Pages - Menu

Pages

14, జూన్ 2026, ఆదివారం

U.G - 10 (కుండలిని - రాహుకేతువులు - తపస్వీయోగం)

చంద్రశేఖర్ గారు యూజీగారి స్మృతులను వ్రాస్తూ 'బ్రహ్మణస్పతి యోగం' అనే ఒక జ్యోతిషయోగాన్ని ఉటంకించారు.

జ్ఞానచక్రవర్తి బిరుదాంకితులైన సత్యనారాయణగారనే జ్యోతిష-వేదపండితుడొకాయన యూజీగారి జాతకాన్ని చూచి, ఆ సమయంలో (ఒకానొక సమయంలో యూజీగారు బెంగుళూరు మైసూరులను సందర్శించినప్పుడు) ఆయన జాతకంలో ఆ యోగం నడుస్తున్నదని అన్నాడు. దీనివల్ల ఈయన యొక్క సాధన ఇంకా లోతులను అందుకుంటుందని, బహుముఖతా విస్తరిస్తుందని, లోకప్రఖ్యాతి కలుగుతుందని ఆయన జోస్యం చెప్పాడట. అలాగే జరిగిందని చంద్రశేఖర్ గారు వ్రాశారు.

జ్యోతిశ్శాస్త్రంలో నాకున్న స్వల్ప అనుభవంలో అటువంటి యోగమెక్కడా నాకు గోచరించలేదు. కాకపోతే, శాస్త్రం అనంతం గనుక, పాండిత్యం కూడా ఆనంతమే గనుక, సత్యనారాయణ గారు దానినెక్కడ చూచారో మనకు తెలియదు గనుక, సందేహలాభాన్ని (benefit of doubt) ఆయనకు ఇచ్చివేసి మనం ముందుకెళదాం.

రాహుకేతువులకు కుండలినీశక్తికి ఉన్న సంబంధాన్ని ఇప్పుడు గమనిద్దాం.

జ్యోతిషశాస్త్రంలో రాహుకేతువులను ఒక మహాసర్పంగా భావిస్తాము. దానికే కాలసర్పమని పేరు.  అంటే, కాలానికే మరొక పేరు రాహుకేతువులు. కాలానికి అతీతుడైన మనిషి ఈ భూమ్మీద లేడు గనుక, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అందరూ రాహుకేతువుల అదుపులో ఉన్నవారేనని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కాలసర్పం నోటిలో చిక్కుకుని ఉన్నవారమే అందరమూ.

సర్పానికి తలా తోకా ఉంటాయి. భూమికున్న ఉత్తరదక్షిణ ధ్రువాలే అవి. భూమియొక్క ఉత్తర అయస్కాంతధృవం రాహువైతే, దక్షిణం కేతువౌతుంది. మనం "కాలము" అంటున్నప్పుడు, అది భూమిపైన మనకు అనుభవంలోకి వస్తున్న కాలంగానే మనం చూడవలసి ఉంటుంది. ఇతర గ్రహాలలో ఇతర లోకాలలో ఉన్న కాలప్రమాణాలు మనకు అవసరం లేదు. మనవరకే మనం చూడాలి. అలాంటప్పుడు, భూమిని చుట్టుకుని ఉన్న ఒక మహాసర్పంగా రాహుకేతువులను మనం భావించవచ్చు. నిజానికి అవి రెండూ భూ-అయస్కాంత శక్తులే.

కుండలినీజాగృతి జరగాలంటే జాతకంలో రాహుకేతువులు ఉచ్ఛస్థితిలో గాని, నీచస్థితిలో గాని ఉండాలని ఇంతకుముందు వ్రాశాను. అయితే, రాహువు వృషభంలో ఉండటానికీ, మిథునంలో ఉండటానికీ తేడా ఉంటుంది. అదే విధంగా నీచలో ఉన్నపుడు వృశ్చికంలో ఉండటానికీ, ధనుస్సులో ఉండటానికీ చాలా తేడా ఉంటుంది. కేతువుక్కూడా ఇంతే అవుతుంది. వాటిని బట్టి ఆయా జాతకుల సాధనావిధానాలు, వారికి కలిగే ఫలితాలు రకరకాలుగా ఉంటాయి.

సాధారణంగా చెప్పాలంటే, ఉచ్ఛజాతకులకు భక్తిమార్గం బాగా యోగిస్తే, నీచజాతకులకు జ్ఞానమార్గం యోగిస్తుంది. భక్తిలోనైనా, జ్ఞానంలోనైనా కుండలినీజాగృతి లేకుండా సాధన ముందుకు కదలదు. అయితే వారి దృష్టి భక్తిమీదనో జ్ఞానసిద్ధిమీదనో ఉంటుంది గాని, కుండలినిని  వారు పట్టించుకోరు. ఒక్క యోగమార్గంలో మాత్రమే దానికి విలువనివ్వడం, సూటిగా దానితో డీల్ చెయ్యడం ఉంటుంది. మిగతావారు దీనిని పట్టించుకోరు.

