదాయాలలో పిల్లి అనేది పితృదేవతలకు చిహ్నంగా భావించబడుతూ ఉండేది. ఈజిప్షియన్లు నేటికీ ఈ భావనను కొనసాగిస్తూ ఉంటారు. కనుక మహాలయ పక్షాలలో ఇలాంటి ప్రశ్న రావడం కరెక్టే.

గ్రహ పరిస్థితిని మనస్సులోనే గమనించాను. ధనుర్లగ్నం అయింది. శుక్రుడు షష్టాధిపతి అయ్యాడు. జ్యోతిష్య శాస్త్రంలో షష్ఠభావం పెంపుడు జంతువులను సూచిస్తుంది. సామాన్యంగా అయితే షష్ఠభావం శత్రు, రోగ, రుణాలను సూచిస్తుంది. కానీ ఇదే భావం పెంపుడు జంతువులను కూడా సూచిస్తుంది. అదెలాగో చెప్తా వినండి.

చతుర్ధం మన ఇంటికి సూచిక. అక్కడ నుండి తృతీయం మన సహచరులు, మన ఇంట్లో ఉండే జీవులను సూచిస్తుంది. కనుక చతుర్ధం నుంచి తృతీయం అయిన షష్ఠమస్థానం మేక, కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులను సూచిస్తుంది. ఇంకా పెద్ద సైజు జంతువులైతే ద్వాదశభావం వాటిని సూచిస్తుంది. ద్వాదశం జైలు గనుక, పెద్ద జంతువులను మన ఇంట్లో కట్టేసి ఉంచితే అది వాటికి జైలులాగే ఉంటుంది గనుక, ద్వాదశభావం పెద్దపెద్ద పెంపుడు జంతువులను సూచిస్తుంది. ఈ విధంగా జ్యోతిశ్శాస్త్రం అంతా లాజిక్ మీదే నడుస్తూ ఉంటుంది.

సరే మన ప్రశ్న చార్ట్ కి వద్దాం.

హోరాధిపతి అయిన శుక్రుడే షష్ఠభావాదిపతీ అయ్యాడు. కనుక పెంపుడు జంతువుల ప్రశ్న ఆ సమయంలో అడుగబడింది. శుక్రుడూ లగ్నాధిపతి అయిన గురువూ కలసి లాభస్థానంలో ఉన్నారు. అంటే, ఇతనికి ఆ పిల్లి అంటే చాలా ప్రేమ ఉన్నమాట నిజమే ! కానీ ధనుర్లగ్నానికి శుక్రుడు మంచిని చెయ్యడు. శత్రువైన శుక్రక్షేత్రంలో గురువున్నాడు. కనుక పిల్లి దృష్టిలో ఇతని ప్రేమకు విలువ లేదు. పిల్లికి అవసరమేగాని ప్రేమ ఉండదు.

కుక్కకు విశ్వాసం ఉంటుంది గాని, పిల్లికి ఉండదు. వీడు నా యజమాని అని కుక్క అనుకుంటుంది. వీడు నా బానిస అని పిల్లి అనుకుంటుంది. పిల్లి చాలా స్వతంత్రమైన జంతువు. దానికి ఒకచోట స్థిరంగా ఉండటం ఇష్టం ఉండదు. అందుకని మనం ఎంత బాగా చూసుకున్నప్పటికీ, దానిష్టం వచ్చిన చోటకు అది వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రేమకు కుక్క కట్టుబడినట్లు పిల్లి కట్టుబడదు. ఎందుకంటే అది పులి జాతికి చెందినది. పులీ పిల్లీ ఒకే జాతికి చెందుతాయి. కాకుంటే సైజులో తేడా అంతే ! అందుకే పులిని 'బిగ్ క్యాట్' అంటారు.

ఒకచోట స్థిరంగా ఉండలేకుండా ఎంతసేపూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండాలని అనుకునేవారు కొందరు ఉంటారు. వాళ్ళు పిల్లిజాతి మనుషులు. అదొక రోగలక్షణం. వీరికి చాలా క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. కొందరిలో ఈ లక్షణం తర్వాత్తర్వాత కేన్సర్ గా కూడా రూపొందుతూ ఉంటుంది. ఎందుకంటే మానసికంగా స్థిరత్వం లేకుండా ఎప్పుడూ ఏదో ఒకదాని వెంట పరుగెత్తుతూ, ఎక్కడో బైటబైట తిరుగుతూ ఉండాలని ఎప్పుడూ అనుకునేవారికి పెద్ద వయసులో కేన్సర్ వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉంటుంది. ఈ మనస్తత్వం పోవాలంటే పిల్లిపాలతో తయారు చేసిన 'లాక్ ఫెలినినం' అనే హోమియౌ ఔషధం బ్రహ్మాండంగా పని చేస్తుంది. ముల్లును ముల్లుతోనే తియ్యాలి అనే సూత్రం మీదే హోమియో ఔషధాలు పని చేస్తాయి.

పాతకాలంలో ఆయుర్వేదంలో ఇలాంటి మందులు తయారీ ఉండేది. కేరళలో ఆయుర్వేదం ఎక్కువగా వాడతారని మనకు తెలుసు. అదే కేరళకు చెందిన అయ్యప్పస్వామి కధలో కూడా, రాణికి ఏదో తలనొప్పి అని వంకపెట్టి పులిపాలు తెమ్మని ఈయన్ను అడవిలోకి పంపిస్తారు. ఆ కధ నిజం అయినా కాకపోయినా, అలాంటి మందులు అప్పట్లో తయారు చేసేవారని మనకు తెలుస్తోంది. ఇప్పుడు ఆయుర్వేద వైద్యులకే ఆ శాస్త్రం పూర్తిగా తెలీదు. తెలిసినా కంపెనీ తయారు చేసిన మందులే అందరూ వాడిస్తున్నారు గాని, పాతకాలంలో లాగా వాళ్ళే మూలికలు తెచ్చి తయారు చెయ్యడం లేదు. అందుకే ఇప్పటి ఆయుర్వేదం పని చెయ్యడం లేదు. 

