14, జులై 2014, సోమవారం

గురుపూర్ణిమ-సాధనా సమ్మేళనం -6

పంచవటి గ్రూప్ అనేది ప్రాధమికంగా నిజమైన సాధకుల కోసం ప్రారంభించబడిన గ్రూపు. ఆధ్యాత్మిక జీవనాన్ని నిజంగా ప్రేమించే వారికోసం, అలా జీవించాలని కోరుకునే వారికోసం,యోగశక్తినీ దైవశక్తినీ సాధనాశక్తినీ ప్రత్యక్షంగా చూడాలనీ అనుభవించాలనీ త్రికరణశుద్ధిగా అనుకునేవారి కోసం ఈ గ్రూప్ సృష్టించబడింది.గ్రూప్ అధ్వర్యంలో ఇప్పటివరకూ ఆరు సాధనా సమ్మేళనాలు జరిగాయి.మొదటి సమ్మేళనం ప్రకాశంజిల్లా పూనూరు గ్రామంలో జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో రెండు, మహానందిలో ఒకటి,కోటప్పకొండలో ఒకటి జరిగాయి.ఇప్పుడు ఆరవది గుంటూరులో మా ఇంటిలో జరిగింది.

మొన్న 12-7-14 గురుపూర్ణిమ అయింది.

నిన్న 13-7-14 తేదీల ప్రకారం నా పుట్టినరోజు అయింది.

కనుక ఆ రోజులలో పంచవటి సభ్యులు కొందరు వచ్చి నన్ను కలుస్తామని అనుకున్నారు.నాకేమీ అభ్యంతరం లేదని చెప్పాను.కాకపోతే కొన్ని షరతులు విధించాను.

నేను పుట్టినరోజు చేసుకునే విధానం విభిన్నంగా ఉంటుంది.కొత్తబట్టలు, గుళ్ళూగోపురాలు, విందులు వినోదాలు, షాపింగులు, సినిమాలు, విహారయాత్రలు --ఇలా ఉండదు.వాటిలో ఏమీ లేదని నాకు అనుభవం నేర్పింది.కనుక ఆరోజున నేను పూర్తిగా మౌనధ్యానంలో ఏకాంతంగా కాలం గడుపుతాను. కనీసం ముప్పై ఏళ్ళనుంచి ఈ విధానం నేను పాటిస్తున్నాను.

ఆ రెండురోజులూ టీవీ ఉండదు.సెల్ ఫోన్ ఉండదు.ఇంటర్ నెట్ ఉండదు. పత్రికలు ఉండవు.అనవసరమైన మాటలు ఉండవు.ఇల్లు దాటి బయటకు పోవడం ఉండదు.నేను మాట్లాడిస్తే మాట్లాడాలి.లేదంటే మౌనంగా ఉండాలి.ఆ సమయంలో నేనెలా ప్రవర్తిస్తానో చెప్పలేను.అదంతా భరించాలి.కనుక నాతో పాటు రెండురోజులు ఉండాలంటే అలాంటి జీవనవిధానానికి తట్టుకోగల స్థితి ఉంటే సంతోషంగా రమ్మని చెప్పాను.

కొందరు రావాలని ఉన్నా కొన్నికొన్ని కారణాల వల్ల రాలేకపోయారు.కొందరు వస్తామన్నా నేనే వద్దన్నాను.చివరకు కొందరు మాత్రమే రాగలిగారు.

మొత్తమ్మీద ఏడుగురు సభ్యులు మాత్రం రాగలిగారు.వారు ఆ రెండురోజులూ నాతో మాఇంటిలో ఉన్నారు.అందులో ఒకరు బెంగళూర్ నుంచి,ముగ్గురు హైదరాబాద్ నుంచి,ఒకరు అనంతపూర్ నుంచి,ఇద్దరు గుంటూరు నుంచి వచ్చారు.మొదటి సమ్మేళనానికి వచ్చిన సభ్యుడొకరు మళ్ళీ ఈసారి కూడా రావడం ఆనందం కలిగించింది.అది అతనిలో ఆరిపోకుండా ఉన్న తపనకు సూచిక.మొదటి సమ్మేళనానికి వచ్చిన అనేకమంది మధ్యలో జారిపోయారు.ఇప్పటివరకూ నిలబడినవారు చాలా తక్కువ.

ఆధ్యాత్మికమార్గం చాలా కష్టమైనది.అది 'పదునైన కత్తి అంచుమీద నడక' అంటుంది కఠోపనిషత్తు.ఆ నడక మనం ఊహించినట్లుగా ఉండదు.అనుక్షణం కాళ్ళు తెగిపోతుంటాయి.ఆమార్గం మన భావాలకూ అభిప్రాయాలకూ అనుగుణంగా హాయిగా సుఖంగా ఏమీ ఉండదు.కనుక చాలామంది దీనినుంచి జారిపోతుంటారు.వారివారి భావాలకు అనుగుణంగా ఇక్కడి పరిస్థితి లేనప్పుడో లేక వారి అహం అనేది గాయపడినప్పుడో చాలామంది ఈ మార్గాన్ని వదిలేస్తారు.

దీనిని అంటించుకోవడం చాలా కష్టం.ఇందులో స్థిరంగా నిలబడటం ఇంకా కష్టం.అనుక్షణం మారడానికి సిద్ధంగా లేకపోతే ఇందులో ఎవ్వరూ ఇమడలేరు. మార్పును స్వాగతించలేకుండా తమతమ భావాలనూ ఆలోచనలనూ అహాలనూ అంటిపట్టుకుని ఉండేవారికి నేను సూచించే ఆధ్యాత్మికమార్గంలో పట్టు చిక్కదు.

ఈ రెండురోజులూ నాతో కలిసి ఉన్నవారికి నాతో కలిసి ధ్యానంచేసే అవకాశం ఇచ్చాను.బౌద్ధతంత్రం నుంచీ ఆర్షతంత్రం నుంచీ కొన్ని ప్రాక్టికల్ ధ్యానవిధానాలు నేర్పించాను. దగ్గరుండి వారిచేత చేయించాను.ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మికత అనేది ధియరీలో లేదు. అది ఆచరణలో ఉంటుంది.

శనివారం నాడు వారితో కలసి నేనూ ధ్యానం చేశాను.'స్పిరిట్యువల్ ఎనర్జీ ఫీల్డ్' అంటే ఎలా ఉంటుందో వారికి అనుభవం కావడం కోసం ఆ ధ్యానసమయంలో ఒక శక్తివలయాన్ని సృష్టించి అది వారికి అనుభవం అయ్యేటట్లు చేశాను.ఎందుకంటే ఎన్ని మాటలు మాట్లాడుకున్నా అంతిమంగా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ప్రాక్టికల్ గా అనుభవిస్తేనే ఇలాంటి విషయాలు అర్ధమౌతాయి.నమ్మకమూ అప్పుడే కలుగుతుంది.

ప్రత్యక్షంగా ఋజువును చూపించగలిగినదే నిజమైన ఆధ్యాత్మికత.

రెండురోజులపాటు ప్రపంచాన్ని పట్టించుకోకుండా పూర్తిగా ధ్యానమయమైన జీవితం గడపాలంటే ఒకేసారి సాధ్యంకాదు.దానికి ఎంతో ముందునుంచి తయారు కావాలి.ఎన్నో పునాదులు వేసుకుంటూ రావాలి.మనస్సును తయారు చేసుకుంటూ రావాలి.ఎన్నింటినో మనంతట మనం వదులుకోవాలి. అప్పుడే అలా ఉండగలం.

సభ్యులు దానికి సిద్ధంగా లేరు గనుక మధ్యమధ్యలో వారికి కొంత లీజర్ టైం అవసరం అయింది.ఆ సమయంలో అనేక ఆధ్యాత్మిక విషయాలను ప్రాక్టికల్ ఉదాహరణలతో వారికి వివరించాను.వారి సందేహాలను తీర్చాను.

వాటిలో కొన్ని విషయాలు--
  • కర్మ-దాని వివిధ సూక్ష్మభేదములు-మంచిలో చెడు,చెడులో మంచి, చెడుకర్మ,మంచికర్మ,నిష్కామకర్మలు ఏమిటి?
  • నిత్యజీవితంలో అవి ఎలా చెయ్యబడతాయి?
  • కర్మరహస్యాలను నిత్యజీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలి?
  • ధ్యానంలో మనస్సు ఎందుకు నిలబడదు?అలా నిలబడాలంటే ఏం చెయ్యాలి?
  • మనకు కనిపించని శక్తులు నిత్యజీవిత సంఘటనలను ఎలా ఆడిస్తాయి?వాటిని ఎలా అడ్డుకోగలం?ఎలా మార్చగలం?
  • మన మనస్సులలో నిత్యం తలెత్తే భయం,అసూయ,ఆశ మొదలైన ఎన్నోరకాల నెగటివ్ వైబ్రేషన్స్ తో ఎలా డీల్ చెయ్యాలి?
  • ధ్యానంవల్ల నిత్యజీవితంలో మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి?
  • సాధన,ఉపాసన అనేవి ఎలా జరగాలి?వాటిలో మెట్లు ఏమిటి?ఎలా వాటిని అందుకోవాలి?
  • రోజువారీ జీవితం గడుపుతూనే దానిని యోగపరమైన,ధ్యానపరమైన సాధనగా ఎలా మార్చుకోవాలి?
  • మొదలైన అనేక మార్మికవిషయాల మీద చర్చలు ఈ సమ్మేళనంలో జరిగాయి.

ఈ సమ్మేళనంలో ప్రత్యక్షంగా పాల్గొనగలిగినవారిని అభినందిస్తున్నాను. కొందరు సభ్యులు మాత్రం శరీరంతో రాలేకపోయినా, మానసికంగా మా మధ్యనే ఉండి దాని ఫలితాలను చాలాదూరం నుంచి అందుకోగలిగారు.

వారిని ఇంకా అభినందిస్తున్నాను.

ఎందుకంటే,'యోగశక్తికి దూరంతో సంబంధం లేదు' అన్న విషయాన్ని వారు ప్రత్యక్షంగా గ్రహించారు గనుక.

ఆ విధంగా జరిగిన రెండురోజుల పూర్తిస్థాయి సాధనా సమ్మేళనం నిన్నటితో ముగిసింది.
read more " గురుపూర్ణిమ-సాధనా సమ్మేళనం -6 "

7, జులై 2014, సోమవారం

రాహుకేతువుల రాశిమార్పు -2014-ఫలితాలు

13-7-2014 న రాహుకేతువులు రాశులు మారబోతున్నారు.గత ఏడాదిన్నర నుంచీ వీరు వరుసగా తులా మేషరాశులలో ఉన్నారు.ఈ తేదీనుంచి దాదాపు ఇంకొక ఏడాదిన్నరవరకూ కన్యా మీనరాశులలో ఉండబోతున్నారు.

