అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

12, అక్టోబర్ 2025, ఆదివారం

గెట్ టుగెదర్

నిన్నమధ్యాన్నం పాతఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు. తనతో మాట్లాడి దాదాపు రెండేళ్లయింది.  2023 లో తిరువన్నామలై వెళ్ళినపుడు చెన్నైలో కలిశాడు. అప్పటికి తనింకా సర్వీసులోనే ఉన్నాడు. ఏడాది క్రితం చెన్నైలోనే రిటైరయ్యాడు. చాలామంది మా కొలీగ్స్ లాగే తనుకూడా హైద్రాబాద్ లో సెటిలయ్యాడు.

'ఏంటి ఉన్నట్టుండి గుర్తొచ్చాను?' అడిగాను.

'ఈ నెల చివరివారంలో మన బ్యాచ్ వాళ్లందరికీ గెట్ టుగెదర్ పెడుతున్నాం. నువ్వూ రావాలి' అన్నాడు.

మా బ్యాచ్ లో అందరికంటే చిన్న కొలీగ్ మొన్న జూలైలో దిగిపోయాడు. దీనితో రైల్వేలో మా బ్యాచ్ అందరూ రిటైరయ్యారు.

ఇలాంటి పార్టీలన్నీ హైదరాబాద్ లోనే పెడుతుంటారు వీళ్ళు. అది మొదటినుంచీ అలవాటు.

'సారీ నేన్రాను' అన్నాను తడుముకోకుండా.

'అదేంటి? ఎందుకలా?' అన్నాడు.

'మీరు మాట్లాడుకునే మాటలు నేను భరించలేను. దానికోసం అంతదూరం రావడం ఎందుకు?' అన్నాను.

'హైదరాబాద్ రావా అసలు?' అడిగాడు.

'నిన్నగాక మొన్న హైదరాబాద్లోనే ఉన్నా' అన్నాను.

'ఏం?' అన్నాడు.

'ఏదో పనిమీద వచ్చాలే' అన్నాను.

'మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా. నేను అత్తాపూర్ లో ఉంటాను. వచ్చి కలిసేవాణ్ని కదా' అన్నాడు.

'మామాపూర్ వద్దన్నాడు' అన్నాను.

'వాడెవడు?' అన్నాడు.

'నేనే. ఎవరికీ చెప్పాలనిపించలేదు. అందుకే ఎవరినీ కలవలేదు. వచ్చిన పనిచూసుకున్నాను. వెనక్కు వచ్చేశాను' అన్నాను.

'మనవాళ్ళని కలవచ్చుగా కనీసం' అన్నాడు.

'నా వాళ్ళని కలిశాను. మనవాళ్లతో నాకెందుకు?' అన్నాను.

పార్టీకి నన్ను ఒప్పించాలని చాలాసేపు ప్రయత్నించాడు. కానీ కుదరలేదు.

'ఆశ్రమం కట్టుకున్నావని విన్నాను' అన్నాడు చివరకు.

'నేను కట్టుకోలేదు. మేస్త్రీలు కట్టారు' అన్నాను.

'అదేలే. ఏం చేస్తుంటావక్కడ?' అడిగాడు కుతూహలంగా.

'నువ్వు మీ ఇంట్లో చేసేదే' అన్నాను.

'దానికోసం అంతదూరం పోవడమెందుకు?' అడిగాడు.

'మనుషులని వెతుక్కుంటూ అడివిలోకి వచ్చాను' అన్నాను.

'ఊరికి దూరమని విన్నాను' అన్నాడు.

'నువ్వు సరిగ్గా వినలేదు. ప్రపంచానికే దూరం' అన్నాను.

'అదికాదు. టైం పాస్ ఎలా అవుతుంది?' అన్నాడు. 

చాలామంది అడిగే ప్రశ్న ఇదే.

'దానిదేముంది? మనం పట్టుకోకపోతే చాలు, అదే పాసవుతుంది' అన్నాను.

అదేదో పెద్ద జోకులాగ గట్టిగా నవ్వేశాడు.

'పుస్తకాలు చదువుతుంటావేమో?' అడిగాడు.

'రాస్తుంటాను' అన్నాను.

అది వినకుండా, 'నేనొచ్చి నాల్రోజులుంటా మీ ఆశ్రమంలో' అన్నాడు.