ఈ విధంగా జ్యోతిష్యశాస్త్రానికీ, హోమియోపతి వైద్యశాస్త్రానికీ, మానవ జీవితానికీ, ఆధ్యాత్మికతకూ సూక్ష్మమైన సంబంధాలు ఉంటాయి. అర్థం చేసుకోగలిగితే ఇదంతా చాలా అద్భుతమైన సైన్స్ గా కనిపిస్తుంది.

జ్యోతిశ్శాస్త్రంలో కుక్కకూ పిల్లికీ చాలా ప్రాముఖ్యత ఉంది. రాహువు పిల్లికి సూచకుడు. కేతువు కుక్కకు సూచకుడు. అందుకే కేతుదోషం ఉన్నప్పుడు కుక్కను పెంచుకోమని చెబుతూ ఉంటారు. కుక్కను పెంచుకున్నాక కలసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాహుదోషం ఉన్నప్పుడు అది పోవడానికి శనివారం నాడు నల్లపిల్లికి పాలు పొయ్యమని రెమెడీ చెబుతారు. ఎందుకంటే నల్లపిల్లి శనికీ రాహువుకూ రెంటికీ సూచిక. 'శనివత్ రాహు:' అని కదా జ్యోతిష్య సూత్రం ! రాహుకేతువుల ప్రభావం మనిషి మీద ఖచ్చితంగా ఉందనడానికి అతనితో నిత్యం కలసి ఉంటున్న కుక్కా పిల్లులే సాక్ష్యం. ఏ దేశంలోనైనా మనుషులు ఈ రెంటినీ సాకుతూ ఉండటం మనం గమనించవచ్చు.

ఎవరి సమక్షంలోనైతే కుక్కా పిల్లీ తమతమ జాతివైరాన్ని వదలిపెట్టి స్నేహంగా ఉంటాయో అలాంటి వారిమీద రాహుకేతువుల ప్రభావం ఉండదు. రాహుకేతువులు కాలస్వరూపులు గనుక అలాంటి మహనీయులు కాలానికి అతీతంగా పరిణతి చెంది ఉంటారు. జిల్లెళ్ళమూడి అమ్మగారి సమక్షంలో కుక్కలూ పిల్లులూ కలసి మెలసి ఉండేవి. రమణ మహర్షి సమక్షంలో కూడా శత్రు జంతువులు కలసి మెలసి ఉండేవి. శ్రీ రామకృష్ణుల సమక్షంలో అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. నిజమైన మహనీయుల సమక్షం అలా ఉంటుంది.

'అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధే వైరత్యాగ:' అంటాడు పతంజలి మహర్షి తన యోగసూత్రాలలో. అంటే - అహింస అనే భావంలో నిజంగా నిత్యమూ ఉండేవారి సమక్షంలో శత్రుజంతువులు కూడా మిత్రులౌతాయి. అదే వారి మహనీయతకు నిదర్శనం !- అంటాడు. అలాంటి మహనీయుల సమక్షంలో దివ్యభావనా తరంగాలు చాలా బలంగా ఉంటాయి. అందుకే, వారి దగ్గర ఉన్న కాసేపూ మన మనస్సులు మనకు తెలీకుండానే మారిపోతూ ఉంటాయి. వారి సమక్షం ఎంతో హాయిగా ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉండటానికి ఇదే కారణం.

సరే, ఈ జ్యోతిష్య-వేదాంతచర్చ ఆపేసి మన ప్రశ్నలోకి వద్దాం !

శుక్రుడు రాహువుదైన స్వాతీ నక్షత్రంలో ఉన్నాడు. అంటే, ఈ పిల్లి చాలా స్వతంత్రమైన వ్యక్తిత్వం కలిగినది. అందుకే ఇంట్లోనుంచి వెళ్ళిపోయింది. అయితే, ఇది ఎక్కడికి పోయింది? ఏమైంది?

తులారాశికి రాహుకేతువులతో అర్గలం పట్టింది. కనుక పిల్లికి టైం ఏమీ బాగాలేదు ! పైగా దాని చతుర్దంలో బలంగా ఉన్న ఉచ్ఛ కుజుడు, కేతువుతో కలసి ఉన్నాడు. కేతువు శనిని సూచిస్తునాడు. శనికుజుల కలయిక యాక్సిడెంట్ ను ఇస్తుంది. కేతువు కుక్కకు సూచకుడు. అంటే ఎరుపూ నలుపూ మచ్చలున్న ఒక బలమైన కుక్క చేతిలో ఈ పిల్లి చనిపోయింది అని అర్ధం ! పైగా, పిల్లిని సూచించే రాహువు ప్రశ్నలగ్నం నుంచి అష్టమంలో ఉంటూ మరణాన్ని సూచిస్తున్నాడు !

దశ వైపు దృష్టి సారించాను. బుధ-చంద్ర-కుజ దశ నడుస్తోంది. ఈ లగ్నానికి బుధుడు బాధకుడు. చంద్రుడు నాశనాన్ని సూచిస్తాడు. కుజుడు కేతువుతో కలసి బలమైన కుక్కను సూచిస్తున్నాడు. కనుక దశాసూచన కూడా మన డిడక్షన్ తో సరిపోయింది ! అదీగాక, పౌర్ణమి సమయంలో అడుగబడే ప్రశ్నలు చాలావరకూ నెగటివ్ రిజల్ట్ నే ఇస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం పౌర్ణమి ఛాయలోనే ఉన్నాం మరి !

ఈ విషయాన్ని ఇతనికి చెబితే బాధపడతాడని, ఇలా అడిగాను.

'పిల్లి ఎన్నాళ్ళు బ్రతుకుతుంది బాబు? ఎందుకు దానిమీద నీకింత వ్యామోహం?'