కనుక వీరి స్థితి ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నది.దీని ఫలితంగా అనేకమంది జీవితాలలో ఊహించని విధంగా అనేక మార్పులు కలుగుతాయి.

ద్వాదశరాశులకు ఆయాఫలితాలు ఎలా ఉండబోతున్నాయో స్థూలంగా పరికిద్దాం.

మేషరాశి
గురువుగారు చతుర్దంలోకి వచ్చిన మంచి ఫలితాలు రాహుకేతువుల ఈ మార్పుతో స్థిరీకరించ బడతాయి.ఎప్పటినుంచో బాధిస్తున్న సమస్యలు తొలగిపోవడం చూడవచ్చు.వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన మార్పులు కనిపిస్తాయి.పనిలో ఉత్సాహం ఎక్కువౌతుంది.ఆశావహమైన ఆలోచనలు కలుగుతాయి.నిరాశ దూరమౌతుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శత్రుబాధ తగ్గుతుంది.మంచిపనులకు అకస్మాత్తుగా ఖర్చు చేస్తారు.

వృషభరాశి
వ్యాపారం వృద్ధి అవుతుంది.షేర్ మార్కెట్ లో లాభాలు వస్తాయి.అనేక రకాలైన ప్లానులు వేస్తారు.సృజనాత్మకత విజ్రుంభిస్తుంది.సాంస్కృతిక కళా రంగాలలోని వారికి మంచికాలం మొదలౌతుంది.సంతానానికి మంచిరోజులు వస్తాయి.మంత్రసాధన,ఆధ్యాత్మికచింతనలు ఎక్కువౌతాయి.

మిధునరాశి
విద్యావృద్ధి కలుగుతుంది.గృహసౌఖ్యం పెరుగుతుంది.వాహనయోగం కలుగుతుంది.వృత్తిపరంగా కొన్ని చికాకులు తలెత్తవచ్చు.వృత్తిలో మార్పులు ఉంటాయి.దూరప్రయాణాలు జరుగుతాయి.ధనవృద్ధి సూచన ఉన్నది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది.

కర్కాటకరాశి
అధికారం పెరుగుతుంది.మాట చెల్లుబాటు అవుతుంది.ధైర్యం ద్విగుణీకృత మౌతుంది.ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.దగ్గర/దూర విదేశీప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.

సింహరాశి
ఆకస్మిక ధనవృద్ధి.పిత్రార్జితం రావడం,రాదనుకున్న డబ్బు రావడం జరుగుతుంది.విద్యకోసం విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది.అకస్మాత్తుగా ఉద్రేకాలకు లోనుకావడం,దానివల్ల అనవసరంగా ఎక్కువగా మాట్లాడటం, దానివల్ల అనర్దాలూ ఉంటాయి.కొంతమందికి తీవ్రమైన ఆధ్యాత్మికభావాలు ముప్పిరిగొంటాయి.

కన్యారాశి
ఉన్నట్టుండి వెలుగు కనిపిస్తుంది.ఎనర్జీ ఎక్కువౌతుంది.ఇంద్రియశక్తులు ఉన్నట్టుండి పెరుగుతాయి.మానసిక శక్తి వృద్ధి చెందుతుంది.ఉత్సాహం ద్విగుణీకృతమౌతుంది.శత్రువులు తగ్గుతారు.

తులారాశి
తండ్రిగాని తండ్రి సమానులు గాని ఉన్నట్టుండి మంచాన పడతారు.లేదా పరలోక యాత్రకు వెళతారు.ఏదో ఒక కారణంగా ఆస్పత్రి దర్శనం తరచూ కలుగుతుంది.ఊహించని ఖర్చులు బాగా పెరుగుతాయి.రహస్య ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి మెరుగౌతుంది.విదేశీ ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.శత్రువులు దూరమౌతారు.

వృశ్చికరాశి
పిత్రార్జితం అందుతుంది.స్నేహితుల వల్ల లాభం కలుగుతుంది.జ్యేష్ట సోదరులకు మంచి జరుగుతుంది.సాంప్రదాయ ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది.జీవితం లాభయుతంగా ఉంటుంది.కానీ ప్రతి లాభం వెనుకా ఒక నష్టం కూడా వెంటనే జరుగుతుంది.

ధనూరాశి
వృత్తిలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తాయి.ఎదుగుదల ఉంటుంది. అయితే త్రిప్పటా,చికాకూ కూడా పక్కపక్కనే ఉంటాయి.ఉద్యోగ పరంగా ఎక్కువగా ఊళ్లు తిరగవలసి వస్తుంది.దాని ఫలితంగా గృహసౌఖ్యం తగ్గిపోతుంది.మానసికచింత పట్టి పీడిస్తుంది.దానిని అధిగమించడానికి దైవసంబంధ విషయాల ఆసరా తీసుకుంటారు.

మకరరాశి
ఇన్నాళ్ళూ ఇంటిలో పీడిస్తున్న చికాకులు దూరం కావడం చూస్తారు.ధైర్యం పెరుగుతుంది.కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి.దూరప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువౌతుంది.పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు.కొందరికి సాధనలో సిద్ధి కలుగుతుంది.

కుంభరాశి
మానసిక చింత ఎక్కువౌతుంది.కంటి వ్యాధులు పీడిస్తాయి.గృహసౌఖ్యం తగ్గుతుంది.కమ్యూకేషన్ స్కిల్స్ తగ్గిపోతాయి.మాట తడబడుతుంది. సంతానం దూరమౌతుంది. రహస్య ఆధ్యాత్మిక చింతనలో సేదదీరుతారు.

మీనరాశి
శత్రువులు బలపడతారు.ఎదుటివారి ప్లానులకు ఇష్టం లేకున్నా తలొగ్గవలసి వస్తుంది.కాని చివరకు అంతా మంచే జరుగుతుంది.బాధ్యతలు పెరుగుతాయి.తనవారికి కాలం కలసి వస్తుంది.దూరప్రయాణాలు ఉంటాయి.కొందరికి స్థలమార్పు సూచితం అవుతున్నది.దీర్ఘరోగాలు విజ్రుంభిస్తాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.తొందరపడి నిర్ణయాలు తీసుకుని మోసపోతారు.జీవితభాగస్వామిలో చురుకుదనం పెరుగుతుంది.

ఈ ఫలితాలు గమనించడానికి 13-7-2014 వరకూ ఆగనక్కర లేదు.ఇప్పటికే ఆయా దిశలలో మార్పులు కలుగుతూ ఉండటం గమనించండి.
read more " రాహుకేతువుల రాశిమార్పు -2014-ఫలితాలు "

4, జులై 2014, శుక్రవారం

కాలజ్ఞానం -24(ఆషాఢమాస ఫలితాలు)


జూన్ 27 న 13-39 గంటలకు హైదరాబాద్ లో ఆషాఢమాసం మొదలైంది.

ఈమాసం ప్రారంభం కావడమే అనేక దుస్సంఘటనలతో మొదలైంది.లగ్నం కన్యా తులల మధ్యన సున్నా డిగ్రీలలో ఖచ్చితమైన శపితయోగ పరిధిలో ఉన్నది.

శుక్రవారం ఆర్ద్రానక్షత్రం వృద్దియోగంలో ఈ మాసం మొదలైంది.

ఈ నెల రాష్ట్రపరంగా ఆర్ధికపరంగా ఏమంత మంచి ఫలితాలను ఇవ్వదు.

భాగ్యభావం దెబ్బతినడంతో డబ్బు సమస్యలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తాయి.చెయ్యాలనుకుంటున్న పనులకు డబ్బులు ఎక్కడనుంచి తేవాలో అర్ధం కాదు.

అయితే ఏదో ఒక రకమైన ప్లానులు వేసి కష్టాలనుంచి గట్టెక్కాలని ప్రయత్నాలు జరుగుతాయి.

దశమంలో ఉన్న ఉచ్ఛగురువు ఒక్కడే ఈ కుండలికి మంచియోగాన్ని ఇస్తున్నాడు.కనుక పరిపాలన నడుస్తూనే ఉంటుంది.అదే లేకపోతే పరిస్తితి అధ్వాన్నంగానే ఉన్నదని చెప్పాలి.కాకుంటే,ధనాధిపతి అయిన కుజుడు అక్కడే నీచలో ఉండటంతో గురువుగారి మంచిప్రభావం చాలావరకూ న్యూట్రలైజ్ అయిపోతున్నది.

ఉద్దేశాలు ప్లానులు మంచివేగాని డబ్బులు ఎక్కడనుంచి వస్తాయో అర్ధంకాని పరిస్తితి ఉంటుంది.

జూలై 6,7,8,9 తేదీలలో మళ్ళీ ప్రమాదాలు దుర్ఘటనలు జరుగుతాయి.కొందరికి పదవీగండం ఉన్నది.కొందరు ప్రముఖులు గతిస్తారు.ప్రభుత్వానికి ఒక విజయం చేకూరుతుంది.

జూలై 13 న కొందరి జీవితాలలో ఒక బలీయమైన ఆధ్యాత్మికసంఘటన జరుగుతుంది.

లౌకికంగా చూస్తే,ఒక ఉగ్రవాదచర్యగాని,లేక ఒక దుస్సంఘటనగాని జరుగుతుంది.సాంస్కృతిక కళారంగాలలో ఒక నష్టం ఉంటుంది.

జూలై 16 నుంచి 18 లోపు ఆర్ధికపరమైన ప్రజాపరమైన చికాకులు రాష్ట్రాన్ని పీడిస్తాయి.న్యాయశాఖారంగంలో,మతరంగంలో దుర్ఘటనలు జరుగుతాయి.

భవిష్యత్ ప్లానింగ్ తోనూ,ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలన్న ఆందోళనతోనే ఈ నెల రాష్ట్రపరిపాలన సాగుతుంది.
read more " కాలజ్ఞానం -24(ఆషాఢమాస ఫలితాలు) "

2, జులై 2014, బుధవారం

చైనా ఆయిల్ పైప్ లైన్ లీక్-హాంగ్ కాంగ్ ఆందోళనలు-నైజీరియా కారుబాంబు పేలుడు-కొనసాగుతున్న రాహుప్రభావం

30-6-2014 సోమవారం సాయంత్రం 6.15 ప్రాంతంలో దాలియన్ అనే చైనీస్ పోర్ట్ సిటీ దగ్గర ఆయిల్ పైప్ లైన్ లీకై ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది.

