27, జూన్ 2021, ఆదివారం
కెనడాలో బయటపడిన 751 పిల్లల సామూహిక సమాధులు - ప్రభువా నీ యిచ్ఛయే నెరవేరుగాక !
25, జూన్ 2021, శుక్రవారం
మయామిలో పన్నెండంతస్తుల భవనం కూలుడు - పౌర్ణమి ప్రభావం
నిన్న పౌర్ణమి. ఉదయం 1.30 కి ఫ్లోరిడాలో మయామి సబర్బ్ అయిన సర్ఫ్ సైడ్ అనేచోట ఒక పన్నెండంతస్తుల భవనం పాక్షికంగా కూలిపోయింది. ఒకరు చనిపోయారు, తొమ్మిదిమంది గాయపడ్డారు, దాదాపు వందమంది గల్లంతయ్యారు. వీరిలో ఎక్కువమంది లాటిన్ అమెరికావాసులు. వాళ్ళు ప్రాణాలతో ఉంటారన్న నమ్మకం లేదు. శిధిలాలను తొలగించి చూస్తేగాని వాళ్ళ శరీరాలు దొరకవు. శిధిలాలను తొలగించే ప్రయత్నాలు సాగుతున్నాయి.
21, జూన్ 2021, సోమవారం
అలబామా తుఫాను - భయంకర కారు ప్రమాదం
అమెరికా లగ్నమైన మిధునం నుంచి చూద్దాం. మిధునరాశి వాయుతత్వరాశని మనకు తెలుసు. జలగ్రహమైన శుక్రుడు ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. మిధునరాశికి ప్రస్తుతం భయంకరమైన అర్గలదోషం పట్టి ఉన్నది. శుక్రుడు 26 వ డిగ్రీమీదున్నాడు. బహుశా ఇదే డిగ్రీ అలబామా రాష్ట్రాన్ని సూచించవచ్చు. ఈ డిగ్రీ ఉన్న భాగం ఆగ్నేయదిక్కును సూచిస్తుంది. ఈ అన్నింటినీ కలుపుకుని చూడండి - అమెరికాదేశం, సుడిగాలులు, తీవ్రవర్షాలు, ఆగ్నేయదిక్కు. సరిపోయిందా లెక్క?
మరి వరుస కారు ప్రమాదాలెందుకు జరిగాయి?
తృతీయాధిపతిగా దగ్గర ప్రయాణాలకు కారకుడైన సూర్యుడు లగ్నంలో ఉన్నాడు. మరణాలకు కారకుడైన ప్లుటోతో అతి దగ్గరి షష్టాష్టకదృష్టిలో ఉన్నాడు. యాక్సిడెంట్లకు, చావులకు మరో కారకుడైన శని ధనుస్సునుంచి సూర్యుని సూటిగా చూస్తున్నాడు.
ఇలాంటి భయంకరమైన యాక్సిడెంట్ జరగడానికి ఇంతకంటే ఇంకేం కావాలి?
14, జూన్ 2021, సోమవారం
శని కుజుల ప్రభావం - 5 - వీకెండ్ లో అమెరికా ఎలా ప్రభావితమైంది?
10-6-2021 గురువారం అమావాస్య సూర్యగ్రహణమైంది. శుక్రవారం నుండి ఆదివారం వరకు మూడురోజులలో అమెరికాలోని మూడురాష్ట్రాలలో చెదురుమదురు కాల్పుల సంఘటనలు జరిగాయి. అనేకమంది చనిపోయారు, అనేకమంది గాయపడ్డారు. అమెరికాలో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అనకండి ! ఎప్పుడూ జరగవు. ఎప్పుడో మాత్రమే జరుగుతాయి. ఆ ఎప్పుడో జరగడం వెనుక ఏమున్నదనేదే నేను చెబుతున్నాను. వినండి.
10-6-2021 గురువారం
డెట్రాయిట్ మిషిగన్ లో జరిగిన కాల్పులలో ఒకరు చనిపోయారు. ముగ్గురు గాయాలపాలయ్యారు.
- అమావాస్య, సూర్యగ్రహణం
- బుధుని తీవ్ర అస్తంగత్వం
- మిధునరాశికి పాపార్గళం
- మిధునమంటే అమెరికా అని గతంలో ఎన్నో సార్లు నిరూపితమైంది. మళ్ళీ ఇప్పుడు రుజువైంది.
