28, ఫిబ్రవరి 2026, శనివారం

ఎలైట్ మేరేజ్

నిన్న మా ఆశ్రమంలో ఒక పెళ్లి జరిగింది.

ఇది ప్రేమవివాహం. ఆ తరువాత, పెద్దలు అంగీకరించిన వివాహం.

ఆశ్రమంలో నిరాడంబరంగా జరిగిన వివాహం.

కేవలం నలభైఅయిదు నిముషాలలో పెళ్లి అయిపోయింది.

మంత్రాలు లేవు. హంగులు లేవు. ఆర్భాటాలు లేవు. మేకప్పులు, వీడియోలు, ఫోటోషూట్ల అనైతికపోకడలు  లేవు. ఎరువుతెచ్చుకున్న సంగీత్ లు, బారాత్ లు, ఆడాళ్ళ డాన్సులు లేవు. మైకులగోల లేదు. 

పిల్లలగోల, సంతమార్కెట్ లాంటి వాతావరణం, అహంకారధోరణులు, అలుగుళ్ళు, అరుచుకోవడాలు, కోపతాపాలు, వస్తువులు పోవడాలు, ఏడుపులు, పెడబొబ్బలు, గొడవలు, ఒళ్లలిసిపోయేలా, కళ్ళు తిరిగిపోయేలా కష్టపడిపోవడాలు, కట్నకానుకలు, పెట్టుపోతల గొడవలు, తొంభయి రకాల ఐటమ్స్ తో భోజనాలు, అందులో సగంపైన వృధాకావడం  -- ఇవేవీ భూతద్దంతో వెతికినా ఎక్కడా లేవు.

మౌనంగా, నిశ్శబ్దంగా ఉన్న ఆహ్వానితులు.

మంద్రమైన సన్నాయి మేళం.

హడావుడీ, తొక్కిసలాటా లేని ఆహ్లాదమైన ఆశ్రమవాతావరణం.

చేస్తున్న తంతుకు అర్ధాన్ని తెలుసుకుంటూ అరగంటలో అయిపోయిన పెళ్లి.

అది - పంచవటి నేర్పిన సంస్కారం.

అసలైన సనాతన హిందూధర్మ జీవనవిధానం.

మంత్రాలు లేకపోవచ్చు. కానీ, వాటి అర్ధాలను వివరించడం జరిగింది.

విసుగుపుట్టే తంతులు లేకపోవచ్చు. కానీ, హిందూధార్మిక వివాహంలోని ముఖ్యఘట్టాలన్నీ ఉన్నాయి.

ఉదయం 11.30 కి కార్యక్రమం మొదలైతే, మధ్యాన్నం 1.30 గంటకి ఉపనయనం, పెళ్లి, భోజనాలు అన్నీ అయిపోయి, అతిధులు తిరిగి బయలుదేరడం కూడా జరిగిపోయింది.

ఇదే అసలైన 'ఎలైట్ మేరేజి' అని మావాళ్లతో అన్నాను.

ఎలైట్ అంటే, కులీన, ఉన్నతవర్గానికి చెందిన అని అర్ధాలున్నాయి. 'క్లాస్' అని అర్ధం చెప్పుకోవచ్చు.

పంచవటి శిష్యులందరూ ఈ చీకటిప్రపంచంలో వెలుగుతున్న దీపాలవంటివారు. అంటే లైట్లన్నమాట.

మనలో 'లైట్' ఉన్నపుడు, మనచుట్టూ 'ఎలైట్' లేకుండా ఎలా ఉంటుంది?

ఈ లైటూ, ఎలైటూ, కులంతో, డబ్బుతో, అధికారంతో, హోదాతో, దర్పంతో వచ్చేవి కావు.

ఉన్నతమైన సంస్కారపు విలువలతో, ధర్మబద్ధమైన  ఆధ్యాత్మిక జీవనంతో వస్తాయి.

ఇది కులాంతర వివాహం. 

'మేము గుణానికి మాత్రమే విలువనిస్తాము. కులానికి కాదు' అని నేను ఎన్నోఏళ్లుగా చెబుతున్నదానికి ఋజువే ఈ వివాహం.

