18, ఆగస్టు 2016, గురువారం

మా అమెరికా యాత్ర - 38 (గురూజీ ఆఫ్ ది హోలీ ట్విన్స్)


















ఇప్పటివరకూ శ్రీరామకృష్ణుల మహా భక్తురాలైన గౌరీమా గురించి మాట్లాడుకున్నాం.ఇప్పుడు మళ్ళీ మన అసలు కధలోకి వద్దాం.

గాంగెస్ లో ఉన్న mothers trust/mothers place ఆశ్రమానికి ప్రస్తుతం అధ్యక్షురాలుగా 'ఇవా ష్రొడర్' అనే యూదువనిత ఉన్నారు.ఈమె సన్యాస నామం 'గౌరీవ్రత మా'.ఈమెకు ప్రస్తుతం 63 ఏళ్ళు.1973 నుంచీ (ఈమెకు 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటినుంచీ) ఈమె స్వామి భాష్యానందగారి శిష్యురాలు.

స్వామి భాష్యానందగారు చికాగోలో ఉన్న వేదాంత సొసైటీ మరియు మిషిగన్ గాంగెస్ లో ఉన్న వివేకానంద మొనాస్టరీ కి అధ్యక్షులుగా ఉన్నారు.స్వామి భాష్యానంద,స్వామి సర్వగతానంద వీరిద్దరూ 1960 ప్రాంతాల నుంచీ అమెరికాలో ఉంటూ శ్రీరామకృష్ణ వేదాంత భావాలను ప్రచారం చేసిన మహనీయులు.

వీరి గురించి ఇక్కడ చూడవచ్చు.

http://www.motherstrust.org/history.htm

http://www.vedantaprov.org/sarvagatananda.html

ఇవా ష్రోడర్ మొదటి సారిగా 20-5-1973 న తన గురువైన భాష్యానంద గారిని కలుసుకున్నారు. ఈమె వివాహం 1974 లో జరిగింది.ఈమె భర్త పేరు ఎడ్విన్ ష్రోడర్ జూనియర్. ఈయన IBM కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా ఉండేవాడు.1975 లో ఒక కుమార్తె జన్మించిన తర్వాత భార్యాభర్త లిద్దరూ వీరి గురువైన స్వామి భాష్యానందగారి వద్ద బ్రహ్మచర్య దీక్ష స్వీకరించారు. అప్పటినుంచీ వీరిద్దరూ కూతురుతో సహా జపధ్యానాలు చేస్తూ శుద్ధమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ చికాగోలో ఉండేవారు. జీవితంలో దేనికీ వీరికి లోటు లేదు.కానీ విలాసాలమీద ఇద్దరికీ మనసు లేదు. ఒక విధమైన ఆధ్యాత్మిక తపనతో, ఉన్నతమైన దివ్యజీవితం గడపాలన్న తృష్ణతో వీరిద్దరూ ఉండేవారు.శ్రీ రామకృష్ణ వివేకానందుల భావాలు వీరిని ఎంతగానో ఆకర్షించాయి.

1975 నుంచి 1985 వరకూ ఈమె తన కూతురైన జెస్సికాతో కలసి ప్రతిరోజూ ఉదయం నుంచీ రాత్రివరకూ చికాగో వేదాంత సొసైటీ ఆశ్రమంలోనే ఉంటూ ధ్యానసాధన గావిస్తూ అక్కడి సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేది.

తర్వాత కొన్నేళ్ళకు స్వామి రంగనాధానందగారి వద్ద సన్యాసం స్వీకరించిన ఎడ్విన్ ష్రోడర్, రామకృష్ణా మిషన్ లో చేరి,ఇండియాలోని బేలూర్ మఠానికి వెళ్ళిపోయాడు.ఇప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నాడు.

1989 లో తన గురువు ఆజ్ఞమేరకు ఈమె ఇండియాకు వచ్చి శ్రీశారదేశ్వరీ ఆశ్రమంలో సన్యాస దీక్ష స్వీకరించింది.విరజా హోమం సందర్భంలో ఈమెకు ఇవ్వబడిన సన్యాసనామం 'గౌరీవ్రత పురీ దేవి'. మొదటి సారిగా ఈ ఆశ్రమంలో సన్యాస దీక్ష స్వీకరించిన అమెరికన్ మహిళ ఈమెయే.

గౌరీమానే ఈమెగా పుట్టిందని ఒక నమ్మకం ప్రబలంగా ఉన్నది.ఎందుకంటే - అమెరికాలో వేదాంత ప్రచారం చెయ్యడానికి రావలసిందిగా గౌరీమాను వివేకానంద స్వామి అభ్యర్దించారు.కానీ ఇండియాలోనే చెయ్యవలసిన పని ఎంతో ఉండటంతో ఆమె అమెరికా వెళ్ళలేక పోయింది.కానీ -' నేను వచ్చే జన్మలో ఆక్కడ పుడతాను' అని గౌరీమా చెప్పిందని అంటారు.ఆ గౌరీమానే ఇవా ష్రోడర్  గా పుట్టిందని కొందరు నమ్ముతున్నారు.

మాతో ఆత్మలోకానంద ఇలా అన్నారు.

'గౌరీవ్రత మా సన్యాసం స్వీకరించడానికి ఇండియాకు వెళ్ళినపుడు నేనూ అక్కడ ఉన్నాను.శారదేశ్వరీ ఆశ్రమం వారు ఈమెను 10 రోజులపాటు నిరంతరం పరీక్ష చేశారు.ఈమె ఎలా ప్రవర్తిస్తుంది,ఎలా తింటుంది, ఏయే వస్తువులు ఇష్టపడుతుంది, ఎలా మాట్లాడుతుంది,ఎలా నిద్రపోతుంది మొదలైన అన్ని కోణాల్లోనూ ఈమెను క్షుణ్ణంగా పరీక్షించారు.అలా పరీక్షించి సంతృప్తి చెందిన తర్వాతే ఈమెకు సన్యాసం ఇవ్వడానికి వారు అంగీకరించారు.

అంతేకాదు.శారదేశ్వరీ ఆశ్రమంలో పాత గౌరీమా వాడిన వస్తువులున్నాయి. వాటిని ఈమె గుర్తుపట్టింది.ఆశ్రమం లోపలి గదులలో ఎక్కడెక్కడ ఏమున్నాయో ఈమె చెప్పింది.అవన్నీ వినిన అక్కడివారు ఈమె గౌరీమా అని,వివేకానంద స్వామి అభ్యర్ధన మేరకు అమెరికన్ శరీరంలో ఈ రకంగా మళ్ళీ వచ్చిందని నమ్మారు.

ఇండియాకు వచ్చి శారదేశ్వరీ ఆశ్రమానికి అధ్యక్షురాలిగా ఉండమని ఇప్పటికీ వారు ఈమెను పిలుస్తూ ఉంటారు.కానీ అమెరికాలో చెయ్యవలసిన పని ఎంతో ఉండటంతో ఈమె ఇండియాకు రావడానికి ఇష్టపడటం లేదు.

మేం గాంగెస్ ఆశ్రమానికి వెళ్ళిన మొదటి రోజునే - "గౌరీవ్రతమా దర్శనం సాధ్యమౌతుందా?" - అంటూ స్వామి ఆత్మలోకానంద గారిని అడిగాను.

దానికాయన - 'సాధ్యం కాకపోవచ్చు.ఆమె చాలా బిజీగా ఉంటారు' - అని జవాబిచ్చారు.

'మాకు ఎక్కువ సమయం అక్కరలేదు.ఒక 5 నిముషాలో లేక 10 నిముషాలో చాలు.ఊరకే ఆమె దర్శనం చేసుకుని వచ్చేస్తాం. ఏమీ మాట్లాడం.' అని ఆయనకు చెప్పాను.

'ఆమెతో చెప్పి చూస్తాను.' అన్నారాయన.

రెండు మూడు రోజులైనా ఈ విషయం గురించి ఆయన ఏమీ చెప్పడం లేదు. బాగుండదని మేమూ ఆ విషయాన్ని పొడిగించలేదు.

'గౌరీవ్రత మా' గురించి మేము చాలా విన్నాము.ఆమె ఒక ఫైర్ బ్రాండ్ సన్యాసిని అని,ఎంత పెద్దవారినైనా సరే చెడామడా కడిగి పారేస్తుందని,చాలా ధైర్యవంతురాలని,ఎవర్నీ లెక్క చెయ్యదని, అమెరికాలోని గ్రాండ్ రాపిడ్స్ అనే ఊరు కేంద్రంగా పనిచేస్తున్న 'బాలికా వ్యభిచార ముఠా' తో ప్రాణాలకు తెగించిమరీ దశాబ్దాలుగా ఒక్కతే పోరాడుతూ ఉన్నదని, ఈ క్రమంలో కొన్ని వందలమంది ఆడపిల్లలను ఆమె ఆ కూపం నుంచి రక్షించిందనీ - ఇలా చాలా చాలా ఆమె గురించి విన్నాము.

మేము అక్కడకు వెళ్లి మూడు రోజులైంది.ఆదివారం నాడు శ్రీరామకృష్ణా యూనివర్సల్ టెంపుల్ లో నేను 'శ్రీవిద్య' అనే సబ్జెక్ట్ మీద ఉపన్యాసం ఇచ్చాను.అదే రోజున నేను వ్రాసిన 'శ్రీవిద్యా రహస్యం', 'తారా స్తోత్రం' అనే పుస్తకాల కాపీలను స్వామి ఆత్మలోకానందగారికి ఇచ్చి వారి లైబ్రరీలో ఉంచమని చెప్పాను.గౌరీవ్రత మా గారికి కూడా కాపీలు ఇవ్వమని చెప్పాను.

మరుసటి రోజున దాదాపు మధ్యాన్నం పదకొండు గంటల సమయంలో మేము రిట్రీట్ హోమ్ బయట నిలబడి ఉండగా, మమ్మల్ని ఉన్నఫళంగా దేవాలయం దగ్గరకు రమ్మని చేతులు ఊపుతున్న స్వామి ఆత్మలోకానంద గారు కనిపించారు.ఏమిటా అని మేము అక్కడకు గబగబా నడుచుకుంటూ వెళ్లాం.దగ్గరకు వెళ్లేసరికి - 'మాతాజీ టెంపుల్ లో ఉన్నారు.త్వరగా వెళ్లి కలవండి' అంటూ ఆయన హడావుడిగా చెప్పారు.

మేమందరం హడావుడిగా టెంపుల్ లోపలకు వెళ్ళాము. లాన్సింగ్ లోని 'భారతీయ టెంపుల్' నుంచి వచ్చిన ఒక పూజారీ ఒక వనితా టెంపుల్ లో నిలబడి మాతాజీతో మాట్లాడుతూ కనిపించారు.వారిద్దరూ మధ్యవయసులో ఉన్నారు.పూజారి గుజరాతీ లాగా ఉన్నాడు.మంచి బుగ్గలు,భారీ శరీరంతో చూడగానే ఏ మాత్రం శరీరశ్రమ లేకుండా చక్కటి సుఖజీవితం గడుపుతున్నవాడిలా కనిపించాడు.వనితేమో మన ఉత్తరాది మహిళలాగా ఉన్నారు.వారితో మాతాజీ మాట్లాడుతూ కనిపించారు.

మాతాజీ సన్యాస దుస్తులలో లేరు.ఒక పాంటు, పైన ఒక స్వెటర్ వంటిది వేసుకుని ఉన్నారు.ఆమె వీపు మా వైపు తిప్పి ఉండటంతో వారిలో మాతాజీ ఎవరో తెలియక ' ఈమేనా మాతాజీ?' అని ఆత్మలోకానంద గారినే అడిగాను. 'అవును ఆమే' అని ఆయన చెప్పారు.

మాతాజీ మామూలు ఎత్తులో బక్కపలచగా ఉన్నారు.వయస్సు వల్లనో లేక ఆహార నియమాలు పాటిస్తున్నందువల్లనో తెలీదుగాని ఆమె కొంచం నీరసంగా ఉన్నట్లు కనిపించినా, ఆమె ముఖమూ కళ్ళూ చాలా కాంతిగా వెలుగుతూ ఉన్నాయి.

మేము దాదాపు పదిమందిమి టెంపుల్ లోకి నిశ్శబ్దంగా ప్రవేశించి అక్కడక్కడా విడివిడిగా నిలబడ్డాము.వారితో మాట్లాడుతున్న మాతాజీ ఎందుకో వెనక్కు తిరిగి మమ్మలనందరినీ చూచి ఆశ్చర్య పోయారు. "ఇప్పటివరకూ ఇక్కడ ఎవరూ లేరు.ఉన్నట్టుండి మీరంతా ఎక్కడనుంచి వచ్చారు?ఆకాశం నుంచి దిగి వచ్చారా హటాత్తుగా?' అని నవ్వుతూ అడిగారు.

'ఈయనే వీళ్ళ గురూజీ' అంటూ ఆత్మలోకానందగారు ఆమెకు నన్ను పరిచయం చేశారు.కొంచం వెనుకగా నిలబడి ఉన్న నేను వెంటనే గబగబా ముందుకు వచ్చి ఆమె పాదాలు తాకి ప్రణామం చేశాను.

ఆమె గబుక్కున వెనక్కు జరిగారు.

