Love the country you live in OR Live in the country you love

11, డిసెంబర్ 2018, మంగళవారం

ఈ లోకం...

ఈ లోకం
ప్రాచీన రంగస్థలం
ఈ లోకం
కౌపీన సంరక్షణం

ఇక్కడ ఒకే డ్రామా
అనేకసార్లు ఆడబడుతుంది
ఇక్కడ ఒకే కామా
అనేక సార్లు పెట్టబడుతుంది

ఇదొక గానుగెద్దు జీవితం
పిచ్చిమొద్దు జీవితం
ఇదొక పనికిరాని కాగితం
చదవలేని జాతకం

ఈ హాస్య నాటికలో ప్రతి నటుడూ
ఎన్నోసార్లు అదే పాత్రను పోషిస్తాడు
ఈ వేశ్యా వాటికలో ప్రతివాడూ
అనేకసార్లు అడుగుపెడతాడు

ఈ రంగస్థలాన్ని ఎలా వదలాలో
ఎవరికీ తెలీదు
ఈ డ్రామాని ఎలా ముగించాలో
ఎవరికీ తెలియదు
ఈ కామాని పుల్ స్టాప్ గా ఎలా మార్చాలో
ఎవరికీ తెలీదు

ఇక్కడ ప్రతివాడూ
చక్కగా జీవిస్తున్నాననుకుంటాడు
కానీ ఊరకే
ఏడుస్తూ బ్రతుకుతుంటాడు

ఇక్కడ ప్రతివాడూ
గెలుస్తున్నాననే అనుకుంటాడు
కానీ ప్రతిక్షణం
ఓడిపోతూనే ఉంటాడు

ఇక్కడ ప్రతివాడూ
ఎన్నో పొందుతున్నాననే భ్రమిస్తాడు
కానీ జీవితాన్ని
కోల్పోతున్నానని మర్చిపోతాడు

ఏవేవో గమ్యాలకోసం
ఎప్పుడూ వెదుకుతూ ఉంటాడు
అనుక్షణం కాళ్ళక్రింద కాలం
కరిగిపోవడం గుర్తించలేడు

పిచ్చివాళ్ళ నిలయం
ఈ లోకం
అచ్చమైన వలయం
ఈ లోకం

అంతు తెలియని పద్మవ్యూహం
ఈ లోకం
లోతు అందని వింతమోహం
ఈ లోకం...