14, సెప్టెంబర్ 2020, సోమవారం
నిత్యానంద జాతకంలో గోచార గ్రహాల పాత్ర - కొన్ని ప్రశ్నలు
9, సెప్టెంబర్ 2020, బుధవారం
'వరాహోపనిషత్' ప్రింట్ పుస్తకం ఈ రోజు విడుదలైంది
మిగతా శిష్యులందరినీ పిలవలేదని బాధపడకండి. ఈ కరోనా గోల అయిపోయిన తర్వాత అందరం కలుద్దాం. మళ్ళీ మన స్పిరిట్యువల్ రిట్రీట్స్ అన్నీ యధావిధిగా మొదలవుతాయి. అంతవరకు కొంచం ఓపిక పట్టండి.
యధావిధిగా ఇది కూడా google play books నుండి లభిస్తుంది.
8, సెప్టెంబర్ 2020, మంగళవారం
ఓషో ప్రియురాలు 'మా యోగ వివేక్' చంపబడిందా?
31 ఏళ్ళుగా నలుగుతున్న ఒక రహస్యాన్ని తేల్చడానికి జ్యోతిష్యశాస్త్రాన్ని ఉపయోగిద్దాం.
క్రిస్టియన్ వుల్ఫ్ స్మిత్ అనే అమ్మాయి 'యునైటెడ్ కింగ్ డం' లో 19-3-1949 న పుట్టింది. 9-12-1989 న పూనాలో ఓషో ఆశ్రమంలో చనిపోయింది. ఈమెకు ఓషో 'మా యోగ వివేక్' అని పేరు పెట్టాడు. తర్వాత 'మా ప్రేమ్ నిర్వానో' అని ఇంకొక పేరు ఈమెకు పెట్టబడింది. ఈ అమ్మాయి 40 ఏళ్ళు మాత్రమె బ్రతికింది. అందులో 20 ఏళ్ళు ఓషో పక్కనే తోడునీడగా ఉంటూ అన్ని సేవలూ చేస్తూ ఉన్నది. ఈమె గనుక పక్కన ఉండి ఎంతో జాగ్రత్తగా 20 ఏళ్ళపాటు చూచుకోకపోయినట్లైతే ఓషో అన్ని ఏళ్ళు బ్రతికేవాడు కాదు. ఎందుకంటే ఓషో ఆరోగ్యం అంత గట్టిది కాదు.
ఈమె గురించి ఓషో ఒక కధ చెప్పేవాడు. ఓషో చిన్నప్పుడు వాళ్ళ పల్లెటూళ్ళో డాక్టర్ శర్మ అనే ఒకాయన ఉండేవాడు. ఆ కుగ్రామంలో ఆయనే డాక్టరు. ఆ డాక్టరు కూతురిపేరు శశి. ఈ అమ్మాయి రజనీష్ ఇద్దరూ చిన్నప్పటి నుంచీ స్నేహితులు. కలసి మెలసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ మధ్యన ప్రేమ చిగురించింది. చిన్ననాటి ప్రేమ చాలా మధురమైనది. దానిలో సెక్స్ అనేది ఉండదు. అలాంటి ప్రేమ వాళ్ళిద్దరి మధ్యన ఉండేది. అయితే, ఉన్నట్టుండి ఏదో జబ్బు చేసిన శశి 1947 లో చనిపోయింది. అప్పటికి రజనీష్ కి 16 ఏళ్ళు. ఆ అమ్మాయికి 14 ఉంటాయేమో? చనిపోయేటప్పుడు రజనీష్ ని చూస్తూ ఆ అమ్మాయి ఇలా అన్నది ' నేను మళ్ళీ వస్తాను. నీ తోడుగా ఉంటాను. నిన్ను చూసుకుంటాను'.
తర్వాత రెండేళ్లకు 1949 లో క్రిష్టియన్ ఉల్ఫ్ స్మిత్ అనే అమ్మాయిగా శశి మళ్ళీ బ్రిటన్ లో పుట్టిందని ఓషో అనేవాడు. ఈ అమ్మాయి 20 ఏళ్ళ వయసులో ఆధ్యాత్మికతను వెతుక్కుంటూ ఇండియాకు వచ్చి 1989 లో చనిపోయేవరకు ఓషోతో ఉండిపోయింది. ఓషో సమక్షంలో ఈమెకు తన పూర్వజన్మ గుర్తు వచ్చిందని అంటారు. అది నిజమో కాదో మనకు తెలియదు. ఎవరికీ తెలియదు. కానీ వాళ్ళిద్దరి మధ్యనా చాలా గట్టి ప్రేమ ఉండేది. దాదాపు 20 ఏళ్ళపాటు ఒషోని కంటికి రెప్పలాగా చూసుకుంది.
ఓషోకు సేవ చెయ్యడం అంటే మాటలు కాదు. అది ఒక ధ్యానం లాంటిదే. అనుక్షణం ఎంతో జాగరూకతతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఆయన ఆరోగ్యం మంచిది కాదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఆయనకు ఉండేది. ఆయనకు ముఖ్యంగా డస్ట్ ఎలర్జీ ఉండేది. కొద్దిగా దుమ్ము తగిలినా ఆయనకు జలుబు చేసేది. ఆస్తమా ఎటాక్ కూడా వచ్చేది. 17 డిగ్రీలు దాటిన వాతావరణం ఆయనకు పడేది కాదు. దీనికి తోడూ ఆయనకు డయాబెటీస్ ఉండేది. ఒక చిన్న పిల్లవాడిని చూసుకున్నట్లు ఆయనను చూసుకోవాల్సి వచ్చేది. ఇదిగాక, పెద్ద చప్పుడులు ధ్వనులు ఆయన భరించలేడు. కొంతమంది ఒంటి వాసన ఆయనకు పడేది కాదు. ఇంటి గదులు ఎంతో క్లీన్ గా ఉంటె తప్ప ఆయన ఉండలేకపోయేవాడు. ఇలాంటి సమస్యలున్న మనిషిని ఎలా చూసుకోవాలి? వివేక్ ఈ పనులన్నీ చాలా ఓపికగా 20 ఏళ్ళ పాటు చేసింది. కానీ ఏనాడూ తన ఆధిపత్యం చేలాయించాలని చూసేది కాదు. ఒక నీడలాగా మౌనంగా ఆయన పక్కనే ఉండేది. సేవ చేసేది. అంతే !