రాహువేమో అనుభవాలను సూచిస్తే, కేతువు వాటికి అతీతమైన స్థితిని సూచిస్తాడు.  రాహువు సహస్రారచక్రాన్ని, కేతువు మూలాధారాన్ని సూచిస్తారు. వీరు ఉచ్ఛస్థితిలో  ఉంటే జీవితాన్ని పూర్తిగా అనుభవించిన తర్వాత కుండలినీజాగృతి  కలుగుతుంది. నీచస్థితిలో ఉంటే, జీవితం మొదట్లోనే అనేక ఎదురుదెబ్బలు, గందరగోళాలు జరిగి, జీవితంపైనా మనుషులపైనా విసుగుపుట్టి వైరాగ్యంవైపు మరలుతారు. ఆ ఫలితంగా కుండలినీజాగృతి కలుగుతుంది. ఈ విధమైన తేడాలు జాతకాలలో ఉంటాయి.

ఆయా జాతకాలలో ఉన్న మిగతా గ్రహస్థితులను బట్టి, రాహుకేతువులపైన వారి దృష్టులను, ప్రభావాలను బట్టి వారివారి దారులుంటాయి.

యూజీగారి జాతకంలో రాహుకేతువులు వృశ్చిక - వృషభరాశులలో నీచస్థితిలోను, చంద్రుని నుండి రాహువు బుద్ధిస్థానంలో ఉండటంతో ఆయనది జ్ఞానమార్గపు ఛాయ అయింది. 

నాకు తెలిసినంతవరకూ యూజీగారి జాతకంలో బ్రహ్మణస్పతి యోగం కంటే, తపస్వీయోగం బలంగా ఉన్నది. ఈ యోగాన్ని గురించి జైమినీమహర్షి యొక్క జ్యోతిషసూత్రములలో  మనకు కనిపిస్తుంది.

సూ || శనిదృష్టే తపస్వీ ప్రేష్యో వా || (జైమిని సూత్రములు 1:2:36)

కారకాంశకు జైమినిమహర్షి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. కారకాంశలో ఉన్న కేతువును శని చూస్తూ ఉన్నట్లయితే ఆ జాతకుడు తపస్విగాని, సేవకుడు గాని అవుతాడని ఆయనన్నాడు. ప్రతి ఉద్యోగీ ఒకవిధంగా సేవకుడేగాని, ఇక్కడ సేవకుడంటే చిన్న ఉద్యోగని అర్ధం చేసుకోవాలి. 

శనికేతుయోగం దరిద్రాన్నిస్తుంది. అది కర్మఫలితంగా వచ్చేది కావచ్చు, లేదా ఖర్మకాలి తను ఆహ్వానించేది కావచ్చు. తపస్సుకు కేతువు, సేవకత్వానికి శనీ కారకులు. కనుక మహర్షి ఈ విధమైన సూత్రాన్ని మనకు ఇచ్చారు.

గతకర్మవల్ల ఈ యోగం ఏర్పడితే, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, ఒకరిక్రింద ఊడిగం చేసుకుంటూ, డబ్బుకోసం ఇబ్బంది పడుతూ, దరిద్రంలో బ్రతికే పరిస్థితి వస్తుంది. ఖర్మకాలి వచ్చే పనైతే, అన్నీ ఉన్నప్పటికీ, నిరాడంబరంగా బ్రతకడం, తినగలిగి ఉన్నా ఉపవాసాలుంటూ మాడటం, లంకంత కొంప ఉన్నా, ఒక చిన్నరూములో చాప వేసుకుని పడుకోవడం, లేదా ఆస్తులన్నీ వదులుకుని ఒక ఆశ్రమంలో ఉండటం, ఒంటిపూట తినడం మొదలైనవి జరుగుతాయి. అది ఆరోగ్యం కోసం కావచ్చు, సాధనగా కావచ్చు. ఎలాగైతేనేమి, చివరకు ఇలాగే  జరుగుతుంది. 

గ్రహాలమధ్యన ఉన్న పఞ్చవిధసంబంధాల వల్ల యోగాలేర్పడతాయి. భారతీయ జ్యోతిషశాస్త్రమంతా గ్రహయోగాలపైననే ఆధారపడి ఉంటుంది. జాతకంలోని యోగాలను సరిగ్గా గుర్తించడం వస్తే, జ్యోతిషంలో పట్టు చిక్కినట్లే అవుతుంది. ఈ విషయాన్ని పాతపోస్టులలో వివరించాను. కనుక, శనికేతువుల మధ్యనున్న ఐదువిధాలైన సంబంధాలవల్ల తపస్వీయోగం ఏర్పడుతుందని స్థూలంగా అర్ధం చేసుకోవచ్చు.

యూజీగారి విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

యూజీగారి జాతకంలో లగ్నం, శనికేతువుల అర్గళంలో ఉన్నది. కేతువు 12 వ భావంలో నీచస్థితిలో ఉంటూ శుక్రుడినే సూచిస్తున్నాడు. శుక్రునితో కలసి ఉన్నాడు. ఈ విధంగా వీరి జాతకంలో తపస్వీయోగం ఏర్పడింది.