'ఏమోనండి. దాదాపు ఎనిమిది తొమ్మిదేళ్ళు బ్రతుకుతుందేమో తెలియదు. కానీ నాకదంటే చాలా ఇష్టం.' చెప్పాడతను సందేహిస్తూ.

లగ్నాధిపతికీ, షష్టాధిపతికీ సంబంధం ఉంటే వాళ్ళు పెట్ లవర్స్ అవుతారు. ఏదో ఒక జంతువును పెంచుకుంటారు. ఇది తిరుగులేని జ్యోతిష్యసూత్రం. అది జంతువా, పక్షా లేక ఇంకోటా అనే విషయం కూడా చక్రంనుంచి చెప్పవచ్చు. అమెరికాలో అయితే పాములనీ, మొసళ్ళనీ ఇంకా నానారకాల జీవుల్నీ పెంచుకునే విచిత్రమైన మనుషులు కూడా ఉంటారు. ప్రశ్నచార్ట్ లో లగ్నాదిపతీ ఆరవ అధిపతీ కలిసే ఉన్నారు.

అతన్ని ఇలా అడిగాను.

'మరి ఆ తర్వాతైనా అది చనిపోతుంది కదా ! దానిగురించి చింత వదిలేయ్. దానికి నీ మీద ప్రేమ లేదు. దానికిష్టమైన చోట అది హాయిగా ఉంది అనుకో. నీ మానాన నువ్వు హాయిగా జీవించు. అంతేగాని దానికోసం వెదుకకు'.

పాపం అతనికీ మాట నచ్చలేదు.

'సార్ సార్ ప్లీజ్. నాకోసం కాస్త ప్రశ్న చూచి చెప్పండి. ఎక్కడుందో చెబితే వెళ్లి తెచ్చుకుంటాను.' అడిగాడు.

'నీ పిచ్చిప్రేమా నువ్వూనూ? చనిపోయిన పిల్లిని ఎక్కడనుంచి తెచ్చుకుంటావ్ రా బాబూ' - అనుకుంటూ మళ్ళీ ఓపికగా అతనికి కౌన్సిల్ చేశాను.

అంతా విని అతను మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు.

ఇక నాకు విసుగొచ్చింది.

ఎలాగూ ఈ పోస్ట్ అతను చదువుతాడు. అప్పుడు నిజం గ్రహిస్తాడని తెలుసు. అందుకని - 'సరేలే చూస్తాలే బాబు. బాధపడకు.' - అని చెప్పి ఫోన్ కట్ చేసేశాను.

ఫోన్ పెట్టేశాక ఒక సామెత గుర్తొచ్చింది.

పనిలేని మంగలి, పిల్లి తల గొరిగాట్ట. మనమూ అలా తయారు అవుతున్నామా? అని నాకే అనుమానం వచ్చింది. మళ్ళీ నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. మనకు బోలెడంత పని ఉంది. ఎంత చేసినా, ఈ జన్మంతా చేస్తూనే ఉన్నాకూడా, తరగనంత పని ఉంది. ఆ పని చేసుకుంటూనే ఇలాంటి పిల్లిప్రశ్నలు కూడా ఇంత ఓపికగా చెబుతున్నందుకు నా ఓపికకు నాకే చాలా ముచ్చటేసింది.

'భేష్ రా సత్యా! వెరీ గుడ్' - అంటూ నా భుజాన్ని నేనే తట్టుకున్నాను.

సారాంశం ఏమంటే - ప్రేమ !

ప్రేమ అనేది అది మనిషి మీదైనా జంతువు మీదైనా దేనిమీదైనా ఉండొచ్చు. కానీ, మనిషి జీవితం ప్రేమతోనే పుట్టి, ప్రేమతోనే నడచి, ప్రేమతోనే అంతమౌతుందని వెనుకటికి ఎవడో వేదాంతి అన్నట్లు గుర్తు !

నిజమే కదూ !
read more " మార్జాలోపాఖ్యానం - 'నా పిల్లి ఎక్కడుంది?' - ప్రశ్నశాస్త్రం "

24, సెప్టెంబర్ 2018, సోమవారం

September - 2018 పౌర్ణమి ప్రభావం

ప్రస్తుతం మనం పౌర్ణమి ఛాయలో ఉన్నాం.

నిన్న విశాఖ మన్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను నక్సల్స్ కాల్చి చంపేశారు. ఇది వింత కాదు. నక్సల్స్ ఇంతకు ముందు ఇలాంటివెన్నో చేశారు. కానీ అసలైన వింత ఆ తర్వాత జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులు అభిమానులు ఎగబడి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చెయ్యడం, పోలీస్ వాహనాలను తగలబెట్టడం, పోలీస్ స్టేషన్ను ఎటాక్ చెయ్యడమే అసలైన వింత.

అసలు దేశాన్ని నాశనం చేస్తున్నదే రాజకీయ నాయకులు. పోలీసులు ఏం చెయ్యగలరు? వాళ్ళను కూడా తమ పావులుగా వాడుకుంటున్నారు నాయకులు ! మళ్ళీ ఏదైనా జరిగినప్పుడు పోలీసులనే దోషులుగా తిడుతున్నారు ! అందరూ దొంగలే ! కాకుంటే నోరున్నవాడు నోరులేనివాడిని దొంగ అంటాడు. భలేగా ఉంది ఈ డ్రామా అంతా !

