2, సెప్టెంబర్ 2014, మంగళవారం

రోహిణీ శకట భేదనం-2 (శనిగ్రహ దృష్టులు-మరికొన్ని నివ్వెరపరచే నిజాలు)

ఇప్పుడొక విప్లవాత్మకమైన వ్యాఖ్య మీ ముందుకు రాబోతున్నది.

శనీశ్వరుని స్థితే కాదు దృష్టి కూడా మంచిదే.

ఇదేంటి లోకమంతా 'చెడు' అంటే ఈయన 'మంచి' అంటాడేమిటి?అనుకోకండి.లోకానికి మంచి అయినది యోగులకు చెడు.లోకులకు చెడు అయినది యోగులకు మంచీ అవుతుంది.లోకాన్నీ వ్యక్తులనూ వారు చూచే దృష్టికోణం విభిన్నంగా ఉంటుంది.

భగవద్గీతయే దీనికి ప్రమాణం.

శ్లో||యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే

(సమస్త జీవులకూ ఏది రాత్రియో ఆ సమయంలో సంయమి ఐనవాడు మేలుకుని ఉంటాడు.ఎందులో సమస్త జీవులూ మేలుకొని ఉంటాయో అది ముని అయిన వాడికి రాత్రిగా కనిపిస్తుంది)

ఆ||ఎల్ల భూతతతుల కేది రాత్రిగ దోచు
దమికి దోచు నదియె దివము గాగ
దేనియందు జనులు దెలివి మీరుచు నుందు
రదియె రాత్రి జూడ నతని కిచట   

(భగవద్గీత 2:69)

లోకమంతా శనీశ్వరుని ప్రభావాన్ని 'చెడు' అనుకుంటుంది.కానీ లోకానికి తెలియని విషయం ఏమంటే శనిప్రభావం చాలా మంచిది.అది మనిషి కర్మను అతని చేత అనుభవింప చేస్తుంది.కర్మక్షాళనం గావిస్తుంది.మన నెత్తిన ఉన్న కర్మబరువును వేగంగా తగ్గిస్తుంది.మనిషిచేత అతని పూర్వకర్మను అనుభవింపచేసి అతని పాపాన్ని ప్రక్షాళనం గావిస్తుంది.అతడిని పరిశుద్ధుడి ని చేస్తుంది.అందుకే శని ప్రభావం చాలా మంచిదని నేనంటాను.

It is a great purifier.

శనైశ్చరుని ప్రభావం లేకుంటే జీవితం చాలా త్వరగా బోరు కొడుతుంది. అంతే కాదు దారీతెన్నూ లేకుండా అయిపోతుంది.పాశ్చాత్యదేశాలలో ఉండే చాలామందికి జీవితం అతిత్వరగా బోరు కొట్టడానికీ వారు తరచూ డిప్రెషన్ లో పడటానికీ కారణం వారిమీద ఉండే తీవ్రమైన శనిప్రభావమే.

ఈ మాట కొంచం అర్ధం కానిదిగా ఉండవచ్చు.కొద్దిగా వివరిస్తాను.అప్పుడు బాగా అర్ధం అవుతుంది.

శనీశ్వరునకు రెండు ప్రభావాలుంటాయి.ఆ మాటకొస్తే ఏ గ్రహానికైనా రెండు ప్రభావాలుంటాయి.ఒకటి పాజిటివ్.ఒకటి నెగటివ్.వీటిలో ఏది ఎక్కువైనా ఇబ్బందే.ఏదైనా సమంగా ఉన్నపుడే జీవితం కూడా సమంగా నడుస్తూ ఉంటుంది.

శనీశ్వరుని దృష్టి ఒకనిమీద అస్సలు లేకుంటే వాడు రోజురోజుకూ లోక వ్యవహారంలో తీవ్రంగా కూరుకుపోతాడు.వాడికి వైరాగ్యం అనేది అస్సలు రాదు.ఊపిరి సలపనంతగా లోకపు పనులలో వ్యామోహాలలో వాడు ఇరుక్కుపోతాడు.అదే శనీశ్వరుని దృష్టి ఒకనిపైన బాగా ఎక్కువగా ఉంటే కూడా అదీ ప్రమాదమే.అటువంటి వాడు తీవ్రమైన నైరాశ్యంలో,డిప్రెషన్ లో కూరుకుపోతాడు.సమత్వం తప్పితే రెండూ ప్రమాదకారులే.

అయితే ఇంద్రియదాసులైన లోకులకు జీవితంలో కష్టాలు వస్తే చాలా బాధగా ఉంటుంది.కానీ ఆ కష్టాలు తమ పూర్వపు చెడు కర్మ వల్లనే వస్తున్నాయన్న జ్ఞానం వారికి ఉండదు.ఒకవేళ ఎవరైనా ఈ నిజాన్ని చెప్పినా వారంత తేలికగా ఒప్పుకోరు.

వారికి అర్జంట్ గా కావలసింది ఆ కష్టం తేరగా పోవడమూ అప్పనంగా సుఖాలు వచ్చి ముంగిట్లో వాలడమూ.ఆ సుఖాలు ఎల్లకాలమూ అలాగే ఉండటమూ.అంతే.వీరి మూలపురుషుడు యయాతి మహారాజు.

ఒకసారి నేనొక గుడికి వెళ్లాను.

అక్కడ పూజారి నాకు తెలుసు.అతను పూజ చెయ్యబోతూ అక్కడ ఉన్న భక్తులను వారి వారి గోత్రాలు అడుగుతున్నాడు.

నా దగ్గరికి వచ్చినపుడు ఇలా చెప్పాను.

'ఎందుకలా అందరివీ గోత్రాలు అడుగుతావు? అందరిదీ ఒకటే గోత్రం. యయాతి గోత్రం.పూజలో అలా చెప్పు సరిపోతుంది.'

అతనికి మన ధోరణి తెలుసు గనుక నవ్వేసి మామూలుగా పూజ ముగించాడు.

తర్వాత ఇలా అన్నాడు.

'శర్మగారు.మీరు అన్నది నిజమే.వారివారి కోరికలు తీరడం తప్ప ఈ పిచ్చి జనానికి ఇంకేం కావాలి?కానీ మీరు చెప్పినట్లు నేనిక్కడ చెయ్యకూడదు. ఎవరి గోత్రాలు వారివి నేను చెప్పే సంకల్పంలో సరిగ్గా చెప్పాలి'

దానికి నేనిలా అన్నాను.

'నిజమే.నేనూ సరదాగానే అన్నాను.సంకల్పంలో 'యయాతి గోత్రం' అని చెప్పమని కాదు నా ఉద్దేశ్యం.లోకం తీరు అలా ఉందని నేను అన్నాను. దానిని సీరియస్ గా తీసుకోకు.మనం చెప్పినా చెప్పకపోయినా లోకుల గోత్రం యయాతి గోత్రమే.ఆ సంగతి నీకూ నాకే కాదు దైవానికి కూడా మనకంటే ముందే తెలుసు.'

ఎవరైనా నన్ను 'శనిదోషం పోవడానికి ఏం చెయ్యాలి?' అనడిగితే నాకు భలే నవ్వొస్తుంది.అదెలా పోతుంది? అది పొయ్యేది కాదు.అది పోతే నీ జీవితమే సమాప్తం అవుతుంది.ఈ లోకంతో నీ ఋణం తీరిపోతుంది.శనిదోషం పోతే దానిని అనుభవించే నీవే పోతావు.ఇది చాలామందికి తెలియదు.

అదీ సంగతి.

శనిదోషం పోవడానికి లోకమంతా ఏవేవో పూజలు పరిహారాలు చేస్తుంది.కానీ అవి అసలైన పరిహారాలు కావు.అసలైన శనిదోష పరిహారాలను కోటికి ఒక్కరు కూడా చెయ్యలేరు.శనిదోషాన్ని నిజంగా నివృత్తి చేసుకోడానికి తమ జీవితాలలో వచ్చిన అవకాశాలను అందరూ కాలదన్నుకునే వారేగాని, అలాంటి పరిస్థితులు జీవితంలో ఎదురైనప్పుడు వాటిని సక్రమంగా ఉపయోగించుకునే వారు ఒక్కరుకూడా నాకు ఇంతవరకూ కనపడలేదు.

అసలు 'శనిదోషం' అనే మాటే తప్పు.అది దోషం కాదు.నీవు చేసుకున్న పూర్వకర్మ.ఆ కర్మ చేసేటప్పుడు అది దోషాన్ని కలిగిస్తుందని నీకు తెలీదా?పోనీ నీకు తెలియకపోయినా,వద్దని చెప్పేవారు చెప్పినప్పుడు నీవు విన్నావా?అహంకారంతో ఒళ్ళు కొవ్వెక్కి చేసుకుని,ఇప్పుడు దాని ఫలితం అనుభవించే సమయంలో 'శనిదోషం' అంటావేమిటి?దోషం శనిది కాదు.నీది.నీవు చేసిన తప్పును శనైశ్చరుడి మీదకు నెట్టాలని చూడటం ఇంకో పెద్దతప్పు.

లోకం అంతా ఇలా అజ్ఞానంలో బ్రతకవలసిందే.వేరే మార్గం దానికి లేదు. ఒకవేళ దారి చూపేవారు దానికి ఎదురైనా ఆ దారిని అది స్వీకరించలేదు.ప్రపంచం మీద అజ్ఞానపు పట్టు చాలా గట్టిది.ఇదొక అనుల్లంఘనీయమైన కర్మ నియమం.దానిని బ్రేక్ చెయ్యడం ముందు హెర్క్యూలియన్ టాస్క్ లు కూడా చాలా చిన్నవిగా కనిపిస్తాయి.

ఈ "యోగిక్ ఉపోద్ఘాతాన్ని" అలా ఉంచి,ప్రస్తుతం విషయంలోకి వద్దాం.

రోహిణీ నక్షత్రంలో శనీశ్చరుని స్థితిని మనం గమనించాం.ఇప్పుడు ఆయన దృష్టిని గమనిద్దాం.

సింహరాశి 17 డిగ్రీల మీదకు వచ్చినపుడు ఆయన వృషభం 17 వ డిగ్రీని తన దశమ దృష్టితో వీక్షిస్తాడు.ఖగోళంలో అలా జరిగిన ప్రతిసారీ అది కూడా ఒక రకమైన రోహిణీ శకట భేదనమే అవుతుంది.అలా జరిగిన ప్రతిసారీ ఏమైందో క్లుప్తంగా పరికిద్దాం.

1) 2007-08 లో శనీశ్చరుడు సింహరాశి 17 డిగ్రీల మీద సంచరించాడు.

ఆ సమయంలో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది.1930 లో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ తర్వాత మళ్ళీ అంత భయంకరమైన ఆర్ధిక దుస్థితి ఇదే అని ప్రపంచ ఆర్ధిక వేత్తల అభిప్రాయం.

2) అంతకు ముందు 1977-78 లలో శనీశ్చరుడు సింహరాశిలో సంచరించాడు.

ఆ సమయంలో పశ్చిమ న్యూయార్క్ ని "బ్లిజర్డ్ ఆఫ్ 1977" ఊపి పారేసింది.ఎక్కడ చూచినా మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది.ఎన్నో మిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది.

అదే సమయంలో ఆంద్రప్రదేశ్ లో దివిసీమ తుఫాను చెలరేగింది.దాదాపు 50,000 మంది ఆ తుఫాన్లో చనిపోయారని ఒక అంచనా.అలాగే 500 మిలియన్ డాలర్ల ఆర్ధిక నష్టం వాటిల్లింది.

3) అంతకు ముందు 1948-49 లలో శనీశ్చరుడు సింహరాశిలో సంచరించాడు.

దాదాపుగా అదే సమయంలో జరిగిన భారతదేశ విభజనలో సరిహద్దు దగ్గర ఇటునుంచి పాకిస్తాన్ కూ అటునుంచి ఇండియాకూ జనాలు మారేటప్పుడు జరిగిన గొడవలలో దాదాపు 5 లక్షల మంది చనిపోయారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులూ రవాణా ప్రమాదాలూ ఎన్నో జరిగాయి.

4) అంతకు ముందు 1918-19 లలో శనీశ్చరుడు సింహరాశిలో సంచరించాడు.

ఆ సమయంలో ప్రపంచంలోనే అతి భయంకరమైన "ఫ్లూ" పాండెమిక్ విజ్రుమ్భించి ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల మందిని ఎటాక్ చేసింది.దీనికి H1N1 ఫ్లూ వైరస్ కారణం.వారిలో 50-100 మిలియన్ల మంది చనిపోయారు.