'నో ! డోంట్ డూ దట్ ! ఎవరి ప్రణామమూ స్వీకరించవద్దని 'వందనా మా' నాకు చెప్పారు.అలా చేస్తే మీకంటే నేను ఎక్కువ అన్న ఫీలింగ్ నాకు కలుగవచ్చు.ఆ అహంకారం నాకొద్దు. అందుకే ఎవరు నా పాదాలు తాకి ప్రణామం చేసినా నేనొప్పుకోను' అన్నారామె.

లాన్సింగ్ నుంచి వచ్చిన దుబ్బ పూజారికి, వనితకు మమ్మల్ని పరిచయం గావించారు మాతాజీ.

అల్టార్ ముందు నిలబడి ఏవైనా శ్లోకాలు చదవమని ఆమె నన్నూ, దుబ్బ పూజారినీ అడిగారు.నాకు ఈ శ్లోకాలూ గట్రా ఇష్టం ఉండదు గనుక మౌనంగా ధ్యానిస్తూ నిలబడ్డాను.దుబ్బ పూజారి మాత్రం శుక్ల యజుర్వేదం నుంచి 'శం నో మిత్రశ్శం వరుణ: శంనో భవత్వర్యమా...' అంటూ శాంతి మంత్రాలు చదివాడు.

ఆ తర్వాత మాట్లాడుకుంటూ అందరం బయటకు వచ్చాము.

"రండి.పంచతప సాధన చేసిన చోటు చూపిస్తాను" - అంటూ ఆలయం వెనుక ఉన్న లాన్ లోకి దారి తీశారు మాతాజీ.

రెండు రోజుల క్రితం మేము చూచిన కుటీరం వద్దకు అందరం దారితీశాం.ఆ కుటీరాన్ని సమీపిస్తూనే అక్కడ నిక్షిప్తం గావించబడిన హోలీ రెలిక్స్ యొక్క వైబ్రేషన్స్ నాకు తాకసాగాయి.నాకు వెన్నులో కంపనాలు మొదలయ్యాయి.

కుటీరం చుట్టూ నిలబడిన మాకు 1990 లో అక్కడ జరిగిన పంచతప సాధన గురించి మాతాజీ వివరించారు.

'ఈ ప్రదేశంలోనే నేను నా గురువైన స్వామి భాష్యానంద, ఇంకొక స్వామీజీ తో కలసి ఐదురోజుల పాటు సాగే పంచతప సాధన చేశాను.అయిదురోజుల పాటు మాకు నీరూ ఆహారం నిద్రా లేవు. నాలుగు పక్కలా అగ్ని కుండాలు వెలిగించి మధ్యలో మేము కూచుని అయిదు పగళ్ళూ అయిదు రాత్రులూ ఎడతెగకుండా ధ్యానం చేశాము. అప్పుడే మాకు వెలుగుతున్న శ్రీ యంత్రం దర్శనమిచ్చింది. "ఇక్కడ నాకు ఆలయం నిర్మించు.నేనిక్కడ నివసిస్తాను." అన్న మాటలు మాకు వినిపించాయి." అంటూ మాతాజీ చెప్పసాగారు.

మాతాజీ అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే నాకు 'గౌరీమా' యొక్క దివ్యమైన జీవితం గుర్తొచ్చింది.ఆమె చేసిన తపస్సు గుర్తొచ్చింది.ఆమె యొక్క నిస్వార్ధమైన సేవ గుర్తొచ్చింది.నాలో భావోద్రేకం మొదలైంది.

"అమెరికాలో పుట్టిన తెల్లవాళ్ళు అయి ఉండీ మన హిందూధర్మం మీద ఎంతో ప్రేమతో,శ్రీ రామకృష్ణుల మీద భక్తితో 26 ఏళ్ళ క్రితమే వాళ్ళు అలాంటి సాధన అక్కడ చేశారా? ఎంత పవిత్రమైన ఆత్మలై ఉండాలి వీళ్ళు? హిమాలయాలలో గౌరీమా చేసిన తపస్సు ఇన్ని వేల మైళ్ళ దూరంలో ఈ ఆలయం రావడానికి ప్రేరకం అయిందా? అభాగినుల కోసం ఆమె ఆ జన్మలో అంత కష్టపడితే ఈ జన్మలో ఈమె మళ్ళీ ఇక్కడి దిక్కులేని అమ్మాయిల కోసం ఇంత కష్టపడుతున్నదా? ఏమిటీ జన్మలు? అసలు వీళ్ళు మానవులేనా? లేక దేవతలా?ఇలాంటి మనుషులు ఇంకా భూమ్మీద ఉన్నారా? " అన్న భావోద్రేకం నాలో సుడులు తిరిగి నా కళ్ళలోనుంచి ధారగా నీళ్ళు కారసాగాయి.

మాట్లాడుతూ మాట్లాడుతూ నావైపు చూచిన మాతాజీ నా కన్నీటిని చూచి చలించిపోయారు.

'ఓహ్...నో...గురూజీ !'  అంటూ ముందుకొచ్చిన ఆమె, హటాత్తుగా చేయి చాచి నా చెంప మీదనుంచి జారుతున్న కన్నీటి బిందువును తన వేలితో తీసుకున్నారు.

'ఈ బిందువును ఆ బిందువుకు అర్పిస్తున్నాను' అంటూ కుటీరం చుట్టూ కట్టిన చెక్క కర్రల క్రిందుగా వంగి లోపల ఉన్న శ్రీచక్రం వద్దకు వెళ్లాలని ఆమె ప్రయత్నించారు.కానీ,పెద్దవయసు కావడంతో ఆమె శరీరం సహకరించలేదు. ఆత్మలోకానంద గారిని దగ్గరకు రమ్మని పిలిచిన ఆమె, తన వేలికి ఉన్న కన్నీటి బిందువును ఆయనకు ఇచ్చారు.ఆయన వంగి కుటీరంలోనికి వెళ్లి ఆ కన్నీటి బిందువును శ్రీచక్రపు బిందువు మీద ఉంచారు.దానిక్రిందే శ్రీరామకృష్ణ, శ్రీమాత, గౌరీమాల చితాభస్మం నిక్షిప్తం చెయ్యబడి ఉన్నది.

నేను వద్దని వారించే లోపే ఇదంతా కన్నుమూసి తెరిచే లోపు జరిగిపోయింది.నేను నేలకు అతుక్కుపోయినట్లు నిలబడి పోయాను.

'ఇక్కడకు చాలామంది వస్తూ ఉంటారు .కానీ నేను నీవంటి వ్యక్తి కోసమే ఎదురు చూస్తున్నాను గురూజీ.' అంటూ కొద్దిసేపు నావైపే చూస్తూ మౌనంగా ఉండిపోయిన మాతాజీ చివరకు ఇలా అన్నారు.

'ఠాకూర్(శ్రీ రామకృష్ణులు), శ్రీమా(శారదామాత) లు ఇద్దరినీ నేను హోలీ ట్విన్స్ అని పిలుస్తాను.వారు అనాది నుంచీ సృష్టిలో ఉన్నారు.ఒకరు శివుడు.ఇంకొకరు శక్తి.నువ్వు వారి బిడ్డవు.అందుకేనేమో,నిన్ను 'గురూజీ ఆఫ్ ది హోలీ ట్విన్స్' అని పిలవమని బిందువు నాకు చెబుతున్నది. నిన్ను ఇకనుంచీ అలాగే పిలుస్తాను.' అన్నదామె.

అనుకోకుండా లభించిన ఈ గౌరవానికి నేను ఇబ్బందిగా నవ్వాను.

'నీవు ఇక్కడకు వచ్చి ఉండగలవా? ఈ ఆశ్రమ బాధ్యతలు స్వీకరించగలవా? ఇక్కడ ఉన్న శ్రీయంత్రం బాగోగులు దాని పూజా పునస్కారాలు వగైరాలు చూచుకోగలవా? నేను ఒక పూజారిని డబ్బులిచ్చి పెట్టుకోగలను.కానీ ఆపని నాకిష్టం లేదు.దీనికి సరియైన మనిషి కావాలి.దీనిని సక్రమంగా ఆరాధించగల మనిషి కావాలి.అది నువ్వే అని నాకు అనిపిస్తున్నది. చెప్పు. నీవిక్కడికి వచ్చి ఈ ఆశ్రమంలో ఉండగలవా? నువ్వు అలా ఉండే పనైతే, నాకు ఎంతో రిలీఫ్ గా ఉంటుంది.నీ వల్ల మా అమెరికాలో ఎంతోమందికి ఉత్తేజం కలుగుతుంది.దివ్యజీవన రహస్యాలను తెలుసుకోవాలని ఆశిస్తున్న మా తెల్లవాళ్ళు ఎందఱో ఉన్నారు. అలాంటి వారికి నీ రాకవల్ల ఎంతో మేలు కలుగుతుంది.ఇక్కడకొచ్చి ఉంటానంటే నీకు వసతి, భోజన ఏర్పాట్లు నేను చూస్తాను.ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నువ్వు నాయకత్వం వహించు.సేవా కార్యక్రమాలు నేను చూచుకుంటాను.నువ్వు మాలో ఒకరివి. మా ఆశ్రమంలోనే నువ్వు ఉండిపోతానని నాకు ప్రామిస్ చెయ్యి." అంటూ ఆమె చెయ్యి చాచింది.

అనుకోని ఈ పరిణామాలకు నేను బిత్తరపోయాను.ఏం మాట్లాడాలో నాకు అర్ధం కాలేదు.

'మాతాజీ! నాకూ ఇక్కడ ఉండాలనే ఉన్నది.ఈ ప్రదేశంలోని శక్తి నన్ను అమితంగా ఆకర్షిస్తున్నది.కానీ నాకు కొన్ని బాధ్యతలున్నాయి.ఉద్యోగం ఉన్నది.పిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలి.అవి ఒకటి రెండేళ్లలో తీరిపోతాయి.అప్పుడు నా ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాను.మీరు చెబుతున్న పనిని నేను అప్పుడు చెయ్యగలుగుతాను.ఆర్నెల్లు ఇక్కడా ఆర్నెల్లు ఇండియాలోనూ అప్పుడు నేను ఉండగలను.కానీ అలా చెయ్యడానికి నాకు కొంత సమయం కావాలి.' అని నేను జవాబిచ్చాను.

అర్ధమైనట్లుగా ఆమె తల ఊపింది.

అలా మాట్లాడుకుంటూ మళ్ళీ ఆలయం ముఖద్వారం వద్దకు మేము చేరుకున్నాము.

లాన్సింగ్ దుబ్బ పూజారీ, వనితా వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు.మా వైపు తిరిగిన ఆమె మాలో అందరినీ పరిచయం చెయ్యమని అడిగింది.పద్మజ అందరినీ పరిచయం చెయ్యసాగింది.

ఈయన 'ఆనంద్' అని అంటూ ఆనంద్ ను మాతాజీకి పరిచయం చేసింది.

ఆనంద్ తో ఆమె ఇలా అన్నారు.

'మీ గురూజీ అంటే మీకు ఇష్టమేనా?'

దానికి ఆనంద్ - ''yes. he is my god" అని సమాధానం ఇచ్చాడు.

వెంటనే దానికి నేను అభ్యంతరం చెబుతూ -'No no.the Lord is the God for all of us. అన్నాను.

మాతాజీ నావైపు ప్రేమతో కూడిన కోపంతో చూచారు.

'గురూజీ.మీరు చాలా మారాలి.ఇప్పటివరకూ ఎవరికీ తెలియనివ్వకుండా మీ శక్తినంతా మీలోనే దాచుకున్నారు. ఇప్పుడు వీరందరి కోసం మీరు ఓపెన్ కావాలి.మీలోని దివ్యత్వాన్ని మీరు బాహాటంగా ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది.ఆయన ఇస్తున్న గౌరవాన్ని మీరెందుకు వద్దని అంటున్నారు? ఆయన మాటకు ప్రతిగా మీరు కూడా -"You are my god too' అనాలి.అది సరియైన విధానం.ఆత్మ అందరిలో ఉన్నది అని మన శాస్త్రాలు చెప్పడం లేదా? ' అని ప్రశ్నించారు.

ఆమె చెబుతున్న దానిలో సత్యం అర్ధమైన నాకు నోట మాట రాలేదు.వెంటనే నాకు వివేకానంద స్వామి గుర్తొచ్చారు.

'ఎంత మహనీయుడవయ్యా? ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్న తెల్లవాళ్ళకు మన శాస్త్రాలలోని సత్యాలను బోధించడమే గాక,వాటిని ఆచరణాత్మకంగా ఎలా జీవితంలో ఆచరించాలో కూడా బోధించి చూపించావు. "ఆత్మవత్సర్వభూతాని"అన్న వేదవాక్యాన్ని ఇలా ఆచరణాత్మకంగా వీళ్ళు ఆచరిస్తున్నారా? అద్భుతం!! నువ్వు నిజంగా సప్త ఋషులలో ఒకడవే.' అని మనసులో భక్తితో ఆయన్ను స్మరించాను.

వెంటనే చేతులు జోడించి 'అవును మాతాజీ.మీరు చెబుతున్నది నిజమే. నేను తప్పుగా మాట్లాడాను.నన్ను క్షమించండి.' అంటూ ఆనంద్ వైపు తిరిగి ఇలా అన్నాను.

'ఆనంద్.You are my god too.నీలోని దైవానికి నేను నమస్కరిస్తున్నాను'

మాతాజీ తృప్తిగా తల పంకించారు.

