Pages - Menu

Pages

12, మార్చి 2026, గురువారం

గ్యాసుదేవుని మహిమలు

ఇవాళ తెల్లవారుఝామున బ్రహ్మముహూర్తంలో మంచినిద్రలో ఉండగా నారదమహర్షి కలలో కొచ్చాడు.

'నాయనా ! నీవు ఆశ్రమమునకే పూర్తిగా పరిమితమై పోయితివి. బయటి ప్రపంచమును ఈషణ్మాత్రమూ పట్టించుకొనుటలేదు. మరీ దద్దమ్మవగుచున్నావు. అప్పుడప్పుడు కాస్త బయటకు కూడా వెళ్లి లోకసంచారము చేయుచుండుము. అప్పుడు మాత్రమే నీకు లోకపుతీరు అవగతం కాగలదు' అని సెలవిచ్చి, నేనేదో చెబుదామనుకునేలోపు డామ్మని మాయమైపోయాడు.

'దేవతలకీ ఋషులకీ కూడా ప్రస్తుతం తీరిక ఉండటం లేదు. అందరూ డెలివరీ బాయ్స్ అయిపోతున్నారు. చెప్పాలనుకున్నది చెప్పేయడం మాయమైపోవడం. ఎదుటివాడి రియాక్షన్ కోసం ఆగడం లేదు. స్పీడు బ్రతుకులైపోయాయి. ఏం చేస్తాం?' అనుకుంటూ బద్దకంగా నిద్రలేచాను.

ఫ్రెష్షయ్యి, ప్రధానశిష్యురాలిని తీసుకుని లోకసంచారానికి బయల్దేరాను.

అదేంటో మరి, టిఫిన్ చేద్దామంటే అన్ని హోటళ్ళూ మూసేసి ఉన్నాయి. కనీసం టీ షాపులు కూడా లేవు.

'ఏంటిది? ఇంతఘోరకలిగా యున్నది?' అని శిష్యురాలిని అడిగాను.

'యుద్ధం ప్రభావంతో గ్యాసు ఆగిపోయింది. హోటళ్లు బంద్' అని  చెప్పింది

ఒక గేటెడ్ కమ్యూనిటీ ముందు అందరూ కర్రలతో కొట్టుకుంటున్నారు.

'ఇదేంటి? ఈ విధముగా యుద్ధము చేయుచున్నారు?' అడిగాను.

'అది యుద్ధం  కాదు. ఒక్కటే గ్యాస్ సిలెండర్ ఉందిట. దానికోసం అందరూ అలా కొట్టుకుంటున్నారు' చెప్పింది.

'గతంలో నా చిన్నప్పుడు, నీళ్ళపంపులవద్ద ఈ దృశ్యములను చూచితిని. ఇప్పుడు ఈ విధముగా చూడవలసి వచ్చినది. ఇదియేకదా మాయాప్రభావము' అన్నాను.

'నోరుముయ్యి' అన్నట్టు చూసింది శిష్యురాలు.

'ఇరాన్ యుద్ధం వల్ల ఇలా ఉంది' అన్నది. 

'యుద్దమా? అదెక్కడ?' అన్నాను అయోమయంగా.

'అందుకే అప్పుడప్పుడూ లోకసంచారం చెయ్యమని మహర్షి చెప్పింది' అన్నది కోపంగా.

'ఓహో నా అగ్నానం నీక్కూడా తెలిసిపోయిందా?' అనుకుని మాట్లాడకుండా ఊరుకున్నాను. 

కొద్దిగా ముందుకెళ్లాం.

'గ్యాసు నామమె పావనము, ప్రభు గ్యాసే రక్షణ కారణము' అంటూ ఒక ప్రార్ధనామందిరంలో నుంచి మైకు మోగుతోంది.

'రామరామ ! బంగారంలాంటి పాటని ఇదేంటి ఇలా మార్చేశారు? అన్నాను విస్తుపోతూ.

'నిన్ననే గ్యాసుదేవుని వైపు కన్వర్ట్  అయ్యారు.యుద్ధం ప్రభావం' కామ్ గా అంది శిష్యురాలు.

మతిపోయింది.

ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి 'గ్యాసో హో సిలెండర్' అంటూ ఇంకో చోటనుంచి పెద్దగా శోకాలు వినిపించాయి.

భయమేసింది.

'ఇదేంటి? వీళ్ళుకూడానా?' అన్నాను.

'అవును. గ్యాసు దొరకడం లేదుగా. కన్వర్ట్ కాక వాళ్ళకీ తప్పలేదు' అంది శిష్యురాలు.

ఇంకో వందగజాలు వెళ్లేసరికి ఇంకొక గుడిలో నుండి శ్లోకాలు వినిపించాయి.

'గ్యాసుదేవాయ నమః, గ్యాసుప్రభువే నమః, గ్యాసురాజాయ నమః, సిలెండరు మాతాయ నమః' అంటూ మైకు పెద్దగా మ్రోగుతోంది.

'వీళ్ళకేం పోయేకాలం?' అడిగాను. 

'కన్వర్ట్ కావడానికి వీళ్ళు ముందుంటారు  కదా. నిన్ననే ఎవరో గ్యాస్ సిలెండర్ ఇచ్చారట. వెంటనే మతం మారిపోయారు. గ్యాసుమీద అష్టోత్తరాలు రాసుకున్నారు. పాడుతున్నారు' అన్నది శిష్యురాలు.

విరక్తిగా నవ్వుకున్నాను.

ఇంతలో ఒక పెద్దగుంపు ఎదురొస్తే ప్రక్కకు తప్పుకుని 'ఏంటా?' అని చూచాం.

అందరి తలలపైనా గ్యాస్ సిలెండర్ ఆకారంలో టోపీలున్నాయి.

'వీళ్లెవరు?' అడిగాను.

'సిలెండర్ ఫౌండేషన్' అని క్రొత్తసంస్థ. సిలెండరు బొమ్మని అలా నెత్తిమీద పెట్టుకుని రోడ్లమీద తిరుగుతుంటే, స్థూలదేహంలో నుండి సూక్ష్మదేహం బయటకొచ్చి, ఎక్కడెక్కడో తిరుగుతుందట' అంది శిష్యురాలు.

'అంటే, స్థూలదేహం రోడ్లమీద తిరుగుతుంటే, సూక్ష్మదేహం లోకలోకాలు తిరుగుతుందా? ఎందుకలా? రెండూ ఒకేచోట చావచ్చుగా?' అడిగాను.

'ఏమో? నీ దేహానికి ఒకచోట ఉండటం ఇష్టమైనట్టే, వాళ్ళ దేహాలకు బయటతిరుగుళ్లు ఇష్టం. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, కాదనడానికి మనమెవరం?' అంది శిష్యురాలు.

ఖాళీగా ఉంటే ఎవడైనా వచ్చి సిలెండర్ టోపీ పెడతాడేమో అని భయమేసి వెంటనే జేబులోంచి కర్చీఫు తీసి తలచుట్టూతా కట్టుకున్నాను.

మరికొన్ని అడుగులేసేసరికి, ఒక బోర్డు కనిపించింది.

'గ్యాసు రావడం లేదని విసిగిపోతున్నారా? మీకు గ్యాసు ఎప్పుడు వస్తుందో గ్యారంటీగా చెప్పబడును' ఇట్లు ప్రసిద్ధ కోయజ్యోతిష్కులు, అని దానిమీద  రాసుంది.

'గ్యాసు రావడం ఏంటి?' అన్నాను అర్ధం కాక.

'అంటే, గ్యాస్ సిలెండర్ డెలివరీ అని అర్ధం' అంది శిష్యురాలు చిరాగ్గా.

'ఓహో అదా ! చివరకు వీళ్ళుకూడా తయారయ్యారా?' అన్నాను నిరాశగా.

'అప్పుడే ఏమైంది? అటుచూడండి' అంది శిష్యురాలు.

'మీ మోకాలు చూసి, గ్యాసు ఎప్పుడొస్తుందో చెప్పబడును. జాతకంతో పనిలేదు' అని ఇంకో బోర్డు కనిపించింది.

'ఇదేంటి ఇలా పెట్టాడు?' అన్నాను.

'అందరూ చేతులు, ముఖాలు చూసి జ్యోతిష్యం చెబుతున్నారు కదా. వెరైటీగా ఉంటుందని ఇలా పెట్టాడు. బ్రెయిన్ అక్కడే ఉంటుందని వాళ్ళ పెద్దదొర చెప్పాట్ట. అందుకే వాళ్ళు మోకాళ్ళు మాత్రమే చూస్తారు' అంది.

'ఇక నా వల్లకాదు. పీచే ముడ్' అని గట్టిగా అరిచాను. 

కట్ చేస్తే, ఇద్దరం ఆశ్రమంలో తేలాం.

'హమ్మయ్య' అని గాలి పీల్చుకునేలోపు, ఫోన్ మ్రోగింది.

ఫోనెత్తి 'హలో' అనేలోపే, 'గురూగారు. నాకిప్పుడే అబ్బాయి పుట్టాడు. బెడ్ పక్కనించే ఫోన్ చేస్తున్నా. ఏం పేరు పెట్టమంటారు?' అడిగాడు ఒక పరమాణువు.

'నీకు పుట్టటం ఏంటి?' అరిచాను విసుగ్గా.

'అంటే, వాళ్ళావిడకని అర్ధం. నువ్వూ నీ చచ్చు సందేహాలు' అని పక్కనించి గిచ్చింది శిష్యురాలు.

'గ్యాసు నాధ్' అని పెట్టుకో ఫో' అని మళ్ళీ ఫోన్లోకి అరిచాను.

'టాంక్యూ గురూజీ. మా ఆవిడక్కూడా కలలో గ్యాసునాధుడు కనపడి, పుట్టబోయే పిల్లాడికి తన పేరే పెట్టాలని. లేకపోతే మా సంగతి తేలుస్తానని బెదిరించాట్ట. మేముకూడా ఇదే అనుకున్నాము. కానీ సెకండ్ ఒపీనియన్ కోసం మీకు ఫోన్ చేశాము. మీరు కూడా అదే చెప్పారు. టాంక్యూ సోమచ్' అని పొంగిపోతున్నాడు.

'ఎక్కువ పొంగిపోకు, పొయ్యిలో పడగలవు' అన్నాను.

'ఇంకొక్క విషయం గురూజీ. మా చెల్లెలిక్కూడా ఇప్పుడే అమ్మాయి పుట్టింది. దానికేమని పేరు పెట్టాలి?' అడిగాడు.

'అస్సలు టైం వేస్ట్ చెయ్యడం లేదురా మీరు?' అనుకుంటూ, 'సిలెండర్ రాణి' అని పెట్టండి. ఎలాగూ పెద్దయ్యాక అయ్యేది అదేగా' అన్నాను.

'టాంక్యూ గురూజీ' అని ఫోన్ పెట్టేశాడు శిష్యుడు.

'హమ్మయ్య' అని చుట్టూ చూడగానే శిష్యులెవరూ కనిపించలేదు.

'వీళ్లంతా ఎక్కడికి పోయారు?' అరిచాను కోపంగా.

'కట్టెపుల్లలేరుకు రావడానికి పక్కపొలాల్లో తిరుగుతున్నారు. మనకీ గ్యాసు లేదు మరి' అంది శిష్యురాలు.

ప్రశ్నార్ధకంగా చూశాను.

'ప్రపంచం ఎన్ని కష్టాలలో ఉందో చూశారు కదా గురూజీ. ఏదైనా రెమెడీ చెప్పి పుణ్యం సంపాదించుకోండి' ప్రాధేయపడింది శిష్యురాలు.

తీవ్రంగా ఆలోచించాను. 

'ఓకే ! దీనికొకటే మార్గముంది. వెంటనే అందరూ టవల్స్ కట్టుకుని దీక్ష మొదలుపెట్టండి. నలభైరోజులపాటు అదే టవల్లో ఉండాలి. అదే మన దీక్షాడ్రస్సు. 'జై గ్యాసుదేవాయ నమః' అనే మహామంత్రాన్ని మీకు ఉపదేశిస్తున్నాను. అన్నిపనులూ మానేసి దీన్ని రోజుకు ఇరవైకోట్లసార్లు జపించాలి. నలభైరోజులపాటు పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. అయితే, 'స్ట్రా'తో బిందెలోనుంచి  పీల్చుకుంటూ తాగచ్చు. కానీ గాలిమాత్రం ఈ నలభైరోజులపాటు అస్సలు పీల్చరాదు. అప్పుడన్ని సమస్యలూ గాలిలో కలసిపోతాయి. వెంటనే అన్నిదేశాలలో ఉన్న మన శిష్యులందరికీ మెయిల్స్ పంపండి. అందరూ ఈ దీక్షను మొదలుపెట్టండి' ఆజ్ఞాపించాను.