ఇది ఎపిడెమిక్ కాదు.పాండెమిక్.అంటే అతివేగంగా వ్యాపిస్తూ అనేక దేశాలనూ ఖండాలనూ ఒకేసారి ఎటాక్ చేసే వ్యాధి అన్నమాట.

అప్పుడే మన దేశంలో 'జలియన్ వాలాబాగ్' హత్యాకాండ జరిగింది.

ఇక ఆ సమయంలో వచ్చిన భూకంపాలూ వరదలూ ఇతర ప్రమాదాల గురించి నేను వ్రాయదలచుకోలేదు.

5) అంతకు ముందు 1889-1890 లలో శనీశ్చరుడు సింహరాశిలో సంచరించాడు.

ఆ సమయంలో "ద గ్రేట్ సియాటిల్ ఫైర్" అనే భయంకర అగ్నిప్రమాదం జరిగింది.ఆ ప్రమాదంలో సియాటిల్ చాలావరకూ నాశనం అయింది.

అదే సమయంలో 'ద గ్రేట్ బేకర్స్ ఫీల్డ్ ఫైర్' అనే ప్రమాదం జరిగి ఆ టౌన్ మొత్తాన్నీ కాల్చేసింది.మొత్తం 196 బిల్డింగులు కాలిపోయాయి.

అదే సమయంలో కాలిఫోర్నియా సమీపంలో 'సాంటియాగో కేన్యన్ ఫైర్' అనే అగ్ని ప్రమాదం జరిగి ఆరంజ్ కౌంటీ, సాన్ డీగో కౌంటీ లను తగలబెట్టింది.

యధావిధిగా భూకంపాలూ వరదలూ వ్రాయదలుచు కోలేదు.

6) అంతకు ముందు 1859-1860 లలో శనీశ్చరుడు సింహరాశిలో సంచరించాడు.

ఆ సమయంలో "సూర్యతుఫాను" అనబడే భూఅయస్కాంత తుఫాన్ వచ్చింది.దానిని "సోలార్ స్టార్మ్ ఆఫ్ 1859" లేదా 'కేరింగ్టన్ ఈవెంట్' అంటారు.

అదే సమయంలో ఐరిష్ సముద్రంలో "రాయల్ చార్టర్ స్టార్మ్" అనబడే భయంకర తుఫాన్ వచ్చింది.

ఇంకా వెనక్కు పోయి చూడనవసరం లేదు.ఎందుకంటే విషయం స్పష్టంగా కనిపిస్తున్నది గనుక.

కనుక ఇప్పుడు అర్ధమైన ఇంకొక విషయం ఏమంటే--

శనీశ్చరుడు సింహరాశిలో సంచారం చేసే సమయంలో కూడా ఉపద్రవాలు కలుగుతాయి.ఎందుకంటే ఆయన దశమ దృష్టితో రోహిణీ నక్షత్రాన్ని వీక్షిస్తాడు గనుక.

అయితే,వృషభరాశిలో సంచారం చేసేటప్పుడు జరిగినన్ని ఎక్కువ ఘోరాలు అప్పుడు జరగడం లేదు.అంటే, ఆయనయొక్క స్థితికంటే దృష్టి బలహీనమైనది అన్న విషయం కనిపించింది కదా.

ఇక ఆయనకు మిగిలిన దృష్టుల ప్రభావాన్ని వచ్చే పోస్ట్ లో చూద్దాం.

(ఇంకా ఉన్నది)
read more " రోహిణీ శకట భేదనం-2 (శనిగ్రహ దృష్టులు-మరికొన్ని నివ్వెరపరచే నిజాలు) "

1, సెప్టెంబర్ 2014, సోమవారం

రోహిణీ శకట భేదనం-1(భారతీయ జ్యోతిష్య విజ్ఞానానికి తిరుగులేని సాక్ష్యం)

రోహిణీ శకట భేదనం!!!

ఈ మాట మనకు పురాణాలలో వినిపిస్తుంది.రామాయణకాలంలో దీనిని గమనించారు.మహాభారత యుద్ధ సమయంలో దీనిని గమనించారు.ఆయా సమయాలలో ఇది ఆకాశంలో కనిపించిన ప్రతిసారీ యుద్ధాలూ తీవ్ర జననష్టాలూ జరిగాయి.

రామాయణ కాలంలో దశరధ మహారాజు ఈ ఖగోళ సంఘటనను గమనించి దాని ఫలితంగా తన రాజ్యంలో ఏదో మహావిపత్తు జరగబోతున్నది అని భావిస్తాడు.

శ్లో|| కృత్తికాంతే శనౌ యాతే దేవజ్నై జ్ఞార్పితో హిసా
రోహిణీ శకటం భిత్వా శనిర్యస్యతి సాంప్రతం

ఇత్థం శకట భేదేన సురాసుర భయంకరం
ద్వాదశాబ్దస్తు దుర్భిక్షం భవిష్యతి సుదారుణం

దేశశ్చ నగర గ్రామా భయభీతా సమం తథా
బ్రువంతి సర్వలోకానాం భయమేతత్ సమాగమం

ఆ సంకట నివారణ కోసం ఆయన శనీశ్వరుని ప్రార్ధించి రచించిన "దశరధకృత శనిస్తోత్రం" మనకు బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తుంది.దానిని ఇప్పటికీ ఎందఱో జపిస్తూ ఉంటారు.ఇది జాతకంలో శనీశ్వరుని దోషాలనుండి, ముఖ్యంగా రోహిణీ శకటభేదన సమయంలో కలిగే విపత్తులనుండి బ్రహ్మాండమైన రక్షాకవచంగా పనిచేస్తుంది.అన్ని విపత్తులనూ నివారిస్తుంది.

మహాభారతంలో ఉన్న కొన్ని శ్లోకాలను చూద్దాం.

శ్లో|| ప్రాజాపత్యం హి నక్షత్రం గ్రహస్తీక్ష్నో మహాద్యుతి:
శనైశ్చర: పీడయతి పీడయన్ ప్రాపినోధికమ్

(ప్రజాపతి నక్షత్రమును (రోహిణిని) తీక్ష్ణుడైన శనైశ్చరుడు పీడిస్తున్నాడు. జనులకు అధికములైన పీడలు కలుగబోతున్నవి)

(సంస్కృత మహాభారతం ఉద్యోగ పర్వం)

శ్లో||రోహిణీం పీడ్యన్నేష స్థితో రాజన్ శనైశ్చర:
వ్యావృత్తలక్ష్మ సౌమస్య భవిష్యతి మహద్భయమ్

(సంస్కృత మహాభారతం భీష్మ పర్వం)

(ఓ రాజా! శనైశ్చరుడు రోహిణీ నక్షత్రాన్ని పీడిస్తున్నాడు.చంద్రుని లక్షణాలు విపరీతంగా కనిపిస్తున్నాయి.ఏదో భయంకరమైన విపత్తు జరుగబోతున్నది)

రామాయణ మహాభారతాలలో నుంచి రోహిణీ శకటభేదన పరంగా ఈ విధములైన శ్లోకాలు మనకు కనిపిస్తున్నాయి.

అసలు--మన పురాణాలలో ఉన్న విషయాలను తేలికగా తీసుకుంటూ,అవన్నీ పిచ్చి కధలుగా కొట్టి పారేసే అలవాటు మనకు ఎలా వచ్చింది? మన ధార్మిక సంపదను మనమే కాలదన్నుకునే దుస్థితి మనకెలా దాపురించింది?

ఇంగ్లీషు చదువులవల్లా,ఇతర మతాల దుష్ప్రచారం వల్లా,మన తల్లిదండ్రులు మనకు నేర్పకపోవడం వల్లా,ఒకవేళ వాళ్ళు నేర్పకపోయినా,మనంతట మనం చదివి తెలుసుకోకపోవడం వల్లా,అనవసరంగా పెరిగిన ధనమదం వల్లా,కుహనా పాండిత్యగర్వం వల్లా ఈ దుస్థితి దాపురించింది.కొండొకచో ప్రక్షిప్త శ్లోకాదుల వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తింది.

అంతేకాదు,పురాణాల లోని అన్ని సంఘటనలూ సాంఘికంగా యధాతధంగా జరిగినవి కావు.వాటిల్లో కొన్నికొన్ని మార్మికార్ధములు కలిగి నిగూడంగా కధలుగా చెప్పబడినవి.అలాంటి వాటిని యధాతధంగా అర్ధం చేసుకోవాలని ప్రయత్నించడమే,మన గందరగోళానికి ఇంకొక కారణం.

అందుకే మనం ఈ "రోహిణీ శకట భేదనం" వంటి వాటిని నమ్మం.ఇవన్నీ జనాన్ని మోసం చెయ్యడానికి బ్రాహ్మణులు వ్రాసిన పిచ్చివ్రాతలని చీప్ గా భావించేవాళ్ళు నాకు తెలిసిన ఇతర కులాలవారిలో చాలామంది ఉన్నారు.ఆ క్రమంలో మన భారతజాతికి గురువైన వ్యాసమహర్షిని కూడా చీప్ గా కామెంట్ చేసినవాళ్ళు నాకు తెలుసు.వారి దోషం ఎక్కడికీ పోదు.అది వారితోనే ఉంటుంది.సమయం వచ్చినపుడు దాని ప్రభావం ఎలా ఉంటుందో వారు తెలుసుకుంటారు.గర్వంతో మాట్లాడేటప్పుడు తెలియకపోయినా, ఆయా బాధలు పడేటప్పుడయినా మనం చేసిన పనుల ప్రభావం ఏమిటో ఎవరికి వారికి తప్పకుండా తెలుస్తుంది.

అయితే అలాంటి అజ్ఞానులు తెలుసుకోవలసిన విషయం ఒకటుంది.

నిజమైన బ్రాహ్మణుడు ఎవరినీ మోసం చెయ్యడు.అతని జీవన విధానమే విభిన్నంగా ఉంటుంది.ఏదో ఆశించి మాయమాటలు చెప్పి దానిద్వారా స్వలాభం పొందాలని చూడటం బ్రాహ్మణ లక్షణం కాదు.త్యాగం అనేది అతనికి ఉగ్గుపాలతో వస్తుంది.అతిమంచితనం వల్ల ఒకవేళ నష్టపోతే తానే నష్టపోతాడు గాని ఇతరులను దోచుకోడు.ఒకవేళ ఏదో కారణంవల్ల ఈ లక్షణాలు అతనిలో కనిపించకపోతే అది అతని గ్రహపాటనే భావించాలి.

కనుక చెప్పేదేమంటే,పురాణాలలో ఉన్న విషయాలన్నీ మనం అనుకునేటట్లు కట్టుకధలు కావు.ముఖ్యంగా వాటిల్లో ఉన్న ఖగోళ రిఫరెన్స్ లూ,ఆయా సమయాలలో జరిగిన సంఘటనలూ అబద్దాలు కావు.ప్రాచీనులు మనకోసం వాటిని రికార్డ్ చేసి భద్రంగా పురాణాల రూపంలో వాటిని అందించారు.మనమేమో వాటిని ఎగతాళి చేస్తూ నమ్మకుండా విర్రవీగుతూ పిచ్చిమాటలు మాట్లాడుకుంటూ ఎంతో అమూల్యమైన సంపదను చేతులారా కోల్పోతున్నాం.ఇంతకంటే దుస్థితి ఎక్కడైనా ఉంటుందా?

కలియుగ ధర్మం అంటే ఇదేనేమో??

కొద్దిసేపు దానిని అలా ఉంచి,రోహిణీ శకట భేదనం అంటే ఏమిటో దాని ప్రభావాలు మనమీద ఎలా ఉంటాయో పరిశీలిద్దాం.

'సూర్యసిద్ధాంతం' లో రోహిణీ శకట భేదన  నిర్వచనం ఇలా ఉన్నది.

శ్లో||వృషే సప్తదశే భాగే యస్య యామ్యోంశకద్వయాత్
విక్షేపో అభ్యధికో భింద్యాద్ రోహిణ్యా శకటాం తు సః
(సూర్య సిద్ధాంతం)

(వృషభ రాశిలో 17 డిగ్రీల వద్ద రెండు అంశల కంటే కొద్దిగా ఎక్కువ విక్షేపం దక్షిణం వైపుగా ఉన్న గ్రహం రోహిణీ శకటాన్ని భేదిస్తుంది)

రెండు వేల సంవత్సరాల నాడు వరాహమిహిరుడు తన బృహత్సంహితలో రోహిణీ శకట భేదనాన్ని గురించి ప్రస్తావించాడు.

