అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

30, మే 2018, బుధవారం

దేవుడు కళ్ళూ చెవులూ ఇచ్చింది మూసుకోడానికా?

నన్ను ప్రశ్నలు అడిగేవారిలో భలేభలే వాళ్ళుంటారు. వాళ్ళ క్రియేటివిటీకి నాకు చాలా సరదాగా ఉంటుంది. వాళ్ళ అజ్ఞానానికి జాలికూడా వేస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నలు అడిగేవారిలో చాలామంది అమ్మాయిలే ఉంటారు. మగవాళ్ళు తక్కువ. ఎందుకంటే, మగవాడికి అహం జాస్తిగా ఉంటుంది. ఇంకొకడిని ఏదైనా అడగాలంటే - 'నేనేంటి ఇంకొకడిని అడిగేదేంటి?' 'ఈయనేంటి నాకు చెప్పేది?' - అంటూ ముందుగా వాడి అహం అడ్డొస్తుంది.

పాపం ఆడవాళ్ళు అలా కాదు. వాళ్లకు తెలుసుకోవాలని జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. అందుకే వెంటనే ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళ సమస్యలు వాళ్ళకూ ఉంటాయి. నాకు కొంచం దగ్గరైతే చాలు, వారిలో పొసేసివ్ నెస్సూ, జెలసీ ఇత్యాది దుర్గుణాలు తలెత్తుతూ ఉంటాయి. ఆ క్రమంలో నానా కంపు చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా అలా చేసిన వాళ్ళ గురించి, వాళ్ళ గోల గురించి మరెప్పుడైనా సీరియల్ గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మన టాపిక్ లోకి వద్దాం.

మొన్నామధ్యన ఒకమ్మాయి నాతో ఫోన్లో మాట్లాడుతూ ఇలా అడిగింది.

'నేను మీ బ్లాగ్ కు చాలావరకూ అడిక్ట్ అయిపోయాను. ప్రతిరోజూ నాలుగుసార్లు మీ బ్లాగ్ ఓపన్ చేస్తూ ఉంటాను. కొత్తవి ఏమైనా వ్రాశారేమో అని'

ఈ మాటను చాలాసార్లు చాలామంది నుంచి విని ఉండటంతో నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు.

'అవునా. థాంక్స్' అన్నా సింపుల్ గా.

'నేను మీ పోస్టులు అన్నీ చదువుతాను గాని మీ పాటలు మాత్రం అస్సలు వినను. అవి నాకు నచ్చవు' అంది ఆ అమ్మాయి మళ్ళీ.

నాకు విషయం అర్ధమైనా అర్ధం కానట్లు నవ్వుతూ - 'అవునా? అవేం పాపం చేశాయి? నేనేమీ అసభ్యమైన పాటల్ని పాడటం లేదే?' అన్నాను.

'అది కాదు. ఎందుకో మీ ఆధ్యాత్మిక పోస్టులు మాత్రమే నాకు నచ్చుతాయి. అలాంటి హై లెవల్ పోస్టులు వ్రాసే మీరు, ఒక మామూలు సింగర్ లాగా సినిమా పాటలు పాడటం ఎందుకో నాకు నచ్చదు' అంది.

'అలాగా' అన్నాను మళ్ళీ సింపుల్ గా.

'అవును. నాదొక డౌట్. అడగమంటారా?' అంది తను.

'చెప్పండి' అన్నాను.

'మీరు ధ్యానం గురించి ఎక్కువగా చెబుతారు కదా'

'అవును'

'నా డౌటేంటంటే, దేవుడు మనకు కళ్ళూ ముక్కూ చెవులూ ఇచ్చింది వాటిని తెరిచి లోకాన్ని చూడమని గాని, వాటిని మూసుకుని ధ్యానంలో కూచోమని కాదుగా? మరి ధ్యానం అనేది దేవుడి ప్లాన్ కు వ్యతిరేకం కదా?' అంది అమాయకంగా.

నవ్వుతో నాకు పొలమారింది.

'మీ డౌట్ చాలా బాగుంది. దానికి ఆన్సర్ చెప్పేముందు నాదొక డౌట్ ఉంది. అడగమంటారా?' అన్నాను.

'మీకు డౌటా? సరే ఏంటో చెప్పండి'

'ఏం లేదు? మీరు ఒక్క నిముషం కూడా కాకముందే రెండు మాటలు మాట్లాడుతున్నారేంటి?' అన్నాను.

'నేనా? రెండుమాటలు మాట్లాడానా? ఎప్పుడు" అందా అమ్మాయి.

'ఇప్పుడే. ముందేమో, దేవుడు నోరిచ్చింది మూసుకొని కూచోడానికి కాదన్నారు. మళ్ళీ వెంటనే, నేను మీ పాటలు వినను అంటున్నారు. దేవుడు నోరిచ్చింది పాటలు పాడటానికి కూడా కదా ! మరి నేనదే చేస్తున్నాను. అవి వినడానికి మీకెందుకు అయిష్టం? అంటే, మీరు కూడా దేవుడి ప్లాన్ కు వ్యతిరేకంగా పోతున్నట్లే కదా?' అన్నాను.

ఆమెనుంచి సౌండు ఆగిపోయింది.

'అంటే అంటే అదీ అదీ....' అంటోంది.

'పోనీ ఇంకో డౌటు. దీనికి చెప్పండి. నిద్రలో మీరు కళ్ళు మూసుకుని నిద్రపోతారా తెరుచుకుని నిద్రపోతారా?' అడిగాను.

'అదేంటండి అలా అడుగుతారు? ఎవరైనా కళ్ళు మూసుకునే కదా నిద్రపోతారు?' అడిగింది ఆమె.

'లేదండి. కొంతమంది కళ్ళు తెరుచుకుని కూడా నిద్ర పోగలరు' అన్నాను.

'అలాంటి వారిని నేనింతవరకూ చూడలేదండి' అందామె.

'కరెక్టే. నేనూ ఇంతవరకూ చూడలేదు' అన్నాను.

ఆమె ఇంకా కన్ఫ్యూస్ అయిపొయింది.

'అదేంటి? మరి ఎలా చెప్పగలుగుతున్నారు చూడకుండా?' అంది.

'నన్ను నేను చూడలేను కదా' అన్నాను.

'అదేంటి? మీరు కళ్ళు తెరుచుకుని నిద్రపోతారా?' అడిగింది ఆమె.

'అవును. అప్పుడప్పుడూ అలా చేస్తాను' అన్నాను.

'ఎందుకలా?' అడిగింది.

'ఎందుకంటే, నేను ప్రతిరోజూ చేపల్ని బాగా తింటాను. అవి అలాగే కళ్ళు తెరుచుకునే నిద్రపోతాయి. వాటిని తినీ తినీ అదే అలవాటు నాకూ వచ్చేసింది' అన్నాను సీరియస్ గా.

అవతలనుంచి కాసేపు నిశ్శబ్దం.

'మీరు చేపలు తింటారా? చేపలు తినేవాళ్ళు అలా అవుతారా?' అంది అనుమానంగా.

పాపం ఇప్పటికి సృష్టించిన కన్ఫ్యూజన్ చాల్లే అనిపించి - 'అబ్బే అదేమీ కాదండి. పక్కనున్నవాళ్ళని సరదాగా భయపెట్టాలని అనుకున్నపుడు కొన్నిసార్లలా చేస్తూ ఉంటాను' అన్నాను.

'నిజంగానా?' అడిగింది భయంగా.

'మీమీదొట్టు. ధ్యానం బాగా చేతనైతే ఇలాంటి ట్రిక్స్ చెయ్యచ్చు.' అన్నాను.

'ఇలాంటి ట్రిక్స్ చెయ్యడానికి ధ్యానం చేస్తారా?' అంది.

