18, ఫిబ్రవరి 2009, బుధవారం

నాడీ జ్యోతిషం- మంత్ర నాడీ గ్రంథాలు


నాడీ జ్యోతిషం అంటే లోకానికి తెలిసినది చాలా తక్కువ. ఏదో బోర్డు చూచి, లేదా ఎవరో చెబితే విని, నాడీ జ్యోతిష్కుల వద్దకు పోయి, కొంత నచ్చి, కొంత నచ్చక, మోసపోయి, డబ్బు వదుల్చుకుని అంతా మోసం నాడీ జ్యోతిషం లేదు అని ప్రచారం చేసేవారు ఎక్కువ మంది ఉన్నారు.


కాని నాడీ జ్యోతిషం అనేది నూటికి నూరు పాళ్ళు నిజం. అన్ని రంగాలలో ఉన్నట్లే, మోసగాళ్ళు రంగంలో కూడా ఉండవచ్చు. అంత మాత్రాన శాస్త్రం అసత్యం కాదు. దీని అసలు రహస్యాలు వందల ఏళ్లుగా చీకటిలో ఉండిపోయాయి. ఎందఱో మహానుభావుల కృషి ఫలితంగా దీని స్వరూప స్వభావాలు ఇప్పుడిప్పుడే వెలుగు లోకి వస్తున్నాయి.

బీ వీ రామన్ గారు తన జీవితమంతా నాడీజ్యోతిష రహస్యాలను తెలుసుకోవటానికి కృషి చేసారు. చాలావరకు గ్రహించగలిగారు కూడా. దానిని సమయం వచ్చినపుడు లోకానికి వెల్లడి చేస్తానని వ్రాసారు. కాని పని చేయకుండా కన్నుమూశారు. బహుశా మార్మిక రహస్యాలు జనసామాన్యానికి తెలియడం ప్రకృతికి ఇష్టం లేదేమో. అందుకని, నేనుకూడా నాకు తెలిసిన అన్ని విషయాలు ఇక్కడ వ్రాయను. స్థూలంగా మరియు సూచనామాత్రంగా చెప్పదలచుకున్నాను.గౌ|| సంతానంగారు, V.A.K. Ayyarగారు నాడీ గ్రంథాలపై పరిశోధన చేసారు. శ్రీనివాసాచారి గారు, R.G.Rao గారు వీటి లోతుపాతులు తెలిసిన పండితులు. పరిశోధన చేసిన ప్రముఖులు, అప్రముఖులు ఇతరులు చాలామంది ఉన్నారు. పాతతరపు తెలుగు హీరోయిన్ భానుమతి కూడా నాడీ గ్రందాలపైన పరిశోధన చేసిందన్న సంగతి చాలామందికి తెలియదు.

నాడీ గ్రంథాలు రెండు రకాలు. ఒకటి :-- మంత్ర నాడి. రెండు :-- తంత్ర నాడి.

మంత్ర నాడీ గ్రంధాలు:

నాడీ గ్రంథాలలో సంస్కృతగ్రంథాలు ఒక కోవకు చెందినవి. వీటిని భ్రుగుసంహితలు అంటారు. తమిళ భాషలో ఉన్నటువంటి గ్రంథాలు ఇంకొక కోవకు చెందినవి. అర్థముకాని ప్రాకృతభాషలో ఉన్న గ్రంథాలు మరికొన్ని ఉంటాయి. ఇది తమిళ, మళయాళ, తెలుగులిపుల కలగలుపుగా, శాసనాల మీద కనిపించే ప్రాచీనలిపికి దగ్గరగా ఉంటుంది.బహుశా ఇది అంతరించిపోయిన గుణాడ్యుని పైశాచికభాష కావచ్చు

మంత్రగ్రంథాలలో తమిళ, పైశాచిక (?) గ్రంథాలు హెచ్చు. వీటిలో తిరిగి రెండు రకాలున్నాయి. మొదటిరకంలోని తాళపత్రగ్రంథాలలో అర్థంకాని భాష ఉంటుంది. ఇది ప్రాచీనతమిళం (సెందమిళం) అని కొందరు చెబుతారు. మామూలు తమిళం వచ్చినవారు కూడా దీనిని చదువలేరు.అర్ధం చేసుకోలేరు. రెండవరకానికి చెందినవే అసలు మంత్రనాడీగ్రంథాలు. వీటిలో తాళపత్రాలు ఖాళీగా ఉంటాయి. కాని చదివేటప్పుడు విచిత్రభాషలో అక్షరాలు కనిపించి మాయమవుతాయి. దీనికి మంత్రసిద్ధి ఉంటుంది.