శ్లో||రోహిణీ శకట మర్కనందనో  యది భినత్తి రుధిరోధవా శిఖీ
కిం వదామి యదనిష్ట సాగరే జగత్సేష ముపయాతి సంక్షయమ్
(బృహత్సంహిత)

(రోహిణీ శకటమును అర్కనందనుడు(శని),రుధిరుడు(కుజుడు) లేదా శిఖి(తోకచుక్కగానీ లేక కేతువుగానీ కావచ్చు) భేదించినప్పుడు కలిగే ఉపద్రవాలను ఏమని చెప్పను? అప్పుడు ప్రపంచం అంతా ఉత్పాత సముద్రంలో మునిగిపోతుంది)

రోహిణీ నక్షత్ర మండలం మధ్యలో అయిదు నక్షత్రాలు ఒక త్రికోణాకారంలో ఉంటాయి.ఆ త్రికోణాకారాన్నే రోహిణీ శకటం అంటారు.అందులో ఉన్న ఆల్ఫా, ఎప్సిలాన్,గామా టారి అనే నక్షత్రాల మధ్యలోనుంచి శని కుజ శిఖి గ్రహాలు సంచరిస్తే అప్పుడు రోహిణీ శకట భేదనం అనబడుతుంది.

కానీ ప్రస్తుతం ఖగోళంలో ఉన్న శనిగ్రహం యొక్క మార్గాన్ని బట్టి ఇది ఇప్పట్లో జరిగే పని కాదు.ఎందుకంటే శనిగ్రహ విక్షేపం (declination) ఉన్న స్థితిని బట్టి ప్రస్తుతం ఆయన యొక్క సంచారమార్గం రోహిణీ శకటప్రాంతానికి దూరంగా ఉన్నది.గత 10,000 సంవత్సరాలలో ఇది ఒక్కసారి కూడా జరగలేదు.కానీ కుజుడు ఈ దారిలో సంచరించినట్లు ఆధారాలు ఉన్నాయి.నేటి ఖగోళ సాఫ్ట్ వేర్లు దానిని నిర్ధారిస్తున్నాయి.

శుద్ధ నిర్వచనం ప్రకారం రోహిణీ శకటంలోనుంచి శనిగ్రహ సంచారం సరిగ్గా 2 డిగ్రీల దక్షిణ డిక్లైనేషన్ తో జరగకపోయినా,ప్రతిసారీ శనిగ్రహం రోహిణీ నక్షత్రంలో సంచరిస్తున్న సమయాలు మనకు తెలుసు.ప్రతి ముప్పైఏళ్ళ కొకసారి ఇది జరుగుతుంది.కుజుడైతే ప్రతి ఏడాదిన్నరకు ఒకసారి ఈ నక్షత్రాన్ని తాకుతాడు.

రోహిణీ నక్షత్రంలో మధ్యలో త్రికోణంలాగా ఉన్న ప్రాంతం మీదుగా శని కుజులు రోహిణీ శకట నిర్వచనం ప్రకారం ఖచ్చితంగా సంచారం చెయ్యడం వేల ఏళ్ళకు ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతుంది.ఎందుకంటే ఈ గ్రహాల మార్గం ఖచ్చితంగా దానిగుండా వెళ్ళదు.

కానీ వీరు రోహిణీ నక్షత్రాన్ని తాకిన ప్రతిసారీ చరిత్రలో ఒక భయంకర వినాశనం జరుగుతూనే ఉన్నది.ఇది నమ్మలేని నిజాలలో ఒకటి. పురాణాలలో చెప్పబడిన విషయం మన కళ్ళముందు అనేకసార్లు జరిగింది.

ఆ సంఘటనలు ఏమిటో మన చరిత్రకు అందినంత వరకూ చూద్దాం.

శనీశ్వరుడు రాశిచక్రాన్ని చుట్టి రావడానికి 30 ఏళ్ళు పడుతుంది అని మనకు తెలుసు.అంటే రోహిణీ నక్షత్రాన్ని శనీశ్వరుడు ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి తాకుతాడు.వృషభం 17 డిగ్రీలంటే అది రోహిణీ నక్షత్రం మూడవ పాదం అవుతుంది.

ఈ మధ్య మనకు దగ్గరగా ఇది జరిగిన సమయంతో మొదలు పెట్టి,వెనక్కు వెళుతూ,ఇది ఆకాశంలో వచ్చిన ప్రతిసారీ భూమి మీద ఏమేమి జరిగాయో ఒక్కసారి చూద్దాం.