ఇదంతా ఇంటర్ నెట్లో దొరుకుతుంది. ఓషో పుస్తకాలలో దొరుకుతుంది. అది కాదు నేను చెప్పబోయేది. వివేక్ చాలా అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయింది. ఇప్పటికీ ఈ మిస్టరీ తేలలేదు. ఈమె చావును హడావుడిగా ముగించేసి, చనిపోయిన రెండే రెండు గంటలలో ఆమెను దహనం చేసేసి, ఏమీ జరగనట్టు నటించారు ఓషో ఆశ్రమ నిర్వాహకులు. అప్పటికి ఓషో చక్కగా బ్రతికే ఉన్నాడు. జీవితాంతం తనకి సేవ చేసిన అమ్మాయికి అదా ఓషో ఇచ్చిన బహుమతి? ఇదా గురుత్వమంటే?
ఓషోకు ఇంత నమ్మకంగా ప్రేమగా 20 ఏళ్ళు సేవ చేసిన వివేక్. ఓషో చనిపోయే 40 రోజుల ముందుగా తను చనిపోయింది. అప్పటికి ఆమెకు 40 ఏళ్ళు మాత్రమే. ఆమె చనిపోయిన వెంటనే ఒక రెండు గంటలలో చడీ చప్పుడూ లేకుండా, ఒక అనామకురాలిని చేసినట్లు, ఆమెను దహనం చేసేశారు. ఇది వివేక్ ను అభిమానించే ఎందరినో కలచివేసే సంఘటన ! ఇది జరిగి నేటికి 31 ఏళ్ళు గడిచినప్పటికీ వివేక్ మరణం ఈనాటికీ ఒక తేలని రహస్యంగానే మిగిలిపోయింది.
ఓషో శిష్యులలో ఇప్పటికీ బ్రతికున్నవాళ్ళు ఈ విషయం మీద కల్లబొల్లి కాకమ్మ కధలు చెబుతున్నారు గాని అసలు విషయం ఎవరూ చెప్పడం లేదు. అందుకని, ఈ రహస్యాన్ని జ్యోతిష్యం సహాయంతో చేదిద్దామని అనుకున్నాను. జ్యోతిష్యశాస్త్రాన్ని సరిగ్గా ఉపయోగించడం తెలిస్తే, జరిగిపోయినది, జరగబోయేది, జరుగుతున్నది అన్నీ ఇంట్లోనుంచి కదకుండా తెలుసుకోవచ్చు. అదే ఈ సైన్స్ గొప్పదనం. ఇక చదవండి !
ఓషో శిష్యులలో చాలామంది 1949 ప్రాంతాలలో పుట్టారు. ఆ సమయంలో గురువు మకరరాశిలో సంచరిస్తూ నీచస్థితిలో ఉన్నాడు. వీళ్ళందరూ గురుదోష బాధితులు. అందుకే వీళ్ళ జీవితాలు అలా గడిచి, చివరికి రకరకాలుగా విషాదాంతాలయ్యాయి.
అందులోనూ ఈమెది అనూరాధా నక్షత్రం అయింది. అనూరాధా నక్షత్ర జాతకులు విచిత్రమైన మనుషులు. ఎందుకంటే వీరికి చంద్రుడు నీచస్థితిలో ఉంటాడు. అందుకే వీళ్ళ మనస్సు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో వీరికే తెలియదు. విశాఖ - 4 వ పాదం, జ్యేష్ట నాలుగు పాదాలు కూడా అంతే. వీళ్ళ మనసులు ఎటు పోతుంటాయో వీరికే తెలియదు.
నక్షత్రాలకు కొన్ని లక్షణాలు ఉండటం నిజమే. ఆయా నక్షత్రాలలో పుట్టినవారికి ఆయా లక్షణాలు ఉండటం కూడా నిజమే. ప్రాచీన వేదకాలంలో విశాఖ నక్షత్రాన్ని 'రాధ' అనేవారు. దానిని అనుసరించి ఉంటుంది గనుక దాని తరువాత నక్షత్రం అనూరాధ అయింది. అనూరాధా నక్షత్రజాతకులు ఎప్పుడూ ఎవరినో ఒకరిని అనుసరిస్తూ ఉంటారు. లేదా ఎవరినో ఒకరిని ఆశ్రయించి, వారిపైన ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. ఈ ఆధారపడటం అనేది భౌతికంగా కావచ్చు లేదా మానసికంగా కావచ్చు. వివేక్ విషయంలో రెండూ జరిగాయి. 1970 లో ఓషోను కలిసినది మొదలు 1989 లో తను చనిపోయేవారకూ వివేక్ ఓషోతోనే ఉన్నది.
నవమాదిపతి ఐన గురువు సప్తమంలో నీచస్థితిలో ఉండటం - ఈమె గురువు, లవరు రెండూ అయిన ఓషోని సూచిస్తున్నది.
కుటుంబస్థానంలోని శని - ఈమె కుటుంబంలో ఉన్న శాపాన్ని సూచిస్తున్నాడు. ఈమె పెద్దల జీవితాలలో కూడా ఇలాంటి సంఘటనలే ఉండి ఉండవచ్చు.
పంచమంలో నీచస్థితిలో ఉన్న లగ్నాధిపతి చంద్రుడు సమాజపు కట్టుబాట్లకు లొంగని ఒక విపరీతప్రేమ వ్యవహారాన్ని చూపుతున్నాడు. నవమంలో ఉన్న పంచమాధిపతి కుజుడు - ఒక ప్రసిద్ధుడూ శక్తివంతుడూ అయిన గురువుతో ప్రేమలో పడటాన్ని సూచిస్తున్నాడు.
