అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

26, నవంబర్ 2015, గురువారం

నేనే ధనుర్దాసునైతే....

నా చిన్నప్పుడు ధనుర్దాసు కధ చదివాను.

అతనొక పేరుగాంచిన మల్లయోధుడు. మొత్తం తమిళదేశం అంతటిలోకీ అంతగొప్ప యోధుడు లేడు.అదే తమిళదేశంలో పొన్నాచ్చి అనే ఒక మంచి అందగత్తె ఉండేది.ఆమె మేనిఛాయ మేలిమి బంగారురంగుతో పోటీపడుతూ ఉండేది.అందుకే ఆమెకు పొన్నాచ్చి అనే పేరు వచ్చింది.తమిళంలో పొన్ను అంటే బంగారం అని కదా అర్ధం.ఆమె గొప్ప సౌందర్యవతేగాని అంతకంటే ఆమె కళ్ళు చాలా అందమైనవి. ఆమె కళ్ళవైపు ఎవరైనా చూస్తె తమ కళ్ళు తిప్పుకోలేకపోయేవారు.అంత అందమైన నేత్రాలు ఆమెకుండేవి.ధనుర్దాసు ఆమెను అమితంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఆమె అందాన్ని అతను అమితంగా ఆరాధించేవాడు.ఆమెను అమితంగా ప్రేమించేవాడు.అతను గొప్ప మల్లయోదుడే గాక గొప్ప సౌందర్యారాధకుడు కూడా.

ఒకరోజున ధనుర్దాసూ పొన్నాచ్చి శ్రీరంగంలో రంగనాధస్వామి దర్శనానికి వచ్చారు.తిరువీధిలో పొన్నాచ్చి  గుడివైపు నడుస్తూ వస్తుంటే, ధనుర్దాసు ఆమెముందు నిలబడి ఆమె కళ్ళను చూచుకుంటూ ఆమెకు ఎండ తగులకుండా గొడుగుపడుతూ గుడివైపు వెనక్కు నడుస్తున్నాడు.తన శిష్యులతో అదేవీధిలో నడుస్తూ పోతున్న రామానుజస్వామి ఈ విచిత్రాన్ని గమనించారు.

"ఏమిటీ వింతప్రవర్తన?" అని ధనుర్దాసును ప్రశ్నించగా - 'ఇంత అందమైన కన్నులను చూడకుండా ఒక్క క్షణంకూడా తాను ఉండలేనని అందుకే ఇలా వెనక్కు నడుస్తున్నానని'- అతను జవాబిస్తాడు.నీ ప్రేయసి కన్నుల కంటే అందమైన కన్నులను చూపిస్తాను రమ్మని దేవాలయంలోకి తీసుకెళ్ళి స్వామి కన్నులను ధనుర్దాసుకు చూపిస్తారు రామానుజస్వామి.భగవంతుని దివ్యనేత్రాలను చూచిన ధనుర్దాసు ప్రేయసి కన్నుల పైన మోహం వీడి భక్తునిగా మారుతాడు.అతనూ పొన్నాచ్చీ రామానుజస్వామి శిష్యులౌతారు. ఇది నిజంగా జరిగిన కధ అని వైష్ణవులు చెబుతారు.

ఈ గాధను చదివినప్పుడు ఈ వ్యవహారమంతా నాకేమీ నచ్చలేదు.సృష్టి అంతా భగవంతుని చిద్విలాసమే అని భావించే రామానుజులు ధనుర్దాసుకు ఆ విధంగా ఎలా బోధించారో నాకైతే అర్ధంకాలేదు.ఈ కధలో అతిశయోక్తులు చాలా ఉన్నాయని నా నమ్మకం.సమాజంలోని అన్ని వర్గాలనూ రామానుజులు చేరదీసి వారికి వైష్ణవ మంత్రోపదేశం ఇచ్చి తన శిష్యులుగా మార్చారు.అలాంటివారిలో వీరిద్దరు కూడా ఒకరని నా వాస్తవికభావన. అంతేగాని ధనుర్దాసుకు దైవంయొక్క నిజమైన నేత్రాలను రామానుజులు సరాసరి దర్శనం చేయించారంటే నేను నమ్మలేను.అదంత తేలికైన విషయం ఏమీ కాదు.అప్పటికప్పుడు అలా చెయ్యడం సాధ్యమూ కాదు.

మల్లయోధులు సామాన్యంగా శూద్రకులాలలో ఉంటారు.నైష్టికులు తాకను కూడా తాకకుండా దూరంగా ఉంచే అలాంటివారిని చెయ్యిపట్టుకుని సరాసరి గర్భగుడిలోకి తీసుకెళ్ళి రంగనాధస్వామి నేత్రాలను అతిదగ్గరగా రామానుజులు చూపించి ఉండవచ్చు.తన శిష్యులుగా స్వీకరించి వారికి వైష్ణవదీక్షను ఇచ్చి ఉండవచ్చు.రామానుజుల విశాల దృక్పధానికి ఇది సరిగానే సరిపోతున్నది. ఆ కృతజ్ఞతతో ఆ భార్యాభర్తలు ఆయన ఆశ్రమంలో స్థిరనివాసం ఏర్పరచుకొని ఆయన శిష్యులుగా మారి ఉండవచ్చు.ఇది వాస్తవంగా జరిగిన కధ.అయితే సామాన్యంగానే ప్రతిదానికీ 'అతి' ఎక్కువగా చేసే వైష్ణవభక్తులు దీనికి చిలవలు పలవలుగా కధను అతికి అతిశయోక్తులు చేర్చి ఉండవచ్చు.

అయితే, పొన్నాచ్చి అందాన్ని నేను శంకించడం లేదు. అలాంటి అందగత్తెలు ఉండటం అసంభవం ఏమీకాదు.నేడు కూడా అలాంటి వాళ్ళున్నారు. ధనుర్దాసు వంటి సౌందర్యారాధకులూ నేడున్నారు.అతన్నీ నేను శంకించడం లేదు.కమలాక్షుని దివ్యనేత్రాలను ధనుర్దాసుకు రామానుజులు అప్పటికప్పుడు దర్శనం చేయించారన్న విషయాన్ని మాత్రమే నేను నమ్మడం లేదు.

సన్యాసజీవితానికి ముందు రామానుజుల సంసారజీవితం అంత సుఖవంతంగా ఏమీ సాగలేదు.ఆయన భార్య మహాగర్విష్టీ అహంభావీ మాత్రమేగాక ఈయనంటే ఆమెకు చాలా చిన్నచూపు ఉండేది.రామానుజుల సంసారంలో 'ప్రేమ' అనేది లేదు.అది మామూలు సాంప్రదాయబద్ధమైన సంసారమేగాని ప్రేమతో నిండిన సంసారం కాదు.అందుకే ఆయనకు సతియొక్క అనురాగపూరితమైన ప్రేమ అంటే ఏమిటో తెలియదని నా నమ్మకం.అందుకే మధురప్రేమికుడైన ధనుర్దాసును గుళ్ళోకి తీసుకెళ్ళి' - ఆ కన్నులలో ఏముందిరా పిచ్చివాడా ఈ కన్నులు చూడు' - అంటూ విగ్రహాన్ని చూపించి ఉండవచ్చు.తనకు తెలియనిది ఎదుటివారిలో కనిపిస్తే అర్ధంచేసుకోలేకపోవడం సామాన్యమే కదా !! పెద్ద పెద్ద గురువులు కూడా దీనికి అతీతులేమీ కారు.