1) ఈ మధ్యన, శనీశ్వరుడు రోహిణీ నక్షత్రంలో ఉన్న సమయం--మే 2001 నుంచి జూన్ 2002 వరకు.
  • అప్పుడే ఖచ్చితంగా సెప్టెంబర్ 11,2001 న అమెరికా ట్విన్ టవర్స్ సంఘటన జరిగింది.5000 మంది ఆ శిధిలాల క్రింద పడి కనపడకుండా మాయమయ్యారు.ఇప్పటికీ వారి జాడా జవాబూ లేవు.
  • అదలా ఉంచితే,ఆ తర్వాత అమెరికా పౌరుల మనస్సులలో వచ్చిన భయాలూ అనుమానాలూ దానివల్ల మన భారతీయులు ఎంత హింస అనుభవించారో అర్ధం చేసుకుంటే ఇది ఒక పెద్ద ఘోరమే అనకుండా ఉండలేం.దీని ఫలితంగా ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లలో ఇంకా యుద్ధం సాగుతూనే ఉన్నది.
  • 'ద్వాదశాబ్దస్తు దుర్భిక్షం భవిష్యతి సుదారుణం(పన్నెండేళ్ళ పాటు దారుణమైన దుర్భిక్షం తాండవిస్తుంది)' అన్న శ్లోకపాదాన్ని గమనిస్తే 2001 లో ఇది జరిగితే పన్నెండేళ్ళ వరకూ ఇంకా ఆఫ్గనిస్తాన్ పాకిస్తాన్ లలో యుద్ధ వాతావరణం తగ్గలేదంటే ఈ మాటలోని గూడార్ధం అర్ధం చేసుకోవచ్చు.
  • సరిగ్గా అప్పుడే గుజరాత్ లో భూకంపం వచ్చి 30,000 మంది చనిపోయారు.ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.ఎన్నో సంస్థలు సహాయం చేశాయి.
అప్పుడే ఇంకొక విచిత్ర సంఘటన జరిగింది.
  • నేపాల్ లోని నారాయణ హితీ రాజభవనంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన తండ్రియైన రాజు బీరేంద్రనూ తల్లి ఐశ్వర్యాదేవినీ ఇంకా తన కుటుంబంలోని తొమ్మిదిమందిని మొత్తాన్నీ పిచ్చిపట్టిన వాడిలా కాల్చి చంపాడు.తనూ చనిపోయాడు.ఇది ఎందుకు జరిగిందో ఇప్పటికీ ఎవరికీ సరిగ్గా తెలియదు.ఏదో 'గ్రహం' ఆవహించినట్లు అతనాపని చేశాడు.ఇదంతా ఒక కుట్ర అని కూడా కొందరంటారు.ఇది సరిగ్గా 1-6-2001 రోజున,శనీశ్వరుడు రోహిణీ నక్షత్రంలో ప్రవేశించిన ఒక నెలకు జరిగింది.
  • అప్పుడే,ఆఫ్గనిస్తాన్ మీద అమెరికా దాడి జరిగింది.WTC సంఘటనకు ప్రతీకార చర్యగానూ,ఆల్ ఖైదా తాలిబాన్ నెట్వర్క్ ని నిర్మూలించే ఉద్దేశ్యంతోనూ ఇది జరిగింది.
  • సరిగ్గా అదే సమయంలో న్యూయార్క్ లో ఒక జెట్ విమానం కూలిపోయి 260 మంది హరీమన్నారు.
  • చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13-12-2001 రోజున భారత పార్లమెంట్ మీద ఉగ్రవాదుల దాడి సరిగ్గా అదే సమయంలో జరిగింది.
2) అంతకు ముందు ఏప్రిల్ 1972 నుంచి జూన్ 1972 వరకూ మరలా డిసెంబర్ 1972 నుంచి ఏప్రిల్ 1973 వరకూ శనీశ్వరుడు రోహిణీ నక్షత్రం మీద సంచరించాడు.
  • 1971 లో సివిల్ వార్ జరిగి పాకిస్తాన్ నించి విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.
  • 1972 లో నికారాగ్వాలో వచ్చిన అతిపెద్ద భూకంపంలో 10,000 మంది చనిపోయారు.20,000 మంది గాయపడ్డారు.ఇంకొక 30,000 మంది ఇల్లూ వాకిండ్లను పోగొట్టుకున్నారు.
  • 1973 లో ఈజిప్టూ+ సిరియా మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం జరిగింది.
  • వరల్డ్ ట్రేడ్ సెంటర్ రెండోభవనం ఈ సంవత్సరంలోనే పూర్తయింది.సరిగ్గా ముప్పై ఏళ్ళ తర్వాత శనీశ్వరుడు మళ్ళీ ఇదే స్థానానికి వచ్చినపుడు అది ధ్వంసం అయింది.
3) అంతకు ముందు జూన్ 1942 నుంచి జూన్ 1943 వరకూ శనీశ్వరుడు రోహిణీ నక్షత్రం మీద సంచరించాడు.
  • దాదాపు 17 లక్షల మంది యూదులు చంపబడిన "హోలోకాస్ట్" సంఘటన సరిగ్గా అప్పుడే జరిగింది.
  • మహా విధ్వంసానికి దారి చూపగల 'న్యూక్లియర్ చెయిన్ రియాక్షన్' అనేది సైన్స్ చేత సరిగ్గా అప్పుడే కనుక్కోబడింది.
  • సరిగ్గా ఇదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది.ఈ యుద్ధంలో దాదాపు పది కోట్లమంది చంపబడ్డారు.లేదా చనిపోయారు.ఒక్కసారిగా భూభారం విపరీతంగా తగ్గింది.
  • మన దేశంలో "క్విట్ ఇండియా" ఉద్యమం జరిగింది.
4) అంతకు ముందు ఆగస్ట్-సెప్టెంబర్ 1912,ఏప్రిల్-ఆగస్ట్ 1913 లలో శనీశ్వరుడు రోహిణీ నక్షత్ర సంచారం చేశాడు.
  • 1912 సంవత్సరానికి 'ప్రమాదాల సంవత్సరం'(the year of disasters) అనే పేరున్నది.ఎందుకంటే సరిగ్గా అప్పుడే, అంటే, ఏప్రిల్ 1912 లోనే టైటానిక్ ఓడ మునిగిపోయింది.ఈ ప్రమాదంలో దాదాపు 1500 మంది ఒకేసారి నీళ్ళలో మునిగి చనిపోయారు.ఆ ఓడలో గుంటూరు వాస్తవ్యులు కూడా ఇద్దరున్నారు.అప్పట్లో ప్రపంచంలో కనీవినీ ఎరుగని సముద్ర ప్రమాదాలలో ఇది పెద్దది.
  • ఒటోమాన్ సామ్రాజ్యం మీద బాల్కన్ యుద్ధం జరిగింది.ఈ యుద్ధ ఫలితంగా దాదాపు 5 లక్షలమంది చనిపోవడమూ,గాయపడటమూ జరిగింది.
  • చైనాలో విప్లవం జరిగి నవశకం మొదలైంది.ఈ విప్లవంలో కనీసం 2.5 లక్షలమంది హరీమన్నారు.
  • జపాన్లో మెయిజీ వంశంతో రాచరికం అంతరించింది.
  • వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ ను చంపడానికి బెంగాల్ స్వాతంత్ర్యయోధులు వేసిన "డిల్లీ కుట్ర" అప్పుడే జరిగింది. 
5) అంతకు ముందు జూన్ 1883 నుంచి జూన్ 1884 వరకూ మరలా శనీశ్వరుడు రోహిణీ నక్షత్రం మీద సంచరించాడు.
  • ఆ సమయంలో,26-8-1883 న ఇండోనేషియాలో 'క్రకతో' అగ్నిపర్వతం పేలింది.ఆ పేలుడు ధ్వని 4,800 కిలోమీటర్ల వరకూ వినిపించింది అంటే అది ఎంత పెద్ద పేలుడో ఊహించవచ్చు.ఆ దెబ్బకు దాదాపు 36,000 మంది చనిపోయారు.ఆ ద్వీపంలో దాదాపు మూడింట రెండు వంతులు నాశనం అయిపోయింది.
  • The Great English earthquake అనబడే Colchester భూకంపం అప్పుడే జరిగింది.యునైటెడ్ కింగ్ డంలో గత 400 ఏళ్ళలో అలాంటి భూకంపం రాలేదు.దాదాపు 1300 ఇళ్ళను ఆ భూకంపం నేలమట్టం చేసింది.
  • అమెరికాలో వచ్చిన అతిపెద్ద టొర్నడో లలో ఒకటైన Enigma Tornado అప్పుడే వచ్చింది.
  • హోవార్డ్ సౌత్ డకోటా టోర్నడో కూడా అదే సంవత్సరంలో వచ్చింది.
6) అంతకు ముందు మే 1854 నుంచి ఏప్రిల్ 1855 మధ్యలో శనీశ్వరుడు రోహిణీ నక్షత్రంలో సంచరించాడు.
  • పొగమంచు కారణంగా రెండు ఓడలు గుద్దుకొని SS Arctic అనే విలాసవంతమైన ఒక పెద్ద ఓడ Newfoundland తీరంలో మునిగి పోయింది.దాదాపు 400 మంది చనిపోయారు.
  • Great fire of New castle and Gateshead అప్పుడే సంభవించింది.
  • నార్త్ అమెరికాలో అప్పట్లో జరిగిన ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటైన Baptiste Creek Train accident జరిగింది.
  • Gasconade bridge train disaster జరిగి వంతెన కూలి ఒక రైలు మొత్తం,ఆ బ్రిడ్జి కింద పారుతున్న గేస్కోనేడ్ నదిలో పడిపోయింది.
  • రష్యా ఓటమికి దారితీసిన 'క్రిమియా' యుద్ధం అప్పుడే జరిగింది.ఇందులో దాదాపు 8 లక్షల మంది చనిపోయారు.ఒక లక్షమంది గాయాల పాలయ్యారు.
  • San Salvador భూకంపం అనే ఘోరమైన భూకంపం వచ్చి ఆ సిటీ మొత్తం సర్వనాశనం అయ్యింది.దాదాపు వెయ్యి మంది చనిపోయారని అంచనా.25 మిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది.
  • లాంగ్ బీచ్ న్యూయార్క్ లో 'పౌచత్తన్' అనే ఓడ మునిగి దాదాపు 500 మంది చనిపోయారు.
  • చైనా గువాన్ డాంగ్ ప్రావిన్స్ లో రెడ్ టర్బన్ విప్లవం మొదలైంది.
  • అమెరికన్ నేవీదళాలు San Juan del Norte అనే  Nicaragua టౌన్ను బాంబుల వర్షం కురిపించి ధ్వంసం చేసి పారేశాయి.
  • మన దేశంలో జరిగిన సంథాల్ తిరుగుబాటులో దాదాపు 15,000 మంది పైగానే సంథాల్ తిరుగుబాటు దారులు చనిపోయారు.బ్రిటిష్ వారిచేత ఈ తిరుగుబాటు అతి క్రూరంగా అణచివెయ్యబడింది.
7) జూన్ 1824-జూలై 1825 వరకూ మళ్ళీ శనీశ్వరుని రోహిణీ సంచారం జరిగింది.
  • ఇప్పటివరకూ మళ్ళీ రానంత అతిపెద్ద వరదలలో సెయింట్ పీటర్స్ బర్గ్ ఆ సమయంలో మునిగిపోయింది.
  • మూడు పెద్ద ఓడలు ఆ సంవత్సరాలలో మునిగిపోయాయి.
  • ఆ సమయంలో జనానికి ఏదో పిచ్చి పట్టినట్లు ఈ క్రింది యుద్ధాలు జరిగాయి.
  • ఆంగ్లో బర్మీస్ యుద్ధం జరిగింది.దాదాపు 50,000 మంది చనిపోయారు.
  • గ్రీక్ సివిల్ వార్ జరిగింది.
  • ఆర్కాన్సాస్ యుద్ధం జరిగింది.
  • బ్రిటన్ అశాంతే యుద్ధం జరిగింది.
  • ఫ్రాంకో ట్రార్జాన్ యుద్ధం జరిగింది.
  • నెథర్లాండ్స్ జావా యుద్ధం జరిగింది.
  • పోర్చుగల్ బ్రెజిల్ యుద్ధాలు జరిగాయి.
8) మే 1795-మే 1796 వరకూ మళ్ళీ శనీశ్వరుని రోహిణీ సంచారం జరిగింది.
  • ఫ్రెంచి విప్లవం సందర్భంగా కిబెరాన్ యుద్ధం(ఫ్రాన్స్ ఆక్రమణ) జరిగింది.దాదాపు 20,000 మంది చనిపోయారు.
  • కోపెన్ హాగెన్ ఫైర్ అనేది అప్పుడే జరిగింది.ఈ మంటలు జూలై అయిదున మొదలై జూలై ఏడు వరకూ రెండురోజులు తగలబడుతూనే ఉన్నాయి.
  • అనేక ఓడలు ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల మునిగిపోయాయి.
  • "కిం వదామి యదనిష్ట సాగరే జగత్సేష ముపయాతి సంక్షయమ్"--'అనేక బాధలనే సముద్రంలో ప్రపంచం మునుగుతుంది' అనిన వరాహ మిహిరుని మాటను పైన నేను ఉదాహరించిన శ్లోకంలో సూక్ష్మంగా గమనిస్తే సముద్ర ప్రమాదాలు ఈ సమయాలలో జరుగుతాయన్న సూక్ష్మసందేశం గోచరిస్తుంది.వేత్తలు వాడే మాటలలో చాలా గూడార్ధాలు ఉంటాయి.అందులో వరాహమిహిరుడు నిగూఢభాషను వాడటంలో సిద్ధహస్తుడు.దీనికి రుజువుగా,రోహిణీ శకటం జరిగిన ప్రతిసారీ, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సముద్ర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో 'టైటానిక్' ఓడ మునిగిపోవడం ఒక పెద్ద సంఘటన మాత్రమే. 
  • అదే సమయంలో నార్తంబర్లాండ్,కంబర్లాండ్ బొగ్గు గనుల ప్రమాదాలలో చాలామంది మరణించారు.
  • మన దేశంలో మహారాణి అహల్యా బాయ్ హోల్కార్ మరణించింది.
  • ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగాయి.
9) జూన్-నవంబర్ 1765;మార్చ్ -జూలై 1766 మధ్యలో మళ్ళీ శనీశ్వరుని రోహిణీ నక్షత్ర సంచారం జరిగింది.
  • ఇంగ్లీషు వారికీ ముఘల్ రాజులకూ మధ్య బక్సర్ యుద్ధం అప్పుడే జరిగింది.ఇందులో దాదాపు 12,000 మంది చనిపోయారు.
  • సరిగ్గా అదే సమయంలో సైనో బర్మీస్ యుద్ధం జరిగింది.దీనిలో దాదాపు లక్షమంది చనిపోయారు.
  • బర్మా-సియాం యుద్ధం అదే సమయంలో జరిగింది.కొన్ని వేలమంది ఇందులోనూ చచ్చారు.
  • అమెరికాలో రాజకీయ విప్లవాలు ఆ ఏళ్ళలోనే జరిగాయి.
10) మే 1736 -మే 1737 వరకూ శనీశ్వరుని రోహిణీ సంచారం జరిగింది.
  • మొదటి డిల్లీ (మరాటా - ముఘల్) యుద్ధం జరిగింది.దాదాపు 50,000 మంది చచ్చారు.
  • పోర్చుగీస్ మరాటా యుద్ధం అపుడే జరిగింది.
  • ఆస్ట్రియా-టర్కీ యుద్ధం జరిగింది.
  • కలకత్తాలో భయంకరమైన భూకంపమూ హుగ్లీ తుఫానూ కలిసి ఒక్కసారే వచ్చాయి.చరిత్రలో ఇలా రెండూ కలసి ఒక్కసారి రావడం మొదటిసారిగా అప్పుడే జరిగింది.ఆ తర్వాత ఇప్పటివరకూ అలాంటి విపత్తు కలకత్తాలో మళ్ళీ రాలేదు.
  • తూర్పు రష్యాలో Kamchatka భూకంపం అప్పుడే వచ్చింది.
11) జూలై 1706 నుంచి జూలై 1707 దాకా మళ్ళీ శనీశ్వరుని రోహిణీ సంచారం జరిగింది.
  • నెబ్రాస్కాలో భయంకరమైన తుఫానులూ వరదలూ వచ్చాయి.
  • పోలాండ్ లో సివిల్ వార్ అప్పుడే జరిగింది.
  • నార్త్ అమెరికాలో కాలనీల కోసం ఇంగ్లీషు ఫ్రెంచి దేశాల మధ్యన యుద్ధాలు జరిగాయి.
  • ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరణం.
12) మే 1677-జూన్ 1678 వరకూ మళ్ళీ శనీశ్వరుని రోహిణీ సంచారం జరిగింది.
  • రష్యా టర్కీ దేశాల మధ్య యుద్ధం జరిగింది.
  • జేమ్స్ టౌన్ విర్జీనియాలో 'బేకన్ విప్లవం' అప్పుడే జరిగింది.
  • అమెరికా తీరంలో స్పానిష్ ఓడ ఒకటి మునిగిపోయింది.
  • శివాజీ మహారాజుకీ ముఘల్ సామ్రాజ్యానికీ యుద్ధాలు జరిగాయి.
13) 1647-1648 మధ్యలో మళ్ళీ శనీశ్వరుని రోహిణీ సంచారం జరిగింది.
  • ఈ సమయంలో రెండవ ఇంగ్లీష్ సివిల్ వార్ జరిగింది.
  • ఒక ఏడాది తర్వాత ఒకటవ చార్లెస్ చక్రవర్తికి శిరచ్చేదం అమలు జరిగింది.
  • నార్త్ అమెరికాలో బీవర్ యుద్ధాలు జరిగాయి.వీటిలో కొన్ని వేలమంది చనిపోయారు.
  • ఇప్పుడు న్యూయార్క్ అని పిలువబడుతున్న చోట 'వాపింగర్ వార్' అనేది జరిగింది.అనేక ఘోరాలూ నేరాలూ ఈ సమయంలో జరిగాయి.
  • భారత దేశంలో అయితే,శివాజీ మహారాజుకీ ముఘల్ సామ్రాజ్యానికీ యుద్ధాలు జరిగిన రోజులవి.
--------------------------------------------------------

మన పురాణాలలో చెప్పబడిన "రోహిణీ శకట భేదనం" అనేది ముమ్మాటికీ నిజం అన్న విషయానికి ఋజువులుగా పై ఉదాహరణల కంటే ఎక్కువగా ఇంకా ఏమీ చెప్పనక్కరలేదనుకుంటాను.

ఇలా తవ్వుతూ పోతుంటే తవ్వినకొద్దీ రోహిణీ శకటానికి ఆధారాలు చరిత్రలో కనిపిస్తూనే ఉన్నాయి.కనుక మనుషుల మీద శనిప్రభావం నిజమే అని తెలుస్తున్నది.లేకపోతే,ఆయన రోహిణీ నక్షత్రాన్ని స్పర్శించిన ప్రతిసారీ ప్రపంచంలో ఘోర విపత్తులు ఎందుకు సంభవిస్తున్నాయి?

అలా సంభవిస్తాయని మన పూర్వఋషులు ఎలా కనుక్కున్నారు?అన్ని వేల ఏండ్ల నాడే ఎలా ఈ విషయాన్ని గ్రంధస్తం చేసి ఉంచారు?ఇదంతా ఎలా సాధ్యమైంది? ఆశ్చర్యంగా లేదూ?

ఈ రకంగా వ్రాస్తూ పోతే దీనికి అంతూ పొంతూ ఉండదు.ఎన్ని సార్లు చూచినా శనీశ్వరుడు రోహిణీ నక్షత్రంలో సంచారం చేస్తున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు గానీ,ఘోరాలు గానీ జరిగి జననష్టం తీవ్రస్థాయిలో జరిగినట్లు రుజువులు స్పష్టాతిస్పష్టంగా లభిస్తున్నాయి.