ఆయిల్ అనేది రాహువు కారకత్వాలలో ఒకటి అని మళ్ళీ మళ్ళీ చెప్పనక్కరలేదు.ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు ఈ విషయం వ్రాసి ఉన్నాను.

కరెక్ట్ గా ఆరోజున శుక్ల తృతీయ.అంటే అమావాస్యకు మూడోరోజు.కనీసం 20,000 మందిని అక్కడనుంచి తరలించారు.ఎంతమంది ప్రమాదంలో గాయపడ్డారో లేదా చనిపోయారో బయటకు తెలియదు.చైనాలో బయటకు పొక్కకుండా రహస్యాలను దాచిపెట్టడం మామూలే.

ఈ సంఘటన సాయంత్రం 6.15 ప్రాంతంలో జరిగింది.ఆ సమయానికి గ్రహస్తితి ఎలా ఉందో చూద్దాం.ఆ సమయానికి ఆశ్లేషా నక్షత్రం నడుస్తున్నది.ఆశ్లేష సర్పనక్షత్రం అనీ రాహువు అధీనంలో ఉంటుందనీ ముందే వ్రాశాను.అదే రోజున ఈ ప్రమాదం జరగడం ఎంత విచిత్రం?

ఇకపోతే మనుష్యులకు లగ్నాలూ రాశులూ ఉన్నట్లే దేశాలకూ ఉన్నాయి.వాటికి స్వాతంత్ర్యం వచ్చిన సమయాన్ని ఆయా దేశాలకు సహజలగ్నాలుగా కొందరు స్వీకరిస్తున్నారు.అది సరికాదు.స్వాతంత్రం రాకముందు కూడా ఆ దేశం ఉన్నది.అసలు కొన్ని దేశాలు పరాయి పాలనలోకి పోనేలేదు.కనుక దేశాలకు లగ్నాలను వాటి స్వాతంత్ర్యసమయాన్ని బట్టి కాకుండా ఆ దేశం యొక్క లక్షణాలను బట్టి నిర్ణయించడం తార్కికంగా ఉంటుంది.పాతకాలపు ప్రఖ్యాత పాశ్చాత్య జ్యోతిష్కుడు 'అలాన్ లియో' తన పరిశీలనను బట్టి తనకు తోచినట్లు దేశాలకు లగ్నాలను నిశ్చయించాడు.తర్వాతకూడా చాలామంది పాశ్చాత్య జ్యోతిష్కులు ఆ పనిని చేశారు.అందులో కొన్ని సరిపోతాయి.కొన్ని సరిపోవు.

మనుష్యులకు ఉన్నట్లే ప్రతీదేశానికి కొన్నికొన్ని లక్షణాలుంటాయి.ఆయా లక్షణాలను బట్టే రాశులను నిర్ణయించాలి.ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పన్నెండు రాశులలో ఇమిడిపోతాయి.ఎందుకంటే ప్రాధమికంగా మానవస్వభావం ఈ పన్నెండు రాశులను దాటి బయటకు పోదు.

ఈకోణంలో చూస్తే చైనాకు వృశ్చికరాశి బాగా సరిపోతుంది.ఎందుకంటే వృశ్చికరాశి వారికి గుట్టు ఎక్కువ.అన్నీ రహస్యంగా ఉంచాలన్న తాపత్రయం వారికి ఉంటుంది.తమ విషయాలు ఎవరైనా గమనిస్తారేమో అని జంకు ఎక్కువగా ఉంటుంది.దానికి తోడు వృశ్చికరాశివారికి స్వార్ధం చాలా ఎక్కువ ఉంటుంది.ఎదుటివారు ఏమైపోయినా సరే తమపని అయితే చాలు అన్న మనస్తత్వం ఉంటుంది.అవసరం అనుకుంటే ఎదుటివారిని నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేయడానికి కూడా వారు వెనుకాడరు.చైనాకు కూడా ఈ లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయని చరిత్ర చదివితే అర్ధం అవుతుంది.పైగా చైనా చిహ్నం అయిన డ్రాగన్ విషజంతువు.అలాగే వృశ్చికం కూడా విషకీటకమే. కనుక చైనాది వృశ్చికరాశే అని నేను భావిస్తాను.

పైగా మనది మకరరాశి.మనకు ఏకాదశం చైనారాశి అవుతుంది.అంటే మిత్రస్థానం.కానీ అది మకరానికి బాధకస్థానం గనుక ప్రస్తుతానికి మిత్రులుగా నటిస్తున్నా వారివల్ల మనకు చాలా బాధలుంటాయి.అలాగే జరుగుతున్నది కదా. 

వృశ్చికరాశికి ద్వాదశంలోనే ప్రస్తుతం శపితయోగం ఉన్నది.కనుక భారీనష్టం సూచింపబడుతున్నది.దానికి అనుగుణంగానే సోమవారం నాడు ఆశ్లేషా (రాహు)నక్షత్రంలో ఈ సంఘటన జరిగింది.ఆ సంఘటన జరిగినప్పుడు కూడా లగ్నం వృశ్చిక ధనూరాశుల మధ్యలో సంధిలో పడింది.ఆ సమయానికి నక్షత్రాదిపతి అయిన బుధుడు అష్టమంలో సున్నా డిగ్రీలలో వక్రించి బాగా బలహీనుడుగా ఉండటం చూడవచ్చు.కనుకనే 20,000 మందిని అక్కడనుంచి ఖాళీ చేయించవలసినంత పెద్ద ప్రమాదం జరిగింది.

నిన్న హాంగ్ కాంగ్ లో లక్షలాది మంది రోడ్లమీదకు వచ్చి ధర్నా చెయ్యడం జరిగింది.హాంగ్ కాంగ్ ప్రజలు కూడా చైనీస్ జాతివారే అన్నది గమనించాలి. అంటే ప్రకృతి వైపరీత్యాలను సృష్టించడం నుంచి మనుష్యులలో ఆవేశాలను రెచ్చగొట్టడంవరకూ గ్రహప్రభావం అన్ని స్థాయులలోనూ ఉంటుందని ఋజువు కావడం లేదూ?నిన్నకూడా ఆశ్లేషా నక్షత్రమే హాంగ్ కాంగ్ లో నడిచింది.

అయితే ఈ రెండు సంఘటనలలోనూ ఎక్కువ ప్రాణనష్టం జరగలేదు.కారణం ఏమంటే వృశ్చిక రాశికి కోణస్థితిలో ఉచ్చంలో ఉన్న గురువుగారి స్థితి.ఆయన దృష్టి పడటం వల్ల  ఘోరమైన ప్రమాదాలూ గొడవలూ జరుగకుండా పరిస్థితి అదుపులోకి వస్తున్నది.అదే లేకుంటే జరిగే ప్రాణనష్టాన్ని ఆపడం ఎవరి వల్లా అయ్యేది కాదు.


నిన్న ఉదయం 8.00 గంటల సమయంలో ఈశాన్య నైజీరియాలో 'మైదుగురి' అనే ఊరిలో కారు బాంబు పేలి కనీసం 50 మంది చనిపోయారు.అనేక కార్లూ ద్విచక్రవాహనాలూ తుక్కుతుక్కు అయ్యాయి.నిన్న మంగళవారం కావడమూ ఆశ్లేషా నక్షత్రమే నడుస్తూ ఉండటమూ గమనించాలి.లగ్నం కర్కాటకం అయింది.హోరాదిపతి శుక్రుడు కార్లకు సూచకుడన్న విషయమూ ఆయన ఏకాదశంలో బాధకస్థానంలో ఉన్నాడన్న విషయమూ గమనార్హములు.వాహనస్థానంలో శపితయోగం ఉన్న విషయం గమనించండి.


50 మంది చనిపోయారంటే అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది.కాని అసలు విషయం అది కాదు.రంజాన్ మాసం కావడంతో ఎక్కువమంది వ్యాపారస్తులు అప్పటికి షాపులు తెరవలేదు.లేకపోతే పేలుడు ధాటికీ ఇంకా ఎన్నో రెట్లు ప్రాణనష్టం జరిగి ఉండేది.అంటే,మతపరమైన కార్యక్రమంలో ఉన్నందువల్ల వారు రక్షింపబడ్డారు.అన్ని మత కార్యకలాపాలకూ గురువు అధిపతి అని గుర్తు ఉంచుకుంటే,ఈ సంఘటనలో గురువుగారి ఉచ్చస్థితి వారిని ఎలా కాపాడిందో అర్ధమౌతుంది.లగ్నం కర్కాటక రాశిలోనే ఉచ్చంలో ఉన్న గురుచంద్రుల సమక్షంలోనే ఉన్నదని గమనించాలి.ఇది తాత్కాలిక గజకేసరీయోగం.ఈ విధంగా గురువుగారి అనుగ్రహం ప్రమాదాలనుంచి ప్రజలను అనూహ్యంగా కాపాడుతుంది.

శపితయోగం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూపడంకోసం కొన్ని ఉదాహరణలు ఇచ్చాను.ఆప్ఘనిస్తాన్ లో జరుగుతున్న మారణకాండను కూడా వ్రాసి ఈ పోస్ట్ ను ఇంకాఇంకా పొడిగించడం ఇష్టంలేక ఇక ఆపుతున్నాను.
read more " చైనా ఆయిల్ పైప్ లైన్ లీక్-హాంగ్ కాంగ్ ఆందోళనలు-నైజీరియా కారుబాంబు పేలుడు-కొనసాగుతున్న రాహుప్రభావం "

29, జూన్ 2014, ఆదివారం

బ్లాక్ సాటర్ డే

నిన్న శనివారాన్ని బ్లాక్ సాటర్ డే అని అనుకోవచ్చు.

ఎందుకంటే నిన్న ఒకే రోజున ఎన్నో ప్రమాదాలు జరిగాయి.

ఉదయం డిల్లీలో భవనం ఒకటి కూలిపోయి జనం చనిపోయారు.

సాయంత్రం చెన్నైలో భవనం కూలిపోయి 11 మంది చనిపోయారు.కనీసం ఇంకా 20 మంది శిధిలాలక్రింద చిక్కుకుని ఉన్నారంటున్నారు.