అందుకనే, 1961 లో శుక్రదశ మొదలు కావడంతోనే ఆయన "సంపాదన" అనే మాటను తన జీవితంలోనుంచి తీసివేశాడు. ఆయన దగ్గర డబ్బులు, ఆస్తిపాస్తులు ఏమీ లేవు. కానీ సంపాదన పైన ఆసక్తి పోయింది. ఎలా బ్రతకాలి? ఏమో? దానికి జవాబు లేదు. కానీ సంపాదన పైన ఇచ్ఛ లేదు. ఇచ్ఛలేనపుడు చెయ్యడం ఎలా సాధ్యమౌతుంది? కాదు. అందుకని ఆయన డబ్బు సంపాదించే ప్రయత్నాలేమీ చేయలేదు. అప్పటికాయనకు కేవలం 43 ఏళ్లే. చేతిలో ఒక్క రూపాయి లేకుండా ఆయన జీవితం నుండి రిటైర్ అయిపోయాడు. కానీ, చీకూచింతా లేవు. ఇది తపస్వీయోగ ప్రభావం.

ఆ తరువాత ఆయన 46 ఏళ్ళు బ్రతికాడు. కాణీ సంపాదన లేదు. కానీ, సాధారణ జీవనానికి ఎక్కడా లోటురాలేదు. ఆ విధంగా ఆయనను చూచుకునేవారిని జగన్మాత ఎక్కడికక్కడ ఏర్పాటు చేసింది.

పైగా, 1963 లో కుండలినీజాగృతి కలిగిన సమయంలో ఆయనకు నడిచిన దశకూడా శుక్ర శుక్ర శని శుక్ర శుక్ర దశనే. ఈ జాతకంలో కేతువు శుక్రుడిని సూచిస్తున్నాడు. కనుక అది కేతు శని దశనే అవుతుంది. అందుకే, అప్పటినుండి తపస్వీయోగం ఆయన జీవితాన్ని ఆక్రమించింది.

అంతేకాదు, 1963 మే నెలలోనే గోచారంలో కూడా ఇదేయోగం మొదలైంది. ఆ సమయంలో కేతువు ధనుస్సులోకి వచ్చి ఉచ్ఛస్థితిని అందుకున్నాడు. మకరంలో ఉన్న శని తన వక్రత్వం వల్ల ధనుస్సులోకి వచ్చి కేతువును కలసినట్లే అవుతుంది. జూలై నెల వచ్చేసరికి, మిధునం నుండి వీరిని శుక్రుడు చూస్తున్నాడు. కనుక సంసారం దూరం కావడం, కుండలినీజాగృతి, అమనస్కస్థితి మొదలైనవన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. ఇవన్నీ తపస్వీయోగ ప్రభావాలే.

గోచారగురువు కూడా దీనికి ఆసరాగా ఉంటూ, నవమభావంలో స్వస్థానంలోకి వచ్చి, జననకాలచంద్రుడిని, అక్కడున్న బుధశనులను చూస్తున్నాడు. ఇది తీవ్రవైరాగ్యాన్ని, అంతర్ముఖత్వాన్ని ఇచ్చింది.  

ఈ విధంగా యూజీగారి జాతకంలో, మిగిలిన యోగాలకంటే తపస్వీయోగప్రభావం చాలా ఎక్కువగా పనిచేసిందని చెప్పాలి.

ఆయనకు అమనస్కస్థితి సిద్ధించిన 9-7-1967 న కూడా ఇదేయోగం ఏ విధంగా పనిచేసిందో ఇప్పుడు గమనిద్దాం.

(ఇంకా ఉంది)

13, జూన్ 2026, శనివారం

U.G - 9 (కెలామిటీ)

U.G  గారి జీవితంలో కెలామిటీ అనేది చాలా ముఖ్యమైన సంఘటన. దీనిని సాంప్రదాయిక యోగపరిభాషలో అయితే 'కుండలినీజాగృతి' అని  చెప్పాలి.

ఈయనేమో ఆధ్యాత్మికతకున్న సాంప్రదాయవివరణలకు భిన్నంగా తనదైన ప్రాణిక-భౌతికపదాలలో దానిని వివరించాడు గనుక కెలామిటీ (విపత్తు లేదా మహాప్రమాదం) అన్నాడు. పదాలేవైనా పదార్ధం ఒకటే గనుక,  అర్ధం చేసుకోగలిగితే ఇబ్బంది  లేదు. అదిలేనప్పుడే అన్ని ఇబ్బందులూ వచ్చేది !

మొన్న బెంగుళూరులో చంద్రశేఖర్ గారిని కలిసినపుడు, యూజీగారు ఇలా అనేవారని ఆయనన్నారు, "ఎవరైనా జ్యోతిష్యశాస్త్ర పరిశోధకులు, నా జాతకాన్ని ప్రామాణికంగా  తీసుకోవచ్చు. నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ జ్యోతిషశాస్త్ర  ప్రకారమే జరిగాయి" అని ఆయన ఆనేవారట. యూరోప్ లో ఉన్న సమయంలో స్వయానా ఆయనే హస్తసాముద్రికాన్ని సరదాగా నేర్చుకున్నారని చంద్రశేఖర్ గారు నాతో అన్నారు.

ఆయన సమక్షంలో చాలామంది ప్రసిద్ధజ్యోతిష్కులు ఆయన జాతకాన్ని విశ్లేషించారు. వారి విశ్లేషణలను ఆయన సరదాగా వింటూ ఉండేవారు.

ఇప్పుడు కెలామిటీని జ్యోతిషశాస్త్ర పరంగా పరిశీలిద్దాం.

