31, ఆగస్టు 2010, మంగళవారం

జ్యోతిశ్శాస్త్ర ప్రయోజనం -వేదాంత చర్చలు

రోజు సాయంత్రం తమ్ముడు చంద్రశేఖర్ ఢిల్లీనుంచి వచ్చాడు. రాత్రికి హైదరాబాద్ పోయి రేపు ఢిల్లీ వెళతాడు.కనుక మిత్రుడు గిరిజా శంకర్ గారి షాపులో అర్జంటు సమావేశమయ్యాం. మాటల మధ్యలో మంచి ఆధ్యాత్మిక సంభాషణలుజరిగాయి.వాటిలో నుంచి కొన్ని మాటలు.

గిరిజా శంక్రర్ గారు మంచి వేదాంతి. బయటకు కనపడడు కాని మాట్లాడితే ఆణిముత్యాలు దొర్లుతాయి. ఆయన నృశింహానంద భారతీ స్వామి శిష్యుడు. గుంటూరులో నృశింహానంద భారతీస్వాములవారని ఒక స్వామి ఉండేవారు. ఆయన కళ్యాణానంద బారతీస్వామి సాంప్రదాయానికి చెందిన వారు. అచ్చమైన వేదాంతి.అసలైన స్వామి.అంతేగాక మంచి జ్యోతిష్య పండితుడు కూడా.

ఆయన ఒకసారి ఇలా అన్నారట.

జ్యోతిశ్శాస్త్ర ఉపయోగం ఏమిటో తెలుసా? నీ జీవితంలో ముందు ముళ్లదారి ఉందని ఆ శాస్త్రం చెబుతుంది. చీకటిపడబోతున్నదని చెబుతుంది. ఎండ ఎక్కువగా ఉంటుందని చెబుతుంది. నీవు చెప్పులు వేసుకుంటావు.టార్చ్ లైట్దగ్గర పెట్టుకుంటావు. గొడుగు వేసుకుంటావు. అంతే దాని ఉపయోగం. కాని ముళ్ళూ తప్పవు, చీకటీ తప్పదు,ఎండాతప్పదు. ప్రారబ్దాన్ని జ్యోతిష్యం తీసివెయ్యలేదు. కాని జాగ్రత్తపడమని ముందుగా సూచిస్తుంది.

ఆయనను ఒకరు ఇలా అడిగారు.
ప్రశ్న: స్వామీ సన్యాసికి ప్రారబ్దం ఉండదు కదా?
స్వామి: ఎందుకలా అనుకుంటున్నావు?
ప్రశ్న: సన్యాసం అంటే రెండవ జన్మ కదా. అప్పుడు మొదటి జన్మ ప్రారబ్దం నశిస్తుంది కదా అందుకని అలా అడిగాను.
స్వామి: సన్యాసం తీసుకోవడం కూడా ప్రారబ్ద కర్మ ప్రకారమే జరుగుతుంది నాయనా. ఇక ప్రారబ్దం తప్పేదెక్కడ?

ఇంకొక సారి ఒకరు ఇలా అడిగారు:
ప్రశ్న: స్వామీ మీరు దండ కమండలాలు ధరించాలి కదా.వాటిని ఎందుకు వదిలేశారు?
స్వామి: అంటే నేనొక స్వామిని గురువును అని అందరికీ చాటింపు వేసుకోవాలా? ఖర్మ నాకెందుకు. అందుకే వాటినీవిసర్జించాను.

వింటున్న చంద్రశేఖర్ ఇలా అన్నాడు.
రమణమహర్షిని కూడా ఒకాయన ఇలాగే అడిగాడు."స్వామీ మీరు వివాహం ఎందుకు చేసుకోలేదు?" అని.
దానికాయన " అది నా ప్రారబ్దం కాదు కనుక చేసుకోలేదు" అని చెప్పాడు. ఇంకొకాయన అలాగే " స్వామీ మీరుసన్యాసం ఎందుకు తీసుకోలేదు" అని ఆయన్నె అడిగాడు. దానికాయన మళ్లీ అదే సమాధానం చెప్పాడు.

వింటున్న నేనిలా అన్నాను.

ఒకవేళ మహర్షి సన్యాసం తీసుకుని ఉంటె అదే ప్రశ్న అక్కడా ఎదురై ఉండేది. "స్వామీ మీరు ఆత్మ జ్ఞాని కదా మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు. దాని ఆవశ్యకత ఏముంది?" అని. కనుక లోకుల మాటలు పట్టించుకోకుండా మన పని మనం చేయ్యటం ఉత్తమం.

సంభాషణ జప ధ్యానాల వైపు మళ్ళింది.మిత్రుడు గిరిజా శంకర్ చక్కని మాట ఒకటి చెప్పాడు.

కాయిక వాచిక మానసిక అని మూడు చెబుతారు కదా. మనసా వాచా కర్మణా అని కూడా అంటారు. మనిషికి మూడు స్థితులలోనూ ఏదో ఒక ఆధారం కావాలి.

బాహ్యంగా ఏదో ఒక విగ్రహం యొక్క ఆసరా కావాలి. వాక్కుకు స్తోత్రమో మంత్రమో ఏదో ఒకటి ఆసరాగా కావాలి. మనస్సుకు ఏదో ఒక ఆలంబన ధ్యానానికి కావాలి. మూడూ అధిగమిస్తే ఇక నిరాకారమే, నిరాధారమే.అటువంటి వానికి ఆసరా అక్కరలేదు. నిరాకార, నిశ్చల, నిరంజన స్థితి అంటే అదే.

త్యాగరాజు ఒక కీర్తనలో ఇలా అన్నారు. "మనసు స్వాధీనమైన మంత్ర తంత్రములేల?" ఆయన ఇంకా ఇలా అన్నారు."గ్రహబలమేమి రామానుగ్రహ బలముగాని".

ఇలా సంభాషణ చాలాసేపు జరిగింది.

చంద్రశేఖర్ ఇలా అన్నాడు.
అన్నగారూ నాకొకటి అనిపిస్తున్నది. ఆధ్యాత్మికంగా ఒక మనిషి ఎదిగాడా లేదా అని ఎలా చెప్పగలం అని చాలారోజులనుంచి నాకొక సందేహం ఉండేది. మధ్యనే నాకు జవాబు దొరికింది. మనిషికి ఎంతగా దేహస్పృహ (Body identification) తగ్గుతుందో అంతగా ఆధ్యాత్మికంగా ఎదిగినట్లు అని నా భావన. మీరేమంటారు?

నేను నిజమే అన్నట్లు తలాడించాను.

మనిషికి దేహవాసన,లోకవాసన, శాస్త్రవాసన అని మూడు ప్రతిబంధకాలుంటాయి. వీటిని ఎంతగా తగ్గించుకుంటే అంతగా అంతరిక జీవితంలో ముందుకు పోగలుగుతాడు. తన దేహాన్ని, తన చుట్టూ ఉన్న లోకాన్ని, తనదనుకునే జ్ఞానాన్ని మరచిపోగలిగినవాడు నిజంగా మహాత్ముడే. అట్టివాడే ఆత్మజ్ఞుడు.

మళ్లీ కలుద్దామని సమావేశం ముగించాము.
read more " జ్యోతిశ్శాస్త్ర ప్రయోజనం -వేదాంత చర్చలు "

25, ఆగస్టు 2010, బుధవారం

పౌర్ణమి ప్రభావం- విమాన ప్రమాదాలు

నేను ఇంతకు ముందు అనేక పోస్ట్ లలో వ్రాసిన మేదినీ జ్యోతిషసూత్రం మళ్ళీ పనిచేసింది.

నిన్న శ్రావణ పౌర్ణమి.

శుక్ర కుజ గ్రహాలు మళ్లీ డిగ్రీ కంజక్షన్ లో చాలా దగ్గరగా బుధునిదైన కన్యా రాశిలో ఉన్నాయి. శుక్రునకు ఇది నీచ రాశి. గురువూ బుధుడూ వక్ర స్థితిలో ఉన్నారు. బుధుడు, కుజ శుక్రుల కలయిక జరిగిన కన్యారాశికి అధిపతి.