ఇంతకంటే ఎక్కువగా వివరించవలసిన పని లేదు. ఇది ఈమె జాతకమే.
ఈమె చనిపోయిన 9-12-1989 న గ్రహస్థితి ఇలా ఉన్నది.
- ఓషో మీద విపరీతమైన ప్రేమ.
- ఓషో ఇంకో నెలలో పోతాడని డాక్టర్లు చెప్పడం
- పూర్తిగా చెడిపోతున్న తన ఆరోగ్యం.
- దానికితోడు గజిబిజి మనసు
- చెడు దశ
- చెడు గోచారం
- వేధిస్తున్న పీ ఎమ్మెస్
- అందుబాటులో ఉన్న రకరకాల ఆత్మహత్యా పద్ధతులు
- వాటిని అమలు చేయగల నిపుణులు
- ఓషో పోయాక తన గతి ఏమౌతుందో అన్న భయం
7, సెప్టెంబర్ 2020, సోమవారం
Ma Anand Sheela - జాతక పరిశీలన - 2
ఇప్పుడు ఈమె జాతకాన్ని సంస్కరించి జనన సమయాన్ని రాబడదాం. నేను చేయబోయే విశ్లేషణ జ్యోతిష్య విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చాలా కష్టమైన సమగ్రమైన విశ్లేషణ. పైపైన జ్యోతిష్యం వచ్చిన వాళ్లకు అర్ధం కాదు. జాగ్రత్తగా గమనించండి.
జీవితంలో కొన్ని సంఘటనలు తెలిసిన వాళ్ళకు, అంటే కొంచం పెద్ద అయినవాళ్లకు జననకాల విశ్లేషణ చేసే విధానం వేరుగా ఉంటుంది. జనన సమయాన్ని రికార్డ్ చేయకపోతే, చిన్నప్పుడే దానిని రాబట్టే విధానం వేరుగా ఉంటుంది. రెండూ శాస్త్రసమ్మతమైనవే. ఇందులో మొదటిదాన్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నాను.
వర్గచక్రాలనేవి భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న అద్భుతమైన ఉపకరణాలు. వాటిని వాడి జనన సమయం తెలియని వారి జాతకంలో దానిని ఎలా బయటకు తియ్యవచ్చో ఇప్పుడు చూడండి.
వికీ పీడియా ప్రకారం, ఆరుగురు సంతానంలో షీలా చిన్నది. కనుక ఆమెది వృషభ, కర్కాటక, వృశ్చిక, మీన లగ్నాలలో ఏదో ఒకటి అవ్వాలి. 5, 7, 9 భావాలను బట్టి ఆమె మనస్తత్వం, ఆమె గురువు, ఆమె ప్రేమవ్యవహారాలు, పెళ్లిళ్లు వీటన్నిటికీ ఈ నాలుగు లగ్నాలు మాత్రమే సరిపోతాయి..
28 - 12 - 1949 న రేవతి నక్షత్రం ఉన్నది. అందులోని నాలుగు పాదాలు ఈ లగ్నాలను కలిగి ఉన్నాయి.-
రేవతి - 2 : 4.08 - 6.23 వృశ్చిక లగ్నం
రేవతి - 3: 11.51 - 13.21 మీన లగ్నం
రేవతి - 3: 15.03 - 17.01 వృషభ లగ్నం
రేవతి - 4: 19.13 - 21.28 కర్కాటక లగ్నం
దాదాపు 17 గంటల వ్యవధిలో ఈ నాలుగు లగ్నాలు ఒక్కొక్కటి దాదాపు రెండు గంటలపాటు ఉంటాయి. వాటిల్లో నుంచి సరియైన లగ్నాన్ని, జనన సమయాన్ని మనం రాబట్టాలి.
రేవతి - 2
ఇది 4.08 - 6.13 మధ్యలో వృశ్చిక లగ్నంతో ఉన్నది. నవాంశలో చంద్రుడు మకరం ఉంటూ, రాశి తుల్య నవాంశ పద్దతిలో అక్కడున్న మూడు గ్రహాలను ఆవరిస్తున్నాడు. మకరరాశి చాలా మొండి మనస్తత్వాన్నిస్తుంది. వీళ్ళు ఓటమిని అంగీకరించే మనుషులు కారు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ చివరకు విజయాన్ని సాధిస్తారు.
ద్వాదశాంశలో చంద్రుడు వృశ్చికరాశిలో నీచలో ఉన్నాడు. 4.31 - 4.41 మధ్యలో మకర లగ్నం ఉదయిస్తోంది. నీచ శుక్రుడు నవమంలో ఉంటూ నీచ గురువును సూచిస్తున్నాడు. కనుక జనన సమయం ఈ మధ్యలోనే ఉండాలి.
ఈ నక్షత్రపాదంలో చంద్రుడు కుంభరాశిలోకి వస్తున్నాడు. కుంభరాశివారు నిస్వార్ధదానగుణం కలిగి ఉంటారు. సాయపడే తత్త్వం వీరికి పుట్టుకతో వస్తుంది. నా ఉద్దేశ్యం ప్రకారం తన గురువైన ఓషోని ఈమె నిజంగానే మనస్పూర్తిగానే ప్రేమించింది. ఈ మధ్య ఇండియాకు వచ్చినపుడు కరణ్ జోహార్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా 'నాకిప్పటికీ ఓషో అంటే గౌరవమే' అంది. షీలా ఆరిగాన్ వదిలి పారిపోయినప్పుడు ఓషో ఆమెను నానా బూతులు తిట్టాడు.అయినా సరే షీలా ఆయనను ఒక్కమాట అనలేదు. ఈ కోణంలో ఓషో కంటే షీలా మంచిదని అనిపిస్తుంది.