శ్రీలలిత అనే మా బృందంలోని అమ్మాయిని హగ్ చేసుకుని మాతాజీ ఇలా అడిగారు.

'డూ యూ లవ్ యువర్ గురూజీ?'

దానికామె చటుక్కున 'నో' అని జవాబు చెప్పింది.

ఊహించని ఆ జవాబుకు ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన మాతాజీ - "దెన్ యూ ఆర్ మైన్" అంటూ నవ్వేసింది.

'నాలో ఏమీ లేదు.నాకేమీ తెలీదు.ఎందుకు ఇక్కడకు వచ్చానో కూడా నాకు స్పష్టత లేదు.' అని శ్రీలలిత అన్నది.

'నీలో అంతా ఉంది.అది ఒక ముసుగుతో కప్పబడి ఉన్నది.నేనూ నా గురుదేవులైన స్వామి భాష్యానంద గారితో ఎన్నో ఏళ్ళక్రితం ఇదే మాట అన్నాను.దానికాయన నాతో ఇదే మాట అన్నారు.అంతా నీలో ఇప్పటికే ఉన్నది.అయితే అది మూయబడి ఉన్నది.నువ్వు చెయ్యవలసినది ఆ ముసుగును తెరవడమే.దానినే సాధన అంటారు.ఒక్క రెండేళ్ళు ఆగు.నీకు అంతా అర్ధమౌతుంది.అజ్ఞానపు ముసుగు తొలగడానికి నాకు 12 ఏళ్ళు పట్టింది.నీకు అంత పట్టదు.రెండేళ్లలో అంతా అయిపోతుంది." అన్నారు మాతాజీ.

ఆమె నావైపు చూచి ఇలా అన్నారు.

'గురూజీ! ఈమెను నీలా మార్చాలి.నీ శిష్యులందరినీ నీ అంత స్థాయికి నీవు చేర్చాలి.నీ అంతవారినిగా వీరందరినీ నువ్వు తయారు చెయ్యాలి.'

అదెంత కష్టమైన పనో,అలా జరగడానికి మధ్యదారిలో ఎన్ని ఆటంకాలున్నాయో అర్ధమైన నేను ఏమీ చెప్పకుండా మౌనంగా మాతాజీ వైపు చూస్తూ ఉండిపోయాను.

అలా - సరళాదేవి,లక్ష్మి,సుమతి,అఖిల,శ్రీలలిత,నాగమణి,సూర్య,మాధవ్, ఆనంద్,రాజు  - అందరినీ మాతాజీకి పరిచయం చేసింది పద్మజ.

చివరగా తనను తాను చూపించుకుంటూ 'నేను పద్మజను' అంటూ చెప్పింది.తను మాతాజీని ఇంతకూ ముందే కలిసింది.ఈ రిట్రీట్ ను ప్లాన్ చేసిందీ దానికి కావలసిన ఏర్పాట్లు చేసిందీ ఆమే. ఆయా ఏర్పాట్లు చేసే పనిలో భాగంగా నెలముందే తను ఒకసారి వచ్చి మాతాజీని కలిసింది.

'అవును.నువ్వు నాకు తెలుసు.'You are my lion' - అని పద్మజ వైపు చూస్తూ మాతాజీ అన్నారు.

'You are Ma Kali' అని పద్మజ మాతాజీతో నవ్వుతూ అన్నది.

'No.I am not Kali.Kali destroys.I protect.I am not Kali, I am Durga the protector and you are my lion' అని మాతాజీ ఆమెతో అన్నారు.

ఆ విధంగా మాలో అందరినీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మాట్లాడింది గౌరీవ్రత మా.

'మీ గ్రూప్ చాలా ప్రత్యేకంగా ఉన్నది.మిమ్మల్ని వదలి నేను వెళ్ళలేక పోతున్నాను.కానీ నాకు చాలా పని ఉన్నది.నన్ను లోపలకు వెళ్ళమని చెప్పండి. లేదంటే నేను ఇలాగే మీతో మాట్లాడుతూ ఉండిపోతాను.' అని ఆమె చివరకు అన్నది.

అప్పుడు మేమందరం కలసి - 'ఇక మీరు లోనికి వెళ్ళండి మాతాజీ.మీకు చాలా పని ఉన్నట్టుంది' అని అన్నాము.

అలా అన్న తర్వాత కూడా ఇంకో అరగంట పాటు, శ్రీ రామకృష్ణుల గురించి, శ్రీమాత గురించి, గౌరీమా గురించి, శారదేశ్వరీ ఆశ్రమం గురించి మాతో అలా మాట్లాడుతూనే ఉన్నది ఆమె.

చివరకు మమ్మల్ని వదల్లేక వదల్లేక ఆమె లోపలకు వెళ్ళింది.

ఆమె చాలా సీరియస్ మనిషనీ, చాలా కరుకుగా మాట్లాడుతుందనీ విన్న మేము ఆమెలో ఒక ప్రేమతో కూడిన మాతృమూర్తిని చూచి విన్నదానికీ కన్నదానికీ పోలికే లేదని ఎంతో ఆశ్చర్యపోయాము.

ఆ విధంగా ఒక్క 5 నిముషాల సమయాన్ని కూడా మాకివ్వడానికి నిరాకరించిన ఆమె ఏకంగా గంటన్నర పాటు మాతో మాట్లాడుతూ ఉండిపోయి, చివరకు మమ్మల్ని వదలి వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కు తిరిగి చూస్తూ లోపలకు వెళ్ళిపోయింది.

లోపలకు వెళుతున్న ఆమెకు మనస్సులోనే ప్రణామం చేసి మేము రిట్రీట్ హోం కు బయలుదేరాము.

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర - 38 (గురూజీ ఆఫ్ ది హోలీ ట్విన్స్) "

17, ఆగస్టు 2016, బుధవారం

మా అమెరికా యాత్ర - 37 (గౌరీమా - శ్రీ శారదేశ్వరీ ఆశ్రమ స్థాపన)


1886 వ సంవత్సరంలో ఆగస్ట్ 15 రాత్రి శ్రీ రామకృష్ణులు తన దేహాన్ని చాలించారు. అప్పటికి ఆయనకు సరిగ్గా 50 ఏళ్ళు మాత్రమే.సరిగ్గా అరవై ఏళ్ళ తర్వాత 1947 లో అదే తేదీన మన దేశానికి స్వతంత్రం వచ్చింది.అరవై అనేది శని గురువుల గోచారంలో చాలా ప్రాముఖ్యమైన సంఖ్య.అరవై ఏళ్ళలో గురువు 5 సార్లు, శనీశ్వరుడు 2 సార్లు రాశిచక్రాన్ని చుట్టి వస్తారు.అంతేగాక అరవై ఏళ్ళ క్రితం ఎక్కడున్నారో అదే స్థానంలో మళ్ళీ కలుస్తారు.కనుకనే మనిషి కూడా షష్టిపూర్తి అనేది అరవై ఏళ్ళకే జరుపుకోవడం జరుగుతుంది.

శ్రీ రామకృష్ణులు దేహం చాలించిన అరవై ఏళ్ళకు మనకు స్వతంత్రం వచ్చింది.ఇలాంటి సంఘటనల వెనుక ఉన్నట్టి మార్మికమైన సూచనలు అర్ధాలు ఏమిటో మనవంటి అల్పబుద్ధులకు ఎలా తెలుస్తాయి?


ప్రస్తుతానికి ఈ జ్యోతిష్య కోణాన్ని అలా ఉంచి, మన కధలోకి వద్దాం.

శ్రీ రామకృష్ణుల దేహత్యాగం తర్వాత ఆయన భక్తులందరూ చెల్లాచెదరై పోయారు.మానసికంగా వారు చాలా క్రుంగి పోయారు. ఆయన దేహంతో లేకపోవడాన్ని భరించలేని వారిలో చాలామంది తాము కూడా చనిపోదామనే అనుకున్నారు. అంతటి ప్రేమను వారు ఆయన వద్ద చవి చూచారు.కానీ ఆత్మహత్య మహాపాపం గనుక వారాపనిని చెయ్యలేదు. ఆయన లేని కలకత్తాలో ఉండలేక అందరూ దేశం నలుమూలలా తీర్ధయాత్రలకు బయలుదేరారు.గౌరీమా కూడా ఆ విధంగా దాదాపు పదేళ్ళు అనేక క్షేత్రాలు తిరుగుతూ అక్కడ తపస్సు చేస్తూ కాలం గడిపింది.అన్నింటికీ తపస్సే మూలమని వారు తమ దైవం దగ్గర నేర్చుకున్నారు.


అలా దాదాపు పదేళ్ళు గడిచాక, గుర్వాజ్ఞను నెరవేర్చడానికి ఆమె కంకణం కట్టుకుంది.ఆ విధంగా 1895 వ సంవత్సరంలో శ్రీ శారదేశ్వరీ ఆశ్రమ శంకుస్థాపన గంగానదీ తీరంలోని బారక్ పూర్ అనే చోట జరిగింది.


జీవనదులన్నీ తమతమ మూలాలలో చాలా చిన్నవిగానే మొదలౌతాయి. మొదట్లో ఈ ఆశ్రమం కూడా చాలా చిన్నదిగానే ప్రారంభించబడింది.ఈ ఆశ్రమం యొక్క ఆశయాలు చాలా ఉన్నతమైనవి.ముఖ్యంగా స్త్రీల జీవితాలను బాగుచెయ్యడం ప్రధానమైన ఆశయంగా ఉంటూ,హిందూ సంస్కృతిని, వేదోపనిషత్తుల జ్ఞానాన్నీ వారికి నేర్పుతూ, అత్యంత పవిత్రమైన సాధనామయమైన జీవితాన్ని ఎలా గడపాలో ఆచరణాత్మకంగా వారికి శిక్షణ నిస్తూ ఈ ఆశ్రమం సాగింది.దానికి తోడుగా స్త్రీలు తమ కాళ్ళపైన తాము నిలబడి ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని ఎలా సంపాదించుకోవాలో చెబుతూ దానికి అవసరమైన లౌకిక విద్యనూ,హాండిక్రాఫ్ట్స్ మొదలైన పనులను వారికి ఆశ్రమంలో నేర్పించేవారు.


గౌరీమా ఇలా అనేవారు.

'స్త్రీలకు సరియైన విద్యను నేర్పాలి.వారిని విద్యాశక్తులుగా తీర్చిదిద్దాలి.అలా చెయ్యకపోతే వారు అవిద్యా శక్తులుగా మిగిలిపోతారు.'

ఈ ఆశ్రమాన్ని శ్రీరామకృష్ణుల శిష్యులైన వివేకానందస్వామి, బ్రహ్మానందస్వామి,శివానందస్వామి మొదలైన మహనీయులు ఎందఱో సందర్శించారు.భారతీయ స్త్రీలను, యువతను ఎలా శక్తివంతులుగా చెయ్యాలి, మన హిందూ ధర్మాన్ని ఎలా తిరిగి ఉద్ధరించి మన దేశానికి తిరిగి పూర్వవైభవాన్ని ఎలా తేవాలి? అన్న విషయం పైన వివేకానందస్వామి సుదీర్ఘంగా గౌరీమాతో చర్చించేవారు.ఈ విషయం మీద గౌరీమా మనసులో ఉన్న ప్రణాళికలను విన్న వివేకానంద స్వామి ఎంతో సంతోషించి ఈ విధంగా అన్నారు.

"మన విద్యావిధానం ఎలా ఉండాలంటే,అది విద్యతో బాటు వ్యక్తిత్వానికి మాత్రమే పెద్దపీట వెయ్యాలి.ఈ ఆశ్రమం నుంచి గార్గి,మైత్రేయి,అరుంధతి వంటి మహా తపస్వినులు, బ్రహ్మ వాదినులు,విదుషీమణులు భవిష్యత్తులో ఉద్భవించాలి. వారేకాదు అంతకంటే ఉన్నతమైన స్త్రీలు ఇక్కడనుంచి పుట్టుకురావాలి.స్త్రీలు ఔన్నత్యాన్ని పొందటం వల్లనే ఏ దేశమైనా బాగుపడుతుంది.ఈ విధంగా మన దేశం తిరిగి తన పూర్వవైభవాన్ని పొందాలి."

క్రమేణా గౌరీమా ఉన్నతమైన జీవితాన్ని చూచి ఉత్తేజితులైన స్త్రీలు ఆశ్రమంలో చేరసాగారు.వారిలో ఎక్కువమంది విధవలు, లేదా భర్తచేత వెళ్ళగొట్టబడి చేతిలో డబ్బులేక రోడ్డున పడిన అభాగినులు,లేదా పేద కుటుంబాల నుంచి వచ్చిన అవివాహితలు ఉండేవారు.ఆశ్రమ స్కూలులో వారే టీచర్లుగా పనిచేసేవారు.ఆశ్రమంలోని మిగతా పనులు కూడా వారే చేసుకునేవారు.కులగోత్రాలతో సంబంధం లేకుండా అటువంటి అభాగినులను చేరదీసి అటువంటి వారిని అత్యన్నతమైన జాతి వజ్రాలుగా మహనీయులైన స్త్రీమూర్తులుగా గౌరీమా తీర్చిదిద్దేది.