ఈ గ్రహస్థితుల వల్ల ఏం జరిగిందో చూద్దామా?

నిన్న మంగళవారం నాడు విమానాలు కూలి చైనాలో 42 మంది, నేపాల్
లో14 మంది చనిపోయారు. చైనాలోని ఇచువాన్ ప్రావిన్స్ లోనూ నేపాల్లోని ఖాట్మండులోనూ ఆ సమయాలలో రవి హోర జరుగుతున్నది. రవి కేతు నక్షత్రంలో గ్రహణం పట్టి ఉన్నాడు. శని రవియొక్క ఉత్తరా నక్షత్రంలో ఉన్నాడు.

ఈ రోజున మళ్లీ తుఫాన్ వాతావరణాలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి.

కనుక ఈ సూత్రం ఎప్పుడైనా వర్క్ అవుట్ అవుతుంది.

కాని ఏ ప్రదేశంలో ఈ ఘటనలు జరుగుతాయి అనేది ఒక్క విషయం కనుక కనుక్కోగలిగితే అప్పుడు కరెక్ట్ గా చెప్పగలగటం సాధ్యం అవుతుంది. గ్రహాల కో-ఆర్డినేట్స్ కు, ఏ ప్రాంతాల కో ఆర్డినేట్స్ సరిపోతాయో అక్కడ ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఈ దిశలో నేను చేస్తున్న పరిశోధన లో కొన్ని లీడ్స్ ఇప్పటికే నాకు కనిపిస్తున్నాయి. ఇంకొంత కాలం లో ఈ సూత్రాలను కూడా అర్ధం చేసుకోగలం అని గట్టిగా భావిస్తున్నాను.

ఒక్కటి మాత్రం నిజం. గ్రహస్థితులు భూమిమీద., మానవ జీవితాల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఇందులో ఎంతమాత్రం అనుమానం అవసరం లేదు.
read more " పౌర్ణమి ప్రభావం- విమాన ప్రమాదాలు "

21, ఆగస్టు 2010, శనివారం

మా జిల్లెళ్ళమూడి యాత్ర-2

ఏడో మైలురాయి దగ్గర ఆర్చ్ పడిపోయి ఉంది. పనివాళ్లు కొందరు ఆ పనిలో ఉన్నారు. వానపడి ఉందేమో ఆప్రాంతం అంతా బురదగా ఉంది.

"ఆ రోజుల్లో ఇక్కడ రెండు కుక్కలు ఎప్పుడూ కాపలా ఉండెవి అన్నగారూ. వాటి పేరు రాముడు, భీముడు.ఎవరైనా భక్తులుఇక్కడ బస్సుదిగి అర్ధ రాత్రో అపరాత్రో నడుచుకుంటూ జిల్లెళ్లమూడికి వస్తుంటె అవి తోడుగా ఊరివరకూ వచ్చి వారినిదిగబెట్టి మళ్ళీ వెనక్కు వచ్చి ఏడో మైలు రాయివద్ద కాపలాగా ఉండేవి. అవి ఎవరో, ఏ పుణ్య జీవులో, వాటికిఅమ్మకు ఏం బంధం ఉండేదో? వాటి జీవితాంతం అలా భక్తులకు సేవలందించాయి." అన్నాడు చరణ్. చరణ్‍కు ఇలాటి సంఘటనలు ఎన్నో తెలుసు. గంటలు గంటలు అలా చెబుతూనే ఉంటాడు.

నాకు వెంటనే శ్రీరామకృష్ణుని శిష్యుడైన స్వామి అద్భుతానంద జీవితంలో ఒక ఘట్టం మదిలో తళుక్కుమని మెరిసింది. శ్రీరామకృష్ణుల కాలంలో పంచవటి ఒక దట్టమైన అడవి. ఆ అడవి పక్కనే ఆనుకొని గంగానది ప్రవహిస్తూ ఉండేది.అక్కడఉన్న వటవృక్షం దగ్గర రాత్రుళ్ళు ధ్యానం చెయ్యమని శ్రీరామకృష్ణులు తన అంతరంగ శిష్యులను పంపేవారు. ఒక్కొక్కరికిఒక్కొక్క విధమైన ధ్యాన విధానాలు చెప్పి పంపేవారు. స్వామి అద్భుతానంద పేరు అప్పట్లో లాటూ అని ఉండేది. ఒకరోజునలాటూ అర్ధరాత్రి సమయంలో పంచవటిలో వటవృక్షం క్రింద ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. దాదాపు అయిదారు గంటలపాటు అనగా దాదాపుగా తెలతెలవారేవరకు అలా ఆయన ధ్యానంలో ఉన్నాడు. అంతసేపూ ఆయనకు కొద్ది దూరంలోనాలుగు కుక్కలు కాపలాగా మౌనంగా కూర్చోని ఉన్నాయి. అవికూడా ధ్యానంలో ఉన్నట్లు మౌనంగా కిక్కురుమనకుండాఉన్నాయి. శ్రీరామకృష్ణులు అది చూచారు. తెల్లవారిన తరువాత తన ప్రియశిష్యుని ప్రేమగా చూస్తూ, " లాటూకు ధ్యానభంగం కలుగకుండా భైరవుడు కాపలాగా ఉన్నాడు". అన్నారు.పంచవటిలోని వటవృక్షం మీద ఒక భైరవుడుఉండేవాడు. ఆయన దర్శనం తొతాపురికి కలిగింది. దత్తాత్రేయుని కాళ్లవద్ద కూడా నాలుగు కుక్కలుంటాయి. అవి నాలుగు వేదాలని అంటారు.

శరణాగత భావంతో భగవంతుని చేరాలని ప్రయత్నించేవారికి, తీవ్ర ధ్యాన సాధకులకు, ప్రకృతి శక్తులు, జంతువులు, సాయపడటం నిజమే. నా అనుభవంలో ఇది చాలా సార్లు నేనూ గమనించాను.

కారు జిల్లెళ్లమూడిలోకి ప్రవేశించి అమ్మగారి ఇంటి ఆవరణలోకి తిరిగింది. ముఖద్వారం ఆర్చి మీద పేరు చూచి పిల్లలు ఆశ్చర్యపోయారు. కారణం? దానిపైన ఇతర ఆశ్రమాలవలె రకరకాలైన పేరులు లేవు. "అందరిల్లు" అని సింపుల్ గా ఆర్చిమీద వ్రాసి ఉండటమే దానికి కారణం. అలా వ్రాసి ఉందేమిటి అని వారికి సందేహం వచ్చింది. నేను నవ్విఊరుకున్నాను. చరణ్ కూడా మాట్లాడలేదు.

అందరం దిగి ఆశ్రమంలో షెడ్డు దగ్గర ఆగాము. నా చిన్నప్పుడు అమ్మగారి దర్శనం చేసుకున్న రోజు గుర్తొచ్చింది. అదిబహుశా 1976 కావచ్చు. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. కొందరు మా పెద్దవాళ్లతో కలసి అమ్మగారి దర్శనానికి నేనూ వెళ్లాను. అమ్మగారు స్టేజి మీద ఇప్పుడున్న పెద్ద పొటోప్రాంతంలో ఒక పెద్ద కుర్చీలో కూర్చొని ఉన్నారు. దాదాపు ఒక రెండువందలమంది దూరంగా నిలబడి ఉన్నాము.మేమూ వారిలో ఉండి చూస్తున్నాము. మౌనంగా అందరినీ చూస్తున్నారు.ఆ చూపు ఇంకా నాకు గుర్తుంది. పూర్తిగా నిరామయంగా ఉంది ఆ చూపు. ఒక గాలి తెమ్మెర మాదిరి అందరినీ అలా స్పృశిస్తూ వెళ్ళిపోయింది.ఎవరినీ ప్రత్యేకంగా చూస్తున్నట్లుగా లేదు.కాని మా వద్దకు వచ్చినపుడు ఆ దృష్టి ఒక్క సెకను అలా ఆగినట్లు అనిపించింది. అది నా భ్రమ అయి ఉండవచ్చు అనుకున్నాను. 