ఈ సమయానికి బుధ - రాహు - గురుదశ నడిచింది. రాహువు లగ్నంలో ఉన్నాడు. ఇది గురు చండాలయోగం. గత జన్మనించి వచ్చిన గురుశాపం ఇది. బుధుడు నీచ గురువు కర్మస్థానమైన తృతీయాన్ని, ప్రేమవ్యవహారాలను సూచించే పంచమాన్ని, వివాహాలకు కారకమైన సప్తమాన్ని చూస్తున్నారు.
రేవతి - 3
15.03 నుంచి 17.01 మధ్యలో వృషభలగ్నం ఉదయిస్తోంది.
దీనిలో చంద్రుడు మళ్ళీ కుంభరాశిలోకి వచ్చి ఉన్నాడు. దీని ఫలితాన్ని పైన వివరించాను కనుక మళ్ళీ చెప్పనవసరం లేదు. 15.40 నుంచి 15.52 మధ్య ఉన్న సమయం ఈమె జీవితాన్ని చాలా సరిగా చూపిస్తున్నది. ఎందుకంటే నీచ రాహువు నవమంలో ఉంటూ, గురువుకు కారకుడౌతూ గురుచండాల యోగాన్నిస్తూ ఒక దుర్మార్గుడైన గురువును సూచిస్తున్నాడు.
ఇప్పుడు షష్ట్యంశకు వద్దాం. ఈ రెండు సమయాలకూ ఇది వృషభ లగ్నాన్నే చూపిస్తున్నది. కనుక ఇంకా లోతుకు పోవాలి.
ఈ సమయంలో బుధ - రాహు - శుక్రదశ నడుస్తూ ఈమె జీవిత గమనాన్ని చాలా సరిగ్గా చూపిస్తున్నది.
రేవతి - 4
ఈ నక్షత్ర పాదంలో కర్కాటక లగ్నం 19.13 నుంచి 21.28 వరకూ ఉదయిస్తున్నది.
ఈ సమయానికి జననకాల దశగా బుధ శని శని దశ నడుస్తున్నది. ఈ దశ ఈమె యొక్క మూడు పెళ్ళిళ్ళను, ప్రేమ వ్యవహారాలను, ఈమెకున్న శాపాలను, వేదనలను, గురువువల్ల పడే బాధలను చూపిస్తున్నది.
ఇప్పటి వరకూ మనం చేసిన విశ్లేషణను బట్టి మనకు నాలుగు సమయాలు వచ్చాయి. వీటిని మనం చిత్రిక పట్టాలి. అవి :
1. 4.41 AM
2. 13.19 PM
3. 15.47 PM
4. 20.22 PM
షీలా జీవితంలో జరిగిన సంఘనలతో ఈ సమయాలను పోల్చి చూచి వీటిలో ఏది సరియైనదో నిర్ణయించాలి. వాటిలో ఓషో మరణం ముఖ్యమైన సంఘటన. ఓషో 1990 జనవరి 19వ తేదీన అనుమానాస్చపద పరిస్థితులలో పూనాలో చనిపోయాడు.
జనన సమయ పరీక్ష
4.41 గంటల జాతకం వృశ్చిక లగ్నం - మీనరాశి
ఆ రోజున రవి- చంద్ర - బుధదశ నడిచింది. సూర్యుడికి గురువుకి సంబంధం లేదు. నీచచంద్రుడు నవమాధి పతిగా ఉంటూ నీచ గురువును సూచిస్తున్నాడు. బుధుడు నవమానికి పన్నెండులో ఉంటూ గురువు చావును సరిగానే చూపిస్తున్నాడు.
13.19 గంటల జాతకం మీనలగ్నం మీనరాశి
ఓషో చనిపోయిన రోజున ఈ జాతకానికి చంద్ర - చంద్ర - చంద్రదశ నడిచింది. నవమాదిపతి అయిన కుజినిచేత చూడబటటం తప్ప చంద్రునికి గురువు మరణంతో సూటి సంబంధం లేదు. కనుక ఈ సమయం సరిపోదు.
15.47 గంటల జాతకం వృషభలగ్నం మీనరాశి
ఆ రోజున చంద్ర - రాహు - రాహుదశ నడిచింది. నవమమైన మకరం నుండి చంద్రుడు రాహువు తృతీయంలో ఉంటూ ఆయుస్శును పాడుచేస్తున్నారు. చంద్రురుడు మారకుడు. నవమాదిపతి అయిన శని నుండి చంద్రుడు రాహువు ఇద్ద్దరూ 8 ఇంటిలో ఉంటూ గురువు చావును సూచిస్తున్నారు. కనుక ఈ సమయం కరెక్ట్ గా సరిపోతున్నది.
20.22 గంటల జాతకం కటకలగ్నం మీనరాశి
ఆ రోజున చంద్ర - శని - శనిదశ నడిచింది. ఇది మానసిక వేదనను ఇస్తుంది. శని 8 వ అధిపతి అవుతూ 9 కి 12 గా గురువు చావును సూచిస్తున్నాడు. చంద్రుడు ఆయుస్సును సూచించే మూడవ ఇంటిలో ఉన్నాడు. శని నాశనాన్నిచ్చే 8 వ ఇంటిలో ఉన్నాడు. చంద్రుడు శని ఇద్దరూ షష్టాష్టకంలో ఉన్నారు.
1965/66 లో ఉన్నత చదువుల కోసం షీలా అమెరికాకు వెళ్ళింది.
20.22 - శుక్ర - చంద్రదశ నడిచింది. శుక్రుడు 4 అవ అధిపతిగా విద్యనిస్తాడు. చంద్రుడు లగ్నాదిపతిగా 9 లో ఉంటూ విదేశ గమనాన్నిచ్చాడు.
15.47 - శుక్ర శుక్ర దశ. లగ్నాధిపతి అయిన శుక్రుడు 9 లో ఉంటూ విదేశీయాత్రనిచ్చాడు.
1981 లో ఓషోకి సెక్రటరీ అయింది. అమెరికాకు వెళ్లారు.
15.47 - శుక్ర - కేతుదశ. కేతువు ఉచ్చబుధునికి కారకుడు. తెలివైన కుట్రను చూపిస్తున్నాడు. భూకారకుడైన కుజునితో ఉంటూ అమెరికాలో భూమి కొనుగోలును చూపుతూన్నాడు.