ఆశ్రమం పెట్టగానే సరిపోదుకదా! దానికి సరిపోయిన ఆర్ధిక వనరులు కావాలి.డబ్బు దగ్గరకు వచ్చేసరికి ఏ కాలంలోనైనా ఏ యుగంలోనైనా మనుషుల ప్రవర్తన ఒకే విధంగా ఉంటుంది. డబ్బనేది చాలావరకూ మంచి పనులకు వినియోగం కాదు. మంచికి విరుద్ధమైన స్వార్ధపూరితమైన పనులకే అది ఎక్కువగా వినియోగం కాబడుతుంది.ఇది లోక సహజం.

ఆశ్రమం మొదలైన కొత్తలో చాలా పేదరికంలో వాళ్ళు బ్రతికేవారు.కనీసం నిత్యావసరాలకు కూడా వారి వద్ద డబ్బు ఉండేది కాదు.అప్పట్లో ఆశ్రమంలో 25 మంది స్త్రీలు ఉండేవారు. స్కూలులో దాదాపు 60 మంది విద్యార్దినులు ఉండేవారు. చాలాసార్లు ఆశ్రమంలో తినడానికి తిండిగింజలు కూడా ఉండేవి కావు.అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గౌరీమా ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసి అలా వచ్చిన ఆహారంతో వారిని పోషించేది.

ఎవరైనా దానికి అభ్యంతర పెడితే ఆమె ఇలా అనేది.

'ఎందుకమ్మా మీరు బాధపడతారు?నేను సన్యాసినిని.భిక్షాటన నా ధర్మం. ఇందువల్ల నాకేమీ బాధ లేదు.మీరు ఆకలితో ఉంటే నేనెలా చూడగలను?'

సర్వసంగ పరిత్యాగినియై ఉండి, తనకంటూ జీవితాంతం ఏమీ దాచుకోని ఆమె,ఆ దిక్కులేని అభాగినుల కోసం ఊరంతా తిరుగుతూనే ఉండేది.ఎవరెవరినో కలసి సహాయం అర్ధిస్తూ ఉండేది.పొద్దున్న ఆశ్రమం లోనుంచి బయటకు వెళ్ళిన ఆమె సాయంత్రానికి డస్సిపోయి మళ్ళీ ఇంటికి చేరేది.

ఈ క్రమంలో ఆమె ఎన్నో చీదరింపులనూ, తిట్లనూ సహించింది. ఆమె కలసిన వారిలో సహాయం చేసేవారు ఉండేవారు, విసుక్కునేవారు ఉండేవారు,తిట్టేవారు ఉండేవారు,ఎగతాళిగా మాట్లాడేవారు ఉండేవారు.వారు ఎలాంటి వారైనా, తనతో ఏ విధంగా ప్రవర్తించినా సరే,ఆమె అన్నింటినీ మౌనంగా భరించేది.తన గురువూ దైవమూ అయిన శ్రీరామక్రిష్ణులను స్మరిస్తూ సహనంతో ఆ అభాగినులకోసం పనిచేసేది.

అంతమాత్రం చేత ఎవరు డబ్బులిచ్చినా ఆమె తీసుకునేదని భావించితే పప్పులో కాలేసినట్లే.ఈ సందర్భంగా రెండు సంఘటనలు వినండి.

ఒకసారి ఒకాయన చాలా పెద్ద మొత్తాన్ని ఆశ్రమానికి విరాళంగా ఇస్తానని ముందుకొచ్చాడు.అప్పట్లో డబ్బు అనేది వారికి చాలా అవసరం కూడా.ఇంకొకరైతే ఎగిరి గంతేసి ఆ డబ్బు తీసుకునే వారు.కానీ గౌరీమా ఆ ధనాన్ని స్వీకరించనని ఖరాఖండిగా చెప్పేసింది.ఆ తరువాత విచారిస్తే - ఆ వ్యక్తి ఆ డబ్బును అవినీతి మార్గాలలో సంపాదించాడని తెలిసింది.

ఇంకొక వ్యక్తి 50,000 రూపాయలను ఆశ్రమానికి విరాళంగా ఇస్తానని ముందుకొచ్చాడు.1900 ప్రాంతాలలో అది ఎంత పెద్ద మొత్తమో మీరు ఊహించవచ్చు.అతని గురించి విచారిస్తే కొన్ని నిజాలు గౌరీమాకు తెలిశాయి.అవేమంటే - అతని అన్న చనిపోయాడు.అన్న ఆస్తిలో వదినకు వాటా వస్తుంది.ఆ వాటాను ఆమెకు రాకుండా చేసి, అలా తను కాజేసిన డబ్బులో కొంత భాగాన్ని పాపపరిహారంగా ఆశ్రమానికి ఇవ్వాలని అతను తలపోశాడు.గౌరీమా ఆ డబ్బును ఏమాత్రం తీసుకోకపోగా అతన్ని పిలిచి చీవాట్లు పెట్టింది.

'ఒక ఆడదాన్ని మోసం చేసి, ఆమెను రోడ్డున పడేసి,అలా కాజేసిన డబ్బులో నాకు వాటా ఇవ్వాలని తలపోస్తున్నావా నీచుడా? ఇలా చెయ్యడం ద్వారా భయంకరమైన పాపాన్ని నీవు మూట గట్టుకుంటున్నావు.ఇప్పటికైనా నీ బుద్ధిని మార్చుకుని మీ వదినకు న్యాయంగా రావలసిన వాటాను ఆమెకు ఇవ్వు.నువ్వు అయిదు లక్షలిచ్చినా సరే నీ డబ్బు నేను తాకను కూడా తాకను' అని ఖచ్చితంగా అతనితో చెప్పేసింది.

పేదరికాన్నైనా సహించేది గాని, వ్యక్తిత్వం లేనివారి విరాళాలు ఆమె స్వీకరించేది కాదు.అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఆమెది.

సేవ పేరుతో విదేశీ మతాన్ని మనపైన రుద్దాలని చూచిన మదర్ తెరెసా వంటి వారిని ఈనాడు మనం మహనీయురాలని పూజిస్తున్నాం.అవార్డులిస్తున్నాం.కానీ గౌరీమా, సిస్టర్ నివేదిత, సిస్టర్ దేవమాత వంటి అసలైన మహనీయులను మనం మర్చిపోయాం.కనీసం వారిని తలచుకోను కూడా తలచుకోము. ఇదీ మన ఖర్మ.

మదర్ తెరెసా ఫోటో పెట్టుకోవడం నేడు చాలామంది హిందువుల ఇళ్ళలో ఒక ఫేషన్ గా మారింది.అలా పెట్టుకుంటే అతనొక పెద్ద ఆదర్శప్రాయుడని ఉన్నతమైన భావాలు కలిగినవాడని నలుగురూ అనుకోవడానికి అలాంటి ఫోటోలు పెట్టుకుంటూ జనాన్ని మోసం చేస్తూ ఉంటారు చాలామంది. ఇలాంటి అజ్ఞానులను చూస్తే నాకుమాత్రం తన తల్లిదండ్రుల ఫోటోలు బయట పారేసి ఎవరో ముక్కూ ముఖం తెలియని వారి ఫోటోలు ఆ స్థానంలో పెట్టుకుని వారే తమ తల్లిదండ్రులని ప్రచారం చేసుకునే నీచులు గుర్తొస్తారు. అలాంటి వారిని చూచి, వీళ్ళకు ఎప్పుడు బుద్దొస్తుందా అని నేను చాలా జాలిపడతాను.

భారతీయుడైన వాడు తన ఇంటిలో ఉంచుకోవలసింది దొంగ బాబాలు,దొంగస్వామీజీలు,రాజకీయ నాయకులు,మదర్ తెరెసాల ఫోటోలు కావు.హిందువైన ప్రతివాడి ఇంట్లోనూ భగవంతుని అవతారమైన శ్రీరామకృష్ణుల ఫోటో ఉండాలి. శ్రీమాత శారదాదేవి ఫోటో ఉండాలి.వివేకానందస్వామి ఫోటో ఉండాలి.గౌరీమా ఫోటో ఉండాలి.అలా ఉన్నప్పుడే మన దేశం నిజంగా బాగుపడుతుంది.ఎందుకంటే, అసలైన దివ్యమూర్తులు వీరే.దీనతతో హీనతతో దిక్కులేక బాధపడుతున్న లక్షలాది మన దేశప్రజలను చూచి విలపించిన దయామూర్తులు వీళ్ళు. మన దివ్యత్వాన్ని మన ధార్మిక వారసత్వాన్నీ మనకు తిరిగి గుర్తు చెయ్యడమేగాక, వాటిని పునరుద్ధరించి తిరిగి మనకు ప్రసాదించిన దేవతా స్వరూపాలు వీళ్ళు.

వీళ్ళను మరచిపోయి ఎవరో మదర్ తెరేసాలనూ, దొంగ బాబాలనూ,దొంగ స్వాములనూ గౌరవిస్తూ పూజిస్తూ ఉన్నంత వరకూ మనకు నిష్కృతి ఎలా కలుగుతుంది? ఔన్నత్యం ఎలా వస్తుంది? మన ధర్మాన్ని మనం మరచిపోవడం అంటే మన తల్లిదండ్రులను మనం మరచిపోవడమే.

ఇలా ఉన్నాం గనుకనే మన ఆధ్యాత్మిక స్థితి ఇలా ఏడ్చింది.

మదర్ తెరేసాకు వందేళ్ళ ముందు గౌరీమా యొక్క అత్యున్నతమైన ఉజ్జ్వలమైన నిస్వార్ధమైన దైవమయమైన జీవితాన్ని ఈ దేశం కనులారా వీక్షించింది.కానీ నేటికీ మనకు మదర్ తెరెసా అంటే ఎవరో తెలుసుగాని గౌరీమా అంటే ఎవరో తెలియదు.ఎంత దౌర్భాగ్యులం మనం?గౌరీమా వంటి నిజమైన మహనీయులను మనం మరచిపోవడం వల్లనే మనకు ధార్మిక దౌర్భాగ్యం దాపురించింది.

మాయ అంటే ఇదిగాకపోతే మరేమిటి?

150 సంవత్సరాల క్రితం-శ్రీరామకృష్ణుల ప్రేరణతో సమాజంలోని స్త్రీల దుస్థితిని,పేదల దౌర్భాగ్యాన్ని పోగొట్టాలని వివేకానందస్వామి, బ్రహ్మానందస్వామి, శివానందస్వామి, అఖండానంద స్వామి,గౌరీమా మొదలైన మహనీయులు పడిన తపనా, చేసిన కృషీ ఫలితంగానే ఈనాడు స్త్రీలు కూడా బాగా చదువుకుంటున్నారు.ఉద్యోగాలు చేస్తున్నారు.వాళ్ళు కూడా ఆర్ధికంగా స్వతంత్రులుగా మారి మగవాళ్ళ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కుంటున్నారు.పాత కాలంలోలా "మా ఖర్మ ఇంతేలే" అని చచ్చేవరకూ ఏడుస్తూ మగవాడి దౌర్జన్యానికి బలైపోయి వాళ్ళు జీవితాలను వెళ్ళబుచ్చడం లేదు. నిస్వార్ధపరులూ దైవాంశ సంభూతులూ అయిన మహనీయుల సంకల్పబలమూ,వారు చేసిన అవిరళకృషుల ఫలితమే నేడు మనం చూస్తున్న ఈ మాత్రం సమానత్వమైనా !

సమానత్వం నిజంగా వచ్చిందా? స్త్రీల బ్రతుకులు నిజంగా బాగుపడినట్లేనా?అని మీరు ప్రశ్నించవచ్చు.నిజమే.ఇంకా సమానత్వం పూర్తిగా రాలేదు.ఒప్పుకుంటాను.కానీ 150 సంవత్సరాల నాటికీ ఇప్పటికీ వచ్చిన మార్పును గమనించండి.బాహ్యంగా మనకు కనిపిస్తున్న ఈ మార్పు అనేది ప్రభుత్వాలు తెచ్చిన మార్పు కాదు.బడా దొంగలైన రాజేకీయ నాయకులు తెచ్చిన మార్పు కాదు.వాళ్ళు ఉత్త మాటలు మాత్రమే చెబుతారు.పనులు మాత్రం వారి స్వార్ధానికే చేసుకుంటారు.

ప్రపంచ భావజాలంలో మహనీయులు మౌనంగా తెచ్చిన మార్పు ఫలితమే ఈనాడు సమాజంలో మనం చూస్తున్న ఈ మార్పు. వారి త్యాగాల ఫలితమే,వారి తపస్సు ఫలితమే - ఈనాడు మనం చూస్తున్న ఈ మార్పు.ముందు కాలాలలో సామాజికంగా ఇంకా పెనుమార్పులు తప్పకుండా వస్తాయి.ఇప్పటివరకూ నిస్సహాయులుగా ఉండిపోయిన స్త్రీలు,బలహీనులు,బలాన్ని సంతరించుకోవడం తప్పకుండా జరుగుతుంది.

శ్రీ శారదేశ్వరీ ఆశ్రమాన్ని విస్తరించడంలో ప్రతి అడుగులోనూ గౌరీమా ఎంతో శ్రమించింది. గురువు కిచ్చిన మాటకోసం 80 ఏళ్ళ పెద్దవయసులో కూడా అనారోగ్యాన్ని ఏమాత్రమూ లెక్క చెయ్యకుండా ఆమె నిరంతర కర్మ వీరురాలిగా బ్రతికింది. ఆమె ఉత్త మాటలపురుగు కాదు.తాను చెప్పిన ఆదర్శాలను తన జీవితంలో చేసి నిరూపించి చూపించింది.ఆమె మనవంటి సామాన్యురాలే అయితే, శ్రీరామకృష్ణుల కటాక్షాన్ని పొందగలిగేదా?