రామానుజులకు రాతివిగ్రహంలో సౌందర్యం కనిపించింది.ధనుర్దాసుకు తన ప్రేయసి సజీవవిగ్రహంలోనే అది కనిపించింది.అందులో తప్పేముంది?అతన్ని తనలా మారమని ఆయన ఆదేశించడం ఏమిటో నాకైతే ఇప్పటికీ ఎంత గింజుకున్నా  అర్ధం కాదు.

ఏదేమైనప్పటికీ -  నా కవితాధోరణికి ఈ కధ కొంత ప్రేరకంగా మారింది."నేనే ధనుర్దాసునైతే" అన్న ఒక కవితను సృష్టింపజేసింది.పనిలో పనిగా రామదాసునూ దేవదాసునూ కూడా కవితలోకి లాక్కొచ్చాను.

చదవండి మరి.

నేనే ధనుర్దాసునైతే
రామానుజుల సన్యాసానికే చరమగీతం పాడించి
ఆయనకే ప్రేమోపదేశం గావించేవాణ్ని
ప్రియురాలి మనోహర నేత్రాలలో లేని సౌందర్యం
దేవుని విగ్రహంలో ఎక్కడుంది? (1)

నేనే ధనుర్దాసునైతే
నా గురువుకే నవ్యదీక్ష నిచ్చి
శుద్ధప్రేమ మంత్రాన్ని ఉపదేశించేవాణ్ని
ప్రేమపొంగే నయనాలలో లేని దివ్యత్వం
రాతి చెక్కడంలో ఎక్కడుంది? (2)

నేనే ధనుర్దాసునైతే
జగద్గురువులకే ప్రేమవిలువను బోధించి
నిజమైన ఆరాధనను నేర్పించేవాణ్ని
అలవిగాని విరహంలో లేని ఆనందం
ఆధ్యాత్మిక ఆచారాలలో ఎక్కడుంది? (3)

నేనే ధనుర్దాసునైతే
అసత్యబోధలు గావించే సద్గురువులందర్నీ
నిత్యజీవితపు అమరత్వంలోకి ఈడ్చుకొచ్చేవాణ్ని
ప్రేయసి ముగ్ధనయనాలలో మునగలేని సన్నాసి
ఆత్మసమర్పణ అవధులనేం అందుకోగలడు? (4)

నేనే ధనుర్దాసునైతే
పాండిత్య పంకపు పాపాత్ములనందర్నీ
ప్రేమగంగలో పవిత్రస్నానం చేయించేవాణ్ని
వలపు సరోవరంలో తేలే హంసకున్న ఆనందం
పుస్తకాలు మేసే పురుగులకెలా అందుతుంది? (5)

నేనే ధనుర్దాసునైతే
రాతి ఆలయాలకన్నింటికీ తాళాలు వేయించి
హృదయాలయాలను బార్లా తెరిపించేవాణ్ని
నీ గుండెలో నిత్యం వెలిగే ప్రేమవెలుగు
గుళ్ళలో వెలిగే నూనెదీపాలలో ఎక్కడుంది? (6)

నేనే ధనుర్దాసునైతే
లోకంలోని కృత్రిమపూజలన్నీ ఆపించి
స్వచ్చమైన ప్రేమారాధనను లోకానికి నేర్పేవాణ్ని
జీవంలో దైవాన్ని చూడలేని కపటి
జడంలో దైవాన్నెలా చేరుకోగలడు? (7)

నేనే ధనుర్దాసునైతే
పవిత్రగ్రంధాలన్నీ అవతల పారవేయించి
భక్తులచేత ప్రేమగీతాలు పాడించేవాణ్ని
ఆచరణకురాని శుష్కవేదాంతం కంటే
ఆత్మను ఆవహించే ప్రేమావేశం వాంఛనీయం కదూ? (8)

నేనే ధనుర్దాసునైతే
లోకులు కప్పుకున్న కాపట్యపు దుస్తులన్నీ తొలగించి
నగ్నసౌందర్యపు నవ్యత్వాన్ని వారికి నేర్పేవాణ్ని
సృష్టిలోని స్వచ్చసౌందర్యాన్ని కొలిచే దృష్టి లేనివాడు
తన సృష్టిలో సౌందర్యాన్ని ఎలా నింపుకోగలడు? (9)

నేనే ధనుర్దాసునైతే
కాకమ్మ కబుర్లు చెప్పే మతకాకులన్నింటినీ
మధురగీతాలు పాడే హంసలుగా మార్చేవాణ్ని
లోకులు తినిపారేసిన ఎంగిలి మాంసఖండాల కంటే
మానససరోవరపు తామరతూళ్ళు మంచివి కదూ? (10)

నేనే ధనుర్దాసునైతే
కోరికలతో మండే కుళ్ళు బ్రతుకులలో
చల్లని ప్రేమజలాలు చల్లించేవాణ్ని
తన చుట్టూ ఉన్న దైవాన్ని చూడలేనివాడు
ఎక్కడో ఉన్న దైవాన్ని ఎలా చేరుకోగలడు? (11)

నేనే ధనుర్దాసునైతే
హిమాలయాల శుద్ధ గంగాజలాన్ని
నీ ఇంటి ముంగిట్లో పారించేవాణ్ని
జీవంలేని గుడికి నిన్ను తీసుకెళ్లడంకాదు
జీవంతో వెలిగే దైవాన్నే నీ ఎదుటకు రప్పించేవాణ్ని (12)

నేనే ధనుర్దాసునైతే
మాయమతాలన్నింటినీ మాయం చేసేసి
ప్రేమమతాన్ని మాత్రమే ప్రచారం చేసేవాణ్ని
ద్వేషాన్నీ కపటాన్నీ పెంచే ఘరానా మతాలకంటే
ప్రేమను పంచే సామాన్యజీవితం ఉత్తమం కదూ? (13)

నేనే దేవదాసునైతే
పార్వతికే మదిరను పట్టించి
పరమానందాన్ని ఆమెకే రుచి చూపించేవాణ్ని
ఆమెకోసం నేనేడవటం కాదు
నాకోసం పడిచచ్చేలా ఆమెను మార్చేవాణ్ని
జీవితాన్ని భగ్నం చేసుకునే నిరాశామోహం కంటే
ఆనందంలో లగ్నంచేసే ప్రేమావేశం మంచిది కదూ? (14)

నేనే రామదాసునైతే
రాజుకివ్వాల్సింది రాజుకిచ్చి
రాముడికివ్వాల్సింది రాముడికిచ్చేవాణ్ని
పరాయి సొమ్ముతో రాతిగుళ్ళు కట్టి శిక్షలు పొందటం కంటే
ప్రేమగుండెలో దైవాన్ని ప్రతిష్టించుకోవడం ఉత్తమం కదూ? (15)

నేనే ధనుర్దాసు నైతే
బయటి యాత్రలన్నీ బహిష్కరింపించి
నీయాత్రను నీలోకే చేయించేవాణ్ని
దేశాలన్నీ తిరిగి దిక్కు తెలియక కూలబడటం కంటే
ఉన్నచోటే ఉండి సర్వం సాధించడం ఉత్తమోత్తమం కదూ? (16)

నేనే ధనుర్దాసు నైతే
వేవేల గోపికల విశ్వవల్లభునికి
సన్యాసపు సాంప్రదాయమేమిటని ప్రశ్నించేవాణ్ని
మనోహర నికుంజాలలో నిత్యరతిలో తేలే రసికుడికి
మడిపంచెల మసి హారతులేమిటని అడిగేవాణ్ని (17)

