అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

28, నవంబర్ 2014, శుక్రవారం

ప్రాణామృత ధారణలో...


  జీవంలేని రాతిశిల్పం
గుడిలో వెలుగై కదిలిస్తుంది
ప్రాణంలేని తీగరాగం
మదిలో జ్వాలను రగిలిస్తుంది

మాటరాని మూగమనసు
మనిషి బ్రతుకును నడిపిస్తుంది
పాడలేని పిచ్చిగుండె
స్వర తంత్రులను తడిపేస్తుంది

ఉందో లేదో తెలియని గమ్యం
ఊర్ధ్వలోకాలకు తెరతీస్తుంది
అందీ అందని నీ సాంగత్యం
ఆనందపు బాధను మిగులుస్తుంది

అందని ఆకాశం కోసం
?ఆరాటమేగా జీవితం
స్పందించే నెచ్చెలి స్నేహం
 !ఆస్వాదనేగా అమృతం

అమూల్యములౌ నిధులకు
ఆకారం ఉండబోదు
సాగుణ్యాత్మల మధ్యన
ఆకాశం అడ్డుకాదు

మాటలాడు నోటికేమొ
భావం దరిజేరరాదు
మూగగుండె లోగిలిలో
ముగ్ధత్వం వీడిపోదు

మౌనాస్వాదనలో వెలిగే
మధురవేదనే సత్యం
ప్రాణామృత ధారణలో
...పలుకు మౌనమే నిత్యం
read more " ప్రాణామృత ధారణలో... "

25, నవంబర్ 2014, మంగళవారం

గోంగూర పువ్వు


 ఆఫీసులో వెహికల్స్ పార్కింగ్ చేసేచోట ఉన్న పిచ్చిచెట్లలో ఒక సౌందర్యం విరబూసి కనిపించింది.

పిచ్చిచెట్టు అనే పదం క్షంతవ్యం.చెట్లలో ఏ చెట్టూ పిచ్చిది కాదు.ఇది మాటవరసకు వాడబడిన పదం మాత్రమే.

'ఏమిటా?' అని చూచాను.

అదొక గోంగూర పువ్వు.

యధాప్రకారం దానిని పలకరించాను.

అది వింతగా చూచింది.

'అందరూ గులాబీలనే మెచ్చుకోలుగా చూస్తారు.మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.నీకు నేనెందుకు మిత్రమా?' అన్నది.

'అందరి గోల నాకెందుకు?నీతో మాట్లాడగలుగుతున్నాను కదా.ఆ మాత్రం అర్ధం కాలేదా?' ఎదురు ప్రశ్నించాను.

అది మౌనంగా నవ్వింది.

ప్రేమగా చూచింది.

మౌనంగానే తన భావాలను నాకు ప్రసారం చేసింది.

చదవండి.
-----------------------------------------------------------

మహరాజుల చేతులలో
నలిగిపోవు ఖర్మలేదు
ప్రతిరోజూ పడకలపై
కుమిలి ఏడ్చు బ్రతుకు గాదు

గులాబీల సొగసు జూచి
మత్తిల్లిన మనసులలో
కాలుమోపబోను నేను

అందము నాస్వాదించుట
నెరుగలేని హీనులతో
చెలిమి చేయబోను నేను

రాజప్రాసాదపు లోగిలి
శ్రీమంతుల నడివాకిలి
నా పదములు తాకబోవు

సౌందర్యపు గర్వముతో
మిడిసిపడే సొగసురాండ్ర
చెంతకు నే చేరనెపుడు

మాయలేని గుండెలలో
మచ్చలేని చేతులలో
నిలిచి యుందు నేనెప్పుడు

జీవహీన విగ్రహాల
మెడల జోలి నాకేల?
ప్రకృతిమాత చల్లని ఒడి
చాలు నాకు ఈ నేల

లోకుల పాపపు కన్నుల
సోకకుండ బ్రదుకు గడపి
రాలిపోదునీ భూమిని
నాకమందు మనసు నిలిపి

భావోన్మత్తుల కన్నుల
లోగిళ్ళను స్పర్శించెద
కల్మషహీనుల ఎడదల
నెల్లప్పుడు నర్తించెద

కనుమోయీ బాటసారి
నా జీవన గమనమును
తరచి చూడుమొక్కసారి
నీ జీవిత గమ్యమును

అత్తరులో సత్తువకై
రక్తమిచ్చు దానగాను
మత్తుకళ్ళ మరుపులలో
కురుల మెరయు దానగాను

కర్మరంగమున కాలిడి
కండలు కరుగగ జేయుచు
ఘర్మజలము చిందించెడి
సార్ధక జీవుల కెప్పుడు

ప్రేమమీర దరిజేరుచు
పెరటిలోని పెన్నిధినై
సాంద్రమైన బలమునిచ్చు
ఆంధ్రమాత సుతను నేను...
read more " గోంగూర పువ్వు "

22, నవంబర్ 2014, శనివారం

యమునా తీరం...