'కాదనుకోండి. ఆ క్రమంలో ఇలాంటి శక్తులు వస్తూ ఉంటాయి. వాటిని సరదాగా అలా వాడుతూ ఉంటా అప్పుడప్పుడు. సరేగాని నా డౌటు క్లియర్ చెయ్యలేదు మీరు. నిద్రలో మీరు కళ్ళు మూసుకుంటారు కదా?' అన్నాను.

'అవును'

'మరి దేవుడేమో కళ్ళు తెరిచి లోకాన్ని చూడమని చెప్పాడని మీరే అంటుంటిరి. మళ్ళీ నిద్రలో కళ్ళు మూసుకుంటాను అంటుంటిరి? ఒక్క నిముషంలో మీరే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏంటిదంతా?' అడిగాను.

'అంటే, నిద్రకూడా పోకుండా ఎల్లకాలం పత్తికాయల్లా కళ్ళు తెరుచుకునే ఉండాలంటే ఎలా కుదురుతుంది?' అందామె.

'నేను చెప్పేది కూడా అదే. కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యకుండా ఎప్పుడూ కళ్ళు తెరుచుకునే ఉండటం కూడా తప్పే కదూ?' అన్నాను.

'ఏమో. మీ ఆన్సర్ తో నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను' అందామె. 

'అది మీ ఇష్టం. మిమ్మల్ని కన్విన్స్ చెయ్యాల్సిన పని నాకు లేదు' అన్నాను.

'మరి నా డౌటు తీరేదెలా?' అంది.

'సరే. ఇంకో మాట అడుగుతాను చెప్పండి. మీ జీవితంలో మీరెప్పుడూ పాటలు పాడలేదా. కనీసం కూనిరాగాలు తియ్యలేదా? ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి. కనీసం బాత్రూంలో స్నానం చెసేటప్పుడైనా, కూనిరాగాలు తియ్యలేదా? ఏ పాటలూ హమ్ చెయ్యరా?' అడిగాను.

'చేస్తాను. అలా అందరూ చేస్తారు' అందామె.

'మరి నేను పాడుతున్న పాటల్ని వినడానికి మీకెందుకు అభ్యంతరం? దేవుడు చెప్పిన పనే నేను చేస్తున్నాను. నేను బాత్రూంలో దాక్కుని పాటలు హమ్ చెయ్యడం లేదు. బాత్రూం బయటే పాడుతున్నాను. నోరు బార్లా తెరిచి మరీ పాటలు పాడుతున్నాను. మరి మీరెందుకు వినడం లేదు?' అడిగాను.

'ఏమో తెలీదు' అందామె.

'దేవుడు మీకు కూడా నోరిచ్చి పాటలు పాడమన్నాడు. మరి మీరెందుకు పాటలు పాడకుండా దేవుడికి అపచారం చేస్తున్నారు?' అడిగాను.

'అదీ తెలీదు' అందామె.

'ఏమీ తెలీకుండా మరి నాకెందుకు ఫోన్ చేశావమ్మా?' అనుకున్నా లోలోపల.

'సరే. ఒక పని చెయ్యండి. నేనిప్పటిదాకా 350 పైన హిందీ పాటలు పాడాను. తెలుగు, మలయాళం, కన్నడం ఇత్యాది ఇంకొన్ని పాడాను. ముందు అవన్నీ వినండి. ఆ తర్వాత మీ డౌట్లు అడగండి. అప్పుడు వాటిని క్లియర్ చేస్తాను' అని చెప్పాను.

'అలాగే చేస్తాను. ఈలోపల చిన్న క్లూ ఇవ్వండి' అందామె.

'ధ్యానం చెయ్యాలంటే కళ్ళు మూసుకునే చెయ్యనక్కరలేదు. తెరిచి కూడా చెయ్యవచ్చు. నేనలాగే చేస్తూ ఉంటాను' అన్నాను.

'అదేంటి? ఇదింకా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ధ్యానం కూడా కళ్ళు తెరిచే చేస్తారా?' అడిగిందామె.

'అవును. అలా ఎన్నో ఏళ్ళు చేసీ చేసీ, కళ్ళు తెరిచి నిద్రపోయే శక్తి సంపాదించాను' అన్నాను.

'దాన్ని శక్తి అంటారా? ఏంటో అంతా అయోమయంగా ఉంది. కాసేపేమో చేపలు తినీ తినీ అలా అయ్యానంటున్నారు. కాసేపేమో ధ్యానం వల్ల ఈ శక్తి వచ్చిందంటున్నారు. ఒక డౌట్ క్లియర్ చేసుకుందామని ఫోన్ చేస్తే మరిన్ని డౌట్స్ పట్టుకున్నాయి నన్ను.' అందా అమ్మాయి.

'నాతో ఇలాగే ఉంటుంది. నేను మీ డౌట్స్ క్లియర్ చెయ్యను. ఇంకా ఇంకా మీలో లేనిపోని డౌట్స్ క్రియేట్ చేస్తాను. నా మార్గం ఇంతే. ఈ హింసకి ఇష్టపడేవారే నాతో మాట్లాడాలి.' అన్నాను.

'మీరు చెబుతున్నవాటిల్లో ఏది నిజం? ఏదబద్ధం?' అందామె.

'అన్నీ అబద్దాలే. నేనొక్కటే నిజం' అన్నాను సీరియస్ గా గొంతు మార్చి.

'సరే ఫైనల్ గా చెప్పండి. దేవుడు మనకి కళ్ళూ చెవులూ ముక్కూ నోరూ ఇచ్చింది మూసుకోడానికా తెరుచుకోడానికా?' అందా అమ్మాయి విసుగ్గా.

'ఇలాంటి డౌట్స్ కూడా వస్తాయా దేవుడా?' - అని నాకు భలే నవ్వొచ్చింది.

'అప్పుడప్పుడూ మూసుకోడానికి, అప్పుడప్పుడూ తెరుచుకోడానికి. రెండూ చేసే శక్తి వాటికి ఉందిగా. ఆ శక్తికి హద్దులు పెట్టడం ఎందుకు?' అన్నాను.

'సరే. ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు?' అందామె చివరకు.

'ఏదో ఒకటి మీకు చేతనైంది చేసుకోండి' అందామని నోటిదాకా వచ్చింది కానీ బాగుండదని మింగేశాను.

'ముందు నా పాటలన్నీ మొత్తం విని ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చెయ్యండి. వినకుండా ఫోన్ చేస్తే ఊరుకోను. మధ్యమధ్యలో కొన్ని పాటల పేర్లు అడిగి మీకు టెస్ట్ పెడతాను. అందులో మీరు ఫెయిల్ అయితే నాకు చెడ్డ కోపం వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం.' అన్నాను కరుగ్గా.

'సరేనండి ఉంటా' అంటూ ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి.

ఈ ఫోన్ కాల్ అయ్యేసరికి భలే విసుగొచ్చింది.

అంతా నా ఖర్మ ! సింపుల్ గా కళ్ళు తెరుచుకుని నిద్రపోవడం కూడా రానివారితో నేను మాట్లాడాల్సి రావడం నా ఖర్మ కాకుంటే మరేమిటి? ఛీ ! చవకబారు మనుషులు ! అంటూ భలే కోపం వచ్చేసింది.

అసలు నా బ్లాగులో ఫోన్ నంబర్ ను ఇవ్వనేల? ఇచ్చితిని పో, ఇలాంటివారు నాకు ఫోన్ చెయ్యనేల? చేసితిరి పో, నేను వారితో గంటలు గంటలు ఇలా వాగనేల? వాగితిని పో, చివరకు విసుగు పుట్టనేల? పుట్టినది పో, దాన్నంతా ఇలా బ్లాగులో పెట్టనేల?

అసలీ గోలంతా నాకేల?