ప్రప్రధమంగా ఆయనకు కుండలినీజాగృతి అనేది లండన్ రామకృష్ణా మిషన్ సెంటర్ లో ఉన్న సమయంలో కలిగింది. అక్కడి సాధువులు భక్తులు అందరూ జపధ్యానాలు చేస్తూ ఉండటం చూసి, వాళ్లంతా సమయాన్ని వృధా చేసుకుంటున్నారని, అలాంటి సాధనలవల్ల ఏమీ ఉపయోగం లేదని యూజీగారు అనుకున్నారు.  ఏమంటే, అవన్నీ ఆయన తన 14-21 ఏళ్ల మధ్యలో స్వామి శివానందగారి పర్యవేక్షణలో హిమాలయాలలో చేసి ఉన్నాడు. కనుక అవన్నీ ఆయనకు బాగా తెలిసినవే.

అలా అనుకుంటూ శూన్యమనస్సుతో అలా కూచుని ఉండగా, ఉన్నట్టుండి ఏదో శక్తి తనలో క్రిందినుండి పైకి సుడులుగా తిరుగుతూ  పైపైకి లేస్తున్నట్లు ఆయన అనుభూతి చెందాడు. అది కాసేపు సవ్యదిశలోనూ, మరికాసేపు అపసవ్యదిశలోనూ తిరుగుతున్నది. అంతకుముందు విమానాశ్రయంలో తను చూసిన విల్స్ సిగరెట్ యాడ్ లో పొగ సుడులు తిరుగుతున్న విధంగా అది ఆయనకు అనిపించింది.

ఇది 1963 లో  జరిగింది. ఆ ఏడాది వేసవిలో ఆయన లండన్ రామకృష్ణా మిషన్ సెంటర్ లో ఆశ్రయాన్ని పొంది, మూడు నెలలపాటు అక్కడున్నాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 7 వ తేదీన ఆ ఆశ్రమ స్వామీజీకి ఒక ఉత్తరాన్ని వ్రాసి అక్కడనుండి బయటకు వచ్చేశాడు.

కనుక జూన్ నెల నుండి మూడు నెలలపాటు ఆయన లండన్ లో ఉన్నాడని మనం అనుకోవచ్చు. ఆ సమయంలో ఆయనకు శుక్రమహర్దశ నడుస్తున్నది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, శుక్ర శుక్ర శని శుక్ర దశ నడుస్తున్నది. ఏరోజున ఈ సంఘటన మొదటిసారి జరిగిందో ఆయనయొక్క జీవితచరిత్రలలో ఎక్కడా దొరకడం లేదు గనుక, ప్రాణదశను ఖచ్చితంగా గుర్తించడం సాధ్యం కావడం లేదు. కానీ త్రవ్వి బయటకు తీయవచ్చు.

యూజీ గారి జీవితంలో శుక్రమహర్దశ 4-4-1961 న మొదలైంది. దీనిలోనే ఆయనకు కుండలినీ జాగృతి కలిగింది. దానికి కారణాలేమిటో జాతకం నుండి గమనిద్దాం.

జాతకంలో శుక్రకేతు యోగాన్ని కలిగి ఉండటం కుటుంబపరంగా, జాతకపరంగా అంత మంచిది కాదు. ఇది భార్యావియోగాన్నిస్తుంది. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఆందులోనూ, ఈయన జాతకంలో నీచకేతువున్నాడు. శుక్రక్షేత్రంలో ఉండటంతో మళ్ళీ శుక్రుడినే సూచిస్తున్నాడు. కనుక 1961 లో శుక్రమహర్దశ ఆయనను ఒంటరివాడిని చేసేసింది. 

నిజానికి 1959 లో అమెరికాలో ఉన్న సమయంలోనే ఈయన కుటుంబంలో కలతలు మొదలైపోయాయి. అమెరికాలో ఉండలేక కుటుంబంతో సహా ఇండియాకు వెళ్ళిపోదామని అప్పుడే నిశ్చయం జరిగిపోయింది. ఆ సమయంలో ఆయనకు కేతు శని దశ నడుస్తున్నది. కర్కాటకరాశికి శని సప్తమాధిపతి అవుతాడు. కేతువుచే సూచింపబడుతున్న శుక్రుడు బాధకుడౌతాడు. కనుక, ఆ దశలోనే కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. కానీ భార్యాపిల్లలతో ఇండియాకు వెళ్లకుండా ఈయన యూరప్ లో ఉండిపోయాడు.

యూజీగారి జాతకంలో కాలసర్పయోగం ఉన్నది. అందుకే, కేతుదశలో కోటీశ్వరుడల్లా బికారైపోయాడు. 1955 ప్రాంతాలలోనే లక్షరూపాయలకు చెక్కురాసి ఇవ్వగల ఆస్తిపరుడాయన. కానీ ఆ ఆస్తినంతా పెద్దకొడుకుకు అమెరికాలో ఇప్పించిన పోలియో ట్రీట్మెంట్ రూపంలో మింగేసిన కేతువు ఆయనను బిచ్చగాడిగా మార్చి యూరప్ వీధులలో వదిలేశాడు.

సరిగా ఇదే సమయంలో ఆయనకు శుక్రదశ మొదలైంది.