ఈ మధ్యనే ఒక రాజకీయ నాయకుడు ఒక సోకాల్డ్ జ్ఞానప్రబోధకుడిని కోట్లు అడిగాడని, ఆయన ఇవ్వనని నిరాకరిస్తే, ఆ ఆశ్రమం మీద కక్ష గట్టి హింస పెడుతున్నాడని ఆ ప్రబోధకుడు రాయలసీమలో ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలో స్వామీజీ అనుచరులే తమను వెంటాడి పైపులతో రాళ్ళతో కొట్టారని చెబుతూ ఆ రాజకీయ నాయకుడు తమను రక్షించలేని పోలీసులను అసభ్యమైన భాషతో దూషిస్తూ హిజ్రాలతో పోల్చడం, దానికి స్పందిస్తూ పోలీసు సంఘంవారు, అలా మాట్లాడేవాళ్ళను నాలుక కోస్తామనడం, ఆ నాయకుడు స్పందిస్తూ 'ఎక్కడికి రమ్మంటావో చెప్పు వస్తా. నాలుక కొయ్యి చూస్తా' అని సవాల్ విసరడం - ఇవన్నీ ఏంటో? ఏమీ అర్ధం కావడం లేదు. అధికారంలో ఉన్న పార్టీ నాయకులూ పోలీసులూ ఈ విధంగా మీడియాలో సవాళ్లు విసురుకుంటూ తిట్టుకుంటూ ఉంటే ప్రజలకు వీళ్ళమీద ఎలా నమ్మకం కుదురుతుంది? వీళ్ళందరూ కల్సి దేశాన్ని ఎలా ఉద్దరిస్తారని నమ్మాలి?

ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఇలా చట్టాన్ని ఖూనీ చేస్తూ, న్యాయాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూ పోతే చివరకు ఎక్కడకు పోతాం మనం?? ఎవరికి వారే న్యాయాధిపతుల లాగా ప్రవర్తిస్తూ ఉంటే ఇక న్యాయవ్యవస్థ ఎందుకు? 

గుంటూరులో పోలీస్ స్టేషన్ను ఒక వర్గం వారు ఎటాక్ చేసి రాళ్ళు రువ్వి, వాహనాలకు నిప్పు పెడితే, ఓట్ల కోసం వారిని బుజ్జగిస్తూ, ఏ యాక్షన్ తీసుకోకపోవడం, మళ్ళీ అమరావతిలో పది ఎకరాలలో ప్రపంచంలోనే ఇప్పటిదాకా లేని మసీదు కట్టిస్తామని ముఖ్యమంత్రి గారే ప్రకటన చెయ్యడం - ఏంటో ఇదంతా?? ఓట్ల కోసం మరీ ఇంత దిగజారాలా?? 

అసలు మనం ఒక గౌరవనీయమైన రాజ్యాంగం నడుపుతున్న దేశంలో ఉన్నామా లేక అవినీతితో కుళ్ళిపోయిన ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నామా తెలియడం లేదు. లా అండ్ ఆర్డర్ అనేది ఉందా లేదా అర్ధం కావడం లేదు.

ఇలాంటి నాయకులు? ఇలాంటి పోలీసులు? ఇలాంటి స్వామీజీలు? వీళ్ళను చూస్తుంటే -- ఛీ ఛీ ఎలాంటి దేశంలో ఉన్నాంరా దేవుడా? అని అనుకోవలసి వస్తోంది. నాయకులూ అధికారులూ దారి తప్పుతుంటే ప్రజలు బుద్ధి చెప్పాల్సి రావడం - దానికోసం బ్యాలెట్ చాలక బులెట్ ను ఎంచుకోవలసిన దుస్థితి పట్టడం - ఈ రాష్ట్రపు ఖర్మ కాకపోతే మరేంటి?

ఆంధ్రాకు దరిద్రం పట్టిందని రాష్ట్రం విడిపోయినప్పుడే నేను వ్రాశాను. తెలంగాణా నిజంగానే బంగారు తెలంగాణా అని కూడా వ్రాశాను. అది ప్రతిరోజూ నిజం అవుతోంది.

మొత్తానికి ఈ పౌర్ణమి భలే డ్రామాలను చూపిస్తోంది. చూడండి మరి !
read more " September - 2018 పౌర్ణమి ప్రభావం "

23, సెప్టెంబర్ 2018, ఆదివారం

'శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రం' తెలుగు ఇంగ్లీష్ ప్రింట్ పుస్తకములు ఈ రోజు విడుదలయ్యాయి

శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రం తెలుగు ఇంగ్లీష్ ప్రింట్ పుస్తకములు ఈ రోజున విడుదల అవుతున్నాయి. ఎవరి చేతులమీదుగా మా సంస్థలో ఏ పని జరగాలో ముందే నిర్ణయించబడి ఉంటుంది. జగన్మాత ఆ అదృష్టాన్ని కొంతమందికి అలా కలిగిస్తుంది. కనుక, ఇదే సమయానికి అనుకోకుండా ఇక్కడకు వచ్చిన వెంకటరాజుగారు, ప్రసాద్ గార్ల చేతుల మీదుగా ఈ పుస్తకములను విడుదల చేయించడం జరిగింది.

లోకం మెప్పులు, గొప్పలు, పటాటోపాల మీద మాకు నమ్మకం లేదు. వాటికి మేము ఏమాత్రం విలువనూ ఇవ్వము. మా పుస్తకాలను ఏ సోకాల్డ్ ప్రముఖుల చేతా ఆర్భాటంగా విడుదల చేయించము. ఆ పని మేమే చేస్తాం. ఎందుకంటే దేనికైనా కొన్ని అర్హతలనేవి ఉండాలి మరి ! పైగా, ఆ ప్రముఖుల చేతుల మురికి మా పుస్తకాలకు అంటుకోవడం మాకిష్టం లేదు.

యోగమార్గంలో పయనించే వారికి ఎంతో ఉపయోగపడే ఈ పుస్తకములను మా సంస్థనుండి ముద్రించడం ఒక అదృష్టంగా భావిస్తూ, త్వరలోనే 'శ్రీ జాబాల దర్శనోపనిషత్' ఇంగ్లీష్ ఈ బుక్ విడుదల అవుతుందని తెలియజేస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకములు google play books నుండి లభిస్తాయి.
read more " 'శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రం' తెలుగు ఇంగ్లీష్ ప్రింట్ పుస్తకములు ఈ రోజు విడుదలయ్యాయి "

21, సెప్టెంబర్ 2018, శుక్రవారం

మా క్రొత్త పుస్తకం 'శ్రీ జాబాల దర్శనోపనిషత్' E Book ఈరోజు విడుదలైంది



పంచవటి ప్రచురణల నుంచి ఆరవ E Book గా 'శ్రీ జాబాల దర్శనోపనిషత్' ఈ రోజున విడుదలైంది. ఈ పుస్తకం కూడా యధావిధిగా pustakam.org నుండి లభిస్తుంది.