అంతా కామెడీగా లేదూ?
read more " దేవుడు కళ్ళూ చెవులూ ఇచ్చింది మూసుకోడానికా? "

29, మే 2018, మంగళవారం

'Hidden meanings of Lalita Sahasranama' - E Book ఈరోజు రిలీజైంది

మార్చి 22 న యాక్సిడెంట్ ఐనప్పటినుంచీ మెడికల్ రెస్ట్ లో ఉన్న నేను ఈ రెండు నెలలలో చేసిన పనులు చాలా ఉన్నాయి. వాటిల్లో 'శ్రీవిద్యా రహస్యం' తెలుగు పుస్తకాన్నీ అలాగే దాని ఇంగ్లీషు అనువాదం 'The Secret of Sri Vidya' అనే పుస్తకాన్నీ ఆమూలాగ్రం అనేకసార్లు పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులు చేసి రెండో ఎడిషన్స్ గా వాటిని విడుదల చెయ్యడం జరిగింది.

ఈ పనులతో బాటు సమాంతరంగా 'లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక' ను 'Hidden meanings of Lalita Sahasranama' అనే పేరుతో ఇంగ్లీష్ లోకి అనువాదం చెయ్యడం జరిగిపోయింది. ఈరోజు ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను.

ఇంతటి లోతైన రహస్యాలున్న ఇలాంటి పుస్తకం లలితా సహస్రనామాలపైన ఇప్పటివరకూ రాలేదని ఘంటాపధంగా నేను చెప్పగలను. అసలీ పనులన్నీ చెయ్యడానికే నాకీ యాక్సిడెంట్ అయిందేమో అని నాకిప్పుడనిపిస్తోంది. మామూలుగా అన్నిపనులూ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నట్లయితే ఇవి చెయ్యడానికి నాకు రెండేళ్ళు పట్టి ఉండేది. అలాంటిది రెండు నెలల్లో చెయ్యగలిగాను.

ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నాకెంతో సహకరించిన నా శ్రీమతికీ, అలాగే నా అమెరికా శిష్యురాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

యధావిధిగా, ఈ పుస్తకం ఆన్ లైన్ లో google play books సైట్ నుంచి, అలాగే  Amazon.com నుంచి కూడా లభ్యమౌతుంది.

ఈ ఇంగ్లీషు పుస్తకంతో అంతర్జాతీయ పాఠకులు కూడా లలితా సహస్రనామాల మహత్యాన్నీ, దానిలోని అసలైన లోతైన అర్ధాలనూ తెలుసుకోగలుగుతారు. ఇది చదివిన ఇంగ్లీషు పాఠకులకు ఖచ్చితంగా మనదేశపు ఆధ్యాత్మిక ఔన్నత్యం పట్ల మంచి అవగాహన కలుగుతుందని, అది తప్పకుండా సరియైన ఆధ్యాత్మిక మార్గంలో వారిచేత అడుగులు వేయిస్తుందనీ నా నమ్మకం.


ఆ తర్వాత - ఖాళీగా ఉండటం మనకస్సలు ఇష్టం ఉండదు కాబట్టి, ఈరోజునుంచీ మా తర్వాతి పుస్తకం - 'Medical Astrology - Part I (With examples of 100 live Astro charts)' పని మొదలుపెడుతున్నాం అని చెప్పడానికి ఇంకా సంతోషిస్తున్నాను.
read more " 'Hidden meanings of Lalita Sahasranama' - E Book ఈరోజు రిలీజైంది "

16, మే 2018, బుధవారం

May - 2018 అమావాస్య ప్రభావం

నిన్న నిండు అమావాస్య.

అమావాస్య ప్రభావాన్ని మళ్ళీ రుజువు చేస్తూ నిన్న మంగళవారం నాడు ఏం జరిగిందో చూడండి.

తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం దగ్గర గోదావరిలో లాంచీ మునిగి 45 మంది జలసమాధి అయ్యి చనిపోయారు. కనీసం వాళ్ళు బయటకు కూడా రాలేకుండా, లాంచీ గది తలుపులు మూసేయ్యడంతో అంతమందీ శవాలుగా మారి, నది అడుగున ఆ లాంచీలో అదే గదిలో ఉన్నారు. 

దాదాపు ఏభై ఏళ్ళనుంచీ ఆ ప్రాంతంలో అవే లాంచీలు నడుస్తున్నాయట. టెక్నాలజీ మారినా అవే పాత లాంచీలు నడుస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారో, వాటిని ఏళ్ళ తరబడి ఓవర్ లోడ్ తో నడిపిస్తుంటే, సదరు మంత్రివర్గ అధికారులూ,  ప్రజా సంక్షేమం అంటూ ఇన్ని ఉపన్యాసాలు దంచే రాజకీయులూ ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు.

మన దేశంలో దేనికీ ముందుచూపు ఉండదు.  వాగుడెక్కువ పని తక్కువ. ఏదైనా జరిగాక అందరూ పోలో మంటూ గోల చేస్తారు. లేదా ఆ ప్రమాదం నుండి లబ్ది పొందుతారు. ఎటు చూచినా మన దేశంలో దోపిడీ తప్ప ఇంకేమీ లేదు. అందుకే ఎప్పుడో బీసీలో జరగాల్సిన ప్రమాదాలు ఇప్పుడు కూడా ఇండియాలో జరుగుతూ ఉంటాయి. అందుకే ఇతర దేశాలు మనల్ని చూచి హేళన చేస్తాయంటే చెయ్యవూ మరి ?

మరొక దుర్ఘటన !

అదే మంగళవారం, అంటే నిన్ననే, వారణాసిలో ఇంకా నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలి సింపుల్ గా 16 మంది పచ్చడి అయిపోయారు.  కొన్ని కార్లు ఇతర వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఇంకా నిర్మాణం దశలోనే ఫ్లై ఓవర్ కూలిపోవడం ఏమిటో? దానిని కడుతున్న వారిపైన చర్యలు ఉంటాయో ఉండవో? ఈ దేశంలో అన్నీ శేష ప్రశ్నలే.

మళ్ళీ ఇదే మంగళవారం రోజున, గుంటూరులో పోలీస్ స్టేషన్ మీద ముస్లిం ప్రజలు దాడిచేసి రాళ్ళు రువ్వడం ప్రజాస్వామ్య వ్యవస్థలోని డొల్లదనానికి పరాకాష్ట. దానికి కారణం ఒక అమ్మాయిని ఎవరో రేప్ చేయ్యబోయారట. జనానికి దొరికిపోయేసరికి అతను సరాసరి పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. అతడిని రాజకీయులూ పోలీసులూ కలసి రక్షిస్తారేమో అని ముస్లిం వర్గాలు కోపం తెచ్చుకుని పోలీసులను, పోలీస్ స్టేషన్నూ, పోలీస్ వాహనాలనూ ఎటాక్ చేశాయి. లాఠీచార్జీలూ, రాళ్ళు రువ్వడాలూ వగైరాలతో అర్ధరాత్రిదాకా గుంటూరు పాత పోలీస్ స్టేషన్ ప్రాంతం రణరంగంలా ఉండి మరో కాశ్మీర్ ను తలపించింది.

ఇవన్నీ మంగళ వారం రోజునే, అందులోనూ అమావాస్య పరిధిలో జరగడం గమనార్హం.

అమావాస్య ప్రభావం మళ్ళీ రుజువైందా లేదా మరి ?
read more " May - 2018 అమావాస్య ప్రభావం "

14, మే 2018, సోమవారం

Secret of Sri Vidya - 2nd Edition - E-Book విడుదలైంది

'శ్రీవిద్యా రహస్యం' తెలుగు పుస్తకానికి ఇంగ్లీషు అనువాదం 'Secret of Sri Vidya' రెండవ ఎడిషన్ నిన్న రిలీజైందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకానికి ఇంకా మెరుగులు దిద్ది నూతనరూపాన్నిచ్చిన సంగతి మీకు తెలిసినదే. అవే మార్పులను దాని ఇంగ్లీషు ప్రతిలో కూడా చెయ్యడం జరిగింది. ఆయా మార్పులతో కూడిన రెండవ ఎడిషన్ ను Google play books లో అప్ లోడ్ చెయ్యడం కూడా జరిగింది.

