ఇజ్రాయెల్ ఎన్నికలయ్యాయి. ఈ దేశ భవిష్యత్తు ఎలా ఉందో చూద్దాం.
రాజకీయ విశ్లేషణ
ప్రస్తుతం ఇజ్రాయెల్ లో 38 పార్టీలున్నాయి. అన్నీ ఎన్నికలలో పాల్గొన్నప్పటికీ, 11 పార్టీలు మాత్రమే చట్టసభలో అడుగుపెట్టగలిగే ఓట్లసంఖ్యను పొందాయి.
చట్టసభలో 120 సీట్లున్నాయి. వాటిలో నెతన్యాహు కూటమికి 53, ప్రతిపక్షానికి 48, అరబ్ పార్టీలకు 19 సీట్లొచ్చాయి. నెతన్యాహు కూటమిలో 5 మిత్రపక్షపార్టీలున్నాయి.
విచిత్రమేంటంటే ప్రతిపక్షం కూడా యూదులదే. నేషనల్, లిబరల్ అని అధికార, ప్రతిపక్ష యూదు పార్టీలను అనుకోవచ్చు. నేషనల్ భావజాలం ఉన్న నెతన్యాహు కూటమేమో, ఇజ్రాయెల్ యూదుల దేశమని, అయితే అరబ్బులు, క్రైస్తవులు మొదలైనవారు శాంతియుతంగా, కొన్ని హద్దులకు లోబడి ఉండవచ్చని అంటుంది. ప్రతిపక్ష యూదులేమో అరబ్బులను ఇతరులను కూడా ఉండనివ్వాలని, అయితే వారికి హద్దులు పెట్టకూడదని అంటారు.
ఈ రెండువర్గాలుగా విడిపోవడమే యూదులు చేస్తున్న అతిపెద్ద తప్పు. కలిసి ఒకేమాటమీద ఉంటే వీళ్లకు మొత్తం 101 సీట్లొచ్చేవి. చీలడం వల్ల, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత మెజారిటీ (61 సీట్లు) ఎవరికీ రాలేదు.
మనదేశంలో హిందువులు చేస్తున్న తప్పునే, ఇజ్రాయెల్ లో యూదులు చేస్తున్నారు. అందుకే ఇండియా, ఇజ్రాయెల్ రెండూ ఒకే బాటలో నడుస్తున్నాయి. భవిష్యత్తు గందరగోళమే.
ఇది రాజకీయ విశ్లేషణ. ఇప్పుడు, జ్యోతిషశాస్త్ర పరంగా గమనిద్దాం.
జ్యోతిష విశ్లేషణ
ఇజ్రాయెల్ కు 14-5-1948 న స్వాతంత్రం వచ్చింది. సమయం సాయంత్రం 3. 50. ఇప్పుడు జాతకాన్ని పరిశీలిద్దాం.
ఈ జాతకంలో పాక్షిక కాలగ్రస్తయోగం, మాలికాయోగం, నిత్యఏడుపు యోగం, ఎండ్రకాయ యోగాలున్నాయి. మొదటి రెండూ సరే, చివరి రెండూ ఏమిటని మీకు సందేహం రావచ్చు. సంస్కృతపదాలైతే మీకు అర్ధంకావడం కష్టమని, తేలికగా ఉండాలని, మీ సౌలభ్యం కోసం వాటిని నేనే పెట్టాను.
ఎప్పుడూ ఏదో సమస్యతో ఏడుస్తూ ఉండేది నిత్యఏడుపు యోగం. ఒకడు ఎదుగుతుంటే, పదిమంది కలిసి వాడిని క్రిందకు లాగేది ఎండ్రకాయయోగం. బాగున్నాయి కదా ! ఎంతసేపూ గ్రంధాలలో ఉన్న పదాలనే వాడితే ఎలా? మనమూ కొన్ని సృష్టించాలిగా !
పోతే, సూర్యుడు బలహీనుడు. గురుబలం లేదు. చంద్రబలం లేదు.
శత్రువులు మిత్రులలాగా నటిస్తూ వెన్నుపోటు పొడుస్తారు. ఆపదలమధ్యన దారులు వెతుక్కుంటూ బ్రతుకుతారు. 'దినదినగండం నూరేళ్లాయుష్షు' అనే సామెత సరిగ్గా సరిపోతుంది. అంత గొప్ప జాతకమేమీ కాదు.
నవాంశ చక్రాన్ని గమనిద్దాం.
ఇంటిదొంగలతో, వాళ్ళ కుట్రలతో ప్రమాదం ఉంటుంది. ఏది చేయాలన్నా అనేకవర్గాలనుండి ప్రతిఘటన ఉంటుంది. కొన్ని దూరదేశాల పైన ఆధారపడి ఈ దేశం ఎక్కువగా నడుస్తుంది.
ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశానికి రాహు మహర్దశ నడుస్తున్నది. ఇది 2022 లో మొదలై, 2040 వరకూ ఉంటుంది. ఇది మంచిదశ కాదు. యుద్ధాలు, కష్టనష్టాలతో కూడి నడుస్తుంది.
ఈ దశలో, 2025-27 మధ్యలో రాహు-గురుదశ నడుస్తుంది. ఇదే సమయంలో, గోచార యురేనస్, 9వ భావంలోని బలహీన సూర్యుడు, బుధులపైన సంచరిస్తున్నాడు. కనుక ఇతరదేశాల జోక్యాలు, కుట్రలు, మన దేశంపైన ఉన్నట్లే, ఈ దేశంపైన కూడా చాలా ఉన్నాయి. ఈ సమయంలో నమ్మకద్రోహాలు, వెన్నుపోట్లు ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్నది అదే. నమ్మకద్రోహాలు, కుట్రలవల్లనే ఈ ఎన్నికలలో అరబ్ పార్టీలు డిసైడింగ్ ఫేక్టర్స్ గా అవతరించాయి.
ఎవరికైతే మనమంటే పడదో, ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో, వాళ్లనే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఏమౌతుంది? అదే ప్రస్తుతం అక్కడ జరుగుతోంది. ముందుముందు ఇక్కడా జరుగుతుంది.
2027-30 మధ్యలో రాహు-శనిదశ నడుస్తుంది. ఈ దశలో ఇజ్రాయెల్ చాలా నష్టపోతుంది. గందరగోళం ఎక్కువౌతుంది. అల్లర్లు, కష్టనష్టాలు, సంక్షోభం ఎదురౌతాయి.
2030 తర్వాత వచ్చే బుధదశలో, ఇతరదేశాల సహాయంతో మాత్రమే ఈ సంక్షోభం నుండి ఇజ్రాయెల్ గట్టెక్కుతుంది.
ప్రస్తుతానికి మాత్రం ఇజ్రాయెల్ పరిస్థితి ఏమీ బాగాలేదు. భవిష్యత్తుకూడా, 2030 వరకూ అస్సలు బాలేదు.
యహోవానే ఈ దేశాన్ని రక్షించాలి !