నేనే ధనుర్దాసు నైతే
దేవుని ప్రతిమస్థానంలో
నా ప్రేయసినే సజీవంగా నిలుపుకునేవాణ్ని
మనం చెక్కిన రాతిశిల్పాలకంటే
దైవం చెక్కిన సజీవశిల్పం మహాద్భుతం కదూ? (18)

నేనే ధనుర్దాసునైతే
ఏ శ్రీరంగానికీ వెళ్ళకుండా
నా అంతరంగంలోకే నేను ప్రవేశించేవాణ్ని
నిలువ జలాల మురికి పుష్కరిణిలో కాకుండా
అమృత సరస్సైన మానససరోవరంలో మునిగేవాణ్ని (19)

మనం కట్టుకున్న బాహ్యజలాశయాల కంటే
దైవం మనకిచ్చిన అంతరికసరోవరం మంచిది కదూ?
మనం బ్రతుకుతున్న కపట జీవితాల కంటే
దైవం ప్రసాదించిన సత్యజీవితం మనోహరం కదూ? (20)
read more " నేనే ధనుర్దాసునైతే.... "

21, నవంబర్ 2015, శనివారం

స్వాగతం

నిద్రను చెదరిన స్వప్నం
నిన్ను క్రుంగదీస్తుంది
వదలని స్వప్నం ప్రేతం
కాకూడదు నీకది నేస్తం
కలనలాగే వదిలెయ్

చేజారే ప్రతి అవకాశం
అంతంలో ఆహుతౌతుంది
దానినలాగే పోనియ్
గతమన్నది గతమే నేస్తం
ముందున్నది కాలమనంతం

అనుభవమేదీ నిలవదు
అమరిక ఏదీ చెల్లదు
ఏదైనా కొన్నాళ్ళే
అనుభవ శూన్యత లోతున
అడుగుంచుట నేర్వవోయ్

ఎంతటి నాటకమైనా
ఒకనాటికి ముగిసిపోవు
వింతల రంగుల లోకం
ఒకరోజున నిన్ను వీడు
శాశ్వతమేదీ లేదోయ్

ఈ సత్యం తెలియనిచో
నీ హృదయం పగిలిపోవు
ఈ మార్గం ఎరుగనిచో
నీ గమనం ఆగిపోవు
వృధగా బ్రదుకకు నేస్తం

ఈ లోకపు వీధులలో
నీవొక సంచారివెపుడు
ఈ మాయల మనుషులతో
నీదొక సంసారమెపుడు
కళ్ళు తెరచి చూడవోయ్

కనుతెరచిన మరుక్షణమే
కలయన్నది మాయమౌను
నిజమెరిగిన నిముషమునే
వగపన్నది వదలిపోవు

తెలుసుకోర ఈ నిజం
మరచిపోర నీ గతం
పలుకు నీకు స్వాగతం
వెలుగులోక వైభవం
read more " స్వాగతం "

19, నవంబర్ 2015, గురువారం

రుజువైన వరాహమిహిరుని సూత్రం

2014 లో రోహిణీశకట భేదనం గురించి వ్రాస్తూ రెండువేల సంవత్సరాల నాటి ఖగోళపండితుడూ ప్రాచీన జ్యోతిర్వేత్తా అయిన వరాహమిహిరుని సూత్రాన్ని వివరించాను.

శ్లో||రోహిణీ శకట మర్కనందనో  యది భినత్తి రుధిరోధవా శిఖీ
కిం వదామి యదనిష్ట సాగరే జగత్సేష ముపయాతి సంక్షయమ్
(బృహత్సంహిత)

(రోహిణీ శకటమును అర్కనందనుడు(శని),రుధిరుడు(కుజుడు) లేదా శిఖి(తోకచుక్కగానీ లేక కేతువుగానీ కావచ్చు) భేదించినప్పుడు కలిగే ఉపద్రవాలను ఏమని చెప్పను? అప్పుడు ప్రపంచం అంతా ఉత్పాత సముద్రంలో మునిగిపోతుంది)

ప్రస్తుతం ఒక నాలుగైదు రోజులనుంచీ మనం చూస్తున్నది ఇది కాకుంటే మరేమిటి?

ప్రస్తుతం శనీశ్వరుడు రోహిణీ నక్షత్రాన్ని కుజరాశి అయిన వృశ్చికం నుంచి తన సప్తమ దృష్టితో వీక్షిస్తున్నాడు. అంతేగాక కుజుడు కూడా అదే నక్షత్రాన్ని ఈ సమయంలో వీక్షిస్తున్నాడు. కుజుడు దక్షిణానికి సూచకుడు.ఆయన ప్రస్తుతం సంచరిస్తున్న కన్యారాశి దక్షిణానికి సూచిక.కనుక దక్షిణభారతం చాలావరకూ నీటిలో మునిగి పోయింది.అందునా ముఖ్యంగా తమిళనాడు ఈ విధ్వంసానికి బాగా గురైంది. కుజునికి అధిదేవత అయిన సుబ్రమణ్యస్వామిని తమిళనాడులోనే ఎక్కువ ఆరాధిస్తారు.

ఇక్కడొక అనుమానం రావచ్చు.ఆరాధించే చోటే ఈ విలయం ఎందుకు జరిగింది? అక్కడ జరగకూడదు కదా అని.

ఆరాధన అంటే ఊరకే విగ్రహాలు పెట్టి పూజలు చెయ్యడం కాదు. ఆ దైవం ఏయే భావాలకు సూచకుడో వాటిని త్రికరణశుద్ధిగా ఆచరించాలి.ఆ లక్షణాలను మన నిత్యజీవితంలో ఆనుసరించాలి.అది లేనప్పుడు ఏ దేవుడికి ఎన్నిరకాల దొంగపూజలు చేసినా ఏమీ ఉపయోగం ఉండదు.కాసేపు పూజ చేసి ఆ తర్వాత మనిష్టం వచ్చినట్లు మనం జీవిస్తుంటే ఈ విధంగానే జరుగుతుంది. అప్పుడే దేవుడూ రక్షించడు. ఇది ఖచ్చితంగా సామూహిక కర్మ ప్రబావమే.

గత అయిదురోజులుగా కొన్ని వందల మైళ్ళ పొడుగునా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎన్నో ఊళ్లు నీళ్లలో దిగ్బంధనం అయ్యాయి.పంటలు పాడై పోయాయి.రోడ్డు రవాణా పూర్తిగా స్తంభించి పోయింది.రైలు మార్గాలు అతలాకుతలం అయ్యాయి.మద్రాసు హైవే మీదుగా అయిదు అడుగుల ఎత్తున నీళ్ళు పారాయి.లారీలు బస్సులు కార్లు నీళ్ళలో మునిగిపోయాయి.పక్కనున్న ఊరికి పోవాలంటే ఎన్నో మైళ్ళు చుట్టూ తిరిగి పోవలసిన పరిస్థితులు తమిళనాడులో ఎన్నో చోట్ల జరిగాయి.కొన్ని చోట్ల అయితే 8 గంటలపాటు ఒకే స్టేషన్లో కదలని రైల్లో ప్రయాణీకులు కూచుని భజన చెయ్యవలసి వచ్చింది.ఎంతోమంది ముందే వేసుకున్న ప్లానులూ వాళ్ళ షెడ్యూళ్ళూ గందరగోళం అయిపోయాయి.ఆస్తినష్టం ఎంతో ఇంకా లెక్కలు తేలడం లేదు.ఈరోజే వాన కాస్త తెరపిచ్చింది.కానీ ఇంకా పూర్తిగా పోయినట్లు లేదు.