ఈ ఖగోళసూచికను రామాయణ కాలంలోనే అంటే దాదాపు 7000 BC ప్రాంతంలోనే గమనించి రికార్డ్ చేసి పెట్టిన భారతీయ ఋషుల మేధాశక్తిని ఏమని స్తుతించాలో మనకు ఈనాటికీ అర్ధం కావడం లేదంటే అది మన ఖర్మ అనుకోవాలో లేక ఇంత జ్ఞానసంపదను మన గ్రంధాలలో ఉంచుకుని కూడా వాటి విలువను గ్రహించలేని చేతగానితనం అనుకోవాలో లేక ఇంకేం అనుకోవాలో మరి?

సరే జరిగినవి జరిగాయి.భవిష్యత్తు పరిస్థితి ఏమిటి?

మళ్ళీ శనీశ్వరుడు రోహిణీ నక్షత్రంలో సంచరించే సమయం ఎప్పుడో చూద్దామా?

2031-2032 ప్రాంతంలో ఆయన మళ్ళీ రోహిణీ నక్షత్రంలో సంచరించ బోతున్నాడు.అప్పుడు శనీశ్వర ప్రభావం వల్ల మళ్ళీ ప్రపంచ ఉపద్రవాలు ఖచ్చితంగా జరుగుతాయి.

యూదులూ అరబ్బులూ,క్రైస్తవులూ ముస్లిముల మధ్యన జరిగే యుద్ధాలు తీవ్రరూపం దాల్చి  ఆ సమయానికి మూడవ ప్రపంచయుద్ధంగా మారబోతున్నదా?లేక ఇంకేదైనా మహాఘోర విపత్తు భూమికి రాబోతున్నదా?తీవ్రమైన ఉపద్రవాలు జరిగి ఘోర జననష్టం జరిగి మళ్ళీ భూభారం తగ్గబోతున్నదా?

ఖచ్చితంగా ఏదో ఒకటి ఆ సమయంలో జరిగి తీరుతుంది.ఎందుకంటే ఈ జోస్యానికి గతంలో ప్రతిసారీ జరిగిన సంఘటనలే ప్రత్యక్ష సాక్ష్యాలు.అవన్నీ పైన వివరించాను.శనీశ్వర ప్రభావం నుంచి ఏ దేశమూ ఏ మనిషీ తప్పుకోలేదు.

అది పూర్తిగా అసాధ్యం.

ఇదంతా చదువుతుంటే 2031-32 సమయంలో ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అనిపించడం లేదూ?

ఏమో? వేచి చూద్దాం ఈసారి ఏం జరుగబోతున్నదో??
read more " రోహిణీ శకట భేదనం-1(భారతీయ జ్యోతిష్య విజ్ఞానానికి తిరుగులేని సాక్ష్యం) "

30, ఆగస్టు 2014, శనివారం

Wise Bucket Challenge

ALS(Amyotrophic Lateral Sclerosis) అనే రోగానికి సంబంధించిన ఎరుక సమాజంలో పెరగడానికీ దాని నివారణకోసం రీసెర్చ్ కి తోడ్పడటానికీ ఐస్ బకెట్ చాలెంజ్ అనేది అమెరికాలో మొదలైంది.ఇందులో ఒక బకెట్ లో నీళ్ళూ ఐస్ ముక్కలూ వేసి వాటిని తలమీద పోసుకుని కొంతమందిని నామినేట్ చేస్తారు.వారు కూడా దీనిని చేసి ఇంకొంతమందిని నామినేట్ చెయ్యాలి. అందరూ కలసి కొంత డబ్బును ఆ రీసెర్చి ఫౌండేషన్ కి దానం చెయ్యాలి.

చాలామంది అమెరికన్లూ దీనిని చేస్తున్నారు.అక్కడ ఉన్న మనవాళ్ళూ చేస్తున్నారు.ఆ రోగానికి సంబంధించిన ఎవేర్ నెస్ పెంచుతున్నారు.బాగానే ఉంది.

పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు, దీనిని చూచి మన దేశంలో "రైస్ బకెట్ చాలెంజ్" అనేదొకటి మొదలైంది.మన దేశంలో పేదరికం అధికం కనుక మనకు కావలసింది ఐస్ బకెట్ చాలెంజ్ కాదు, రైస్ బకెట్ చాలెంజ్ అంటూ ఒక బకెట్ లో బియ్యాన్ని నింపి దానిని ఎవరైనా పేదవారికి దానం ఇవ్వడం కొందరు మొదలు పెట్టారు.

ఇచ్చేవాళ్ళు ఇస్తుంటే మన దేశంలో తీసుకునే వారికి కొదవేముంది?మనదేశంలో కోటీశ్వరులకు కూడా తెల్లకార్డులుంటాయి కదా.ఒక బకెట్ రైస్ వస్తున్నది తీసుకుంటే పోలా అని బెంజీ,  బీ ఎం డబ్లూ, కార్లలో పోయేవారు కూడా ఆగి ఒక బియ్యం బకెట్ ను డిక్కీలో వేసుకుని పోతున్నారు. 

మన దేశంలో ప్రస్తుతం పేదవారు అనేవారు అసలున్నారా? అని నాకొక పెద్ద అనుమానం గత కొన్నేళ్ళ నుంచీ ఉంది.ప్రతి పేదవాడి ఇంట్లోనూ నేడు కలర్ టీవీ ఉంది.ఒకవేళ లేకపోతే ప్రభుత్వమే ఇస్తోంది.ఇంటింటికి కేబుల్ నెట్ వర్క్ ఉన్నది.ఇంటర్ నెట్ కనెక్షన్ ఉన్నది.ఇంటికి నాలుగు చొప్పున సెల్ ఫోన్లూ ఉన్నాయి.మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త మొబైల్నూ కొని పాతదాన్ని నెలకొకసారి మార్చిపారేస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ నేడు ఒక మొబైల్ షాపు పెట్టడానికి సరిపోయినన్ని పాత సెల్ ఫోనులు పడున్నాయి.ఇంటికి నాలుగు టూ వీలర్లూ రెండు కార్లూ ఉంటున్నాయి.

ఇకపోతే ఇప్పటికీ మంచినీళ్ళు దొరకని పల్లెటూళ్ళు కూడా మన దేశంలో చాలా ఉన్నాయి.కాని సారాయి కొట్టులేని ఊరు మాత్రం ఎక్కడా లేదు. ఒకవేళ లేకపోతే,ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలే వాటిని అమర్చిపెట్టి పోయాయి.అన్ని సారాయి షాపులూ సాయంత్రానికి కిటకిట లాడుతున్నాయి.జనంతో కళకళ లాడుతున్నాయి.కొన్ని ఊర్లలో అయితే పొద్దు పొద్దున్నే కూడా అవి జనంతో సందడిగా కనిపిస్తున్నాయి.కాలేజీ ఆడపిల్లల దగ్గరనుంచీ అందరూ నేడు సారాయిని (ఏదో ఒకరూపంలో) చక్కగా తాగుతున్నారు. సారాయి అని చీప్ గా అన్నందుకు మళ్ళీ అది తాగేవారికి కోపం రావచ్చు. పేరు ఏదైనా పదార్ధం అదేగా.

మన దేశంలో 'వైన్ బకెట్ చాలెంజ్'(Wine Bucket Challenge) మాత్రం ఎప్పటినుంచో నడుస్తోంది.దానికి ఎవరి ప్రోత్సాహమూ ఆహ్వానమూ అక్కర్లేదు.ఎవరికి వారే స్వచ్చందంగా పరమోత్సాహంతో దీనిలో పాల్గొంటున్నారు.

ఇలాంటి ప్రజలకు రైస్ బకెట్ నిజంగా అవసరమా? అంటే లేదనే సమాధానం వస్తుంది.ఎవరికో దురదపుట్టి ఇస్తున్నారు గనుక తీసుకునేవారు తీసుకుంటున్నారు గాని నిజంగా మన దేశంలో పేదవాడు ప్రస్తుతం ఎక్కడా లేడు.అందరి దగ్గరా డబ్బులు బాగానే ఉన్నాయి.

ఆ మధ్యన అమెరికానుంచి చుట్టపు చూపుగా ఇండియాకు వచ్చిన ఒక మిత్రుడు ఇలా అన్నాడు.

'నేను నాలుగేళ్ల తర్వాత ఇండియాకు వచ్చాను.ప్రస్తుతం ఇండియాను చూస్తుంటే అమెరికాలో ఉన్న మేమే మీకంటే పేదవాళ్ళమని అనిపిస్తున్నది.'

ఐస్ బకెట్టూ, రైస్ బకెట్టూ మన దేశానికి అవసరం అవునో కాదో నేను చెప్పను గాని ప్రపంచం మొత్తానికీ అవసరం అయిన చాలెంజ్ ఒకటి మాత్రం నేను చెప్పదలచుకున్నాను.

అదే వైస్ బకెట్ చాలెంజ్ Wise Bucket Challenge

అంటే మనం వైస్ గా జ్ఞానంతో బ్రతకడం,ఇతరులలో దానిని పెంపొందించే పనిని చెయ్యడం అన్నమాట.ఒక్కమాటలో చెప్పాలంటే నిజమైన సనాతనమైన భారతీయ ఆధ్యాత్మికతను నిత్యజీవితంలో ఆచరిస్తూ ఇతరులను కూడా దానిని ఆచరించేలా ఉత్తెజపరచడమే Wise Bucket Challenge.వారూ వీరూ అన్న భేదం లేకుండా ప్రపంచంలోని మనుష్యులకందరికీ ఇది నేటి కాలంలో అత్యంత అవసరం.

అయితే ఆధ్యాత్మికతకీ బకెట్ కీ ఏంటి సంబంధం? అని అనుమానం రావచ్చు.

ఇంగ్లీషులో 'కికింగ్ ద బకెట్' అనే మాట ఉన్నది.అంటే బాల్చీ తన్నెయ్యడం అన్నమాట.

పుట్టిన ప్రతి మనిషీ ఏదోరోజున పోక తప్పదు.ఇది అందరికీ తెలిసిన విషయమే.కానీ ఆ పోయే సమయానికి కర్మ బ్యాలెన్స్ ను పూర్తిగా ఖాళీ చేసుకుని పోవడమే నేను చెప్పే 'వైస్ బకెట్ చాలెంజ్'.

జ్ఞానంతో జీవిస్తేనే ఇది సాధ్యమౌతుంది.జ్ఞానంతో కర్మ చేస్తూ బ్రతికితేనే ఇది సాధ్యమౌతుంది.అప్పుడే మన ఎకౌంట్లో ఉన్న కర్మ తగ్గుతూ వస్తుంది.దానికి విరుద్ధంగా అజ్ఞానంలో బ్రతికి తదనుగుణమైన కర్మలు చేస్తూ ఉంటే అది రోజురోజుకూ పెరుగుతుంది.అప్పుడు బాల్చీ తన్నేసే సమయానికి తలకు మించిన భారంతో పోవలసి వస్తుంది.ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనకున్న కర్మ బ్యాలెన్స్ ను ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ చేసుకుని పోవలసి వస్తుంది. అది అభిలషణీయం కాదు.

మనం ఈలోకంలోకి వచ్చేటప్పుడే ఒక పెద్దబకెట్ నిండా కర్మతో వచ్చాం. జ్ఞానహీనులమై ఇష్టం వచ్చినట్లు బ్రతికితే,బకెట్ తన్నేసే సమయానికి ఒక పెద్ద కర్మగంగాళాన్ని మోసుకుని పోవలసి వస్తుంది. ఆ గంగాళం బరువుతో అప్పుడెక్కడికి పోతామో,ఏ జన్మ ఎత్తుతామో మనకు తెలియదు. 

అలా కాకుండా,చేతిలో ఉన్న బకెట్ ని ఖాళీచేసి అవతలపారేసి హాయిగా చేతులూపుకుంటూ పోవాలంటే,నిత్యజీవితంలో కర్మను యోగంగా మార్చుకుని జీవితాన్ని నడిపినప్పుడే ఈ వైస్ బకెట్ చాలెంజ్ లో మనిషి నెగ్గగలుగుతాడు.

దీనికి ఇంకొకరిని నామినేట్ చెయ్యనవసరం లేదు.అలా నామినేట్ చెయ్యడం కుదరదు కూడా.ఇది ఎవరికి వారికి లోనుండి రావలసిన చాలెంజ్.ఒకరిని చూచి ఇంకొకరు వాత పెట్టుకునే చాలెంజ్ కాదు.