దత్తాత్రేయులవారు మహాయోగి, మహాజ్ఞాని. అవతార మూర్తియగు పరశురామునకే ఈయన గురువు. తన శిష్యుడగు సాంకృతికి ఈయన ఉపదేశించిన అనేక యోగరహస్యములు దీనిలో కలవు. 

ఇది సామవేదమునకు చెందిన యోగోపనిషత్తు. ఉపనిషత్తులు సాధారణముగా జ్ఞానభాండాగారములుగా ఉంటాయి. వాటి మధ్యలోనున్న కొన్ని యోగోపనిషత్తులలో ఇదీ ఒకటి. ఈ రోజున దీని "ఈ-బుక్" ను విడుదల చేస్తున్నాను. మా ప్రచురణల నుండి వస్తున్న అమూల్య రత్నములలో ఇదీ ఒకటి. త్వరలోనే దీని ఇంగ్లీష్ వెర్షన్ విడుదల అవుతుంది. దానివెంట వీటి ప్రింట్ పుస్తకములూ వస్తాయి.

దత్తాత్రేయుల వారి అనుగ్రహంతోనే పదిరోజులలో ఈ పుస్తకాన్ని వ్రాయడం సాధ్యమైందని భావిస్తున్నాను. అతి తక్కువ కాలంలో ఈ పుస్తకాన్ని పూర్తి చేయడంలో ఎంతో సహాయపడిన నా అమెరికా శిష్యురాళ్ళకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.

మా పుస్తకములను నిరంతరం ఆదరిస్తున్న పాఠకులకు నా అభినందనలు, కృతజ్ఞతలు.
read more " మా క్రొత్త పుస్తకం 'శ్రీ జాబాల దర్శనోపనిషత్' E Book ఈరోజు విడుదలైంది "

18, సెప్టెంబర్ 2018, మంగళవారం

మానవుడు

ఒక మానవుడు....

మట్టిలో పుట్టి
మట్టికోసం కొట్టుకుని
మట్టిలో కలసి
మట్టికొట్టుకు పోతున్నాడు

తప్పని తెలిసీ
తప్పించుకునే మార్గం తెలియక
చేసిన తప్పులనే మళ్ళీ చేస్తూ
తప్పుల కుప్ప అవుతున్నాడు

ఒప్పులివీ అంటూ
ఒప్పించేవాళ్ళు చెప్పినా
ఒప్పుకోలేక
ఒప్పులకుప్పలా వగలేస్తున్నాడు

తనతో ఏదీ రాదనీ తెలిసినా
తమాయించుకోలేక
తనివి తీరకుండానే
తనువు చాలిస్తున్నాడు

ఇంకో మానవుడు

మట్టిలో పుట్టినా
మత్తులో జోగకుండా
మనసునధిగమిస్తూ
మహనీయుడౌతున్నాడు

దానవత్వాన్ని దాటిపోతూ
మానవత్వాన్ని పోగు చేస్తూ
దైవతత్వాన్ని అందుకుంటూ
ధన్యజీవిగా మారుతున్నాడు

రహదారిలో తాను నడుస్తూ
తనవారిని తనతో నడిపిస్తూ
పరతత్వపు పందిళ్ళలో
పరవశించి పోతున్నాడు

చావు పుట్టుకల ఆటలో
పావుగా ఇక్కడ పుట్టినా
ఆట నియమాలను దాటి
అనంతంలోకి అడుగేస్తున్నాడు

మానవుడు....
read more " మానవుడు "

14, సెప్టెంబర్ 2018, శుక్రవారం

బాబాజీ మేట్రిమోనీ సర్వీసెస్

ఈ పేరుచూచి నేనేదో కొత్త మేట్రిమోనీ సర్వీస్ ప్రారంభించానని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే!  అలాంటిదేమీ లేదు. 

చదవండి !

మొన్నామధ్య ఒక పాత మిత్రుడు కలిశాడు. కాస్త నీరసంగా కనిపించాడు.

'ఏంటీ అలా ఉన్నావ్?' అడిగాను.

తన కష్టాలు చెప్పుకొచ్చాడు.

ఇద్దరు పిల్లలకూ పెళ్ళిళ్ళకోసం తెగ తిరుగుతున్నాననీ ఎక్కడా సంబంధాలు కుదరడం లేదనీ చెప్పాడు.

ఆయన కష్టాలన్నీ విని ఇలా అన్నాను.

'అంటే వివేకానందుని వేషంలో ఉన్నావన్నమాట ప్రస్తుతం?'

'అదేంటి?' అన్నాడు.

'అవును. ఆయనకూడా అమెరికాకు వెళ్లబోయే ముందు పది పన్నెండేళ్ళు ఈ దరిద్రపు దేశంలో బికారిలా కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ తిరిగాడు. ఎవరూ ఆయన్ను గుర్తించలేదు. ప్రస్తుతం నీ పరిస్థితి కూడా అంతేగా?' అన్నాను.

'ఏంటో? ఎంత తిరిగినా పని మాత్రం అవడం లేదు' అన్నాడు.

'ఈ రోజుల్లో అలా తిరగనవసరం లేదు.  మెట్రిమోనీ సైట్లలో చేరు. పనౌతుంది'.

'అదీ అయింది. ఎన్నో సైట్లలో ఉన్నాను. కానీ అక్కడా ఏమీ జరగడం లేదు. ఏడాది నుంచీ ఉన్న సంబంధాలు అలాగే ఉంటున్నాయి. ఏవీ ముందుకు కదలడం లేదు'.