బీవీ రామన్ గారు 1938 లో శ్రీనివాసాచారి అనే నాడీజ్యోతిష్కుని కలిసారు. ఆయన వద్ద బుధనాడి అనే గ్రంథం ఉన్నది. ఈయన జీవితం అంతా విషాదంతో నిండి ఉంది. మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు. కానీ మొదటి ఇద్దరు భార్యలు విషాద పరిస్థితులలో చనిపోయారు. శ్రీనివాసాచారి గారి అభిప్రాయం ప్రకారం నాడిగ్రంథం ఇంటిలో ఉండరాదు. ఒకవేళ ఉంటే,  కుటుంబం మీద శాపం ఉంటుంది. చాలా నాడీగ్రంథాలు క్షుద్ర మంత్రములపైన ఆధారపడి ఉంటాయి. ఆయా క్షుద్రదేవతలను ప్రతిరోజూ తృప్తిపరచాలి. తేడా వస్తే ఫలితములు దారుణంగా ఉంటాయి. వాటిని తృప్తిపరిచే విధానాలు వేర్వేరుగా ఉంటాయి.

చిక్క మగులూర్ లో నారాయణశాస్త్రిగారనే జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆయన శనిభగవానుని అధిష్టానదేవత అయినట్టి కాలభైరవుని మంత్రసాధన చేసాడు. సిద్ధివల్ల ఉత్త రాశిచక్రం చూచి ( అంశ చక్రముల పని లేకుండానే) ఒక ఏడాది వరకు ఫలితములు అచ్చుగుద్దినట్లు చెప్పడం సాధ్యపడుతుంది. సాధన చివరదశకు వచ్చింది. సాధన మధ్యలో ఆయన ఒక చెరువులో నిలబడి మంత్రజపం చేస్తుండగా, ఒక అందమైన యువతి బిందె తీసుకుని చెరువులో నీళ్ళకోసం వచ్చింది. ఆమెను చూచి ఈయన మనస్సు చలించింది. మంత్రజపంలో అంతరాయం కలిగింది. దాని దారుణ ఫలితంగా, ఆయనకు పక్షవాతం వచ్చి వెంటనే నోరు, చెయ్యి, కాలు పడిపోయాయి. నియమనిష్టలలో విఘాతం కలిగితే ఫలితాలు అంత దారుణంగా ఉంటాయి.

శశికాంతజైన్ గారు వారి పుత్రులు ఆశ్చర్యకరమైన జ్యోతిష్కులు. ఎదుటి మనిషి ఏమి అడుగ బోతున్నాడో గ్రహించి ముందుగానే వారి మనసులో ప్రశ్నను , దానికి జవాబును చెప్పగలరు. రకంగా ఒకసారి కాదు, కొన్నివందల సార్లు వీరు పరీక్షలకు నిలబడి విజయం సాధించి చూపారు. వీరికి కర్ణపిశాచిని మంత్రసిద్ది ఉందని జనం అనుకునేవారు.

జ్యోతిష్కులలో కొందరికి పంచాంగుళీ  మంత్రసిద్ధి ఉంటుంది. పంచాంగుళీమాత హస్తసాముద్రిక విధానానికి అధిదేవత. దేవతాకటాక్షం వల్ల ఫలితములు ఎక్కువ కష్టపడకుండా తేలికగా చెప్పవచ్చు. ఈమె అంత ప్రమాదకారి కాదు. కొంచం సాత్వికదేవత. అసలు వీరందరూ దేవతలు కారు. దేవతలకంటే కొంచం స్థాయి తక్కువవారు. Demi Gods and Goddesses అని చెప్పవచ్చు. కాని మానవాతీతశక్తులు ప్రసాదించగలిగిన వారు. వీరిలో ఎక్కువ మంది భయంకరమైన ఆకారం కలిగి ఉంటారు. భయాన్ని జయించిన సాధకుడు మాత్రమె వీరి దర్శనాన్ని తట్టుకోగలుగుతాడు. లేకపోతే వీరి దర్శనం వల్ల మతిభ్రమణం వంటి చేదు పరిణామాలు కలుగుతాయి.