'ఈ గ్రహయోగం సంభవించినప్పుడు లోకం దుఃఖంలో 'మునుగుతుంది' అనే మాటను వాడటంలో వరాహమిహిరుడు ఎంతో శ్లేషను ఉపయోగించాడు. మార్మికభాషను వాడటంలో ఆయన సిద్ధహస్తుడు.ఆయన వ్రాసిన పుస్తకాలన్నీ ఇలాగే మార్మికార్ధాలతో నిండి ఉంటాయి.ఎంతో క్లిష్టమైన గణిత సూత్రాలను 'కటపయాది' విధానంలో ఇమిడ్చి సూత్రబద్ధం గావించడంలో ఆయన దిట్ట.ఆయన వ్రాసిన సూత్రాలను విడమర్చి చెప్పడానికి పుస్తకాలకు పుస్తకాలే వ్రాశారు పరిశోధకులు.దీనినిబట్టి ఆయన తన గ్రంధాలలో వాడిన మార్మికభాష ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

గతంలో రోహిణీశకట భేదనం జరిగిన ప్రతిసారీ జననష్టం ఆస్తినష్టం జరిగింది. వాటిలో భూకంపాలున్నాయి.జలప్రమాదాలున్నాయి.ఈసారి కూడా అవన్నీ జరుగుతున్నాయి.తమిళనాడు ఆంధ్రాలలో లక్షలాది మంది అయిదు రోజులుగా కురుస్తున్న వర్షంవల్ల నానాపాట్లూ పడటమూ, పంట నష్టమూ,ఆస్తి నష్టమూ చాలా ఎక్కువగా ఉండటమే దీనికి తార్కాణాలు.

ఈ ఖగోళసూత్రాన్ని 2000 ఏళ్ళ నాడే పరిశీలించి, సూత్రీకరించి మనకందించి, ముందుముందు కూడా ఇది ఖచ్చితంగా జరుగుతుందని వ్రాసిపెట్టిన వరాహమిహిరాది ప్రాచీన శాస్త్రవేత్తలకు జోహార్లు అర్పించకుండా ఉండగలమా?
read more " రుజువైన వరాహమిహిరుని సూత్రం "

14, నవంబర్ 2015, శనివారం

నేనెవర్ని?

విశ్వపుటంచుల లోయలలో
ఏముందో చూద్దామని శూన్యంలో
అలుపులేని గమనంతో
నిరంతరం ప్రయాణించే
వేగుచుక్కను నేను

విచిత్రాల ధరణి పైకి
ఏమీ తోచని సమయంలో
సరదాగా ఎప్పుడైనా
కాసేపు షికారుకొచ్చే
విస్మృత యాత్రికుడిని నేను

మానవ నీచత్వాల వలలో
మాయా వ్యామోహాల సుడిలో
కావాలని కాసేపు చిక్కి
చూస్తుండగానే వలను త్రెంచి
రివ్వున ఎగసే గరుడపక్షిని నేను

లోకనిమ్నత్వాలను మించిన
అతీతపధాల మహాటవిలో
అమరసరస్సుల తీరాలలో
భయమన్నది తెలియక
ఠీవిగా సంచరించే మృగరాజును నేను

లోలోని ఐక్యానుభవ కుసుమాల
తీపి మకరందాలు గ్రోలుతూ
నిరంతర ఝుంకారనాదంతో
విరులలో ఝరులు రగిలిస్తూ
మత్తుగా ఎగిరే తుమ్మెదను నేను

జన్మ పరంపరల గుట్టు తెలిసి
మానవ మస్తిష్కాన్ని తరచి తరచి
నిగూఢమైన దారులలో నడచి నడచి
కర్మ తుంపరలలో ముద్దగా తడిసినా
ఏమాత్రం తడి అంటని నీటికోడిని నేను

ఎన్నిసార్లు కన్నుమూసినా
ఎన్ని ముసుగులు చివికి పోయినా
ఎన్ని జన్మలు గడచి పోయినా
వెన్ను చూపక మళ్ళీ కన్ను తెరిచి
మరణాన్ని వెక్కిరించే గంధర్వపక్షిని నేను

ఎన్నిసార్లీ గళం మూగబోయినా
ఎన్నిసార్లీ స్వరం రాకపోయినా
చిరునవ్వుతో సరిదిద్దుకొని
మధురగీతాలను మళ్ళీ ఆలపించే
అలుపులేని అజ్ఞాత గాయకుడిని నేను

ఏ ఎడారీ ఇంకించుకోలేని
ఏ సరిహద్దూ బంధించుకోలేని
ఏ కల్మషమూ మలినం చెయ్యలేని
సత్యజలధి వైపు నిత్యగమనం చేసే
స్వచ్చజలాల జీవనదిని నేను

విశ్వపుటంచుల లోయలలో
ఏముందో చూద్దామని శూన్యంలో
అలుపులేని గమనంతో
నిరంతరం ప్రయాణించే
వేగుచుక్కను నేను

విచిత్రాల ధరణి పైకి
ఏమీ తోచని సమయంలో
సరదాగా ఎప్పుడైనా
కాసేపు షికారుకొచ్చే
విస్మృత యాత్రికుడిని నేను
read more " నేనెవర్ని? "

13, నవంబర్ 2015, శుక్రవారం

ఈ అతికామయోగం ఎన్నాళ్ళు సారూ?

ఈ రోజు మధ్యాన్నం ఒక అభిమాని ఫోన్ చేశాడు.

'మీరు చెప్పినట్లే ఇంకా రేపులు జరుగుతూనే ఉన్నాయి.బుధవారం రాత్రి బెంగుళూరు కబ్బన్ పార్క్ లో 30 ఏళ్ళ  ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ యువతి పార్క్ సెక్యూరిటీ గార్డ్స్ చేతిలో గ్యాంగ్ రేప్ కు గురైంది.' అన్నాడు.

'ఇందులో ఏమీ అనుమానం అక్కర్లేదు.గ్రహప్రభావాలు ఉన్నంతకాలం ఇవి జరుగుతూనే ఉంటాయి.గ్రహాలు ఇప్పుడున్న చోటు నుంచి మారిపోతే ఆరోజు నుంచి జరగమన్నా జరగవు.' అన్నాను.

'ఇంకా ఎన్నాళ్ళు సార్ ఈ అతికామయోగం? ' అన్నాడు.

'ప్రస్తుతం శుక్ర కుజ రాహువులు కన్యారాశిలో ఉన్నారు.వీరిలో శుక్రుడు ముందున్నాడు.కుజుడు వెనుకగా ఉన్నాడు.రాహువు వక్రగతిలో సింహం వైపు వెనక్కు పోతున్నాడు గనుక ఆయనతో ఇబ్బంది లేదు.శుక్రుడిని కుజుడు వెంబడిస్తున్నాడు.అందుకనే ఆడవాళ్ళను మగవాళ్ళు వెంటాడుతున్నారు.అఘాయిత్యాలు చేస్తున్నారు.డిసెంబర్ 1 తేదీన శుక్రుడు ఇప్పుడున్న రాశిమారి తులారాశిలోకి వస్తాడు.అంతవరకూ ఇలాంటి దుస్సంఘటనలు తప్పవు.' అన్నాను.