యమునా తీరం
అంతమెరుగని విరహవలయం
రాధాహృదయం
వింత వలపుల ప్రేమనిలయం






గోపికల గుండెల్లో
మిగిలి రగిలిన ప్రణయగాథ
ఓపికల అంచుల్లో
విరిగి ఒరిగిన మధురబాధ



ఓపలేని విరహంలో
వేగుతున్నదొక ఉదయం
తాపమింక సైపలేక
తూగుతున్నదొక హృదయం






దాచిఉన్న హృదయానికి
దరిజేరని అనంతం
పూచిపూచి వాడిపోయె
పలుకలేని వసంతం




 ఎదురుచూచు వేదనలో
కరుగుతోంది కాలం
కుదురులేని మనసులో
మరుగుతోంది మౌనం






ప్రియుని కొరకు వేచివేచి
పిచ్చిదాయె మానసం
క్రియాశూన్య చేతనలో
కదలలేని సాహసం




రుచులు చూపి దూరమాయె
మురళి మధురగానం
అలవిగాని తాపంలో
తల్లడిల్లె ప్రాణం




నీవు లేని నిశిరాతిరి
నన్నుజూచి వెక్కిరించె
నన్ను మరచి చనిన నిన్ను
మరువలేక యమున వేచె

ప్రేమ విలువ నెరుగలేని
దైవత్వం ఎందులకో?
చెలియ మనసు మరచిపోవు
రాచరికం ఎందులకో?






ప్రేమేగా జీవనసారం?
ప్రేమేగా పావనతీరం!!
ప్రేమేగా శాశ్వతవేదం?
ప్రేమేగా బ్రతుకున మోదం!!





ప్రేమేగా సత్యస్వరూపం?
ప్రేమేగా నిత్యనివాసం!!
ప్రేమేగా మణిమయ తేజం?
ప్రేమేగా నిజమగు దైవం !!
read more " యమునా తీరం... "

19, నవంబర్ 2014, బుధవారం

కళ్ళు విప్పి చూడు నేస్తం...

కళ్ళు విప్పి చూడు నేస్తం
మూసిన ముంగిళ్ళు దాటి చూడు నేస్తం
మనసు వాకిళ్ళు తెరచి చూడు నేస్తం
హృదయపు లోగిళ్ళు తరచి చూడు నేస్తం

ఒక అతీతస్వర్గం దిగుతోంది నీకోసం
ఒక అమేయ రోచిస్సు ఉద్భవిస్తోంది నీకోసం
ఒక అద్భుతలోకం వేచింది నీకోసం
ఒక అమానుష తేజం నిలిచింది నీకోసం

విశ్వప్రభుని వేడుకుంటూ నీవు రాల్చిన ప్రతి కన్నీటిచుక్కా
ఆ స్వర్గానికి ఒక్కొక్క మెట్టుగా మారింది
బీటలు వారిన నిరాశలో నీవు చేసిన ప్రతి నిట్టూర్పూ
ఈ ఎడారిలో ఒక చెట్టును చిగురింప జేసింది

వేదనలో నీవు గడపిన నిశిరాత్రులన్నీ
ఉదయభానుని స్వర్ణకాంతులలో తడిసి మెరుస్తున్నాయి
మౌనరోదనలో గడచిన నీ జీవితక్షణాలన్నీ
మృదుమధుర సంగీతంతో నింపబడి పిలుస్తున్నాయి

అంతులేని కాళరాత్రి అంతమైపోయింది
శాంతి నిండిన కాంతిసరస్సు సొంతం కాబోతోంది
యుగయుగాల నిరీక్షణ ముగిసిపోయింది
వగపెరుగని వైచిత్రి ఎగసి లేవబోతోంది

నిరంతరం నీవన్వేషించిన ప్రేమస్వప్నం
సాకారమై నీ కళ్ళెదుట నిలిచింది చూడు
తరతరాలుగా నీవు వెదకిన మధురహృదయం
చకోరమై నిన్ను కలవరిస్తోంది చూడు

ప్రభుని ప్రేమసముద్రాన్ని తన హృదిలో నింపి
ఒక అదృశ్య ఆత్మ నీకోసం వేచి చూస్తోంది
చావెరుగని అమృత భాండాన్ని తన చేత ధరించి
ఒక వెలుగుపుంజం నీ తలుపు తడుతోంది

కళ్ళు విప్పి చూడు నేస్తం
కాంతిసముద్రం నీ ఎదురుగా ఉంది
ఒళ్ళు విరుచుకుని లే నేస్తం
కటిక చీకటి అంతమై చాలాసేపైంది...
read more " కళ్ళు విప్పి చూడు నేస్తం... "

17, నవంబర్ 2014, సోమవారం

కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫోటోలు-4

Creeping like a snake
Tai Chi Pose
1986 -Guntakal
30 ఏళ్ళ క్రితం గుంతకల్ లో నేను మార్షల్ ఆర్ట్స్ స్కూల్ నడిపే రోజుల్లో నాకు కాశీ అని ఒక శిష్యుడు ఉండేవాడు.మెయిన్ రోడ్డులోనే అతనికి ఒక ఫోటో స్టూడియో ఉండేది.

ఆ ఫోటో స్టూడియో వెనుకగా ఉన్న ఒక రూం లో ముఖ్యమైన శిష్యులతో నేను సీక్రెట్ ఫైటింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసేవాడిని.

జెనరల్ ప్రాక్టీస్ కోసం రైల్వే హైస్కూల్ గ్రౌండ్లో సాయంత్రం చీకటిపడిన తర్వాతనుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకూ అందరం చేరేవాళ్ళం.అందరిలో అభ్యాసం చెయ్యలేని కొన్ని సీక్రెట్ టెక్నిక్స్ ప్రాక్టీస్ కోసం ఫోటోస్టూడియో వెనుక ఉన్న రూంకి వారంలో రెండు మూడురోజులు చేరేవాళ్ళం.