'మేము ఊరకే మాటలను చెప్పము. చెప్పినది చేసి చూపిస్తాము' అనడానికి కూడా ఇదే నిదర్శనం.

పంచవటిలో అన్నికులాలూ ఉన్నాయి. పేదలనుంచి, కోటీశ్వరులవరకూ అన్ని తరగతులవారూ, వర్గాలవారూ ఉన్నారు. కానీ మేమంతా ఒకే కుటుంబం.

దానిపేరు 'పంచవటి' కుటుంబం.

ఇక్కడ అసలైన ఆధ్యాత్మికత ఆచరణాత్మకంగా దర్శనమిస్తుంది.

ఎంతోమంది సంస్కర్తల, మహనీయుల భావాలు ఇక్కడ కార్యరూపం దాలుస్తాయి.

ప్రపంచపు వెకిలితనానికి భిన్నమైన ఉదాత్తమైన, ఉన్నతమైన, సంస్కారపూరితమైన జీవనవిధానం ఇక్కడ అడుగడుగునా కనిపిస్తుంది.

అందుకే అంటున్నాను ఇది 'ఎలైట్ మేరేజ్' అని.

'వర్గం లేనిదే స్వర్గం' అని జిల్లెళ్ళమూడి అమ్మగారన్నారు.

'భక్తేర్ జోతి నోయ్' (భక్తులలో కులం ఉండదు) అని శ్రీరామకృష్ణులన్నారు.

దానిని నిజం చేసి చూపిస్తున్నాం.

స్వర్గాన్ని భూమిపైన ఆవిష్కరించే ప్రయత్నాన్ని చేస్తున్నాం.

ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో జరగాలని, ఎంతోమంది జీవితాలలో అవి 'లైట్' ను నింపాలని ఈ సందర్భంగా ఆశిస్తూ, ఈ 'ఎలైట్ మేరేజి' లో పాలుపంచుకున్న అందరికీ, ముఖ్యంగా లండన్, దుబాయ్, అమెరికాల నుండి వచ్చి మరీ ఈ వివాహంలో పాలుపంచుకున్నవారికి, రాగలిగినవారికి, రాలేకపోయినవారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు పంచవటిశిష్యులకు ఈ సందర్భంగా నా ఆశీస్సులందిస్తున్నాను.

అర్ధంలేని ప్రహసనాలుగా నడుస్తున్న నేటి పెళ్లిళ్లన్నీ ఈ 'ఎలైట్ మేరేజి' ని చూచి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

read more " ఎలైట్ మేరేజ్ "

26, ఫిబ్రవరి 2026, గురువారం

సోదియోగి

ఆశ్రమంలో ఒక పెళ్లి పెట్టుకున్నాం. దానికని శిష్యులు ఒక్కొక్కరే వస్తున్నారు.

ఇవాళ టిఫిన్లయ్యాక మాట్లాడుకుంటూ ఉండగా శిష్యులు ఒక ప్రతిపాదన తెచ్చారు.

'గురూజీ. మీరేమనుకోకపోయితే ఒక చిన్న మాట' అన్నారు.

'చెప్పండి' అన్నాను.

'ఏమీలేదు. మీరిప్పటిదాకా మొదలుపెట్టిన భజనలు, డాన్సులు అన్నీ పాతబడిపోయాయి. ఇప్పుడవేవీ అమ్ముడుపోవడం లేదు. ఆశ్రమానికి ఆదాయం తగ్గిపోయింది. అందుకని మాదొక కొత్త ఐడియా' అన్నారు.

ఆదాయమనేసరికి నాకు నూతనోత్సాహం పెల్లుబికింది.

'త్వరగా చెప్పండి' అన్నాను పక్కమీదనుంచి బద్దకంగా లేస్తూ.

'ఏమీలేదు. మీ రెండుపాదాలకు ఫోటో తీసి AI టూల్స్ తో సరిదిద్ది, ఆ ఫోటోలను మార్కెటింగ్ చేద్దామని అనుకుంటున్నాం. ముందు మీ శిష్యులందరూ కొనుక్కుంటారు. ఆ తర్వాత అందరూ కొనుక్కుంటారు' అన్నారు.