'ఓకే గురూజీ !' అని శిష్యురాలు ఆ పనిలోకి దిగింది.

'జై గ్యాసునాధాయ నమః' అనుకుంటూ నేను పక్కమీద వాలాను.

11, మార్చి 2026, బుధవారం

ఒకటే రూల్

గతంలో ఒకమ్మాయి నా భావాలకు ఆకర్షితురాలై నన్ను సంప్రదించింది.

'నేను మీ సంస్థలో చేరతాను' అన్నది.

'సరే చేరు' అన్నాను.

'అయితే నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి' అన్నది.

రూల్స్ పెట్టాల్సింది నేనుకదా అని నాకు డౌటొచ్చినా, తమాయించుకొని, 'చెప్పు ఏంటవి?' అన్నాను.

'మీ సంస్థ రూల్స్ ఏవీ నేను పాటించను. నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. మీరేమీ అడ్డుచెప్పకూడదు' అన్నది.

'ఎందుకలా?' అడిగాను.

'నాకు మొదట్నుంచీ స్వతంత్రంగా ఉండటం అలవాటు' అన్నది.

'అంతేనా ఇంకా ఏవైనా ఉన్నాయా?' అడిగాను.

'నామీద ఎవరూ అజమాయిషీ చెయ్యకూడదు. ఇది చెయ్యి అది చెయ్యి అంటూ చెప్పకూడదు. అలా చెబితే నాకు పిచ్చికోపం వస్తుంది' అన్నది.

'ఇంకా చెప్పు' అన్నాను.

'నాకు తంత్రా నేర్చుకోవాలని ఉంది. మీకది తెలుసని మీ వ్రాతలను బట్టి అర్ధమైంది. నాకు నేర్పించాలి' అన్నది.

'దానికి కొన్ని అర్హతలుండాలి. అందరికీ అది పనికిరాదు' అన్నాను.

'నన్ను మించిన అర్హతలు ఇంకెవరికుంటాయి?' అన్నది.

'సరే చూద్దాం. ముందు నీ రూల్స్ మొత్తం చెప్పు' అన్నాను.

'నా ఇష్టం వచ్చినపుడు మా ఊరికి వెళతాను. నా ఇష్టం వచ్చినపుడు వస్తూ ఉంటాను. ఆశ్రమంలో కూడా నా టైం టేబుల్ ప్రకారం నేనుంటాను. మీ షెడ్యూల్ నేను పాటించను. నాకు కొన్ని అలవాట్లున్నాయి. ఉదాహరణకు, సరిగ్గా అర్ధరాత్రి పన్నెండుకు నేను టీ త్రాగుతాను. అప్పుడు లేచి నేను టీ పెట్టుకుంటుంటే నాకు ఎవరూ  అడ్డు చెప్పకూడదు. ఇలాంటివి చాలా ఉన్నాయి' అన్నది.

'అమావాస్యకీ పౌర్ణమికీ ఒకరకంగా ప్రవర్తిస్తూ ఉంటావు. అప్పుడు కూడా మేమేమీ పట్టించుకోకూడదు. కదా?' అడిగాను.

'మీకెలా తెలుసు?' అడిగింది ఆశ్చర్యంగా.

'దీనికేదో పెద్ద నాలెడ్జి అవసరం లేదులే గాని, ఇంతేనా ఇంకా ఏవైనా ఉన్నాయా?' అడిగాను.

'ప్రస్తుతానికి ఇంతే. ఇంకా గుర్తొచ్చినపుడు ముందుముందు చెబుతాను' అన్నది.

'నీ రూల్స్ చాలా బాగున్నాయి. నాకు నచ్చాయి' అన్నాను.

'నిజంగానా?' ఆమెకు అనుమానమొచ్చింది.

'అవును. నాకిన్ని రూల్స్ లేవు. ఒక్కటే ఉంది. దాన్ని నీవు పాటిస్తే చాలు. ఆశ్రమంలో నీకు అడ్మిషన్ రెడీ' అన్నాను.

'ఒక్కటేనా? చెప్పండి' అన్నది ఉత్సాహంగా. 

'ఏమీలేదు. నాదగ్గర ఒక పంచింగ్ బ్యాగ్ ఉంది. దానిపైన పంచెస్ కిక్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. కొట్టీ కొట్టీ అది చినిగిపోయింది' అని ఆపాను.

ఆమె అనుమానంగా చూస్తోంది.

'దాని స్థానంలో నిన్ను వేలాడగడతాను. రోజూ ఒక గంటపాటు నా ప్రాక్టీస్ చేసుకుంటాను. ఆ తర్వాత కిందకి దించుతాను. నువ్వొప్పుకోవాలి. అంతే. వెరీ సింపుల్ ' అన్నాను.

యధావిధిగా ఆమెకూడా మాయమైపోయింది. తిరిగిచూస్తే ఒట్టు !

ఇంత సింపుల్ రూల్లో అంత నచ్చనిది ఏముందో నాకిప్పటికీ అర్ధం కావడం లేదు !

లక్ష డొనేషన్

'లక్షరూపాయలు మీకు డొనేషన్ ఇస్తున్నాను. తీసుకోండి' అన్నది ఒకామె.

వాళ్ళు అమెరికాలో ఉంటారు. రెండువారాల ట్రిప్పుమీద ఆమె ఇండియాకు వచ్చింది.

' నాకెందుకు నీ డొనేషన్?' అన్నాను.

'మీక్కాదు. సంస్థకు ఉపయోగపడుతుంది' అన్నది.

'ఇది నీ కష్టార్జితమా?' అడిగాను.

'కాదు. ఇది నా పాకెట్ మనీ. మా ఆయనిచ్చాడు. వాడుకోమని' అన్నది.

వాళ్ళాయన అమెరికాలో పెద్ద డాక్టరు.

'మీ ఆయన డబ్బులు నాకెందుకు? నేను తీసుకోను. నువ్వు సంపాదించు అప్పుడు చూద్దాం' అన్నాను.

'నాకు సంపాదించవలసిన అవసరం లేదు, మాకు ఒక చార్టర్ విమానమే ఉంది' అన్నది.

'వేరేవాళ్ళ సొమ్మును మనం దానం చెయ్యకూడదు. మనం కష్టపడి సంపాదించినది మాత్రమే దానానికి అర్హతను పొందుతుంది' అన్నాను.

'మా ఆయన వేరే ఎలా అవుతాడు?' అన్నది. 

'కర్మదృష్టిలో ఎవరి ఎకౌంట్ వారిదే' అన్నాను.

'పరవాలేదు తీసుకోండి'  అని బలవంతం చేసింది.

'ఆడపిల్ల పాకెట్ మనీని సంస్థకైనా సరే తీసుకోవడానికి నేను విరుద్ధం' అని ఖరాఖండిగా చెప్పేశాను.

'నేనిలా డొనేషన్ ఇచ్చినట్టు మా ఆయనకు తెలియదులెండి' అన్నది.

'అలా అయితే అస్సలు తీసుకోను. ఆయన ఈ డబ్బులు ఎందుకోసం నీకిచ్చాడో అందుకోసం మాత్రమే వాడాలి. వేరే పనులకు వాడకు' అన్నాను.

'నా పాకెట్ మనీ నా ఇష్టం' అన్నది.

'నీ డొనేషన్ తీసుకోవడం తీసుకోకపోవడం నా ఇష్టం' అన్నాను.

ఆమె ఈగో దెబ్బతిన్నది.

'చివరిగా అడుగుతున్నాను. తీసుకుంటారా లేదా?' అడిగింది.

'ఒకసారి చెప్పాక నా నిర్ణయంలో మార్పుండదు' అన్నాను.

'అయితే నేను మీ సంస్థలో ఇమడలేను. పోతున్నాను' అన్నది.

'ఆలస్యం చెయ్యకు' అన్నాను.

ఆమె మాయమైపోయింది.

ఎంతమంది పిచ్చోళ్ళురా దేవుడా నీ లోకంలో !

10, మార్చి 2026, మంగళవారం

మొదటిసారి

'నేను మారాలని ఇంతరకూ ఎవరూ నాకు చెప్పలేదు. మొదటిసారిగా మీనుంచి మాత్రమే ఈమాటను వింటున్నాను' అని గతంలో ఒక శిష్యురాలు కాబోయినామె అన్నది.

నవ్వొచ్చింది.

'దేనికైనా మొదలనేది ఒకసారి ఉంటుందిగా' అన్నాను.

'ఉంటే, ఇప్పటిదాకా నాకెందుకు ఎవరూ చెప్పలేదు?' అన్నది.

ఆమె అతితెలివికి ముచ్చటేసింది.

'నీకు పెళ్లయిందా? అడిగాను.

'అయింది' అన్నది.

'మరి అప్పుడెందుకు ఈ మాటను నీవడగలేదు? నాకిప్పటిదాకా పెళ్లి కాలేదు. మొదటిసారి మీరు చేస్తున్నారు. మిమ్మల్నెలా నమ్మాలి? నేను చేసుకోను. అని మీ తల్లిదండ్రులను ఎందుకు అడగలేదు? ఎగురుకుంటూ ఎందుకు పెళ్లి చేయించుకున్నావు?' అన్నాను.

'అదీ ఇదీ ఒకటే ఎలా అవుతుంది?' అన్నది తెలివిగా.

'మరి ఏది ఏది ఒకటౌతుంది?' అడిగాను.

'ఏమో మరి ! మారడం ఎందుకసలు?' అన్నది మళ్ళీ.

'మారకు. మారమని ఎవరు నిన్ను బలవంతం చేస్తున్నారు? ' అడిగాను.

ఆమె మాయమైపోయింది.

ఆమె కనిపించడం అదే మొదటిసారి, అదే చివరిసారి.

కొన్నిసార్లు మొదటిసారే చివరసారి కూడా అవుతుంది !

నక్సులైట్లు

'బయట ఎక్కడ చూసినా అందరూ మా మతంలోకి మారు, మా కల్ట్ లోకి మారు అని ఒకటే ఊదరగొడుతున్నారు' అంది గతంలో ఒక శిష్యురాలు.

'అవును. నక్సులైట్లు మీ ఇంటికి కూడా వచ్చారా?' అడిగాను.

'నక్సులైట్లా? వాళ్లెవరు?' అడిగింది.

అంటే, అలా ఇళ్ళంబడి తిరిగి మారమని పోరుపెట్టేవాళ్ళని నేనలా పిలుస్తాను. హోమియోలో నక్సువామికా అని ఒక మందుంది. ఆ పేషంట్లకు కాస్త అతి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటివాళ్ళను నేను అలా పిలుస్తూ ఉంటాను' అన్నాను.

'చాలామంది తగిలారు' అన్నది.

'మరి మారకుండా ఇంకా ఇలాగే ఉన్నావే/' అడిగాను.

'పెద్దలమార్గం అని కొంతమంది  వచ్చారు. తర్వాత పిల్లలమార్గం అని ఇంకొంతమంది వచ్చారు' అన్నది.

'ఏం? యువకులమార్గం, ముసలోళ్ళమార్గం రాలేదా?' అడిగాను.

'లేదు. సహజమార్గం వాళ్ళొచ్చారు. ఆ తర్వాత బెమ్మకుమారీలు, సాయిబాబీలు, దేవకన్యలు వచ్చారు. నల్లముసుగులేమో అలా రాకపోయినా స్నేహంగా ఉంటూ మతం మార్చాలని చూశారు.  ఇస్ ఖానులు కూడా ట్రై చేశారు. నేనెవ్వరికీ పడలేదు. ఎందుకో వాళ్లెవరూ నాకు నచ్చలేదు. పడినట్లైతే ఎక్కడ తేలేదాన్నో?' అన్నది.

'అది నీ అదృష్టం. పడితే, ఎక్కడ తేలేదానివో నీకే కాదు ఎవరికీ తెలీదు. నిజం చెప్పాలంటే ఇక తేలడం ఉండదు. మునిగి-'పోవడమే' అన్నాను. 

'మీరు కూడా అంతేనా?' అన్నది సూటిగా.

'నేనేమైనా నిన్ను మారు మారు అని చెప్పానా ఎప్పుడైనా? అడిగాను.

'లేదు. అందుకే ధైర్యంగా అడుగుతున్నాను' అన్నది.

'దేనిగానూ మారవద్దు, అసలు మారవలసిన పనే లేదు' అనే నేను చెబుతాను. నువ్వు దేనిగానూ మారవలసిన పని లేదు. నువ్వు నువ్వుగా ఉంటే చాలు' అన్నాను.

'అందరూ అలాగే ఉన్నారు కదా? తేడా ఏముంది?' అన్నది.