ఆ స్టూడియోలో సరదాగా తీసినదే ఈ ఫోటో.

ఇది 'తాయ్ చి' విద్యలో "క్రీపింగ్ లైక్ ఎ స్నేక్" అనే టెక్నిక్.దీనినే 'స్నేక్ క్రీప్స్ లో' అని కూడా పిలుస్తారు.దీనికి చాలా ఫైటింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి.దీని అభ్యాసం వల్ల మంచి flexibility వస్తుంది.ఒళ్ళు ఎటు కావాలంటే అటు వంగుతుంది.దీనికి తోడుగా 'చక్రాసనం', కలారిపాయట్టు లోని 'మైప్పత్తు' అనే అభ్యాసాలు తోడైతే పాము మెలికలు తిరిగినట్లు శరీరాన్ని ఎటు కావాలంటే అటు వంచవచ్చు.

కాశీ నాకు పరిచయం కావడం కూడా విచిత్రంగా జరిగింది.అప్పట్లో ఆ ఊరిలో చంద్రావతమ్మ గారని ఒక మ్యూజిక్ టీచర్ ఉండేవారు.ఆమె సొంతూరు నంద్యాల.ఆమె గాత్రం చాలా అద్భుతంగా ఉండేది.అంతేగాక ఆమె వయోలిన్ అద్భుతంగా వాయించేవారు.వాయిద్యాలలో 'తబలా'  అంటే నాకు చాలా ఇష్టం.అందుకని తబలా నేర్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెదుకుతూ,ఒక సెకండ్ హ్యాండ్ తబలా ఆమె దగ్గర అమ్మకానికి ఉన్నదంటే ఆమె ఇల్లు వెదుక్కుంటూ వెళ్లాను.

గుంతకల్ లో అప్పట్లో ఏమీ దొరికేవి కావు.ఏదైనా కావాలంటే ఇటు కర్నూల్ గాని అటు బళ్ళారి గాని పోయి కొనుక్కోవాలి.అలా ఆమె నాకు పరిచయం అయ్యారు.మ్యూజిక్ షాపులో తబలా కొనాలంటే సరిపోయే డబ్బులు నా దగ్గర అప్పుడు లేవు.నా దగ్గర డబ్బులు లేకుంటే సర్దుకునేవాడిని గాని,నా స్టూడెంట్స్ దగ్గర ఏనాడూ ఫీజు తీసుకునేవాడిని కాదు.అప్పట్లో గుంతకల్ స్కూల్లో ఏభై మంది స్టూడెంట్స్ ఉండేవారు.

క్రమేణా మా అమ్మగారూ ఆవిడా మంచి స్నేహితులయ్యారు.సాయంత్రాలలో వాళ్ళిద్దరూ కలసి కూర్చుని త్యాగరాజ కృతులు అద్భుతంగా ఆలపించేవారు. నేనేమో నా వచ్చీరాని తబలా బిట్స్ తో సహకరించేవాడిని.తబలా అపశ్రుతులు దొర్లినా పాపం వాళ్ళిద్దరూ ఏమీ అనేవారు కారు.ఆమె దగ్గర ఒక తబలాతో బాటు ఒక హార్మోనియం కూడా అమ్మకానికి దొరికింది.అప్పట్లో కొన్నాళ్ళు తబలా వాయించడం నేర్చుకున్నాను.ఆ తర్వాత ఆ ఊరు ఒదిలి వచ్చేటప్పుడు అవి రెండూ ఆమెకే ఇచ్చేశాను.

వాళ్ళ ఇంటిలోనే నాకు కాశీ పరిచయం అయ్యాడు.

అతనికి మార్షల్ఆర్ట్స్ నేర్చుకోవాలని చాలా కుతూహలం ఉండేది.నేను స్కూల్ నడుపుతున్నానని తెలిసి అందులో చేరాడు.అతని ప్రెండ్ తిరుమలేష్ అని ఒకతను ఉండేవాడు.అతనిది పాత గుంతకల్.అతను కర్రసాములో మంచి స్పెషలిస్ట్.అతనికి నేను మార్షల్ ఆర్ట్స్ నేర్పేటట్లు,అతను నాకు కర్రసాము నేర్పేటట్లు ఒప్పందం కుదిరింది.

ఆ విధంగా సెకండ్ హ్యాండ్ తబలా కోసం వెదుకులాట,నాకొక మంచి మ్యూజిక్ టీచర్ని ఫేమిలీ ఫ్రెండ్ గా పరిచయం చెయ్యడమే గాక,ఒక మంచి శిష్యుడినిచ్చింది.అంతేగాక కర్రసాము నేర్చుకునే అవకాశాన్ని కూడా కలిగించింది.

ఆ విధంగా కాశీ ఫోటో స్టూడియో మాకందరికీ ఒక అడ్డాగా మారింది.ఒకరోజున ప్రాక్టీస్ సెషన్ అయిన తర్వాత అక్కడ తీసినదే ఈ ఫోటో.
read more " కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫోటోలు-4 "

15, నవంబర్ 2014, శనివారం

కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫోటోలు -3

మరికొన్ని పాత ఫోటోలు ఇక్కడ ఇస్తున్నాను.