మంత్రనాడి తెలిసిన వారికి సాంప్రదాయజ్యోతిష్యం కూడా కొంత తెలిసి ఉంటుంది. కొందరికి అసలు తెలియదు. రెండవరకానికి చెందిన వారు పైశాచిక భాష చదవటం నేర్చుకొని ఉంటారు. తాళపత్రంలో ఉన్న భాషను, లేక అప్పటికప్పుడు కనిపించి మాయం అయ్యే మాటలను చదివి చెప్పగలరు. అంతవరకే వారి ప్రజ్ఞాపాటవాలు పని చేస్తాయి. దానిని మించి వారికి జ్యోతిష్యజ్ఞానం ఉండదు.

తమిళనాడీ జ్యోతిష్కులలో చాలామంది క్షుద్రమంత్రములు తెలిసినవారు ఉంటారు. వారు కొన్నిరోజులు బాగా ధనం సంపాదిస్తారు. కాని చివరకు, వీరి జీవితములు విషాదంగా ముగుస్తాయి. దిక్కులేని మరణం వీరిని వరిస్తుంది. దానికి కారణం పేరాశ. ఆశతో ఉన్నవీ లేనివీ చెప్పి పృచ్చకుల వద్ద ధనం గుంజుతారు. తెలిసీ తెలియని రెమెడీస్ చెప్పి  పృచ్చకుని కర్మలో వీరూ భాగం మూటగట్టుకుంటారు.కనుక లోకులకర్మ వీరి నెత్తిన పడుతుంది. అందుకే మంత్రనాడీ గ్రంథముల జోలికి పోవడం శ్రేయస్కరం కాదు. వాటిని ఇంటిలో ఉంచుకొనుట దోషప్రదం. రకంగా చూచినా విధానం మంచిది కాదు. ఒకవేళ ఈ విధానాన్ని అనుసరించాలంటే ఆ వ్యక్తీ సంసారజీవితానికి దూరంగా ఉంటూ, అనేక నియమనిష్టలు పాటిస్తూ ఒక బికారిలా బతకాలి. అప్పుడే లోకుల కర్మ అతనికి సోకకుండా ఉంటుంది. అలా కాకపోతే అతని జీవితంలో భయంకరమైన ఎదురుదెబ్బలు తగలటం ఖాయం. నాలుగుడబ్బుల కోసం అహంకారులైన లోకుల కర్మను తలకెత్తుకోవడం కంటే తెలివితక్కువతనం ఇంకోటి ఉండదు. 

విషయాలు ఇంతకంటే లోతుగా వ్రాయడం అనుమతి లేదు గనుక వ్రాయడం లేదువచ్చే వ్యాసంలో తంత్ర నాడి గ్రంథాల గురించి చూద్దాము.
read more " నాడీ జ్యోతిషం- మంత్ర నాడీ గ్రంథాలు "

17, ఫిబ్రవరి 2009, మంగళవారం

జెన్ కథలు- అంతా శూన్యం

జెన్ కథలు - 3 : అంతా శూన్యం
----


యమోక
తేషు అనే యువకుడు జెన్ గురించి తెలుసుకోవాలని అనేక మాస్టర్ల వద్ద శిష్యరికం చేసాడు. చాలా జ్ఞానాన్ని పొందాడు. కాని తృప్తి చెందక చివరకు దోకువాన్ అనే జెన్ మాస్టర్ వద్దకు వచ్చాడు.

దోకువాన్ సమయంలో శాంతం గా కూచుని హుక్కాలో పొగ తాగుతున్నాడు.