20.22 - రవి - రాహు దశ. ఈ సంఘటనను చూపడం లేదు.
1984 నుంచి 85 - ఆరిగాన్ లో గొడవలు - కుట్రలు
20.22 - రవి దశలో బుధ, కేతు శుక్ర దశలు. రవి 6 లో ఉండటం వల్ల గొడవలు ఉంటాయి. కానీ నేరాలు ఘోరాల సూచన లేదు.
15.47 - రవి దశలో గురు, శని అంతర్దశలు. రవి 8 లో రహస్య కుట్రలిస్తాడు. 9 లో ఉన్న గురువు గురువును సూచిస్తాడు. శని 9 అధిపతిగా బాధకుడు. గురువు చేతిలో కీలుబొమ్మగా మారి నానా నేరాలు చెయ్యడం సూచన ఉన్నది. కనుక 15.47 బాగా సరిపోతున్నది.
13 Sept 1985 న ఈమె ఓషోని వదిలేసి యూరప్ కి పారిపోయింది.
15.47 chart - రవి - శని - శుక్రదశ నడిచింది. రవి 8 లో ఉంటూ గురువును వదిలెయ్యడం చూపుతున్నాడు. 9 వ అధిపతి అయిన శని బాధకుడు, గురువు వల్ల బాధలను సూచిస్తున్నాడు. లగ్నాధిపతి 9 లో ఉంటూ విదేశాలకు పోవడాన్నిస్తున్నాడు. ఈ సమయం మళ్ళీ సరిపోతున్నది.
పై విశ్లేషణను బట్టి, 28.12.1949 న 15.47 అనేది ఆమె ఖచితమైన జనన సమయంగా నేను భావిస్తున్నాను.
ఈ సమయానికి ఉన్న వృషభ లగ్న జాతకం ఈమె జీవితంలో అన్ని సంఘటనలను సరిగ్గా చూపిస్తున్నది. మచ్చుకి ఈ క్రింది విషయాలు గమనించండి.
- 11 వ భావం నుండి ఈమె అయిదుమంది అన్నలు అక్కలు సరిపోతున్నారు.
- 9 లో ఉన్న నీచ గురువు ఈమె తండ్రిని సూచిస్తున్నాడు. ఆయనొక మహానుభావుడు. 16 ఏళ్ళ వయసులో కూతురిని అమెరికాకు పంపిస్తూ - 'నీకు మొదట తారసపడిన స్నేహితుడిని తొందరపడి పెళ్లి చేసుకోకు. కొంతమందితో సెక్స్ ఎంజాయ్ చేయి. ఆ తరువాత వారిలో నీకు బాగా నచ్చిన ఎవడో ఒకడిని ఎంచుకో' - అన్న జ్ఞానబోధ చేసిన మహా గొప్ప తండ్రి.
- 9 లోని నీచ గురువు, ఈమె గురువైన ఓషోని కూడా సూచిస్తాడు. ఈమె చేత అడ్డమైన పనులన్నీ చేయించిన ఓషో, చివరకి తను తెలివిగా తప్పుకున్నాడు. ఈమెను జైలు పాలు చేశాడు.
- 4 లో శని శత్రుస్థాన స్థితి వల్ల సంసార సౌఖ్యం ఉండదు. సుఖం ఉండదు. శాంతీ ఉండదు.
- 5 లో కుజ కేతువుల వల్ల మహా మొండి మనస్తత్త్వం, చావు తెలివీ ఉంటాయి.
- లగ్నాధిపతి శుక్రుడు 9 లో మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల జీవితమంతా విదేశాలలో నివాసం ఉంటుంది.
- ఈ జాతకం ఈమె యొక్క గట్టి మనస్సుని కూడా కరెక్ట్ గా చూపిస్తున్నది. నా ఉద్దేశ్యంలో, ఇంకొక ఆడపిల్ల అయితే ఇన్ని కష్టాలను, అది కూడా విదేశాలలో ఉంటూ, ఒంటరిగా తట్టుకునేదే కాదు. వృషభలగ్న జాతకులు అలాంటి వారే. ఎన్ని కష్టాలనైనా తట్టుకుని ధైర్యంగా నిలబడతారు.
ఓషోని వదిలేసి షీలా చాలా మంచిపని చేసిందని నా ఉద్దేశం. ఈమె జీవితాన్ని ఓషో పూర్తిగా భ్రష్టు పట్టించాడు. ఒకవేళ ఇంకా ఇంకా ఓషోతోనే ఉండి ఉన్నట్లయితే ఈమె జీవితం ఇంకా సర్వనాశనం అయిపోయి ఉండేది.
ఓషో ఈమెను నానా బూతులు తిట్టినా ఈమె తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అక్కడే ఈమె ఔన్నత్యము, ఓషోపట్ల ఈమెకున్న గౌరవము బయటపడుతున్నాయి. మొదట లక్ష్మిని, తర్వాత షీలాను, ఆ తర్వాత హాస్యను తన స్వార్ధానికి వాడుకోబట్టే చివరకు ఓషో హత్య చేయబడ్డాడు. అంతేకాదు, ఆయన ప్రేమికురాలు సేవకురాలు అయిన వివేక్ కూడా చంపబడింది. అవన్నీ ఇంకోసారి చూద్దాం.
ప్రస్తుతం ఈమెకు రాహు దశ జరుగుతున్నది. లాభస్థానంలో ఉన్న రాహువు, గోచారంలో లాభంలో ఉన్న శని ఈమెను మళ్ళీ భారతదేశానికి తెచ్చారు. ఈమె జీవితం మీద సినిమాలు తీయిస్తున్నారు. ఇప్కపుడామెకు 70 ఏళ్ళు వచ్చాయి. కనీసం ఇప్పుడైనా ఈమె జీవితంలో సంతోషం నిండాలని కోరుకుందాం !