'నాలుగు గంటలు కూడా ఉండలేవు' అన్నాను.

'అదేంటి? వస్తానంటే వద్దంటావు?' అన్నాడు నిష్టూరంగా.

'వచ్చాక నువ్వు పడే బాధ చూడలేను కాబట్టి, వద్దంటున్నాను' అన్నాను.

'మనవాళ్లంతా హాయిగా హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీస్ లో సెటిలైతే, అసలెందుకు అలా దూరంగా ఉంటున్నావు?' అడిగాడు.

'నా కర్మ' అన్నాను.

'అయితే చూడాల్సిందే మీ ఆశ్రమాన్ని' అన్నాడు.

'నీ కర్మ' అన్నాను.

'గాయత్రిని వదలకు. అప్పట్లో బాగా చేసేవాడివి కదా' అడిగాడు 30 ఏళ్లనాటి సంగతులు గుర్తుచేసుకుంటూ.

'నేను వదల్లేదు. తనే వదిలేసింది' అన్నాను.

'అదేంటి?' అన్నాడు మళ్ళీ.

'సావిత్రి వచ్చిందని గాయత్రి వెళ్ళిపోయింది' అన్నాను.

'ఏంటి అదోలా మాట్లాడుతున్నావ్?' అన్నాడు.

'నిన్న సాయంత్రం నుంచీ పిచ్చెక్కింది' అన్నాను.

'ఇంతకీ పార్టీకి రానంటావ్?' అడిగాడు.

'రానని, రాలేనని కాదు. వచ్చి, మిమ్మల్ని బాధపెట్టడం ఎందుకని ఆలోచిస్తున్నాను' అన్నాను.

'ఏంటిరా బాబు. సరిగ్గా చెప్పు' అన్నాడు తల బాదుకుంటూ.

'ఏముందిరా? మీరంతా అక్కడ చేరి ఏం చేస్తారు? తింటారు. తాగుతారు. షేర్లు, కార్లు, ఆస్తులు, ఒక్కొక్కడు ఎన్ని ఇళ్ళు కొన్నాడు, పిల్లలు ఎక్కడ సిటిలయ్యారు, వాళ్లెలా సంపాదిస్తున్నారు, మీమీ గొప్పలు, ఎచ్చులు, ఈగోలు, రంకుపురాణాలు, రాజకీయాలు ఇవేగా మీరు మాట్లాడుకునేవి.

సర్వీసులో ఉన్నపుడు ఒక్కడంటే ఒక్కడు మనుషుల్లాగా బ్రతికార్రా మీరు? సగంమందివి అవినీతి బ్రతుకులు. మిగతా సగంమందివి అర్ధంలేని బ్రతుకులు. ఏముంది మీరు చెప్పేది నేను వినేది? మీ సోది నేను తట్టుకోలేను. నా సోది మీరు తట్టుకోలేరు. ఇంకెందుకు అక్కడకి రావడం?' అడిగాను.

ఫ్రెండ్ గాడు పట్టువదలని విక్రమూర్ఖుడు.

'అయినా సరే ఒకసారి రావచ్చుకదా నా కోసం' అన్నాడు.

'నీకోసమైతే, ఈసారి వచ్చినపుడు చెప్తాను. కలువు. ఎక్కడన్నా డిన్నర్ చేద్దాం. మాట్లాడుకుందాం ' అన్నాను.

'సరే అలాగే. కానీ ఇదికూడా కాదనకు. ప్లీజ్'' అన్నాడు.

పాపం ఇంతగా భంగపోతున్నాడని, చివరికిలా చెప్పాను.

'సరే. వస్తాను. డేటు, వెన్యూ పంపించు. ఆ తర్వాత ఏం జరిగినా నా బాధ్యత లేదు. ముందే చెబుతున్నాను. మళ్ళీ నన్ను అనొద్దు' అన్నాను.

'అమ్మయ్య. ఒప్పుకున్నావ్. నేను మేనేజ్ చేస్తాలే. డోంట్ వర్రీ. నువ్వు రా' అన్నాడు.

'తెలిసి తెలిసి దిగుతున్నావ్. నీ కర్మ' అన్నాను.