యమోక తన జ్ఞానాన్ని ఇలా వివరించాడు. " మనస్సు, బుద్ధుడు, జీవులు - నిజానికి ఏదీ లేదు. ప్రపంచం యొక్క నిజ తత్వం శూన్యత. భ్రమ లేదు, జ్ఞానం లేదు. జ్ఞాని లేడు, అజ్ఞాని లేడు. ఇచ్చేది లెదు, తీసుకునేది లెదు..అంతా శూన్యం. "

దోకువాన్ మౌనంగా పొగ తాగుతున్నాడు. విన్నాడో లేదో కూడా తెలియటం లెదు.
హఠాత్తుగా తన కర్రతో యమోకను బాదాడు. యమోకకు పిచ్చి కోపం వచ్చింది.
"అంతా శూన్యం ఐతే, నీ కోపం ఎక్కణ్ణించి వచ్చింది?" అన్నాడు దోకువాన్.

యమోక చాలామంది గురువుల వద్ద తిరిగి శిష్యరికం చేసాడు. అతడు పుస్తక జ్ఞానాన్ని పొందాడు. శాస్త్రాలు కంఠతా పట్టి ఉన్నాడు. శ్లోకాలు పుంఖాను పుంఖాలుగా వల్లించ గలడు. బౌద్ధికంగా సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. కాని అనుభవ శూన్యుడు. సాధనా బలం లేదు. ఇది తత్వ శాస్త్రాన్ని పుస్తకాలు చదివి అర్థం చేసుకుని అదే సర్వస్వం అనుకునే వారి తీరు. ఫిలాసఫీ అనేది బుద్ధి తో అర్థం చేసుకోవచ్చు. కాని జెన్ కేవలం అనుభూతి ద్వారానే తెలిసేది. అనుభూతికి పుస్తక జ్ఞానానికి సంబంధం లేదు. పై పెచ్చు పుస్తక జ్ఞానం, జెన్ అనుభూతికి ఆటంకం అవుతుంది. నానిన్ కథ లో ప్రొఫెసరు గారు తత్వ శాస్త్ర పండితుడు. కనుకనే బుర్రలో ఉన్న పుస్తక జ్ఞానం ఖాళీ చేయానిదే జెన్ ఎక్కదు అని నానిన్ పరోక్షం గా సూచించాడు.

అంతా శూన్యం అనేది నిజమే. కాని అది యమోక అనుభవ జ్ఞానం కాదు. గ్రంధాలలో చదివి చిలుక లాగా వల్లిస్తున్నాడు. ఫిలాసఫీ లో విహరిస్తూ అదే నిజమైన జ్ఞానం అని భ్రమిస్తున్నాడు. అతన్ని ఊహాలోకం లోనుండి వాస్తవ జగత్తుకు తేవడానికి దోకువాన్ కర్రతో ఒక్క బాదు బాదాడు. యమోక సాధనా బలం కలిగిన వాడితే ఆ దెబ్బతో తెలివి తెచ్చుకునేవాడు. కాని అతనికి అర్థం కాలేదు. మానవ సహజ మైన కోపం అతన్ని వశం చేసుకుంది.

నిజమైన శూన్య స్థితి అయిన No-mind అతనికి అనుభవంలో ఉంటే కోపం వచ్చేది కాదు. అసలు యమోక ఇక్కడికి వచ్చేవాడే కాదు. జ్ఞాని కాలేదు కనుకే దోకువాన్ వద్దకు వచ్చాడు. జ్ఞానం కలిగినప్పుడు ఒకరి ప్రమాణ పత్రం అవసరం లేదు. అపుడు ఎవరి వద్దకో వెళ్ళ వలసిన అవసరం కూడా ఉండదు.