'అందరూ అలా  లేరు. అందరూ తమ సహజస్థితినుండి మారిపోయే ఉన్నారు. అలా మారినవాళ్ళని నక్సులైట్లు మళ్ళీ మారుస్తున్నారు. అంటే, ఇప్పటికే కల్తీ అయిన నూనెలో ఇంకా కల్తీని కలుపుతున్నారు. అదేమో మడ్డినూనెగా మారుతున్నది. ఆ మడ్డి అంతా వదిలించుకొని నువ్వు నువ్వుగా మారమని మాత్రమే నేను చెబుతున్నాను. కానీ అది నువ్వనుకుంటున్న 'మారడం' కాదు. ఇప్పటికే మారి, అంటించుకున్నదాన్ని వదిలించుకోవడం' అన్నాను.

'యిప్పుడు నేనేం చెయ్యాలి?' అడిగింది.

'ఏమీ చెయ్యద్దు. ఊరకే మాతో కలసి ఉండు. నీలో ఉన్న మురికి అంతా అదే వదిలిపోవడం నువ్వే చూస్తావు' అన్నాను.

'అదెలా జరుగుతుంది?' అడిగింది.

'ఎలా జరిగితే నీకెందుకు? చెప్పినట్లు ఉండు. జరగనప్పుడు అడుగు' అన్నాను.

గురువిణి

గతంలో నాకు శిష్యురాలయ్యే అదృష్టాన్ని కొద్దిలో మిస్సయిన ఒకామె ఉండేది. ఆమె అప్పుడప్పుడూ మా ఇంటికి వచ్చి కొన్నాళ్ళుంటూ ఉండేది. కానీ అదేంటోగాని, నేను చేసే ప్రతిపనినీ తప్పుపడుతూ, సాధిస్తూ, నసపెడుతూ ఉండేది.

మనకేమో సరదాగా జోకులేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉండటం అలవాటు. ఆమెకది నచ్చేది కాదు.

'మనం అలా జోకులెయ్యకూడదు. సీరియస్ గా ఉండాలి' అనేది.

'మనం' అంటోంది ఏమిటా అని డౌటొచ్చినా, 'ఏం కోల్పోయామని అంత సీరియస్ గా ఉండాలి?' అనడిగాను.

ఆమెకు బోల్డంత కోపమొచ్చేసింది.

'గురువులంటే సీరియస్ గానే ఉండాలి. అప్పుడే మనకు విలువ ఉంటుంది. లేదంటే నలుగురిలో చీపై పోతాం. మీరెందుకు అన్నన్ని పుస్తకాలు వ్రాస్తున్నారు? అన్ని టాపిక్స్ అవసరం లేదు. ఒక్క విపస్సానా  చాలు' అన్నది.

అంటే, తనను కూడా నాతో సమానంగా ఊహించుకుంటూ, నలుగురికీ బోధించాలని చూస్తోందని అర్ధమైంది.

'ఒక్క విప్పసారానే అందరికీ సరిపోయేపనైతే ఇన్నిన్ని బ్రాండ్లు ఎందుకు?' అన్నాను.

'అలాంటి చీప్ జోకులే వెయ్యద్దని చెప్పేది' అని ఆమెకు చాలా కోపమొచ్చింది.

'అబ్బో చాలా ముదిరిందే'  అనుకున్నాను.

ఒకసారి ఏదో పుణ్యక్షేత్రానికెళ్ళినపుడు, అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు. అలా నిలబడకూడదు, ఇలా కూచోకూడదు, వాళ్ళవైపు చూడకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, అంటూ ప్రతిదానికీ నస  మొదలుపెట్టింది.

'నయం కావడం కష్టం. త్వరగా మంచి స్పెషలిస్టుకు చూపించాలి' అనుకున్నాను.

ఒకరోజున ఏదో చిన్నవిషయంలో గొడవేసుకుని, 'మీ మార్గం వేరు. నా మార్గం వేరు. నేను మీ దారిలో నడవలేను. పోతున్నాను, నమస్కారం' అన్నది.

నేనుకూడా ప్రతినమస్కారం చేస్తూ 'సరే. నా పాదాలకు మీ నమస్కారం' అన్నాను.

తర్వాత ఏమైపోయిందో కనిపించలేదు.

పాపం ఎలా ఉందో? తగ్గిందో లేదో?

సంజీవినీ మూలిక

'మీరు చెప్పేదంతా బాగానే ఉందిగానీ, మీ దగ్గరకు నేనిప్పుడే రాలేను' అన్నది గతంలో ఒక శిష్యురాలు. గతంలో అంటే, పదేళ్ళక్రితమన్నమాట.

'అదేంటి? నా దగ్గరకు రమ్మని నేనెప్పుడూ ఎవరినీ పిలవలేదే?' అన్నాను ఆశ్చర్యపోతూ.

'అంటే, మీ దారిలో నడవలేనని అర్ధం' అన్నది.

'సరే నడవలేకపోతే ఎవరైనా ఆర్ధోపెడిక్ డాక్టరుకు చూపించుకో' అన్నాను.

'కొన్ని బాధ్యతలు తీరితేగాని ఈ మార్గంలోకి రాలేను' అన్నది.

'ఏమిటా బాధ్యతలు?' అడిగాను.

'ముందు మా అమ్మాయి చదువు పూర్తి కావాలి'  అంది

'ఇప్పుడేం చదువుతున్నది మీ అమ్మాయి' అడిగాను.

'ఎనిమిదో క్లాసు' అన్నది.

'ఏం చదవాలనుకుంటున్నది?' అన్నాను.

'మెడిసిన్ చేస్తుందిట' అన్నది.

'అంటే ఇంకో ఇరవై ఏళ్ళు పడుతుందిగా' అన్నాను.

'అటూ ఇటూగా పట్టచ్చు' అన్నది.

'ఆ ! ఎంతసేపులే ఇరవైఏళ్ళేగా ఇరవైనిముషాల్లో అయిపోతుంది. కానీయ్' అన్నాను.

'ఆ తర్వాత దానికి పెళ్లి చెయ్యాలి' అంది.

'చేసుకుంటుందా?' అడిగాను.

'అదేం మాట?' తనకి కోపం వచ్చింది.

'అంటే, అమెరికాలో కుర్రకారు పెళ్లొద్దంటున్నారు కదా. పైగా ఇంకా ఇరవైఏళ్ల తర్వాతాయె. అప్పటికి ఎలా ఉంటుందో? పోనీ ఆ తర్వాతైనా కుదురుతుందా?' అన్నాను.

'దానికి ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టాలిగా' అంది.

'అంటే ఇంకో పదేళ్లు. ఇక నే చెప్తా విను. ఆ తర్వాత ఆ పిల్లలు చదువుకోవాలి. పెద్దవాళ్ళు కావాలి. సెటిల్ కావాలి. పెళ్లిళ్లు చేసుకోవాలి. ఇదంతా అయ్యేటప్పటికి ఇంకో ఏభై ఏళ్ళు అవుతుంది. అప్పటికి నీకు నూటఇరవైఏళ్ళు వస్తాయి. పోనీలే అప్పుడైనా కుదురుతుందా?' అడిగాను.

'ఏంటి నా లైఫుతో మీకు ఎగతాళిగా ఉందా?' ఈ సారి కోపం ఎక్కువగా వచ్చింది.

'అబ్బే. నాకెందుకంత అదృష్టం? నీ లైఫు పూర్తిగా నీ ఇష్టమే. అలాగే కానియ్. నేను మాత్రం అర్జెంటుగా హిమాలయాలకు పోతున్నాను రేపే' అన్నాను.

'ఎందుకు?' అడిగింది.

'నీకంటే శక్తులున్నాయి గనుక 120 ఏళ్ళు ఉంటావు. నేనంతకాలం ఉండలేను. మరి ఉండాలంటే సంజీవినీమూలికను వెతుక్కోవాలి కదా. అదేమో హిమాలయాలలో తప్ప లోకల్ మెడికల్ షాపుల్లో దొరకడం లేదు. అందుకు' అన్నాను.

ఫోన్ కట్ అయిపోయింది.

ఆ తర్వాత ఆ శిష్యురాలేమైందో తెలియదు. బహుశా పిల్లల కాలేజీ అడ్మిషన్ల కోసం అమెరికాలో ఇంకా తిరుగుతూ ఉందేమో !

బోడి సాధనదేముంది? ఎన్నాళ్లయినా వెయిట్ చేస్తుంది. దానికంటే, పిల్లల చదువులు ముఖ్యం కదా !

తను చెప్పినట్టే పదేళ్లు వెయిట్ చేసినా తన జాడాజవాబూ కనిపించడం లేదు. ఏమైందో ఏమిటో? ఏ బెమ్మకుమారీ గానో, సాయిబాబీ గానో మారిపోలేదు కదా ! లేక, సంజీవినీ మూలికను అమెరికాకు పార్శిల్ చెయ్యాలేమో !

జ్యోతిష్యం నిజమేనోయ్

'ఇవాళేంటి ఇన్ని పోస్టులు టకాటకా రాస్తున్నారు?'కామెంటాడు  ఒక శిష్యుడు వాట్సప్ లో.

'జ్యోతిష్యమంటే నీకు నమ్మకం కలిగిద్దామని' అన్నాను. 

'అంటే?' అడిగాడు.

'ఇవాళ గ్రహస్థితులు చూడు అలా ఉన్నాయి మరి. అందరూ అతలాకుతలం అవుతారు. ఇరాన్ యుద్ధం చాలా ఊపందుకుంటుంది ఇవాళ' అన్నాను.

'ఏయే గ్రహాలు అలా ఉన్నాయి?' అడిగాడు.

'చంద్రుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, గురువు అందరూ ఇవాళ విలక్షణంగానే ఉన్నారు' అన్నాను.

'మరి శనిగ్రహాన్ని వదిలేశారేం?' అడిగాడు కించిత్ ఎగతాళిగా.

'నీరూపంలో తగులుకుందిగా. ఎక్కడ వదలగలిగాను?' అని ముగించాను.

సాయిబాబీ

మొన్నీ మధ్యన ఇద్దరు సాయిబాబీలు ఆశ్రమం చూడటానికొచ్చారు.

సాయిబాబా భక్తురాళ్లని అలా పిలవడం నాకలవాటు.

భాభీ అంటే 'వదిన' కాబట్టి అలా పిలవడం తప్పుకాదు.

వచ్చినప్పటినించీ ఒకామె భయంభయంగా చుట్టూ చూస్తోంది.

'ఒకవేళ నాలో బాబా ఏమన్నా దర్శనమిచ్చాడేమో కొంపదీసి' అని నేను భయపడ్డాను.

చూసీ చూసీ, 'ఇంత అడివిలో ఉంటున్నారు. ఇక్కడ క్రూరజంతువులేమీ ఉండవా?' అందామె భయంగా.

'నేనున్నాగా వేరే జంతువులెందుకు?' అన్నాను.

ఇంతలో రెండో ఆమె కల్పించుకుని తన విజ్ఞానప్రదర్శన చేసింది.

బాబీలకు విజ్ఞానప్రదర్శన ఎక్కువని  నాకు ముందే తెలుసుకాబట్టి నేనేమీ ఆశ్చర్యపోలేదు.

'అవుండే చోటికి మనం వచ్చి ఉంటున్నాం. మనం ఉంటున్న చోటకు అవి రాలేదు' అందామె. ఈ మాటను చాలామంది అంటూనే ఉంటారు.

నేను నవ్వాను.

'అది కరెక్ట్ కాదు' అన్నాను.

'మరి?' అంటూ ప్రశ్నార్ధకంగా చూశారు బాబీలు.

'అడవులలో బోరుకొట్టి అవన్నీ సిటీలకు చేరాయి. వాటికి భయపడి మేము అడివిలోకి వచ్చి ఉంటున్నాము' అన్నాను.

నేనన్నది బాబీలకు అర్ధం కాలేదు. వాటికి కాగడాహారతి మాత్రమే అర్ధమౌతుంది. మనకేమో అది రాదు. ఏం చేస్తాం?

బాబీలు చాలామాట్లాడారు గాని బాబా విషయం ఎత్తలేదు.

బ్రతికిపోయారు.

కాలేజీ చదువు

'నేను మీతో మాట్లాడినవాటిని అందరితో ఎందుకు షేర్ చేస్తున్నారు?' అడిగింది ఒక శిష్యురాలు.

'నీ పేరు చెప్పడం లేదుగా. సబ్జెక్ట్ వరకూ చెబితే తప్పేముంది?' అన్నాను.

'మీకు దాపరికం అంటూ ఉండదా?' అడిగింది.

'ఉండదు. అంతా ఓపెనే' అన్నాను. 

'మరి మాకు ప్రైవసీ వద్దా?' అడిగింది.