ఇందులో విచిత్రం ఏమంటే,ఉదయం డిల్లీ సంఘటనకూ సాయంత్రం చెన్నై సంఘటనకూ నవాంశ చక్రం ఒకటే.నవాంశ లగ్నం రెంటికీ మీనమే అయింది.చతుర్దాతిపతి అయిన బుధుడు ఈ రెండు చక్రాలలోనూ అష్టమంలో రాహువుతో కలసి ఉన్నాడు.ఇదొక నమ్మలేని నిజం.జ్యోతిష్య విద్యార్ధులకు ఈ విచిత్రం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించడమేగాక,గ్రహప్రభావాలు ఎంత విచిత్రంగా ఉంటాయో మరొక్కసారి కళ్ళకు కట్టిస్తుంది.

ఈ రెండు సంఘటనలకూ దాదాపు తొమ్మిది గంటలు తేడా ఉన్నది.కానీ రెండు సంఘటనలలోనూ నవాంశలో గ్రహస్తితులు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. మనకు కనపడని శక్తులు ఏ విధంగా సంఘటనా క్రమాన్ని నిర్దేశిస్తూ ఉంటాయో చెప్పడానికి ఇదొక మచ్చుతునక.ఖచ్చితంగా ఆయా సమయాలకు ఆయా గ్రహస్తితులు సరిగ్గా ఎవరో కదిపినట్లు ఆయా ప్రదేశాలకు చేరుకుంటాయి.మనకు తెలియని ఒక అతీతశక్తి పర్యవేక్షణలో అంతా నడుస్తున్నదని చెప్పడానికి ఇవే నిదర్శనాలు.

అయితే ఈ సమయంలో హోరాదిపతి శుక్రుడు అయ్యాడు.రాశి చక్రంలో చతుర్దాదిపతి అయిన శని నవాంశలో నీచంలో ఉంటే ఆయనతో కలసి ఈ శుక్రుడున్నాడు.కనుకనే కూలి చేసుకునే సాదాసీదా జనం ఈ ఘటనలో చనిపోయారు.

విశాఖపట్నంలో ఫార్మా కంపెనీలో పేలుడు జరిగింది.

కాన్పూర్ లో గ్యాస్ ప్రమాదం జరిగింది.

గుజరాత్ పోర్ట్ లో ఇలాంటిదే ఒక ప్రమాదం జరిగింది.

ఇలా రకరకాల చోట్ల ఒకేరకమైన ప్రమాదాలు ఒకేరోజున జరగడం కాకతాళీయం కాబోదు.దీనివెనుక ఉన్న కారణం ప్రతికూల గ్రహస్థితులు మాత్రమే.

ఈరోజు మళ్ళీ ఏమీ జరగలేదు.దానికి కారణం అమావాస్య ప్రభావం బలహీనపడటమే.

ఈ విధంగా వ్యక్తిగత జీవితాలలో గత పదిరోజులుగా ఎన్నో సంఘటనలు జరిగాయి.మచ్చుకి కొన్ని చూద్దాం.

మా స్నేహితుని అబ్బాయికి 14 ఏళ్ళు.అతనికి ఉన్నట్టుండి షుగర్ లెవెల్ 800 కి వెళ్ళిపోయింది.కళ్ళు తిరిగి పడిపోతే ఆస్పత్రిలో చేర్పించారు.షుగర్ లెవల్ ఈ స్థాయిలో ఉంటె అసలు బ్రతకడం కష్టం.ఇదేదో మిరకిల్ గా ఉన్నది అని ట్రీట్ చేస్తున్న డాక్టర్లే నోరెళ్ళబెట్టారు.ఈ వయసులోనే అతను ఇన్సులిన్ డిపెండెంట్ అయ్యాడు.ఇది జరిగి 5 రోజులు అయింది.ఈ విషయం చెప్పి స్నేహితుడు వాపోయాడు.ఊహించని అంతుబట్టని ఆరోగ్య సమస్యలకు రాహువు కారకుడని చాలాసార్లు గతంలో వ్రాశాను.

గతవారంలో అనేకమంది అకస్మాత్తు ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిని దర్శించడం జరిగి ఉంటుంది.ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ఉంటాయి.నా చుట్టుపక్కల నేనే ఎన్నో కేసులు చూచాను.ఇదీ ఈ గ్రహప్రభావమే.

అంతేకాదు ఇరాక్ లో ప్రస్తుతం జరుగుతున్న అంతర్యుద్ధం కూడా రాహువు ప్రభావమే.ముస్లిం దేశాలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి.

ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పెద్ద సంఘటనలూ,వ్యక్తిగత జీవితాలలో అనేక రోజువారీ సంఘటనలూ రాహుప్రభావంతో జరుగుతున్నాయి.చూచే దృష్టితో చూస్తే వాటిని చక్కగా అర్ధం చేసుకోవచ్చు.

అయితే కొంతమందికి అనుమానం వస్తుంది.

ఈ ప్రమాదాలలో అందరూ సామాన్యులే పోతున్నారు.తెరవెనుక ఉండి ఈ పనులను చేయిస్తున్న పెద్దవారు హాయిగానే ఉన్నారు కదా అని.

కర్మ ఎవరినీ వదలదు.దానికి ధనవంతులనీ పేదవారనీ తేడా ఉండదు. ఎవరిసమయం వచ్చినపుడు వారికి వాత పెడుతుంది.అయితే ఆ వాతను పెట్టే విధానంలో తేడాలుంటాయి.మోసకారులకు మోసపూరితంగానే దెబ్బ తగులుతుంది.అతితెలివి ఉన్నవారికి ఇంకా తెలివిగా దెబ్బ తగులుతుంది. కర్మను చేసికూడా తప్పుకుందాం అనుకునేవారికి వారు ఊహించని విధంగా, తప్పుకోలేని విధంగా దెబ్బ తగులుతుంది.అహంకారులకు వారి అహం అణగిపోయే విధంగా శిక్ష పడుతుంది.క్రూరంగా కర్మ చేసినవారికి ఇంకా క్రూరంగా శిక్ష పడుతుంది.దీనిని ఆపడం ఎవరి తరమూ కాదు.

పేదవాళ్ళ బాధలు బయటకు కనిపిస్తాయి.ధనికుల బాధలు అలా కనిపించవు.వాళ్ళ బాధలు చెప్పుకోలేనివి.కానీ వాళ్లవి వాళ్ళకూ ఉంటాయి.వారి సమయం వచ్చినపుడు వారూ అనుభవిస్తారు.

తన జీవితంలో జరిగిన సంఘటన ఒకటి నా స్నేహితుడు నాతో చెప్పాడు.

వాళ్ళ అబ్బాయి చైనాలో MBBS చదువుతున్నాడు.అతన్ని చూడటానికి మా స్నేహితుడు చైనా వెళ్లాడు.చేతిలో పదిలక్షల క్యాష్ ఉన్నది.కానీ దురదృష్టవశాత్తూ దానిని మార్చుకోడానికి ఆరోజున బ్యాంకులు మూసేసి ఉన్నాయి.ఇతను షుగర్ పేషంటు.కనీసం టీ త్రాగుదామంటే చేతిలో డబ్బులు లేవు.మన కరెన్సీ అక్కడ చెల్లదు.చేతిలో పదిలక్షల ఇండియన్ కరెన్సీ ఉండికూడా టీ తాగడానికి డబ్బుల్లేని పరిస్తితిని అతడు చైనా రోడ్లమీద అనుభవించాడు.

తిండిలేక షుగర్ లెవల్స్ పడిపోయి చివరకు కళ్ళుతిరిగి రోడ్డుమీద పడిపోయే స్థితిలో ఉన్నాడు.అక్కడ ఎవడికీ ఇంగ్లీష్ రాదు.మావాడికి చైనీస్ రాదు.ఏం చెయ్యాలి?చివరికి తట్టుకోలేక రోడ్డు పక్కనే ఉన్న కొన్నిషాపులలో అడుక్కున్నాడు కూడా.అయితే భాష రాకపోవడంతో వాళ్లకు ఇతనేమి చెబుతున్నాడో అర్ధం కాలేదు.ఇతను మనదేశంలో ఒక హోటల్ యజమాని. ఏసీ రూం దాటి సాధారణంగా బయటకు రాడు.కాని ఆరోజున చైనాలో ఒక కప్పు 'టీ' కోసం అడుక్కునే స్థితిలోకి నెట్టబడ్డాడు.

ఇంతలో ఇతని అదృష్టం బాగుండి ఒక చైనా అమ్మాయి అక్కడకు వచ్చింది. ఆ అమ్మాయి అక్కడ యూనివర్శిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్.ఇతను చెబుతున్నది ఆమెకు అర్ధమై,వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆరోజుకు ఆశ్రయం ఇచ్చింది. మర్నాడు బ్యాంకులు తెరిచాక ఇతను డబ్బు మార్చుకున్నాడు.

ఆరోజున ఆ అమ్మాయి గనుక అక్కడ కన్పించకపోతే చేతిలో పదిలక్షల కరెన్సీతో చైనారోడ్లమీద టీ నీళ్ళకోసం ముఖంవాచి కుక్కచావు చచ్చి ఉండేవాడిని అని నాతో చెప్పి వాపోయాడు.చేతిలో డబ్బున్నా కొన్నిసార్లు కర్మపెట్టే బాధలు ఇలా ఉంటాయి.డబ్బు అన్నివేళలా అన్నింటినీ పరిష్కరించలేదు.

అతను తరచుగా గుంటూరులో అన్నదానం చేస్తూ ఉంటాడు.ఎంతోమంది దిక్కులేనివాళ్లకు తనచేత్తో తరచుగా అన్నం పెడుతూ ఉంటాడు.ఆ సంగతి నాకు తెలుసు.

అతనితో ఇలా చెప్పాను.

"నీవు చేసిన అన్నదానమే ఆ సమయంలో నిన్ను ఆదుకుంది. అన్నపూర్ణాదేవి ఆ అమ్మాయి రూపంలో వచ్చి ఆ దేశంకాని దేశంలో ఆపదలో ఉన్న నిన్ను ఆదుకుంది.నిన్ను ఆదరించి నీకు అన్నం పెట్టింది. నీవు ఇక్కడ చేసిన మంచిపని అక్కడ నీకు అక్కరకు వచ్చింది." అని చెప్పాను.

మన కర్మ మన వెనకే  ఉంటుంది.ఎక్కడికీ పోదు.అది మనకు కనిపించక పోవచ్చు.కాని మన నీడలా వెన్నంటే ఉంటుంది.

ఒక హిందీ సామెత ఇలా అంటుంది.

"భగవాన్ కే ఘర్ మే దేర్ హై అంధేర్ నహీ"

'భగవంతుని ఇంటిలో(సృష్టిలో) ఆలస్యం ఉందేమో గాని చీకటి లేదు.' అంటే ఆలస్యమైనా చివరికి న్యాయం జరుగుతుంది అని.