Lateral Swing Kick
1985
Guntakal
"లేటరల్ స్వింగ్ కిక్" అనే ఈ కిక్ నా ఫేవరేట్ కిక్స్ లో ఒకటి.ఇది కూడా ప్రమాదకరమైనదే.ఈ కిక్ ఏ వైపునుంచి వస్తున్నదో ప్రత్యర్ధికి అర్ధం కాకుండా మీద పడిపోతుంది. అందుకని దీనిని తప్పుకోవడం, చాలా అలర్ట్ గా ఉంటే తప్ప,చాలా కష్టం.

మార్షల్ ఆర్ట్స్ లో నేను నేర్పే  సిస్టం చాలా ప్రమాదకరమైనది.ఇందులో ఎక్కువ సేపు ఫైటింగ్ ఉండదు.ఒకటి రెండు దెబ్బలలోనే మనిషిని స్పృహ తప్పేటట్లు చెయ్యడం నా విధానం.Pressure points and Nerve centers మీద సూటిగా బలంగా తగిలే దెబ్బలు కొట్టడం ఇందులో ముఖ్య సూత్రం.

Block the punch and 
Strike the windpipe with Knuckles
1985
Guntakal



మీదకొస్తున్న పంచ్ ను బ్లాక్ చేస్తూ,ప్రత్యర్ధి విండ్ పైప్ ను బలమైన నకిల్ పంచ్ తో పగలగొట్టడం ఈ టెక్నిక్ లో చూడవచ్చు.ఇది చాలా దారుణమైన బాధను కలిగిస్తుంది. ఒక్కొక్కసారి స్పాట్ లో ప్రాణాలే పోవచ్చు.
    

Opening of our new School at Guntakal
2000

Near our School
1990
Guntakal





2000 సంవత్సరంలో గుంతకల్ స్కూల్ ను కొత్త హంగులతో పున: ప్రారంభించినప్పుడు తీసిన ఫోటో.ఇందులో నా ముఖ్య శిష్యులైన కిషోర్,సురేష్ లను చూడవచ్చు.వీరిలో కిషోర్ కిక్స్ స్పెషలిస్ట్.సురేష్ పంచెస్ లో మంచి ఎక్స్పర్ట్.ఆ రోజులలో వీళ్ళిద్దరూ భయంకరమైన ఫైటర్స్.పదిమందిని ఉత్తచేతులతో ఎదుర్కొని ఓడించడం అంటే వీరికి మంచినీళ్ళు త్రాగినంత సులభం.




1990 లో గుంతకల్ స్కూల్ దగ్గర తీసిన ఫోటో.
read more " కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫోటోలు -3 "

13, నవంబర్ 2014, గురువారం

కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫోటోలు-2

మరికొన్ని పాతఫోటోలను నా శిష్యులూ అభిమానుల కోసం ఇక్కడ ఇస్తున్నాను.

Powerful High Side Kick
(1985)
Guntakal
1985 ప్రాంతాలలో నేను హై కిక్స్ బాగా అభ్యాసం చేసేవాడిని.మనిషికి చేతులకంటే కాళ్ళు ఎక్కువ బలంగా ఉంటాయి.కనుక చేతులతో నాలుగు దెబ్బల కంటే కాలితో ఒక మంచి కిక్ చాలా ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుంది.తైక్వాన్ డో సిద్దాంతం ఇదే.

చేతులు వెనక్కు కట్టుకుని,కాళ్ళు మాత్రమే వాడుతూ-నాలుగు వైపులనుంచీ కమ్ముకునే నలుగురు ప్రత్యర్ధులను-రకరకాలైన కిక్స్ తో ఎదుర్కొని మట్టి కరిపించే స్పెషల్ టెక్నిక్ నా ఫేవరేట్ టెక్నిక్.

హై కిక్ చేస్తూ కాలి బొటనవేలితో ప్రత్యర్ధి కణతమీద బలమైన దెబ్బ కొట్టడం ద్వారా ఒకేఒక్క కిక్ తో ప్రత్యర్ధిని నేలకు పడగొట్టే టెక్నిక్ నేను కేరళలో నేర్చుకున్నాను.ఇది చాలా ప్రమాదకరమైన టెక్నిక్. దీనిలో ఒకేఒక్క కిక్ తో మనిషి ప్రాణాన్ని క్షణంలో సులువుగా తీసేయవచ్చు.

ఒకసారి ప్రాక్టీస్ సందర్భంలో పొరపాటున ఈ కిక్ తగిలి నా స్టూడెంట్ ఒకతను స్పృహతప్పి కుప్ప కూలిపోయాడు.మాకు చెమటలు పట్టేశాయి. హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పిస్తే అదృష్టం బాగుండి అతను బ్రతికి బయట పడ్డాడు.ఆ తర్వాత పంచింగ్ బాగ్స్ మీదేగాని మనుషుల మీద డైరెక్ట్ గా ఈ టెక్నిక్స్ ను అభ్యాసం చెయ్యడం మానేశాను.