నవ్వేసి ఇలా అన్నాను.

'అవన్నీ బాబాజీ మెట్రిమోనీ సర్వీసులే. అక్కడ పని జరగదు'

'అదేంటి?' అన్నాడు అయోమయంగా.

'నువ్వు బాబాజీ భక్తుడవని గతంలో విన్నట్లు గుర్తు. ఇంకా క్రియాయోగం చేస్తున్నావా?'

'ఆ చేస్తున్నా. కానీ ఈ మధ్యనీ వెదుకులాటలో పడి సాధన  కొంచం తగ్గింది'. అన్నాడు.

'నిజమే నువ్వు వెనకబడ్డావు. నీ కంటే లోకమే బాబాజీ భక్తిలో ముందుంది' - అన్నాను.

'అదేంటి?' - అన్నాడు.

'లోకం బాబాజీని నమ్ముకున్నంతవరకూ ఎవరికీ పెళ్ళిళ్ళు కావు. ఎందుకంటే ఆయన మహాయోగి కదా. పెళ్ళికి ఒప్పుకోడు' - అన్నాను.

'మొదలు పెట్టావా నీ జోకులు? విషయం ఏంటో చెప్పు' - అన్నాడు విసుగ్గా.

'ఏం లేదు. ఇప్పుడందరికీ పైచూపే. పక్కచూపు, చుట్టుపక్కల చూపు ఎవరికీ లేదు. అంతా పైచూపే. ఎక్కడో మేఘాల్లోంచి ఏదో సంబంధం ఊడి పడుతుందని అందరూ తలలు పైకెత్తి దురాశ పట్టిన చాతక పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. బాబాజీ కూడా అంతే కదా. కళ్ళు పైకెత్తి చూస్తూ ఉంటాడు. అందుకే లోకమంతా బాబాజీ భక్తులే అంటున్నాను' - అన్నాను.

'వీళ్ళకీ ఆయనకూ పోలికేంటి?' - అన్నాడు వాడు.

'నిజమే. ఆయనది శాంభవీ ముద్ర. లోకులది దాంభికీ ముద్ర. అంతే తేడా !' - అన్నా నేనూ నవ్వుతూ.

'దీనికి మార్గం లేదా?' - అన్నాడు.

'ఉంది. పైచూపు చూచే డాంబిక యోగాభ్యాసం మానేసి, పక్కచూపుతో చక్కగా నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటే అన్నీ సర్దుకుంటాయి' - అన్నాను.

'ఏంటో ఈ ప్రపంచం అంతా గోలలా ఉంది' అన్నాడు వాడు విసుగ్గా.

'ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది.  అది గోలగా లేకపోతే విచిత్రం గాని గోలైతే విచిత్రం ఏముంది? గోల చెయ్యడమే దాని నైజం. ఈ చెత్త ప్రపంచంలో నుంచి నిజంగా మనవాళ్ళేవరో వారిని ఏరుకోవడమే మనం చెయ్యవలసిన పని. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. సమయం వచ్చినప్పుడు మీ పిల్లలకు సంబంధాలు అవే కుదురుతాయి. నిరాశ పడకు.' అని చెప్పి వాడిని పంపేశాను.
read more " బాబాజీ మేట్రిమోనీ సర్వీసెస్ "

13, సెప్టెంబర్ 2018, గురువారం

'The Science of Yoga according to Lord Dattatreya' - E Book released today



మా పుస్తకాలన్నీ తెలుగు మరియు ఇంగ్లీషు భాషలలో విడుదల అవుతున్నాయని మీకు తెలుసు.

ఈ క్రమంలో భాగంగా, వినాయకచతుర్ది పర్వదినమున, 'శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రము' ఇంగ్లీష్ వెర్షన్ ను The Science of Yoga according to Lord Dattatreya అనే పేరుతో ఈ రోజు E - Book గా విడుదల చేస్తున్నాను. ఇది కూడా pustakam.org నుంచి లభిస్తుంది. అతి త్వరలో ఇవి తెలుగు, ఇంగ్లీషు ప్రింట్ పుస్తకములుగా విడుదల అవుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

ఈ సందర్భంగా నా శిష్యులకు, అభిమానులకు, అనుచరులకు, పాఠకులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
read more " 'The Science of Yoga according to Lord Dattatreya' - E Book released today "

10, సెప్టెంబర్ 2018, సోమవారం

"శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రము" తెలుగు E Book విడుదలైంది

మన ప్రాచీన వేదాంత యోగ సాంప్రదాయంలో ఉన్న ఆణిముత్యాలైన గ్రంధములను "పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" నుంచి వరుసగా అందిస్తున్న మా ప్రయత్నంలో భాగంగా మా అయిదవ తెలుగు E - Book గా 'శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రము' ను ఈ రోజున విడుదల చేస్తున్నాను. ఈ పుస్తకం కావలసిన వారు pustakam.org నుండి పొందవచ్చును. రెండు రోజులలో దీని ఇంగ్లీషు E - Book, పదిరోజులలో ఈ రెండూ ప్రింట్  పుస్తకములు విడుదల అవుతాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

దత్తాత్రేయులవారు త్రిమూర్తి స్వరూపుడని మన నమ్మకము. ఈయన మహాజ్ఞాని మాత్రమేగాక మహాయోగి కూడా ! అవధూత సాంప్రదాయమునకు ఈయన ఆద్యుడు. కొన్ని యోగ, తంత్ర సాంప్రదాయములు ఈయన్ను సాక్షాత్తు పరబ్రహ్మముగా భావిస్తాయి. రామాయణ కాలమునకు ముందే ఉన్నట్టి పరశురామునికి కూడా ఈయన గురువన్న సంగతిని బట్టి ఈయన ఎంతటి మహనీయుడో మనం ఊహించవచ్చు.