అతనికి ఇంకా తెలివి కలగలేదని గ్రహించిన దోకువాన్ " అంతా శూన్యమైతే, నీ కోపం ఎక్కణ్ణించి వచ్చింది" అని అడిగాడు. అంటే, నీవు చెబుతున్న ఉన్నత సత్యం నీ అనుభవం కాదు. అది అనుభవం కానంత వరకు ఎంత చదివినా అంతా వృధా. నీవు చాలా చదివావు. కాని సాధనా పరంగా మొదటి మెట్టు కూడా ఎక్కలేదు. కనీసం ఇకనన్నా సాధన మొదలు పెట్టు అని పరోక్షంగా దోకువాన్ సూచిస్తున్నాడు.
read more " జెన్ కథలు- అంతా శూన్యం "

16, ఫిబ్రవరి 2009, సోమవారం

నాడీ జ్యోతిషం-భ్రుగు సంహితలు

నాడీ జ్య్తోతిషం - 2 -: భ్రుగు సంహితలు
---
సత్యాచార్యుని దాటి ఇంకా ప్రాచీన కాలం లోనికి పోదాం. క్రీస్తు పూర్వం ఎన్ని వేళ ఎండ్లో తెలియదు. మహర్షుల కాలం లోప్రవేశించాం. జ్యోతిష్యానికి ఆద్యులలో ఒకరైన భ్రుగు మహర్షి మహావిష్ణువును వక్ష స్థలంపైన తన్నాడు. దేహంతోవైకుంఠానికి ఎట్లా చేరాడు ? అని సందేహం కలుగుతుంది. మహర్షి గనుక తన తపశ్శక్తి తో వైకుంఠానికి చేరి వుండవచ్చు. లేదా భౌతిక దేహంతో గాక సూక్ష్మ దేహం తో పోయి ఉండవచ్చు. మహా విష్ణు వక్ష స్థలం లక్ష్మి దేవి నివాసం. కనుక దేవిఅలిగి మహర్షిని శపించింది. నేటి నుంచి నీవు నీ వంశం వారు దరిద్రంతో కాపురం చేస్తారు. సంపద మీ వంశంలోనిలబడదు.

మహర్షి ఖిన్నుడై నాడు. భూలోకానికి వచ్చిన పిదప, చేసిన తప్పుకు చింతించాడు. శాప నివారణ కావాలంటే ఏమిచెయ్యాలి? శాపం ఇచ్చిన మహా లక్ష్మి గురించే తపస్సు ప్రారంభం చేసాడు. ఏండ్లు గడిచాయి. దేవి ప్రసంనురాలైంది. ప్రత్యక్షం అయింది. తల్లీ నిన్ను కాలితో తన్ని తప్పు చేశాను. శాపాన్ని ఉపసంహరించు. దరిద్రం పోయే మార్గం చెప్పు. మహా లక్ష్మి చెప్పింది. వత్సా. నీకు త్రికాల జ్ఞానం అనుగ్రహిస్తున్నాను. దీనితో నీకు సమస్త జనుల భూత, భవిష్య, వర్తమాన వివరాలు తెలుస్తాయి. వాటితో జనులకు మేలు చెయ్యి. తద్వారా నీ వంశస్తులకు ధనార్జన కలుగుతుంది.

తల్లీ ఇంకొక్క వరం కావాలి. అన్నాడు మహర్షి. నీవు నాకు కూతురివై జన్మించాలి. నేను నిన్ను కాలితో తన్నాను. నీవుబిడ్డగా నా గుండెల మీద తన్నాలి. నీ ఆలనా పాలనా నేను చూడాలి. నిన్ను పెంచి పెద్ద చెయ్యాలి.
అప్పుడే నాకు మనశ్శాంతి కలుగుతుంది. దేవి ప్రసంనురాలైంది. సరేనంటూ వరమిచ్చింది. భ్రుగు మహర్షి కి భార్గవి అనే పేరుతొ బిడ్డగాపుట్టింది. మహర్షి శాపం తీరింది. మహర్షి వ్రాసిన గ్రంథాలే భ్రుగు సంహితలు.