ఐస్ బకెట్ చాలెంజ్ వల్ల ALS అనే వ్యాధి నిర్మూలనానికి దోహదం అవుతుంది.

వైస్ బకెట్ చాలెంజ్ వల్ల కూడా ALS అనే వ్యాధి పోతుంది.అయితే ఈ వ్యాధి వేరు.దీనిని నేను 'అజ్ఞాన లంపటం సిండ్రోం' (ALS) అని పిలుస్తాను.వైస్ బకెట్ చాలెంజ్ చెయ్యగలిగిన వాడికి అజ్ఞానమూ పోతుంది.ప్రపంచ లంపటమూ పోతుంది.

ఆత్మారామత్వమూ ఆనందస్వరూపమూ వాడికి మిగులుతాయి.

ఐస్ బకెట్, రైస్ బకెట్ల వల్ల ఏవేవి పోతాయో నేను చెప్పలేను గాని వైస్ బకెట్ వల్ల మాత్రం మూలవ్యాధి (fundamental disease) అయిన అజ్ఞానం నశించిపోతుందని నేను ఘంటాపధంగా చెప్పగలను.

ఇది నేను కొత్తగా చెబుతున్నది కాదు.భగవంతుడే దీనిని గురించి చెప్పినాడు.

శ్లో||తేషామేవానుకంపార్ధ మహమజ్ఞానజం తమ:
నాశాయామ్యాత్మ భావస్థో జ్ఞాన దీపేన భాస్వతా

(భగవద్గీత 10:11)

(వారి మీద కరుణతో వారి హృదయాలలో నేనే నిలిచి ఉండి,జ్ఞాన తేజస్సుతో వాటిని నింపి,అజ్ఞాన జనితమైన అక్కడి చీకటిని నాశనం చేస్తున్నాను)

అంటూ భగవంతుడే ఈ ఛాలెంజ్ స్వీకరించేవారికి అభయప్రదానం గావిస్తున్నాడు.ఇంక భయమేముంది?

ఈ ఛాలెంజ్ ని మనం స్వీకరించకుండా అడ్డుపడే తమస్సు అంటే ఏమిటో కూడా భగవంతుడే చెప్పాడు.

శ్లో|| తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం
ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత

(భగవద్గీత 14:8)

నిర్లక్ష్యమూ,ఆలస్యమూ,బద్ధకమూ -- ఈ మూడూ అజ్ఞానం నుంచి పుట్టినవి.ఇవే సమస్త జీవులనూ మోహంలో ముంచి జ్ఞానం వైపు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాయి.

ప్రమాదం (నిర్లక్ష్యం) అంటే - మనకిప్పుడే ఆధ్యాత్మికత ఎందుకులే అన్న నిర్లక్ష్య ధోరణి.

ఆలస్యం అంటే - రేపు చేద్దాంలే అని ఏరోజుకారోజుకి సాధనను వాయిదా వెయ్యడం.


నిద్ర అంటే - సాధనలో బద్ధకాన్ని వదిలించుకోలేని అశక్తత.


తమస్సు అంటే ఈ మూడు లక్షణాలే.


అంతేకాదు, Wise Bucket Challenge (WBC) అనే ఈ ఛాలెంజ్ ని స్వీకరించే వాడికి అంతర్గత WBC (White Blood Corpuscles) కౌంట్ తగినంతగా పెరిగి అజ్ఞానం అనే మహమ్మారిని అడ్డుకునే వ్యాధినిరోధక శక్తి అతనిలో విపరీతంగా పెరుగుతుందని నేను చెబుతున్నాను.

ఈ ఛాలెంజ్ ని స్వీకరించమని సాక్షాత్తూ భగవంతుడే విసుగనేది లేకుండా ఎప్పటినుంచో మనలను పిలుస్తున్నాడు.కానీ ఆయన మాట ఎవరూ వినడం లేదు.

శ్లో||తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసి నాత్మనః
ఛిత్వైనం సంశయం యోగమాత్తిష్టోత్తిష్ట భారత

(భగవద్గీత 4:42)

(ఓ భారతపుత్రా! అజ్ఞానం నుండి పుట్టి నీ హృదయంలో తిష్ట వేసి ఉన్నట్టి సంశయములను జ్ఞానం అనే ఖడ్గంతో ఛేదించు.యోగమును ఆధారంగా చేసుకొని నీ జీవనసమరాన్ని నడిపించు)

ఇదే వైస్ బకెట్ ఛాలెంజ్

ఈ ఛాలెంజ్ ని స్వీకరించమని మన సనాతన ధర్మమూ మన మహర్షులూ కూడా కొన్నివేల ఏళ్ళ నుంచీ మనలను ఆహ్వానిస్తూనే ఉన్నారు.

కానీ ఈ ఛాలెంజ్ ని మనస్ఫూర్తిగా స్వీకరించేవారు ఎందరున్నారు?అందరూ పనికిమాలిన ఐస్ బకెట్ ఛాలెంజ్,రైస్ బకెట్ ఛాలెంజ్ లను స్వీకరించేవారేగాని అసలైన వైస్ బకెట్ ఛాలెంజ్ ని స్వీకరించేవారు ఎవరున్నారు?

కనీసం ఒక్కరన్నా ఉన్నారా???
read more " Wise Bucket Challenge "

27, ఆగస్టు 2014, బుధవారం

స్వామివారి అపాయింట్ మెంట్ కావాలి

మొన్నొక రోజున పొద్దున్నే ఒక ఫోన్ కాల్ వచ్చింది.

ఏదో కొత్త నంబర్.

సామాన్యంగా కొత్త నంబర్లకు నేను పలకను.

'సరే చూద్దాంలే పొద్దున్నే ఎవరో' అనుకుని 'హలో' అన్నా.

'స్వామిగారున్నారా?' అవతలనుంచి ఒక గొంతు వినిపించింది.

'నేను స్వామినెప్పుడయ్యానా?' అని నాకే అనుమానం వచ్చింది.

ఏమిటో చూద్దామని -'ఏ స్వామివారు?' అని అడిగాను.

'అదే... గుళ్ళో స్వామిగారు ఉంటారట కదా?' అన్నాడు ఆ వ్యక్తి.

'గుళ్ళో స్వామి ఫోన్లో ఎలా మాట్లాడతాడు?' అడిగాను.

'అదికాదు.ఆయన అపాయింట్ మెంట్ కావాలి.'

పొద్దున్నే ఏమిటో ఈ హాస్యప్రభంజనం అనుకుని-'గుళ్ళో స్వామి అపాయింట్ మెంట్ మీక్కావాలా?' అడిగాను.

'అవును'

'మీ వయసెంత?' అడిగాను.

'నలభై'

'అప్పుడే అంత తొందర ఎందుకు? ఇంకా కొన్నాళ్ళు ఉండండి.' అన్నాను.

నేను చెబుతున్నది అవతల ఎక్కడం లేదు.

'అలా కాదు.నేను చాలా ట్రబుల్స్ లో ఉన్నాను.స్వామిగారిని అర్జెంట్ గా కలవాలి' అన్నాడు.

'స్వామిగారు కూడా ప్రస్తుతం చాలా ట్రబుల్స్ లో ఉన్నారు.ఆయన ఎవర్ని కలవాలో ఆలోచిస్తూ ధ్యానంలో ఉన్నారు.' అన్నాను.

వినిపించుకునే పరిస్థితిలో అవతల వ్యక్తి లేడు.

'ధ్యానం లోనుంచి లేచాక,ఆయనతో మాట్లాడి అపాయింట్ మెంట్ ఇప్పించండి.ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి కలుస్తాం.' అన్నాడు.

'వీలుకాదు.ధ్యానం తర్వాత ఆయన ప్రియశిష్యురాలితో ఏకాంతసేవలో ఉంటారు.మధ్యాన్నం మూడువరకూ బయటకు రారు.ఈలోపల కదిలిస్తే ఆయనకు మహాకోపం వస్తుంది.'అన్నాను సీరియస్ గా.

అవతలి వ్యక్తి పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నాడు.

'పోనీ ఈలోపల ఏదైనా రెమెడీ మీరు చెప్పినా పరవాలేదు." అన్నాడు.

మధ్యాన్నం మూడువరకూ కూడా ఆగలేడట!!వెంటనే పనిచేసే రెమెడీ ఈలోపల నేను చెప్పాలట!!! ఇదేమైనా తలనొప్పి మాత్రా వేసుకున్న పదినిముషాలలో నొప్పి మాయం అవడానికి??

టీవీ జ్యోతిష్కుల పుణ్యమా అని 'రెమేడీ'అనేది ఒక పెద్ద ఫార్స్ అయిపోయింది.ఒక లెక్కా ఏమీ లేకుండా ఎవరి నోటికోచ్చినవి వారు చెబుతున్నారు.చేసేవారు చేస్తున్నారు.ఇది కర్మతో చెలగాటం అనే విషయం ఎవరికీ అర్ధం కావడం లేదు.

ఈ ఫోన్ కాల్ ఎవరికో చెయ్యబోయి నాకు చేశాడని అర్ధమైపోయింది.

'అలాంటి రెమెడీలు నాకు తెలియవు.నా రెమెడీలు మీరు ఆచరిస్తే మీ సమస్యలు పోవుగాని ఏ సమస్య వచ్చినా చెదరకుండా మీరు ఉండగలుగుతారు.కానీ అలాంటివి ఫోన్లో చెప్పను.' అన్నాను.

'అందుకే సార్.వచ్చి కలుస్తాం.' అన్నాడు.

'మీరెలాంటి రేమేడీలు ఆశిస్తున్నారు?' అడిగాను.

'స్వామిగారు హోమాలు చేయిస్తారట కదా?అన్ని ప్రాబ్లెమ్స్ పోతాయట కదా?' అన్నాడు.

ఆ స్వామివారెవరో ఈ గోలేమిటో విషయం వెంటనే అర్ధమై పోయింది.

'స్వామివారి డైరీలో ఇంకో అయిదేళ్ళ వరకూ కాల్షీట్లు ఖాళీలు లేవు. అపాయింట్ మెంట్లు ముందే ఫిక్స్ అయిపోయాయి.' అన్నాను.

'అలా అంటే ఎలా సార్?పోనీ మీరైనా ఏదైనా రేమేడీ చెప్పండి.' అన్నాడు.

నేను స్వామివారి అసిస్టెంట్ ను అనుకుంటున్నాడని నాకర్ధమైంది.

'అసలు మీ ప్రాబ్లెం ఏమిటి?' అడిగాను.

'రెండు కోట్లు బ్లాక్ అయిపోయాయి.అవతలి పార్టీ మోసం చేసాడు.వాడు నా ఫ్రెండే.ఆ డబ్బు వచ్చే మార్గం చెప్పాలి' అన్నాడు.

ఇక ఇతనికి ఉపదేశం అవసరం అనుకున్నా.

'చూడండి.అత్యాశ మంచిది కాదు.ఉన్నంతలో బ్రతకడం నేర్చుకోండి. దురాశకు పోయి నానా పాడుపనులూ చేసి డబ్బు సంపాదించకండి.ఎంత సంపాదించినా వెంట తీసుకుపొయ్యేది ఏమీ లేదు.సుఖాలకు అంతూ పొంతూ కూడా లేదు.మానవ జీవితగమ్యం డబ్బు సంపాదన ఒక్కటే కాదు. అమూల్యమైన మానవజీవితాన్ని అనవసరమైన విషయాలలో వృధా చేసుకోకండి.ధర్మంగా బ్రతకండి.ఒకవేళ అధర్మం అయితే మీకు నష్టం కలిగినా సరే ఆ పనిని ఒదిలెయ్యండి.' అన్నా.

అవతలవైపు నుంచి భయంకరమైన నిశ్శబ్దం వినిపించింది.

ఫోన్ పెట్టేశా.

ఆయన ఫోన్ చేసిన స్వామివారు ఎవరో నాకు తెలుసు.ఆ స్వామివారే ప్రస్తుతం పీకల్లోతు లౌకిక సమస్యలలో కూరుకుని పోయి ఉన్నారు.పోనీ ఆధ్యాత్మిక జ్ఞానమన్నా ఆయనకు ఎక్కువైపోయిందా అంటే అదీ లేదు.అలాంటి స్థితిలో ఉండి వారు ఇతరులకు సలహాలిస్తున్నారు.వీరు స్వీకరిస్తున్నారు.

ఏమిటో ఈ మాయ!!