11-6-2021 శుక్రవారం
చికాగోలో సాయంత్రం ఏడు నుంచి రాత్రి పన్నెండు మధ్యలో నాలుగు కాల్పుల సంఘటనలు జరిగాయి. ఆరుగురు గన్ షాట్ గాయాలకు గురయ్యారు.
సవన్నా జార్జియాలో జరిగిన కాల్పుల సంఘటనలో ఒకరు చనిపోయారు. ఏడుగురు గాయపడ్డారు.
- మిధునరాశికి పాపార్గళం
- చంద్రశుక్రుల డిగ్రీ సంయోగం
12-6-2021 శనివారం
చికాగోలో అర్ధరాత్రి పన్నెండు నుంచీ సాయంత్రం లోపు ఏడు కాల్పుల సంఘటనలు జరిగాయి. వీటిల్లో ఏడుగురు గాయపడ్డారు.
ఆస్టిన్ టెక్సాస్ లో ఉదయం జరిగిన కాల్పులలో ఒకరు చనిపోయారు. 14 మంది గాయపడ్డారు.
న్యూబర్గ్, లూయిస్ విల్, కెంటకీ లో జరిగిన కాల్పులలో ఒకరు చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు.
- మిధునరాశికి పాపార్గళం
- మేష యురేనస్ కూ, మిధునశుక్రునికి ఖచ్చితమైన డిగ్రీ దృష్టి.
గత రెండురోజులకంటే శనివారం నాడు గ్రహయోగాలు బలంగా ఉన్నాయి. యురేనస్ దృష్టి విపరీతమైన దూకుడునూ, ఆలోచనలేని చర్యలనూ ప్రేరేపిస్తుంది. కనుక ఆ రోజున ఎక్కువ కాల్పుల సంఘటనలు జరిగాయి.
13-6-2021 ఆదివారం
ఆస్టిన్ టెక్సాస్ లో జరిగిన మూడు కాల్పుల సంఘటనలలో నలుగురు గాయపడ్డారు.
- మిధునరాశికి పాపార్గళం
- చంద్రకుజుల డిగ్రీసంయోగం. గురువుతో వీరికి ఖచ్చితమైన 6/8 దృష్టి.
మొత్తం అన్ని సంఘటనలనూ వ్రాయడం అనవసరం గాని, ఈ వీకెండ్ లో జరిగిన కాల్పుల సంఘటనలలో మొత్తం 6 గురు చనిపోగా 40 మంది గాయాలపాలయ్యారు. వీరిలో కొందరికి తీవ్రమైన గాయాలైతే, మరికొందరికి ఒకమోస్తరు గాయాలయ్యాయి. అన్నీ గన్ షాట్ గాయాలే.
ఇవన్నీ ఉన్నట్టుండి ఈ వీకెండ్ లోనే, అదీ అమెరికాలోనే, ఎందుకు జరిగాయో అర్థమైందా మరి? మిధునరాశి ఇంతగా దెబ్బతిన్నప్పుడు అమెరికాలో ఇలా జరగక ఇంకెలా జరుగుతుంది?
అయినా నా పిచ్చిగాని, పడ్డాక లబోదిబో అనడమేగాని ముందుగా చెబితే ఈ లోకంలో ఎవడు వింటాడు గనుక?
13, జూన్ 2021, ఆదివారం
శనికుజుల ప్రభావం - 4 - చైనా గ్యాస్ పైప్ లైన్ పేలుడు
11, జూన్ 2021, శుక్రవారం
శనికుజుల ప్రభావం - 3 - అమావాస్య సూర్యగ్రహణం ఏమేం చేశాయి?
శని - కుజ - ప్లుటోల చెడుప్రభావాలు కొనసాగుతున్నాయి.
- నిన్న గురువారం, అమావాస్య సూర్యగ్రహణం. మొన్న బుధవారం రాత్రి 10. 15 గంటలకు ముంబాయ్ లోని మలాడ్ ఏరియాలో ఒక ఇల్లు కూలిపోయి 11 మంది చనిపోయారు. పక్కనున్న ఇళ్లుకూడా దెబ్బతిన్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాలవల్ల ఇది జరిగిందని అంటున్నారు.
- దక్షిణ కొరియాలో ఒక ఐదంతస్తుల బిల్డింగ్ కూలిపోయి క్రిందనున్న బస్సుమీద పడింది. ఆ బస్సులోని 9 మంది హరీమన్నారు. మరో 8 మంది తీవ్రగాయాల పాలయ్యారు.