Golden Rooster Standing on One leg
(Tai Chi Pose)
1985-Guntakal
'గోల్డెన్ రూస్టర్ స్టాండింగ్ ఆన్ ఒన్ లెగ్' అనేది తాయ్ చీ అభ్యాసాలలో ఒకటి.దీనికి అనేక అప్లికేషన్స్ ఉన్నాయి.యాంగ్ తాయ్ చీ ఫాం లోనూ,చెన్ తాయ్ చీ ఫాంలోనూ కూడా ఇది వస్తుంది.దీనివల్ల స్టాన్స్ లో మంచి బేలెన్స్ వస్తుంది. కాళ్ళలో బలం పెరుగుతుంది. క్రేన్ కుంగ్ ఫూ లో కూడా ఈ అభ్యాసం ఉన్నది.

పైకెత్తిన కాలు,అఫెన్స్,డిఫెన్స్ లకు సిద్ధంగా ఉన్న రెండు చేతులతో రకరకాల బలమైన దెబ్బలు కొట్టడం ద్వారా దగ్గరకొచ్చిన ప్రత్యర్ధిని క్షణాలలో మట్టి కరిపించవచ్చు.
read more " కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫోటోలు-2 "

ఊహించినవి-జరిగినవి-28

శనీశ్వరుని వృశ్చికరాశి ప్రవేశ ఫలితాలను ఊహిస్తూ వ్రాసిన రెండు విషయాలు నిజమయ్యాయి.

ఒకటి

ముస్లిం ఉగ్రవాదం పెరుగుతుంది- అని వ్రాశాను.

ఆ తర్వాత కొన్ని రోజులకే వాఘా బార్డర్ సంఘటన జరిగింది.మన ప్రదానమంత్రికే డైరెక్ట్ గా హెచ్చరిక పంపేంత స్థాయిలో రెచ్చిపోయి వాళ్ళు తెగబడుతున్నారు.ఉగ్రవాదం పెరుగుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రెండు

స్త్రీలలో గైనిక్ సమస్యలు ఎక్కువౌతాయి-అని సూచనాప్రాయంగా చెప్పాను.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలై అంతమంది చనిపోవడమూ అంతమంది చావుబతుకుల్లో ఉండటమూ నిన్న విన్నాం.ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది పెద్ద ఆపరేషన్ కానేకాదు.ఒక సర్జన్ అనేవాడు దీనిని అతి తేలికగా చెయ్యగలడు.పైగా గత 30 ఏళ్ళుగా ఈ రకమైన ఆపరేషన్లు ఈ స్థాయిలో ఫెయిలైన దాఖలాలు ఎక్కడా లేవు.మరి ఇప్పుడే శనీశ్వరుడు వృశ్చికరాశిలోకి మారిన వెంటనే మాత్రమే ఇవి ఎందుకు జరుగుతున్నాయి?

మానవజీవితం మీద గ్రహాల పాత్ర లేదంటారా?

కళ్ళు తెరిచి చూచే అలవాటుంటే ఉన్నదని మీరే ఒప్పుకోవలసి వస్తుంది.

ఆలోచించండి.
read more " ఊహించినవి-జరిగినవి-28 "

11, నవంబర్ 2014, మంగళవారం

కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫోటోలు-1

పాత ఫోటోలను వెదుకుతుంటే రెండేళ్ళక్రితం తీసిన కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫోటోలు కనిపించాయి.

రమేష్,గిరిధర్ నా దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి రెండేళ్ళ క్రితం వచ్చారు.కానీ అన్ని ఆరంభ శూరత్వాలలాగా వారిది కూడా అయింది.ఆ తర్వాత వారికి రావడమూ కుదరలేదు.నాకేమో నేర్పడమూ కుదరలేదు. నేర్పడానికి నేను సిద్ధంగా ఉన్నా,వారికి తీరిక లేకుంటే నేనేం చెయ్యగలను?ఒక దొంగ గురువు దగ్గర రమేష్ కొన్నేళ్ళు కష్టపడి కుంగ్ ఫూ నేర్చుకున్నాడు.కానీ అది అసలైన కుంగ్ ఫూ కాదు.కుంగ్ ఫూ స్కూల్స్ లో ఎక్కువ శాతం బోగస్ స్కూళ్ళే.స్టూడెంట్స్ యొక్క తెలియనితనాన్ని ఆసరాగా తీసుకుని ఆయా గురువులు నకిలీ కుంగ్ ఫూ నేర్పిస్తూ అదే నిజమని భ్రమింపచేస్తూ వేలకువేలు ఫీజులు గుంజుతున్నారు.అలాంటి దొంగ గురువులు నాకు చాలామంది తెలుసు.కొన్ని వేలమంది స్టూడెంట్స్ ఇలా మోసపోతున్నారు.

ఒక విద్యను నేర్చుకోవాలంటే ఆరిపోని తపన లోలోపల నిరంతరం జ్వలిస్తూ ఉండాలి.ఎప్పుడో మనకు గుర్తొచ్చినపుడు కాసేపు మాట్లాడు కోవడం,కొంచం అభ్యాసం చెయ్యడం, ఆ తర్వాత మర్చిపోవడం,మళ్ళీ మన పనులన్నీ అయిపోయి ఏమీ తోచనపుడు ఇవి గుర్తురావడం- ఇలా చేస్తే ఏ విద్యా పట్టుపడదు. అందులోనూ మార్షల్ ఆర్ట్స్ వంటి కష్టమైన విద్యలు అసలే రావు.అలాంటి విద్యలు పట్టుబడాలంటే ప్రతిరోజూ అభ్యాసం తప్పనిసరి.