ఈ పుస్తకం ఇంత త్వరగా పూర్తి అవడానికి నాకెంతో సహకరించిన నా అమెరికా శిష్యురాళ్ళకు కృతజ్ఞతలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. "పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" అమెరికా మరియు ఇండియా సభ్యులకు, శిష్యులకు నా ఆశీస్సులు. మా పుస్తకములను నిరంతరం ప్రోత్సహిస్తున్న పాఠకులకు నా కృతజ్ఞతలు.
read more " "శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రము" తెలుగు E Book విడుదలైంది "

6, సెప్టెంబర్ 2018, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 20 (అమ్మ నన్ను మందలించింది)

గుంటూరులో సాధనా సమ్మేళనం రెండవ రోజున అందరం కలసి బస్సు ఒకటి మాట్లాడుకుని జిల్లెళ్ళమూడికి వెళ్లామని ఇంతకుముందే వ్రాశాను. అప్పుడు జరిగిన మూడు ముఖ్యమైన సంగతులు ఈ పోస్టులో వ్రాస్తాను.

ఆశ్రమం ఆఫీసులో ఒకన్నయ్య మమ్మల్ని  ఇలా అడిగారు.

'మీ ప్రోగ్రాం ఏమిటి? ఇక్కడనుంచి ఇంకా ఏయే చోట్లకు మీరు వెళ్ళాలి?'

సామాన్యంగా ఇలా బస్సులు వేసుకుని వచ్చేవారు, నాలుగైదు పుణ్యక్షేతాలు తిరుగుతూ,  ఆ  క్రమంలో భాగంగా జిల్లెళ్ళమూడి కూడా వస్తూ ఉంటారు. అందుకని ఆయనలా అడిగారు.

నేనిలా చెప్పాను.

'మేము ఇంకెక్కడికీ వెళ్ళము. ఇక్కడనుంచి సరాసరి గుంటూరు వెళతాము.  దీనిని మించిన పుణ్యక్షేత్రం  మా దృష్టిలో ఇంకేదీ లేదు.'

ఆయన తృప్తిగా తల పంకించారు.

ఆలయంలో అమ్మ దర్శనం చేసుకుని అందరం వసుంధరక్కయ్య దగ్గరకు చేరుకున్నాం. గదిలో అందరం పట్టకపోతే,   చాలామందిమి  బయట అరుగు మీదా, చెట్టు కిందా కూచున్నాం. ఆడవాళ్ళు కొందరు మాత్రం అక్కయ్య దగ్గరగా కూచుని అమ్మ గురించి ఆమె చెప్పిన మాటలు విన్నారు.

అక్కడనుంచి బయల్దేరి వచ్చేటప్పుడు చరణ్ ఇలా అడిగాడు.

'అక్కయ్యా ! నాలుగైదు వందల సంవత్సరాల క్రితం, ఇదే ప్రాంతంలో ఎవరో ఒక నగ్నయోగిని జుట్టు విరబోసుకుని తిరుగుతూ ఉండేదని, ఆమెను కాపలాగా ఎప్పుడూ ఒక మహాసర్పం ఆమెతోబాటే తిరుగుతూ  ఉండేదని విన్నాను. ఆమే తర్వాత జన్మలో అమ్మగా పుట్టిందని కొందరు అంటుంటే విన్నాను. ఇది నిజమేనా?'

అక్కయ్య ఇలా చెప్పింది.

'ఈ కధను నేను వినలేదు. అమ్మకూడా ఎప్పుడూ చెప్పలేదు. బహుశా ఇది వారివారి ఊహ అయి ఉండవచ్చు. లేదా వారికి అలా దర్శనం కలిగి ఉండవచ్చు. అంతేగాని ఇందులో నిజం లేదు. కానీ ఒక విషయం నాకు గుర్తుకు  వస్తున్నది. ఒకసారి అమ్మను ఎవరో ఇలా అడిగారు. అప్పుడు నేను పక్కనే ఉన్నాను. "అమ్మా ! చాలా ఏళ్ళ క్రితం మంగళగిరి అన్నసత్రంలో నువ్వు వడ్డిస్తూ ఉండగా మేము చూచాము. నువ్వు అక్కడకు వచ్చావా? అని". అది అమ్మ పుట్టకముందో లేదా అమ్మ చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడో జరిగిన విషయం. కానీ అమ్మ మంగళగిరి వెళ్లి అక్కడ అన్నదాన సత్రంలో వడ్డించిన దాఖలాలు  లేవు. తను పుట్టకముందే తనెలా అక్కడ కనిపిస్తుంది? అది వారివారి ఊహో లేదా దర్శనమో అయి ఉండవచ్చు. అంతే !'

ఇప్పుడు కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. అమ్మ కనిపించింది. హైమ కనిపించింది అని.  తెల్లచీర కట్టుకుని జుట్టు  విరబోసుకుని  రాత్రిళ్ళు  అమ్మ ఇక్కడ పొలాలలో తిరుగుతూ ఉంటుందని. నిజానిజాలు నాకూ తెలీదు. అమ్మ శరీరంతో ఉన్న రోజులలో కూడా ఇలాగే జరిగేది. అమ్మ నడుస్తుంటే అస్సలు శబ్దం అయ్యేది కాదు.  అంత సుతారంగా నడిచేది అమ్మ. నేను వంటగదిలో కాఫీకాస్తూ ఉంటే, ఎప్పుడొచ్చేదో వచ్చి నా వెనుక నిలబడి నేను కాఫీ ఎలా కాస్తున్నానో చూస్తో ఉండేది అమ్మ. చప్పుడు  చేసేది కాదు. నేను ఎందుకో వెనక్కు తిరిగితే అమ్మ నిలబడి చూస్తూ ఉండేది.