- ఇదే సమయంలో మెక్సికో టూర్ కెళ్లిన మెలిస్సా, జార్జియా లారీ అనే బ్రిటిష్ అక్కాచెల్లెళ్లు ఒక మడుగులో ఈతకొడుతుండగా వారిలో ఒకమ్మాయిని మొసలి పట్టుకుంది. జార్జియా ఆ మొసలితో పోరాడింది. ఇద్దరూ బయటపడ్డారు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. అది కాదు అసలు విషయం. మెక్సికో కూడా ఇండియాలాగా మకరరాశి అని ఇంతకుముందు వ్రాశాను. మకరమంటే మొసలి. ఈ అక్కాచెల్లెళ్ళిద్దరూ కవలలు, అంటే మిధునరాశిచేత సూచింపబడతారు. కర్కాటకమంటే నీటిమడుగు. కర్కాటకరాశిలో ఉన్న నీచకుజుడు మొసలిని సూచిస్తున్నాడు. అక్కడున్న నీచ కుజునికీ మిధునానికీ (ట్విన్ సిస్టర్స్ కీ) ఆచ్చాదనాదోషం ఉన్నది. మకరం నుంచి శని ప్లూటో ల దృష్టి కర్కాటకం మీద ఉన్నది. ఈ లోపల అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య సమయంలోనే ఈ సంఘటన జరిగింది. ఎంత కరెక్ట్ గా జరిగిందో చూడండి ! ఎక్కడో ఇంగ్లాండ్ లో ఉన్న ట్విన్స్ ఇదే సమయానికి మెక్సికోకెళ్లి అక్కడ ఎవడో లైసెన్స్ లేని టూర్ గైడ్ చూపించిన ఒక నీటిమడుగులో దిగి ఈతకొడుతూ మొసలిబారిన పడ్డారు. గ్రహప్రభావాలు లేవని అనగలమా చెప్పండి ! అమావాస్య, పౌర్ణమి సమయాలలో ఇలాంటి సాహసాలు చెయ్యకూడదని మనవాళ్ళు ఊరకే అనలేదు మరి !
- ఇది అంతర్జాతీయ వార్త కాదు. కానీ గ్రహప్రభావాలు మనిషి జీవితం మీద ఎంత సూక్ష్మంగా పనిచేస్తాయో చెప్పడానికి ఈ సంఘటనను వ్రాస్తున్నాను.
- ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జరిగాయి. ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే.
7, జూన్ 2021, సోమవారం
శనికుజుల ప్రభావం -2 - పాకిస్తాన్ రైలు ప్రమాదం - శ్రీలంకలో విపరీత వర్షాలు
కుజ శని ప్లూటో ల విధ్వంసం కొనసాగుతున్నది !
ఈరోజు ఉదయం దక్షిణ పాకిస్తాన్లో రెండు రైళ్లు గుద్దుకుని 40 మంది చనిపోయారు, 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో మొదటి రైలు పట్టాలు తప్పగా దాని పెట్టెలు పక్క ట్రాక్ మీద పడ్డాయి. ఎదురుగా వస్తున్న మరో రైలు వాటిని గుద్దుకుని అదీ పట్టాలు తప్పింది. రైల్వే సేఫ్టీ పరంగా ఇది మేజర్ యాక్సిడెంటే.
విధ్వంసానికి కారకుడైన కుజుడు ప్రస్తుతం కర్కాటకం 3 వ డిగ్రీలో సంచరిస్తున్నాడు. చావులకు కారకుడైన ప్లూటో (యమగ్రహం) మకరరాశిలో 2 వ డిగ్రీమీదున్నాడు. ఇద్దరికీ ఖచ్చితమైన సమసప్తక దృష్టి ఉన్నది. పాకిస్తాన్ దేశం ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్ కూ మధ్యలో ఉన్నది గనుక అది మకరం 3 వ డిగ్రీమీదున్నదని నా భావన. మకరం భూతత్వ రాశి గనుక పాకిస్తాన్లో భూపరమైన యాక్సిడెంట్ జరిగింది.