నాకు ఇరవై ఏళ్ళ వయస్సు నుంచీ నేను మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నాను. ఇప్పటికి కొన్ని వందలమందికి శిక్షణనిచ్చాను.కానీ విద్యను శుద్ధంగా చివరివరకూ నేర్చుకున్న వారు ఇంతవరకూ ఒక్కరు కూడా లేరు.ప్రస్తుతం నాకు ఏభై ఏళ్ళు వచ్చాయి.కానీ నేటికీ నా వయసులో సగం వయసున్న ఒక పాతికేళ్ళ యువకుడిని కూడా తేలికగా ఎదుర్కొని కొన్ని సెకన్లలో మట్టి కరిపించగలను. నిరంతర అభ్యాసం వల్ల అలాంటి ఫిట్ నెస్ వస్తుంది.

స్టూడెంట్స్ అనేవారు ముందు ఎంతో ఉత్సాహంతో ఊపుతో వచ్చి అడుగుతారు.మన సమయం వృధా చేసుకొని వారికి నేర్పడం మొదలు పెడతాము.కానీ వారిలో చిత్తశుద్ధి ఉండదు.కొన్ని నెలలు పోయాక అభ్యాసం మానేస్తారు.కొంతమంది ఒకటి రెండేళ్ళు నేర్చుకుని మానేస్తారు.అలాచేస్తే వీరవిద్యలు పట్టుపడవు.నేను ముప్పై ఏళ్ళ నుంచీ అభ్యాసం మానకుండా చేస్తున్నాను.ఈరోజుకీ చేస్తూనే ఉన్నాను.ఇప్పుడు కూడా ఉదయమే లేచి డాబామీద "తాయ్ చి యాంగ్ ఫాం" ప్రాక్టీస్ చేసి వచ్చి ఇది వ్రాస్తున్నాను.నా దగ్గర ఏదైనా నేర్చుకోవాలంటే జీవితాన్ని దానికి అంకితం చెయ్యగల పట్టుదలా దీక్షా ఉన్నవాళ్లకే అది సాధ్యమౌతుంది.లేకుంటే వాళ్ళకూ నాకూ సమయం వృధా కావడం తప్ప ఉపయోగం లేదు.అవి ఆధ్యాత్మిక సాధనా రహస్యాలైనా సరే,ఇతర విద్యలైనా సరే.


ఉబుసుపోని కబుర్లలో కాలక్షేపం చేసేవారికి కబుర్లే మిగులుతాయి.దీక్షగా సాధన చేసేవారికే కోరుకున్నది దక్కుతుంది.
read more " కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫోటోలు-1 "

9, నవంబర్ 2014, ఆదివారం

నాలో కలసిపో...

'నా హృదయం ఒక బండరాయి' - అన్నాను.

'దానిక్రింద ఉన్న అగాథ జలప్రవాహం నీకు తెలియదు'-అన్నాడు.

'ప్రేమంటే నాకు తెలియదు'-అన్నాను.

'ప్రేమ లేకపోతే నీవు లేవు'- అన్నాడు.

'నాకు కనిపించడం లేదెందుకు?' అన్నాను.

'కళ్ళు తెరువు.కనిపిస్తాయి' అన్నాడు.

'నాకు అనిపించడం లేదెందుకు?' అన్నాను.

'హృదయపు వాకిలి తెరువు.అనిపిస్తుంది'- అన్నాడు.

'నీవు చెప్పేది అబద్దమా నిజమా?' అనుమానంతో అడిగాను.

'అబద్ధం కూడా నిజమే' అంటూ నవ్వాడు.

'రాలేను' అన్నాను.

'రానక్కరలేదు' అన్నాడు.

'బంధాలు వదలడం లేదు' అన్నాను.

'అవి నిన్ను వదలడం లేదా?వాటిని నీవు వదలడం లేదా?' అడిగాడు.

'నేనెవర్ని?' అడిగాను.

'నేనే నీవు'-అన్నాడు.

'ఎలా తెలుసుకోవడం?' అడిగాను.

'నాలో కలసిపో.'అన్నాడు.
read more " నాలో కలసిపో... "

8, నవంబర్ 2014, శనివారం

మెరిసే మెరుపుల్లో...

వర్షాకాలపు ఒక రోజున
హృదయపు లోతుల్లోంచి పొంగిన కవిత
భావోద్వేగంలో నుంచి బయల్పడిన కవిత
గుండె గదుల్లో సమాధి అయిన కవిత
ఇన్నాళ్ళకు మళ్ళీ వెలుగు చూసింది
------------------------------------------------
కారణాలేమైతేనేం?

ప్రతి కన్నీరూ ఒక కాంతిసీమకే దారి తీస్తుంది
ప్రతి మరణమూ ఒక జీవనాన్నే చేరువ చేస్తుంది

ప్రతి వేదనా భరిత హృదయమూ
ఒక అమేయానందాన్నే అలవోకగా అందుకుంటుంది

ప్రతి సుదీర్ఘ నిశీధపయనమూ
ఆకాశపుటంచుల వెలుగులలోకే చేరుకుంటుంది 
-----------------------------------------
ఇక చదవండి
-----------------------------------------

ఒకటే చీకటి
పొద్దుట్నించీ ముసురు
ఒంటరిదైపోయిన
నా పిచ్చిహృదయంలా...