ఫ్రెండ్ గాడు ఫోన్ పెట్టేశాడు.

read more " గెట్ టుగెదర్ "

3, అక్టోబర్ 2025, శుక్రవారం

లాభనష్టాలు

పొద్దున్న ఏదో పనిలో ఉండగా, మిత్రుడు  రవి ఫోన్ చేశాడు.

అది తన వాకింగ్ టైం.

"నవరాత్రులు బాగా జరిగాయా?" అడిగాడు.

"ఆ. జరిగాయి" అన్నాను.

"పలానా గురువుగారి ఆశ్రమంలో అమ్మవారి పూజలకు, అలంకరణకు బాగా డబ్బులు వసూలు చేశాడు. తెలుసా?" అడిగాడు.

"నాకనవసరం. అలాంటి చెత్త నాకు చెప్పకు" అన్నాను.

నన్ను రెచ్చగొట్టడం రవికి సరదా. నేనేదైతే వద్దంటానో అవే చెబుతూ ఉంటాడు.

"అలాకాదు. అమ్మవారికి అలంకరణ చెయ్యాలి, పూజలు చెయ్యాలి. డబ్బులు పంపండి, పంపండి' అని శిష్యుల వెంటపడి మరీ అడుక్కున్నాడు. బాగానే పోగయ్యాయిట మొత్తంమీద" అన్నాడు.

గతంలో ఆయన దగ్గర ఏదో అమ్మవారి మంత్రాన్ని ఉపదేశం పొందాడు రవి. ప్రస్తుతం ఇద్దరికీ చెడింది. కానీ వదలకుండా వాళ్ళ న్యూసు మాత్రం సేకరిస్తూ ఉంటాడు.

'ఇంతకీ ఏమంటావ్?' అన్నాను.

'నువ్వు కూడా అలా చేస్తే బాగుంటుందేమో?', అన్నాడు.

'అలంకరణ నేనే చేసుకోను, ఇక అమ్మవారికేం చేస్తాను?' అన్నాను.

'ఇంత సమయాన్ని ఇతరులకోసం వెచ్చిస్తున్నందుకు నీకు లాభం ఉండాలి కదా?" అన్నాడు.

' అలాంటిదేమీ ఉండదు. ఇక్కడ ఎవడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు. అంతే ' అన్నాను.

'మరి నీ శిష్యులకైనా ఏదో ఒక లాభం ఉండాలి కదా?' అడిగాడు.

'ఉంటుంది. అది డబ్బుతో కొలవబడేది కాదు' అన్నాను.

' ఇలా అయితే నీ దగ్గరకెవరొస్తారు? ' అన్నాడు.

' రమ్మని ఎవడు దేబిరిస్తున్నాడు?' అన్నాను.

' అదికాదు. లాభం లేకుండా ఎలా? ' మళ్ళీ అడిగాడు.

'లాభనష్టాలను దాటి ఆలోచించలేవా?' అడిగాను.

'ఎలా? జీవితమంతా అవేగా?' అన్నాడు.

'లాభం కోరుకుంటే నష్టం. నష్టం అనుకోకపోతే లాభం' అన్నాను.

' నీ ధోరణి నీదేగాని నా మాటవినవు కదా? ' అన్నాడు.

' నువ్వు వాకింగ్ మానేసి యోగాభ్యాసం చెయ్యమంటే చెయ్యవు కదా?' అన్నాను.

'బై' అంటూ ఫోన్ పెట్టేశాడు రవి.

read more " లాభనష్టాలు "

2, అక్టోబర్ 2025, గురువారం

గర్భగుడి

'అష్టమి నాడు దర్శనానికి 8 గంటలు పట్టిందట?'  అన్నాడు శిష్యుడు మొన్న.

'ఎక్కడ?' అడిగాను.

'విజయవాడ కనకదుర్గా అమ్మవారి గుడిలో' అన్నాడు.

'అలాగా' అన్నాను.

'మనకేంటో ఇక్కడ? అసలివాళ ఏ తిథో కూడా తెలీడం లేదు' అన్నాడు.

నవ్వాను.

'గుడిని దాటాకే గర్భగుడి' అన్నాను.

read more " గర్భగుడి "

మా 74 వ పుస్తకం 'యోగినీ హృదయము' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 74 వ పుస్తకంగా 'యోగినీ హృదయము' అనే ప్రాచీన తంత్రగ్రంధమునకు నా వ్యాఖ్యానమును 
ఈ నవరాత్రులలో విడుదల చేస్తున్నాను. ఇది దాదాపు 1000 సంవత్సరాల నాటి ప్రాచీనగ్రంధము. దీనికి నిత్యాహృదయమని, సుందరీహృదయమని పేర్లున్నాయి.