నన్నడిగితే మాత్రం ఈ సామెత తప్పంటాను.

భగవంతుని న్యాయస్థానంలో ఆలస్యమూ లేదు.చీకటీ లేదు.

మనం అనుకున్న సమయానికి అనుకున్నట్లు జరగకపోతే అలా అనుకుంటాము.కాని అది నిజం కాదు.ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా ఖచ్చితంగా జరుగుతుంది.ఎలా జరపాలో దైవానికి తెలుసు.ఎప్పుడు జరపాలో కూడా ఖచ్చితంగా తెలుసు.

కాకపోతే ఆ జరిగేదాని వెనుక ఉన్న రహస్యసూత్రాలను అర్ధం చేసుకోవడమే మనం చెయ్యవలసిన పని.జ్యోతిష్యశాస్త్రపు పరమ ప్రయోజనం అదే. సృష్టిరహస్యాలను చక్కగా ఆకళింపు చేసుకోవడమే జ్యోతిష్యశాస్త్రపు పరమ ప్రయోజనం.

అలా అర్ధం చేసుకుని ప్రయోజనం ఏమిటీ అని అడగవచ్చు.

అలా వాటిని అర్ధం చేసుకుంటే ఆ తప్పులను మన జీవితంలో మనం చెయ్యకుండా ఉంటాం.ఆ బాధలు పడకుండా తప్పుకోగలుగుతాం. దైవన్యాయానుసారం జీవించగలుగుతాం.దైవానికి దగ్గర కాగలుగుతాం.

మనిషి జన్మలో ఇంతకంటే ఇంకేం కావాలి?
read more " బ్లాక్ సాటర్ డే "

28, జూన్ 2014, శనివారం

డిల్లీలో కూలిపోయిన నాలుగంతస్తుల భవనం-శపితయోగానికి మరో తిరుగులేని తార్కాణం

ఈరోజు ఉదయం 8.55 ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం ఒకటి డిల్లీలో కూలిపోయింది.పదకొండు మంది చనిపోయారని అంటున్నారు. ఎంతమంది కూలిపోయిన సిమెంట్ స్లాబుల క్రిందా,రాళ్ళక్రిందా చిక్కుకుని ఉన్నారో తెలియదు.నిదానంగా ఆ లెక్క తెలుస్తుంది.

రాహువు కుజుడు అమావాస్య కలసిన ప్రభావాలకు ఇది ఇంకొక తిరుగులేని నిదర్శనం.శపితయోగపు నిరాఘాటమైన పదఘట్టనకు ఇది మరొక ఋజువు.జ్యోతిష్యపరమైన కోణాలు ఇందులో ఏమున్నాయో ఒక్కసారి పరికిద్దాం.

లగ్నం ఆశ్లేషా నక్షత్రంలో ఉన్నది.ఆశ్లేషా నక్షత్రం సర్పనక్షత్రం.దీనికి అధిష్టాన దేవత రాహువు.కనుక రాహుప్రభావం స్పష్టంగా ఉన్నది.

గృహాలను సూచించే చతుర్దంలో శపితయోగం కూర్చొని ఉండటం స్పష్టంగా కనిపిస్తున్నది.కనుక భవనం కూలిపోయింది.కానీ లగ్నంలో గురువు ఉచ్చంలో ఉండటం వల్ల ప్రాణనష్టం తగ్గింది.లేకుంటే మంచి రద్దీగా ఉండే ప్రాంతంలో అంత భవనం కూలిపోతే చుట్టుపక్కల భవనాలకు కూడా నష్టం జరగాలి.ఇక్కడ కూడా గురు అనుగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నది.గురువుగారి అనుగ్రహానికి మరొక్క నిదర్శనం ఈరోజు పునర్వసు నక్షత్రం నడుస్తూ ఉండటం.కరుణామయుడైన గురువు వల్లనే ఇంత ఘోరప్రమాదంలో కూడా ప్రాణనష్టం తగ్గింది.

ఈప్రాంతంలో 7.30 నుంచి 8.30 వరకూ కుజహోర నడిచింది.ఆ సమయం లోనే భవనం కూలడానికి ఇతర కారణాలు బలాన్ని సంతరించుకుని ఉండాలి.ఆ చుట్టుపక్కల ఏదో ఇంకొక కట్టుబడి జరుగుతూ ఉన్నదని అంటున్నారు.ఆ ప్రకంపనలకు ఆ భవనం బాగా వీక్ అయి ఉండాలి.అంటే కుజహోరలో భవనం పడిపోవడానికి రంగం సిద్ధం అయింది.తర్వాత ఒక అరగంటలో రాహునక్షత్రంలో ఉన్న సూర్యహోరలో అది కూలిపోయింది.

8.30 నుంచి సూర్యహోర మొదలైంది.సూర్యుడు కూడా ఆశ్లేషా నక్షత్రంలో ఉండటం స్పష్టంగా చూడవచ్చు.అంటే ఈ సమయం పైన కూడా రాహువు ప్రభావం నక్షత్రపరంగా ఉన్నది.

నవాంశను ఒక్కసారి పరికిద్దాం.లగ్నాధిపతి గురువు పంచమంలో ఉచ్చంలో ఉన్నప్పటికీ నీచంలో ఉన్న కుజునితో కలసి ఉన్నాడు.వీరిద్దరినీ నీచంలో ఉన్న శనిస్థానం నుంచి హోరాధిపతి సూర్యుడు చూస్తున్నాడు.కుజుడు భవనాలకు భూమికి అధిపతి.చతుర్దాదిపతి బుధుడు అష్టమంలో రాహువుతో కలసి వక్రించి ఉన్నాడు.

అమావాస్య ప్రభావం దాని తర్వాత మూడురోజుల వరకూ ఉంటుందని కూడా ఎన్నోసార్లు పాతపోస్ట్ లలో వ్రాశాను.ఈరోజు అమావాస్య తర్వాతి రోజే.గమనించండి.

గత మూడురోజులనుంచీ జరుగుతున్న సంఘటనల వల్ల ఇంకొక విషయం కూడా స్పష్టంగా తెలుస్తున్నది.ప్రమాద కంపాస్ అనేది స్థిరంగా ఉండదు. భూమి తిరుగుతున్నట్లే అదికూడా తిరుగుతూ ఉంటుంది.కర్మబీజాలు ఎక్కడ పక్వానికి వచ్చాయో అక్కడ అది ప్రభావం చూపిస్తుంది.అందుకే ఒక్కొక్కరోజు ఒక్కొక్కచోట అది తన చేతిని విదిలిస్తున్నది.

వ్యక్తిగత జీవితాలలో అయితే గత అయిదురోజులుగా ఎన్నో రకాలైన దుర్ఘటనలు జరుగుతున్నాయి.ఎవరికి వారు గమనించుకుంటే తెలుస్తుంది.

శపితయోగానికీ,రాహువు,కుజుడు,అమావాస్య ప్రభావాలకు ఇది మరొక్క ప్రత్యక్షనిదర్శనం.
read more " డిల్లీలో కూలిపోయిన నాలుగంతస్తుల భవనం-శపితయోగానికి మరో తిరుగులేని తార్కాణం "

27, జూన్ 2014, శుక్రవారం

గెయిల్ గ్యాస్ పైప్ లైన్ అగ్నిప్రమాదం - అమావాస్య ప్రభావానికీ రాహుప్రభావానికీ మరో ఋజువు

ఈరోజు నిండు అమావాస్య.

ఈరోజు తెల్లవారు ఝామున తూర్పుగోదావరి జిల్లా 'నగరం'లో గెయిల్ పైప్ లైన్ బద్దలై అగ్నిప్రమాదం జరిగింది.11 మంది సజీవదహనం అయ్యి నిలువునా కాలిపోయారు.ఇంకొక 15 మందికి తీవ్రంగా ఒళ్ళు కాలిపోతే వారిని ఆస్పత్రికి తరలించారు.

'నగరం' అక్షాంశ రేఖాంశాలు

Longitude: 81E54
Latitude:16N29

గ్యాస్,పెట్రోల్,కెమికల్స్,తదితర ఇంధనాలూ,పేలుడు పదార్ధాలూ మొదలైనవి రాహువు కారకత్వాలని చాలాసార్లు ఇంతకుముందే వ్రాసి ఉన్నాను.ప్రస్తుతం శపితయోగం ప్రజలను వెంటాడుతున్నదనీ వ్రాశాను.అమావాస్య ప్రభావం ఉంటుందనీ ఎన్నోసార్లు చెప్పాను.రాహు కేతువులు రాశులు మారబోతూ చాలా అన్ స్టేబుల్ గా ఉన్నారనీ వారి ప్రభావాలు దారుణంగా ఉంటాయనీ వ్రాస్తూనే ఉన్నాను.

ఇప్పుడు మన కళ్ళముందే ఈ దారుణ సంఘటన జరిగింది.

నేను వ్రాస్తున్నవి నిజాలే అనడానికి ఇంతకంటే మళ్ళీమళ్ళీ ఋజువులు అవసరం లేదు.

నిన్నటి కుండలికీ ఈరోజు కుండలికీ స్థూలంగా పెద్దతేడాలు ఉండవు.కొన్ని కొన్ని పారామీటర్స్ మాత్రం మారుతాయి.అవేమిటో మాత్రమె క్లుప్తంగా చూద్దాం.

ఈరోజు ఆర్ద్రానక్షత్రం నడుస్తున్నది.వింశోత్తరీ విధానం ప్రకారం ఇది రాహువు అధీనంలో ఉంటుంది.ఈ నక్షత్రం ఉదయం 3.45 ప్రాంతం నుంచీ మొదలైంది అన్న విషయం గమనించాలి.రాహుసమయం మొదలుకావడంతోనే ఈ ప్రమాదం జరిగింది.ఇదొక బలీయమైన ఋజువు. 

కుజుడు హస్తా నక్షత్రంలో ఉన్నాడు.అంటే రాహువు ప్రభావం చంద్రునిమీదుగా ప్రయాణించి అంగారకుని కారకత్వాన్ని యాక్టివేట్ చేసింది.బుధుడు మృగశిర నక్షత్రంలో వక్రించి ఉన్నాడు.అంటే అంగారకుని ఆధీనంలో ఉన్నాడు. అగ్ని ప్రమాదాలలోనూ పేలుళ్ళలోనూ అంగారకునికి గల శక్తిని ఇంతకుముందు చాలాసార్లు వివరించాను.