2, సెప్టెంబర్ 2020, బుధవారం
Ma Anand Sheela - జాతక పరిశీలన - 1
ఓషో ప్రభావం ఇండియానుంచి అమెరికాకు విపరీతంగా వ్యాపించడానికి ముఖ్య కారకురాలు మా ఆనంద్ షీలా లేదా షీలా అనే గుజరాతీ మహిళ. ఆయన్ను అమెరికా తీసుకెళ్లింది, అక్కడ ఆరిగన్ రాష్ట్రంలో రజనీష్ పురం పెట్టడానికి, పెరగడానికి, కూలిపోవడానికి, అక్కడ జరిగిన నేరాలకు, ఘోరాలకు, చివరికి అందరూ జైలు పాలవ్వడానికి, వీటన్నిటికీ కారకురాలిగా లోకం ముందు దోషిగా నిలబడిన వ్యక్తి షీలా. ఈమె జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
వికీపీడియా ప్రకారం ఈమె 28-12-1949 తేదీన గుజరాత్ లోని బరోడాలో పుట్టింది. దీనినిప్పుడు వడోదర అంటున్నారు. జనన సమయం తెలియదు. అయినా సరే, మనకేమీ ఇబ్బంది లేదు గనుక, జాతకాన్ని పరిశీలిద్దాం. ఈమె జాతకాన్ని పైన చూడవచ్చు.
ఎంతగా కాదనుకున్నప్పటికీ, భారతీయ ఆధ్యాత్మికచింతనా మార్గంలో ఓషో పాత్రను పూర్తిగా కాదనలేం. ఆయన సంస్థలో ఎన్ని ఘోరాలు, నేరాలు జరిగినా, ఆయన పుస్తకాలను, ఆయన ఆలోచనాధోరణిని మాత్రం కాదనడం కష్టం. మాటలవరకూ ఆయన చాలా గొప్పదైన, ఆచరణాత్మకమైన ఫిలాసఫీని చెప్పాడు. చేతల్లో ఎంతవరకూ ఆచరించాడనేది తరువాతి సంగతి. అందులో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడనేది వాస్తవం. అందరినీ విమర్శించి చివరకు తానే నవ్వులపాలయ్యాడు. ఏదేమైనప్పటికీ, ఇండియా, అమెరికాలు రెండూ ఓషోని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేవు. ఓషో తరువాత వచ్చిన గురువులందరూ కొద్దో గొప్పో ఆయన ఫిలాసఫీని చెబుతున్నవాళ్ళే.
షీలాది రేవతీనక్షత్రం రెండోపాదం. శుక్లనవమి బుధవారం నాడు పరిఘా యోగంలోఈమె పుట్టింది. నాదికూడా రేవతీనక్షత్రం రెండోపాదమే. అందుకేనేమో, లోకమంతా షీలాని ఎంత తిట్టినా, నాకెందుకో ఆమెను చూస్తే 'అయ్యో పాపం' అనిపిస్తుంది. ఓరెగాన్ లో జరిగిన నేరాలన్నీ ఓషో, షీలాలు కలిసే చేశారు. అయితే, ఓషో మాత్రం బయటపడకుండా తెరవెనుక కూచుని, అన్నీ షీలా చేత చేయించేవాడు. చివరికి తాను అమాయకుడిలా నటించి, ఆమెని బలిపశువును చేశాడు. ఇది ఓషో చేసిన అతి పెద్ద తప్పు. చేసేదంతా చేయించి, చివరకు ఒక ఆడపిల్లను బలిచెయ్యడం చాలా ఘోరమైన పాపం. ఇదొక గురువు లక్షణం కానేకాదు.
ఓషో చెప్పిన ఉపన్యాసాలు, ఆయన మాట్లాడిన విషయాలు, తనను గురించి తాను చెప్పుకున్న మాటలు, చేయించుకున్న ప్రచారాలు చూస్తే, ఆయన స్థాయి బుద్ధునికంటే ఎక్కువగా తోస్తుంది. మరి అంత శక్తి ఉన్నవాడు షీలా ఎలాంటిదో గ్రహించలేక పోయాడా? మొదట్లోనేమో 'నువ్వు నాతొ ప్రేమలో ఉన్నావు. నేను నీతో ప్రేమలో ఉన్నాను' అన్నాడు. చివర్లోనేమో 'అదొక బజారుముండ. నేను తనతో పడుకోలేదని తనకి కుళ్ళు' అన్నాడు. అంత ఛండాలంగా ఒక ఓపెన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఒక గురువుని నేనిప్పటివరకూ చూడలేదు.
క్లుప్తంగా చెప్పాలంటే, Zorba the Buddha అనేది ఆయన విధానం. అంటే అత్యంత భోగాలు అనుభవిస్తూ కూడా, ఒక బుద్ధుడున్న స్థితిలో ఉండే వ్యక్తి అనర్ధం. ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఎవడూ దీనిని చెయ్యలేడు. ఓషో కూడా ఊరకే మాటలు చెప్పాడు గాని, ఆచరణలో ఘోరంగా విఫలమయ్యాడు. ఆ క్రమంలో మాయమాటలు చెప్పి ఎన్నో జీవితాలను నాశనం చేశాడు.
జీవితాలను బాగు చేసేవాడు, మనుషులను జ్ఞానమార్గంలో నడిపించి మోక్షానికి దారి చూపేవాడు 'గురువు' అన్న పదానికి అర్హుడౌతాడు గాని, జీవితాలు నాశనం చేసి, చివరికి 'నాకేం తెలీదు' అని తప్పించుకునేవాడు కాలేడు. అదే విధంగా - 'చేసేపని ఎలాగున్నా పరవాలేదు, చేరే గమ్యం ప్రధానం' అని చెప్పేవాడు అసలు గురువే కాడు. చేసే పనిని బట్టి, నడిచే నడకను బట్టి గమ్యం ఉంటుంది గాని దానికి భిన్నంగా ఉండదు. ఒళ్ళంతా బురద పూసుకుని పెంటలో నడుస్తూ, 'చివరికి నేను స్వర్గాన్ని చేరతాను' అనుకుంటే అది జరిగే పని కాదు.