డిగ్రీపరంగా శుక్రుడొక్కడే దీనికి బయట ఉన్నాడు. కనుక కాలసర్పం నోటపడకుండా తప్పుకున్నది శుక్రుడొక్కడే. కనుకనే రాహుకేతుస్వరూపమైన కర్మకు అతీతస్థితిని తన దశలో అందించాడు.

చంద్రలగ్నం నుంచి రాహుకేతువులు 5-11 ఇరుసులో నీచస్థితిలో  ఉన్నారు. కనుక బుద్ధిని నశింపజేసే జ్ఞానయోగవిధానం ఈయనదై  కూచుంది. రాహువున్నది వృశ్చికరాశి గనుక, కుండలినీయోగం దానికి తోడైంది.

నవాంశచక్రాన్ని గమనిస్తే ఒక విచిత్రమైన యోగం మనకు గోచరిస్తుంది. లగ్నంలో ఉన్న శుక్రుడిని మిగతా అన్ని గ్రహాలూ ఒక చక్కని వ్యూహంలో ఆర్గళంలో బంధించాయి. 

2-12 ఇరుసులో చంద్రకుజులు, 3-11 లో బుధ సూర్యులు, 4-10 లో రాహుకేతువులు, 6-8 లో  దృఢకర్మ గ్రహాలైన గురుశనులు వెరసి అన్ని గ్రహాలూ తమతమ శక్తులను శుక్రునిపైన కేంద్రీకరించాయి. కనుక, ఎన్నో జన్మలనుంచి చేస్తున్న సాధన ఈ శుక్రదశలో ముగింపుకు వచ్చింది. జన్మరాహిత్యాన్ని, మోక్షాన్ని అందించింది.

ఆనాటి గోచారగ్రహాలను గమనిద్దాం.

1960 - గురుశనులు ధనూరాశిలో ఉన్నారు. ఇది కర్కాటకరాశికి కర్మస్థానమౌతుంది. 

1961 - ఇద్దరూ మకరంలోకి మారారు. గురువు నీచస్థితిలో పడ్డాడు. శని స్వస్థానంలో బలంగా ఉన్నాడు. కానీ గురుయుతి మంచిది కాదు. గోచారంలో ఇటువంటి స్థితి ఉన్న సమయంలో ఈయనకు శుక్రమహర్దశ మొదలైంది.

1962 - శని మకరంలో ఉండిపోయాడు. గురువు కుంభంలోకి ప్రవేశించాడు.

1963 - గురువు మీనంలోకి వెళ్ళిపోయాడు. ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ వరకూ యూజీగారు లండన్ లోని రామకృష్ణా మిషన్ బ్రాంచిలో ఉన్నాడని పైన చెప్పాను. అప్పుడే కుండలినీ జాగృతిని ఈయన మొదటిసారిగా అనుభూతి చెందాడు.

ఇది జూలైలో జరిగి ఉంటుందని నా భావన. కారణమేమంటే, జూలై 9 న ఈయన జన్మించాడు. 1967 లో ఈయనకు కలిగిన జ్ఞానోదయం వంటి స్థితి కూడా అదే తేదీన కలిగింది. దానికి నాలుగేళ్ళ ముందు కుండలినీ జాగృతి జరిగిందని ఆయన అన్నాడు. కనుక 1963 జూలై 9 న ఈ సంఘటన జరిగి ఉంటుందని నా భావన. ఇదే నిజమైతే ఆనాడు ప్రాణదశ కూడా శుక్రుడే నడిచింది. కనుక, ఆ రోజున యూజీగారి జాతకంలో శుక్ర శుక్ర శని శుక్ర శుక్ర దశ నడిచింది. ఆనాటి గ్రహస్థితిని ఈ చార్టులో చూడండి.

ఆయన జననలగ్నమైన మిధునంలో నాలుగు గోచార గ్రహాలున్నట్లుగా మనం చూడవచ్చు. వీరిలో గోచారరవి సరిగ్గా జననరవి పైన సంచరిస్తున్నాడు. రాహుకేతువులు ఉచ్ఛస్థితిలో ఉన్నారు. శనిచంద్రులు కలసి సప్తమంలో అస్తమిస్తూ శూన్యమానసాన్ని సూచిస్తున్నారు. నవాంశలో సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. బుధుడు నీచస్థితిలో ఉంటూ బుద్ధి మాయం కావడాన్ని సూచిస్తున్నాడు.మిధునంలోని నాలుగు గ్రహాలు ఈయన యొక్క రాశియైన కర్కాటకం నుండి 12 వ భావంలో ఉంటూ అంతచ్ఛేతనలోని శక్తి జాగృతం కావడాన్ని సూచిస్తున్నాయి.

ఇక్కడ ఇంకొక విచిత్రం  ఉన్నది. స్విట్జర్లాండ్ లో ఈ సంఘటన జరిగిన సరిగ్గా మూడురోజులకు జూలై 13 వ తేదీన ఇండియాలో నేను పుట్టాను. కనుక, ఒక్క చంద్రుని స్థితి తప్ప, నా జాతకచక్రం కూడా ఇదే. యూజీగారికి కుండలినీజాగృతి కలిగినది నేను పుట్టినది, కేవలం మూడురోజుల తేడాతో, ఒకే సమయంలో జరిగింది.