శ్రీయంత్రములో నవావరణలున్నాయి. ఆయా ఆవరణదేవతలను యోగినులంటారు. వారిపేర్లు ఖడ్గమాలాస్తోత్రంలో వస్తాయి. ఆ యోగినుల యొక్క ఉపాసనను ఏ విధముగా చేయాలనిన సారమును వివరిస్తుంది గనుక, ఈ గ్రంధమునకు 'యోగినీ హృదయమని' పేరు పెట్టబడింది.  

ఇది వామాచార శ్రీవిద్యోపాసనకు చెందినది. వామకేశ్వర తంత్రములోని ఒక భాగమని కొందరు పండితుల నమ్మిక కాగా, ఇది ప్రత్యేకమైన గ్రంథమని, వామకేశ్వర తంత్రమునకు దీనికి సంబంధం లేదని మరి కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇది వామాచార శ్రీవిద్యోపాసనా గ్రంధమే. దీనిలో మన్మధోపాసితమైన కాదివిద్య చెప్పబడింది.

ఈ గ్రంధములో మూడు అధ్యాయములున్నాయి. అవి, చక్రసంకేతము, మంత్రసంకేతము, పూజాసంకేతములనిన పేర్లతో ఉన్నాయి. శ్రీచక్రముయొక్క వివిధ ఆవరణలు, వాటి అర్ధములు మొదటి అధ్యాయములో ఉన్నాయి. మంత్రభాగము, చక్రేశ్వరీ దేవతల వివరణ, ఆయా మంత్రార్ధములు రెండవ అధ్యాయంలో ఉన్నాయి.  శ్రీచక్రమును వామాచారపద్ధతిలో ఏ విధముగా పూజించాలనిన వివరము మూడవ అధ్యాయంలో ఇవ్వబడింది.

ఎన్నో తంత్రరహస్యముల సమాహారమైన ఈ గ్రంధాన్ని విజయదశమి నాడు విడుదల చేయడం కాకతాళీయం కాదని నేను భావిస్తున్నాను. ఈ గ్రంధాన్ని వ్రాసి, ప్రచురించే పనిలో సహాయపడిన నా శిష్యులందరికీ ఆశీస్సులు. 

'ఈ - బుక్' ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

శ్రీవిద్యోపాసకులకు, శాక్తతంత్రాభిమానులకు, నా వ్యాఖ్యానం ఆనందాన్ని కలిగిస్తుందని భావిస్తున్నాను.
read more " మా 74 వ పుస్తకం 'యోగినీ హృదయము' విడుదల "

1, అక్టోబర్ 2025, బుధవారం

పూర్ణాహుతి

చాలారోజులనుంచీ తెలిసిన ఒక పెద్దాయన ఇవాళ ఫోన్ చేశాడు. ఆయనకు 75 పైనే ఉంటాయి.

కుశలప్రశ్నలయ్యాక, విషయంలోకొచ్చాడు.

'రేపు మా ఇంట్లో చండీహోమం పూర్ణాహుతి చేస్తున్నాము. మీరు రావాలి' అన్నాడు.

'అవడానికా?' అడిగాను.

'అదేంటి?' అన్నాడు.

అర్ధం కాలేదని అర్ధమైంది.

'పోయినేడాది కూడా చేసినట్టున్నారు హోమం?' అన్నాను.

'అవునండి. చేశాము' అన్నాడు.

'అప్పుడివ్వలేదా?' అడిగాను.

'ఇచ్చాము' అన్నాడు.

'మరి ఇంకెందుకు?' అన్నాను.

 'అంటే?' అన్నాడు.

'ఒకసారి పూర్ణంగా ఆహుతయ్యాక మళ్ళీ వ్వడానికి ఇవ్వడానికి ఇంకేం మిగిలుంటుంది?' అన్నాను.

ఏదో గొణుక్కుంటూ ఫోన్ పెట్టేశాడు పెద్దాయన.

నవరాత్రులు మళ్ళీ నవ్వుతున్నాయి.

read more " పూర్ణాహుతి "