'మరి ఈ సమయంలో అమ్మాయిలు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి?' అడిగాడు.

'సాహసాలు పనికిరావు.రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒంటరిగా బయట తిరగడం మానుకోవాలి.ఒకవేళ తప్పకపోతే ఎవరినైనా తోడు తీసికెళ్ళాలి. ఎమర్జెన్సీ ఫోను నంబర్లు దగ్గర ఉంచుకోవాలి.జాగ్రత్తలో ఉండటం మంచిది. ఎందుకంటే ప్రస్తుతం గ్రహస్థితి బాగాలేదు.ఎవరి బుద్ధి ఎలా మారుతుందో చెప్పలేము.అందుకని రిస్క్ తీసుకోవడం అస్సలు పనికిరాదు.' చెప్పాను.

'ఏంటి మన దేశంలో ఈ ఖర్మ?' వాపోయాడు.

'లోకల్స్ ఎప్పుడూ ఇలాంటి నేరాలు చెయ్యరు.డిల్లీలో కూడా లోకల్స్ అందరూ బాగా చదువుకున్న వాళ్ళూ ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేసేవారూను. వాళ్ళు సాధారణంగా ఇలాంటి పనులు చెయ్యరు.బీహార్ నుంచీ రాజస్థాన్ నుంచీ హర్యానా నుంచీ అక్కడకు చిన్నచిన్న పనులు చేసుకునే వాళ్ళు వేలసంఖ్యలో వస్తుంటారు.వాళ్లకు ఇల్లూ వాకిలీ సరిగ్గా ఉండవు.చదువు ఉండదు.లేబర్ గా డిల్లీకి వస్తుంటారు.వీళ్ళవల్లే క్రైం జరుగుతూ ఉంటుంది. బెంగుళూరు కూడా అంతే.లోకల్స్ అందరూ చాలా మంచివాళ్ళు. బయటనుంచి వచ్చిన వాళ్ళ వల్లే ఈ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి.ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ కూడా బీహారీలే అంటున్నారు.ఇప్పుడు నయంగదూ కనీసం దోషులను వెంటనే పట్టుకుంటున్నారు.ఇంతకు ముందైతే దిక్కూ దివాణం ఉండేది కాదు.అసలు కంప్లెయింట్ ఇస్తే పట్టించుకునేవారే కారు.ఇప్పుడు చాలా నయం.కానీ చాలదు.పరిస్థితి ఇంకా మారాలి.లా అండ్ ఆర్డర్ బాగా కట్టుదిట్టం కావాలి.అప్పుడు గాని ఇలాంటి నేరాలు మటుమాయం కావు. అంతవరకూ ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది.' అన్నాను.

'అంటే ఇంకొక ఇరవై రోజులు ఈ గోల తప్పదన్న మాట' అన్నాడు.

'అంతే. బై.' అంటూ ఫోన్ కట్ చేశాను.
read more " ఈ అతికామయోగం ఎన్నాళ్ళు సారూ? "

4th Astrology Workshop on Medical Astrology

ఇప్పటివరకూ మూడు Astro Workshops జరిగాయి.4th Astrology Workshop హైద్రాబాద్ లో త్వరలో జరుగబోతున్నది.

ఈ workshops కు వస్తున్నవారికి ఇప్పటివరకూ జ్యోతిశ్శాస్త్రంలో నేను అనుసరించే విధానాన్ని నేర్పిస్తూ వచ్చాను.మూడు సమావేశాలతో బేసిక్స్ నేర్పడం అయిపోయింది.కనుక ఇప్పుడు జ్యోతిష్యశాస్త్రంలోని ప్రత్యేక విషయాల (Specialized subjects) లోకి ప్రవేశిస్తున్నాం.

మొదటగా Medical Astrology ని తీసుకోవడం జరుగుతున్నది.ఎందుకంటే - మనిషికి ముందుముందు రాబోయే రోగాలు ఎలా ఉంటాయి?ఆయా రోగాలు జీవితంలో ఎప్పుడొస్తాయి?అసలవి ఎందుకొస్తాయి?వాటిని రాకుండా ఎలా చేసుకోవచ్చు?ఒకవేళ వస్తే ఎలాంటి రెమేడీలు చేస్తే అవి త్వరగా తగ్గుతాయి? వంటి విషయాలు తెలుసుకోవడమే ఏ మనిషైనా మొట్టమొదట తన జీవితంలో చెయ్యవలసిన పని.ఆరోగ్యం లేకుంటే ఎన్ని ఉన్నా ఏమీ ప్రయోజనం లేదన్న విషయం అందరికీ తెలిసిందేగా?

కనుకనే Medical Astrology అనే సబ్జెక్ట్ ను ముందుగా స్వీకరించడం జరిగింది.ఈ వర్క్ షాప్ కు రాదలచుకున్నవారు మిగతా వివరాలకోసం పంచవటి ట్రస్ట్ P.R.O Raju Sykam ను ఈ క్రింది ఫోన్ లో సంప్రదించవచ్చు.

Mobile Number:--9966007557
read more " 4th Astrology Workshop on Medical Astrology "

12, నవంబర్ 2015, గురువారం

11-11-2015 అమావాస్య ప్రభావం

ఈ అమావాస్యకు కొద్దిరోజుల ముందు నుంచీ అంతరిక్షంలో కొన్ని గ్రహస్థితులు నెలకొన్నాయి.దానివల్ల సమాజంలో కొన్ని విపరీత సంఘటనలు కనిపిస్తున్నాయి. అవేంటో పరిశీలిద్దాం.

కన్యారాశిలో రాహువు శుక్రుడు కుజుడు చంద్రుడు కలవడమే ఆ విపరీతస్థితి.జ్యోతిశ్శాస్త్ర ప్రకారం ఇది అతికామయోగం అనబడుతుంది.దీనిగురించి పాతపోస్టులలో వ్రాశాను చూడండి.అందుకనే ఈ మధ్యన అమ్మాయిలమీద బలాత్కారాలు మళ్ళీ ఎక్కువౌతున్నాయి.ఇది శుక్రుడికి నీచరాశి గనుక నీచమైన పనులు సమాజంలో జరుగుతున్నాయి. 

ఈ మధ్యలో జరిగిన కొన్ని సంఘటనలు చూద్దామా?

3.11.2015
నల్గొండ జిల్లాలో 15 ఏళ్ళ అమ్మాయిని 16 ఏళ్ళ అబ్బాయి రేప్ చేశాడు.పైగా దీనిలో తన స్నేహితుని సహాయం తీసుకున్నాడు.

3.11.2015
జోద్ పూర్ లో ఒక గృహిణి తన ఫేస్ బుక్ ఫ్రెండ్ చేతిలో రేప్ కు గురైంది.

అంతేకాదు.ఎప్పుడో జరిగిన ఆశారాం బాపూ మీద రేప్ అభియోగమూ, ఎప్పుడో జరిగిన Delhi UBER Cab రేప్ కేసూ కూడా ఇప్పుడు మళ్ళీ తెరమీదకు వచ్చాయి.

6.11.2015:
బెంగుళూరులో బస్సులో ఒంటరిగా ప్రయాణిస్తున్న నర్సు మీద అత్యాచారం జరిగింది.చేసిన వెధవపని చాలక ఆ అమ్మాయి ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుంటానని సదరు నిందితుడు ఆఫర్ ఇవ్వడం అతి హేయమైన చర్య.