అది 1963 వ సంవత్సరం. మళ్ళీ ఇన్నాళ్లకు, సరిగ్గా నాకు 63 వ ఏట బెంగుళూరు వెళ్లి చంద్రశేఖర్ గారి ఇంటిలో యూజీగారి గదిని దర్శించి వచ్చాను. ఇదంతా అనుకోకుండా జరిగింది. ప్లాన్ వేసుకొని చేసినది కాదు. ఇవన్నీ కాకతాళీయం కాదని, వీటి వెనుక మామూలు దృష్టికి కనిపించని కర్మసంబంధాలున్నాయని నా భావన. ప్రస్తుత టాపిక్ అది కాదు గనుక, అందరికీ వీటిని వివరించవలసి పని లేదు గనుక, ఆ రహస్యాలలోకి ఇంతకంటే ఎక్కువగా పోవడం లేదు.

నేడు కుండలిని అనేది ఒక ఫేషన్ అయిపోయింది. అందులోను విదేశీయుల చేతులలో పడి కుండలిని, చక్రాలు మొదలైనవన్నీ భ్రష్టు పడుతున్నాయి. డ్రగ్సు వాడడం, పిచ్చిపిచ్చిగా అరవడం, గెంతడాన్నే కుండలిని అని చెబుతున్నారు. ఇదంతా పెద్దమాయ.

మార్కెట్లో కనిపించే కుండలిని అంతా వ్యాపారమే. కుండలిని కోర్సులు, చక్రా హీలింగ్ కోర్సులు, చక్రా రేకీ కోర్సులు, మెడిటేషన్ క్లాసులు అన్నీ బూటకాలే. వీళ్ళలో ఎవరికీ కుండలిని గురించి ఏమీ తెలియదని నేను ఘంటాపథంగా చెప్పగలను.

కుండలినీ జాగృతి అనేది అందరికీ కలగదు. అలా జరిగినవారిలో కూడా పూర్ణజాగృతి అనేది మళ్ళీ వెయ్యిమందిలో ఒకరికి మాత్రమే అవుతుంది. దానికి మార్మికమైన కారణాలున్నాయి. కుండలినీ జాగృతి జరగడానికి కావలసిన దైహిక, ప్రాణిక, మానసిక అర్హతలు చాలామందిలో ఉండవు. అదే దీనివెనుక ఉన్న ముఖ్యమైన కారణం !

ఇంకా చెప్పాలంటే, ఆధ్యాత్మికత అనేది అందరికీ పనికొచ్చే బటాణీ కాదు. మానవులలో చాలామంది ఆధ్యాత్మికతకు అస్సలు పనికిరారు. పనికొస్తాం అని వాళ్ళనుకోవచ్చు, కానీ పనికిరారు. ఆధారాలు లేకుండా కేవలం మనం ఊరకే అనుకున్నంతమాత్రాన అన్నీ నిజాలైపోవు. ఈ రంగంలో గత ఏభై ఏళ్లుగా నేను చేస్తున్న పరిశీలన, పరిశోధనల వల్ల నేనీ అభిప్రాయానికొచ్చాను. 

జీవితంలోని అన్ని సంఘటనలకూ జాతకంలోని గ్రహాలకూ ఖచ్చితమైన సంబంధం  ఉంటుంది.  అదేవిధంగా,కుండలినికి కూడా ఉంటుంది !

ఒకనికి కుండలినీజాగృతి కలగాలంటే అతని జాతకంలో రాహుకేతువులు ఉచ్ఛస్థితులలో  గాని, నీచస్థితులలోగాని ఉండాలి. అదికూడా, మిధున-ధనూరాశుల ఇరుసులో వీరున్నపుడు మాత్రమే ఈ అద్భుతం సాధ్యమౌతుంది.

యూజీగారి జాతకంలో రాహుకేతువులు వృశ్చిక-వృషభరాశుల ఇరుసులో నీచస్థితిలో ఉన్నాయి. కనుక ఈయనకు కుండలినీ జాగృతి విధిగా వ్రాసిపెట్టి ఉన్నది. కానీ 1963 లో రాహుకేతువులు మిధున - ధనూరాశులలో ఉచ్ఛస్థితిలోకి వచ్చిన సమయంలో మాత్రమే జాతకంలో ఈ యోగం జాగృతమైంది.

5, మే 1963 న రాహువు మిధునరాశిలోకి కేతువు ధనూరాశిలోకి ప్రవేశించి ఉచ్ఛస్థితిలోకి వచ్చారు. అప్పటికింకా యూజీగారు దిక్కులేనివాడిగా లండన్ వీధులలో తిరుగుతూనే  ఉన్నాడు.కానీ చేతిలో డబ్బులు అయిపోవస్తున్నాయి. పగలంతా వీధులలో తిరుగుతూ, రాత్రిళ్ళు హైడ్ పార్కులో పడుకుంటూ, ఒక పిచ్చివాడిలాంటి స్థితిలో ఆయన ఉండేవాడు. అదేసమయంలో  ఒకనాడు పోలీసుచేత హైడ్ పార్కు నుండి వెళ్లగొట్టబడ్డాడు. ఇది 1963 జూన్ నెలలో జరిగింది.