అతి త్వరలో amazon లో కూడా, నవీకరించబడిన రెండవ ఎడిషన్ అందుబాటులోకి వస్తుంది.

తెలుగు పుస్తకం మన తెలుగు పాఠకులను మాత్రమే అలరిస్తోంది. కానీ ఇంగ్లీషు పుస్తకం అనేక దేశాలలో, ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలలో తెల్లవారిచే చదువబడుతోంది. ఈ విధంగా మన భారతీయ ఆధ్యాత్మికత యొక్క విశిష్టత వారికి కూడా అర్ధమౌతోంది.

తెలుగుతో బాటు ఇంగ్లీషు పుస్తకాన్ని కూడా సమానంగా ఆదరిస్తున్న అంతర్జాతీయ పాఠకులకందరికీ నా కృతజ్ఞతలు.
read more " Secret of Sri Vidya - 2nd Edition - E-Book విడుదలైంది "

8, మే 2018, మంగళవారం

ఒక్కసారి నా ఎదుటకు రావా?

ఇప్పుడనుకుని ఏం లాభం ?
ఇప్పుడేడిచి ఏం ఉపయోగం ?
కానీ ఊరుకుంటుందా నా మనసు?
పోరు మానుతుందా నా హృదయం?

ఒకనాడు....
బిచ్చగాడిలా నా వాకిట్లో నిలబడ్డావు
పిచ్చివాడిలా మౌనంగా వేచి ఉన్నావు
నాకోసం ఎంతో ఎదురుచూచావు

నేనేం చేశాను?
ఎంగిలి మెతుకుల్ని నీ దోసిట్లోకి విసిరేశాను
అడుక్కుండేవాడివంటూ హేళనగా నవ్వాను
గర్వంతో భళ్ళున తలుపేశాను

ఇన్నేళ్ళ తర్వాత....
ఈనాడు నాకు తెలివొచ్చింది
ఎంత తప్పు చేశానో ఇప్పుడు తెలిసొచ్చింది
నువ్వు అడుక్కోవడానికి రాలేదని
నన్ను ఉద్ధరించడానికే నా గుమ్మంలోకి వచ్చావని
ఇన్నేళ్ళ తర్వాత తెలిసొచ్చింది

మళ్ళీ ఒక్కసారి నా ఎదుటకు రావా?
నా గుండెనే కోసి నీ చేతుల్లో పెడతాను
నా కన్నీటితో నీ పాదాలు కడుగుతాను
నా ఆత్మనే నీకు అర్పణం చేస్తాను

ఒకనాడు...
సింహాసనం ఎక్కే అదృష్టాన్ని నా ముందుంచావు
నేనేం చేశాను?
అదొక కుక్కిమంచం అనుకున్నాను
నిర్లక్ష్యంగా దానిని చేజార్చుకున్నాను
కాలితో దానిని కసిగా తన్నాను
కానీ ఇప్పుడర్ధమౌతోంది
నాకా కుక్కిమంచం కూడా లేదని
నేను గొప్పదనుకున్నది చాలా అల్పమైనదని
నేను విర్రవీగినది ఏమాత్రం విలువలేనిదని

ఒక్కసారి నాకా అవకాశం ఇవ్వవా?
నా తప్పును దిద్దుకోనివ్వవా?
ఒక్కసారి నా ఎదుటకు రావా?

ఒకనాడు...
నువ్వు నవ్వుతూ పలకరిస్తే
నానుంచి ఏదో ఆశిస్తున్నావని భ్రమపడ్డాను
నా అందం చూచి మోజుపడ్డావనుకున్నాను
ఎంత పిచ్చిదాన్ని?
నీ చూపున్నది నా అందం పైన కాదని
ఇప్పుడు తెలిసింది

కానీ ఏం లాభం?
ఈలోపల నాకందనంత దూరాలకు వెళ్ళిపోయావు
తిరిగి వస్తావో రావో తెలియదు 
ఒక్కసారి నా ఎదుటకు రావా?

ఎన్నోసార్లు...
నీ ప్రేమను పొందే అర్హత నాకు లేకున్నా
ఎన్నో రూపాలలో నాకెదురొచ్చావు
ప్రేమగా నన్ను నీ కౌగిలిలోకి ఆహ్వానించావు

కానీ నేనేం చేశాను?
ప్రతిసారీ నా ప్రవర్తనతో నిన్నవమానించాను
నీ పసిమనసును తీవ్రంగా గాయపరచాను
ఇప్పుడెంతగా ఏడుస్తున్నానో నాకు తెలుసు
ఒక్కసారి నా ఎదుటకు రావా?

నేనెంత పాపిని?
స్వచ్చమైన నీ మనసును గ్రహించలేకుండా
నా గర్వమే నాకు అడ్డొచ్చింది
అమూల్యమైన నీ సాంగత్యాన్ని ఆస్వాదించకుండా
నా అహంకారమే నన్ను పాడుచేసింది
నా మనసుకు నేను బందీనై
నీ ఆత్మను గ్రహించలేకపోయాను
నా ఆత్మకు నేనే దూరమయ్యాను
ఇన్నేళ్ళ తర్వాత బుద్ధొచ్చింది
ఒక్కసారి నా ఎదుటకు రావా?

ఒకనాటి నా అందం
నేడు ఆవిరైపోయింది
ఒకనాటి నా ఒంటి బిగువు
ఇప్పుడు జారిపోయింది
వీటిని చూచుకునా నిన్ను దూరం చేసుకున్నాను?
కామమనుకునా ప్రేమను చేజార్చుకున్నాను?
పశ్చాత్తాపమనే అగ్ని నన్ను కాలుస్తోంది
కన్నీరనే సముద్రం కట్టలు తెగి ప్రవహిస్తోంది
మళ్ళీ నా జీవితంలో వస్తాయా ఆ అమూల్య క్షణాలు?
మళ్ళీ ఇస్తావా ఒకప్పుడు నువ్విచ్చిన అవకాశాలు?

నిన్ను కోరుకోనప్పుడు ఎన్నోసార్లు ఎదురుపడ్డావు
నిన్ను ఆశించనప్పుడు నీ చేతినెన్నోసార్లు అందించావు
కానీ నా మనసే నన్ను మోసగించింది
నీ విలువ తెలుసుకోలేకుండా నన్ను మాయచేసింది

బంగారం లాంటి నీ హృదయాన్ని
నా అహంతో ప్రతిసారీ గాయపరచాను
నాకు నిష్కృతి ఉందా అసలు?

నిన్ను క్షమించమని ఎలా అడగను?
నేను చేసినవన్నీ నాకు గుర్తొస్తూ ఉంటే?
నా గుండెను కోస్తూ చిత్రవధ చేస్తూ ఉంటే?

అయినా సరే,
ధైర్యాన్ని కూడదీసుకుని
క్షోభ నిండిన గుండెతో
కారుతున్న కన్నీళ్ళతో
బేలతనపు మనస్సుతో
మళ్ళీ అడుగుతున్నాను
నన్ను క్షమించవా?
ఒక్కసారి నా ఎదుటకు రావా?
read more " ఒక్కసారి నా ఎదుటకు రావా? "

7, మే 2018, సోమవారం

లలితా సహస్ర నామములపై బుద్ధమత ప్రభావం

ఈ మధ్యలో మంచి చిక్కటి ఆధ్యాత్మిక పోస్టులు వ్రాసి చాలా రోజులైందని అనిపించింది. అలాంటి పోస్టులు ఈ మధ్యన నేను వ్రాయడం లేదని కొందరు ఆధ్యాత్మిక వీరాభిమానులు నాకప్పుడప్పుడు  మెయిల్స్ ఇస్తున్నారు. అందుకే ఈ పోస్టు !