నాకనుమానం వచ్చింది.

'అందరూ ఎందుకు కొనుక్కుంటారు?' అడిగాను.

'పిచ్చిజనం ఏదైనా కొనుక్కుంటారు. అంతా మనం మార్కెటింగ్ చేయడంలో ఉంటుంది. ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన బాబాలు, గురువులు అందరూ ఎలా అయ్యారు మరి? ఈ ఫోటో  దగ్గరుంటే మీకు అదృష్టం  తన్నుకుంటూ వస్తుంది అని ప్రచారం చేద్దాం. చచ్చినట్టు కొనుక్కుంటారు' అడిగారు శిష్యులు.

అదీ నిజమేగా అనిపించింది.

'ఫొటోను కొనుక్కున్నవాళ్ళు దానిని పూజామందిరంలో అందరు దేవుళ్లతో బాటుగా పెట్టుకుంటారు. లేదంటే ఆ దేవుళ్లను మీ పాదాల క్రింద పెడతారు. లేదా, భక్తి ముదిరితే చిన్న చిన్నకార్డులుగా మార్చి జేబులలో పెట్టుకుంటారు. ఇంకా ముదిరిపోతే లాకెట్లుగా మార్చి మెళ్ళో దండలుగా వేసుకుంటారు. మీ పాదాలకు ప్రచారమూ అవుతుంది. మనకు ఆదాయమూ వస్తుంది. ఎలా ఉంది ఐడియా?' అడిగారు శిష్యులు.

ఇన్నాళ్లూ ఈ ఐడియా రానందుకు నామీద నాకే చెడ్డ చిరాకేసింది.

'వెరీ గుడ్ ఐడియా. ఎంత పెడుతున్నారు రేటు?' అడిగాను.

'ఒక కాలుకు రెండువేలు చొప్పున రెండుకాళ్ళకూ నాలుగువేలు పెడదాం' ముక్తకంఠంతో డిసైడ్ చేశారు శిష్యులు.

'మన కాళ్లకు అంత విలువుందా?' అని నాకు అనుమానమేసినప్పటికీ, వాళ్ళు చెబుతున్నారు గనుక, ఉందేమోలే అనిపించి 'ఓకే. ప్రొసీడ్. అయితే ఈ స్కీముకు ఏ పేరు పెడుతున్నారు?' అని అడిగాను.

'బురిడీబాబా లేదా సోదియోగి' అని రెండు టైటిల్స్ అనుకుంటున్నాం, మీరు ఏదో ఒకటి డిసైడ్ చెయ్యండి' అన్నారు శిష్యులు.

'బాబా పాతబడిపోయింది. యోగి బెటర్' అన్నాను.

'సరే గురూజీ, 'సోదియోగి' టైటిల్ ని ఫైనల్ చేద్దాం' అన్నారు శిష్యులు.

'ఎక్సలెంట్. గో ఎహెడ్. విజృంభించండి. ఈ ఫోటోలు లక్షలాది అమ్ముడుపోవాలి. మనకు కోట్లు వచ్చిపడాలి. మరి, ఆ డబ్బుతో ఏం చేద్దాం?' అడిగాను.

'ఏముంది? నల్లమల అడవులలో ఒక నూరెకరాలు కొనేద్దాం' అన్నారు శిష్యులు.

'అడవులు అలా అమ్మరు' అన్నాను కోపంగా

'మరీ మంచిది. అమ్మకపోతే ఆక్రమిద్దాం. ఆక్రమించేసి మన ఆశ్రమం బ్రాంచిని అక్కడ కడదాం' అన్నారు.

'భలే బాగుంది. ఇక పనిమీదుండండి' అని  ఆజ్ఞాపించాను.

'సరే గురూజీ, మీరు విశ్రాంతి తీసుకోండి. మిగతా పని మేము చూసుకుంటాం' అంటూ వాళ్ళు పనిలోకి దిగారు.