ఆశ అనేది చాలా గొప్ప శక్తి.దురాశ అనేది ఇంకా గొప్ప శక్తి.ఇవి రెండూ మనిషిని పట్టుకుని పీడిస్తూ ఉన్నంతవరకూ ఇలాంటి స్వాముల చేతులలో చిక్కి బలికాక తప్పదు.ఇలాంటి అనైతిక పనులకు సలహాలిచ్చే వీరు 'స్వామి' అన్న పదానికి అర్హులేనా అని నా ప్రాచీన అనుమానం.చివరకు 'నేటి స్వాములు' హవాలా కార్యకలాపాలకు బ్రోకర్లుగా మారుతున్నారు. ఇంతకంటే చండాలం ఇంకొకటి ఉండదు.

తప్పుదారిన పోతున్నవారికి 'ఇదితప్పు' అనిచెప్పి దారి మళ్ళించి మంచిదారిలో పెట్టేపనిని వారు చెయ్యాలి.అంతేగాని,ఆయా పనులకు సహకరిస్తూ,అవి తేలికగా అయ్యే మార్గాలు చెబుతున్న వీరు 'స్వామి' అన్న పదం తగిలించుకుని దానిని భ్రష్టు పట్టిస్తున్నారు.

దశనామీ సంప్రదాయాన్ని సృష్టించిన ఆదిశంకరుల వంటి మహనీయులు ఇలాంటి స్వాములను పైనుంచి చూచి ఎంతగా బాధపడుతున్నారో అనిపించింది.

దేవుడా!! ఎంత గొప్ప ప్రపంచాన్ని సృష్టించావయ్యా!! ఎలాంటి లీలను నడిపిస్తున్నావయ్యా !! అని దైవానికి మనస్సులో నమస్కారం చేసుకుని నా పనిమీద నేను బయలుదేరాను.
read more " స్వామివారి అపాయింట్ మెంట్ కావాలి "

20, ఆగస్టు 2014, బుధవారం

BKS Iyengar-శపిత యోగం

నేడు ప్రపంచంలో BKS Iyengar (బేలూర్ కృష్ణమాచార్ సుందరరామ అయ్యంగార్ )పేరు తెలియని వారు ఉండరు.

Light on Yoga, Light on Pranayama మొదలైన గ్రంధాలు అనేకం వ్రాసి దాదాపు 60 పైన దేశాలలో యోగా స్కూల్స్ స్థాపించిన ఈ 95 ఏళ్ళ యోగాచార్యుడు ఈరోజు ఉదయం పూనాలో దేహం చాలించాడు.

ఈ వయసులో కూడా ఆయన అరగంట సేపు శీర్షాసనంలో ఉండగలడు.మిగిలిన ఆసనాలంటే ఇంక చెప్పనక్కరలేదు.అవన్నీ ఆయనకు కొట్టిన పిండి.'లైట్ ఆన్ యోగా' పుస్తకంలో ఆయన చూపించిన యోగాసనాలు చూస్తే అసలు ఈయన శరీరంలో ఎముకలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతుంది.

ఈయనకూడా శపితయోగానికి బలయ్యారంటే చదువరులకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది.

ఒక్కసారి ఈయన జాతకం పరికిద్దాం.

ఈయన 14-12-1918 తేదీన కర్ణాటక కోలార్ జిల్లాలోని బేలూర్ లో ఉదయం 3.00 గంటలకు జన్మించారు.తల్లిదండ్రులు సాంప్రదాయ వైష్ణవ బ్రాహ్మణులు.

గురుశనుల వక్రీకరణ వల్ల ఈయనకు లోకంతో ఎంతో కర్మసంబంధం ఉన్నదని స్పష్టంగా కనిపిస్తున్నది.అందుకేనెమో దేశదేశాలు తిరిగి యోగా స్కూల్స్ స్థాపించి భారతీయ హఠయోగానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చారు.

ప్రపంచంలో లక్షలాదిమందికి యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యాన్ని కలిగించారు. ఇలాంటి వ్యక్తి తన చిన్నతనంలో ఫ్లూ మలేరియా టీబీ టైఫాయిడ్ లతో బాధపడ్డారంటే మనకు నమ్మశక్యం కాదు.కానీ ఇది నిజం.

కాలయుక్తి నామ సంవత్సరం మార్గశిర ఏకాదశి రోజున ఆయన జన్మించారు. ఈయన చనిపోయినది కూడా ఏకాదశి రోజుననే కావడం ఒక విచిత్రం.శ్రావణ ఏకాదశి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమికి దగ్గరగా ఆయన చనిపోవడం ఆయనపైన ఉన్న కృష్ణానుగ్రహాన్ని సూచిస్తున్నది. వైష్ణవునిగా జన్మించినందుకు ఏకాదశి రోజునా అందులోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి దగ్గరగా పోవడం చాలా మంచిది.ఈయనకు ఉత్తమ గతులు కలుగుతాయన్న దానికి ఇది సూచన.

అశ్వనీనక్షత్రం రెండోపాదంలో ఈయన జన్మించారు.అశ్వనీ దేవతలు దేవ వైద్యులు.ఈయన కూడా తన యోగవైద్యంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు.నక్షత్ర లక్షణాలు ఈ విధంగా జీవితంలో కనిపిస్తూ ఉంటాయి.

ఈయన పుట్టినపుడు కేతు/కుజ దశ జరుగుతూ ఉన్నది.కేతు కుజుల సంబంధం గురించీ వీరవిద్యల గురించీ నేను ఇంతకు ముందు వ్రాసి ఉన్నాను.దీనికి ఋజువు మళ్ళీ ఈ జాతకంలో కనిపిస్తుంది.ఈ సంబంధం ఉన్నప్పుడు శరీరంతో చేసే వ్యాయామవిద్యలు చాలా త్వరగా పట్టుబడతాయి.యోగానికీ వీరవిద్యలకూ సంబంధం ఉన్నదని నేను స్వానుభవంతో నిర్ధారణగా చెప్పగలను.

జననకాల దశాదిపతి అయిన కేతువు అష్టమంలో ఉండటంతో ఆయన చిన్నతనం అంతా రోగాలతోనూ గండాలతోనూ గడిచింది. బలహీనంగా, ఎప్పుడూ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండే ఈ పిల్లవాడు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి యోగాగురువు అవుతాడనీ 95 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతుకుతాడనీ బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు.

కుజుడు బలంగా ఉన్న జాతకులకు భౌతిక పరిధిలో అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి.వారు దానిని దాటి వెళ్ళలేరు.ఒకవేళ వెళ్ళినా వారి మూలాలు భౌతికం లోనే పాతుకుని పోయి ఉంటాయి.కుజునికి ఉచ్ఛరాశి మకరం కూడా భూతత్వ రాశియే.అందుకే వారికి భౌతిక శరీర సంబంధం అంత త్వరగా వదలదు.

ఈయన జాతకంలో కుజుడు రాశి నవాంశలలో ఉచ్ఛలో ఉన్నాడు.కనుక చాలా బలంగా ఉన్నట్లు లెక్క.కనుక భౌతిక శరీరంతో చేసే హఠయోగాన్ని ఈయనకు వరంగా ప్రసాదించాడు.
  
18 ఏళ్ళ వయసులో 'యోగా' ను నేర్పడానికి ఆయన పూనాలో అడుగు పెట్టాడు.అప్పుడు ఆయనకు శుక్ర/శని దశ జరుగుతున్నది.మొదట్లో ఎన్నో కష్టాలు పడినా క్రమేణా గుర్తింపు లభించింది.శనీశ్వరుడు ఈయన జాతకంలో విద్యకు కారకుడు.కనుక శరీరకష్టంతో కూడిన యోగవిద్య ఆయనకు పట్టుబడింది.శుక్రుడు లగ్నాదిపతిగా మూడింట నవమాధిపతి అయిన బుదునితో కలసి ఉన్నాడు.నవమం నుంచి గురువుతో చూడ బడుతున్నాడు.కనుక దూరప్రాంతానికి యోగాగురువుగా వెళ్ళాడు.

1952 లో వాయులీన విద్వాంసుడు యెహోదీ మెనూహిన్ ద్వారా ఈయన లండన్ లో యోగా క్లాస్ ప్రారంభం చేశాడు.ఆ సమయంలో చంద్ర/గురు దశ ఈయన జాతకంలో జరిగింది.చంద్రుడు సప్తమంలోనూ గురువు నవమంలోనూ ఉండటం చూడవచ్చు.ఈ రెండూ విదేశాలను సూచించే స్థానాలే.

90 ఏళ్ళ వయస్సులో కూడా రోజుకు మూడుగంటలు ఆసనాభ్యాసమూ ఒక గంట ప్రాణాయామమూ ఆయన ఖచ్చితంగా చేసేవాడు.వంక దొరికితే సాధనను ఎగర గొడదామని చూచే నేటి మనుష్యులు ఈయన్ని చూచి బుద్ధి తెచ్చుకోవలసిన అవసరం చాలా ఉన్నది.

ఈయన జిడ్డు కృష్ణమూర్తికి కూడా యోగా నేర్పించాడు.

ఈయనా రజనీషూ ఇద్దరూ పూనాలోనే ఉండేవారు.రజనీష్ చివరలో రకరకాల రోగాలతో బాధపడుతూ ఉన్నప్పుడు ఈయన దగ్గర యోగా నేర్చుకోమని కొందరు సూచించగా రజనీష్ తిరస్కరించాడు.శీర్షాసనం అంతసేపు వేస్తే మెదడులో రక్తనాళాలు చిట్లిపోతాయని రజనీష్ వాదించాడు. మరి నేటివరకూ అయ్యంగార్ కు ఏ రక్తనాళాలూ చిట్లలేదు.

1984 లో నేను గుంతకల్లు లో ఉన్నప్పుడు అక్కడ యోగా క్లాసు మొదలు పెట్టించడానికి అక్కడి వైశ్యప్రముఖులు ఈయనను రప్పించారు.అప్పుడు ఆయన యోగా క్లాసును దగ్గరుండి చూచాను.అప్పటికే నేను మార్షల్ ఆర్ట్స్ మరియు యోగా చాలా తీవ్రంగా చేసేవాడిని.అయ్యంగార్ గారి విధానంలో చాలా రకాలైన props వాడతారు.అవీ మంచివే.కానీ యోగాలో నా విధానం వేరు.నాకు ఆ క్లాసులో కొత్త ఏమీ కనపడలేదు.కనుక నేను అందులో చేరలేదు.

పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డులు ఈయనను వరించాయి.

పద్మశ్రీ 1991 లో వచ్చింది.ఆ సమయంలో గురు/కేతు దశ జరిగింది.వీరిద్దరూ అష్టమంలో ఉండటం చూస్తే ఈ అవార్డ్ ఈయనకు వ్రాసిపెట్టి ఉన్నట్లు కనిపిస్తుంది.గత జన్మలో బాకీ ఉన్న దానిని ఈ జన్మలో ఇలా అందుకున్నాడు.

పద్మభూషణ్ 2002 లో శని/శని దశలో వచ్చింది.శనీశ్వరుడు ఈయనకు విద్యాదిపతిగా దశమ లాభ స్థానాలలో ఉండటం చూడవచ్చు.

పద్మవిభూషణ్ 2014 లో శని/రాహు దశలో వచ్చింది.ఘటీ లగ్నం రాహు నక్షత్రంలో ఉండటం గమనిస్తే ఇది ఎందుకు జరిగిందో అర్ధమౌతుంది.

నేడు అంటే 20-8-2014 న శని/రాహు/శనిదశలో ఈయన మరణించాడు.ఇది ఖచ్చితమైన శపితయోగ దశ అని మళ్ళీమళ్ళీ నేను వివరించనవసరం లేదు.ఇదేమిటో నా పాత పోస్ట్ లు చదివిన వారికి సుపరిచితమే.

ప్రస్తుతం గోచార కుజశనులు ఈయన జననలగ్నం మీద సంచరిస్తున్నారు. అంటే ఈయన జన్మలగ్నానికి శపితయోగం పట్టింది.

రాశి నవాంశలలో ఉచ్ఛస్థితిలో ఉన్న కుజుడు ఈయనకు శరీర ప్రధానమైన హఠయోగవిద్యనూ ఇచ్చాడన్నది వాస్తవం.అంతర్జాతీయ గుర్తింపును రాహువూ గురువూ ఇచ్చారు.