ఆ సమయానికి ఆయన చేతిలో అయిదు పెన్నీలు మాతమే మిగిలి ఉన్నాయి.  అవికూడా అయిపోయాక ఏం చెయ్యాలి? ఎక్కడికి పోవాలి? అని ఆలోచిస్తూ ఉండగా, రామకృష్ణా మిషన్ సెంటర్ కు వెళ్లమనిన ఒక సూచన ఆయనకు అందింది. అందుకని, ఆ అయిదు పెన్నీలతో వచ్చిన స్టేషన్ వరకూ టికెట్టు కొనుక్కుని, అక్కడ దిగి, అక్కడనుండి లండన్ రామకృష్ణా మిషన్ కు నడుచుకుంటూ వెళ్ళాడు. 

ఆ సమయంలో స్వామి ఘనానందగారు ఆ కేంద్రానికి అధ్యక్షులుగా ఆన్నారు. 1948 లో ఆ కేంద్రాన్ని ఆయనే స్థాపించి, 1969 లో చనిపోయేవరకూ ఆయనే దానిని నడిపారు.

ఆయన రామకృష్ణుల ప్రత్యక్షశిష్యుడైన స్వామిశివానందగారి శిష్యుడు. శివానందస్వామివారు నా పరమగురువులు. మా గురువుగారైన గంభీరానందగారు, ఘనానందగారు ఇద్దరూ సోదరశిష్యులు.  ఈవిధంగా, యూజీగారికీ నాకూ ఉన్న అనుబంధం రామకృష్ణుల ద్వారానే కలిగింది.

మొన్న బెంగుళూరులో చంద్రశేఖర్ గారి ఇంటికెళ్ళినపుడు, అక్కడున్న రజని అనే యూజీగారి ఫాలోయర్, 'యూజీగారితో మీకెలా పరిచయం?' అని ఒక మాటను అడిగారు.

'నేనాయనను చూడలేదు' అని చెప్పాను.

 'మరి?' అని ఆమె అడిగారు.

దానికేదో నెట్లో చదివానని ఆమెతో చెప్పాను. కానీ, నెట్లో చదివినంతమాత్రాన, పుస్తకాలు చదివినంత మాత్రాన అందరూ మనల్ని కదిలించరు. వెళ్లి వాళ్ళను కలవాలని కూడా అనిపించదు. అలా  అనిపించాలన్నా, అలా ఒకరిని కలవాలన్నా, ఆ వెనుక బలమైన కర్మసంబంధాలుండాలి. వాటినెలా వివరించి మీటింగులలో అందరితో చెప్పగలం? కనుక ఆమెకు అలా చెప్పాను.

స్వామి ఘనానందగారు యూజీగారి పరిస్థితిని విని, తమ ఆశ్రమంలో ఆయనను ఉండమని ఆశ్రయం ఇచ్చారు. Complete Works of Swami Vivekananda పుస్తకాల ప్రూఫ్ రీడింగ్ చెయ్యమని యూజీగారికి చెప్పారు. ఆయన ఆ పనిని చేసుకుంటూ అక్కడ ఉంటూ  ఉండేవారు. ఆ విధంగా 1963 జూన్ నెల నుండి సెప్టెంబర్ 7 వ తేదీ వరకూ మూడు నెలలపాటు  రామకృష్ణులు ఆయనకు ఆశ్రయాన్నిచ్చి కాపాడారు.

రామకృష్ణులంటే కాళికామాతనే. కాళికామాతనే కుండలినీశక్తి. కాళీఅనుగ్రహం లేనిదే ఎవరికీ కుండలినీజాగృతి అనేది కలగదు.

లండన్ రామకృష్ణా మిషన్ ఆశ్రమంలో ఉన్న సమయంలోనే ఆయనకు కుండలినీ జాగృతి కలిగింది. ఈ విధంగా లోకానికి అర్ధం కాని కర్మరహస్యాలు మహనీయుల జీవితాలలో చాలా ఉంటాయి. తరచి చూస్తేగాని వాటి లోతుపాతులు అర్ధం కావు.

(ఇంకా ఉంది)

10, జూన్ 2026, బుధవారం

అవతార ప్రయోజనం

'గురువుగారు ! మీ అవతార ప్రయోజనం ఏమిటి?' అని ఒక శిష్యపరమాణువు ఇప్పుడే ఫోన్లో అడిగాడు.

తడుముకోకుండా, 'చిక్కుముడులు విప్పడం, చిక్కుల్లో పడెయ్యడం' అని చెప్పాను.

అవతలనించి మౌనం !

'ఏం !  అర్ధం కాలేదా ?' అడిగాను.

'లేదు. ఈ మాటే పెద్ద చిక్కుముడిలాగా ఉంది' అన్నాడు.

'నీ మనసులో మాట బయటికి రానీయ్' అన్నాను.

'ఎప్పుడో 30 ఏళ్ళక్రితం తప్పిపోయిన రాజ్ కిరణ్ జాతకం ఇప్పుడెందుకు గురూగారు?' అన్నాడు చనువుగా.

'రహస్యం చెప్పనా?' గొంతు తగ్గించి గుసగుసగా అడిగాను.

రహస్యమనేసరికి మనవాడికి ఉత్సాహం ఎక్కువైపోయింది.

'చెప్పండి చెప్పండి' అన్నాడు.

'నిన్న రాజ్ కిరణ్ కనిపించి, తన జాతకం రాయమన్నాడు. సోమీ అలీ లాంటి కొందరు తనకోసం ఇంకా  వెదుకుతున్నారని, బాలీవుడ్ కూడా తనకోసం వెదుకుతోందని చెప్పాడు. ఈ సందిగ్దతకు ఆఖరుచుక్క పెట్టమన్నాడు. అందుకే రాశా' అన్నాను.