నేను పక్కమీద వెనక్కు వాలి, మళ్ళీ యూట్యూబులో మునిగిపోయాను.

read more " సోదియోగి "

1, ఫిబ్రవరి 2026, ఆదివారం

మా 77 వ గ్రంధంగా 'జ్ఞానసంకలినీ తంత్రము' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 77 వ గ్రంధంగా, 'జ్ఞానసంకలినీ తంత్రము' అనబడే ప్రాచీనగ్రంధమునకు నా వ్యాఖ్యానమును నేడు విడుదల చేస్తున్నాము. 


తంత్రములన్నీ శివశక్తుల సంవాదరూపములై యుంటాయి. ఈ గ్రంధము కూడా అటువంటిదే. దీనియొక్క పేరునుబట్టి, అనేక ఇతరతంత్రముల నుండి సేకరించబడిన జ్ఞానము ఈ గ్రంధములో ఒకచోట కూర్చబడినదని తెలుస్తున్నది.


పెద్దదైన ఏ ఇతర గ్రంధమునకూ ఇది అనుబంధము కాకుండా, స్వతంత్రరచనగా కనిపిస్తున్నది. దీనిలోని భావములు కూడా, వివిధ యోగోపనిషత్తులనుండి, జ్ఞానోపనిషత్తులనుండి సేకరించబడినట్లుగా ఉన్నాయి. దీని ప్రతిధ్వనులు భగవద్గీతలో కూడా మనకు దర్శనమిస్తాయి.


దీనిలో సృష్టిక్రమము, పంచభూతములు, చక్రములు, నాడులు, వాయువులు, వాటియొక్క పనులు, ఓంకారము, దానియొక్క మూడుభాగములు, ఆయాభాగముల తత్త్వములు, కుండలినీసాధన మొదలైన విషయములు వివరింపబడినాయి. ఆచారములు, తంతులకు భిన్నమైన జ్ఞానమార్గము, యోగశాస్త్రముతో మేళవింపబడి దీనిలో దర్శనమిస్తున్నది.


మధ్యయుగములనాటి అనేకగ్రంథములలో వలె, దీనిలో కూడా, వేదాంతమును, యోగశాస్త్రమును, తంత్రశాస్త్రమును సమన్వయపరచాలనిన ప్రయత్నం కనిపిస్తుంది. వేదాంత, యోగ, తంత్రశాస్త్రాభిమానులకు, జిజ్ఞాసువులకు మరియు సాధకులకు ఈ గ్రంధం ఉపయోగకరంగా ఉంటుందని మా విశ్వాసము.


ఈ గ్రంధము కూడా తిరుపతి బుక్ ఫెస్టివల్ లోని 35 వ నంబరు స్టాల్లో లభిస్తుంది. లేదా మా తక్కిన గ్రంధాలలాగే ఆన్లైన్ లో ఇక్కడ లభిస్తుంది. జిజ్ఞాసువులు, పాఠకులు మరియు మా అభిమానులు దీనిని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.

read more " మా 77 వ గ్రంధంగా 'జ్ఞానసంకలినీ తంత్రము' విడుదల "

నిస్వార్థ కర్మయోగులు


తిరుపతి బుక్ ఫెస్టివల్ లో మన స్టాల్ ను నడుపుతున్న నిస్వార్థకర్మయోగులను ఇక్కడ మీరు చూడవచ్చు. వీరందరూ, సాఫ్ట్ వేర్ రంగంలో సీనియర్ పొజిషన్స్ లో ఉన్న ఇంజనీర్లు. అదేసమయంలో మన పంచవటి సాధనామార్గంలో సీనియర్ సాధకులు కూడా.

అసలైన హిందూమతం గురించి, యోగమార్గం గురించి, పంచవటి భావజాలం గురించి, మీకున్న సందేహాలను, ఈ పదిరోజులలో ప్రత్యక్షంగా వీరిని కలిసి మీరు తీర్చుకోవచ్చు.

తిరుపతివాసులు దీనిని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.

read more " నిస్వార్థ కర్మయోగులు "