భ్రుగు సంహితలు ఉత్తర భారత దేశంలో ఉన్నాయి. హోషియార్పూర్ లో ఉన్న ఒక కుటుంబం అధీనంలో ఉన్నాయి. ఇవిఆశ్చర్య జనక మైన ఫలితాలు ఇస్తాయి. రెండు ఉదాహరణలు:

1 . ఒక రష్యన్ మహిళా తన భర్తతో కలిసి భ్రుగు సంహిత కోసం భారత్ వచ్చింది. దానిలో ఉన్నా విషయం విని ఆమె నిర్ఘాతపోవటమే గాక, అది నిజమే నని చెప్పింది. ఇంతకీ అందులో ఏముంది? ఇతర వివరాలతో బాటు, రష్యన్ మహిళ తనతల్లికి రెండవ భర్తతో పుట్టిన మూడవ సంతానం అని ఉంది. ఇది విని ఆమె అవాక్కైంది. ఇటువంటి వివరాలను సాధారణజోతిషం చెప్పలేదు. నాడీ గ్రంథములే చెప్పగలవు.

2 . స్వామి క్రియానంద, ఒక అమెరికన్. పరమహంస యోగానంద శిష్యుడు. SRF నుండి విడిపోయి సొంత సంస్థపెట్టుకున్న వాడు. ఈయన తన భ్రుగు సంహితా రీడింగ్ చదువుతుండగా జరిగిన సంఘటన ఆయనే వ్రాసాడు. "జాతకుడు ఇతర దేశస్థుడు, యోగ నేర్చుకోవటం కోసం ఒక ప్రసిద్ధ గురువును ఆశ్రయిస్తాడు. ఇతడు సంహితచదువుతుండగా ఆకాసంలో పెద్ద మెరుపు మెరుస్తుంది." అని ఉంది. క్రియానంద చదవటం ఆపి ఆకాశంలోకి చూస్తాడు. మంచి ఎండ తో ఉన్న ఆకాసంలో మెరుపు ఎలా వస్తుంది అని ఆలోచిస్తుండగా, తటిల్లని రెండు మబ్బుల మధ్యన విధ్యుత్ప్రవహించి మెరుపు మెరిసింది.

సంభ్రమ గొలిపే ఇటువంటి సంఘటనలు భ్రుగు సంహితలో చాలా ఉంటాయి. వ్రాస్తూ పొతే ఇదే ఒక గ్రంథం అవుతుంది. గ్రంథాలు దక్షిణ భారతంలో దొరకవు. ఉత్తర భారత దేశంలోనే ఉన్నాయి. ఇవి భ్రుగు వంశస్తుల వద్ద వంశ పారంపర్యంగా దాచ బడుతూ వస్తున్నాయి. వీరిది శ్రీ వత్స గోత్రం అంటారు.

భార్గవ, చ్యవన, ఆప్నవాన, ఔర్వ, జమదగ్ని-- గోత్ర మూల ఋషులు. లక్ష్మిదేవి కటాక్షం పొందిన వారు గనుక శ్రీ వత్సగోత్రీకులు అయినారు.

వచ్చే వ్యాసంలో మంత్ర నాడి గురించి చూద్దాము

read more " నాడీ జ్యోతిషం-భ్రుగు సంహితలు "

15, ఫిబ్రవరి 2009, ఆదివారం

నాడీ జ్యోతిషం

నాడీ జ్యోతిషం- 1
------------------

నాడీ జ్యోతిషం గురించి నేడు అందరికీ తెలుసును . కాని దీని అసలు లోతు అతి తక్కువ మందికే అవగాహన ఉంది. నాడీజ్యోతిషాన్ని గురించి నాకు తెలిసిన విషయాలు వ్రాయబోతున్నాను. ఇది ఒక వ్యాసంలో అయ్యే పని కాదు. ఎన్నివ్యాసాలూ అవుతాయో తెలియదు. వ్రాసుకుంటూ పోదాం.

దీనిని దక్షిణాదిన నాడీ జ్యోతిషం అని, ఉత్తరాదిన భ్రుగు సంహిత అని పిలుస్తూ ఉంటారు. ఎవరు వ్రాసారో తెలియదు. ఎంతకాల మైనదో తెలియదు. అసలు నిజాలో కాదో తెలియదు. చాలా మంది ఇది మోసం అంటారు. కాని నిప్పు లేనిదే పొగరానట్లు, ఎంతో కొంత నిజం దీనిలో ఉందా?. ఉంటే దీని పుట్టు పూర్వోత్తరాలేమిటి ? ఇవి ఎలా వచ్చాయి ? వీటిలోరకాలేన్ని ? అన్నీ నిజాలేనా ? అన్నీ ప్రశ్నలే.