'ప్రైమరీ క్లాసులో ఉన్నపుడు ప్రైవసీ కావాలి. కాలేజీకొచ్చాక ఎందుకు?' అడిగాను.

'ఏంటో మీ మాటలు అర్ధం కావు' అన్నది.

'అర్ధం అవుతాయని, అవ్వాలని నేను ఆశించడం లేదు' అన్నాను.

ఎన్ని?

'మీరు గతంలో బాగా వ్రాసేవారు, ఇప్పుడు మానేశారు' అని కామెంటింది ఒక శిష్యురాలు.

'ఇప్పుడూ వ్రాస్తున్నాను. కానీ బ్లాగులో వ్రాయడం లేదు' అన్నాను.

'తీరిక ఉండటం లేదేమో?' అడిగింది.

'అవును. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ తీరిక ఉండటం లేదు' అన్నాను.

'రోజుకు అసలెన్ని పోస్టులు వ్రాయగలరు మీరు?' అడిగింది.

'నిమిషానికొకటి వ్రాయగలను' అన్నాను.

'ఏముంటుంది అలా వ్రాయడానికి?' అడిగింది.

'ఇవాళ వ్రాస్తాను చూడు' అన్నాను.

డొంకతిరుగుడు

 'మీరేదీ సూటిగా చెప్పరా? డొంకతిరుగుడుగా చెప్తారెందుకు?' గతంలో ఒక శిష్యురాలి డౌటు.

'నేనుండేదే పొలిమేర డొంకలో. వేరేగా ఎలా చెప్పగలను?' అన్నాను.

'సూటిగా చెప్పచ్చుగా' అడిగింది.

'నువ్వు భరించలేవు' అన్నాను.

'మీతో చాలా కష్టం' అన్నది.

'నా అంత తేలికగా ఎవరూ దొరకరు' అన్నాను.

'కానీ పట్టుకోలేకపోతున్నాం కదా?' అడిగింది.

'ఇంకో రెండుచేతులు అరువు తెచ్చుకో' అన్నాను.

ప్రేమ

'మీరు చెప్పేవాటిని  నేనెందుకు అర్ధం చేసుకోలేకపోతున్నాను?' గతంలో ఒక శిష్యురాలు అడిగింది.

'అవి అర్ధం చేసుకునేవి కావు. ఆచరించేవి' అన్నాను.

'నేను ఆచరణలో కూడా పెట్టలేకపోతున్నాను' అన్నది.

'ముందు అనుసరించు. ఆచరణ అదే వస్తుంది' అన్నాను.

'అదీ కుదరడం లేదు. ఎందుకిలా?' అడిగింది.

'ప్రేమలేదు గనుక అనుసరించలేకపోతున్నావు' అన్నాను.

'అదెలా వస్తుంది?' మళ్ళీ ప్రశ్న.

'నువ్వు పోతే అదొస్తుంది' అన్నాను.

త్వరగా బయల్దేరు

'ఎన్నో గుళ్ళు తిరిగాను. ఎందరో గురువులను చూశాను. ఏమీ ఉపయోగం లేదు' అన్నదొక శిష్యురాలు గతంలో.

'నీలాంటివాళ్లతో వాళ్ళకి బాగానే ఉపయోగం ఉంటుంది' అన్నాను.

'నేను చెబుతున్నది నా గురించి' అన్నది కోపంగా.

'పోనీ తిరుగుడు మానేసి చూడు. ఉపయోగం ఉంటుందేమో?' అన్నాను.

'మీ దగ్గర కూడా ఏమీ ఉపయోగం లేదు. మీరు చెప్పేవి నాకేమీ ఎక్కడం లేదు' అన్నది నిరాశగా.

'నేను నీకేమీ చెప్పలేదుగా?' అన్నాను.

'అందరికీ చాలా చెబుతున్నారుగా?' అన్నది.

'అందరికీ చెప్పినవి నువ్వెందుకు ఎక్కించుకోవాలని చూస్తున్నావు?' అడిగాను.

'మరి నేను వెనుకబడిపోతున్నాను కదా?' అన్నది.

'ఆలా అనుకుంటే ముందుకు రా' అన్నాను.

'ఎందుకు రాలేకపోతున్నాను?' అడిగింది మళ్ళీ.

'ముందు ఉన్నచోటనుంచి లేస్తే, ఆ తర్వాత ముందుకో వెనక్కో ఎక్కడికో ఒకచోటకు రావచ్చు' అన్నాను.

'నాకు కర్మ బరువు చాలా ఎక్కువగా ఉంది' అన్నది.

'దించుకో మరి. ఎందుకు మోస్తున్నావు?' అడిగాను.

'మీరు చెప్పేవి నాకేమీ అర్ధం కావడం లేదు' అన్నది.

'అర్ధమయ్యేదాకా పూర్ణంగా ఉండు' అన్నాను.

'ఎప్పటికర్ధమౌతాయి' అడిగింది.

'నువ్వు నేనైనప్పుడు అర్ధమౌతాయి' అన్నాను.

'అప్పుడేమౌతుంది?' అంది మళ్ళీ.

'అప్పుడు నువ్వు అడిగేదీ ఉండదు, నేను చెప్పేదీ ఉండదు. నీకీ బాధా ఉండదు' అన్నాను.

'ఇలా అయితే నేను మీ దగ్గర ఉండలేను' అంది.

'త్వరగా బయల్దేరు' అన్నాను.

వయసు

సాధన చెయ్యడం నావల్ల కావడం లేదు' అన్నాడు ఈ మధ్యనే ఒక శిష్యుడు.

'మంచిదే' అన్నాను.

'అదేంటి? సాధన చెయ్యకపోతే ఆధ్యాత్మికంగా ఎదిగేదెలా?' అన్నాడు తనే.

'అలా అనుకుంటే, చెయ్యి మరి' అన్నాను.

'అదే చెయ్యలేకపోతున్నాను' అన్నాడు నీరసంగా.

'చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం, చేయాలనుకున్నది చెయ్యలేకపోవడమే జీవితం' అన్నాను.

'సాధన మొదలుపెట్టగానే ఏదో ఒక అవాంతరం వస్తున్నది' అన్నాడు.

'దానికి బుద్ధి లేదు. ఈసారి అలా రావద్దని దానిని చెప్తాలే. కనీసం అదైనా నామాట వింటుందేమో చూద్దాం' అన్నాను.

'అందరూ బాగానే చేస్తున్నారు. నేనే చెయ్యలేకపోతున్నాను' అన్నాడు మళ్ళీ. 

 'వాళ్ళు వయసులో ఉన్నారు. నీకేమో వయసైపోయింది. నువ్వు మాత్రం ఏం చేయగలవు పాపం' అన్నాను.

ఎలాగో అలాగ

'ఎంత ప్రయత్నించినా, మీరాశించిన మార్పు నాలో రావడం లేదు' అన్నది గతంలో ఒక శిష్యురాలు.

'నీలో మార్పు రావాలని నేనసలు ఆశించడం లేదు' అన్నాను.

'ఇంకెలా ప్రయత్నించాలి?' అడిగింది.

'ఎక్కువ ప్రయత్నించకు, బెణుకుతుంది' అన్నాను.

'నేనెందుకు మారలేకపోతున్నాను?' అడిగింది మళ్ళీ.

'అసలెందుకు మారాలి నువ్వు?' ఎదురు ప్రశ్నించాను.

'మరెలా?' అన్నది.

'ఇప్పుడెలాగో అలాగే' అన్నాను.

మార్పు

'మారమని ఇప్పటిదాకా నాకెవరూ చెప్పలేదు' అంది గతంలో ఒక శిష్యురాలు.

'నేనూ చెప్పడం లేదు' అన్నాను.

'మరి మీరు చాలా సాధనలను చెబుతున్నారుగా?' అడిగింది.

'అవి చేసేవాళ్ళకోసం. నీకోసం కాదు' అన్నాను.

'మా ఆయనకూడా ఏనాడూ ఏ పనిలోనూ నాకడ్డు చెప్పలేదు. మీరేమో ఇన్ని రూల్స్ చెబుతున్నారు' అంది.

'రూల్స్ ఉంటాయి. వాటిని పాటించమని నిన్నెవరు బలవంతపెట్టారు?' అన్నాను.

'అసలు నేనెందుకు మారాలి? నేను మారను' అంది తనే మళ్ళీ.

'మంచిది. నువ్వూ మారకు. నేనూ మారను. ఇద్దరం ఎల్లకాలం ఇలాగే ఉందాం' అన్నాను. 

లేడీ డాక్టర్

'మీరు చెబుతున్న సాధనలను నేను చెయ్యగలనా?'  అడిగింది గతంలో ఒక శిష్యురాలు.

'మీరిచ్చిన మందులను నేను మింగగలనా అన్నాట్ట వెనకటికొక పేషంటు' అన్నాను.

'ఇవన్నీ నాకసలు అవసరమా?' అడిగింది.

'ఆకలి ఉంటే, తిండి అవసరమా అనే ప్రశ్నే ఉండదు' అన్నాను. 

'నాకివి అవసరం లేదు' అన్నది తానే మళ్ళీ.

'నీకే మందివ్వాలో డాక్టరుకు కూడా నువ్వే చెబుతావా?' అడిగాను.

'ఏమైనా ఈ సాధనలను నేను చేయలేను' అన్నది.

'చెయ్యకు. చెయ్యమని నేనేమీ  భంగపోవడం లేదుగా?' అన్నాను.

'ఎవరైనా లేడీ గురువును వెతుక్కుంటాను' అన్నది.

'అలాగే చెయ్. నీ సమస్యకు లేడీ డాక్టరే కరెక్టు' అన్నాను.

6, మార్చి 2026, శుక్రవారం

అర్ధముందా అసలు?

సప్త సముద్రాలను దాటానని

చిందులేసినవాడు

చివరకు దోమ చేతిలో చచ్చాడు


ఎన్నో లోకాలను చూశానని

ఎచ్చులేసిన తల్లి

ఎర్రికుక్క చేతిలో చచ్చింది


మనిషి పొగరుకు అర్ధముందా అసలు?


రాజులమంటూ విర్రవీగినవారిని

రంకుపురాణం చంపింది

పోజులెన్నో కొట్టినవాళ్లను

పొల్లుమాట చంపింది


మనిషి పొగరుకు అర్ధముందా అసలు?


ప్రపంచాన్ని గెలిచానన్నవాడు 

పనికిరాని చావు చచ్చాడు

అందరినీ భయపెట్టానన్నవాడు 

అర్ధంలేని చావు చచ్చాడు


మనిషి పొగరుకు అర్ధముందా అసలు?


పెద్దపనులు చేశానన్నవాడు

పెరటిదొడ్లో చచ్చాడు

చంద్రమండలానికెళ్ళానన్నవాడు

చెయ్యెత్తలేని స్థితిలో చచ్చాడు



మనిషి పొగరుకు అర్ధముందా అసలు?


కోట్లు కూడబెట్టినవాడు

కోమాలో చచ్చాడు

మహోపన్యాసకుడు

మాటరానిస్థితిలో చచ్చాడు


మనిషి పొగరుకు అర్ధముందా అసలు?


ఏమి చేసినా ఎన్ని సాధించినా

అహాన్ని నీ తలకెక్కనీకు నేస్తం


నీలాంటివాళ్ళు నీకంటే గొప్పవాళ్ళు

ఎందరో పోయారిక్కడ 


రేపేమి జరుగుతుందో తెలీని బ్రతుకులో

మనిషి పొగరుకు అర్ధముందా అసలు?


నీ అహంకారానికి అర్ధముందా అసలు?

3, మార్చి 2026, మంగళవారం

మనకేంటి సంబంధం?

ఇరాన్లో ఖమేనీ చంపబడ్డాడు.

ఇండియాలోని అనేకరాష్ట్రాలలో ముస్లిములు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన ప్రకటిస్తున్నారు. నినాదాలిస్తున్నారు. హింస రేగకుండా పోలీసు బందోబస్తు చెయ్యవలసి వస్తున్నది.

అసలు, వీళ్ళకేంటి సంబంధం?

'తినేది భర్త తిండి, పాడేది ఇంకెవడిదో పాట' - అని తెలుగులో ఒక సామెతుంది. అలా ఉంది వీళ్ళ ధోరణి.

'ఖమేనీ మా నేత, మా గురువు' అని వీళ్ళనుకుంటే, ఇండియాలో ఉండటం ఎందుకు? ఇరాన్ కి వెళ్ళిపోవాలి. 

ఎందుకు పోవడం లేదు?

ఈ ఖమేనీ గురించి ప్రపంచనేతలు ఏమన్నారు?