భక్తుల విరాళాలతో విలాస జీవితాలు గడుపుతూ ఏవేవో దిక్కుమాలిన పూజలను జనాల నెత్తిన రుద్దుతున్న నేటి సోకాల్డ్ స్వామీజీలు - గౌరీమా కాలిగోటికి కూడా సరిపోలరని నేను ఘంటాపధంగా చెప్పగలను.

ఆమె మనస్సు నిరంతరం హిమాలయాల సానువుల్లోనే విహరిస్తూ ఉన్నప్పటికీ, ఆమె దేహం మాత్రం నిరంతరం నిస్వార్ధ కర్మ రంగంలో ఉండింది.ఆత్మలో నిశ్చలత్వం, శరీరంతో నిరంతర నిష్కామ సేవ చేస్తూ భగవద్గీతలో చెప్పినట్లు కర్మలో అకర్మను, అకర్మలో కర్మను వీక్షిస్తూ మహాయోగినియై, బ్రహ్మనిష్టురాలై ఆమె జీవితాన్ని గడిపింది.

హిమాలయాలలో ఉండగా ఆమె చేసిన ఘోరమైన తపస్సును చూచిన పరమపూజ్య భోలానాద్ పరమహంస అనే సద్గురువు తన తీర్ధయాత్రలలో భాగంగా కలకత్తాకు వచ్చినపుడు గౌరీమా శిష్యులతో ఇలా అన్నాడు.

"గౌరీమా ఇప్పుడు కర్మిష్టిగా మీకు కనిపిస్తున్నది.కానీ ఆమె ఎంత గొప్ప తపస్వినియో మీకు తెలియదు.హిమాలయాలలో ఆమె చేసిన ఘోరమైన తపస్సును మేము చూచాము.మీలోని బలమైన మగవారు కూడా అటువంటి తపస్సును కలలో కూడా చెయ్యలేరు.మీరిప్పుడు బోనులోని సింహాన్ని చూస్తున్నారు. నిర్భయంగా ఠీవిగా కొండల్లో అడవులలో తిరిగిన సింహాన్ని మేము చూచాము."

క్రమేణా ఆమె దివ్యమైన జీవితాన్నీ ఉన్నతమైన ఆదర్శాలనూ చూస్తున్న ప్రపంచం నుంచి ఆమెకు సహాయం అందసాగింది.ఆ ఆదర్శాలకు ప్రభావితులైన అనేకులు ఆమెకు అనుచరులుగా చేరసాగారు.కానీ ఆమె పేరు ప్రఖ్యాతులను ఆమడ దూరంలో ఉంచేది.ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి.

ఆశ్రమం కొత్త భవనం ప్రారంభోత్సవ సమయంలో ఒక సంఘటన జరిగింది.ఆమెకు చెప్పకుండా చేయించిన శిలాఫలకం మీద "ఈ ఆశ్రమం సన్యాసిని గౌరీమా చేత స్థాపించబడినది" అని శిష్యులు చెక్కించారు.ఆ ఫలకం చూస్తూనే ఆమె కోపంతో ఇలా అరిచింది.

'ఎవరు ఈ పని చేసింది?'

ఇలా అంటూ ఆమె ఆశ్రమం లోనికి రాకుండా వెనక్కు వెళ్లిపోసాగింది.భయపడిన కొందరు శిష్యులు 'అందులో ఏమి తప్పు ఉందని?' అడిగారు.దానికి ఆమె ఇలా జవాబిచ్చింది.

'ఈ ఆశ్రమం శ్రీమాతది. ఆమె పేరు అక్కడ ఉండాలి.నా పేరు కాదు.అసలు నేనెవర్ని?నా పేరు అక్కడ ఎందుకు చెక్కించారు?' ఇలా అంటూ తన పేరుతో ఉన్న శిలా ఫలకాన్ని తొలగించేవరకూ ఆమె ఊరుకోలేదు.

తనకు ఎవరైనా ప్రత్యేక గౌరవాన్ని ఇస్తే ఆమె నెగటివ్ గా స్పందించేది.ఆమె చాలాసార్లు ఇలా అనేది.

"పేరు ప్రఖ్యాతులనేవి పందిపెంట అంత దరిద్రమైనవి.వాటిని చెత్తా చెదారంతో సమానంగా భావించాలి.మన కర్మను నిస్సంగంగా నిర్మోహంగా మనం చెయ్యాలి.కర్మను యోగంగా చేస్తున్నపుడు మీ మనస్సులలో పేరుకోసం గుర్తింపు కోసం యావ ఉన్నట్లయితే ఆరోజే మీరు ఆధ్యాత్మికంగా చనిపోయినట్లు గుర్తుంచుకోండి."

ఒకరోజున కలకత్తాకు వచ్చిన గాంధీ,కస్తూర్బాలు,చిత్తరంజన్ దాస్ తో కలసి గౌరీమాను దర్శించారు.ఆ సమావేశం సందర్భంలో భగవద్గీతను గురించి, త్యాగం యొక్క విశిష్టతను గురించి,శ్రీ రామకృష్ణుల మహోజ్జ్వల దివ్య జీవితాన్ని గురించి ఆమె చేసిన ప్రసంగానికి వారు ముగ్ధులై పోయారు.కానీ, వారిలో చిత్తరంజన్ దాస్ మాత్రమే గౌరీమా పాదాలకు ప్రణామం చేశాడు గాని గాంధీ చెయ్యలేదు.ఆయనకు అంతటి అహంకారం ఉండేది.ఏం చేస్తాం?అలాంటి వాళ్ళు మనకు నాయకులయ్యారు మరి !

ఒక మహనీయురాలిని ఇంకొక నిజమైన మహనీయురాలో నిజమైన మహనీయుడో మాత్రమే గుర్తించగలరు గాని ఊరకే 'మహాత్మా' అని ఎవరో ఇచ్చిన బిరుదును తగిలించుకున్నవారు ఎలా గుర్తించగలరు?

నిరంతరం కర్మరంగంలో నిస్వార్ధంగా పనిచేస్తూ కూడా, ఆమె ఉన్నతములైన సమాధి స్థితులలో ఉంటూ ఉండేది.ఇదెలా సాధ్యమని భావిస్తున్నారా?మరి ఎటువంటివారి కటాక్షాన్ని ఆమె పొందింది? ఒక సంఘటనను ఇక్కడ ప్రస్తావిస్తాను.

తన ఆశ్రమాలలో ఒక దానికి "పంచవటి ఆశ్రమం" అని తన గురుదేవుల సాధనా రంగస్థలం యొక్క పవిత్రమైన పేరును ఆమె పెట్టుకుంది.ఒకరోజు సాయంత్రం తన ఆశ్రమంలోని చెట్టు క్రింద నిలబడి ఈ కృష్ణ కీర్తనను ఆమె ఆలపించసాగింది.

ప్రభూ ! నీ పాదాలు నిత్యానంద నిలయాలు
అక్కడ భయం అనేది లేదు
వాటిని తాకిన నేనీ లోకంలో నిర్భయంగా తిరుగుతాను
నాకు అలసట కలిగితే నీ కౌగిలిలో సేదదీరుతాను
పరమ సౌందర్యమయమైన నీ ముఖాన్ని
ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాను...

ఈ పాట పాడుతున్న ఆమె మనస్సు క్రమేణా బాహ్యస్మృతిని కోల్పోయి సమాధిలోకి వెళ్ళిపోయింది.శరీరాన్ని మరచిపోయిన ఆమె అలాగే శిలావిగ్రహం లాగా ఆ చెట్టుక్రింద నిల్చుని ఉండిపోయింది.ఆమెకు శ్వాస లేదు.కనురెప్పలు కదలడం లేదు.నాడి ఆడడం లేదు. చీకటి పడింది. రాత్రి ముగిసింది. తెల్లవారింది. కానీ ఆమె అలాగే శిలా విగ్రహంలాగా ఆ చెట్టుక్రింద నిలబడే ఉన్నది.ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల ప్రజలు ఉదయం నుంచీ తండోపతండాలుగా వచ్చి ఆమెకు పూలతో అభిషేకం చెయ్యసాగారు. అయినా ఆమెలో ఏ చలనమూ లేదు.మర్నాడు మధ్యాన్నం దాదాపు పదకొండు గంటలకు ఆమె మెల్లిగా సమాధిని వదలి బాహ్యస్పృహలోకి వచ్చింది.అంటే దాదాపుగా 17 గంటలపాటు ఆమె శిలావిగ్రహంలా నిలబడి సమాధి స్థితిలో ఉండిపోయింది.

శ్రీ రామకృష్ణుల అనుగ్రహమంటే అది !

ఆమె శిక్షణలో ఎందఱో స్త్రీలు మహనీయులైన ఋషీమణులుగా ప్రకాశించారు.ఆమె రక్షణలో ఎందఱో అభాగినులు మళ్ళీ తమ తమ జీవితాలలో వెలుగును చూచారు.తన గురుదేవుల దేహత్యాగం తర్వాత 56 ఏళ్ళు ఆమె బ్రతికింది. కానీ అనుక్షణం ఆయన చెప్పిన మార్గంలోనే నడుస్తూ,ఆయన చెప్పిన పనిని తూచా తప్పకుండా చేస్తూ,తన చివరిరోజు వరకూ ఆయన కిచ్చిన మాటను నెరవేర్చడానికి కష్టపడింది.తన వారసత్వాన్ని కొనసాగించే సమర్ధులైన దేవతలవంటి స్త్రీ మూర్తులను తయారు చేసే వ్యవస్థను నెలకొల్పింది.  

ఈ విధంగా ఎంతో పవిత్రమైన ధన్యమైన తపస్సంపన్నమైన జీవితాన్ని తన గురుదేవుల కిచ్చిన మాట ప్రకారం జనారణ్యం అయిన కలకత్తా నగరంలో జనమధ్యంలోనే గడపిన పరమపూజ్య గౌరీమా 1938 సంవత్సరపు శివరాత్రి రోజున సమాధి స్థితిలో దేహాన్ని వదలి వేసింది.

శివరాత్రి రోజున గౌరీమా తన అంతరంగ శిష్యులతో ఇలా చెప్పింది.

'గురుదేవులు మళ్ళీ నా హృదయాన్ని తన దారంతో బంధించి లాగుతున్నారు.56 ఏళ్ళ క్రితం ఆయన మొదటి సారిగా ఇలా లాగి నన్ను ఆయన దగ్గరకు చేర్చుకున్నారు.మళ్ళీ ఇప్పుడు నా హృదయాన్ని ఆయన పట్టి లాగుతున్నారు.నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది.'

చీకటి పడుతూ ఉండగా ఆమె ఇలా అన్నది.

"ఈరోజున వేరే విషయాలు ఏమీ మాట్లాడను.నా గురువు, నా దైవం, మనందరి దైవం అయిన శ్రీరామకృష్ణుల గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం."   

ఇలా అంటూ ఆమె తన గురుదేవుల దివ్యజీవితం గురించి అనర్గళంగా రెండు గంటలపాటు మాట్లాడింది.ఆ తర్వాత ' గురు శ్రీరామకృష్ణా, గురు శ్రీరామకృష్ణా, గురు శ్రీరామకృష్ణా..' అని మూడుసార్లు ఉచ్చరించింది.ఆ తర్వాత తన చుట్టూ కూర్చుని ఉన్న శిష్యులతో - 'అందరూ నిశ్శబ్దంగా ఉండండి.నన్ను కదిలించకండి' అని చెప్పింది.అలా చెబుతూ మెల్లిగా కన్నులు మూసుకుని ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయింది.

ఎనభై ఏళ్ళ సుదీర్ఘమైన పవిత్ర తపోమయ జీవితాన్ని గడపిన ఆ మహనీయురాలు తన ఇష్టదైవమైన శ్రీ రామకృష్ణులను ధ్యానిస్తూ శివరాత్రి పూట తన ఇష్టానుసారంగా దేహాన్ని సమాధిస్థితిలో వదిలేసి ఎవరినైతే తన జీవితమంతా ధ్యానించిందో వారి దగ్గరకు చేరుకుంది.

ఆమె ఈ భూమి మీద బ్రతికిన 80 ఏళ్ళలో - మొదటి 40 ఏళ్ళను తన శరీరాన్నీ మనస్సునూ ఏమాత్రమూ లెక్కచెయ్యకుండా భగవంతుని పట్ల పరిపూర్ణ శరణాగతితో తీవ్రమైన తపస్సులో గడిపింది.మిగిలిన 40 ఏళ్ళూ తన గురుదేవుల కిచ్చిన మాట కోసం - దిక్కులేని స్త్రీలను చేరదీసి వారిని ఉజ్జ్వలమైన దివ్యమూర్తులుగా తీర్చి దిద్దుతూ నిరంతర కర్మవీరురాలిగా నిస్వార్ధమయమైన జీవితాన్ని గడపింది.చివరకు శివరాత్రి సమయంలో స్వచ్చందంగా సమాధిస్థితిలో దేహాన్ని వదిలేసి ఒక మహాయోగినిలా భగవంతునిలో ఐక్యం అయింది.