మన యోగవిద్యకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఇటువంటి విశిష్ట వ్యక్తులకు 'భారతరత్న' ఇవ్వడం చాలా అవసరం.అలా ఇవ్వడం ద్వారా మన ప్రభుత్వం తనను తానే గౌరవించుకున్నట్లూ మన విద్యలను గౌరవించినట్లూ అవుతుంది.

మన సంస్కృతిని గౌరవించే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడున్నది గనుక అలా జరుగుతుందని ఆశిద్దాం.
read more " BKS Iyengar-శపిత యోగం "

ఉచిత సలహాలు

ఈ లోకంలో ఉచిత సలహాలు ఇచ్చేవారు చాలా ఎక్కువ.

కాకపోతే ఆ సలహాలు ఇవ్వబోయే ముందు వారివారి అర్హతలు ఏమిటో చూచుకోకుండా చాలామంది సలహాలు ఇవ్వబోతూ/ఇచ్చేస్తూ ఉంటారు.

నాక్కూడా చాలామంది ఉచిత ఆధ్యాత్మిక సలహాలిస్తుంటారు.

నిన్నగాక మొన్న,పిరమిడ్ ధ్యానం వంటి పిచ్చిపిచ్చి ధ్యాన విధానాలు ప్రారంభం చేసిన కొందరూ,అటుమొన్న సాయంత్రం నుంచీ రమణమహర్షి పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన ఇంకొందరూ,ఒక నెలక్రితం ఓషో పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన ఇంకొందరూ,ఇంకేదో నిషా పుట్టించే యోగా చేసే మరికొందరూ తరచుగా నాకు ఉచిత సలహాలు ఇస్తుంటారు.

వారి సలహాలకు నాకు చచ్చే నవ్వు వస్తూ ఉంటుంది.ఆ సలహాలు చాలా సరదాగా కామెడీగా ఉంటాయి.నా బిజీ లైఫ్ లో వారి కామెడీ సలహాలు నాకు చాలా రిలాక్సేషన్ ఇస్తూ ఉంటాయి.

అందుకు,ముందుగా వారికి థాంక్స్ చెప్పాలి.

వాటిలో కొన్నింటినీ,వాటికి నా జవాబులనూ ఇక్కడ చదవండి.

మీరూ హాయిగా నవ్వుకొని రిలాక్స్ అవ్వండి.
-----------------------------------------------
ఈ మధ్యనే ఒక పిల్లకాకి ఇచ్చిన సలహా ఇది.

1) కృష్ణుని జనన సమయం తెలుసుకోవడానికి జ్యోతిష్యం ఎందుకు?ధ్యానంలో అన్నీ తెలుస్తాయి.అలా ట్రై చెయ్యండి.నేను మొన్న ధ్యానంలో ఉన్నప్పుడు ఒక తెల్లని రెక్కల గుర్రాన్ని ఎక్కి గుంటూరులో మీ ఇంటి డాబా మీదకు వచ్చాను.డాబా మీద దిగుదాం అనుకునేలోపు గుర్రం ముందుకు వెళ్ళిపోయింది.ఫోర్త్ డైమెన్షన్ లోకి వెళితే అన్నీ తెలుస్తాయి.

నా జవాబు:

అవునా? ధ్యానం అంటే ఏంటో అదెలా చెయ్యాలో నాకు తెలియదే? ఎలా మరి?పోనీ ఒక పని చేద్దాం.నేను అజ్ఞానిని గనుక జ్యోతిష్య లెక్కలతో కుస్తీ పడుతున్నాను.మీరు ధ్యానసిద్ధులు కదా,మీ ధ్యానంలో చూచి కృష్ణుని అసలైన జననతేదీ వివరాలు చెప్పండి చూద్దాం.నాకీ బాధ తప్పుతుంది.

పోతే నాదొక సలహా.అలా గుర్రంఎక్కి ఆకాశంలో ఎగిరేటప్పుడు దాని మెడను గట్టిగా వాటేసుకోండి.ఒకవేళ బాలెన్స్ తప్పి ఆకాశంలోనుంచి జారి కింద పడితే రక్షించే దిక్కు ఉండరు.మా డాబా మీద పడితే పరవాలేదు.ఏదో ఒక హోమియో మందు నోట్లోవేసి నేను లేపుతాను.కానీ బిజీ రోడ్డు మీద పడితే చాలా కష్టం.

అసలే గుంటూరులో అందరూ పరమ దుర్మార్గులున్నారు.కనీసం 108 ని పిలిచి అందులో ఎక్కించే పనికూడా ఎవరూ చెయ్యరు.రోడ్డుమీద మీ ఖర్మానికి మిమ్మల్ని అలా వదిలేస్తారు.తెల్లరెక్కల గుర్రం మీకోసం ఎలాగూ ఆగదు.ఇంకొక ధ్యానిని వెదుక్కుంటూ అది ముందుకు ఎగిరిపోతుంది.కనుక జాగ్రత్త.

ముందుజాగ్రత్తగా,ఈసారి ధ్యానంలో కూచోబోయే ముందు తలకొక హెల్మెట్ పెట్టుకుని,వీపుకొక పేరాచూట్ కట్టుకుని కూచోండి సరిపోతుంది.అప్పుడు రెక్కలగుర్రంమీద నుంచి కింద పడినా కనీసం తలవరకూ సేఫ్ గా ఉంటుంది.

రాత్రి పూట పడుకోబోయే ముందు నాగేస్పర్రావు నటించిన 'కీలుగుఱ్ఱం' లాంటి పిచ్చిపిచ్చి సినిమాలు చూడకండి.అలా చూస్తే ఇలాంటి కలలే వస్తాయి.

ఇంకొక మహాజ్ఞాని సలహా ఇది.

2) శర్మగారు? అసలు మీకెందుకు ఈ గోల?ఈ బ్లాగులలో వీళ్ళతో ఈ గోలంతా మీకెందుకు? ఆత్మజ్ఞాని లక్షణాలు ఇలా ఉండవు.వెంటనే మీ బ్లాగు మూసేసి ఊరుకోండి.

నా జవాబు:-

మీ సలహాకి నా కృతజ్ఞతలు.

ఆత్మజ్ఞాని లక్షణాలు చెబుతున్నారంటే మీకూ ఆ జ్ఞానం ఉండే ఉంటుంది.మీరూ ఆత్మజ్ఞానులే అయి ఉంటారు.మరి మీరుమాత్రం నా బ్లాగు చూచీ,అందులోని విషయాలు మీకు జీర్ణం కాకా,ఇంత అసూయ పుట్టీ ఇలా బాధపడటం ఎందుకు?నాకు చెబుతున్నట్లు మీరు కూడా ఈ బ్లాగుల గోల వదిలిపెట్టి హాయిగా ఆత్మస్థితులై ఉండవచ్చుగా?

నాకు చెప్పబోయేముందు మీరే ఆపని చెయ్యాలి.ముందా పనిమీద ఉండండి.

మరో మహాజ్ఞాని సలహా ఇది.

3) మౌనమే అత్యుత్తమం అని రమణమహర్షి అన్నాడు.నిజమైన జ్ఞాని మీలా రోజుకొక పోస్ట్ వ్రాస్తూ బోధనలు చెయ్యడు.ఆ సంగతి గ్రహించండి.

నా జవాబు:-

అవునా? రమణమహర్షి మీతో అలా చెప్పారా పాపం? ఆయన బ్రతికి ఉన్న రోజులలో చక్కగా సోఫాలో కూచుని కాఫీత్రాగి న్యూస్ పేపర్ చదివేవారు. రేడియో వినేవారు.ఎందరితోనో ఎన్నో విషయాలు ముచ్చటించేవారు.ఈ సంగతులన్నీ మీకు ఇంకా తెలీవేమో?అవున్లే నిన్నగాక మొన్ననేగా మీరు రమణసాహిత్యం చదవడం మొదలుపెట్టింది.లోతులు అర్ధం కావాలంటే ఇంకా టైం పడుతుంది.

కనీసం ఒక రెండేళ్ళపాటు ఆ పుస్తకాలు బాగా చదివాక అప్పుడు నాతో మాట్లాడే కనీస అర్హత మీకు వస్తుంది.ఆ తర్వాత మళ్ళీ మెయిల్ ఇవ్వండి.

రమణమహర్షి పుస్తకాలు చదవడం కాదు.కనీసం మంచి ప్రశ్నలు ఎలా అడగాలో ముందు నేర్చుకోండి.మీరన్నట్లు రోజుకోక్క పోస్ట్ ఏం ఖర్మ? రోజుకు రెండూ మూడూ పోస్ట్ లు ఎలా వ్రాయాలో నేనీలోపల ప్రాక్టీస్ చేస్తాను.ఈరోజుకి ఇది రెండో పోస్ట్ చూచుకోండి.
---------------------------------------------------
ఇలా రకరకాలైన ఉచిత సలహాలూ విమర్శలూ నాకు వస్తూ ఉంటాయి. వీరిలో చాలామందికి సరియైన తెలుగు వ్రాయడమూ రాదు.మంచి ఇంగ్లీషు వ్రాయడమూ రాదు.సబ్జెక్టూ వారివద్ద ఉండదు.ఇలాంటి వారు నాకు ఉచిత సలహాలు ఇవ్వబోవడం నాకు భలేనవ్వు తెప్పిస్తూ ఉంటుంది.

ఉచిత సలహాలు వారే కాదు.నేనూ ఇవ్వాలి కదా కొన్ని.

అలాంటి వారికందరికీ నాదొక ఉచిత సలహా.

దయచేసి మీమీ ఉచిత సలహాలు ఆపకండి.కనీసం రోజుకొకటి నాకు మెయిల్ ఇస్తూ ఉండండి.ఎందుకంటే ముందే చెప్పినట్లుగా,మీ సలహాలు వచ్చినప్పుడల్లా నవ్వుతో నాకు పొలమారి మంచి నీళ్ళు త్రాగే పరిస్థితి వస్తూ ఉంటుంది.కాకపోతే నా బిజీ లైఫ్ లో మీ కామెడీ మెయిల్స్ వల్లే నేను ఉల్లాసంగా నవ్వుతూ ఉండగలుగుతున్నానంటే మళ్ళీ మీకు మా చెడ్డకోపం వస్తుందేమో.

నా ఈ పోస్ట్ చూచి అలా మీకు కోపం వస్తే, ఒక పని చెయ్యండి.

పిరమిడ్ ధ్యానం అలవాటైన వారు,పిరమిడ్లోకి దూరి తలుపేసుకుని గట్టిగా గాలిపీలుస్తూ శ్వాసమీద ధ్యాస ఉంచండి.మీ కోపం మాయమౌతుంది. కాకపోతే మొత్తం తలుపులు మూసుకోకండి.కనీసం ఒక్క కిటికీ అన్నా ఓరగా తెరిచి ఉంచుకోండి.లేకపోతే ఆ లోపల కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోయి ఊపిరాడక ఏదన్నా అయితే మీ బంధువులు మీకే ఒక పిరమిడ్ కట్టించవలసిన పరిస్థితి దాపురించవచ్చు.

రమణమహర్షి పుస్తకాలు చదివి నాకు ఉచిత సలహాలు ఇస్తున్న వారికి ఈ పోస్ట్ చదివి పిచ్చికోపం వస్తే - 'ఈ కోపం ఎవరికి వస్తున్నది? అసలు శర్మగారికి ఉచితసలహాలు ఇవ్వడానికి "నేనెవర్ని"?'-అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి.మీ కోపం మహర్షి దగ్గరకు వెంటనే పారిపోతుంది.

పాములు పట్టే స్వాములవారి శిష్యులైతే, ముందుగా ఒక మాంఛి పుట్టను సెలెక్ట్ చేసుకుని దాని ఎదురుగా కూచుని నాదస్వరం ఊదుతూ ఆ పామును బయటకు రప్పించే పనిలో ఉండండి.ఏ పక్కనుంచి ఆ పాము బయటకు వస్తుందో అనే భయంలో నామీద కోపం ఎక్కడికో మాయమై పోక తప్పదు. ఒకవేళ మీ ఖర్మం చాలక పుట్టలోంచి పాము బయటకు వస్తే దానికోసం ఒక బుట్టను రెడీగా పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

ఇవన్నీ చేసినా చెయ్యకపోయినా,మీమీ sub- standard సలహాలు ప్రతిరోజూ నాకివ్వడం మాత్రం దయచేసి మానకండి.ఇంత మంచి ఫ్రీ కామెడీ మీలాంటి వారి దగ్గర కాకపోతే ఇంక నాకెక్కడ దొరుకుతుంది?
read more " ఉచిత సలహాలు "