'ప్రపంచంలోని అత్యంతదుష్టులలో ఖమేనీ ఒకడు' అని డోనాల్డ్ ట్రంప్ అన్నాడు. అంతేకాదు, 'నన్ను రెండుసార్లు చంపాలని ప్లాన్ వేశాడు. ప్రయత్నించాడు. కానీ చివరకు నాకే దొరికిపోయాడు' అని కూడా అన్నాడు. అంటే తనమీద జరిగిన హత్యాప్రయత్నాలను చేయించింది ఖమేనీనే అని ట్రంప్ సూటిగానే చెప్పాడు.

'గత 47 ఏళ్లుగా ఇజ్రాయెల్ ను రూపుమాపాలని ఖమేనీ ప్రయత్నించాడు. చివరికి న్యాయం జరిగింది' అని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు.

'ప్రపంచంలోని అత్యంతదుష్టులలో, హింసావాదులలో, కిరాతకులలో ఖమేనీ ఒకడు' అని  అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ ప్రకటించాడు.

'ఒక నియంత చావడం చాలా మంచిది' అని ఉక్రెయిన్ ప్రకటించింది.

'ఇలాంటి సైతాన్ పాలన అంతమైతే ఏడ్చేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు' అని UK ప్రకటించింది.

'ప్రపంచంలోని టెర్రరిస్టు కిరాతకులకు మిసైల్స్ సరఫరా చేస్తున్నది ఇరానే' అని ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ అల్బనీస్ ప్రకటించాడు.

'ఖమేనీ ఛస్తే గాని మాకు తృప్తి లేదు' అని ఫ్రాన్స్ ప్రకటించింది.

'మిడిల్ ఈస్ట్ లోని గొడవలకన్నింటికీ కారణం ఇరాన్ మాత్రమే' అని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించాడు.

వాస్తవాలిలా ఉంటే, ఇండియాముస్లింలు మాత్రం తెగ బాధపడిపోతున్నారు. వాళ్లకు తిండీనీళ్ళూ సహించడం లేదు. అక్కడేదో ఖమేనీవల్ల మన దేశం ఏదో మేలును పొందినట్లు?

ఈ ఖమేనీ ఒకపెద్ద హిందూవ్యతిరేకి. ఇండియాని ఆక్రమించాలని చూసేవాళ్లకు మాత్రం గొప్ప మిత్రుడు. మహానుభావుడు.

2017 లో, 'కాశ్మీరుకోసం తిరగబడండి. విధ్వంసాలు చెయ్యండి' అని ఇండియా ముస్లిములను ఖమేనీ రెచ్చగొట్టాడు.

2020 ఢిల్లీ అల్లర్లు జరిగినపుడు, 'ఇండియాలోని ముస్లిములను హిందూ తీవ్రవాదులు చంపుతున్నారు. ముస్లిములకు ఇండియాలో రక్షణ లేదు' అని ఖమేనీ ప్రకటన చేశాడు. 

కానీ, నిజానికి ఇండియాలో జరిగినది, జరుగుతున్నదీ, దానికి పూర్తిగా వ్యతిరేకం. ఇండియాలో ముస్లిములకున్నంత రక్షణ మరే దేశంలోనూ లేదు.

మన దేశం తెచ్చిన CAA (Citizenship Amendment Act) ను ఇరాన్ పార్లమెంట్ వ్యతిరేకిస్తూ ప్రకటన చేసింది. 

2024లో, ఇండియాను గాజాను పోలుస్తూ ప్రకటన చేశాడు ఖమేనీ. అంటే, నేడు ఇజ్రాయెల్ లో ఏదైతే జరుగుతున్నదో, అదే ఇండియాలో కూడా జరగాలని అతని కోరిక.

అనేకసార్లు ఇండియా అంతర్గతవ్యవహారాలలో ఖమేనీ జోక్యం చేసుకుని ముస్లిములను రెచ్చగొట్టే ప్రకటనలు చేశాడు. ఆసియా మొత్తాన్నీ, ముఖ్యంగా ఇండియాను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నదే ఇతని జీవితధ్యేయం.

ఊరకే తెల్లగడ్డం పెంచి, తలపాగా పెట్టుకుని, గౌను తొడుక్కున్నంతమాత్రాన ప్రతివాడూ సెయింట్ అయిపోతాడా? ఊరకే 'శాంతి' అని అరిస్తే సరిపోతుందా? పొద్దున్న లేచినదగ్గరనుంచీ చేస్తున్న పనులేంటి?

ఇటువంటి దుర్మార్గుడు చనిపోతే, నిరసనలు చేస్తున్నారు ఇండియా ముస్లిములు.

అసలు వీళ్ళనేమనాలి?

ఎక్కడో ఎవడో చస్తే, మీకేంటి సంబంధం? మీరెందుకు రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేయాలి?

ఇండియా ముస్లిములకు అసలు తెలివనేది ఉందా? దేశభక్తి ఉందా? ఇదేనా దేశభక్తి అంటే?

ఇతరదేశాలకు భావదాస్యపు ఊడిగం చేయడాన్ని ఇండియాముస్లిములు ఎప్పుడు మానుకుంటారో?

ఇలాంటివాళ్లకు వంతపాడుతూ, సంతాపాలు ప్రకటిస్తున్న పార్టీలకు మనమెందుకు ఓట్లేసి గెలిపించాలి? మన శత్రువులకు వంతపాడుతూ, శత్రుదేశాలను సపోర్ట్ చేస్తున్న నాయకులు మనదేశంలో అసలెందుకుండాలి?

ఆలోచించండి.

28, ఫిబ్రవరి 2026, శనివారం

ఎలైట్ మేరేజ్

నిన్న మా ఆశ్రమంలో ఒక పెళ్లి జరిగింది.

ఇది ప్రేమవివాహం. ఆ తరువాత, పెద్దలు అంగీకరించిన వివాహం.

ఆశ్రమంలో నిరాడంబరంగా జరిగిన వివాహం.

కేవలం నలభైఅయిదు నిముషాలలో పెళ్లి అయిపోయింది.

మంత్రాలు లేవు. హంగులు లేవు. ఆర్భాటాలు లేవు. మేకప్పులు, వీడియోలు, ఫోటోషూట్ల అనైతికపోకడలు  లేవు. ఎరువుతెచ్చుకున్న సంగీత్ లు, బారాత్ లు, ఆడాళ్ళ డాన్సులు లేవు. మైకులగోల లేదు. 

పిల్లలగోల, సంతమార్కెట్ లాంటి వాతావరణం, అహంకారధోరణులు, అలుగుళ్ళు, అరుచుకోవడాలు, కోపతాపాలు, వస్తువులు పోవడాలు, ఏడుపులు, పెడబొబ్బలు, గొడవలు, ఒళ్లలిసిపోయేలా, కళ్ళు తిరిగిపోయేలా కష్టపడిపోవడాలు, కట్నకానుకలు, పెట్టుపోతల గొడవలు, తొంభయి రకాల ఐటమ్స్ తో భోజనాలు, అందులో సగంపైన వృధాకావడం  -- ఇవేవీ భూతద్దంతో వెతికినా ఎక్కడా లేవు.

మౌనంగా, నిశ్శబ్దంగా ఉన్న ఆహ్వానితులు.

మంద్రమైన సన్నాయి మేళం.

హడావుడీ, తొక్కిసలాటా లేని ఆహ్లాదమైన ఆశ్రమవాతావరణం.

చేస్తున్న తంతుకు అర్ధాన్ని తెలుసుకుంటూ అరగంటలో అయిపోయిన పెళ్లి.

అది - పంచవటి నేర్పిన సంస్కారం.

అసలైన సనాతన హిందూధర్మ జీవనవిధానం.

మంత్రాలు లేకపోవచ్చు. కానీ, వాటి అర్ధాలను వివరించడం జరిగింది.

విసుగుపుట్టే తంతులు లేకపోవచ్చు. కానీ, హిందూధార్మిక వివాహంలోని ముఖ్యఘట్టాలన్నీ ఉన్నాయి.

ఉదయం 11.30 కి కార్యక్రమం మొదలైతే, మధ్యాన్నం 1.30 గంటకి ఉపనయనం, పెళ్లి, భోజనాలు అన్నీ అయిపోయి, అతిధులు తిరిగి బయలుదేరడం కూడా జరిగిపోయింది.

ఇదే అసలైన 'ఎలైట్ మేరేజి' అని మావాళ్లతో అన్నాను.

ఎలైట్ అంటే, కులీన, ఉన్నతవర్గానికి చెందిన అని అర్ధాలున్నాయి. 'క్లాస్' అని అర్ధం చెప్పుకోవచ్చు.

పంచవటి శిష్యులందరూ ఈ చీకటిప్రపంచంలో వెలుగుతున్న దీపాలవంటివారు. అంటే లైట్లన్నమాట.

మనలో 'లైట్' ఉన్నపుడు, మనచుట్టూ 'ఎలైట్' లేకుండా ఎలా ఉంటుంది?

ఈ లైటూ, ఎలైటూ, కులంతో, డబ్బుతో, అధికారంతో, హోదాతో, దర్పంతో వచ్చేవి కావు.

ఉన్నతమైన సంస్కారపు విలువలతో, ధర్మబద్ధమైన  ఆధ్యాత్మిక జీవనంతో వస్తాయి.

ఇది కులాంతర వివాహం. 

'మేము గుణానికి మాత్రమే విలువనిస్తాము. కులానికి కాదు' అని నేను ఎన్నోఏళ్లుగా చెబుతున్నదానికి ఋజువే ఈ వివాహం.

'మేము ఊరకే మాటలను చెప్పము. చెప్పినది చేసి చూపిస్తాము' అనడానికి కూడా ఇదే నిదర్శనం.

పంచవటిలో అన్నికులాలూ ఉన్నాయి. పేదలనుంచి, కోటీశ్వరులవరకూ అన్ని తరగతులవారూ, వర్గాలవారూ ఉన్నారు. కానీ మేమంతా ఒకే కుటుంబం.

దానిపేరు 'పంచవటి' కుటుంబం.

ఇక్కడ అసలైన ఆధ్యాత్మికత ఆచరణాత్మకంగా దర్శనమిస్తుంది.

ఎంతోమంది సంస్కర్తల, మహనీయుల భావాలు ఇక్కడ కార్యరూపం దాలుస్తాయి.

ప్రపంచపు వెకిలితనానికి భిన్నమైన ఉదాత్తమైన, ఉన్నతమైన, సంస్కారపూరితమైన జీవనవిధానం ఇక్కడ అడుగడుగునా కనిపిస్తుంది.

అందుకే అంటున్నాను ఇది 'ఎలైట్ మేరేజ్' అని.

'వర్గం లేనిదే స్వర్గం' అని జిల్లెళ్ళమూడి అమ్మగారన్నారు.

'భక్తేర్ జోతి నోయ్' (భక్తులలో కులం ఉండదు) అని శ్రీరామకృష్ణులన్నారు.

దానిని నిజం చేసి చూపిస్తున్నాం.

స్వర్గాన్ని భూమిపైన ఆవిష్కరించే ప్రయత్నాన్ని చేస్తున్నాం.

ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో జరగాలని, ఎంతోమంది జీవితాలలో అవి 'లైట్' ను నింపాలని ఈ సందర్భంగా ఆశిస్తూ, ఈ 'ఎలైట్ మేరేజి' లో పాలుపంచుకున్న అందరికీ, ముఖ్యంగా లండన్, దుబాయ్, అమెరికాల నుండి వచ్చి మరీ ఈ వివాహంలో పాలుపంచుకున్నవారికి, రాగలిగినవారికి, రాలేకపోయినవారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు పంచవటిశిష్యులకు ఈ సందర్భంగా నా ఆశీస్సులందిస్తున్నాను.

అర్ధంలేని ప్రహసనాలుగా నడుస్తున్న నేటి పెళ్లిళ్లన్నీ ఈ 'ఎలైట్ మేరేజి' ని చూచి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

26, ఫిబ్రవరి 2026, గురువారం

సోదియోగి

ఆశ్రమంలో ఒక పెళ్లి పెట్టుకున్నాం. దానికని శిష్యులు ఒక్కొక్కరే వస్తున్నారు.

ఇవాళ టిఫిన్లయ్యాక మాట్లాడుకుంటూ ఉండగా శిష్యులు ఒక ప్రతిపాదన తెచ్చారు.

'గురూజీ. మీరేమనుకోకపోయితే ఒక చిన్న మాట' అన్నారు.

'చెప్పండి' అన్నాను.

'ఏమీలేదు. మీరిప్పటిదాకా మొదలుపెట్టిన భజనలు, డాన్సులు అన్నీ పాతబడిపోయాయి. ఇప్పుడవేవీ అమ్ముడుపోవడం లేదు. ఆశ్రమానికి ఆదాయం తగ్గిపోయింది. అందుకని మాదొక కొత్త ఐడియా' అన్నారు.