విచిత్రంగా ఇదే సమయంలో, శ్రీలంకలో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. కొన్ని వందల ఇళ్ళు దెబ్బతిన్నాయి. 245,000 మంది ఈ వర్షాలవల్ల దెబ్బతిన్నారు. సింహరాశి శ్రీలంకను సూచిస్తుందని వ్రాశాను. దానికి ద్వాదశంలో జలతత్వరాశిలో ఏర్పడిన ఈ యోగం వల్ల అక్కడ విపరీతమైన వర్షాలు పడ్డాయి. కర్కాటకం జలతత్వరాశిగా శ్రీలంకలో జలప్రమాదాన్ని సృష్టించింది.
ఈ రకంగా, ఒకే గ్రహయోగం, ఆ దేశాన్ని బట్టి, ఆ గ్రహాలను బట్టి రకరకాలైన ఫలితాలనిస్తుంది. మనుషులకైనా ఇంతే. చేసుకున్న కర్మ ఎవరినీ వదలదు కదా మరి !
6, జూన్ 2021, ఆదివారం
శనికుజుల విధ్వంసం మొదలైంది - బుకీనా ఫాసో మారణకాండ
నాలుగో తేదీన వ్రాశాను. అయిదున మొదలైంది విధ్వంసం.
పశ్చిమ ఆఫ్రికాలోని బుకీనా ఫాసో అనే చిన్న దేశంలో ఇస్లామిక్ టెర్రరిస్టులు దాడిచేసి వందమంది అమాయకప్రజలను దారుణంగా చంపేశారు. వీరివెనుక ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ సంస్థలున్నాయి. ఒకప్పుడు నలభైఏళ్ల పాటు కాశ్మీర్లో జరిగిందే ఇప్పుడక్కడ జరుగుతోంది. దౌర్జన్యం, చంపడాలతో ఇస్లాంని ఎలా వ్యాప్తి చేస్తారో ఆ అల్లాయే జవాబు చెప్పాలి ! ఒకవైపు ఇస్లామంటే శాంతి అంటారు, మరోవైపు ఇలా జనాన్ని చంపుతుంటారు. ఇదేం ఇస్లామో మరి? మతం కోసం జనాన్ని చంపడమేంట్రా దరిద్రుల్లారా! ఎవర్రా మీకు చెప్పింది?
ఆఫ్రికా దేశాలలో నల్లవాళ్ళెక్కువ, కనుక అవి శనిరాశులైన మకర కుంభాల పరిధిలో ఉంటాయి. వీటిలో కొంచం సంపన్నదేశాలు కుంభరాశిలో ఉంటే, పేదదేశాలు మకరంలో ఉంటాయి. అసలు రాశిచక్రంలో ఏయే డిగ్రీలు ఏయే దేశాలను సూచిస్తాయి అన్న విషయం మీద నేను చేస్తున్న యాస్ట్రో రీసెర్చి పూర్తయ్యాక దానినొక పుస్తకంగా ప్రచురిస్తాము. 'మెడికల్ ఆస్ట్రాలజీ' లాగా జ్యోతిషశాస్త్ర విద్యార్థులకు అదొక టెక్ట్ బుక్ అవుతుంది. అప్పుడుగాని ప్రపంచ జ్యోతిష్యశాస్త్ర చరిత్రలో ఈ విషయంపైన ఉన్న అసందిగ్ధత సమసిపోదు.
ఆ విషయాన్ని అలా ఉంచితే, బుకీనా ఫాసో అనేది మకరరాశిలో 1 డిగ్రీమీద ఉందని నేను భావిస్తున్నాను. దీనికి కారణమేమంటే, మకరం 2 వ డిగ్రీమీదున్న ప్లూటో మరియు కర్కాటకంలో ఇప్పుడే ప్రవేశించిన కుజులమధ్యన ఖచ్చితమైన సమసప్తక దృష్టి ఏర్పడింది. ప్లుటోను జ్యోతిష్యంలో యమగ్రహమంటారు. అంటే,చావుకు సూచకుడు. వీరిద్దరి దృష్టివల్ల విధ్వంసం జరిగి జనం చనిపోతారు. కరెక్ట్ గా తేదీలుకూడా పొల్లుపోకుండా అదే జరిగింది చూడండి మరి !
4, జూన్ 2021, శుక్రవారం
రాబోయే యాభై రోజులు
2-6-2021 నుండి కుజుడు కర్కాటకరాశిలో అడుగుపెట్టాడు. అదాయనకు నీచస్థితి. ఇప్పటికే శని మకరంలో కూర్చుని తమ ప్రపంచ ప్రణాలికను అమలుచేయడానికి ఆయనకోసం ఎదురుచూస్తున్నాడు, . వీరిద్దరి మధ్యనా సమసప్తక దృష్టి జూలై 20 వరకూ, అంటే యాభై రోజులపాటు ఉంటుంది. ఈ యాభై రోజులూ ప్రపంచానికి, ముఖ్యంగా ఇండియాకు గడ్డురోజులు కాబోతున్నాయి.