ఈ విధంగా ఇప్పుడు  కూడా ఇక్కడ ఉన్న విద్యార్ధులకు కొందరికి అమ్మ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళను నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటుందని అంటారు. అమ్మ అడుగుల చప్పుడు వినపడదు. కానీ హైమ అలా కాదు. గజ్జెలు కట్టుకుని చిన్నపిల్లలా గెంతుతూ తను నడుస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడ కొంతమందికి రాత్రిపూట గజ్జెల చప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అది హైమ అడుగుల చప్పుడు. హైమ మన దగ్గరగా నడుస్తుంటే గజ్జెల చప్పుడు వినిపిస్తుంది. తను కనిపించదు. కానీ ఈ ధ్వని మాత్రం వినిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఈ ప్రదేశాన్ని రక్షిస్తూ ఇక్కడే   ఉన్నారు. లేకపోతే ఇక్కడ మాకేముంది రక్షణ?' అంటూ అక్కయ్య చెప్పింది.

మాకేదో బట్టలు పెడదామని అక్కయ్య గూట్లో వెదుకుతుంటే నేనిలా చెప్పాను.

'బట్టలు వద్దక్కయ్యా ! నేనీ పంచెలూ అవీ కట్టుకోను.  నాలుగు జతలు బట్టలుంటే నాకు చాలు. నా జీవితమంతా అలాగే బ్రతికాను. మినిమంలో బ్రతకడమే నాకిష్టం. అందుకని నాకవి వద్దు. అమ్మ కాళ్ళదగ్గరున్న పువ్వును ఇవ్వు చాలు.'

అక్కయ్య నవ్వేసి, ఆ  పువ్వుతో బాటు కొన్ని పండ్లను నా చేతిలో పెట్టి ఆశీర్వచనం చేసింది.

అక్కడ నుంచి అందరం బయల్దేరి అప్పారావన్నయ్య దగ్గరకు వచ్చిన సంగతీ అక్కడ జరిగిన సంగతులూ కూడా ఇంతకు ముందే వ్రాశాను.

ఆయనతో మాట్లాడుతూ ఉండగా మాటల మధ్యలో ఆయనిలా అన్నారు.

'పోయినసారి మీరు వచ్చి వెళ్ళాక -- "వాడు యాక్సిడెంట్ అయి క్రిందపడి లేచి ఇక్కడకు వచ్చాడు. వాడికేమీ ఇవ్వకుండా పంపించావు నువ్వు?" అంటూ అమ్మ నన్ను మందలించింది. అప్పటినుంచీ, ఇవి మీకోసం తీసి ఉంచి, మీరెప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్నాను. కాబట్టి ఇప్పుడీ బట్టలు మీరు తీసుకోవాలి.' అంటూ పంచెల చాపు నా చేతిలో పెట్టారాయన.

నాకొద్దని సుతారంగా  చెప్పబోయినా ఆయన వినిపించుకోలేదు.

"అమ్మ స్వయానా అలా  చెప్పాకకూడా నేను చెయ్యకపోతే ఎలా? అమ్మకు నేను జవాబు చెప్పవలసి వస్తుంది' అంటూ  నా నోరు నొక్కేశారాయన. 

అమ్మను స్మరిస్తూ నీళ్ళు నిండిన కళ్ళతో ఆ బట్టలు స్వీకరించాను.

అమ్మ ప్రస్తుతం ఏ రూపంలో ఉన్నదో ఆమెను చూచే శక్తి మనబోటి సామాన్యులకు లేకపోవచ్చు. కానీ మనలాంటి అల్పులను కూడా అమ్మ చూస్తూనే ఉన్నది. నిత్యం గమనిస్తూనే ఉన్నదన్న నిజం ఇలా అప్పుడప్పుడూ, అమ్మకు అతిదగ్గరగా ఎన్నోఏళ్ళు బ్రతికినవారి ద్వారా మనకు అర్ధమౌతూ ఉంటుంది.  మనలో నూతనశక్తిని నింపుతూ ఉంటుంది.

(సశేషం)
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 20 (అమ్మ నన్ను మందలించింది) "

2, సెప్టెంబర్ 2018, ఆదివారం

Vijnana Bhairava Tantra English E - Book ఈరోజు విడుదల అయింది.


నేను వ్రాస్తున్న పుస్తకాలను తెలుగులోనూ ఇంగ్లీషులోనూ ఒకేసారి వ్రాయడం నా అలవాటుగా మారింది. అదే విధంగా ఈ పుస్తకాన్ని కూడా ఇంగ్లీష్ లోకి వ్రాశాను. దీని E-Book ను ఇవాళ రిలీజ్ చేస్తున్నాము.

Panchawati Spiritual Foundation - USA ప్రెసిడెంట్ అయిన ఆనంద్ కుమార్ చేతులమీదుగా ఈ పుస్తకం ఈరోజు విడుదల చెయ్యబడుతున్నది. ప్రస్తుతం తను ఇండియాకు వచ్చి ఉన్నాడు. అందుకని ఈ పుస్తకాన్ని తన చేతులమీదుగా రిలీజ్ చేయిస్తున్నాను.


ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని అతి తక్కువకాలంలో వ్రాయడంలో నాకెంతో సహాయపడిన నా అమెరికా శిష్యురాళ్ళకు నా ప్రత్యేక కృతజ్ఞతలు, ఆశీస్సులు.


తెలుగైనా ఇంగ్లీషైనా ఏ భాష ప్రత్యేకత దానిదే. దేని అందం దానిదే. అందుకే, తెలుగురాని వారికోసం ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని ఈరోజు రిలీజ్ చేస్తున్నాము. ఇంగ్లీషులో కూడా ఈ పుస్తకం అంతర్జాతీయ ప్రమాణాలతో చాలా చక్కగా వచ్చింది. ఒక నెలలోపు దీని ప్రింట్ బుక్ కూడా రిలీజ్ అవుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకం కూడా google play books నుంచి మరియు  amazon.com నుంచి లభిస్తుంది.
read more " Vijnana Bhairava Tantra English E - Book ఈరోజు విడుదల అయింది. "