ఆదాయమనేసరికి నాకు నూతనోత్సాహం పెల్లుబికింది.

'త్వరగా చెప్పండి' అన్నాను పక్కమీదనుంచి బద్దకంగా లేస్తూ.

'ఏమీలేదు. మీ రెండుపాదాలకు ఫోటో తీసి AI టూల్స్ తో సరిదిద్ది, ఆ ఫోటోలను మార్కెటింగ్ చేద్దామని అనుకుంటున్నాం. ముందు మీ శిష్యులందరూ కొనుక్కుంటారు. ఆ తర్వాత అందరూ కొనుక్కుంటారు' అన్నారు.

నాకనుమానం వచ్చింది.

'అందరూ ఎందుకు కొనుక్కుంటారు?' అడిగాను.

'పిచ్చిజనం ఏదైనా కొనుక్కుంటారు. అంతా మనం మార్కెటింగ్ చేయడంలో ఉంటుంది. ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన బాబాలు, గురువులు అందరూ ఎలా అయ్యారు మరి? ఈ ఫోటో  దగ్గరుంటే మీకు అదృష్టం  తన్నుకుంటూ వస్తుంది అని ప్రచారం చేద్దాం. చచ్చినట్టు కొనుక్కుంటారు' అడిగారు శిష్యులు.

అదీ నిజమేగా అనిపించింది.

'ఫొటోను కొనుక్కున్నవాళ్ళు దానిని పూజామందిరంలో అందరు దేవుళ్లతో బాటుగా పెట్టుకుంటారు. లేదంటే ఆ దేవుళ్లను మీ పాదాల క్రింద పెడతారు. లేదా, భక్తి ముదిరితే చిన్న చిన్నకార్డులుగా మార్చి జేబులలో పెట్టుకుంటారు. ఇంకా ముదిరిపోతే లాకెట్లుగా మార్చి మెళ్ళో దండలుగా వేసుకుంటారు. మీ పాదాలకు ప్రచారమూ అవుతుంది. మనకు ఆదాయమూ వస్తుంది. ఎలా ఉంది ఐడియా?' అడిగారు శిష్యులు.

ఇన్నాళ్లూ ఈ ఐడియా రానందుకు నామీద నాకే చెడ్డ చిరాకేసింది.

'వెరీ గుడ్ ఐడియా. ఎంత పెడుతున్నారు రేటు?' అడిగాను.

'ఒక కాలుకు రెండువేలు చొప్పున రెండుకాళ్ళకూ నాలుగువేలు పెడదాం' ముక్తకంఠంతో డిసైడ్ చేశారు శిష్యులు.

'మన కాళ్లకు అంత విలువుందా?' అని నాకు అనుమానమేసినప్పటికీ, వాళ్ళు చెబుతున్నారు గనుక, ఉందేమోలే అనిపించి 'ఓకే. ప్రొసీడ్. అయితే ఈ స్కీముకు ఏ పేరు పెడుతున్నారు?' అని అడిగాను.

'బురిడీబాబా లేదా సోదియోగి' అని రెండు టైటిల్స్ అనుకుంటున్నాం, మీరు ఏదో ఒకటి డిసైడ్ చెయ్యండి' అన్నారు శిష్యులు.

'బాబా పాతబడిపోయింది. యోగి బెటర్' అన్నాను.

'సరే గురూజీ, 'సోదియోగి' టైటిల్ ని ఫైనల్ చేద్దాం' అన్నారు శిష్యులు.

'ఎక్సలెంట్. గో ఎహెడ్. విజృంభించండి. ఈ ఫోటోలు లక్షలాది అమ్ముడుపోవాలి. మనకు కోట్లు వచ్చిపడాలి. మరి, ఆ డబ్బుతో ఏం చేద్దాం?' అడిగాను.

'ఏముంది? నల్లమల అడవులలో ఒక నూరెకరాలు కొనేద్దాం' అన్నారు శిష్యులు.

'అడవులు అలా అమ్మరు' అన్నాను కోపంగా

'మరీ మంచిది. అమ్మకపోతే ఆక్రమిద్దాం. ఆక్రమించేసి మన ఆశ్రమం బ్రాంచిని అక్కడ కడదాం' అన్నారు.

'భలే బాగుంది. ఇక పనిమీదుండండి' అని  ఆజ్ఞాపించాను.

'సరే గురూజీ, మీరు విశ్రాంతి తీసుకోండి. మిగతా పని మేము చూసుకుంటాం' అంటూ వాళ్ళు పనిలోకి దిగారు.

నేను పక్కమీద వెనక్కు వాలి, మళ్ళీ యూట్యూబులో మునిగిపోయాను.

24, ఫిబ్రవరి 2026, మంగళవారం

నీవే నేను

పసిపాపలా నిద్రిస్తున్న

నీ ముద్దుమోమును చూస్తూ


కనురెప్ప వాల్చలేక

నిద్రకు దూరమయ్యాను


ప్రేమ తప్ప ఏమీ తెలియని

మమత తప్ప ఏమీ ఎరుగని


నీ అమాయకపు మనసును గమనిస్తూ

గుండె కరిగి నీరయ్యాను


కరిగిపోతున్న కాలాన్ని 

కళ్ళెదురుగా చూస్తూ


గమ్యంలేని పయనాన్నీ

గతిలేని మన బ్రదుకులనూ


నిస్సహాయంగా పరికిస్తూ

నిశ్చేష్టుడనై నిలుచుండిపోయాను


గతజన్మల మన కథలన్నీ

వరుసగా చదువుకొని


విధి ఆడే వింతాటను తలచి 

కన్నీరుమున్నీరయ్యాను


తమ స్వార్థం కోసం 

ఇతరులను బలిచేసిన వాళ్లనూ

 

ఇతరుల స్వార్థం కోసం 

తాము బలైపోయిన వాళ్ళనూ


ఎందరినో చూచి

మనసు స్థంభించి  శిలనయ్యాను


అదుపులేని ఆవేశాలనూ 

వెర్రివైన వ్యామోహాలనూ


బాధ్యత లేని మనుషులనూ

భయంతో సాగే బ్రతుకులనూ


అన్నింటినీ చూస్తూ 

బ్రదుకుతీరు అర్ధంకాని వెర్రినయ్యాను


ఎన్నో రూపాలలో ఎన్నో సందర్భాలలో

ఎప్పటినుంచో ఎదురొస్తూ


అన్నింటినీ నేర్పిస్తూ

అనుక్షణమూ ఆదుకున్న

 

నిన్ను చివరకు గుర్తించి

మాటరాక మూగనయ్యాను


చేయవలసిన పనులు

చెందవలసిన గనులు


చేరవలసిన చోటు

పోరవలసిన పోరు


అసలంటూ ఏవీలేవన్న 

అంతిమసత్యం తెలిసిరాగా


నాలో నేనై 

అన్ని నేనులూ నేనై

నీవే నేనయ్యాను

23, ఫిబ్రవరి 2026, సోమవారం

బందీలు

భార్యకు భర్తా, భర్తకు భార్యా 

ఒకరికొకరు బందీలు

ఇద్దరూ కలసి 

కుహనా కుటుంబవ్యవస్థకు బందీలు


అర్ధం లేని చదువులకు పిల్లలు

ఊపిరి సలపని బ్రతుకులకు ఉద్యోగులు

తెంపులేని చాకిరీకి గృహిణులు

బందీలు


పెరిగిపోతున్న ఆస్తులకు

తరిగిపోతున్న కాలానికి

వీడని దురాశలకు

తీరని కోరికలకు

మనుషులు బందీలు


గుళ్లకు దేవుళ్ళు

లంచాలకు ఉద్యోగులు

అధికారదాహానికి నాయకులు

అత్యాశకు సామాన్యులు

బందీలు


ఆలోచనలకు మేధావులు

అహంకారాలకు మతాధిపతులు

అన్యాయాలకు నేరస్తులు

అబద్దపు బ్రతుకులకు అందరూ

బందీలు


విశాలత్వంలోకి ఎదగనివ్వకుండా

పట్టి ఆపుతున్న

తమ ఆత్మలకు తామే

ప్రతి ఒక్కరూ బందీలు

16, ఫిబ్రవరి 2026, సోమవారం

సమాధి

'విశాఖపట్నం నుండి ఒకాయన ఫోన్ చేశాడు. అర్జెంట్ గా మిమ్మల్ని కలుస్తాడట' అన్నాడు మా సెక్రటరీ మూర్తి.

'ఎందుకు?' అడిగాను.

'సమాధిస్థితి కావాలట' అన్నాడు.

'ఎంత వయసు?' అడిగాను.

'చిన్నవాడే. ముప్పైకి అటూ ఇటూ ఉండచ్చు' అన్నాడు మూర్తి.

ఆశ్చర్యమేసింది.

'సరే రమ్మను. చూద్దాం' అనబోతున్నాను.

అంతలో ఒక బాంబు పేలింది.

'కానీ కొన్ని కండిషన్స్ పెట్టాడు' అన్నాడు మూర్తి.

'ఏంటవి?' అడిగాను.

'శుక్రవారం సాయంత్రం వస్తాట్ట. శనివారం, ఆదివారం మాత్రం ఆశ్రమంలో ఉండగలడట. మళ్ళీ సోమవారం పొద్దున్నే వెళ్ళిపోవాలట. అంతకు మించి కుదరదట. ఈలోపలే, గురువుగారిచ్చే సమాధో ఇంకోటో లేటు చెయ్యకుండా ఇచ్చెయ్యాలన్నాడు. లేటయితే తనకు నచ్చదట' అన్నాడు మూర్తి.

'ఏం లేటయితే పరలోకానికి ఫ్లయిటు మిస్సవుతుందా?' అడిగాను.

'ఏమో మరి?' అన్నాడు.

'సరే. ఒకపని చేద్దాం. 'సాధనా నివాస్' కోసం తెప్పించిన ఇటుకలు, సిమెంటు, ఐరను అన్నీ ఆశ్రమంలోనే ఉన్నాయి. వాటితో ఒక 4x4 సమాధి కట్టిద్దాం. వచ్చి శుక్రవారం సాయంత్రం అందులో కూచోమను. బయటనుంచి డోరు సీలు చేసేద్దాం. బయటకొచ్చే ఓపికుంటే,  సోమవారం పొద్దున్నే తలుపు తీసుకుని బయటకురావచ్చు,  లేదంటే, ఎప్పటికీ అందులోనే ఉండిపోవచ్చు'  అన్నాను. 

మూర్తి నవ్వి, 'ఇదే చెప్పమంటారా?' అన్నాడు.

'నిరభ్యంతరంగా చెప్పు . మరి సమాధి త్వరగా కావాలంటే అదే మార్గం' అన్నాను.

సోషల్ మీడియా  ప్రభావంతో అన్నీ వెర్రితలలేసినట్లే ఆధ్యాత్మికం కూడా వేస్తోంది.

చక్రాలు, కుండలిని, సమాధి, ఆత్మసాక్షాత్కారం, జీవన్ముక్తి మొదలైనవన్నీ ఏవో నవ్వులాటల్లాగా తయారయ్యాయి. వారంరోజుల కోర్సుతో ఇవన్నీ వచ్చేస్తాయని భ్రమపడుతున్నారు పిచ్చిజనం !

ఇలాంటివాళ్ళకి నేను చెప్పిన సమాధే కరెక్టు.

అదేంటి? అప్పుడే పనివాళ్ళొచ్చేశారు. సమాధి కట్టేస్తున్నారు. బాబోయ్ ! మావాళ్లు చాలా ఫాస్ట్ గా ఉన్నారు.

మరి ఆ కుర్రాడెప్పుడొస్తాడో ఏంటో?

శివుడు చూస్తున్నాడు

శివరాత్రి.

పక్కఊరి శివాలయంలో ఏకాహభజన ఏర్పాట్లు జరిగాయి.

శివుడు మౌనంగా చూస్తున్నాడు.

నిన్న పొద్దుటినుంచీ 24 గంటల భజన మొదలైంది.

ఆరుగంటలకొక బ్యాచ్ చొప్పున ఆడాళ్ళు చేరి భజన చేస్తున్నారు.

రాత్రంతా మాక్కూడా మైకు వినిపిస్తూనే ఉంది.

శివుడు చూస్తూనే ఉన్నాడు.

తెల్లవారింది. 

భజనచేస్తున్న భక్తులు అలసిపోయి ఇంటికిపోయి నిద్రపోతున్నారు.

శివుడికి మాత్రం అలుపూ లేదు, నిద్రా లేదు. 

ఎప్పటిలా చూస్తూనే ఉన్నాడు.