అరేబియా దేశాలలో లాగా భయంకరమైన శిక్షలు పబ్లిగ్గా వెంటనే పడినప్పుడే మన దేశంలోని 'డిసిప్లిన్ లెస్' ప్రజలకు భయం అనేది ఉంటుంది.అలా శిక్షలు పడనప్పుడు ఇలాంటి కేసులు మళ్ళీమళ్ళీ మనదేశంలో జరుగుతూనే ఉంటాయి.తప్పదు.

9.11.2015
నాలుగు గంటల వ్యవధిలో ఆరు భూకంపాలు అండమాన్ నికోబార్ దీవులను వణికించాయి.పైన చెప్పిన గ్రహాల సంయోగం భూతత్వ రాశి అయిన కన్యలో జరగడం గమనార్హం.

11.11.2015
సరిగ్గా అమావాస్య ఘడియలలో - ముజఫర్ నగర్ లో 15 ఏళ్ళ బాలిక ముగ్గురి చేతిలో రేప్ కు గురైంది.

అసలీ 3.11.2015 ప్రత్యేకత ఏమిటి? ఆ సమయంలోనే ఇన్ని రేపులు ఎందుకు జరిగాయి? లేదా పాత కేసులు మళ్ళీ న్యూసులోకి ఎందుకు వస్తున్నాయి? అప్పటినుంచీ నేటివరకూ ప్రతిరోజూ మీడియాలో ఈ న్యూసులు ఎందుకు కనిపిస్తున్నాయి? - అని గమనిస్తే ఒక గ్రహస్థితి కొట్టొచ్చినట్లుగా కనిపించింది.

శుక్రుడు కుజుడు అప్పుడే సరిగ్గా రాశి మారి సింహం నుంచి కన్యలోకి అడుగుపెడుతున్నారు.వీరిద్దరూ ఆ సమయంలో సున్నా డిగ్రీలలో రాశిసంధిలో ఉన్నారు.సరిగ్గా అదే సమయంలో మీడియా దృష్టికి వచ్చినవీ రానివీ చాలా రేపులు జరిగాయి.ఇవి మన దేశానికే పరిమితమా? ఇతరదేశాలలో జరగలేదా?అంటే మనకు తెలియదు.జరిగే ఉంటాయి. ఆయాదేశాల మీడియాలో వెదకాలి.వీటిల్లో కూడా కొన్ని బయటకు వస్తాయి. కొన్ని రావు.

3.11.2015 నుంచి నేటివరకూ ఒక్కసారి మీలోకి తొంగి చూచుకోండి.మీ జీవితాలలో కూడా ఇలాంటి సన్నివేశాలు కొన్ని మీకు ఎదురయ్యే ఉంటాయి. మీలో చాలామందికి ఆ సమయంలో ఉద్రేకాలు విజ్రుంభించి ఉంటాయి. ప్రశాంతంగా ఆలోచించండి.మీకే అర్ధమౌతుంది.ఎందుకంటే మనుషులలో ఎవరూ గ్రహప్రభావానికి అతీతులు కారు,కాలేరు కాబట్టి.

ఓహో ! గ్రహప్రభావం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయా? అయితే శిక్షలు కూడా గ్రహాలకే వేస్తే సరిపోతుంది కదా? అని కొంతమంది హేతువాదులూ నాస్తికులూ ఎగతాళిగా కామెంట్ చేస్తూ ఉంటారు.నోరుందిగదా అని ఏదో ఒకటి మాట్లాడితే సరిపోదు."మనుషులలో కొన్నికొన్ని ఉద్రేకాలు కొన్నికొన్ని గ్రహస్థితులు ఉన్నప్పుడు విపరీతంగా పెల్లుబుకుతూ ఉంటాయి,ఇది వాస్తవం" అని చెప్పడమే ఈ పరిశీలనా ఉద్దేశ్యం.అంతేగాని మనం చేసే ప్రతితప్పునూ గ్రహాలమీదకో దేవుడిమీదకో నెట్టమని కాదు.తప్పు చేసి తప్పించుకోవచ్చనీ కాదు.

గ్రహాలను శిక్షించడం మనవల్ల కానేకాదు.కనీసం వాటివల్ల మనం శిక్షించబడకుండా ఉండే స్థితికి చేరుకోగలిగితే చాలు.మన జీవితాలు ధన్యములు అయినట్లే.ఒకపూట తిండి లేకుంటే నీరసం వచ్చి కూలబడిపోయే మనం స్టెల్లార్ ఫోర్సెస్ అయిన గ్రహాలను ఏదో చెయ్యగలం అనుకోవడం పిచ్చి భ్రమ మాత్రమే. 

గ్రహస్థితులకూ మానవజీవితంలోని సంఘటనలకూ ఖచ్చితమైన సంబంధం ఉన్నదని ఈ సంఘటనలు మళ్ళీ ఋజువు చేస్తున్నాయి.
read more " 11-11-2015 అమావాస్య ప్రభావం "

11, నవంబర్ 2015, బుధవారం

Martial Art Practice - Video-2 (8-11-2015)

8-11-2015 న గుంటూరులో జరిగిన మార్షల్ ఆర్ట్ క్లాస్ నుంచి మరికొన్ని వీడియో క్లిప్స్ ను ఇక్కడ చూడవచ్చు.

youtube Link


read more " Martial Art Practice - Video-2 (8-11-2015) "

10, నవంబర్ 2015, మంగళవారం

Martial Arts Practice (8-11-2015) - Video 1

8-11-2015 న గుంటూరులో జరిగిన మార్షల్ ఆర్ట్ క్లాస్ నుంచి కొన్ని వీడియో క్లిప్స్ ను ఇక్కడ చూడవచ్చు

Youtube Link
https://youtu.be/9PHYU2A28WE
read more " Martial Arts Practice (8-11-2015) - Video 1 "

8, నవంబర్ 2015, ఆదివారం

Martial Arts Class Photos - (8-11-2015)

ఉదయం 5 కల్లా డాబామీద క్లాస్ మొదలైంది.డాబాపైకి ఎక్కుతున్నప్పుడు ఇంకా బాగా చీకటిగా ఉండి,తూర్పున ఉదయిస్తున్న కన్యారాశిలో ద్వాదశి చంద్రుడూ, ఆపైన ప్రకాశవంతంగా శుక్రుడూ,పక్కనే కుజుడూ, ఇంకా కాస్త పైన సింహరాశిలో గురువూ దర్శనమిచ్చారు.వారితోనే ఉన్న రాహువు కనిపించడు కానీ అక్కడే ఉంటాడు.కనుక డాబా ఎక్కుతున్నప్పుడే ఆ గ్రహదేవతలకందరికీ ప్రణామం గావిస్తూ క్లాసు మొదలుపెట్టాను.ఆ సమయంలో వీరవిద్యలకు అధిపతీ నాకు ఆత్మకారకుడూ అయిన కుజుని హోర నడుస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది.

8.00 వరకూ డాబా మీదే మర్మవిద్యా విధానాలు అభ్యాసం చేసి,కొంచం ఎండ ఎక్కడంతో క్రిందకు దిగి ఇంట్లోకి వచ్చి అక్కడే మిగతా క్లాసు మధ్యాన్నం 12.30 వరకూ కొనసాగించాము.