జిల్లెళ్లమూడిలో అదే ప్రదేశంలో మళ్ళీ నిలబడి చూచాను. అదే సంఘటన నా కళ్లముందు మళ్ళీ ఆవిష్కృతమైంది. అప్పుడు జనంతో కిటకిట లాడేది. ప్రస్తుతం స్టేజి ఖాళీగా ఉంది. జిళ్లెళ్లమూడి కెళితే నన్ను నేను చాలా నిగ్రహించుకోవలసి వస్తుంది. కళ్ళు ధారాపాతం గా వర్షిస్తాయి. ఇది ఎందుకో నాకెప్పుడూ అర్ధంకాదు. చరణ్ పరిస్థితీ అదే. అక్కడి వాళ్లకు ఇలాటి సీన్లు మామూలే గనుక వాళ్లు పట్టించుకోరు.

అవ్యాజమైన మాతృప్రేమ అక్కడ వాతావరణంలో గూడుకట్టుకుని ఉండటం కొద్దిగా సేన్సిటివిటి ఉన్నవాళ్ళకు వెంటనే అనుభవంలోకి వస్తుంది. ఎల్లలు లేని, తప్పులు చూడని, కారణాలు అడగని మహా ప్రేమ అది. ఒక వరద లాగా అది మనల్ని ముంచెత్తుతుంది. జన్మ జన్మల మన తప్పొప్పులు మొత్తం తెలిసి కూడా వాటిని అస్సలు లెక్కించకుండా, పట్టించుకోకుండా అవ్యాజమైన మాతృప్రేమను నిష్కారణంగా మనపైన వర్షిస్తుంది. అటువంటి ప్రేమముందు కరగని రాతిగుండె ఉంటుందా?

"మిమ్మల్నందరినీ నేనే కని మీ తల్లులకు పెంచమని ఇచ్చానురా". అని అమ్మగారు అనేవారు. ఏమి ప్రేమ? అటువంటి ప్రేమతత్వాన్ని మళ్లీ శారదామాతలోనే చూస్తాము. మానవులు, యోగులు, ఋషులు, దేవతలు, పశు పక్ష్యాదులు, కీటకాలతో సహా సర్వంసృష్టి మొత్తం నా సంతానమే అని చెప్పిన ఆ ఆధ్యాత్మిక స్థాయి ప్రపంచమంతా వెతికినా ఇంకెక్కడా కనిపించదు. ఎవరిలోనూ చూడలేము.

ఆ రోజులలో అమ్మగారిని ఒకరు అడిగారట.

అమ్మా నీవు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టికూడా కులాలు పాటించవెందుకూ? అని.

"గుణభేదమే లేని నాకు కులభేదమేమిటి నాన్నా?" అని అమ్మ సమాధానం.

"శుక్ల శోణితాలదే కులమో అందరిదీ అదేకులం" అన్నది అమ్మ. ఇక దానికి జవాబేముంది?

అక్కడకు వచ్చిన వారిలో చాలామంది అమ్మ సమక్షంలోకి రాగానే ధారాపాతంగా ఏడ్చేవారు.అమ్మ మౌనంగా చూస్తూ ఉండేది. "ఎందుకమ్మా వాళ్ళు అలా నిష్కారణంగా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నారు? "అని పక్కన ఉన్నవారు అడిగితే నవ్వి " వాళ్ళు ఏడవటానికే వచ్చారురా ఏడవనివ్వు" అనేది కాని కారణాలు చెప్పేది కాదు.

శ్రీరామకృష్ణుని ప్రత్యక్ష శిష్యులూ నాకు పరమ గురువులూ అయిన స్వామి శివానంద మహరాజ్ గారి జీవితంలో (అప్పట్లో ఆయన పేరు తారక్) ఒకసారి ఇలాటి సన్నివేశం జరిగింది. తారక్ యువకునిగా ఉన్నపుడు శ్రీరామకృష్ణుని సన్నిదికి చేరాడు. వివేకానంద స్వామితో సహా చాలామంది అలాగే వచ్చారు. తారక్ ఒక రోజున పంచవటిలో ధ్యాననిమగ్నుడై ఉన్నాడు.శ్రీరామకృష్ణులు ఆ దారిగా వెళుతూ తారక్ ను చూచి ఆగారు. వెంటనే తారక్‍కు ఒళ్లంతా కరింట్ షాక్ కొట్టినట్లుగా జలదరించి దు:ఖం పొర్లుకొచ్చి ధారగా ఏడుస్తున్నాడు అలా ఒక గంట సేపు గడిచాక శ్రీరామకృష్ణులు మౌనంగా అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ రోజున తారక్‍కు చాలా అగాధమైన ధ్యానస్థితి కలిగింది. తరువాత చాలా సేపటికి ధ్యానం ముగించుకొని తారక్ శ్రీరామకృష్ణుల గదికి వచ్చి నమస్కరించి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు ప్రేమగా ఆయనతో "చూడు తారక్. భగవంతుని స్మరిస్తున్నపుడు, ధ్యానంలోనూ. కన్నీరు ధారగా రావడం చాలా మంచి సూచన. దానివల్ల పూర్వ జన్మల పాపాలు కడిగివేయబడతాయి.అంతరంగం శుద్దమౌతుంది. అటువంటి వారిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తాడు" అన్నారు.

అయితే అది బలవంతాన తెప్పించుకొని ఏడవడం కాకూడదు. కొందరు ఆడవారు ఇలా కూడా చేస్తారు. పాపం అది కూడా మంచిదే.

చైతన్య మహాప్రభు జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆయన భక్తులకు సంకీర్తనా సమయంలో పారవశ్య స్థితులు కలగటం,కళ్లవెంట నీళ్ళు ధారలు కట్టడం, సమాధి నిమగ్నత, దివ్య దర్శనాలు సర్వ సాధారణంగా ఉండేవి. కాని ఒకనికి మాత్రం కనీసం ఏడుపుకూడా వచ్చేది కాదు. అతను సిగ్గుతో "నేనెంత పాపాత్ముణ్ణై ఉండాలి? వీరందరికీ ఇటువంటి స్థితులు కలుగుతున్నాయి. నాకు ఏ అనుభూతీ కలగటం లేదు. ఇటువంటి మహనీయుని సమక్షంలో కూడా కరగని నా గుండె ఎంత రాతిబండో కదా" అనుకుని కన్నీరు రావడం కోసం కళ్లలో కారం పెట్టుకున్నాడు. అది చూచి చైతన్యమహాప్రభు ఆ భక్తుని కౌగలించుకొని "ఈ పని చెయ్యటానికి ఎంతటి మానసిక క్షోభ అనుబవించావో కదా నీవు. భగవంతునిపై నీ కెంతటి ప్రేమ లేకపోతే ఈ పని చేస్తావు?" అంటూ పారవశ్యంలో సమాధి స్థితిని పొందాడు.

ఇలా ఆలోచిస్తూ, ఏదో లోకంలో ఉన్నవాళ్ళలాగా అమ్మ ఆలయానికి దారి తీశాము. నా పరిస్థితి తెలుసు కనుక మా కుటుంబ సభ్యులూ, చరణూ, నన్ను పలుకరించకుండా మౌనంగా వాళ్ల లోకంలో వాళ్ళు ఉన్నారు.

(ఇంకా ఉంది)

read more " మా జిల్లెళ్ళమూడి యాత్ర-2 "

15, ఆగస్టు 2010, ఆదివారం

నిజమైన స్వాతంత్ర్యం

ఈ రోజుతో మనం స్వాతంత్ర్యాన్ని పొంది 63 ఏళ్ళు గడిచాయి. దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది. కాని ఎన్నోరకాలైన ఇతర స్వాతంత్ర్యాలు ఇంకా రాలేదు. ఇది లౌకికజీవిత నిజం.

అంతరిక జీవితంలో కూడా స్వాతంత్ర్యమే అత్యున్నత ఆదర్శం. దీన్నే ముక్తి లేదా మోక్షం అని మన ప్రాచీనులు చెప్పారు. ముక్తి గురించి తెలియాలంటే దేనిచేత బంధింపబడి ఉన్నామో ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే ఆ బంధం నుంచి ముక్తి ఎలా సాధ్యమో తెలుసుకోవచ్చు. దానికి తగిన ప్రయత్నం చెయ్యవచ్చు.