పైగా దీనికి ఇంకో కారణం కూడా ఉంది. నా బ్లాగులోనుంచి కాపీకొట్టిన భావాలను కొన్ని దినపత్రికలలో ఆధ్యాత్మిక శీర్షికల క్రింద కొందరు రచయితలు వ్రాసుకుంటున్నారని ఈ మధ్యనే రుజువులతో సహా నాకు తెలిసింది. ఆ పేపర్ కటింగ్స్ ను చూచిన మీదట నాకు చాలా జాలేసింది. ఇంకొంతమంది బ్లాగుచోరులు నా పోస్టులను వాట్సప్ లొ వాళ్ళ పోస్టులుగా ప్రచారం చేసుకుంటున్నారు. మొన్నొకరోజున నా పోస్టు ఒకటి ఎక్కడెక్కడో తిరిగితిరిగి వాట్సప్ లో నాకే వచ్చింది. దానిని చూచి నాకు భలే నవ్వొచ్చింది. పోనీలే అలాగే వ్రాసుకోనీ అనుకుంటూ, వాళ్లకు ఇంకా కొంత సబ్జెక్ట్ ఇద్దామని కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాను.

నా మాట నమ్మలేక పోతున్నారా? త్వరలో ఇదే కంటెంట్ ను కొంచం మార్చి, కొన్ని న్యూస్ పేపర్లలో రెలిజియస్ కాలమ్స్ వస్తాయి చూచుకోండి మరి !

బుద్ధమతం ప్రాచీన మతాలలో ఒకటి. సనాతన ధర్మం లేదా హిందూమతం అనేది అతి ప్రాచీనమైనదని, అది బుద్ధమతం కంటే ఇంకా ప్రాచీనమైనదని మన విశ్వాసం. అది నిజం కూడా. కానీ బుద్ధుని తర్వాత వచ్చిన అనేక స్తోత్రాలు, మంత్రాలు, తంత్రగ్రంధాలలో బుద్ధుని ప్రభావం అతి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంత వద్దనుకున్నా కొన్నికొన్ని పదాల దగ్గర ఈ విషయం మనకు తెలిసిపోతూ ఉంటుంది. బుద్ధమతం అంటే పడని కొందరు సాంప్రదాయ వాదులకు ఈ పదాలు నచ్చవు. వారికవి కొరుకుడు పడవు. కానీ ఆయా స్తోత్రాలలో అవి కన్పిస్తూ ఉంటాయి గనుక వాటికి హిందూ సాంప్రదాయ పరమైన అర్ధాలను వారు ఇస్తూ ఉంటారు. కానీ ఆ అర్ధాలు అతికినట్లుగానే ఉంటాయి గాని సహజమైన సువాసనను ఇవ్వవు.

అయినా, బలరాముడిని తొలగించి, ఆయన స్థానంలో బుద్ధుడిని దశావతారాలలో ఒకడుగా స్వీకరించిన మనం, ఆయన వాడిన పదాలను ఉన్నవి ఉన్నట్టుగా తీసుకోవడంలో మాత్రం అంగీకరించలేక పోతూ ఉంటాం. దీనికి మన కుహనా సాంప్రదాయం అడ్డుగా వస్తూ ఉంటుంది. కానీ ఆయా పదాలు మనవి కావు కాబట్టీ, అవి బుద్ధమతంలో విరివిగా వాడబడిన పదాలు కాబట్టీ వాటిని వాటిగానే ఒప్పుకోక తప్పదు మరి !

నేను సనాతనవాదినే గాని, నాకు బుద్ధమతం అంటే ద్వేషమూ లేదు, అసహ్యమూ లేదు. నేను బుద్ధుని ఎంతగానో ఆరాధిస్తానని చెప్పడానికి గర్విస్తాను. అంతమాత్రం చేత నా వైదిక మూలాలకేమీ నష్టం వాటిల్లదు. సరిగ్గా అర్ధం చేసుకుంటే వేదాలూ, బుద్ధుడూ ఇద్దరూ చెప్పినది ఒకటే అని అర్ధమౌతుంది. విషయం అంతాకూడా, మనం స్వచ్చమైన దృష్టితో చూడటంలోనూ, ఆ చూచినదానిని సరిగ్గా అర్ధం చేసుకోవడం లోనే ఉంది.

బౌద్ధమూ, జైనమూ అనే మతాలు నిజానికి సనాతనధర్మం అనే ప్రాచీన వృక్షానికి వచ్చిన కొత్త కొమ్మలనీ, వాటిని అవైదిక మతాలని పిలవడం పొరపాటనీ, వివేకానంద స్వామి వంటి మహనీయులు అభిప్రాయ పడ్డారు.

నేడు అనేకులు రోజూ పారాయణం చేస్తున్న లలితా సహస్రనామాలలో బుద్ధమతం ఛాయలున్నాయని నేనంటే చాలామందికి రుచించక పోవచ్చు. కానీ ఇది సత్యం. లలితా సహస్ర నామాలపైన ఎంతో రీసెర్చి చెయ్యడమే గాక, ఆ మార్గంలో నా చిన్నప్పటి నుంచీ సాధన చేసి, దానిమీద పుస్తకం కూడా వ్రాశాను కాబట్టి ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను.

ఉదాహరణకు కొన్ని నామాలను చూద్దాం.

'మైత్రాది వాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణీ' అనేది లలితానామాలలో గల ఒక నామం. దీనిలోని రెండవ భాగమైన 'మహాప్రళయ సాక్షిణీ' ని కాసేపు పక్కన ఉంచుదాం. మొదటి భాగాన్ని గమనిద్దాం.

'మైత్రాది వాసనా లభ్యా' అంటే - 'మైత్రి మొదలైన వాసనల (ఆలోచనల) వల్ల లభించేదానవు' అని అర్ధం. ఇక్కడ, 'మైత్రాది' అనే పదంలో 'మైత్రి మొదలైన' అనే అర్ధం కనిపిస్తున్నది గాని, 'మైత్రి'కి తోడు ఇంకేమేం ఉన్నాయో స్పష్టమైన వివరణ లేదు. స్తోత్రాలనేవి అతి తక్కువ మాటల్లో అతి ఎక్కువ అర్ధాలను పొదిగి ఉంటాయి గనుక ఇంతకంటే ఎక్కువ వివరంగా అక్కడ చెప్పడం కుదరని పని. అలా ప్రతిదానినీ వివరించుకుంటూ పోతే అది వ్యాఖ్యానం అవుతుంది గాని స్తోత్రం అవదు. కనుక అక్కడ అలా క్లుప్తంగా చెప్పబడిందనుకుందాం కాసేపు.

బౌద్ధంలో బ్రహ్మవిహార ధారణ అనే సాధన ఒకటుంది. దానిలో - మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే నాలుగు భావాల మీద ధ్యానం చేసే ప్రక్రియ ఉంటుంది. లలితా సహస్ర నామాలలో చెప్పబడిన 'మైత్రి మొదలైన ఆలోచనలు' అనేవి, ఇవే అని నా ఉద్దేశ్యం. ఎందుకంటే, సనాతన వైదిక సాంప్రదాయంలో 'మైత్రి' మొదలైన భావాల పైన ధ్యానం అనేది ఎక్కడా చెప్పబడలేదు. కొందరు ఈ పదాన్ని వేదాలలో చెప్పబడిన ' మైత్రా వరుణులు' అనే దేవతలతో ముడి పెట్టి వ్యాఖ్యానించాలని ప్రయత్నించారు. ముఖ్యంగా, 'మైత్రాది' అనే పదానికి 'మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, అగ్ని మొదలైన' అనే వైదికార్ధాన్ని చెప్పాలని వారు ఎంతగానో ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం కృతకంగానే ముగిసింది గాని సహజత్వాన్ని సంతరించుకోలేదు.