1970 ప్రాంతాలలో పూనాలోని ఓషో ఆశ్రమంలో 'థెరపీ' లనబడే గ్రూప్ మెడిటెషన్లు జరిగేవి. విదేశీయులకు కూడా అవి చాలా ఖరీదైన ప్రోగ్రాములు. వాటిలో భారతీయులకు ప్రవేశం లేదు. అవి చాలా రహస్యంగా జరిగేవి. వాటిలో హింస, కొట్టుకోవడం, గ్రూప్ సెక్స్ మొదలైన చండాలమంతా ఉండేది. వాటిల్లో పాల్గొనేవాళ్ళలో చాలామందికి కాళ్ళు చేతులు విరిగిన సంఘటనలు, ముఖాలు వాచిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ అవి ఎంతో మానసిక ఊరటని, విశ్రాంతిని, రిలీఫ్ ని ఇచ్చేవి. వాటికోసం విదేశీయులు బారులు తీరేవాళ్ళు. కానీ వాళ్ళు తెచ్చుకున్న డబ్బులు త్వరలోనే అయిపోయేవి. ఏం చెయ్యాలో తెలీక, కొంతమంది తెల్ల అమ్మాయిలు పూనాలో వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించి మరీ ఆ ప్రోగ్రాములలో పాల్గొనేవాళ్లు. తెల్లబ్బాయిలు డ్రగ్స్ అమ్మేవాళ్ళు. ఓషో ఈ రెంటినీ తప్పని చెప్పేవాడు కాదు. వారిని ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించమనేవాడు. అవి కట్టి ప్రోగ్రాములు చెయ్యమనేవాడు. పైగా, ఎవరిదగ్గరైనా పడుకున్నప్పుడు కూడా ధ్యానం ఎలా చేయవచ్చో ఉపన్యాసాలిచ్చేవాడు. అంటే, శిష్యులు ఏమై పోయినా తనకు మాత్రం డబ్బే ప్రధానమని చెప్పకనే చెప్పేవాడు. ఈ కోణంలో ఓషో రక్తంలోని ఒక నీచమైన జైన్ వ్యాపారస్తుడు బయటపడతాడు. ఓషో జైన్ మతస్తుల ఇంట్లో పుట్టాడు.
ధ్యానం కోసం పూనా వీధుల్లో ఒళ్ళమ్ముకోడానికి సిద్ధపడిన ఆ అమ్మాయిలను తలచుకుంటే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంత శుద్ధమైన, ఎంత అమాయకమైన మనసులో వాళ్ళవి ! ఏం? అలాంటి వాళ్ళకోసం ధ్యానాన్ని ఉచితంగా నేర్పలేకపోయాడా ఇన్ని నీతులు చెప్పిన ఓషో? నీ బోడి ధ్యానాన్ని చెయ్యడానికి ఒకమ్మాయి ఒళ్ళమ్ముకోవాలా? దరిద్రుడా ! నువ్వొక గురువా అసలు? నీ కుటుంబసభ్యులలో ఎవరైనా ఆ పని చేస్తే నీకెలా ఉంటుంది? అప్పుడు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తావా? ఎందుకు నీ పుస్తకాలు? వాటిల్లో నీతులు? పనికిమాలిన చెత్త !'
ఇవన్నీ చూచాడు గనుకనే యూజీ - 'ఓషో ఒక అమ్మాయిల బ్రోకర్' అన్నాడు.
ఆ అమ్మాయిలు గనుక ఇప్పుడు చనిపోయి ఉంటే, ఖచ్చితంగా స్వర్గంలో ఉంటారు. ఓషో ఖచ్చితంగా నరకంలో ఉంటాడు. ఇది నిజం !
'ప్రజల పాపాలకు రాజుకు శిక్ష పడుతుంది, శిష్యుల పాపాలకు గురువుకు శిక్ష పడుతుంది' - అంటారు. శిష్యులు తప్పు దారిలో పోతుంటే సరిదిద్దాల్సింది పోయి, వాళ్ళచేత నానా ఛండాలపు పనులు చేయించి, చివరలో వాళ్ళ ఖర్మకు వాళ్లను వదిలేసి తాను విమానమెక్కి పారిపోవడం ఒక్క ఓషోకే చెల్లింది. షీలా కూడా అదే చేసింది. ఇద్దరూ కలిసి వాళ్ళను అమాయకంగా నమ్మిన అందర్నీ ముంచారు. ఇదా గురుత్వమంటే ?
ఈమె జాతకంలో చూడగానే కనిపించే అంశం గురువు నీచత్వం. ఎవరి జాతకంలో నైతే గురువు నీచలో ఉంటాడో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడం ఈ జన్మలో సాధ్యం కానే కాదు, మిగతా గట్టి యోగాలు ఉండి, అవి సాయపడితే తప్ప. సాధారణంగా ఇలాంటి జాతకులకు ఒక నీచమైన గురువు లభిస్తాడు. లేదా, ఆ గురువు వల్ల వీళ్లకు భ్రష్టత్వం పడుతుంది. లేదా వీళ్ళే గురువును వెన్నుపోటు పొడుస్తారు. లేదా వీళ్ళే ఒక దొంగ గురువుగా అవతారం ఎత్తుతారు. ఎలా చూచినప్పటికీ, ఇది ఒక సూటియైన గురుదోషమే. ఈ కారణం చేతనే ఈ జాతకులు ఎంత గింజుకున్నా ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించలేరు. అలా జరగడానికి వాళ్ళ పూర్వకర్మమే కారణం అవుతుంది. పూర్వజన్మలో వీళ్ళు గురుద్రోహులై ఉంటారు. కనుక ఈ జన్మ ఇలా పోవలసిందే. లేదా, ఒక నిజమైన గురువు దొరికితే ఆయన సేవలో తరించాల్సిందే. ఈ గురుశాపం వల్ల వీళ్లకు ఇతర రెమెడీలు కూడా పనిచేయవు.