బాహ్యంగా ప్రతివాడూ స్వతంత్రుడననే భావించవచ్చు గాక. కాని అంతరికముగా ప్రతివాడూ బానిసే. అతడు రాజు కావచ్చు. పేద కావచ్చు. విద్యావంతుడు కావచ్చు. నిరక్షరాస్యుడు కావచ్చు. ఉన్నత పదవులలో ఉండి భోగభాగ్యాల మధ్యన విలాస జీవితం గడిపేవాడు కావచ్చు. తిండికి లేక కటిక దరిద్రంలో బతుకు వెళ్ల దీస్తున్నవాడు కావచ్చు. వీరందరూ అంతరిక జీవితంలో కట్టు బానిసలే. గానుగెద్దులకూ వీరికీ ఏమీ భేదం లేదు.

ఏ విధంగా మనం బానిసలమో తెలుసుకుందామా?

మొదటి రకం: మనం ఎదుటివారి ఊహలకు బానిసలం. మన జీవితంలో ఎక్కువభాగం ఎదుటివారిని మెప్పించడానికే సరిపోతున్నది. మనం బట్టలు వేసుకొనేది మన కోసం కాదు. ఎదుటివారు ఏమైనా అనుకుంటారేమో అని మంచి బట్టలు ధరిస్తాం. ఎదుటివారి దృష్టిలో మంచిగా కనపడాలని లేని మంచిని నటిస్తాం. ఎదుటివాని హంగులు చూచి మనకు అవసరం లేకున్నా వాటిని అనుకరిస్తాం. వారివద్ద ఉన్న వస్తువులు మనమూ సంపాదించడానికి అమూల్య జీవితాన్ని, సమయాన్ని ఆహుతి చేసుకుంటాం. వారు అనే ఆహా ఓహో ల కోసం మన అమూల్యమైన జీవితాన్ని వృధా వ్యాపకాలలో వెచ్చిస్తున్నాం. ఎదుటివారికి గొప్ప ఉపన్యాసాలిచ్చి వారి మెచ్చుకోళ్ల కోసం అర్రులు చాస్తూ అదే గొప్ప పాండిత్యం అనుకుంటున్నాం. మనకేమి కావాలో మనకు తెలియదు. మన జీవితం ఎటుపోతున్నదో మనకు తెలియదు. ఎదుటివాని చేతిలో మనం కీలుబొమ్మలం. పరాయివారి మెప్పుకోసం బతికే జీతగాళ్లం. సమాజం చేతిలో మనం కీలుబొమ్మలం. ఇది స్వాతంత్ర్యం ఎలా అవుతుంది?

ఇక రెండవ రకం: మన ఇంద్రియాలకు మనం బానిసలం. పంచేద్రియాలు మన స్వాధీనం లో లేవు. వాటి ఆధీనంలో మనం ఉన్నాం. అవి చెప్పినట్లు మనం ఆడుతున్నాం. ఒక మంచి సుందరమైన దృశ్యమో, మనిషో కనిపిస్తె చూడకుండా ఉండలేం. మంచి మసాలా వాసన వస్తే నోటిలో నీళ్ళు మనకు తెలీకుండానే ఊరుతుంటాయి. ఒక వస్తువు కనిపిస్తే కొనకుండా ఉండలేము. ఆకలిని ఆపుకోలేము, దాహాన్ని ఆపుకోలేము. నిద్రను ఆపుకోలేము, కోరికలను ఆపుకోలేము. ఆవేశాలను ఆపుకోలేము. వెరసి మన ఇంద్రియాలకు మనం బానిసలం. అవి నడిపినట్లు మనం నడుస్తున్నాం. అవి ఈడ్చుకుపోయిన చోటికి మనం పోతున్నాం. ఇది స్వాతంత్ర్యం ఎలా అవుతుంది?

ఇక మూడవ రకం: మన మనస్సుకు మనం బానిసలం. మనస్సు మనం చెప్పినట్లుగా వినదు. అది చెప్పినట్లు మనం ఆడుతున్నాం. ఒక్క క్షణం కదలకుండా ఉండు అంటే ఆ క్షణంలోనే ఎక్కడలేని అనవసర విషయాలన్నీ నాకే కావాలి అంటుంది మనసు. ఆలోచన మనలను లాక్కుపోతున్నది కాని మనం ఆలోచనను నడిపించడం లేదు. మన ఆలోచనలు మన స్వాధీనంలో లేవు. మనసు మన స్వాధీనంలో లేదు. ఇది స్వాతంత్యం ఎలా అవుతుంది?

ఇక నాలుగవ రకం: మన అహానికి మనం బానిసలం. నేను ప్రతివానికన్నా భిన్నంగా కనపడాలి. నేను అందరికంటే అధికుణ్ణి. నేను అందరికంటే ముందుండాలి. నేను చెప్పినట్లు ఇతరులు వినాలి. నా ప్రత్యేకతను నేను కాపాడుకోవాలి. నేను సుఖంగా ఉండాలి. దానికోసం ఎందరు ఏమై పోయినా పరవాలేదు. నా పని నాకు ముఖ్యం. ఇలా నా, నా, నా అనుకుంటూ నా అహానికి నేను బానిసగా మిగులుతున్నాను. నా అహం తృప్తి పడటం కోసం నేను ఏపనైనా చేస్తున్నాను. జీవితమంతా దాస్యం చేయించుకున్న ఈ అహం మరణంలో ఏమౌతుంది. ఎక్కడికి పోతుంది. అన్న ఆలోచన మనకు రాదు. ఒక్కసారిగా పేలిపోయి అదృశ్యమై పోయే ఒక నీటి బుడగకోసం నా జీవితమంతా దానికి దాసోహం అంటూ ఊడిగం చేస్తున్నానా? నన్ను నేను తెలుసుకునే అవకాశం ఇచ్చిన ఈ జన్మను వృధాగా గడిపి పరీక్షలో ఓడిపోయినవానిగా నిష్క్రమిస్తున్నానా? ఏమిటీ విచిత్రం? ఏమిటీ బానిసత్వం? అన్న ఆలోచన మనకు రాదు.

మనకు స్వాతంత్ర్యం వచ్చిందా? ఎక్కడొచ్చింది? రాజకీయ స్వాతంత్ర్యం దేశానికి వచ్చి ఉండవచ్చు. సమాజాన్ని దోచుకునే వారికి వచ్చి ఉండవచ్చు. రాజకీయ స్వాతంత్ర్యం మన ఆశయం కాదు. మన జీవిత గమ్యం ఇది కాదు.

ఎదుటివారికీ, వారి ఆలోచనలకూ, నేను చేస్తున్న ఊడిగం నుంచి బయట పడినప్పుడే అది నిజమైన స్వాతంత్ర్యం.

నా ఆలోచనలకూ, నా అహానికీ కట్టుబడి ఉన్న నా బానిసత్వం నుండి నేను బయటపడి నప్పుడే నిజమైన స్వాతంత్ర్యం.

ఇంద్రియాలకూ, ప్రకృతికీ నేను చేస్తున్న ఊడిగం నుంచి నేను బయటపడినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం.

ఇటువంటి స్వాతంత్ర్యాన్ని పొందటమే ముక్తి, అదే మోక్షం. ఈ ముక్తి అనేది ఎవరినుంచో నాకు వచ్చేది కాదు. నన్నెవరూ బంధించలేదు. ఇది నేను నా చుట్టూ నిర్మించుకున్న బోను. దీనినుంచి నేనే బయట పడాలి. ఇది నానుంచి నాకు మోక్షం. ప్రకృతినుంచి నాకు మోక్షం. జన్మ జన్మల నుంచీ నన్ను వెంటాడుతున్న సంస్కారాలనుంచి, కర్మ బంధాలనుంచి, జనన మరణాలనుంచి నాకు కలిగే మోక్షం.