15, ఫిబ్రవరి 2026, ఆదివారం

అంతటా వెలుగు

తెల్లవారుఝాము. 

చీకటి బాగా ఉంది. 

మైలుదూరంలోని పల్లెమసీదు పొద్దున్నే నిద్రలేపింది.

ఇవాళ శివరాత్రి కదా? దాని సౌండు చాలా పెరిగింది.

'అల్లా తప్ప వేరే దేవుడు ఎవడూ లేడు' అని రోషంగా మైకు అరుస్తోంది.

'610 CE  కి ముందు ఎవడున్నాడా?' అని నాకు డౌటొచ్చింది.


తెలతెలవారుతోంది.

ఫోన్లో ఏదో మెసేజి వచ్చింది.

'ఏంటా?' అని చూచాను.

'హ్యాపీ శివరాత్రి' అని ఒక స్నేహితుని నుంచి.

'శివుడికి రాత్రయితే నీకు హ్యాపీ ఎందుకు?' అని రిప్లై ఇచ్చాను.


తెల్లవారింది

ఆదివారం కదా ! ఇంకొక ఊరినుంచి చర్చిమైకు చెవుల్లో మ్రోగుతోంది.

దాని సౌండు కూడా ఇవాళ బాగా ఎక్కువైంది.

స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం - అంటూ అరిగిపోయిన రికార్డులాగా ఎవరో అరుస్తున్నారు.

ఏ స్తోత్రమో, ఎవరికి స్తోత్రమో అదిమాత్రం చెప్పడం లేదు. 

బహుశా వాళ్ళక్కూడా సరిగ్గా తెలిసినట్టు లేదు.


కొంచెం పొద్దెక్కింది.

గుడిమైకులు నిద్రలేచాయి. 

శివుడి సినిమాపాటలు మార్మోగుతున్నాయి.

మళ్ళీ ఏడాదిదాకా వాటికి పనీ ఉండదు. శివుణ్ణి అనుకునేవారూ ఉండరు.

'పోన్లే ఇవాళన్నా మ్రోగనీ' అనుకున్నాను.


బారెడు పొద్దెక్కింది. 

2008 లో నేను వ్రాసిన మొట్టమొదటి పోస్టును ఒక శిష్యుడు నాకే ఫార్వార్డ్ చేశాడు.

అందులో, ఆనాటి శివరాత్రినాడు కాళహస్తిలో నాకు కలిగిన ధ్యానానుభవాన్ని వర్ణించాను.

నా పోస్టును నాకే పంపడంలో అతని ఉద్దేశం నాకర్ధం కాలేదు.

బహుశా, 'అప్పుడలా  ఉన్నారు.ఇప్పుడేంటి?'  అని అతని ఉద్దేశం కావచ్చు.

'ఆనాడు ధ్యానం చేశాను. ఈనాడు స్నానం కూడా చెయ్యను' అని అతనికి రిప్లై ఇచ్చాను.


సూర్యుడు బాగా పైకొచ్చాడు. అంతటా వెలుగు పరచుకుంది.

నాకు బాగా మెలకువొచ్చింది.

6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

పాలల్లో విషం

ప్రస్తుతం తిరుపతిలో మకాం.

పుస్తకప్రదర్శనలో మన స్టాల్ ను సందర్శిస్తున్నాం. ఒకరోజున ఇతరస్టాళ్లను చూచుకుంటూ నడుస్తుండగా ఒకాయన ఆపి, ' నేను కొన్ని సూక్తులను వ్రాసాను. చూడండి ' అంటూ ఒక కాగితాన్ని చూపించాడు. 

సరే ఏంటో చూద్దామని దృష్టి సారించాను.

దానిపైన మొదట్లోనే 'ఓం శ్రీ సాయినాధాయ నమః' అని వ్రాసుంది. దానిక్రింద ఏవేవో నీతులు రాసున్నాయి. ఇలాంటి మెంటల్ కేసులను చాలామందిని చూచి ఉన్నానేమో,  వెంటనే ఆ కాగితాన్ని అతనికిచ్చేసి ' మీ సూక్తులు మొదట్లోనే పెడదారి పట్టాయి. ముందు దీన్ని మార్చండి. ఆ తరువాత ఇతరులకు  నీతులు చెప్పచ్చు ' అంటూ ఆ లైన్ చూపించాను.

సాయిబాబా గురించి నేనంటున్నానని అతనికి అర్థమైంది. 

'మీకు బాబా నచ్చకపోతే వదిలేసి, మిగతాదాంట్లో మంచిని తీసుకోండి' అన్నాడు తెలివిగా.

వాళ్ళు చేస్తున్న తప్పేంటో వాళ్లకు అర్ధంకాదు. కానీ ఈ అతితెలివికి మాత్రం తక్కువేమీ ఉండదు.

'పాలల్లో విషం కలిసింది. విషం వదిలేసి పాలు మాత్రమే త్రాగమంటే ఎలా వీలవుతుంది? మీరు త్రాగగలరా?' అన్నాను.

అతనికి నోటమాట రాలేదు.

' సాయిబాబాకీ నాథసాంప్రదాయానికీ సంబంధం ఏంటసలు? సాయినాథ, ఏసునాధ, ఏంటి ఇదంతా? ఇలాంటి సంకరపదాలు, సంకరమంత్రాలు తయారుచేసినవాడికి అసలు మతుందా పోయిందా?' అడిగాను.

అతనలాగే చూస్తున్నాడు.

'తురకబాబాకి బీజాక్షరాలు జోడించినంత మాత్రాన ఆయన హిందువు కాలేడు. మీరు మాత్రం చివరకు ఎటూకాకుండా అయిపోతారు. నా ఈ సూక్తిని మీ సూక్తులకు చేర్చుకోండి' అని చెప్పి నా దారిన ముందుకొచ్చేశాను. 

మత్స్యేంద్రనాధుడు, గోరఖ్ నాధుడు మొదలైన నవనాథులు మహాసిద్ధులు. వారందరూ ఈశ్వరభక్తులు. ఆ పేరుని కూడా కల్తీ చేస్తున్నారు నేటి కుహనాహిందువులు.

'ఎంత అజ్ఞానంలో ఉన్నార్రా హిందువులారా? మీకు చెప్పేవాడు లేడు. ఉన్నా మీరు వినరు. మీ ఖర్మ ఇంతే' అనిపించింది.

1, ఫిబ్రవరి 2026, ఆదివారం

మా 77 వ గ్రంధంగా 'జ్ఞానసంకలినీ తంత్రము' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 77 వ గ్రంధంగా, 'జ్ఞానసంకలినీ తంత్రము' అనబడే ప్రాచీనగ్రంధమునకు నా వ్యాఖ్యానమును నేడు విడుదల చేస్తున్నాము. 


తంత్రములన్నీ శివశక్తుల సంవాదరూపములై యుంటాయి. ఈ గ్రంధము కూడా అటువంటిదే. దీనియొక్క పేరునుబట్టి, అనేక ఇతరతంత్రముల నుండి సేకరించబడిన జ్ఞానము ఈ గ్రంధములో ఒకచోట కూర్చబడినదని తెలుస్తున్నది.


పెద్దదైన ఏ ఇతర గ్రంధమునకూ ఇది అనుబంధము కాకుండా, స్వతంత్రరచనగా కనిపిస్తున్నది. దీనిలోని భావములు కూడా, వివిధ యోగోపనిషత్తులనుండి, జ్ఞానోపనిషత్తులనుండి సేకరించబడినట్లుగా ఉన్నాయి. దీని ప్రతిధ్వనులు భగవద్గీతలో కూడా మనకు దర్శనమిస్తాయి.


దీనిలో సృష్టిక్రమము, పంచభూతములు, చక్రములు, నాడులు, వాయువులు, వాటియొక్క పనులు, ఓంకారము, దానియొక్క మూడుభాగములు, ఆయాభాగముల తత్త్వములు, కుండలినీసాధన మొదలైన విషయములు వివరింపబడినాయి. ఆచారములు, తంతులకు భిన్నమైన జ్ఞానమార్గము, యోగశాస్త్రముతో మేళవింపబడి దీనిలో దర్శనమిస్తున్నది.


మధ్యయుగములనాటి అనేకగ్రంథములలో వలె, దీనిలో కూడా, వేదాంతమును, యోగశాస్త్రమును, తంత్రశాస్త్రమును సమన్వయపరచాలనిన ప్రయత్నం కనిపిస్తుంది. వేదాంత, యోగ, తంత్రశాస్త్రాభిమానులకు, జిజ్ఞాసువులకు మరియు సాధకులకు ఈ గ్రంధం ఉపయోగకరంగా ఉంటుందని మా విశ్వాసము.


ఈ గ్రంధము కూడా తిరుపతి బుక్ ఫెస్టివల్ లోని 35 వ నంబరు స్టాల్లో లభిస్తుంది. లేదా మా తక్కిన గ్రంధాలలాగే ఆన్లైన్ లో ఇక్కడ లభిస్తుంది. జిజ్ఞాసువులు, పాఠకులు మరియు మా అభిమానులు దీనిని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.

నిస్వార్థ కర్మయోగులు


తిరుపతి బుక్ ఫెస్టివల్ లో మన స్టాల్ ను నడుపుతున్న నిస్వార్థకర్మయోగులను ఇక్కడ మీరు చూడవచ్చు. వీరందరూ, సాఫ్ట్ వేర్ రంగంలో సీనియర్ పొజిషన్స్ లో ఉన్న ఇంజనీర్లు. అదేసమయంలో మన పంచవటి సాధనామార్గంలో సీనియర్ సాధకులు కూడా.

అసలైన హిందూమతం గురించి, యోగమార్గం గురించి, పంచవటి భావజాలం గురించి, మీకున్న సందేహాలను, ఈ పదిరోజులలో ప్రత్యక్షంగా వీరిని కలిసి మీరు తీర్చుకోవచ్చు.

తిరుపతివాసులు దీనిని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.

30, జనవరి 2026, శుక్రవారం

18 వ తిరుపతి బుక్ ఫెస్టివల్ లో పంచవటి స్టాల్




జనవరి 31 నుండి ఫిబ్రవరి 8 వరకూ, తిరుపతిలో బుక్ ఫెస్టివల్ జరుగుతుంది. దీనిలో మన 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' కు 35 వ నంబరు స్టాలు కేటాయించబడింది. దీనిలో మా పుస్తకాలన్నీ లభిస్తాయి.

ఈ మధ్యనే విడుదలైన ఈ క్రింది పుస్తకాలను కూడా ఈ స్టాల్లో అందుబాటులో ఉంచుతున్నాము. 

1. స్వరచింతామణి 
2. యోగ యాజ్ఞవల్క్యము 
3. జ్ఞానసంకలినీ తంత్రము

మా భావజాలాన్ని వివరించడానికి మా సంస్థ సీనియర్ సభ్యులు స్టాల్లో అందుబాటులో ఉంటారు.

తిరుపతివాసులు, అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నాము. 

ఫిబ్రవరి 5 మరియు 8 తేదీలలో నేను కూడా తిరుపతిలోనే ఉంటాను. అప్పుడు ఈ స్టాల్ ను సందర్శించబోతున్నాను.

తిరుపతిలో కలుసుకుందాం.

16, జనవరి 2026, శుక్రవారం

సోమనాథ్ ఆలయ కథ - ఇస్లామిక్ నాటో

గుజరాత్ రాష్ట్రంలో అరేబియాసముద్రతీరంలో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రం - సోమనాధ్ ఆలయం. 'సౌరాష్ట్రే సోమనాథం చ..' అంటూ మొదలౌతుంది మన జ్యోతిర్లింగ స్తోత్రం. పాతకాలంలో గుజరాత్ ను 'సౌరాష్ట్ర' అనేవారు.

1026 CE లో మహమ్మద్ ఘజనీ చేసిన దండయాత్రలో ఈ ఆలయం తీవ్రంగా ధ్వంసమైపోయింది. దానిని దండయాత్ర అనడం కంటే, దోపిడీ అంటే సరిపోతుంది. ఇది జరిగి నేటికి సరిగ్గా వెయ్యేళ్ళు నిండాయి. యాభైవేలమంది తురకసైనికులతో ఈ ఆలయాన్ని ముట్టడించి దానిని మూడురోజులపాటు తీరికగా ధ్వంసం చేసి, దోచుకున్నాడు గజనీ.

వందలాదిమంది హిందూవీరులు దానిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి, ఆ యుద్ధంలో చనిపోయారు. నిరాయుధులైన వందలాదిమంది బ్రాహ్మణపండితులను ఆ ఆలయపరిసరాలలో నరికేసింది గజనీ సైన్యం. స్త్రీలపైన చేసిన అరాచకాలకు లెక్కే లేదు.