మధ్యమధ్యలో మాకందరికీ  మల్టీ గ్రెయిన్ రాగిజావ,బాదంపాలు,డ్రై ఫ్రూట్స్ ఇచ్చి మాకు నీరసం రాకుండా కాపాడిన శ్రీమతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఆ విధంగా ఉదయం   5 నుంచీ మధ్యాన్నం 12.30 వరకూ 7.30 గంటలపాటు ఏకధాటిగా సాగిన మొదటి వీరవిద్యా క్లాస్ జయప్రదంగా ముగిసింది.నెలకు కనీసం ఒక క్లాస్ ఈ విధంగా చేద్దామన్న నిర్ణయంతో ఈ క్లాసు ముగిసింది.ఇప్పుడు నేర్పించిన టెక్నిక్స్ ను బాగా అభ్యాసం చేసి తదుపరి క్లాసుకు రావలసిందిగా ఈ అభ్యాసిలను కోరుతున్నాను.

ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.
















































read more " Martial Arts Class Photos - (8-11-2015) "

4, నవంబర్ 2015, బుధవారం

మర్మవిద్య

మార్షల్ ఆర్ట్స్ లో అత్యున్నత శిఖరాగ్రంలాంటిది - మర్మవిద్య.

ఇది అతి ప్రాచీనకాలంలో మన దేశంలో ఉండేది.మన చేతగానితనం వల్ల, అనేక మన ప్రాచీనవిద్యలలాగే ఇదీ అంతరించిపోయింది.కేరళలో మాత్రం అక్కడక్కడా అతి కొద్దిమంది మాస్టర్స్ దగ్గర ఉన్నది.నేడు చైనాలో జపాన్ లో కూడా ఈ విద్య అక్కడక్కడా మాత్రమే బ్రతికి ఉన్నది.చైనాలో దీనిని Dim Mak Kung Fu(Death Touch) అంటారు.ఈ విద్యను లోతుగా తెలిసిన మాస్టర్లు దీనిని అంత త్వరగా ఎవరికీ చెప్పరు.నేర్పరు.రహస్యంగా తమలోనే ఉంచుకుంటారు.

కారణం?

ఈ విద్య బాగావస్తే, ఉత్త వేళ్ళతో ఒక్క క్షణంలో ఒక మనిషిని చంపేసెయ్యవచ్చు.లేదా పదే పది నిముషాలలో అతనికి పక్షవాతం వచ్చేలా చెయ్యవచ్చు.లేదా అతను క్రమేణా క్షీణించి ఒక ఆరునెలల తర్వాత చనిపోయేలా చెయ్యవచ్చు.ఇదంతా వినడానికి వింతగా అసాధ్యంగా అనిపించవచ్చు.కానీ ఇది నిజం.అందుకే దీనిని మర్మవిద్య అంటారు.

మనుషులలో స్వార్ధపరులు ఎక్కువ. మోసగాళ్ళూ చిత్తశుద్ధి లేనివాళ్ళూ ఎక్కువ.అలాంటి వాళ్లకు ఈ విద్యను నేర్పిస్తే, వాళ్ళు వాళ్ళ స్వార్ధానికి ఈ విద్యను వాడవచ్చు.దీనితో ఎందరికో హాని కలిగించవచ్చు.ఏ ఆధారమూ దొరకని పద్ధతిలో సైలెంట్ గా ఎంతోమందిని చంపవచ్చు కూడా.అప్పుడా పాపం అంతా ఆ నేర్పించిన మాస్టర్ కు చుట్టుకుంటుంది.అందుకే ఎవరికి బడితే వారికి ఈ విద్యను నేర్పడం జరగదు.అది చైనా కావచ్చు,జపాన్ కావచ్చు,లేదా ఇండియా కావచ్చు.ఎక్కడైనా నిజమైన మాస్టర్లు ఇదే సూత్రాన్ని పాటిస్తారు.నికార్సైన వ్యక్తిత్వమూ నూటికి నూరుపాళ్ళు నిజాయితీ ఉన్న శిష్యులకే దీనిని నేర్పడం జరుగుతుంది.అలాంటి వాళ్ళు ఒకవేళ దొరకకపోతే ఈ విద్య ఆ మాస్టర్ తోనే అంతరించి పోతుంది అంతేగాని అర్హతలు లేనివారికి ఇది ఎన్నటికీ నేర్పబడదు.

"డిం మాక్ కుంగ్ ఫూ" లో రెండు రకాలున్నాయి.ఒకటి బిగ్ హ్యాండ్.రెండు స్మాల్ హ్యాండ్.మొదటి పధ్ధతి యాంగ్ శక్తిని ఉపయోగిస్తుంది.దీని ప్రభావం వెంటనే కనిపిస్తుంది.దెబ్బ తగిలిన కొద్ది సెకండ్లలో మనిషి కిందపడి గిలగిలా కొట్టుకుని మరణిస్తాడు.లేదా కోమాలోకి వెళ్ళిపోతాడు.లేదా పక్షవాతానికి గురౌతాడు.రెండవది యిన్ శక్తిని ఉపయోగిస్తుంది.దీని ప్రభావం వెంటనే కనిపించదు.కానీ కొద్ది గంటల నుంచి కొన్ని రోజుల తర్వాత క్రమేణా శరీరంలో దీని లక్షణాలు కనిపించడం మొదలౌతుంది.ఈ లక్షణాలు ఏ మందులకూ తగ్గవు.క్రమేణా ఆ వ్యక్తి క్షీణిస్తూ మరణానికి దగ్గరై చనిపోతాడు.ఏ టెస్టులలోనూ ఏమీ దొరకదు.

మర్మఘాత ప్రయోగం జరిగిన వ్యక్తిలో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి.

>దెబ్బ తగిలిన ప్రదేశం వెంటనే మొద్దుబారినట్లు,తిమ్మిరెక్కినట్లు,లేదా చచ్చుబడినట్లు అనిపిస్తుంది.ఆ ప్రదేశం అంతా కందిపోయి ఎర్రగా అవుతుంది.

>తలతిరుగుతున్నట్లు,పొట్టలో త్రిప్పుతున్నట్లు,వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది.

>ఊపిరి పీల్చుకోవడం కష్టమౌతుంది.గుండె పట్టేసినట్లు అనిపిస్తుంది.

>బలవంతాన ఊపిరి పీల్చుకుంటే దెబ్బ తగిలిన చోట విపరీతమైన నొప్పి కలుగుతుంది.

>ఒళ్లంతా దిగచెమటలు పడతాయి.

>విపరీతమైన నిస్సత్తువగా అనిపించి,కాళ్ళు అసలు ఉన్నాయో లేవో అనిపిస్తూ, నిలబడటమే అసంభవం అవుతుంది.మనిషి జావగారినట్లు కుప్పకూలిపోతాడు.

>కళ్ళముందు నల్లటి వలయాలుగా తిరుగుతున్నట్లు,చూస్తున్న ప్రదేశం గిర్రున తిరిగిపోతున్నట్లు అనిపిస్తుంది.కొన్ని దెబ్బలలో కళ్ళముందు sudden blackout అవుతుంది. 

ఇదంతా ఎలా సాధ్యం అనుకుంటున్నారా? సాధ్యమే.