ఎందుకంటే - 'మైత్రాది వాసనాలభ్యా' అనే పదంలో మైత్రి మొదలైనవి వాసనలుగా (సంస్కారాలుగా) చెప్పబడ్డాయి గాని, దేవతలుగా చెప్పబడలేదు. మిత్రావరుణులు, ఇంద్రుడు మొదలైనవారు వైదిక దేవతలే గాని - ఆలోచనలు, సంస్కారములు, వాసనలు కారు. కనుక ఈ పదాలద్వారా ఉటంకించబడినది వైదిక దేవతలు కారన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది.

వైదికార్ధాన్ని సమర్ధించేవారు భగవద్గీత పన్నెండో అధ్యాయం (భక్తియోగం) నుంచి

'అద్వేష్టస్సర్వ భూతానాం మైత్ర కరుణ ఏవచ
నిర్మమో నిరహంకార: సమదుఃఖ సుఖ క్షమీ
సంతుష్ట స్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయ:
మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్తస్సమే ప్రియ:'

అనే శ్లోకాలను ఉటంకిస్తూ ఉంటారు.

కానీ ఈ శ్లోకాల వల్ల ఇందులో ఉటంకించబడిన 'మైత్రి, కరుణ మొదలైన' అనే పదానికి గల బుద్ధమత సంబంధం నిరాకరించబడటం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుతున్న భగవద్గీత అనేది బుద్ధుని తర్వాత వచ్చినదేనన్నది చరిత్రకారుల ఉద్దేశ్యం. మహాభారతకాలం బుద్ధుని కంటే ఇంకా 2500 సంవత్సరాల పూర్వం అయినప్పటికీ, భగవద్గీత అనేది క్రీ. శ. తొమ్మిది, పదో శతాబ్దాల ప్రాంతంలో గ్రంధస్తం చెయ్యబడిందని పలువురు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. కనుక అసలైన ప్రాచీన భగవద్గీతలో ఏ శ్లోకాలున్నాయో, ఆ తర్వాత ఏయే శ్లోకాలు అందులో చేర్చబడ్డాయో ఎవరికీ తెలీదు.

ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు భగవద్గీత అనేదే మహాభారతంలో తర్వాతి కాలంలో చొప్పించబడిన ప్రక్రిప్తఘట్టం అని కొందరు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే, మహాయుద్ధ మధ్యంలో అంత ఫిలాసఫీని గంటలు గంటలు చర్చించుకునే సమయం ఉండదు గనుక ! అర్జునుడూ కృష్ణుడూ అలా గంటలు గంటలు ఫిలాసఫీ మాట్లాడుకుంటూ ఉంటే, మిగతా పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం ఏం చేస్తోంది? గోళ్ళు గిల్లుకుంటున్నదా? లేకపోతే, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు లే, ఈ లోపల ఒక కునుకు తీద్దాం అని అందరూ నిద్ర పోతున్నారా?

'నేను యుద్ధం చెయ్యను' అని అడ్డం తిరిగిన అర్జునుడిని శ్రీకృష్ణుడు ఒప్పించి, అతనికి కొన్ని మంచి మాటలు చెప్పి, తిరిగి యుద్ధానికి అతన్ని సిద్ధం చేసి ఉండవచ్చు. అంతేగాని పద్దెనిమిది అద్యాయాలతో కూడిన భగవద్గీతను అతనికి ఆ యుద్ధం మధ్యలో ఉపదేశం చేశాడంటే లాజిక్ ఒప్పుకోదు. కనుక భగవద్గీత అనేదాన్ని మహాభారతం మధ్యలో ఎవరో తర్వాతి వారు ప్రక్షిప్తం చేశారనే కాస్త లాజిక్ ఉన్న ఎవరికైనా అనిపిస్తుంది.

అసలు చెప్పాలంటే, 'జయం' అనే పేరుతో పదివేల శ్లోకాలతో వ్యాసమహర్షి చేత వ్రాయబడిన గ్రంధం నేడు లక్ష శ్లోకాలతో 'మహాభారతం' అన్న పేరుతో మనకు లభిస్తోంది. దానినే మనం చదువుకుంటున్నాం. మరి ఈ తొంభై వేల శ్లోకాలు ఎక్కడనుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? వీటిల్లో ఒరిజినల్ శ్లోకాలు ఏవి? తర్వాత ప్రక్షిప్తాలుగా చేర్చబడినవి ఏవి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడా లేవు. ఏ పండితుడూ వీటికి జవాబులు చెప్పలేడు.

దీనికి కారణమేమంటే - మనకు ప్రస్తుతం లభిస్తున్న ఏ గ్రంధమూ ఒరిజినల్ కాదు. అనేక మార్పులు చేర్పులు చెయ్యబడిన రూపాలే నేడు మనకు కనిపిస్తున్నాయి. భగవద్గీత కూడా దీనికి మినహాయింపు కాదు. అసలైన భగవద్గీతలో ఇంకా చాలా శ్లోకాలున్నాయంటూ అనేకమంది ఉత్తరాదిలో పరిశోధనలు చేసి పుస్తకాలు వ్రాసిన వారున్నారు. అంతెందుకు? ఎక్కిరాల వేదవ్యాస్ గారు కూడా 'ప్రాచీన భగవద్గీత' అనే పేరుతో 1990 ప్రాంతాలలోనే ఒక పుస్తకం వేశారు. అందులో, మామూలుగా మనకు లభించే భగవద్గీతలో లేని అనేక శ్లోకాలను ఆయన ఉటంకించారు.

కనుక 'అద్వేష్టస్సర్వ భూతానాం మైత్ర కరుణ ఏవచ' అనే ఈ శ్లోకంలో చెప్పబడిన 'మైత్రి కరుణ మొదలైన గుణాలు' అనే పదం మీద బుద్ధమత ప్రభావం లేదు అని చెప్పే ఆధారాలు మనకెక్కడా కన్పించవు. ఎందుకంటే ఈ పదాలు సనాతనధర్మం కంటే కూడా బుద్ధమతంలోనే విరివిగా వాడబడ్డాయి.

లలితా సహస్ర నామాలపైన గల బుద్ధమత ప్రభావాన్ని చూపించే ఇంకొక నామం - 'నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయినీ'. ఇందులోని 'నిర్వాణ సుఖదాయినీ' అనే పదాన్ని గనుక మనం గమనిస్తే నేను చెబుతున్న విషయంలోని నిజం అర్ధమౌతుంది.

'నిర్వాణం' అనే పదం బౌద్ధంలో వాడబడిన పదమే గాని హిందూమతపు పదం కాదు. ఈ పదాన్ని కొంచం గమనిద్దాం.

'వాణం' అనే సంస్కృత పదానికి శరీరం, ఆధారం అని అర్ధాలు. నిర్వాణం అంటే 'శరీరం లేని స్థితి', 'ఒక ఆధారమంటూ లేని స్థితి' అని అర్ధాలున్నాయి. ఇది బౌద్ధంలో ఎక్కువగా సూచించబడే శూన్యత్వ స్థితికి సంకేతమే గాని, హిందూమతంలో వచ్చే 'సచ్చిదానందస్థితి' కి సంకేతం కాదు. లలితా సహస్ర నామాలకు అధికారిక భాష్యంగా కొనియాడబడే 'సౌభాగ్య భాస్కరం' వ్రాసిన భాస్కరరాయలవారు కూడా ఈ పదానికి సనాతన పరమైన అర్ధాన్ని సంతృప్తికరంగా చెప్పలేక పోయారు.