ఉదయం 3.42 నుంచి  4.42 వరకూ కుజహోర ప్రమాదం జరిగిన ప్రాంతంలో నడిచింది.ఇది అగ్నికి ఆజ్యాన్ని తోడుచేసింది.రాహువుయొక్క నక్షత్రమూ కుజుని హోరాసమయమూ ఒకదానికొకటి తోడైతే ఇంకేం జరుగుతుంది? ఏం జరగాలో అదే జరిగింది.

మొన్న కేరళలో ఇడుక్కి ప్రాంతంలో జరిగిన ఘోరమైన కారు ప్రమాదం కూడా ఇదే సమయంలో తెల్లవారుఝామునే జరిగింది.అందులో ఒక కుటుంబంలో ఇద్దరు అక్కడే చనిపోతే ఇద్దరు బయటపడ్డారు.వాళ్ళు ప్రయాణిస్తున్న కారు పట్టుదప్పి 1000 అడుగుల లోతులోకి పడిపోయింది.దానికి పొగమంచు కారణం అన్నారు.పొగమంచు ఒకరకమైన మాయే.కళ్ళముందు ఉన్నదానిని కనపడకుండా అడ్డుకునే ప్రతిదీ మాయ క్రిందికే వస్తుంది.అన్ని మాయలకూ రాహువే కారకుడు.

బీహార్లో రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడమూ తెల్లవారుఝామునే జరిగింది.కనుక తెల్లవారుఝాము సమయంలో రాహువు యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటున్నదని తెలుస్తున్నది.రాహువు సూర్యుడిని మ్రింగుతాడని పురాణవచనం.కనుక సూర్యోదయం కాబోయే ముందు ఉన్న చీకటిని రాహువుగా అనుకోవచ్చు.ఆ చీకటిని చీల్చుకుంటూ సూర్యోదయం జరుగుతుంది.అంటే సూర్యోదయానికి కొన్ని గంటలముందు రాహువు సూర్యుడిని బంధించి ఉండటం అన్న భావన చాలా తార్కికంగా ఉన్నది.అందుకే ఆ సమయంలో రాహువు బలీయంగా ఉంటున్నాడు.అనేక ప్రమాదాలు ఆ సమయంలోనే జరుగుతున్నాయి.

అంతేకాదు.యోగధ్యానాది మార్మికసాధనలు చేసేవారు కూడా ఈ సమయంలోనే వాటిని చెయ్యాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి.మాయను జయించాలంటే దానిప్రభావం గట్టిగా ఉన్న సమయంలోనే దానిని ఎదుర్కోవాలి.బ్రాహ్మీముహూర్తం వెనుక ఉన్న రహస్యం ఇదే.

ప్రమాదం జరిగిన తర్వాత భద్రతాప్రమాణాలు సరిగ్గా లేవని ప్రజలు గోలచెయ్యడమూ వాటిమీద కమీషన్ వెయ్యడమూ అది ఎటు పోతుందో ఏమైపోతుందో తెలీకపోవడమూ మన దేశంలో మామూలే కదా.ముందే ఎందుకు వీటిని చూచుకోరో అర్ధం కాదు.

ఏదేమైనా,నేను కొన్ని నెలలనుంచీ హెచ్చరిస్తున్న శపితయోగమూ రాహుప్రభావమూ కర్మసిద్ధాంతమూ ప్రత్యక్షనిజాలే అనడానికి ప్రతిరోజూ మన కళ్ళముందు జరుగుతున్న ఈ సంఘటనలే నిదర్శనాలు.

కొంతమంది అంటారు.జరిగిన తర్వాత మీరు అన్నీ వ్రాస్తున్నారు.ముందే చెప్పవచ్చు కదా అని.

కోట్లాది మంది జీవితాలలో ప్రతిరోజూ అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి;ప్రతివారికీ బొట్టు పెట్టి చెప్పడం సాధ్యం కాదు.

రాహువు కారకత్వాలు ఏమిటో వ్రాస్తూనే ఉన్నాను.ఆయన అధీనంలో ఏయే పదార్ధాలు ఉంటాయో వ్రాస్తున్నాను.ఆయా పదార్ధాలతో డీల్ చేస్తున్నపుడు ప్రస్తుతం చాలాచాలా జాగ్రత్తగా ఉండాలి అనేదే దీని అర్ధం.ఈ జాగ్రత్త పాటిస్తే ప్రమాదం తప్పుతుంది.లేకుంటే జరుగుతుంది.లక్షలాది జనంమీద స్థూలంగా మాత్రమె చెప్పడానికి వీలవుతుంది.వ్యక్తిగత జాతకాలైతే వ్యక్తిగతంగా చెప్పవచ్చు.అదీ తేడా.

చాలామంది ఇలా అంటారు-'కరెక్ట్ గా ఫలానాచోట ఫలానా సంఘటన ఫలానా నిముషానికి జరుగుతుంది అని చెప్పవచ్చు కదా'- అని.

వీరికి తెలియని రహస్యం ఒకటున్నది.గ్రహాలు మనం అనుకునేటట్లు జడపదార్ధాలు కావు.అవి చైతన్యపు పుంజాలు.అందుకే వాటిని దైవీశక్తులని అంటాము.సైన్సు జీవులు వాటిని మట్టిముద్దలుగా భావించవచ్చు.కానీ మార్మిక యోగదృష్టికి అవి మట్టిముద్దలు కావు.అవి శక్తిస్వరూపాలు. ప్రపంచంలో జడం అనేది ఏదీలేదు.మనం జడం అనుకునేది నిజానికి ఒక చైతన్యపు ఘనీభవరూపం.మనం రాయి అనుకునే దానిలో కూడా ఎంతో ఎటామిక్ ఎనర్జీ ఘనీభవించి బంధింపబడి ఉంటుంది.కనుక అదీ శక్తిస్వరూపమే. 

ఒకచోట గట్టి కర్మానుభవం ఉన్నది అక్కడ ఏదో ఒక తీవ్రమైన ప్రమాదం జరుగబోతున్నది అనుకుందాం.దానిని మనం కనిపెట్టి అడ్డుకుంటే,ఆ శక్తి ఇంకొక రూట్ తీసుకుంటుంది.ఎందుకంటే అది తెలివిలేని శక్తికాదు.ఆ శక్తిని నడిపే ఒక మోటివ్ ఫోర్స్ ఉంటుంది.ఆ ఫోర్స్ ఏం చేస్తుందంటే,మనం అనుకోనివిధంగా ఊహించని విధంగా అది రూట్ మార్చుకుని ఇంకొక రకంగా ఆ ప్రమాదాన్ని జరిపిస్తుంది.దీనిని దృఢకర్మ అంటాము.అంటే ఎంత ప్రయత్నించినా తప్పనిది.

మనకు శక్తి చాలకపోతే,దానిని ఆపుతున్న మనమీద కూడా ఆ శక్తి తిరగబడుతుంది.ఎందుకంటే ఇతరుల కర్మలో మనం చేతులు పెడుతున్నాం గనుక.

'Final destination' అనే ఇంగ్లీష్ సినిమా సీక్వెల్స్ చాలామంది చూచి ఉంటారు.ఆ సినిమాలో ఈ సూత్రాన్నే వాళ్ళు వాడుకుని ఒక సీరియల్ కధగా మలిచారు.అయితే వాళ్లకు 'పరిహార క్రియలు' అనే కాన్సెప్ట్ తెలియదు గనుక దాని జోలికి పోలేదు.

మన భారతీయ జ్యోతిశ్శాస్త్రంలో ఈ కాన్సెప్ట్ ఉన్నది.బలీయమైన కర్మను తుడిచి పెట్టాలంటే దానికి సరిపోయే బలీయమైన పరిహారం చెయ్యాలి.అప్పుడు కర్మను పరిహారం చెయ్యవచ్చు.కాని ఆ అదృష్టం అందరికీ కలగదు.అది ఎవరికి దక్కుతుంది? ఎవరికి అలా పరిహారాలు చేసుకోవడం సాధ్యమౌతుంది? అన్నది పాత పోస్ట్ లలో చర్చించాను.కావలసిన వారు చూడవచ్చు.

ఒక్క విషయం మాత్రం తేటతెల్లంగా రుజువౌతున్నది.మనుష్యుల పైన గ్రహప్రభావం సత్యం.కర్మఫలితాలనేవి సత్యం.వాటిని అనుభవించడమూ సత్యమే.ఈ మహత్తరమైన విజ్ఞానం భారతీయుల సొంతం.దీనిని ఇప్పుడిప్పుడే ప్రపంచం గుర్తిస్తున్నది.మనం మాత్రం ఇంకా మన ప్రాచీనసంపదను గుర్తించకుండా దానిని విమర్శించుకుంటూ కూచుంటున్నాం.

చుట్టూ నీరున్నా తాగేవాడికే అది దాహం తీరుస్తుంది.తాగుదామా వద్దా అని మీనమేషాలు లెక్కిస్తూ కూచుంటే ఈలోపల ఉన్న సమయం కాస్తా గడచిపోతుంది.

ప్రపంచం మొత్తం కర్మబద్ధమై నడుస్తున్నది.కర్మను జయించేవారెవ్వరు? ప్రస్తుత జీవనపోరాటంలో అంతటి ఓపిక ఎవరికుంది?
read more " గెయిల్ గ్యాస్ పైప్ లైన్ అగ్నిప్రమాదం - అమావాస్య ప్రభావానికీ రాహుప్రభావానికీ మరో ఋజువు "

26, జూన్ 2014, గురువారం

రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రమాదం-ఒక పరిశీలన




రాహు ప్రభావానికి ఇంకొక తార్కాణం నిన్న జరిగింది.

నిన్న ఉదయం 2.15 కి బీహార్ లోని చాప్రా దగ్గర రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది.12 బోగీలు పట్టాలు తప్పాయి.కొన్నైతే విసిరేసినట్లు చాలా దూరంగా పడిపోయాయి.ఆ విషయాలన్నీ టీవీలలో చూచి ఉంటారు.