ఇటువంటి స్వాతంత్ర్యమే యోగులకు అభిమతం. దీనికి తక్కువ దైన ఏ స్వాతంత్ర్యమైనా వారికి అవసరం లేదు. దానిని వారు ఉత్తమమైన స్వాతంత్ర్యంగా పరిగణించరు.

దీనిని పొందాలంటే అచంచలమైన, అకుంఠితమైన దీక్ష కావాలి. సాధన కావాలి. నాయమాత్మా బలహీనేన లభ్య: ఆత్మానుభవం బలహీనులకు లభించదు అన్న ఉపనిషద్వాణి మనలను తట్టి లేపటం లేదా? మన పూర్వీకులైన మహర్షుల ఉత్తేజపూరిత సందేశాన్ని మనం వినలేక పోతున్నామా? చేతకాని వాళ్లలా జీవితాన్ని ముగించడం అభిలషణీయమేనా?

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 63 ఏళ్ళు అయింది అంటున్నాం. ఎన్ని వేల జన్మల నుంచి మన ప్రయాణం సాగుతున్నదో మనకు తెలుసా? ఎన్ని కాలాలలో, ఎన్ని దేశాలలో, ఎన్ని ప్రాంతాలలో, ఎన్ని వేషాలు ఇప్ప’టికి ఈ జీవుడు వేశాడో మనకు తెలుసా? స్వాతంత్ర్యం రాకుండా ఎన్ని వేల సంవత్సరాలు గడిచాయో మనకు జ్ఞాపకం ఉన్నదా?

ఆలోచించండి. మన పూర్వీకులైన మహర్షులు మనలను చూచి ఇటువంటివారా మా వారసులు" అని సిగ్గుపడుతున్నారు గమనించండి. సాధనా పరులు కండి. మహత్తరమైన యోగాన్ని అనుష్టించండి. జన్మ జన్మల కర్మ బందాల నుంచి విముక్తి కలిగించే భరతదేశపు దివ్యసంపద అయిన యోగాన్ని ఈ రోజునుంచే ప్రారంభించండి.

అప్పుడే స్వాతంత్ర్య దినోత్సవం నిజంగా జరుపుకున్నట్లు లెక్క. లేకపోతే అన్ని పార్టీల లాగే ఇదీ ఒక పార్టీ. ఒక గెట్ టుగెదర్. అంతే.

read more " నిజమైన స్వాతంత్ర్యం "

29, జులై 2010, గురువారం

మార్స్ ఎఫెక్ట్

గత వారం రోజులనుంచీ కుజ శనుల మధ్యన దూరం తగ్గుతూ వస్తున్నది. దీనివల్ల అనేక దుస్సంఘటనలు జరుగుతాయి అని ముందే వ్రాశాను. దానికి నిదర్శనంగా వరుసగా రోజుకొక సంఘటనను వింటున్నాం.

నిన్న రాత్రి ముంబైలోని "కుర్లా" లో భవనం కూలి చాలా మంది దానికింద చిక్కుకుపోయారు. ఇదికూడా ముందే వ్రాసినట్లు "మ", "క" అనే అక్షరాలతో మొదలు కావడం గమనార్హం.

అసలు వింత ఇది కాదు. ఇండోనేషియా భూకంపం గాని, మర్గలా కొండల్లో కూలిన విమానం కాని, కుర్లాలో కూలిన భవనం కాని అన్నీ కుజ హోర లోనే జరిగాయి. ప్రతిరోజు ఈ ఒక్క గంట కాలం కుజుని ఆధీనంలో ఉంటుంది. ఆ సమయంలోనే ఈ ప్రమాదాలు జరగటం కూడా గమనించదగిన విషయం.

అంతే కాదు.గత కొద్ది రోజులుగా జరుగుతున్న కుజ శనుల కలయిక వల్ల అనేక మంది జీవితాలలో అనేక బాధలు కలుగుతూ ఉంటాయి. అవి ఈ క్రింది విధంగా ఉండవచ్చు.

౧. అనుకోకుండా వస్తువులు పాడైపోవటం, ముఖ్యంగా వాహనాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, రిపేర్లు రావటం. అనవసరంగా డబ్బు ఖర్చు చేయవలసి రావటం.

౨.యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరగటం. ఈ సందర్భంగా, చిన్న చిన్న దెబ్బలు తగలటం కూడా యాక్సిడెంట్లేనని మరచిపోకండి.


౩.అనుకోకుండా కోపాలు పెరిగి చిన్న విషయానికి ఇతరులతో గొడవలు కావడం. తరువాత బాధ పడటం.


౪. అనారోగ్యాల వల్ల బాధలు రావటం. డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు.


౫. సంతానంతో చికాకులు


ఇవన్నీ కుజ శనుల కలయిక వల్లనే జరుగుతున్నాయి. ఎవరి జీవితాలలో వారు పరిశీలించుకోవచ్చు. తెలివైన వారు రెమెడీస్ పాటించి ఈ బాధలనుంచి విముక్తులు కావచ్చు. ఇదే జ్యోతిర్విజ్ఞానంలోని పరమ ప్రయోజనం.

సూచన: లగ్నము లేదా రాశి కన్యా, కుంభ,మేషములలో ఏదో ఒకటి అయిన వారికి ఈ ఫలితాలు జరుగుతాయి. ఒకటి లగ్నము ఒకటి రాశి అయినవారికి నూటికి నూరుపాళ్ళు జరుగుతాయి. చెడు దశలు జరుగుతున్న వారికి ఈ ఫలితాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని మరచిపోకండి.
read more " మార్స్ ఎఫెక్ట్ "

28, జులై 2010, బుధవారం

పాకిస్తాన్ లో కూలిన విమానం- మళ్ళీ నిజమైన జ్యోతిష్యం

రోజు బహుళ తదియ. అనగా పౌర్ణిమ నుంచి మూడోరోజు.

మొన్నటి పోస్ట్ లో ఇలా వ్రాశాను.

"గురు గ్రహం యొక్క కరుణా దృష్టి వల్ల ఎక్కడా పెద్దగా ప్రాణ నష్టం జరుగలేదు. కాని రోజునుంచి గురువు వక్రిస్తున్నాడు. అనగా రెట్రో మోషన్ లోకి పోతున్నాడు. అంటే రేపటినుంచి ఆయన రక్షణ ఉండదు. కనుక జరుగబోయే నష్టాలు రేపటినుంచి మొదలౌతాయి."

"ముఖ్యంగా జూలై 26 న కుజ శనులు ఒకే నక్షత్ర పాదంలోకి వస్తున్నారు. అనగా నవాంశ చక్రంలో కుంభరాశిలో కలిశి ఉంటారు. 27, 28 తేదీలలో వీరితో కేతువు కూడా కలుస్తున్నాడు.కనుక రేపటినుంచి, 28 తేదీలోపల ప్రమాద సూచక కాలంఅనిపిస్తున్నది."

ఈ రోజు పాకిస్తాన్ లోని మర్గలా కొండలలో ఎయిర్ బ్లూ కంపెనీ విమానం కూలిపోయింది. "పా"కిస్తాన్, "మ"ర్గలా, అనే పదాలు ప, మ అనే అక్షరాలతో మొదలు కావటం గమనించ గలరు.

మొన్న జరిగిన ఎయిర్ క్రాప్ట్ ప్రమాదాలలో పెద్దగా ప్రాణ నష్టం జరుగలేదు. కాని ఈ రోజు జరిగిన ప్రమాదం లో 152 మంది చనిపోయారు. ఒక్కరూ ప్రాణాలతో బతికి బయట పడలేదని అంటున్నారు. దీనికి కారణం 25 వ తేదీ నుంచి ఉపసంహరింపబడిన గురుగ్రహ అనుగ్రహమే.

వేద సమ్మతమైన జ్యోతిష్య జ్ఞానం అమోఘమైనది. దీనిలో ఇంకా రీసెర్చ్ జరిగాల్సి ఉన్నది. అదే జరిగితే ఖచ్చితంగా తేదీ,సమయం,ప్రదేశంతో సహా జరుగబోయే సంఘటనలు తెలుసుకోవచ్చు. దానికి సమయాన్ని వనరుల్ని వెచ్చించగల ఔత్సాహికులు కావాలి.