కనుక, లలితా సహస్ర నామాలలో మనకు కనిపించే 'మైత్రాది వాసనాలభ్యా' మరియు 'నిర్వాణ సుఖదాయినీ' అనే పదములవల్ల ఈ నామాలు వ్రాసిన వారిమీద బుద్ధమతపు ప్రభావం ఉన్నదన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది. ఎందుకంటే ఇవి సనాతన ధర్మపు (హిందూమతం) ఆత్మతో ముడిపడిన భావాలు, పదాలు కావు.

ఒకవేళ 'మైత్రి కరుణ' అనేవి హిందూమతంలో కూడా ఉన్నాయి కదా అనే వాదన వచ్చినప్పటికీ, 'నిర్వాణం' అనే పదం మాత్రం హిందూమతంది కాదు. అలాంటి పదం శాక్తేయ స్తోత్రం అయిన లలితా సహస్ర నామాలలో కనిపించడం అనేది - తంత్రయుగంలో విలసిల్లిన ఒక విచిత్రమైన పరిస్థితికి అద్దం పడుతోంది. తంత్రయుగంలో, అంటే క్రీ.శ 3-10 శతాబ్దాల మధ్యన హిందూ తంత్రాలూ బౌద్ధతంత్రాలూ విరివిగా పుట్టుకొచ్చాయి. వాటిలోని భావాలు కూడా పడుగుపేకలలా కలిసిమెలసి పోయాయి. వీటికి మూలాలు బెంగాల్ ఒరిస్సా రాష్ట్రాలలో ఉన్నాయి. ఆ కాలంలో వచ్చిన బౌద్ధతంత్ర గ్రంధాలనూ, హిందూ తంత్ర గ్రంధాలనూ వ్రాసినది ఆయా రాష్ట్రాలకు చెందిన పండితులూ, బౌద్ధ భిక్షువులే. దీనికి ఆధారాలు మనకు చాలా లభిస్తున్నాయి. వారే అక్కడనుండి టిబెట్ కు వెళ్లి అక్కడ వజ్రయాన బౌద్ధాన్ని ప్రచారం చేశారు.

వజ్రయాన బౌద్ధంలో కూడా దేవీ ఆరాధన ఉన్నది. దేవిని అందరు బుద్ధులకూ తల్లిగా అక్కడ ఆరాధిస్తారు. తారాదేవి, లలితాదేవి. కాళికాదేవి మొదలైన దేవతలు ఆయా టిబెటన్ పేర్లతో, బౌద్ధసాంప్రదాయపు పేర్లతో అక్కడ మనకు దర్శనమిస్తారు. వారి ఆరాధనా విధానాలు వజ్రయానబౌద్ధంలోని తంత్ర సాంప్రదాయంలో కూడా ఉన్నాయి.

కనుక బౌద్ధ తంత్రాలలోనూ, హిందూ తంత్రాలలోనూ మనకు దేవీ ప్రస్తావన కనిపిస్తుంది. అలాగే బౌద్ధ సాంప్రదాయపు పదాలు కూడా హిందూ స్తోత్రాలలో, మంత్రాలలో కనిపిస్తాయి. శ్రీచక్ర ఆరాధనలోని ఆవరణ పూజలో మనకు కన్పించే 'ఓం బుం బుద్ధాయ నమ:' అనే మంత్రమే దీనికి గల తిరుగులేని రుజువని నా విశ్వాసం. నిష్టగా ఉపాసన చేసే శ్రీవిద్యోపాసకులకు నేను చెప్పేదానిలోని నిజం అర్ధమౌతుంది, వాళ్లకు ఓపన్ మైండ్ అనేది ఉంటే !

కనుక, లలితా సహస్ర నామాలపైన బుద్ధమత ప్రభావం ఉంది అనేది నిర్వివాదాంశం. అంతేకాదు, పాతంజల యోగసూత్రాల చిక్కటి సంస్కృతాన్ని మనం అర్ధం చేసుకుంటే అందులో కూడా 'అస్మిత', 'క్లేశ' వంటి బుద్ధమతపు పదాలు ఎన్నో మనకు కన్పిస్తాయి. ఇవి మన హిందూమతపు పదాలు కావు. అంతేకాదు, బుద్ధమతపు భావాలు కూడా యోగసూత్రాలలో ఎన్నో ఉన్నాయి. క్రీ.పూ. ఒకటో శతాబ్దానికి చెందిన యోగసూత్రాల మీద అంతకు ముందర ఐదొందల ఏళ్ళ క్రితపు బుద్ధుని ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది? బుద్ధుని అసలైన కాలం క్రీ.పూ ఆరో శతాబ్దం కాదనుకోండి. ఒకవేళ అదే అని మనం ప్రస్తుతానికి అనుకున్నప్పటికీ అప్పటి సమాజాన్ని అన్ని రంగాలలోనూ ఎంతో ప్రభావితం చేసిన బుద్ధుని ప్రభావం యోగసూత్రాలమీద తప్పకుండా ఉంటుందనడం తార్కికం.

స్పష్టమైన తీరుతెన్నులతో నిర్దుష్టంగా ఉన్నట్టి బుద్ధుని సాధనా విధానానికి పోటీగానే పతంజలి మహర్షిచేత 'యోగసూత్రాలు' వ్రాయబడ్డాయని నా దృఢవిశ్వాసం. నా చిన్నప్పటినుంచీ యోగసూత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మీదట నేనీ విషయాన్ని చెబుతున్నాను. పతంజలి మహర్షి కంటే చాలా ప్రాచీనుడైన బుద్ధుడు తన విధానాన్ని అష్టాంగమార్గం అన్నాడు. పతంజలి మహర్షి తన యోగాన్ని అష్టాంగయోగం అన్నాడు. ఇందులో కూడా పోలికలున్నాయి మరి !

అయినా మన పిచ్చి కాకపోతే, బుద్ధుడిని దశావతారాలలో ఒకడుగా ఒప్పుకున్న మనం ఆయన వాడిన పదాలనూ, ఆయన భావాలనూ, ఆయన సాధనా విధానాన్నీ ఒప్పుకోలేక పోవడం ఎంత విచిత్రం?

మాయాప్రభావమూ, అజ్ఞానపు పట్టూ, మనుషుల మీద ఎంత గట్టిగా ఉంటాయో దీనిని బట్టి ఇంకోసారి బాగా అర్ధం కావడం లేదూ?
read more " లలితా సహస్ర నామములపై బుద్ధమత ప్రభావం "

2, మే 2018, బుధవారం

ఆర్నెల్లపాటు మకరరాశిలో కుజసంచారం - ఫలితాలు

మీరు కొన్నాళ్ళుగా వాయిదా వేస్తున్న పనిని నిన్నా ఈరోజులలో మొదలు పెడతారు. చేసిఉంటారు. మీ జీవితాలలో పరిశీలించి చూచుకోండి. నిన్నా ఈ రోజులలో మీరు చేసిన చేస్తున్న పనులను గమనించి చూడండి. అవి చిన్నచిన్న పనులే కావచ్చు. ఎవరికైనా ఫోన్ చెయ్యడమో, లేకపోతే మెయిల్ ఇవ్వడమో, లేదా ఇలాంటిది ఏదో ఒక చిన్న పనే కావచ్చు. అవి మీరు చాలా రోజులనుంచీ వాయిదా వేస్తున్నవై ఉంటాయి. కానీ తప్పకుండా నిన్నా ఈరోజులలో ఆపనులను మీరు చేసి ఉంటారు. మీ జీవితాలను గమనించండి. నేను చెబుతున్న దానిలో నిజం మీకే అర్ధమౌతుంది.

దీనికి కారణం మీ పైన కుజుని ప్రభావం! దీనివల్ల మీలో ఉన్నట్టుండి ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.