ఈ సంఘటనను ఒక్కసారి విశ్లేషిద్దాం.
  • లగ్నడిగ్రీ మేషం 26.భరణీనక్షత్రంలో నిలిచి ఉన్నది.భరణికి అధిష్టానదేవత యమధర్మరాజు అని మనకు తెలుసు.మృత్యుకారక నక్షత్రంలో ఇలాంటి సంఘటన జరగటం కాకతాళీయం ఏమీ కాదు.
  • లగ్నం కేతువుతో కలసి ఉన్నది.ఆ కేతువు 0 డిగ్రీలలో రాశి మారబోతూ చాలా చికాకుగా ఉన్నాడు.రాహుకేతు ప్రభావాలవల్ల ప్రమాదాలు జరుగబోతున్నాయని అనుకుంటూనే ఉన్నాం. కేతులగ్నం లోనే ఈ ప్రమాదం జరగడం కూడా కాకతాళీయం కాదు.
  • లగ్నాధిపతి అంగారకుడు షష్ఠంలో శత్రుస్థానంలో ఉన్నాడు.ప్రమాదాలలో అంగారకుని పాత్ర గురించి ఇప్పటికి ఎన్నో పోస్ట్ లలో వ్రాశాను.దానికి అనుగుణంగానే ఇది కూడా జరగడం చూడవచ్చు.
  • అంత్యరాశి అయిన మీనంలో ఉన్న అకస్మాత్తు సంఘటనలకు కారకుడైన యురేనస్ అంగారకునితో ఖచ్చితమైన సమసప్తక దృష్టిలో ఉన్నాడు.ఇది చాలా ముఖ్యమైన యోగం.అకస్మాత్తుగా జరిగే సంఘటనలలో యురేనస్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది.ఇక్కడ కూడా అది మళ్ళీ ఋజువైంది.
నవాంశ పరిస్థితి చూద్దాం.

  • వాహనకారకుడు శుక్రుడు యురేనస్ తో కలసి ఉన్నాడు.రాశిచక్రంలో అంగారకుని దృష్టి ఉండటం గమనించాలి.కనుక అకస్మాత్తు వాహన ప్రమాదం జరిగింది.
  • శని,కేతువులతో కలసి చంద్రుడు మేషరాశిలో ఉన్నాడు.శనీశ్వరుడు నీచంలో ఉన్నాడు.దీని గురించి ఇక చెప్పనే అక్కర్లేదు.
  • కుజుడు నీచంలో ఉండి ఉచ్ఛగురువుతో కలసి ఉన్నాడు.కనుకనే ప్రమాదపు ఉద్ధృతి తగ్గింది.ఆ బోగీలు విసిరేసినట్లు దూరంగా పడిపోవడం చూస్తె ప్రస్తుత జరిగిన ప్రాణాపాయం చాలా తక్కువ అనే చెప్పాలి.దీనికి గురువు యొక్క కరుణే కారణం.
  • ప్రమాద సమయంలో కుజహోర జరిగింది.ఇంతకంటే ఋజువు ఇంకొకటి అవసరం ఉండదు.ఖచ్చితంగా అంగారకుని అధీనంలో ఉన్న సమయంలోనే ప్రమాదం జరగడం గమనార్హం.కొన్ని కొన్ని సమయాలు కొన్ని గ్రహాల అధీనంలో ఉంటాయన్నది నిజమే అని ఇది ఋజువు చేస్తున్నది.
తిధి:- కృష్ణత్రయోదశి.
ఒక్కరోజులో అమావాస్య రాబోతున్నది.అమావాస్య ప్రభావం గురించి నేను లెక్కలేనన్ని పాత పోస్ట్ లలో వ్రాశాను.హెచ్చరిస్తూ వస్తున్నాను.మళ్ళీమళ్ళీ ఇది నిజం అవుతూ వస్తున్నది.ఈ సారి కూడా మళ్ళీ నిజమైంది. కావలసిన వారు ఒక్కసారి పాత పోస్ట్ లు తిరగెయ్యండి.

చతుర్దంలో గురువు ఉచ్చంలో ఉండటమూ,ఆరూడలగ్నం నుంచి శుక్రుడు స్వక్షేత్రంలో వాహనస్థానంలో ఉండటమూ ఈ ప్రమాదంలో ప్రాణనష్టాన్ని చాలావరకూ తగ్గించాయి.లేకుంటే రాజధాని ఎక్స్ ప్రెస్ పోతున్న వేగానికీ ప్రమాదం జరిగిన ధాటికీ ఇంకా ఎందఱో చనిపోయి ఉండాలి.

గురువు అనుగ్రహం ఈ విధంగా ఎన్నో ప్రాణాలను రక్షించింది.

కాని ఈ విషయం ఎందరు గ్రహిస్తారు?ఎందరు దైవానికి కృతజ్ఞతలు తెలుపు కుంటారు?ఎందరు బుద్ధి తెచ్చుకుని ధర్మానికి కట్టుబడి జీవించడం ప్రారంభిస్తారు?ఎందరు తమను తాము మార్చుకుని అహంకారం తగ్గించుకుని ధర్మపు నీడలోకి వస్తారు?అందరూ రకరకాలైన అహంకారాలతో విర్రవీగేవారే గాని వాస్తవాలను గ్రహించేవారు ఎందరున్నారు? 

అన్నీ శేషప్రశ్నలే.అందుకేనేమో శేషుని ప్రతిరూపం అయిన రాహువు ఈ రకంగా కర్మక్షాళనం గావిస్తున్నాడు.ఇదొక్కటే కాదు.ప్రతిరోజూ అనేక రకాలుగా ఈ ప్రక్షాళన సాగుతున్నది.చూద్దాం ఇంకా ఎన్ని ఉన్నాయో??
read more " రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రమాదం-ఒక పరిశీలన "

25, జూన్ 2014, బుధవారం

రాహుప్రభావాలు -- నిత్యజీవితంలో నుంచి కొన్ని ఉదాహరణలు

ప్రస్తుతం రాహుశనుల మీద గురువుగారి కంట్రోల్ పోయింది గనుక రాహువు ప్రజలమీద రకరకాలుగా బాగా విజృంభిస్తున్నాడు.ఈ విషయం మొన్ననే హెచ్చరించాను.

కాని రాహువుయొక్క ఆయాచర్యలు మామూలుగా కేజువల్ దృష్టితో చూస్తే అర్ధంకావు.వాటిని అర్ధం చేసుకోవాలంటే లోతైన మార్మికదృష్టి ఉండాలి.

ప్రస్తుతం ఎన్ని రకాలుగా రాహువు యొక్క చర్యలు జరుగుతున్నాయో అర్ధం చేసుకునే దిశగా కొన్ని ఉదాహరణలు మాత్రం గమనిద్దాం.

ఒకటి

మొదటగా గుంటూరు విజయవాడ మధ్యలో ఈమధ్య జరిగిన యాసిడ్ ట్యాంకర్ రోడ్డు ప్రమాదం గురించి చూద్దాం.ఇది చాలా విచిత్రమైన ప్రమాదం.

ఒక పెళ్ళికి అటెండ్ అయిన కొందరు విజయవాడకు పోదామని బయలుదేరారు.ఒక క్వాలిస్ ఖాళీగా ఉంటె అదెక్కారు.వీళ్ళకు కర్మానుభవ సమయం దగ్గరపడింది.ఆ డ్రైవర్ మీద రాహుప్రభావం విపరీతంగా ఆవహించింది.విపరీతమైన స్పీడుతో కారు తోలడం మొదలుపెట్టాడు.లోపల కూచున్నవారికి పైప్రాణాలు పైనే పోయినంత భయం పుట్టింది.

'బాబూ!!ఇంత స్పీడ్ పోవద్దు.తగ్గించు.లేదంటే మేము దిగిపోతాము'- అని వాళ్ళు ఎంత మొత్తుకుంటున్నా వినకుండా విపరీతమైన స్పీడ్ తో పోనిచ్చి తమకంటే ముందుపోతున్న ఒక యాసిడ్ ట్యాంకర్ ను వెనకనుంచి గుద్దేశాడు.ఆ ట్యాంకర్ వెనుక భాగంలో ఈ కారు ఇరుక్కుంది.ఆ ధాటికి యాసిడ్ ట్యాంక్ మూత తెరుచుకుని కారులోని వారికి యాసిడ్ తో అభిషేకం జరగడం మొదలైంది.అలా యాసిడ్ తో కారునూ అందులోని మనుషులనూ అభిషేకం చేసుకుంటూ కారును మూడు కిలోమీటర్లు లాక్కెళ్ళింది ట్యాంకర్. కారులో ఒకామె అక్కడికక్కడే కారులోనే చనిపోయింది.మిగతావాళ్ళకు తీవ్ర యాసిడ్ గాయాలయ్యి ఒళ్లంతా కాలిపోయింది.అలా కాలిపోతూ హాహాకారాలు చేస్తూ మూడుకిలోమీటర్లు ట్యాంకర్ తో లాగబడుతూ ప్రయాణం చేశారు. చివరకు యాసిడ్ తో ఒళ్ళు కాలిపోయి రోడ్డుమీద పడి బాధతో కేకలు పెడుతూ ఉంటె చాలాసేపటి వరకూ వారిని పట్టించుకున్న నాధుడు లేడు.ఇది జరిగి రెండురోజులయ్యింది.

ఇదెంత విచిత్రమైన సంఘటనో గమనించండి.

యాసిడ్ కు రాహువు కారకుడు అన్న విషయం జ్యోతిష్య విద్యార్ధులకు సుపరిచితమే.రోడ్డు ప్రయాణాలకూ ప్రమాదాలకూ కూడా ఆయనే కారకుడని మళ్ళీ చెప్పనక్కరలేదు.కీటకాలకూ సర్పాలకూ ఇతర పాకే జంతువులకూ రాహువే అధిష్టాన దేవత అని జ్యోతిష్య ప్రామాణిక గ్రంధాలు అంటాయి.

ఒక్కసారి భూమిని వదలి ఆకాశంలో మేఘాలవరకూ వెళ్లి చూద్దాం. అక్కడనుంచి క్రిందికి చూస్తె,భూమిమీద పోతున్న కార్లు అన్నీ పాకుతున్న చిన్నచిన్న పురుగులలాగా కనిపిస్తాయి.రైళ్ళు అన్నీ చిన్నచిన్న పాముల లాగా కనిపిస్తాయి.కనుకనే వీటిమీద రాహువు ప్రభావం అమితంగా ఉంటుంది. దీనిని మార్మిక పరిభాషలో 'లా ఆఫ్ సిగ్నేచర్' అంటారు.ప్రామాణిక గ్రంధాలలో గ్రహకారకత్వాలన్నీ ఈ సూత్రం ఆధారంగానే నిర్ణయించబడ్డాయి.

భిన్నధ్రువాల మధ్యన ఆకర్షణ ఉంటుంది.అలాగే ఒకే రకమైన ధ్రువాలు ఒక్కచోటికి చేరడమూ కరెక్టే.మార్మిక విషయాలలో ఈ రెండుసూత్రాలూ వర్తిస్తాయి.ఎక్కడ ఏ సందర్భంలో ఏసూత్రం ఎలా వర్తిస్తున్నదో సూక్ష్మంగా గమనించి గ్రహించాలి.