ఈమె జాతకం చాలా విచిత్రమైనది. ఈమె జాతకంలోని గ్రహస్థితులను గమనిద్దాం.
ధనుస్సులో రవి
ఇది చాలా ఆశపోతు మనస్తత్వాన్ని, దురహంకారపు తత్త్వాన్ని ఇస్తుంది. ధనుస్సు సహజధర్మ స్థానం కనుక మతపరంగా ఎదగడం, ధార్మిక సంస్థలలో ఉన్నత పదవులు నిర్వహించడం జరుగుతుంది.
మీనంలో రాహు చంద్రులు
రాహుచంద్రులు కలిస్తే అది ఒక మాఫియా లీడర్ మనస్తత్వాన్నిస్తుంది. కానీ ఇక్కడ రాహువు గురుక్షేత్రంలో ఉంటూ గురువును సూచిస్తున్నాడు. ఇదొక గురుచండాల యోగం. అంటే, ఛండాలపు గురువు లభిస్తాడని అర్ధం. అంతేగాక, సంప్రదాయ విరుద్ధమైన పనులు, నేరాలు చేసే యోగం ఉందని అర్ధం. హింసాత్మక కార్యక్రమాలకు, అనైతికమైన పనులకు, నేరపూరితమైన చర్యలకు ఈ యోగం ప్రేరకమౌతుంది. మీనం ఆధ్యాత్మిక రాశి గనుక, ఈ పనులన్నీ ఒక ఆధ్యాత్మిక సంస్థ ముసుగులో జరుగుతాయని తెలుస్తున్నది.
కన్యలో కుజ కేతువులు
ఇదొక భయంకరమైన అహంకార యోగం. ఇక్కడ కేతువు ఉచ్చబుదుడిని సూచిస్తున్నాడు. కనుక విపరీతమైన తెలివినీ, అదే సమయంలో మహామొండిదైన అధికారపూరిత మనస్తత్వాన్నీ తనమాటే సాగాలన్న పంతపు ధోరణినీ ఈ యోగం సూచిస్తుంది. దీనినే 'చావు తెలివి' అని మనం అంటూ ఉంటాం.
సింహంలో శని
దొడ్డిదారిన అధికారంలోకి రావడం, కొంతకాలం చక్రం తిప్పడం, తరువాత ఒక తోకచుక్కలాగా రాలిపోవదాన్ని ఈ యోగం సూచిస్తుంది. ఈ క్రమంలో చాలా చెడ్డ పేరును కూడా సంపాదించడం జరుగుతుంది.
మకరంలో బుధ గురు శుక్రులు
తను అనుకున్నది సాధించడానికి ఏ పనిని చేసినా పరవాలేదనే ఆలోచనా, దానికి అవసరమైన ప్లానింగూ, అనుచరులూ, చివరకు అంతా సర్వనాశనం కావడం ఈ యోగం వల్ల జరుగుతుంది. లోకంలో గొప్ప పేరును ఈ యోగం ఇస్తుంది. కానీ ఆ పేరుతో బాటు దారుణమైన చెడ్డపేరు కూడా వస్తుంది. బుద్ధి కారకుడైన బుధునితో నీచగురువు ఉండటం, ఒక నీచగురువు ఈమె బుద్ధిని పాడు చేస్తాడని సూచిస్తోంది. అక్కడే శుక్రుడుండటం ఈమెకు చాలామందితో ఉన్న సంబంధాలను, అది కూడా ఆ గురువు సంస్థలో ఉన్నవాళ్ళతో, సూచిస్తోంది.
ఇవన్నీ షీలా జీవితంలో జరిగినట్లు మనం స్పష్టంగా గమనించవచ్చు.
(ఇంకా ఉంది)
31, ఆగస్టు 2020, సోమవారం
'యోగ యాజ్ఞవల్క్యము' E Book నేడు విడుదలైంది

ఈ గ్రంథం పన్నెండు అధ్యాయములతో నిండి ఉన్నది. వీనిలో, వైదికధర్మమార్గము, దాని విధులతోబాటు, వర్ణాశ్రమధర్మములు, అష్టాంగయోగము మరియు దాని విభాగములైన, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు, తంత్రసాధనయైన కుండలినీయోగము మొదలైనవి ఒక్కొక్కటి సవివరముగా చెప్పబడినాయి. ఆధ్యాత్మికమార్గంలో జ్ఞాన, కర్మ, యోగముల ప్రాముఖ్యతను వివరించిన యాజ్ఞవల్క్యులు, విధిపూర్వకంగా చేయవలసిన వైదికనిత్యకర్మలను చేస్తూనే, అష్టాంగయోగమును కూడా ఆచరించాలని బోధిస్తారు.
ఈ ప్రాచీనగ్రంథములోని భావములను, విధానములను, తరువాతి కాలమునకు చెందిన యోగోపనిషత్తులు, హఠయోగప్రదీపిక, ఘేరండసంహిత మొదలైన ఇతరగ్రంథములు స్వీకరించాయి. గాయత్రీమహామంత్రముతోను, ఓంకారము తోను చేయబడే వైదికప్రాణాయామము, అశ్వినీదేవతలు చెప్పిన మర్మస్థాన ప్రత్యాహారము, అగస్త్యమహర్షి ప్రణీతమైన ప్రత్యాహారము, సగుణ నిర్గుణ ధ్యానములు ఈ గ్రంథముయొక్క ప్రత్యేకతలు.
వైదికధర్మమార్గమును, అష్టాంగయోగమును, తంత్రమును సమన్వయం చేయాలన్న ప్రయత్నం ఈ గ్రంథం లో మనకు గోచరిస్తుంది. యోగాభిమానులకు ఈ ప్రాచీనగ్రంథం ఎంతో ఉత్తేజాన్ని కలిగించి, వారిని దైవమార్గంలో ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
యధావిధిగా ఈ గ్రంధం కూడా google play books నుంచి లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.


