ఒక కథతో మొదలు పెడదాము. సత్యాచార్యుడు, వరాహ మిహిరుని కంటే ముందు కాలం లో జీవించిన ఒక జ్యోతిర్వేత్త. ఎందుకనగా, వరహ మిహిరుని బృహజ్జతకం లో ఆయుర్నిర్ణయ అధ్యాయములలో సత్యాచార్యుని ప్రశంస కనిపిస్తుంది. అన్ని విదానములలోకి సత్యాచార్యుని ఆయుర్ నిర్ణయ పధ్ధతి యైన " అంశాయుర్దాయ గణన పద్ధతి " ఉత్తమమనివరాహ మిహిరుడంటాడు. అనగా ఈయన వరాహ మిహిరుని కంటే చాలా ముందు వాడు. క్రీస్తు పూర్వపు వాడు కూడాకావచ్చు.

సత్యాచార్యుని ఆధునిక నాడీ జ్యోతిష్యమునకు పితామహునిగా భావిస్తున్నాము. ఈయన గురించి ఒక గాధప్రచారములో ఉంది.

సత్యాచార్యుడు జ్యోతిస్సాస్త్రమును ఔపోసన పట్టిన వాడు. మహా పండితుడు. కాని జాతక ఫలితములను నూటికి నూరుశాతము చెప్పలేక పోయేవాడు. అనేక సందేహములు పట్టి పీడించేవి. ఎందుకని ఫలితములు పూర్తిగా తెలుసుకోనలేముఅని ఆలోచన చేసేవాడు. చివరకు ఆయన గురువు ఒక సూచన చేసాడు. పరమేశ్వరుని గురించి తపస్సు చేయి. నీకుమార్గం దొరుకుతుంది అని.

సత్యాచార్యుడు శివుని గురించి ఘోర తపస్సు చేసాడు. కొన్నేళ్ళకు శివుడు ప్రత్యక్షం అయినాడు. సత్యాచార్యుడు తనసందేహాలు చెప్పి తరుణోపాయం అడిగాడు. పరమ శివుడు దరహాసంతో " వత్సా. నీవు నేర్చుకుంది స్థూల మైనజ్యోతిర్విద్య. దాని వల్ల ఫలితములు పూర్తిగా అవగతం కావు. సూక్ష్మ జ్యోతిషమని ఇంకొకటుంది. అది తెలిసినచో నీకుభూత వర్తమాన భవిష్యత్తులు కళ్ళ ముందు కనిపిస్తాయి. దీనికి నాడీ అంశ తెలియాలి. పంచ భూత తత్వమూ, కాలవిభజనము, నాడీ అంశతో అనుసంధానము చేసుకుంటే సర్వం బోధపడుతుంది." అని నాడీ విజ్ఞానమునుఅనుగ్రహించినాడు. దీనివల్ల సత్యాచార్యుడు త్రికాల జ్ఞానాన్ని పొందాడు. భవిష్యత్తులో పుట్టబోవు కోటానుకోట్ల జీవితాలుఆయన కళ్ళ ముందు దృశ్యములుగా కనిపించాయి. ఆయన వ్రాసినదే సత్య నాడి లేక ధృవ నాడి. విషయాలనుద్రువీకరించి చెబుతుంది కనుక ధృవ నాడి అయింది.

నాడీ గ్రంథములు అనేకములున్నవి. వీటిలో మార్కండేయ నాడి ఫలితములే సరియైనవని బీ వీ రామన్ గారు తన జీవితకథ లో వ్రాసారు. కౌమార నాడి, వసిష్ఠ నాడి, అగస్త్య నాడి, భ్రుగు నాడి, కాక భుసుండా నాడి ఇత్యాది అనేక నాడీ గ్రంథాలుకలవు. ఈరోజు నాడీ అనేది పెద్ద వ్యాపారం. కాని దీనిలో మోసం చేసేవారే ఎక్కువ మంది కనిపిస్తారు .

