ఆశ్రమంలో క్రొత్త బిల్డింగు కడుతున్నాం. దాని పనులు జరుగుతున్నాయి. కట్టుబడికోసం ఇసుకట్రాక్టర్లు వస్తున్నాయి. శిష్యులు ఏవో పనులమీద బయటకెళ్తే నేనే దగ్గరుండి చూస్తున్నాను.
ఒక ట్రాక్టరబ్బాయి ఇలా అడిగాడు.
'ఇదేంటి సార్?'
చూస్తే, పాతికేళ్ళుంటాయి. ముఖంలో నిజాయితీ కనిపిస్తోంది.
'ఆశ్రమం' అన్నాను.
'అంటే?' అన్నాడు
'ఆశ్రమమే' అన్నాను.
'అంటే ముసలోళ్ల ఆశ్రమమా?' అడిగాడు.
'కాదు' అన్నాను.
'అంటే ఇక్కడ ఏం చేస్తారు?' అడిగాడు సంకోచంగా.
'ఏమీ చెయ్యం. ధ్యానమే' అన్నాను.
'అంటే మెడిటేషనా?' అడిగాడు.
'అవును. చదువుకున్నావా?' అన్నాను.
'డిగ్రీ చదివాను. అందరికీ నేర్పిస్తారా?' అన్నాడు.
'లేదు. మా వరకే' అన్నాను.
అతను నిరాశపడ్డాడు.
'మాది చిన్నకులం సార్' అన్నాడు నిరాశగా.
జాలేసింది. పల్లెటూళ్ళలో అన్నిటికీ కులం ముందుంటుంది.
'నీకైతే నేర్పిస్తాను. నేర్చుకుంటావా?' అడిగాను.
అనుమానంగా చూశాడు.
'దీనికి కులంతో పనిలేదు నాయనా. దేవుడిని చేరుకోవడానికి కులమెందుకు?' అన్నాను.
'అంటే, అందరూ చెప్పరు సార్' అన్నాడు.
'నేను చెప్తాను. నీకు శ్రద్ధ ఉంటే రా, నేర్పిస్తాను' అన్నాను.
'మాది ఫలానా కులం సార్' అన్నాడు.
' దానితో నాకు పని లేదు ' అన్నాను.
'మేం పనులు చేసుకుంటాం సార్. ఆదివారం అయితే రాగలను' అన్నాడు.
'సరే అలాగే రా' అన్నాను.
'అదేనా మందిరం?' అన్నాడు ధ్యానమందిరం వైపు చూస్తూ.
'అదే. అక్కడే అందరూ చేసేది. నువ్వూ అక్కడే' అన్నాను.
అతని ముఖంలో సంతోషం కనిపించింది.
'ఎంత కట్టాలి?' అడిగాడు, మళ్ళీ సంశయిస్తూ.
బాధేసింది.
'ఏంటి కట్టేది? ఇది బేరాల ఆశ్రమం కాదు. సారాల ఆశ్రమం' అన్నాను.
నమ్మలేనట్లు చూచాడు.
'రేపు ఆదివారం నుంచి వస్తాను సార్' అని ట్రాక్టర్ ఎక్కి వెళ్ళిపోయాడు.
నాకు పరిచయస్తులలో ఎంతోమంది పెద్దకులాల వాళ్ళు, బాగా చదువుకున్నవాళ్ళు ఉన్నారు. ఎవరూ ఇలా అడగలేదు. వాళ్ళ అహంకారాలు వాళ్లకు అడ్డుగోడలయ్యాయి. వినయానికి అదృష్టం పట్టింది.
ఆధ్యాత్మికలోకంలో అహంకారం ఎలా పనిచేస్తుంది?
గుంతలోనే నీళ్లు నిలబడతాయి. మిట్టమీదనుండి జారిపోతాయి.
ఇంత చిన్నవిషయం కోట్లాదిమందికి అర్ధం కాదు.
చల్లనిగాలీ, వెన్నెలా, విశాలమైన ప్రకృతీ, ఆరుబయట ఉన్నవారికే అందుతాయి గాని, ఆడంబరంగా ఏసీరూముల్లో దాక్కుని ఉండేవారికి ఎలా అందుతాయి?
'ఎవరి అదృష్టానికి ఎవరు కర్తలు?' అనుకున్నాను.