"మృడాని" అన్న శివుని పేరును తల్లిదండ్రులు ఆమెకు ఇచ్చారు. "గౌరీ" అన్న దీక్షా నామాన్ని గురుదేవులు ఇచ్చారు.ఈ రెంటినీ సార్ధకం గావిస్తూ శివరాత్రి నాడు శివస్వరూపుడైన శ్రీరామకృష్ణుల పాదాల చెంతకు ఆమె శాశ్వతంగా చేరుకుంది.

ఏమిటా జీవితం !! ఏమిటా వ్యక్తిత్వం !!

మహనీయులు ఈ లోకంలో పుట్టే తీరూ,ఇక్కడ బ్రతికే తీరూ, ఇక్కడనుంచి నిష్క్రమించే తీరూ - అన్నీ విలక్షణంగానే అద్భుతంగానే ఉంటాయని చెప్పడానికి గౌరీమా జీవితమే స్పష్టమైన ఉదాహరణ.

ఇలాంటి వాళ్ళు కారా ప్రాతస్మరణీయులు? ఇలాంటి వాళ్ళు కారా పూజార్హులు? ఇలాంటి వాళ్ళు కారా లోకానికి నిజమైన గురువులు? ఇలాంటి వారి వల్ల కాదా ఈ భరతభూమిలో ఇంకా ధర్మం నిలిచి ఉన్నది? ఇలాంటి వారు పుట్టడం వల్ల కాదా ఈ భూమి బ్రద్దలు కాకుండా ఇంకా నిలబడి ఉన్నది?

గౌరీమా స్థాపించిన 'శ్రీ శారదేశ్వరీ ఆశ్రమం' ఈనాటికీ కలకత్తాలో ఉన్నది.ఈ ఆశ్రమానికీ రామకృష్ణా మిషన్ కూ సంబంధం లేదు. ఈ ఆశ్రమంలో గురువులుగా ఈనాటికీ స్త్రీలే పరంపరగా వస్తున్నారు.ప్రస్తుతం 'వందనా మా' అనబడే దివ్యమూర్తి నేతృత్వంలో ఈ ఆశ్రమం గౌరీమా పెట్టిన - బ్రహ్మచర్యం, తపస్సు,నిస్వార్ధసేవ,స్త్రీ జనోద్దరణ - అనే ఆశయాలకు అనుగుణంగా నడుస్తూనే ఉన్నది.

గౌరీమా తర్వాత ఈ ఆశ్రమానికి అధ్యక్షులుగా దుర్గామా, సువ్రతా మా, వందనా మా - అనబడే దివ్యమూర్తులు వచ్చారు.వీరిలో ప్రస్తుతం "వందనా మా" జీవించి ఉన్నారు.వీరెవ్వరూ మామూలు మనుషులు కారు. "వందనా మా" ఆరేళ్ళ వయసులో దీక్షా స్వీకారం చేసి,18 ఏళ్ళ వయసులో సన్యాసం స్వీకరించిన మహనీయురాలు.ఈమెకిప్పుడు 90 ఏళ్ళు.వారి ఉజ్జ్వలములైన జీవితాలను గురించి నేను చెబితే చాలా పేలవంగా ఉంటుంది. మీ అంతట మీరే చదవండి.

ఈ ఆశ్రమం వెబ్ సైట్ ఇక్కడ చూడవచ్చు.

http://saradeswariashram.org/


ఈ ఆశ్రమం యొక్క రెండు ప్రత్యేకతలు మీకు ప్రస్తావిస్తాను.

ప్రపంచంలో రెండు అత్యంత విలువైన వస్తువులు ఈ ఆశ్రమంలో ఉన్నాయి.ఒకటి - గౌరీమా జీవితాంతం పూజించిన శక్తివంతమైన దామోదర సాలగ్రామం. రెండు - శ్రీ రామకృష్ణులు తన సాధనా సమయంలో వాడిన జపమాల.

శ్రీరామకృష్ణులు శారదామాతను జగజ్జనని అయిన లలితాదేవిగా అర్చించారు.దీనినే షోడశీపూజ అంటారు.ఈ షోడశీపూజా సమయంలో, తన సాధనా ఫలాన్ని మొత్తాన్నీ తన జపమాలతో సహా, శ్రీమాత పాదాల వద్ద సమర్పించి నేలపైన సాగిలపడి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశారు ఆయన. అప్పటినుంచీ ఆ జపమాల శ్రీమాత వద్దనే ఉన్నది.ఈ జపమాలను శ్రీమాత తన దేహత్యాగ సమయంలో గౌరీమా శిష్యురాలైన దుర్గామా కు ఇచ్చారు.అప్పటి నుంచి ఆ జపమాల 'శ్రీ శారదేశ్వరీ ఆశ్రమం' లో ఉన్నది.

ప్రపంచంలోని అత్యంత విలువైన వస్తువు ఏదంటే చాలామంది చాలా రకాలైన సమాధానాలు ఇవ్వవచ్చు.కానీ నేను మాత్రం తడుముకోకుండా ఒక్కటే చెబుతాను.భగవంతుని అవతారం అయిన శ్రీరామకృష్ణులు వాడిన జపమాలను మించిన విలువైన వస్తువు ఈ భూమ్మీద ఎక్కడా లేదు.కోహినూర్ వజ్రమైనా సరే ఈ జపమాల ముందు చెత్తతో సమానం నాకు.అలాంటి అద్భుతమైన వస్తువు ఈ ఆశ్రమంలో ఇప్పటికీ ఉన్నది.

వారి ప్రాణాలకంటే ఎక్కువగా ఈ రెండు వస్తువులనూ వారు ఈనాటికీ రక్షించుకుంటూ వస్తున్నారు.

గౌరీమా గురించి ఇంత సుదీర్ఘంగా ఎందుకు వ్రాయవలసి వచ్చిందని మీకు అనుమానం రావచ్చు.

నేను అమెరికా వెళ్ళినపుడు మిషిగన్ గాంగెస్ లో స్పిరిట్యువల్ రిట్రీట్ జరిపిన mothers trust/mothers place ashram ఈ శారదేశ్వరీ ఆశ్రమానికి అమెరికాలో ఉన్న ఏకైక బ్రాంచ్ కావడమే ఇదంతా వ్రాయడానికి కారణం.

ఈ అమెరికా ఆశ్రమానికి అధ్యక్షురాలిగా ఉన్న "ఇవా ష్రోడర్" అనబడే స్త్రీమూర్తి యొక్క సన్యాసనామం కూడా - 'గౌరీవ్రత పురీదేవి" కావడమూ, ఈమె కూడా అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన సన్యాసిని కావడమూ,ఆమె నన్నూ మా బృందాన్నీ ఎంతగానో అభిమానించి,'గురూజీ' అంటూ నన్ను సంబోధించి ఎంతో ఆత్మీయంగా మమ్మల్ని చూడడమూ - ఈ సంఘటనలన్నీ వివరించే ముందుగా,దీనికంతా మూలమైన అసలు "గౌరీమా" ఎవరో ఆమె జీవితం ఎంత అద్భుతమైనదో చెప్పడం కోసమే ఇదంతా వ్రాస్తున్నాను.

పొద్దున్న లేచిన దగ్గరనుంచీ పరమ స్వార్ధంతో, అహంకారంతో, కుళ్ళుతో మనస్సులు నింపుకుని, విలాసాల కోసం,వినోదాల కోసం అమూల్యమైన జీవితాన్ని వృధా చేసుకుంటూ అదే పెద్ద ఘనకార్యం అన్నట్లు బ్రతుకుతున్న మనమెక్కడ? శరీరాన్నీ దాని సుఖాన్నీ ఏమాత్రమూ లెక్కచెయ్యని తీవ్రమైన తపోదీక్షలో భగవంతుని దర్శనాన్ని పొంది, సర్వజీవులలోనూ ఆయన్నే చూస్తూ, లోకపు పాపాన్నీ, దాని ఫలితమైన దుఖాన్నీ కడగాలని జీవితాంతం నిస్వార్ధంగా ప్రయత్నించిన గౌరీమా వంటి మహనీయులెక్కడ? మనకూ వారికీ అసలు పోలికేమైనా ఉన్నదా కొంచమైనా? 

మనమంతా తలలు వంచి మ్రొక్కవలసిన 'గౌరీమా' దివ్యజీవితం గురించి చదివారు కదా ! మీలో ఎవ్వరికీ తెలియని అద్భుతములైన విషయాలు తెలుసుకున్నారు కదా !

వచ్చే పోస్ట్ లో mothers trust/mothers place ashram గురించీ,నా అమెరికా యాత్ర సందర్భంగా అక్కడ జరిగిన అద్భుతాల గురించీ చదవండి.

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర - 37 (గౌరీమా - శ్రీ శారదేశ్వరీ ఆశ్రమ స్థాపన) "

13, ఆగస్టు 2016, శనివారం

మా అమెరికా యాత్ర - 36 (గౌరీమా - గురు సమక్షంలో...)

మాట ఇచ్చిందే గాని గౌరీమా మనస్సు ఇంకా సందిగ్ధావస్థలోనే ఉన్నది.తోడేళ్ళు పులులూ నక్కలతో కూడిన ఈ ప్రపంచంతో తాను నెగ్గుకు రాగలదా? ఈ పనిని తాను నెరవేర్చగలదా? తన గురుదేవులకిచ్చిన మాటను తాను నిలబెట్టుకొన గలదా? - ఇలాంటి సందేహాలు ఆమెను చుట్టుముట్టేవి.

ఒకరోజున శ్రీ రామకృష్ణులతో ఆమె ఇలా అన్నది.

'గురుదేవా! ఈ లోకంలోని మనుషులు ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు కదా.సహాయం చెయ్యడానికి చాచిన చేతినే ఖండించే రకాలు వీళ్ళు.ఇలాంటి తుచ్చులతో నాకెందుకు? దీని బదులు ఇంకొక పని చేస్తాను.అత్యంత పవిత్రాత్ములైన కొద్దిమంది అమ్మాయిలను నాకివ్వండి.వారిని హిమాలయాలకు తీసుకుపోయి అక్కడ వారికి తపస్సు ధ్యానము  నేర్పించి, దివ్యజీవనం ఎలా గడపాలి? ఈ లోకపు రొచ్చుకు అతీతంగా నిత్యనిర్మలంగా ఎలా జీవించాలి? అన్న విషయాలు నేర్పించి వారిని దివ్యాత్ములుగా తీర్చి దిద్దుతాను.ఈ కలకత్తా రొదలో నేను ఇమడలేను.హిమాలయాల ప్రశాంత వాతావరణానికి అలవాటు పడిన నాకు రణగొణ ధ్వనితో కూడిన ఈ నగర వాతావరణం చాలా దుర్భరంగా ఉన్నది.ఉన్నతులైన స్త్రీలను తయారు చెయ్యడమేకదా నేను చెయ్యవలసిన పని?ఆ పనిని ఈ విధంగా చేస్తాను. అనుమతించండి."

శ్రీ రామకృష్ణులు చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు.

"నీవు ఇప్పటికే చాలా తపస్సు చేశావు.ఇంక నీవు హిమాలయాలకు పోనవసరం లేదు.ఇదే నగరంలో ఇదే రణగొణ ధ్వని మధ్యలో నువ్వుంటూ నేను చెప్పిన పని చెయ్యాలి.అదే అసలైన సాధన.ఏకాంతంలో సాధన గొప్పదే.కానీ అది ఎల్లకాలం పనికిరాదు.నీవా స్థితిని దాటావు.నీ తపశ్శక్తి ఎంతటిదో పరీక్షించుకోవడానికి ఈ ప్రపంచమే సరియైన రంగస్థలం.కనుక నీ ఊహను విడచిపెట్టు.నీ కార్యరంగం ఈ నగరమే.ఇక్కడే నువ్వు పని చెయ్యాలి."

గురుదేవుల మాటలకు గౌరీమా ఆ క్షణానికి అయిష్టంగానే తలూపింది.

గౌరీమా భవిష్యత్తులో చెయ్యవలసిన పనికి శ్రీరామకృష్ణులే రంగం సిద్ధం చెయ్యసాగారు.తన భక్తులతో మాటల సందర్భంగా గౌరీమా ఎంత గొప్ప తపస్వినియో ఎంత గొప్ప పవిత్రాత్మురాలో ఆయన మాటమాటకూ చెప్పేవారు.ఆ మాటలు విన్నవారు ఆమెను ఎంతో గౌరవంగా చూడటమేగాక, ఆమె మాటలు వినాలని ఆమె సమక్షంలో కొంత సమయం గడపాలని కోరుకోసాగారు.ఆ విధంగా గౌరీమా గురించి నలుగురికీ తెలియడం ప్రారంభం అయింది.

తన భక్తులైన బలరాం బోస్, యదుమల్లిక్ వంటి వారి ఇళ్ళకు తరచుగా వెళ్లి అక్కడి స్త్రీలకు నాలుగు మంచిమాటలు చెప్పి వారిని సన్మార్గంలో పెట్టవలసిందిగా శ్రీరామకృష్ణులు గౌరీమాను ఆదేశించేవారు.ఇలా బోధించడం అనేది తనకు ఇష్టం లేకపోయినా ఆమె ఆ పనిని చెయ్యవలసి వచ్చేది.