వైదీస్వరన్ కోయిల్, కంచి, మద్రాసు, కుంబకోణం, ఇంకా అనేక తమిళ నాడు నగరాలలో నాడి జ్యోతిష్కులు కనిపిస్తారు. బెంగుళూరులో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అన్ని చోట్లా బ్రాంచిలు పెట్టి నడుపుతున్నారు. డిల్లీ లో అనేకబ్రాంచిలు కలవు. కాని వీరిలో నిజమైన నాడీ జ్యోతిష్కులు ఒక శాతం కూడా ఉండరు అనేది నిజం.
read more " నాడీ జ్యోతిషం "

జెన్ కధలు - నాన్ ఇన్ టీ కప్పు

జెన్ కధలు - 2 : నాన్ ఇన్ టీ కప్పు
----
జపాన్ లో మెయిజి కాలానికి చెందిన నాన్ ఇన్ పేరుగాంచిన జెన్ మాస్టర్.
ఒక యూనివర్సిటి ప్రొఫెసర్, జెన్ గురించి తెలుకోవటానికి నాన్ ఇన్ వద్దకు వచ్చాడు.
నాన్ ఇన్ మర్యాదగా టీ ఇచ్చాడు. టీ కప్పులో టీ పోస్తున్నాడు. అది నిండింది. ఇంకా పోస్తూనే ఉన్నాడు. టీ పొర్లిపోతున్నది.
చూస్తున్న ప్రొఫెసర్ అసహనంతో అరిచాడు. " మహాశయా. టీ కప్పు నిండుగా ఉంది. ఇంకా పోస్తే ఎట్లా పడుతుంది అందులో?"
నాన్ ఇన్ చిరునవ్వు నవ్వాడు. ఇలా అన్నాడు.
మీ మనసు కూడా టీ కప్పు వలెనె ఉంది.

ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి.
1.
ఏదైనా కొత్త విషయం మనకు తెలియాలంటే, ముందుగా దాని గురించిన అభిప్రాయములు మనకు ఉండరాదు. అప్పుడే విషయం గురించిన సరియైన అవగాహన వస్తుంది. ముందు గానే మనం కొన్ని అభిప్రాయములు ( Pre Concieved Ideas or Notions) ఏర్పరచుకొని ఉంటే కొత్త విషయం యథాతథం గా మనము గ్రహించలేము.మనము పెట్టుకొన్న కళ్ళజోడు రంగులోనే మనకు ప్రపంచం కనిపిస్తుంది. అంటే పూర్తిగా Objective Observation ఉంటేనే మనకు సత్యం అవగతమౌతుంది. లేకపోతె కాదు. 2.ఇక జెన్ గురించి. జెన్ అంటే మనసు నుంచి, మనసు లేమికి ప్రయాణం. A journey from mind to no-mind. మనసులోనుండి ఆలోచనలనూ, అభిప్రాయాలను, అనుభూతులను, భావోద్వేగాలను సమస్తాన్ని ఖాళీ చేస్తే మిగిలేది జెన్. అప్పుడే సత్యం ముఖాముఖి దర్శనం ఇస్తుంది. మాస్టర్ నానిన్ పరోక్షం గా ఇదంతా సూచిస్తున్నాడు. ప్రొఫెసరు గారు అర్థం చేసుకున్నాడో లేదో మనకు తెలియదు. జెన్ మాస్టర్ల శైలి ఇలా ఉంటుంది. అతి గంభీర అర్థాలను, మామూలు మాటల్లో, ఒక్కోసారి అసంబద్దంగా ఉండే మాటలలో సూచిస్తారు. చంద్రుని వైపు చూపే వేలులా ఉంటాయి జెన్ బోధనలు. A finger pointing at the moon. అర్థం చేసుకుంటే మన ముందు మరో ప్రపంచం ఆవిష్కృత మౌతుంది. లేకపోతె పిచ్చి మాటల వలె ఉంటాయి.
read more " జెన్ కధలు - నాన్ ఇన్ టీ కప్పు "