రెండు

ఇకపోతే మొన్న జరిగిన కలకత్తా మెట్రో రైల్వే ప్రమాదం చూద్దాం.

కలకత్తా మెట్రో రైల్వేలోని సొరంగంలో మెట్రో ట్రెయిన్ చాలాసేపు నిలిచి పోయింది.ఊపిరాడక,బయటకు రాలేక ప్రయాణీకులు నానా నరకం అనుభవించారు. చివరకు వారిని నిచ్చెనల మీదుగా బయటకు లాగారు.

పాము అనే జీవి నేలలో ఉన్న సొరంగాలలో బొరియలలో తిరుగుతుంది. మెట్రోరైలు కూడా ఒకరకంగా నేలబొరియలలో తిరిగే పామువంటిదే. రాహువు యొక్క రూపం సర్పమే.కనుక మొన్న జరిగిన మెట్రోరైలు ఘటన కూడా రాహుప్రభావమే అనడానికి సంశయం అక్కర్లేదు.ఆరకంగా భూసొరంగంలో బంధించి జనాన్ని రాహువు హింస పెట్టాడు.

రాహువు హింసపెట్టాడు అనడంకంటే,చేసుకున్న పాపాలకుగాను ఎవరి ఖర్మను వారు అనుభవించారు అనడం సబబుగా ఉంటుంది.గ్రహాలు దైవ స్వరూపాలనీ వాటిని ఎగతాళిగా సంబోధించడం,ఎకసెక్కాలు చెయ్యడంవల్ల, వాటి కోపానికీ చెడుప్రభావానికి తీవ్రంగా గురికావలసి ఉంటుందనీ ఇంతకు ముందు ఎప్పుడో వ్రాసిన పోస్ట్ లో ఒకసారి హెచ్చరించాను.

మూడు

ఋతుపవనాలు వెనక్కు పోవడం కూడా రాహుప్రభావమే.

వస్తున్నాయి వస్తున్నాయి అనుకున్న ఋతుపవనాలు ఎక్కడా పత్తా లేకుండా వెనక్కు పారిపోతున్నాయి.ఎండలు మండిపోతూ,మళ్ళీ రోహిణీకార్తె వచ్చిందా అనిపిస్తూ ప్రతిరోజూ ఎంతోమంది వడదెబ్బ తగిలి చనిపోతున్నారు.

ఇది కూడా రాహుప్రభావమే అని నేనంటాను.

ఇదెలా సాధ్యమో చూద్దాం.

'ఎల్ నినో' అంటే ఏమిటో ఆ టెక్నికాలిటీస్ ఏమిటో నేనిక్కడ వివరించబోవడం లేదు.క్లుప్తంగా చెప్పాలంటే --'సముద్రం మీదనుంచి వీచే వేడిగాలుల వల్ల భూమిపైన చాలామార్పులు కలుగుతాయి'-- అనుకోవచ్చు.దీని ప్రభావంవల్ల మనకు ప్రస్తుతం రావలసిన ఋతుపవనాలు వెనక్కు పోతున్నాయి.లేదా న్యూట్రలైజ్ అయిపోతున్నాయి.

ఇక్కడ ఒకసారి రామాయణంలోకి తొంగిచూద్దాం.

హనుమంతుడు సముద్రాన్ని దాటే సమయంలో ఆయన నీడను పట్టుకుని క్రిందకు లాగాలని ఒక శక్తి ప్రయత్నిస్తుంది.దాని పేరు 'సింహిక'.అది 'రాహువు'కు తల్లి అని రామాయణం అంటుంది.రాహువుకు 'సైంహికేయుడు' అని నామాంతరం ఉన్నది.సముద్రం మీద ప్రయాణించే వాటిని అది అరికట్టి క్రిందకులాగి స్వాహా చేసేస్తూ ఉంటుంది.అయితే హనుమంతుడి ముందు దాని శక్తి సరిపోదు.ఆయన దానిని సునాయాసంగా ఓడించి ముందుకు సాగిపోతాడు.అందుకే రాహువు యొక్క దుష్ప్రభావాలనుంచి తప్పుకోవడానికి హనుమంతుడిని పూజించాలి.

మనం ఇప్పుడు 'ఎల్ నినో' అంటున్నదానినే వాల్మీకి 'సింహిక' అన్నాడు. పూర్తిగా అదే ఇది కాకపోవచ్చు.కాని రెండూ సముద్రప్రభావాలే.దగ్గరదగ్గరగా రెండూ ఒక రకమైనవే.

అప్పుడు ముందుకు వెళుతున్న హనుమంతుడిని క్రిందకు లాగాలని ప్రయత్నించింది సింహిక.ఇప్పుడు ముందుకు వెళుతున్న ఋతుపవనాలను వెనక్కు లాగేసింది 'ఎల్ నినో ఎఫెక్ట్'.ఇది రాహుప్రభావమే అంటే ఇప్పుడు ఒప్పుకుంటారా మరి??

ఆమధ్యన మాయమైన మలేషియా విమానం కూడా శపితయోగం మంచి పట్టుమీద ఉన్నపుడే మాయమై ఇంతవరకూ కనిపించకుండా పోయింది.ఇది గమనార్హం.

ఒక్కసారి పక్కన ఉన్న బొమ్మను చూడండి.Wet and warm packet ను మింగుతున్నట్లుగా Dry warm packet సర్పాకారంలో ఉండటం స్పష్టంగా చూడవచ్చు.ఇక్కడ రాహువు మనకు స్పష్టంగా దర్శనం ఇస్తున్నాడు.ఈ కోణంలో చూస్తే, ఇప్పుడు చదువరులకు విషయం కొంత అర్ధం అయిందనుకుంటాను.

కనుక ప్రస్తుతం మండే ఎండలకూ,వడదెబ్బతో ప్రతిరోజూ పోయే ప్రాణాలకూ కూడా  రాహువే కారణం అయ్యాడు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయాలు చాలా విచిత్రంగా సూక్ష్మంగా ఉంటాయి.వాటిని చూచే దృష్టితో చూస్తేనే అవి అర్ధం అవుతాయి. ఆషామాషీగా పైపైన చూస్తే అవి అర్ధంకావు.రాహుప్రభావం చిత్రవిచిత్రాలతో కూడి ఉంటుందని ఇంతకు ముందే వ్రాశాను.రాహువుకు 'మాయావి' అని ఒక పేరున్నది.దీనిని మనం జాగ్రత్తగా గమనించాలి.

రాహువు యొక్క విచిత్రమైన ప్రభావాలు ఎలా ఉంటాయో కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇక్కడ వివరించాను.అవి ఇంకా ఎన్నో రకాలుగా ఉంటాయి.ఎక్కడికక్కడే ప్రత్యేకంగా ఉంటాయి.ప్రతి సంఘటనా విభిన్నంగా ఉంటుంది.కర్మనుంచి తప్పుకోవడానికి మనిషి అతితెలివితో తీసుకునే జాగ్రత్తలను రాహువు చాలా తేలికగా ఇంకా తెలివిగా అధిగమించగలడు.ఆ వరం ఆయనకు దైవం చేతనే ఇవ్వబడింది.

రాబోయే రోజులలో ఇంకా ఎన్నెన్ని చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుతాయో, ప్రజలకు వారివారి కర్మక్షాళనం ఎలా జరుగుతుందో,శపితయోగం ఇంకా ఎన్నిరకాలుగా జనులను కాటేస్తుందో వేచిచూద్దాం.
read more " రాహుప్రభావాలు -- నిత్యజీవితంలో నుంచి కొన్ని ఉదాహరణలు "

23, జూన్ 2014, సోమవారం

ఆనంద నాట్యం




ప్రకృతి మొత్తం 
ఆనందనాట్యం చేస్తోంది 
తన హృదిలో ఉన్న ప్రియునిమోమును 
తదేకంగా చూస్తోంది 

యుగయుగాల ఆటల్లో  
చిలిపి దాగుడుమూతల్లో 
చిప్పిల్లిన ఆనందం 
లోకంగా మారింది 

ప్రియునిగా ఉన్న తాను 
ప్రేయసిగా మారింది 
తిరిగి ప్రియుని వెదుకుతోంది 
వింతైన ఆటలలో వినోదాన్ని పొందుతోంది 

ఆటకోసం ఈ జాలం 
సమస్తం సృష్టించింది 
ఆట జోరుగా సాగుతోంది 
ఆనందం వెదజల్లుతోంది 

తెలియని వారికి వెలుగులూ చీకట్లు 
తెలిసినవారికి రెండూ ఒకటే
రెంటినీ మించిన రెండూ తానైన 
వెలుగు కానట్టి ఒక వింతవెలుగు 

ఎగిరే గాలిపటాలలో 
ఏదో ఒకటి తెగిపోతోంది 
విశ్వాంతరాళంలో వేగంగా ఎగురుతోంది 
దారం ఆధారం లేకనే దిక్కులలో విహరిస్తోంది 

క్షణకాలం ప్రియుని కౌగిలిలో 
కళ్ళుమూసి సేదతీరుతుంది 
మరునిముషం ప్రియునితో 
చిలిపి ఆటలాడుతుంది 

ఇంకోక్షణం బుంగమూతితో 
అలిగి దూరంగా పోతుంది 
మరుక్షణం ముద్దు మాటలతో 
ప్రేమగా లాలిస్తుంది 

ఒక నిముషం భక్తిగా సేవిస్తుంది 
మరునిముషం కాలితో తాడిస్తుంది 
చిలిపితనం రూపుదాల్చింది 
ప్రేమహృదయం తనకే ఉంది 

ఏడ్చేవారిని చూస్తూ
ఎక్కువగా నవ్వుతుంది 
నవ్వేవారిని మట్టుకు 
ఏడిపింప చేస్తుంది  

రెండూ సంద్రపు అలలని  
ఎరిగినవారిని మాత్రం 
ఓరకంట చూస్తూ
చిలిపినవ్వు రువ్వుతుంది

ఆట వద్దు పొమ్మంటే 
అమితబాధలు పెడుతుంది 
వాటిలో గెల్చినవారిని  
ఒడిలోనికి లాగుతుంది

తనలా మారినవారిని 
తనతో ఆడనిస్తుంది
వారడిగిన తాయిలం 
ఏదైనా వెంటనే ఇస్తుంది  

ప్రకృతి ఆనందనాట్యం చేస్తోంది
తన ప్రియుని మోమును 
పరవశించి చూస్తోంది...........
read more " ఆనంద నాట్యం "