రీసెర్చ్ లో సహకరించడానికి ఎవరన్నా ముందుకొస్తున్నారా?
read more " పాకిస్తాన్ లో కూలిన విమానం- మళ్ళీ నిజమైన జ్యోతిష్యం "

26, జులై 2010, సోమవారం

"పంచవటి"- కొత్త గ్రూప్ మొదలైంది

మిత్రులారా.
"పంచవటి" పేరుతో కొత్త గ్రూప్ మొదలైంది. అదికూడా భారతజాతికి పరమగురువైన వ్యాసభగవానుని ఆరాధనా పుణ్యదినం అయిన గురుపూర్ణిమ (25-7-2010) రోజునే.

అనేకమంది మిత్రులు చాలా పేర్లు సూచించారు. అవన్నీ వాటి వాటి కోణాలలో బాగానే ఉన్నాయి. కాని మనం ఈ గ్రూపులో చర్చించబోయే విషయాలన్నిటినీ అవి ప్రతిబింబించటానికి వీలుగా ర్రూప్ పేరును "పంచవటి" అని పెట్టాను.

పంచవటి మహా పుణ్య స్థలి. శ్రీరామకృష్ణుని దివ్యసాధనలకు, దివ్యానుభవాలకు అది వేదిక, మౌన సాక్షి. అక్కడ సమస్త మతాలూ, యోగాలూ,తంత్రాలూ, సాధనా విధానాలూ సామరస్యంగా మిళితమైనాయి. అలౌకికానుభవాలు ఆవిష్కరించబడ్డాయి. అతీత శక్తులు దిగివచ్చి దర్శనమిచ్చాయి. అద్భుతాలు రోజువారీ సంఘటనల లాగా జరిగాయి. వివేకానందునివంటి మహనీయులు అక్కడనే రూపుదిద్దుకున్నారు.

అంతేకాక, నాకు ప్రవేశం ఉన్న అన్ని విద్యలను అయిదు ముఖ్యమైన శాఖలక్రింద అమర్చవచ్చు. ఆ విధంగా చూచినా పంచవటి అన్న పేరు బాగుంది. చాలామంది శ్రీవిద్య అనే పేరు బాగుందన్నారు. శ్రీ అనునది బ్రహ్మ వాచకము. శ్రీవిద్య అనగా బ్రహ్మ విద్య అని వేదము అర్ధం చెప్పింది. తంత్ర సాంప్రదాయం లో శ్రీవిద్యను స్వతంత్ర తంత్రము అని అంటారు. తంత్ర మార్గంలో శ్రీవిద్య అత్యున్నతమైనది. ఆ పేరు నాకు స్వతహాగా బాగా ఇష్టమే అయినప్పటికీ, నేను శ్రీవిద్యోపాసకుడనే అయినప్పటికీ, మన గ్రూపు లో చర్చించబడే విశయాల దృష్ట్యా ఆ పేరు సరిపోదని నాకనిపించింది. కనుక ఆ పేరును పక్కన ఉంచాను. "పంచవటి" అనే పేరును ఖాయం చేశాను.

నా భావాలు నచ్చినవారికి, నాతో రెగులర్ గా కాంటాక్ట్ లో ఉన్నవారికి ఇన్విటేషన్ పంపుతున్నాను. జాయిన్ కాగలరు. ఇతరులెవరైనా జాయిన్ కాగోరితే, నాకు ఈ మెయిల్ చెయ్యండి. వారికీ స్వాగతం చెబుతాను.
read more " "పంచవటి"- కొత్త గ్రూప్ మొదలైంది "

25, జులై 2010, ఆదివారం

ఇండోనేషియా భూకంపం-మళ్ళీ నిజమైన జ్యోతిష్యం

జ్యోతిష్య విద్య యొక్క మహాత్యం మళ్ళీ నిజమైంది. ఇది దైవిక మైన విద్య కనుక ఎన్ని సార్లైనా ఋజువౌతూనే ఉంటుంది. కళ్ళున్నవారు చూడవచ్చు.

మొన్న 20 వ తేదీన కన్యా రాశిలో జరుగబోతున్న కుజ శనుల యుతిని గురించి వ్రాస్తూ ఇలా వ్రాశాను.

కనుక తూర్పు దక్షిణ దిక్కులలోనూ, ఇవి రెండూ కలిసిన ఆగ్నేయ దిక్కులోనూ, లేక దక్షిణ పశ్చిమ దిక్కులు కలిసే నైరృతి దిక్కులోనూ భూ ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, భూకంపాలు,అగ్ని ప్రమాదాలు జరుగవచ్చు. ఇండోనేషియా, అండమాన్, భారత తూర్పు తీరం వెంబడి ఉన్న భూకంప ప్రభావిత ప్రమాద స్థలాలు మళ్లీ జాగృతం కావచ్చు.

ఏం జరిగిందో చూడండి.

ఈ రోజు గురుపౌర్ణిమ. నిన్న శనివారం ఉదయం ఇండోనేషియాలో, ఫిలిప్పైన్స్ లో పలుమార్లు భూకంపం వచ్చింది. రెచ్టర్ స్కేల్ మీద 7 పాయింట్లు నమోదైంది. అంతర్జాతీయ న్యూస్ లో ఈ విషయం చూడవచ్చు. ఈ విషయాన్ని జ్యోతిష్య విద్య అయిదురోజుల ముందే చెప్పగలిగింది.

అంతే కాదు. మిత్రులు జయదేవ్ గారు ఆ పోస్ట్ కు కామెంట్స్ వ్రాస్తూ ఇలా అన్నారు.

SANI RULES AIR,MARS RULES HIGH SPEED VEHICLES...SO DUE TO THIS Major FLIGHT/SPACE/CYCLONIC EVENTS ALSO WILL NoT B RULED OUT SARMA garu.

జయదేవ గారి ప్రిడిక్షన్ నూటికి నూరు పాళ్ళు నిజమైంది. నిన్న రెండు విమానాలు కూలిపోయాయి. ఒకటి కెనడాలో పైలట్ జెట్ విమానం .ఇంకొకటి బెంగాల్లో మిగ్-27. సైక్లోన్ వాతావరణం వచ్చేసింది. మన కళ్ళ ముందే ఇవన్నీ చూస్తున్నాం.

ఈ ప్రిడిక్షన్స్ నిజం కావటం ఒక అద్భుతం గా నేను భావిస్తున్నాను. కోట్లాది రూపాయల ఖర్చుతో నడుస్తున్న మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కాని, సీస్మోలాజికల్ డిపార్ట్మెంట్ కాని ఈ విషయాలను కనిపెట్టలేక పోయాయి. జ్యోతిర్విద్య యొక్క గొప్పదనాన్ని గురించి ఇంతకన్నా ఋజువు ఇంకేం కావాలి?

గురు గ్రహం యొక్క కరుణా దృష్టి వల్ల ఎక్కడా పెద్దగా ప్రాణ నష్టం జరుగలేదు. కాని ఈ రోజునుంచి గురువు వక్రిస్తున్నాడు. అనగా రెట్రో మోషన్ లోకి పోతున్నాడు. అంటే రేపటినుంచి ఆయన రక్షణ ఉండదు. కనుక జరుగబోయే నష్టాలు రేపటినుంచి మొదలౌతాయి.

జ్యోతిష్యం వ్యక్తిగత విషయాలనే కాదు, దేశాలకు సంబంధించిన విషయాలు కూడా చెప్పగలదు. దీనిలో గట్టి రీసెర్చ్ జరిగితే ఖచ్చితంగా దుర్ఘటనలు జరుగబోయే ప్రదేశం సమయం చెప్పవచ్చు. దీనిద్వారా నష్టం నివారించవచ్చు.

నిన్న శనివారం. శనిహోర లో, కుజ హోరలలోనే భూకంపాలు జరిగాయి. కుజ శనుల ప్రభావం వల్లనే ఇవి జరిగాయని ఇంతకన్నా ఋజువులు ఇంకా ఏమి కావాలి?