తనకు బాగా అంతరంగికులైన వారిని శ్రీరామకృష్ణులు ఎప్పుడో ఒక క్షణంలో ఒక మాటను అడిగేవారు.ఆమాటకు వారిచ్చే జవాబును బట్టి వారి ఆధ్యాత్మికస్థాయి ఎంతటిదో ఆయన అంచనా వేసేవారు.అతీతమైన దివ్యశక్తులు ఆయనలో మూర్తీభవించి ఉన్నప్పటికీ ఇలాంటి పద్దతులు కూడా ఉపయోగించి ఆయన తన శిష్యులను భక్తులను సరదాగా పరీక్షిస్తూ ఉండేవారు.అదేవిధంగా ఒకరోజున గౌరీమాను కూడా ఇలా అడిగారు.

"గౌరీ! నాగురించి నువ్వు ఏమని అనుకుంటున్నావు? నేనెవర్నో చెప్పు?"

గౌరీమా తడుముకోకుండా ఇలా చెప్పింది.

'సర్వదేవతలూ ఎవరిలో భాగాలో ఆ పరమాత్మయే మీరు.మీరు సాక్షాత్తూ పరబ్రహ్మమే.ఈ రూపంలో మా అందరికోసం మీరు భూమికి వచ్చారు."

ఆమెకు శాస్త్రపాండిత్యం ఉన్నది గనుక, ఇలా అంటూ ఆమె శ్రీమద్భాగవతం నుంచి ఈ శ్లోకాన్ని ఉటంకించింది.

"ఋషయో మనవో దేవా: మనుపుత్రా: మహౌజసా:
కళా: సర్వే హరేరేవ సప్రజాపతయః స్మృతాః
ఏతే చాంశ కలా పుంసా కృష్ణస్తు భగవాన్ స్వయమ్"

(ఋషులు,మనువులు,దేవతలు,మహా శక్తివంతులైన మనుపుత్రులు, ప్రజాపతులు వీరందరూ భగవంతుడగు హరి యొక్క అంశలు మాత్రమే.కానీ కృష్ణుడో - సాక్షాత్తూ భగవంతుడే."

ఆ మాటలు విన్న శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో తన కుడి అరచేతిని ఆమె తలపైన ఉంచి ఆశీర్వదించారు.

అందరి దగ్గరా ఆయన తనను పొగుడుతుంటే గౌరీమాకు అసౌకర్యంగా ఉండేది.అందుకని ఆయనతో ఇలా దెబ్బలాడేది.

'ఎందుకు నా గురించి గొప్పగా అందరికీ చెబుతారు? దానివల్ల నాకు ఎంతో అసౌకర్యంగా ఉంటుంది."

దానికి శ్రీరామకృష్ణులిలా అనేవారు.

"చూడు గౌరీ.నువ్వు సామాన్యురాలవా? చిన్నప్పటి నుంచీ వేరే ఆలోచన లేకుండా దైవం కోసం నువ్వు తీవ్రమైన తపస్సు చేశావు.చిన్నవయసులోనే సాహసోపేతంగా హిమాలయాలకు వెళ్లి అక్కడ ఏళ్ళ తరబడి తపస్సు చేసి ఎందఱో పురుషులు ఈనాటికీ చెయ్యలేని పనిని నీవు చేశావు. నీ సంగతి అందరికీ తెలియాలి.నిన్ను చూచి జనులు నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో నేర్చుకోవాలి.అందుకే అందరికీ నీగురించి నేనే చెబుతున్నాను."

ఆయన తన భక్తులతో తరచుగా ఇలా అనేవారు.

"గౌరీ చాలా పవిత్రాత్మురాలు.ఎన్నో జన్మలుగా ఆమె భగవంతుని పరమ భక్తురాలు.ఆమె బృందావనపు గోపికలలో ఒకతె. గోపికలు చాలా పవిత్రులు. వారి భక్తి కల్మషం లేనిది.వారికి భగవంతుడు ఎప్పుడూ అతి చేరువగానే ఉంటాడు.గౌరి చెప్పేవి వినండి.ఆమెను చూచి ఎలా జీవించాలో నేర్చుకోండి. మీకు ఒక ఉన్నతమైన జీవితాదర్శాన్ని చూపడానికే ఆమె ఈ లోకానికి వచ్చింది."

త్వరలోనే గౌరీమా గురించి అందరికీ తెలియడం ప్రారంభమయింది.

ఈ విధంగా గురుసమక్షంలో ఆమె ఆనందంగా రోజులు గడపసాగింది.చూస్తూ ఉండగానే ఈ విధంగా మూడేళ్ళు గడచాయి.

ఇదిలా ఉండగా,1886 వ సంవత్సరం వచ్చేసింది. శ్రీ రామకృష్ణులు శరీరాన్ని వదలి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది.తన అంతరిక భక్తులు తన దగ్గరే ఉంటే ఈ సంఘటన చూచి వారు చాలా ఏడుస్తారని ఆయనకు తెలుసు. అందుకని వారిని దూరంగా పంపాలి.

అప్పటివరకూ గౌరీమా తన జీవితమంతా దేశాలు పట్టుకుని తిరిగింది.కానీ శ్రీ రామకృష్ణుల పరిచయం ఎప్పుడు కలిగిందో అప్పటినుంచీ ఆమెకు తీర్దాటన మీద విముఖత కలిగింది.తన దైవం ఎదురుగానే ఉన్నపుడు ఇంకా వేరే తీర్ధయాత్రలెందుకు? అందుకని ఆమె గురుసమక్షంలోనే ఆ మూడేళ్ళూ ఉండిపోయింది.

మనస్సులను మట్టిముద్దలు చేసి ఆడుకోవడంలో సిద్ధహస్తుడైన శ్రీరామకృష్ణుల లీల చాలా అద్భుతమైనది. ఉన్నట్టుండి గౌరీమా మనసులో ఒక సంకల్పం కలిగి అది దినదిన ప్రవర్ధమానమై పోసాగింది.అదేమంటే - మళ్ళీ బృందావనానికి వెళ్లి అక్కడ ఉండి కొన్నాళ్ళు తపస్సులో కాలం గడపాలని.ఉన్నట్టుండి ఈ కోరిక ఎందుకు కలుగుతున్నదో అర్ధంగాక ఆమె అయోమయంలో పడిపోయింది.చివరకు తట్టుకోలేక ఒకరోజున శ్రీరామకృష్ణులకు తన మనస్సును వివరించి,తీర్ధయాత్రలంటే అయిష్టత కల్గిన తనకు ఉన్నట్టుండి బృందావనానికి వెళ్లాలని బలంగా అనిపిస్తున్నదనీ, ఎందుకిలా జరుగుతున్నదో తెలియడం లేదనీ చెప్పింది.

ఆమె మాటలు చిరునవ్వుతో విన్న ఆయన ఇలా అన్నారు.

'అలాగే వెళ్ళు గౌరీ.కొన్నాళ్ళు బృందావనంలో ఉండు.అక్కడ ఉండి తపస్సు చెయ్యి.ఈ సంకల్పం నీ మంచికే."

తన దేహత్యాగ సమయంలో పక్కనే ఉంటే ఆ బాధను ఆమె తట్టుకోలేదని ఆయనకు తెలుసు గనుక ఆయనే ఆమె మనస్సులో ఆ సంకల్పాన్ని కలిగించారు.మౌనంగా తన లీలను నడిపించారు.అన్ని మనస్సులకూ ఆధారమైన విశ్వమానసం (Universal Mind) ఆయనది.దాని సంకల్పానికి తిరుగేముంది?

శ్రీమాత ఆశీస్సులు స్వీకరించిన గౌరీమా బృందావనానికి చేరుకుంది.అక్కడ ఉంటూ తపస్సులో కాలం గడపసాగింది.

ఈలోపల కలకత్తాలో, శ్రీరామకృష్ణులు తన దేహాన్ని వదిలేసి తన నిజధామానికి చేరుకున్నారు.కానీ ఈ విషయం ఆమెకు తెలిసేసరికి చాలా ఆలస్యం అయింది.ఈ రోజులలో లాగా అప్పుడు సమాచార వ్యవస్థ ఇంత వేగంగా లేదుకదా !

ఆ వార్త ఆమెను పిడుగుపాటులా తాకింది.నిర్ఘాంతపోయిన ఆమె ఆ షాక్ నుంచి చాలారోజులు తేరుకోలేకపోయింది.ఊహించని విధంగా తన దైవం ఇలా తనను వదలి వెళ్లిపోతాడని ఆమె ఎంతమాత్రం ఊహించలేదు.ఆ బాధను తట్టుకోలేక ఆమె కూడా శరీరాన్ని వదిలేద్దామని అనుకుంది. మహనీయులకు శరీరం ఉంటే ఎంత పోతే ఎంత?వారికి ఎటువంటి భేదమూ ఉండదు.బృందావనంలో భ్రుగుకుండం అని ఒక మడుగు ఉన్నది. అందులో దూకి చనిపోదామని ఆమె ఆ కుండం దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్ళింది. నీళ్ళలో దూకబోతున్న ఆమె, తనకూ నీటికీ మధ్యన అడ్డంగా ప్రత్యక్షమైన శ్రీరామకృష్ణులను చూచి అప్రతిభురాలై నిలబడిపోయింది.

ఆమె వైపు చూస్తున్న ఆయన కొంచం కటువైన స్వరంతో ఇలా అన్నారు.

'ఏంటి నువ్వు చెయ్యబోతున్న పని? ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటున్నావా? ఇదేనా నువ్వు చెయ్యవలసిన పని? నేను నీకిచ్చిన పని పూర్తిచెయ్యకుండా ఎక్కడకు వద్దామని నీ ఆలోచన?'

ఆమోఘమైన ఆయన దర్శనంతో ఆమె మనస్సు క్షణంలో మారిపోయింది.తన ప్రయత్నాన్ని విరమించుకున్న ఆమె ఆలోచనలో పడింది.

అవును.తన గురుదేవులు తనకు ఒక పనిని అప్పగించారు.అది పూర్తి చెయ్యకుండా ఈ లోకం నుంచి వెళ్ళిపోవడం పిరికితనమూ స్వార్ధమూ అవుతుంది.ఇది సరియైన పని కాదు.

ఇలా ఆలోచించుకున్న ఆమె వెనక్కు తిరిగి తన బసకు వచ్చేసింది.కొద్ది రోజులకు శ్రీరామకృష్ణుల దేహత్యాగాన్ని భరించలేని శ్రీమాత తన అంతరంగికులైన స్వామి యోగానంద, గోలాప్ మా, యోగిన్ మా మొదలైన వారితో తీర్ధయాత్రలు చేస్తూ బృందావనానికి వచ్చింది.అక్కడ గౌరీమాను కలుసుకున్న శ్రీమాత తనకు కలిగిన దర్శనాన్ని గౌరీమాకు వివరించింది.

శ్రీరామకృష్ణుల దేహత్యాగానంతరం వివాహిత యొక్క చిహ్నాలైన బొట్టు గాజులు మొదలైన వాటిని హిందూమత సాంప్రదాయం ప్రకారం తీసివెయ్య బోయింది శ్రీమాత.అదే క్షణంలో ఆమె ఎదురుగా ప్రత్యక్షమైన శ్రీరామకృష్ణులు ఆమె చేతిని పట్టుకుని వారిస్తూ ఇలా అన్నారు.

"ఏంటి నువ్వు చేస్తున్న పని? నేను చనిపోయానని భావిస్తున్నావా? ఇదుగో చూడు నీ ఎదురుగానే నిల్చుని ఉన్నాను.కావాలంటే నన్ను తాకి చూడు. నేనెక్కడికీ పోలేదు.ఒక గదినుంచి ఇంకో గదిలోకి వచ్చాను.అంతే.నీ ఆలోచన విరమించు."

ఈ దర్శనం చూచిన శ్రీమాత బొట్టు గాజులను తీసి వెయ్యకుండా అలాగే ఉంచుకుంది.

ఈ విషయం విన్న గౌరీమా ఇలా అన్నది.

"అమ్మా.నువ్వు లక్ష్మీదేవివి.నువ్వు మంగళకరములైన చిహ్నాలను తీసివెయ్యకూడదు.ఠాకూర్ స్వయానా విష్ణువే. ఆయనకు మరణం ఎలా ఉంటుందమ్మా? నువ్వు అలా చెయ్యకు.నీవే గనుక ఈ పని చేస్తే లోకానికి అమంగళం వాటిల్లుతుంది.ఆ పని ఎప్పటికీ చెయ్యకు."

ఈ విధంగా శ్రీరామకృష్ణులను ధ్యానిస్తూ,ఒకరినొకరు ఓదార్చుకుంటూ, ఒకరి అనుభవాలను ఒకరు పంచుకుంటూ, వారు బృందావనంలో కొన్ని నెలలున్నారు.ఆ సమయంలో వారికి అనేక దర్శనాలను శ్రీరామకృష్ణులు అనుగ్రహించారు.

ఆ తర్వాత వారు తిరిగి కలకత్తాకు వచ్చేసారు.

ఎన్ని దర్శనాలు నిదర్శనాలు చూచినా మానవ సహజమైన వేదన మహనీయులను కూడా సహజంగా బాధిస్తూనే ఉంటుందికదా? పైగా వారి ప్రేమ చాలా స్వచ్చమైనది. అవసరాలకోసం నటించే మన ప్రేమవంటి దొంగప్రేమ కాదది. కనుక అమితమైన వారి ప్రేమలాగే,వారి బాధకూడా అమితంగానే ఉంటుంది.