ఆగని వాన 
మౌనంగా కురుస్తోంది
మూగగా రోదించే  
నా ప్రేమప్రవాహంలా...

ఒంటరిగా వేచిఉన్నా 
ఏనాడూ రాని నీ రాకకోసం
వాకిటనే నిలిచి ఉన్నా 
తిరిగి చూడని నీ చూపుకోసం 

దిగంతాల లోయల్లోకి చూస్తున్నా 

కనిపించని నీ జాడలకోసం
అనంతాల లోతుల్లోన వెతుకుతున్నా 
నీ జ్ఞాపకాల నీడలకోసం 
  
వానల్లో తడుస్తున్నా 
నీకోసం ఎదురుచూస్తూ 
కోనల్లో తిరుగుతున్నా 
నీ జ్ఞాపకాల బరువు మోస్తూ 

ప్రేమోన్మాదంతో 
మత్తెక్కిన నా హృదిలో 
సమస్త ప్రకృతీ నిన్నే 
దర్శింప చేస్తున్నది  

భావోద్వేగంతో
మైమరచిన నాలో
లోకమంతా నిన్నే  
స్ఫురింప చేస్తున్నది 

పిలిచే నేల పిలుపుల్లో చూచా
నీ అనంత మౌన నిరీక్షణని
కదిలిన ఆకాశపుటంచుల్లో చూచా 
నను కోరే నీ హృదయ సంసిద్ధతని 

ముసిరిన చీకట్లలో చూచా 
నిను చుట్టిన అంతులేని ఆవేదనని
నల్లని పెనుమబ్బుల్లో చూచా 
చెప్పలేని నీ మూగభావాల  బరువుని  

ఉక్కపోతలో చూచా 
ఉక్కిరిబిక్కిరైన  నీ లేతమనసుని
ఝుమ్మంటూ మూగే ఉసిళ్ళలో చూచా 
నిన్ను ముంచెత్తిన ఎన్నో సందేహాలను

వేగంగా సాగే మేఘాలలో చూచా
నను చేరే నీ మూగసందేశాలను
మెరిసే మెరుపుల్లో చూచా
నీ సుమధుర దరహాసాలను

సూదుల చినుకుల్లో కన్నా
ఓపలేని నీ మోహ సంవేదనలను
ఉరిమే ఉరుముల్లో విన్నా
నీ గుండెల విరహోన్మత్త నిట్టూర్పులను

నను వణికించే చలి ఊహల్లో నిలిపింది
నీ సైపలేని ప్రణయోల్లాసాన్ని
నాపై జారుతున్న గత్తరి చినుకు
తట్టి లేపింది ఒకనాటి నీ మెత్తని స్పర్శను

ఊగే చెట్ల ఉద్వేగంలో
తిలకించా నీ హృదయానందఝరిని 
రాలే పూలల్లో చూచా
పులకించిన నీ మేని గగుర్పాటుని 

తడిపే కుండపోతల్లో వీక్షించా
నిను ముంచెత్తిన మధురానుభవాన్ని 
పులకిస్తున్న పుడమిలో దర్శించా
చెప్పలేని నీ మౌన పరవశాన్ని

కమ్మని మట్టి వాసనలో ఆఘ్రాణించా
కనిపించని నీ ప్రాణ పరిమళాన్ని 
తెరిపిచ్చిన వెలుతురులో తెలుసుకున్నా
తేటపడిన నీ పిచ్చి మనసుని

వెలిసిన ఆకాశంలో చూచా
అవధిలేని నీ నిర్మలాంతరంగాన్ని
వెలిగే భానునిలో వీక్షించా 
అంతులేని నీ మహోజ్జ్వల ఆత్మజ్యోతిని...
read more " మెరిసే మెరుపుల్లో... "

7, నవంబర్ 2014, శుక్రవారం

మా స్వామి మిమ్మల్ని రమ్మంటున్నారు

నెట్ లోకంలో నాకు అభిమానులు ఎందఱో ఉన్నట్లే,విమర్శకులూ ఉన్నారని నాకెప్పుడో తెలుసు.వాళ్ళను పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను. ఎందుకనగా-మన దారిన మనం పోతుంటే అవి అలా అరుస్తూనే ఉంటాయని నాకు తెలుసు.

అసలు నా పోస్ట్ లను అభిమానుల కంటే విమర్శకులే ఎక్కువ క్షుణ్ణంగా చదువుతారని కూడా నాకు తెలుసు.పాపం వాళ్లకు నామీద ఏదో అసూయ ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది.ఒక మనిషిలో ఇన్ని టాలెంట్స్ ఎలా సాధ్యం?మనలో ఒక్కటి కూడా లేదే? అనే వాళ్ళ బాధను నేనర్ధం చేసుకోగలను.


విమర్శతో పేరు సంపాదించాలనుకునే వారికి ఎలాంటి పేరు వస్తుందో రామాయణ కల్పవృక్షాన్నీ,రామాయణ విషవృక్షాన్నీ రెంటినీ చూస్తే అర్ధమౌతుంది.రెంటికీ పేరొచ్చింది.ఏవి ఎలాంటి పేర్లో ఒక్కసారి గమనిస్తేనన్నా నా విమర్శకుల అకారణ అసూయ చల్లారుతుందేమో అని నా చిన్ని ఆశ. అప్పటికీ ఆ సలుపు ఆగకపోతే అది వారి ఖర్మ.