ఇంకా విచిత్రాలు చూడాలని ఉందా? అయితే వినండి. మొన్నటి పోస్ట్ లో ఇలా వ్రాశాను.

ప్రమాదాలు జరిగే ప్రదేశాలు,వాహనాలు etc, , , , , అనే అక్షరాలతో మొదలౌతాయి లేదా ఈ అక్షరాలతో సంబంధం కలిగి ఉంటాయి. వ్యక్తులలో కూడా ఆ అక్షరాలతో మొదలయ్యే పేర్లు గలవారికి (ముద్దుపేర్లకు కూడా) ఎక్కువగా ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీరిలో కన్యా లగ్నం గాని, కన్యా రాశిగాని ఉన్నవారికి ఈ సరికే ఫలితాలు కనిపించడం మొదలయ్యి ఉంటుంది

ఏం జరుగుతున్నదో చూద్దామా? కెనడా విమాన ప్రమాదం లో తృటిలో తప్పించుకున్న పైలట్ పేరు బ్రియాన్ బూస్, మన దేశమ్ లో కూలిన మిగ్ విమానం బెంగాల్ లో బొత్ పుతి అని గ్రామం లో కూలింది.

భూకంపాలు వచ్చిన ప్రదేశాల పేర్లు చూద్దామా? ఫిలిప్పైన్స్ లొ మిండోనా ద్వీపం లోని కొటాబాబో అనే ఫ్రదేశం లో భూకంపం వచ్చింది.

ఆ అక్షరాలతో మొదలయ్యె పేర్లు ఉన్న అనేక మంది మిత్రుల జీవితాలలో గత వారం నుంచి అనారోగ్యాలు, చికాకులు, అనవసర గొడవలు మొదలయ్యాయని నాకు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ఇంతకంటే రుజువులు ఇంకేం కావాలి?

విమాన ప్రమాదాల గురించి, సైక్లోన్ గురించి కరెక్ట్ గా చెప్పిన మిత్రులు జయదేవ గారికి నా అభినందనలు. జయదేవ్ గారు. మనకు ఒకరి పొగడ్తలు అవసరం లేదు. ఆత్మ తృప్తి చాలు.

కొత్తగా మొదలయ్యే గ్రూపులో ఇటువంటి చర్చలు ముమ్మరంగా జరిగి ఇంకా విలువైన అనేక విషయాలు వెలుగు చూడాలని ఆశిస్తున్నాను.
read more " ఇండోనేషియా భూకంపం-మళ్ళీ నిజమైన జ్యోతిష్యం "

24, జులై 2010, శనివారం

త్వరలో మొదలయ్యే గ్రూప్ కు పేరు పెట్టండి

నా బ్లాగు సభ్యులు చాలామంది వారివారి జాతక సమస్యలతో నన్ను సంప్రదిస్తున్నారు. కాని వాటిని బ్లాగు ముఖంగా చర్చించటం భావ్యంకాదు. పర్సనల్ విషయాలు అందరికీ తెలియటం వారికి బాధ కలిగిస్తుంది కనుక బ్లాగులో వాటిని చర్చకు పెట్టరాదు. ఇంకా కొంతమంది, తంత్ర శాస్త్రం మొదలైన రహస్య విషయాలలో నిజమైన ఆసక్తి ఉన్నవారున్నారు. వారు బ్లాగు ముఖంగా ఆ విషయాలను అడగలేకపోతున్నారు. అడిగినా వాటికి బాహాటంగా బదులివ్వలేను.

ఇంకొక్క విషయం. జ్యోతిషవిద్య కంటే నాకు ఇంకా బాగా ఇష్టమైన తంత్ర శాస్త్రం,మంత్ర శాస్త్రం, రహస్యయోగక్రియలు, అతీత శక్తుల సాధన, పారానార్మల్ ఫినామినా, అక్కల్ట్ మొదలైన విద్యలున్నాయి. వాటిలోకూడా నాకు బాగా ప్రవేశం ఉందని చెప్పగలను. కాని వాటిని గురించి వ్రాస్తే సరిగా అర్ధం చెసుకునే వాతావరణం బ్లాగుల్లో కనిపించటం లేదు. నాలుగు ఇంగ్లీషు ముక్కలు వస్తే చాలు భారతీయమైనదంతా అనాగరికం, అశాస్త్రీయం అనుకునే వారి సంఖ్య బ్లాగుల్లో ఎక్కువగా ఉంది.

కనుక నా భావాలు నచ్చేవారి కోసం, "తంత్ర" మొదలైన రహస్య విషయాలు, వ్యక్తిగత విషయాల పైన, జ్యోతిష్య సమస్యలపైన లోతైన చర్చ కోసం ఒక గ్రూప్ మొదలు పెట్టబోతున్నాను. అందులో వ్యక్తిగత సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించడమేగాక, పైన చెప్పిన సబ్జెక్ట్ లలో లోతైన చర్చలు సాధ్యపడతాయి. నా బ్లాగు సభ్యులు అందులో వారి వారి సమస్యలు అడగవచ్చు. లిమిటెడ్ గ్రూప్ కనుక వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

అందులో జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న బ్లాగర్లు అందరూ పాలు పంచు కోవచ్చు. సమస్యలకు వారి వారి సూచనలు తెలియ చెయ్య వచ్చు. సుహృద్భావ వాతావరణం లో చర్చలు కొనసాగించాలని ఈ ప్రయత్నం.

ఆ గ్రూప్ కు ఒక మంచి పేరు సూచించవలసిందిగా బ్లాగ్ మిత్రులను కోరుతున్నాను. అందరికీ నచ్చిన పేరు పెడదామని నా ఆలోచన. సూచనలకు ఇదే నా ఆహ్వానం.
read more " త్వరలో మొదలయ్యే గ్రూప్ కు పేరు పెట్టండి "

22, జులై 2010, గురువారం

జెన్ కధలు- సూర్యోదయం

అది జబల్‍పూర్ పట్టణం.

ఒక చలికాలం ఉదయం.ఇంకా చీకటి తెరలు తొలగలేదు.

ఇద్దరు వ్యక్తులు మౌనంగా నడుస్తున్నారు. ఒక అరగంట నడక తర్వాత ఊరి బయటికి చేరారు. అప్పటికి చీకటి తెరలు తొలగి తెలతెలవారుతున్నది. తూర్పున ఎర్రని సూర్యుడు ఉదయిస్తున్నాడు.చుట్టూ పచ్చని ప్రకృతి మనోహరంగా ఉన్నది. అప్పటిదాకా ఎవరూ మాట్లాడలేదు. ఇంతలో ఒకాయన " సూర్యోదయం ఎంత బాగుంది" అన్నాడు. "నువ్వింత వాగుడుకాయ వని తెలిస్తే నాతో రానిచ్చేవాణ్ణి కాదు. రేపటినుంచి నాతో వాకింగ్‍కి రావద్దు."అన్నాడు రెండో వ్యక్తి. ఆ రెండో వ్యక్తే ఓషో రజనీష్.

ఓషో రజనీష్ యువకునిగా ఉన్నపుడు జబల్‍పూర్ యూనివర్శిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్‍గా పనిచేశాడు. ఆ రోజుల్లో ఆయన చీకటితోనే లేచి, ఊరి బయటికి నడుచుకుంటూ వెళ్ళి ఉషోదయాన్నీ, ప్రకృతినీ ఆస్వాదిస్తూ, సూర్యోదయాన్ని తిలకించి వెనక్కు తిరిగి వచ్చేవాడు.

రజనీష్ కు పరిచయం ఉన్న ఒకాయన తాను కూడా వాకింగ్‍కు వస్తానని కోరాడు. రజనీష్ మొదట్లో ఒద్దన్నాడు. కాని ఆ వ్యక్తి మరీ మరీ కోరినమీదట సరే నన్నాడు. మరుసటిరోజు పైన వివరించిన ఘటన జరిగింది. ఆ తరువాత రోజునుంచీ రజనీష్ ఆయన్ను తనతో వాకింగ్‍కు రానివ్వలేదు.