మనిషి శరీరంలో 360 (Vital Points) మర్మస్థానాలున్నాయి.వాటిల్లో ఒక్కొక్కదానిని కొడితే లేక తడితే ఒక్కొక్క రకమైన ప్రభావం ఆ మనిషిలో కనిపిస్తుంది.కొన్ని వెంటనే పనిచేస్తాయి.కొన్ని స్లో పాయిజన్ లాగా నిదానంగా పనిచేస్తాయి.వీటిల్లో మళ్ళీ 108 మర్మస్థానాలు ముఖ్యమైనవి.మళ్ళీ వీటిల్లో 36 మర్మస్థానాలు మరీ ముఖ్యమైనవి.ఈ 36 మర్మస్థానాలు తక్షణ మరణాన్ని (Instant Death) ను కొనితెస్తాయి.మిగిలిన 72 చావుకంటే ఇంకొంచం తక్కువ స్థాయి (అంటే కోమా, పక్షవాతం,స్పృహ తప్పి పడిపోవడం వంటి) ప్రభావాలను కలిగిస్తాయి.మనిషి శరీరంలో ఈ మర్మస్థానాలనేవి ఎక్కడున్నాయో ఫీలవడం,ఒక్కొక్కదానిని విడివిడిగా గుర్తించడం,వాటిని ఒక్కొక్కదానిని ఏ యాంగిల్ లో ఎంత ఫోర్స్ తో కొట్టాలి? దానికి ఏ రకమైన ఫోర్స్ ను వాడాలి?ఎంత ప్రాణశక్తిని అప్పుడు ఉపయోగించాలి?ఎలా ఉపయోగించాలి?ఆ ప్రాణశక్తిని ఎక్కడనుంచి తీసుకురావాలి?అన్న విషయాలు ప్రాక్టికల్ గా నేర్చుకోవడమే మర్మవిద్య.

దెబ్బ తిన్న మనిషిని తిరిగి స్పృహలోకి రప్పించడం లేదా చావుకు దగ్గరగా ఉన్న వ్యక్తిని వెనక్కు తీసుకురావడం (Revival methods) అనేవి ఈ విద్యలో ఉన్నత స్థాయులు.ఇవి చాలా కష్టమైన ప్రక్రియలు.కానీ ఇవన్నీ నిజాలే.

ఈ విద్య బాగా రావడానికి కనీసం 12 సంవత్సరాల కఠోర సాధన అవసరం అవుతుంది.ఈ సాధన కరాటే కుంగ్ ఫూ స్కూళ్ళలో చేసే ప్రాక్టీస్ కు పూర్తి విభిన్నంగా ఉంటుంది.మామూలు మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ లు కూడా మర్మవిద్య వచ్చిన మాస్టర్ ముందు ఎందుకూ పనికిరారు. మర్మవిద్య అంత ప్రమాదకరమైనది. ఇది బాగా వస్తే, ఒక చిన్న దెబ్బతో మనిషిని స్పాట్ లో కుప్పకూలి చనిపోయేలా చెయ్యవచ్చు.అంత చిన్నదెబ్బ అంత ఎఫెక్ట్ ను ఎలా తెస్తుందా? అని చూచేవాళ్ళు నిర్ఘాంతపోతారు.

కానీ ఈ విద్య వచ్చినవాళ్ళు దీనిని నూటికి 99 శాతం ఉపయోగించరు. ఎందుకంటే - ఎదుటి మనిషికి హాని చెయ్యడం అనే ఉద్దేశ్యం ఉన్నవారికి ఈ విద్య నేర్పబడదు.నేర్చుకున్నా పట్టుబడదు.దీనిని నేర్చుకున్న వారు సాధారణంగా ఎదుటి మనిషిని తాకడానికి కూడా ఇష్టపడరు.ఎందుకంటే ఎదుటి మనిషి శరీరంలోని మర్మస్థానాలు (Vital Nerve Centers) వారికి కనిపిస్తూ ఉంటాయి.పొరపాటున దేనిని తాకితే ఏమౌతుందో అన్న భయం వారిలో ఉంటుంది.వీరు ఎక్కడ బడితే అక్కడ ఫైటింగ్ కు కూడా దిగరు.వారిని ఒక ఫైట్ కు రమ్మని రెచ్చగొట్టడమూ కష్టమే.వారు అంత తేలికగా రెచ్చగొట్టబడరు.

మరి వాడనప్పుడు అంత కష్టపడి దీనిని నేర్చుకోవడం ఎందుకు అని అనుమానం రావచ్చు.దీనిని నేర్చుకోవడం వల్ల ఇతర ఉపయోగాలున్నాయి. ఈ అభ్యాసాలవల్ల మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది.ముసలి వయసులో కూడా ఎవరిమీదా ఆధారపడకుండా ఏ మందులూ అనవసరంగా వాడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. 90 ఏళ్ళ వయసులో కూడా బీపీ షుగరూ ధైరాయిడూ కీళ్ళనొప్పులూ గుండెజబ్బులూ ఊపిరితిత్తుల రోగాలూ కిడ్నీ రోగాలూ ఇలాటి రోగాలు ఏవీ లేకుండా హాయిగా బ్రతకవచ్చు.మానసికంగా ఎలాంటి చీకాకులూ లేకుండా ఎంతో ఉల్లాసంగా ఉండవచ్చు. ఈ ఉపయోగాలు చాలవూ? అసలు ఇతరులను కొట్టవలసిన అవసరం ఏముంది?

విశ్వంలోనూ తన శరీరంలోనూ ఉన్న ప్రాణశక్తిని కంట్రోల్ చెయ్యడం, ఆ శక్తిని శరీరంలోని అన్ని భాగాలకూ తిప్పడం,బయటికి ఫోకస్ చెయ్యడం,తిరిగి దేహంలోకి తీసుకోవడం మొదలైన ప్రక్రియలు ఈ సాధనలో ఉంటాయి. అందుకే ఇది మన యోగసాధనకూ తంత్రసాధనకూ చాలా దగ్గరగా వస్తుంది. ఉన్నతస్థాయిలలో యోగమూ - తంత్రమూ - మర్మవిద్యా ఈ మూడూ ఒక్కటే అయిపోతాయి.అందుకే దీనిని నేర్చుకున్న వ్యక్తి జీవితమే సమూలంగా మారిపోతుంది.అతను ఒక మర్మయోగిగా మారిపోతాడు.ఎంతో పూర్వపుణ్యమూ ఎంతో అదృష్టమూ ఉంటే తప్ప ఈ విద్యను  నేర్చుకునే అవకాశం అందరికీ రాదు.

నాలుగేళ్లనుంచి చాలా సూక్ష్మంగా పరీక్ష చేసిన మీదట నన్ను అనుసరిస్తున్నవారిలో కొందరిని మాత్రం ఈ విద్య నేర్చుకోవడానికి అర్హులుగా సెలెక్ట్ చేశాను.పంచవటి గ్రూపులో నన్ను ఎంతో శ్రద్ధతో అనుసరిస్తున్న ఆరుగురు సభ్యులకు మాత్రం వచ్చే ఆదివారం నుంచీ ఈ మర్మవిద్యా క్లాస్ గుంటూరులో మొదలు పెడుతున్నాను.
read more " మర్మవిద్య "

2, నవంబర్ 2015, సోమవారం

Martial Arts Festival - Videos -3

మొన్న జరిగిన మార్షల్ ఆర్ట్స్ ఫెస్టివల్ నుంచి కొన్ని వీడియోలను ఇక్కడ చూడవచ్చు.

https://youtu.be/icFf3GSFk7I
read more " Martial Arts Festival - Videos -3 "

1, నవంబర్ 2015, ఆదివారం

Martial Arts Festival -Videos - 2


Warm Up Exercises
read more " Martial Arts Festival -Videos - 2 "

Martial Arts Festival - Videos -1


Warm Up Exercises






read more " Martial Arts Festival - Videos -1 "