నీచకుజుడు, శనులమధ్యన ఏర్పడుతున్న సమసప్తకదృష్టి వల్ల భూకంపాలు, వానలు, వరదలు రావడం, భవనాలు, వంతెనలు కూలడాలు, రవాణా ప్రమాదాలు మొదలైనవి జరుగుతాయి.
ఇవేగాక, కరోనా మూడోవిడత వడ్డన (థర్డ్ వేవ్) ఇదే సమయంలో వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రపంచంలోని మిగతాదేశాల సంగతెలా ఉన్నా, ఇండియాలో ఈ సూచన బలంగా ఉన్నది, మకరరాశి ఇండియాను సూచిస్తుంది గనుక. కాబట్టి మళ్ళీ వినాశనం తప్పదు !
ఇప్పటివరకూ వచ్చిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్ వరదలు, గల్ఫ్ లో, శ్రీలంక దగ్గర ఓడలు మునిగిపోవడం ఇవన్నీ రాబోయే వాటికి సాంపిల్స్ మాత్రమే. ఇండియా, మెక్సికో, కెనడా మొదలైన మకర - కర్కాటక దేశాలు ఈ యాభై రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇదిగాక ఇండియాకు శత్రువులు పెరుగుతారు. పాకిస్తాన్ నుంచి ఎదురుదాడి ఎదుర్కోవలసి వస్తుంది. అది కాశ్మీర్ పాటను మళ్ళీ అందుకుంటుంది.
ఈ యాభైరోజులలో వచ్చే పౌర్ణమి అమావాస్య పరిధులలో ఖచ్చితంగా దుర్ఘటనలు జరుగుతాయి. పరిధి అంటే ముందూ వెనుకా రెండు రోజులని అర్ధం. కనుక జాగ్రత్తలు చాలా అవసరం.
10th June 2021 - అమావాస్య + సూర్యగ్రహణం.
24th June 2021 - పౌర్ణమి
9th July 2021 - అమావాస్య
24th July 2021 - పౌర్ణమి
జాగ్రత్తపడండి మరి !
3, జూన్ 2021, గురువారం
శ్రీలంక తీరంలో మునిగిన ఓడ - జ్యోతిష్యం ఏమంటోంది?
- శ్రీలంక అసలు పేరు సింహళదేశం. అంటే, సింహాలుండే దేశమని అర్ధం.
- శ్రీలంక జెండా మీద కత్తిని పట్టుకున్న సింహం ఉంటుంది.
- మే 20 న చంద్రుడు సింహరాశిలో ఉంటూ, నా లాజిక్ నిజమని చెబుతున్నాడు.
- 4/10 ఇరుసులో ఉచ్ఛరాహుకేతువులతో సింహానికి అర్గళం పట్టింది. అంటే ఆ దేశానికి మూడిందని అర్ధం.
- శత్రు రోగ ఋణ స్థానమైన షష్ఠంలో శని ప్లూటో లుంటూ, జలతత్వరాశి అష్టమమూ అయినా మీనాన్ని చూస్తున్నారు. అంటే, మత్స్యసంపద దెబ్బతింటుందని అర్ధం. ప్రస్తుతం ఈ ఓడ మునగడం వల్ల అదే జరగబోతున్నది.
- శని ప్లూటో లు షష్టాష్టక దృష్టితో సింహచంద్రుడిని చూస్తున్నారు. రాహు శుక్రులను కోణదృష్టితో చూస్తున్నారు. రాహువు రసాయనాలకు, యాసిడ్స్ కు కారకుడని మనకు తెలుసు. శని ఆయిల్ కి సూచకుడు. శుక్రుడు నీటికి సూచకుడు.
- రాహుశుక్రులు చంద్రునితో కేంద్రదృష్టిలో ఉన్నారు. జలప్రమాదం సూచితం.
- అన్నింటినీ మించి, చతుర్ధమూ, జలతత్వరాశీ అయినా వృశ్చికంలో కుజుని సూచిస్తూ ఉచ్చ కేతువున్నాడు. దీనివల్ల నీటిలో అగ్ని సూచితమౌతున్నది.