ఈ రోజు సాయంత్రం 4.30 ప్రాంతంలో కుజుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ నవంబర్ 6 వ తేదీ వరకూ, అంటే ఆర్నెల్లపాటు ఉండబోతున్నాడు. సామాన్యంగా నలభై రోజులలో ఒక రాశిని దాటవలసిన ఆయన ఆర్నెల్లు అక్కడే ఉంటున్నాడు. దీనినే 'స్తంభన' అంటారు. దానికి కారణం మధ్యలో ఆయనకు వస్తున్న రెండు నెలల వక్రత్వం, మందగతి వగైరాలు. ఈ ఆర్నెల్ల కాలంలో ఆయన ఇప్పటికే మకరరాశిలో ఉన్న కేతువుతో కలసి సంచరిస్తాడు. 

మకరంలో ఉన్న కేతువు, స్వక్షేత్రంలో ఉన్న శనీశ్వరుడిని సూచిస్తున్నాడు. సహజంగా కేతువు కుజుడిని సూచిస్తాడు. కానీ ఇక్కడ ఆయనకు డబల్ రోల్ వచ్చింది. అందులోనూ కుజునికి పరమశత్రువు అయిన శనీశ్వరుడయ్యాడు. అంటే, కేతువు రెండు పరస్పర శత్రువుల పాత్రలను పోషించాలి. అంటే తానొక స్ప్లిట్ పర్సనాలిటీగా మారాలి. ఇది మంచి సూచన కాదు.

ఈ ఆర్నెల్ల కాలం ప్రపంచంలో అనేక మార్పులను తేబోతున్నది. వాటిలో కొన్నింటిని ఇక్కడ సూచిస్తున్నాను.

  • నిన్న వచ్చిన అకాలవర్షాన్ని అది మిగిల్చిన నష్టాన్ని గమనించండి. ఉన్నట్టుండి అదెందుకొచ్చింది? అందులోనూ ఈ మండువేసవిలో?
  • ఉన్నట్టుండి నిన్న సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో ఉరుములు పిడుగులతో హోరువాన వచ్చి గుంటూరు విజయవాడలలో పిడుగులు పడి దాదాపు 20 మంది చనిపోయారు. ఏంటిది?
  • నిన్న కుజుని ఆధిపత్యంలో ఉన్న మంగళవారం అయింది. గమనించండి.
  • ఈ అకాలవర్షమూ, ఉరుములూ, పిడుగులూ, అవి మిగిల్చిన వ్యవసాయ నష్టాలూ, ప్రకృతి కన్నెర్ర చెయ్యడమూ ఇదంతా కాకతాళీయం కాదు. రాబోయే ఆర్నెల్లకాలంలో జరుగబోతున్న వాటికి ఇవి సూచన మాత్రమే. 
  • ఒక్కరోజులో (నేడు) జరుగబోతున్న కుజుని మకరరాశి ప్రవేశమే ఈ తాత్కాలిక విలయానికి కారణం.
  • కుజుడు ఎలక్ట్రికల్ ఎనర్జీకి కారకుడన్న విషయం గుర్తుంటే, నిన్న అకస్మాత్తుగా వచ్చిన ఉరుములు పిడుగులు గాలివానా ఎందుకు వచ్చాయో అర్ధమౌతుంది.
  • ఇకపోతే, ఈ ఆర్నెల్లకాలంలో ఏం జరుగబోతున్నాయో చూద్దాం.
  • ప్రతిమనిషిలోనూ అహంకారం పెరిగిపోతుంది. ప్రతిదానికీ పక్కవాళ్ళతో వాదనలు, గొడవలు, తగాదాలు జరుగుతాయి. నేనే కరెక్ట్ అన్న ధోరణి బాగా పెరుగుతుంది. దానివల్ల పక్కవారితో గొడవలు వస్తాయి. 
  • వాతావరణమూ ప్రకృతీ మనిషిని బాగా దెబ్బతీస్తాయి. పంటలు దెబ్బ తింటాయి. భూవివాదాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ ఒక స్థిరత్వం లేకుండా అనేక ఒడుదుడుకులకు లోనౌతుంది. దీనిలో పడి ఎంతోమంది డబ్బు నష్టపోతారు.
  • వృత్తి వ్యాపారాలలో అనేకమంది జీవితాలలో ఊహించని అనేక మార్పులు వస్తాయి.
  • ఒకసారి ఎక్కువ ఉత్సాహం, దాని వెంటనే అంతకు రెట్టింపు డిప్రెషన్ చాలామందిలో చూడవచ్చు.
  • దూకుడుగా ముందుకు వెళ్లేవారికి అనుకోని ఎదురుదెబ్బలు తగలడం ఈ సమయంలో దాదాపు ప్రతిరోజూ మీరు చూడవచ్చు.
  • ప్రపంచవ్యాప్తంగా హింస పెరుగుతుంది. దేశాల మధ్యా, దేశానికీ దాని పౌరులకూ మధ్యా జరిగే యుద్ధాలలో అనేక మంది చనిపోతారు.
  • భూకంపాలు వచ్చి అనేకమందిని కబళిస్తాయి. అనేక మంది నిరాశ్రయులౌతారు. బయటపడిన వాళ్ళు మానసిక స్థైర్యాన్ని కోల్పోతారు.
  • నాయకులే దొంగలౌతారు. మాయమాటలతో ప్రజలను నమ్మిస్తారు. ప్రజలు వంచించబడతారు.
  • మొబైల్, ఎలక్ట్రానిక్ రంగాలు సామాన్య ప్రజలకు మరింత దగ్గరౌతాయి. అనేక ఇతర సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
  • యధావిధిగా ఈ ఆర్నెల్లు కూడా, యాక్సిడెంట్లు, అసహజ మరణాలు కొనసాగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే, గత రెండు నెలలకంటే కూడా ఈ సమయంలో ఇంకా ఎక్కువౌతాయి.
  • అవినీతిపరులు ఎక్కువౌతారు. అనైతికత కూడా ప్రజలలో ఎక్కువౌతుంది.
  • అయితే - ఈ యోగం అందరికీ అంతా చెడే చెయ్యదు. వారివారి జాతకాలను బట్టి చాలామందికి అద్భుతమైన మంచి ఫలితాలు కూడా కనిపిస్తాయి. ఎంతో మంది జీవితాలు వారు ఊహించిన విధంగా సెటిల్ అవుతాయి కూడా.
  • కానీ జనరల్ గా ప్రపంచవ్యాప్తంగా మాత్రం చెడు జరుగుతుంది. చెడుకర్మ పోగేసుకుని ఉన్నవారికి ఈ కాలంలో భయంకరమైన శిక్షలు పడతాయి, ఈ శిక్షలు పడేది మానవ న్యాయస్థానాలలో కాదు, దైవన్యాయస్థానంలో, ప్రకృతి న్యాయస్థానంలో అవి పడతాయి. మనిషి వాటినుంచి తప్పుకోలేడు. 

జూన్ 28 నుంచీ ఆగస్ట్ 25 దాకా కుజుడు వక్రస్తితిలో సంచరిస్తాడు. ఈ ఆర్నెల్ల కాలంలో, ప్రపంచానికి ఇది చాలా చెడుకాలం అని చెప్పాలి. ఈ రెండునెలల కాలం చాలామందిని కబళిస్తుంది.

చదువరులను భయపెట్టడానికి ఈ సూచనలు ఇవ్వడం లేదు. మనిషిని అంతిమంగా రక్షించేది నీతి మాత్రమేననీ, అందుకనే నిత్యజీవితంలో నీతిగా జాగ్రత్తగా పద్దతిగా ఉండమని చెప్పడమే నా ఉద్దేశ్యం.
read more " ఆర్నెల్లపాటు మకరరాశిలో కుజసంచారం - ఫలితాలు "