కలకత్తాకు వచ్చిన గౌరీమాకు అనుక్షణం శ్రీరామకృష్ణులు గుర్తొచ్చేవారు. ఆయన తిరిగిన ప్రదేశాలు ఏవి చూచినా ఆమె తట్టుకోలేక పోయేది. 'నా మనస్సులో అనుక్షణం మీరే ఉండాలి' అంటూ తానడిగిన వరం ఇలా ఇవ్వబడినందుకు ఆమెకు ఎంతో దుఖం కలిగేది.కృష్ణుడు మధురకు వెళ్ళిపోయిన తర్వాత గోపికలు పడిన బాధ ఈమె మళ్ళీ పడసాగింది.ఈ బాధను భరించలేక ఒకరోజున కాళీఘాట్ లోని కాళికాలయానికి వెళ్లి అమ్మ ముందు కూచుని ఏడ్వసాగింది గౌరీమా.

ఎంతో సేపు అలా ఏడ్చిన ఆమె ఉన్నట్టుండి తన భుజాన్ని ఎవరో తాకినట్లు అనిపించి తలఎత్తి చూచి ఆశ్చర్య పోయింది. అక్కడ కాళీమాత ఒక నల్లని త్రిభుజాకారమైన రాయి రూపంలో ఉంటుంది.తలెత్తిన గౌరీమాకు ఆ విగ్రహం కన్పించలేదు.దాని స్థానంలో నవ్వుతూ నిలబడి ఉన్న శ్రీరామకృష్ణులను చూచిన ఆమె నిర్ఘాంతపోయి ఆయనవైపు అలా చూస్తూ ఉండిపోయింది.

చిరునవ్వు చిందిస్తున్న ఆయన ఎప్పటిలాగే తన కుడిచేతిని ఆమె తలపైన ఉంచి ఆశీర్వదించారు.కాళీమాతే తనను తాకిన అనుభూతి ఆ క్షణంలో కలిగి ఆమె మనస్సులో వేధిస్తున్న బాధ అంతా మంత్రం వేసినట్లు మాయమై పోయింది.ఆ బాధ స్థానంలో అమితమైన ఆనందం ఆమెలో పొంగి వచ్చింది.

ఈ విధంగా వారి బాధ తారాస్థాయికి చేరినప్పుడల్లా శ్రీ రామకృష్ణుల దర్శనం వారికి కలిగి వారిని శాంతింపజేస్తూ ఉండేది.

ఈ విధంగా ఏళ్ళు గడుస్తూ ఉండగా మళ్ళీ గౌరీమా తీర్ధయాత్రలకు బయలుదేరింది.ఈసారి కలకత్తా నుంచి దక్షిణాదిన ఉన్న రామేశ్వరం కన్యాకుమారిల వరకూ కాలినడకన ప్రయాణించింది.దారిలో ఎన్నో క్షేత్రాలను దర్శిస్తూ ఆమె ప్రయాణం సాగింది.ఆ తరువాత మళ్ళీ హిమాలయాలకు వెళ్లి కొన్ని నెలలు ఉత్తరకాశీలోని మారుమూల అటవీ ప్రాంతాలలో ఉంటూ ఆమె తపస్సులో కాలం గడిపింది.

ఉత్తరకాశీ అంటే ఈ రోజులలోనే హిమాలయాలలో చాలా లోతట్టు ప్రాంతం.అక్కడ చలీ అధికమే.అదంతా మంచు కొండలూ దట్టమైన అడవితో కూడుకున్న నిర్మానుష్య ప్రాంతం.ఇక 150 ఏళ్ళ క్రితం అక్కడ ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.సరియైన దారికూడా అప్పట్లో ఉండేది కాదు. బండరాళ్ళను పట్టుకుని ప్రాకుతూ ఆ కొండలు ఎక్కాలి.అక్కడ క్రూరమృగాలు కూడా విచ్చలవిడిగా తిరిగేవి.అలా రాళ్ళల్లో పడి ఎక్కుతూ పొతున్నపుడు ఏ పులో ఏ ఎలుగుబంటో ఎదురైతే అంతే సంగతులు.మౌనంగా దానికి ఆహారం అయిపోవడమే. లేదా కొంచం కాలు జారితే చాలు.వేల అడుగుల లోతున్న లోయలో పడి నుజ్జు నుజ్జు అయిపోవడమే.

అలాంటి అడవులలో మంచు కొండల్లో ఉంటూ గౌరీమా తన తపస్సును మళ్ళీ కొనసాగించింది.

ఇలా దాదాపు పదేళ్ళు గడిచాయి.

ఇక శ్రీరామకృష్ణులు ఇచ్చిన పనిని ప్రారంభించాలని ఆమెకు గట్టి సంకల్పం కలిగింది. ఆ సంకల్పం నుంచి ఉద్భవించినదే శ్రీ శారదేశ్వరీ ఆశ్రమం. ఈ ఆశ్రమ స్థాపనతో ఆమె జీవితంలో చివరి అధ్యాయం ప్రారంభమైంది.

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర - 36 (గౌరీమా - గురు సమక్షంలో...) "

12, ఆగస్టు 2016, శుక్రవారం

అరుణాచల ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాలికో ఫూల్ దుర్మరణం - ఒక పరిశీలన

అరుణాచల ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాలికో ఫూల్ ఆగస్ట్  9 న తన ఇంట్లో ఉరేసుకుని శవమై కనిపించాడు. చచ్చినోళ్ళ జాతకాలు చూడటం మనకు అలవాటే గనుక ఈయన జాతకాన్ని కూడా పరిశీలిద్దాం.

ఈయన 20-7-1969 న అరుణాచల ప్రదేశ్ లోని హవాయి లో వల్లా అని ఊరిలో జన్మించాడు.ఈ ప్రదేశానికి GPS Co-ordinates 96E48; 27N53; Time Zone 5.30 East of GMT.సమయం ఖచ్చితంగా తెలియదు.అయినా పరవాలేదు.మనకు తెలిసిన ఇతర విధానాలు ఉపయోగించి పైపైన చూద్దాం.

చంద్రలగ్నం నుంచి చూస్తే బలవన్మరణ జాతకాలలో ముఖ్యంగా ఆత్మహత్యా జాతకాలలో నేను ఎన్నో సార్లు నిరూపించిన జైమినీ మహర్షి చెప్పిన యోగం ఈయన జాతకంలో కూడా కొట్టొచ్చినట్లుగా చూడవచ్చు.అదేమంటే - తృతీయంలో పాపగ్రహం ఉండటం.అక్కడ ఉన్న కుజుడు గుళిక మాంది నెప్ట్యూన్ (వరుణ) గ్రహాలతో కలసి ఉండటం వల్ల బలవన్మరణం సూచితం అవుతున్నది.

"అష్టమం ఆయుష స్థానమష్టమాదష్టమం తధా" అన్న "జాతకచంద్రిక సూత్రం" ప్రకారం అష్టమమూ తృతీయమూ ఆయుష్య స్థానాలు అవుతాయి.ఒకరి ఆయుస్సు ఎంత ఉన్నది అన్న విషయం చూడాలంటే ఈ రెండు స్థానాలను గమనించాలి.

జైమిని సూత్రమైన - "మంద మాన్దిభ్యాం జలోద్బంధనాదిభి:" అన్న సూత్రం ప్రకారం తృతీయంలో శనిగాని మాంది గాని ఉన్నప్పుడు ఆ జాతకుడు నీటిలో పడిగాని, ఉరిపోసుకుని గాని మరణిస్తాడు - అని ఖచ్చితమైన సూత్రాన్ని జైమిని మహర్షి వేల ఏళ్ళ క్రితమే ఇచ్చి ఉన్నాడు.అది అంతే ఖచ్చితంగా రుజువు కావడం ఈ జాతకంలో కూడా మళ్ళీ చూడవచ్చు.ఈజాతకంలో కూడా మాందిగ్రహం తృతీయంలోనే ఉన్నాడు.కనుక ఉరితో మరణం సంభవించింది.

జ్యోతిశ్శాస్త్ర సూత్రాలు ఎంత ఖచ్చితంగా పనిచేస్తాయో చూచారా మరి? ఇదే సూత్రం గతంలో హీరో ఉదయ్ కిరణ్ జాతకంలోనూ, హీరోయిన్ జియాఖాన్ జాతకం లోనూ,హీరో రంగనాద్ జాతకంలోనూ కూడా ఉన్న విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.కావాలంటే నేను వ్రాసిన పాత పోస్టులు మరొక్కసారి చదవండి.

ఇలాంటి దూకుడు పనులు చేసేవారి జాతకాలలో చంద్రుని పాత్ర చాలా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.ఎందుకంటే చంద్రుడు మన:కారకుడు గనుక.

ఈ జాతకంలో ముఖ్యమైన యోగం ఏమంటే - చంద్రుడు,యురేనస్ సరిగ్గా 7 డిగ్రీల మీద సంయోగంలో ఉండటం.వీరితో బాటు బాధకుడైన గురువు కూడా అదే 7 డిగ్రీల మీదే ఉన్నాడు.ఈ బిందువు ఉత్తరా నక్షత్రం అయింది.వీరితో బాటు కేతువు కూడా అదే నక్షత్రంలో ఉంటూ సున్నా డిగ్రీలలో ఉన్నాడు.ఈ నక్షత్రాదిపతి అయిన సూర్యునకు ద్వాదశాదిపత్యం వచ్చింది.ఇంకేం కావాలి?

యురేనస్ లక్షణాలు తెలిసిన వారికి విడిగా చెప్పవలసిన పని లేదు.చంద్రునిపైన ఇలాంటి యురేనస్ యొక్క ప్రబలమైన ప్రభావం ఉన్న జాతకులు ఉన్నట్టుండి హటాత్ నిర్ణయాలు తీసుకుంటారు.ఉన్నట్టుండి దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తారు.విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు.అంతేకాదు వాటిని క్షణాలలో అమలు చేస్తారు కూడా.మనతో మాట్లాడుతూనే ఉండి పక్కరూములోకి వెళ్లి క్షణాలలో ఆత్మహత్య చేసుకుని శవంగా కనిపిస్తారు.అప్పటిదాకా వారితో మాట్లాడుతూ ఉన్నవారు నిర్ఘాంతపోతారు.ఇలాంటి జాతకుల మనస్సు ఏ క్షణంలో ఎలా టర్న్ అవుతుందో వారికే తెలియదు.దీనికితోడుగా చంద్రునిమీద కేతువు యొక్క ప్రభావం కూడా ఉన్నది.బాధకుడైన గురువు ప్రభావం ఉన్నది.మనస్సు మీద ఇన్ని రకాలైన శక్తులు పనిచేస్తుంటే ఆ జాతకుడు ఇంకేం చెయ్యగలడు?

అదీగాక తృతీయంలో ఉన్న కుజ,మాందీ నెప్ట్యూన్ల క్షేత్రమే ఘటీలగ్నం కూడా అయింది.కనుక అధికారము పేరు ప్రఖ్యాతులు హటాత్తుగా పోయిన ఫలితంగా వచ్చిన డిప్రెషన్ ఈ దుర్ఘటనకు కారణమని స్పష్టంగా కనిపిస్తున్నది.

చంద్రలగ్నాత్ అష్టమంలో ఉన్న నీచశని వల్ల ఇతనికి జనశాపం ఉన్న విషయం స్పష్టంగా గోచరిస్తున్నది.

ఇవి చాలవన్నట్లు - ఇదే సమయంలో గోచార గురువు సింహరాశిని వదలి కన్యారాశిలో ఉన్న జననకాల గురు చంద్ర కేతు యురేనస్ ల మీదకు రాబోతున్నాడు.వెంటనే ఈ సంఘటన ట్రిగ్గర్ చెయ్యబడింది.గోచార ఫలితాలు ఒక వారం నుంచే కనిపించడం ప్రారంభం అవుతాయి.దానికి కారణం ఆయా గ్రహాలకుండే ఆచ్చాదనా (Orb) ప్రభావం.

ఈ గ్రహప్రభావాలన్నీ కలసి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇంకా ముఖ్యమంత్రి క్వార్టర్స్ ఖాళీ చెయ్యకుండానే, అదే ఇంటిలో ఆత్మహత్య చేసుకోవడం అనే సంఘటనకు దారి తీశాయి. గతంలో కూడా కడుపునొప్పి భరించలేక ఈయన ఒక నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడట.హీరో రంగనాద్ కూడా పదో తరగతి చదివే సమయంలో రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు.చంద్రునిమీద ఆయా ఇతర గ్రహాల ప్రభావాలు బలంగా ఉన్న సమయంలో ఇలాంటి జాతకులు ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నాలు చేస్తారు.చాలాసార్లు ఆ ప్రయత్నాలు ఫలించకపోయినా ఏదో ఒక బలహీన క్షణంలో అవి సక్సెస్ అవుతాయి.ఇతని కేసు కూడా అలాంటిదే.

జీవితం అనేది జాతకంలో ఎంత స్పష్టంగా దర్శనమిస్తుందో చూచారా మరి?
read more " అరుణాచల ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాలికో ఫూల్ దుర్మరణం - ఒక పరిశీలన "