సోమనాధ్ జ్యోతిర్లింగాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టి, తన దేశంలోని మసీదుల మెట్లలో తాపడం చేయడానికి తీసుకుపోయాడు ఘజనీ. రోజూ మసీదులకు వెళ్లే తురకలు వాటిని తొక్కుతూ మసీదులోపలకు పోవాలన్నది ఆ ప్లాను. ఇప్పటికీ ఆ మసీదులు అలాగే ఉన్నాయి. జ్యోతిర్లింగపు ముక్కలు ఆ మెట్లలోనే ఉన్నాయి. ఈనాటికీ వాటిని వేలాదిమంది తొక్కుతూనే ఉన్నారు.

అంతకుముందు 16 సార్లు చేసిన దోపిడీ దండయాత్రలలో ఒకసారి, కురుక్షేత్రం దగ్గరలోని థానేసర్ లో ఉన్న నిలువెత్తు విష్ణుభగవానుని విగ్రహాన్ని పెకలించి అదేవిధంగా ఆఫ్గనిస్తాన్ కు తీసుకుపోయాడు ఘజనీ. దానిని కూడా ముక్కలు చేసి, ఆ ముక్కలను రోడ్లనిర్మాణంలో, మసీదుమెట్ల నిర్మాణంలో వాడేశారు.

మరొక దండయాత్రలో మధురానగరాన్ని అందులోని వందలాది కృష్ణుని దేవాలయాలను ధ్వంసం చేశాడు గజనీ. మళ్ళీ ఆ సంపదను కూడా ఆఫ్గనిస్తాన్ కు తరలించాడు.

ఆఫ్గనిస్తాన్ కు దరిద్రం పట్టడానికి, నేటికీ కూడా నిత్యయుద్ధాలతో అగ్నిహోత్రంలాగా మండుతూ, ఏ విధమైన ఎదుగుదలా లేకుండా, అందరినీ అడుక్కుంటున్న దేశంగా ఉండిపోవడానికి ఇవే ముఖ్యమైన కారణాలు.

1026 CE లో చేసిన దండయాత్రలో, సోమనాథ్ ఆలయఖజానాలో ఉన్న బంగారాన్ని, కోటిపైగా బంగారునాణేలను, వజ్రాలను, లోహవిగ్రహాలను, యాభైఏనుగులు మరియు వందలాది గుఱ్ఱాలపైన తరలించుకుని ఆఫ్గనిస్తాన్ కు తీసుకుపోయాడు ఘజనీ.

అయితే, తిరుగుప్రయాణంలో, వచ్చినదారిలో వెళ్లకుండా, రాన్ ఆఫ్ కచ్, మరియు థార్ ఎడారుల ద్వారా దారిని ఎంచుకోవడం గజనీ చేసిన ఘోరమైన తప్పై కూచుంది. తిరుగుప్రయాణం వారికి నరకాన్ని చూపించింది.

తీవ్రమైన ఎడారిఎండలో వారాలతరబడి ప్రయాణాన్ని తట్టుకోలేక, త్రాగడానికి నీళ్లు లేక, దాదాపు 30 వేలమంది సైనికులు దారిలోనే చనిపోయారు. సగంకంటే తక్కువమంది సైనికులతో తన రాజ్యానికి చేరుకున్నాడు ఘజనీ. అప్పటినుంచీ ఏదో అంతుబట్టని రోగం అతన్ని వెంటాడింది. కొంతమంది చరిత్రకారులు అది మలేరియా అన్నారు, ఇంకొంతమంది టీబీగా తేల్చారు. కొందరు ఎడారిజ్వరం అన్నారు. కొందరు మాత్రం 'రుద్రుని కోపం' అన్నారు. ఏదేమైనప్పటికీ, నాలుగేళ్లు తిరక్కుండానే, 1030 CE లో అతను చనిపోయాడు. అతని వంశం అధికారకుమ్ములాటలతో అంతమైపోయింది.

వెయ్యేళ్ళు గడిచాయి.

మనకు స్వతంత్రం వచ్చిన తరువాత సోమనాథ్ ఆలయాన్ని మళ్ళీ నిర్మించుకున్నాం. అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, హోమ్ మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈ పనికి అండగా నిలబడి ఆలయాన్ని పూర్తి చేయించారు. వారి ప్రయత్నాలను హిందూధర్మవ్యతిరేకి  అయిన ప్రధానినెహ్రూ  వ్యతిరేకించాడు. కానీ వీళ్ళు వినలేదు. ఆలయం మళ్ళీ నిర్మించబడింది.

నేడు మోడీగారి ప్రభుత్వపు చొరవతో, సోమనాథ్ ఆలయం మళ్ళీ అప్పటి కళాకాంతులతో వెలుగుతూ భవ్యమైన మందిరంగా నిలబడింది. శివలింగానికి నమకచమకాలతో రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. వేదఘోష ఆలయంలో ప్రతిధ్వనిస్తోంది.

ఘజనీలాంటి పిచ్చికుక్కలు మాత్రం చరిత్రపుటలలో కలసిపోయారు. అమాయకులను చంపి, అద్భుతమైన ఒక సంస్కృతిని నాశనం చేశాననుకుంటూ, దోచుకున్న డబ్బుతో ఒక వెలుగు వెలిగిన ఆఫ్గనిస్తాన్ నేడు అడుక్కుతినే దేశమైపోయింది. భారతదేశమేమో అగ్రరాజ్యంగా అవతరించడానికి శరవేగంతో ముందుకు దూసుకుపోతోంది.

కానీ, వెయ్యేళ్ళు గడిచినా రాక్షసులు అంతం కాలేదు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, ఇరాన్, టర్కీ, ఖతార్ మొదలైన  రూపాలలో ఇంకా ఉన్నారు. మనదేశానికి ఎసరు పెట్టాలని చూస్తూనే ఉన్నారు.  నిన్నగాక మొన్న జరిగిన సౌదీ, పాకిస్తాన్, టర్కీల డిఫెన్స్ ఒప్పందమే దీనికి తార్కాణం.  'ఇస్లామిక్ నాటో' గా రూపొంది భారతదేశాన్ని ఓడించి, ఆసియాను శాసించాలనేది వీరి వ్యూహం. దీనికి రూపకర్త, విశ్వాసం లేని కుక్క పాకిస్తాన్. దానికి అండ చైనా వంటి ఇతరదేశాలు.

గజనీ వీళ్ళరూపంలో మాత్రమే లేడు. ఇండియాలోనే ఉంటూ శత్రుదేశాలకు వంతపాడే కొంతమంది నాయకుల, ప్రజల రూపాలలో కూడా ఉన్నాడు. వీరందరి బారినుండి, భారతదేశాన్ని రక్షించడానికి బీజేపీ, ఆరెస్సెస్ లున్నాయి గనుక ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. మనం సురక్షితంగా ఉన్నాం. అదే, దేశపుపగ్గాలు వేరేపార్టీల చేతులలో ఉంటే మన దేశపరిస్థితి ఇంకెలా ఉండేదో ఊహిస్తే భయమేస్తుంది.

ఈనాటికీ మన దేవాలయాలలో దూరి నమాజ్ చెయ్యాలని ప్రయత్నించేవారు, అక్కడే మూత్రవిసర్జన చేసేవారు, విగ్రహాలను అవమానించేవారు చాలామంది ప్రతిరోజూ న్యూసులో కనిపిస్తున్నారు. వీళ్ళంతా  'మానసిక స్థిమితం లేనివాళ్లు' అనే మెడికల్ సర్టిఫికెట్ వెనుక దాక్కుని తప్పుకుంటున్నారు. బుద్ధిలేని కొన్నిరాష్ట్రాలు దీనిని చూసీచూడనట్లు పోతున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు దీనిని బాహాటంగా సపోర్ట్ చేస్తున్నాయి. ఇది లాంగ్ రన్ లో మొత్తం దేశానికే చేటౌతుందన్న విషయం చాలామందికి అర్థం కావడం లేదు.

'మెత్తగా ఉంటే మొత్తబుద్ది' అని సామెతుంది. అతిమంచితనం అసలుకే మోసం అవుతుంది.

హిందూమతాన్ని, హిందూదేవతలను, హిందూదేశాన్ని, ఎవరు అవమానించినా వాళ్లకు 'షరియా' ప్రకారం తక్షణశిక్షలు పడాలి. మతిస్థిమితం లేనివాళ్లయితే, మతి వచ్చేవరకూ, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ప్రభుత్వం ఆ పనిని చేయకపోతే ప్రజలే చేయాలి. అటువంటి చైతన్యం ప్రజలలో వచ్చిననాడే మనదేశానికి రక్ష.

'హిందువులు ఒకళ్ళ జోలికి అనవసరంగా పోరు' అనేది అందరికీ తెలుసు. అదే మనకు శాపమైంది. 'వాళ్ల జోలికి పోతే ఊరుకోరు' అనే విషయం కూడా అందరికీ అర్ధం కావాలి.

సోమనాథ్ ఆలయాన్ని మనం తిరిగి నిర్మించుకున్నాం. అదేవిధంగా, గజనీకూడా మళ్ళీ బ్రతికి లేస్తున్నాడు. ఈ యుద్ధం అంత తేలికగా ముగిసేటట్లు కనిపించడం లేదు. అలా ముగియాలంటే, భారతీయులలో హిందూచైతన్యం రావాలి. 

లేకపోతే మాత్రం, ఇస్లామిక్ నాటో రూపంలో మళ్ళీ  ప్రాణం పోసుకుంటున్న ఘజనీ దాడులకు మనదేశం గురికాక తప్పేటట్లు లేదు.

ఈసారి యుద్ధంలో గజనీ గెలుస్తాడా? మనం గెలుస్తామా? చూడాలి.

PSLV - C 62 విఫలం కావడానికి ముహూర్తం కారణమా?

మొన్న 12 వ తేదీన ప్రయోగించిన PSLV - C 62 రాకెట్ విఫలమైంది. 

టెక్నికల్ కారణాలు ఏవైనా ఉండవచ్చు గాక ! జ్యోతిష్య కారణాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. 

ఆ రోజున ఉదయం 10. 12 కి గ్రహస్థితిని నేను పరిశీలించాను. ఇంతకంటే పనికిరాని ముహూర్తం ఇంకెక్కడా ఉండదు. ఇది విఫలం కావడానికి పెట్టిన ముహూర్తంలాగా ఉంది గాని, సక్సెస్ కు పెట్టిన ముహూర్తంలాగా లేదు.

జ్యోతిష్యశాస్త్రాన్ని వారు లెక్కిస్తారో లేదో నాకు తెలియదు. కానీ, జరిగిన నష్టంతో పోల్చుకుంటే, నమ్మకం అంత ముఖ్యం కాదన్న చిన్నవిషయం వాళ్ళ లాజిక్ కు తట్టి ఉండాలి.

లేదా, సోకాల్డ్ సెలబ్రిటీ జ్యోతిష్కుల మాయలోనన్నా వాళ్ళు పడి ఉండాలి. అది అసాధ్యమేమీ కాదు.

లేదా, వివేకానందుని పుట్టినరోజు కాబట్టి మంచిరోజని భావించారా? 1863 లో వివేకానందస్వామి పుట్టినపుడు జనవరి 12 న ఉన్న గ్రహస్థితులు వేరు. 2026 లో అలా ఉండవు. ఉత్త తేదీలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే వచ్చే ఇబ్బందులు ఇవే మరి !

పైగా, లౌకికంగా చూస్తే, వివేకానందస్వామిది అంత అదృష్టజాతకమేమీ కాదు. ఆ విధంగా చూచినా, ఆ తేదీని రాకెట్ ప్రయోగానికి ఎంచుకోకూడదు.   

అయినా, PSLV రాకెట్ల ప్రయోగంలో అంత అనుభవం ఉన్న ఇస్రో, మూడవదశ ఇగ్నిషన్ లో ఎలా విఫలమౌతుంది? అన్నది అసలైన ప్రశ్న. ఇది ప్రయోగాత్మకదశ కాదుగా ! రాకెట్ టెక్నాలజీని ఇప్పుడు క్రొత్తగా ఇస్రో నేర్చుకోవడం లేదుగా ! PSLV ప్రయోగం ఇస్రోకు క్రొత్త కాదు కూడా !

తప్పులనుంచి నేర్చుకోవడం మంచిదే. కానీ నిర్లక్ష్యంవల్ల ఆ తప్పులు మాటిమాటికీ జరుగకూడదు. ప్రజాధనం విలువలేనిది కాదుగా !

నమ్మకమా? నష్టమా? అనిన ప్రశ్న వచ్చినపుడు, ఒక చిన్న నమ్మకాన్ని పాటించి నష్టాన్ని తప్పుకోవడం తెలివైనవారి లక్షణం కాదా?