'చేతనైనవాడిని చూస్తే చేతగానివాడికి ఏడుపు సహజమే'- అని సామెత ఉన్నది.దానిని నేనొప్పుకోను.ఏడుపనేది సహజమెలా అవుతుంది?అందులోనూ అసూయతో కూడిన ఏడుపు?అది పూర్తిగా అసహజమైనదే. శనీశ్వరుని రాశిమార్పు ప్రభావమే ఈ అసహజ చేష్టకూడా.



లోపల్లోపల ఏడిస్తే ఏడిచారు.ఆ ఏడుపును సిగ్గువిడిచి మాటమాటకీ బయటపెట్టుకోవడమే అతిపెద్ద జుగుప్సాకరమైన పనులలో ఒకపని.ఇది కూడా శనీశ్వరుని రాశిమార్పు ప్రభావమే.ఇలాంటివి జరుగుతాయని కూడా ముందే వ్రాశాను.



నాగురించి ఎవరో ఎక్కడో ఏదో వ్రాశారని ఒక ఫ్రెండ్ నిన్న ఫోన్లో చెప్పింది.

"పోనీలే ఆ రకంగానైనా వాళ్ళు నన్ను నిరంతరమూ ధ్యానిస్తున్నారు.అదే చివరికి వాళ్లకు మోక్షాన్నిస్తుంది,అన్ని భక్తులలోకీ వైరభక్తి శ్రేష్ఠమైనది. అలాంటి భక్తులను నేనెప్పుడూ వదిలిపెట్టను.Let them continue." అని చెప్పాను.

  

ఇకపోతే నన్ను ఉద్ధరించాలనుకునే ఆధ్యాత్మికవేత్తలు ఇంకొందరున్నారు. నేను చాలా తప్పుదారిలో ఉన్నానని వారి మహత్తరమైన అభిప్రాయం. అందుకని నన్ను సరియైన దారిలో పెట్టాలని వారు ఉచితవకాల్తా తీసుకుని ముందుకొస్తూ ఉంటారు.వీళ్ళ బాధేమిటో కూడా నాకు తెలుసు.కానీ చెబితే బాగుండదు.అందుకే చెప్పను.

వీరిలో ఒకాయన మొన్న ఒక మెయిల్ ఇచ్చాడు.

'మాఊరి దగ్గర ఒక స్వామీజీ ఉన్నారు.ఆయనకు మీగురించి చెప్పాను.మీ బ్లాగు వ్యాసాలు కొన్ని ప్రింట్ తీసి ఆయనకు ఇచ్చాను.ఆయన చదివారు. (అర్ధమైనవో లేదో మరి?).మిమ్మల్ని వచ్చి ఆయన దర్శనం చేసుకోమని చెప్పమన్నారు. మీరు ఓకే అంటే మిమ్మల్ని ఆయన దగ్గరకు తీసుకెళతాను.' అని ఆ మెయిల్ సారాంశం.

సామాన్యంగా ఇలాంటి చెత్త మెయిల్స్ నేను చదవను.జవాబివ్వను.కానీ ఆరోజున ఎందుకో చదివాను.పాపం ఎవడో అక్కుపక్షి చాలా బాధల్లో ఉన్నాడు లాగుంది అని జాలి కలిగి రిప్లై ఇచ్చాను.

'మీరు మీ స్వామి దగ్గరకు తరచూ వెళుతూ ఉంటారా?' అనడిగాను.

'అవును.నాకు తీరిక దొరికినప్పుడల్లా వెళుతుంటాను.ఆయన పాదాల దగ్గర కూచుంటే చాలా శాంతిగా ఉంటుంది.మీరు ఎప్పుడు వస్తున్నారు?' అని మళ్ళీ మెయిల్ ఇచ్చాడు.

'ప్రస్తుతం నాకు తీరిక లేదు.ఒక పనిచెయ్యండి.ఊరకే ఆయన పాదాల దగ్గర కూచుంటే లాభం లేదు.ముందు మీరాయన పాదాలను గట్టిగా పట్టుకోండి.ఆ తర్వాత మీరూ మీ స్వామీజీ ఇద్దరూ కలసి వచ్చి నా పాదాలు గట్టిగా పట్టుకోండి.అప్పుడు మీ ఇద్దరికీ ఉత్త శాంతినేం ఖర్మ?డైరెక్ట్ గా మోక్షాన్నే ప్రసాదిస్తాను.మీరెప్పుడు వస్తున్నారో ముందుగా చెబితే నా పాదాలకు సాక్స్ వేసుకుని రెడీగా ఉంటాను.' అని జవాబిచ్చాను.

  

నన్ను ఉద్ధరించాలనుకునే ఆయన ప్రయత్నానికి ఆ దెబ్బతో పాపం పురిట్లోనే సంధి కొట్టింది.మళ్ళీ అతనివద్ద నుంచి జవాబు లేదు.

ఏం చేస్తాం?లోకంలో అసూయ అనేక రకాలు.ఇలాంటి వాళ్ళను చూచి మనసారా నవ్వుకోవడమే నేను చెయ్యగలిగిన పని.



read more " మా స్వామి మిమ్మల్ని రమ్మంటున్నారు "