ధ్యానుల యొక్క రసాస్వాదన చాలా గాఢంగా ఉంటుంది. వాళ్ళు సముద్రపు అడుగున
మునిగి ఈత కొట్టేవాని వంటివారు. మామూలు వ్యక్తుల యొక్క ఆస్వాదన పేలవంగా ఉంటుంది. వాళ్ళు పై పైన తేలుతూ ఉండే వాని వంటివారు. గాఢమైన ఏకాగ్రతలో తన్ను తాను మరిచినప్పుడే ఏ అనుభవమైనా అవధులు దాటిస్తుంది. ఆ స్థాయికి తగ్గిన అనుభవం చప్పగా ఉంటుంది.

ప్రాణం రెండు పనులను ఏకకాలంలో చెయ్యలేదు. చేసినా తాను రెండుగా చీలినప్పుడే రెండు పనులు చెయ్యగలదు కాని ఒక్కటిగా ఉండి రెండు పనులు చెయ్యలేదు. ఇది యోగులకు అనుభవ సిద్ధం. యోగులు ప్రకృతికి దూరంగా పోయేవారు కారు. వారిది ప్రకృతితో మమేకమైన జీవితం. నిజం చెప్పాలంటే, జీవితాన్ని ఒక ధ్యాని ఎంజాయ్ చేసినట్లు సామాన్యుడు చెయ్యలేడు. కారణం? ధ్యాని తన శక్తిని పూర్తిగా పణం పెట్టగలడు. తనను తాను పూర్తిగా మరచి ఒక అనుభవంలో లీనం కాగల శక్తి అతనికి సాధన ద్వారా కలుగుతుంది. కాని సామాన్యుడు అనేక భయాలు, ఆందోళనలు, సందేహాల వలలో చిక్కుకుని ఉంటాడు. అతను అమృతాన్ని తాగుతున్నా కూడా, అతని మనస్సు ఎక్కడొ ఉంటుంది కాబట్టి, ఆ రుచిని పూర్తిగా ఆస్వాదించలేడు. కాని ధ్యాని అయినవాడు, ఒకే ఒక్క పనిలో తన సర్వ శక్తులనూ ఇంద్రియాలనూ కేంద్రీకరించ గలడు. కనుక అతని అనుభవం మామూలు వ్యక్తి అనుభవం కంటే ఎన్నో రెట్లు గాఢంగా ఉంటుంది.

ఒక యోగి లేక ధ్యాని సూర్యోదయం వంటి ఒక మామూలు సంఘటనను ఎంతో ఎంజాయ్ చెయ్యగలడు. దానిలో లీనమై అతను ప్రపంచాన్ని దాటి పోగలడు. అటువంటి వాని పక్కన ఉన్న వారు అందుకే ఎంతో జాగరూకతతో ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే వారి వేవ్ లెంగ్త్ లు చాలా భిన్నంగా ఉంటాయి. అనవసరంగా వారిని డిస్టర్బ్ చేయని వారే వారితో ఉండగలరు.

రజనీష్ పక్కన ఉన్న వ్యక్తి కూడా సూర్యోదయాన్ని ఎంజాయ్ చేద్దామనే ఆయనతో అంతదూరం కలసి వచ్చాడు. కాని అతనికి దాన్ని ఎలా ఎంజాయ్ చెయ్యాలో తెలియదు. "సూర్యోదయం ఎంత బాగుంది?" అన్న మాట అతను అనవలసిన పని లేదు. అలా అంటున్న క్షణంలోనే ఆ అనుభవం నుంచి అతను దూరమౌతాడు. ఆ సున్నిత అనుభవం అతని నుంచి జారిపోతుంది.

బాహ్యంగా తన అనుభవాన్ని వ్యక్తపరచాలనే కోరిక ఆ అనుభవాన్ని అంతం చేస్తుంది. ఇది ఒక అంతరిక నియమం. నీకు సూర్యోదయం నచ్చితే దాన్ని మౌనంగా ఎంజాయ్ చెయ్యి. కాని అది ఎలా ఉందో ఎందుకు వ్యక్తపరుస్తున్నావు? నీ వ్యక్తీకరణ ఎవరికి కావాలి? అలా వ్యక్త పరచడం వల్ల నీవా అనుభవం నుంచి ఆ క్షణం లోనే దూరమౌతున్నావు. పక్కవాణ్ణి కూడా నీ స్థాయికి దిగలాగుతున్నావు.

ఇటువంటి మామూలు మనుషుల సాహచర్యం ధ్యానులు భరించలేరు. అది వారి నిమగ్నతను భంగపరుస్తుంది. మామూలుగా చూస్తే అతను అన్న మాట తప్పేం కాదు. కాని ఒక ధ్యానానుభవం లో ఉన్న వాని ఏకాగ్రతకు అది విసుగును కలిగిస్తుంది.కారణం? వారి అనుభవం యొక్క క్వాలిటీ భిన్నంగా ఉంటుంది. అది వీరికి అర్ధం కాదు. అందుకే, ధ్యానుల సాహచర్యం కోరేవారు వారి స్థాయిని అర్ధం చేసుకుని తదనుగుణంగా ఉండవలసి ఉంటుంది. అందుకోసం తన మనస్తత్వాన్ని ఎంతో మార్చుకోవలసి వస్తుంది. అందుకే అటువంటివారితో ఉండటం చాలా కష్టమైన పని.

రజనీష్ అతనికి "వాగుడుకాయ" అన్నాడు. మామూలు దృష్టికి ఈ మాట క్రూరంగా కనిపిస్తుంది. అతను అన్నమాటలో తప్పేముంది? అనిపిస్తుంది. కాని ధ్యానికి "సూర్యోదయం ఎంత బాగుంది" అనే చిన్న మాటకూడా ఆ క్షణంలో విసుగును పుట్టిస్తుంది. తానున్న హిమాలయ శిఖరాలనుంచి పాతాళానికి పడినట్లు అనిపిస్తుంది.

సతోరి అనేది ఒక సున్నితమైన అనుభవం. ప్రపంచం లోని అన్ని సున్నిత అనుభవాలలాగానే, ఇది కూడా చాలా సులభంగా జారిపోతుంది. దానిని చేరుకోవడం ఒక ఎత్తు అయితే దానిని నిలబెట్టుకోవడం ఇంకొక ఎత్తు. ఆ పనికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు అవసరం అవుతాయి. పూర్తిగా వర్తమానం లో ఉండి తనను తాను మరచిపోగలిగిన వానికి సతోరి అందుబాటులోకి వస్తుంది. "నేను" అనేది తలెత్తిన క్షణంలో అది జారిపోతుంది.

కనిపిస్తున్న సూర్యోదయాన్ని ఎంజాయ్ చెయ్యకుండా దానిని బయటకు చెప్పాలనుకున్న క్షణంలోనే ఆ వ్యక్తి మనస్సునుంచి ఆ సున్నిత అనుభవం జారిపోయింది. అప్పుడా మనసు వర్తమానాన్ని ఒదిలి బయటి ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. అంతేగాక పక్కవానికి కూడా ఏకాగ్రతను భంగపరుస్తుంది.

ఏ అనుభవమైనా మౌనంలోనే గాఢతను పొందుతుంది. అనుభవి మాయమవ్వగలిగితే అనుభవం హిమాలయ శిఖరాలను అందుకుంటుంది. ప్రపంచపు అవధులను దాటించగలుగుతుంది. అది ఒక గొప్ప అనుభవం కానక్కరలేదు. సూర్యోదయం వంటి అతి మామూలు, సామాన్య అనుభవం కూడా ధ్యానికి స్వర్గాన్ని చూపించగలదు. కాని దానిని ఎలా అందుకోవాలో తెలియాలి. ఎలా ఆస్వాదించాలో తెలియాలి.

అందుకే ధ్యానులు, జ్ఞానులు మౌనాన్ని ఆశ్రయిస్తారు. మౌనంలో, ఏకాంతంలో ఉన్న ఆనందం విలువ వారికి తెలుస్తుంది.
read more " జెన్ కధలు- సూర్యోదయం "