'పోయినోళ్ళ జాతకాలెందుకు గురూగారు? బ్రతికున్న మావి చెప్పచ్చు కదా !' అడిగాడు.

'నాకు బ్రతికున్నవాళ్ళు ఇష్టం ఉండరు' అన్నాను.

'మాకు ఉపయోగంగా ఉంటుంది కదా?' అడిగాడు.

'మీకు  ఉపయోగపడాల్సిన పని నాకు లేదు. ఎవరికి నిజంగా అవసరమో నాకు తెలుసు. వారికే పడతాను. ఇదే నా అవతార ప్రయోజనం' అన్నాను సీరియస్ గా.

'మాకోసం దాన్ని కొంచెం మార్చుకోలేరా?' దీనంగా అడిగాడు.

'లేను. పెట్టెయ్ ఫోను' అన్నాను.

ఫోన్ కట్ అయిపోయింది.

రాజ్ కిరణ్ కు ఏమయ్యింది? జననకాల సంస్కరణ - ప్రశ్నజాతక నిర్ధారణ !


ఇతను 5-2-1949 న ముంబై లో జన్మించాడు. ఆరోజు శనివారం. అశ్వని 3-4 పాదాలు, భరణీ నక్షత్రం-1 పాదం ఆరోజు నడిచాయి. సమయం తెలియదు గనుక లగ్నం తెలియదు. జననకాల సంస్కరణ చేద్దాం.

ఇతను సినిమానటుడు గనుక, వృత్తివల్లనే ఇతనికి పేరుప్రఖ్యాతులు వచ్చాయి గనుక, ఈ విశ్లేషణలో దశాంశకు ప్రాధాన్యత ఉంటుంది.

దశాంశలో ఆ రోజున మిధునంనుండి కన్యవరకు నాలుగు నవాంశలు నడుస్తాయి. ఇతని ఆకారాన్ని బట్టి, నిండైన ముఖాన్ని బట్టి, కర్కాటకరాశి సరిపోతుంది. అప్పుడు 10  లో ఉచ్ఛసూర్యుడు, 4 లో ఉచ్చ శని, 11 లో శుక్రక్షేత్రంలో ఉచ్చరాహువులతో సినిమా కెరీర్ బ్రహ్మాండంగా ఉంటుంది.  కనుక,ఇతని దశాంశచంద్రుడు కర్కాటకంలో ఉండాలి. అలాంటపుడు, జననసమయం, 7. 22 am - 12. 18 pm మధ్యలో ఉంటుంది.

ఇతని కెరీర్ 1970 - 1980 మధ్యలో బ్రహ్మాండంగా నడిచింది. అప్పుడు ఇతనికి చంద్ర మహర్దశ జరిగింది. దశమంలో ఉన్న ఉచ్చసూర్యుడు, చతుర్దంలో ఉన్న ఉచ్ఛశని, లాభస్థానంలో ఉన్న ఉచ్చరాహువుల వల్ల ఇతను పట్టుకున్నది ఆ టైములో బంగారం అయింది.  ఇతని సినిమాలు ఈ క్రింది తేదీలలో విడుదల అయ్యాయి. ఈ తేదీలను, ఇతని జీవితపు  ఇతర ముఖ్యఘట్టాలను ఆధారాలుగా తీసుకొని సంస్కరణ చేయగా, ఇతని జననసమయం మధ్యాన్నం 12. 18 గా తేలుతున్నది.

1-1-1975 న ఇతని మొదటి సినిమా 'కాగజ్ కె నావ్' విడుదల అయింది. ఆ రోజున ఇతనికి చంద్ర-చంద్ర-చంద్ర దశ నడిచింది. అంటే, అప్పుడే చంద్రదశ మొదలైంది. దశాంశను పరిశీలిస్తే ఇది ఎందుకు జరిగిందో అర్ధమౌతుంది. చంద్రుని నుండి 10-4 ఇరుసులో ఉచ్చ శని సూర్యులు, లాభంలో ఉచ్ఛరాహువు కారకులు. 

11 -6- 1980 న, బాక్సాఫీసును బ్రద్దలు కొట్టిన 'కర్జ్' సినిమా విడుదలైంది. ఆ రోజున చంద్ర-శని-రాహు దశ నడిచింది. శనిరాహువులు దశాంశ చక్రంలో ఉచ్ఛస్థితిలో ఉండటాన్ని గమనించాలి.

3-12-1982 న, మరపురాని కథతో, సంగీతంతో, సందేశంతో తీయబడిన 'అర్ద్' సినిమా విడుదల అయింది. మహేష్ భట్ తీసిన చిత్రాలన్నింటిలోకీ ఇది మరపురాని చిత్రంగా  ఈనాటికి కూడా నిలిచిపోయింది. ఆ రోజున ఇతని జాతకంలో చంద్ర-శుక్ర-రవి దశ నడిచింది. చతుర్థంలో స్వస్థానంలో ఉన్న శుక్రుడిని దశమంనుండి  ఉచ్చ రవి వీక్షిస్తూ ఉండటం గమనించండి.

కానీ 1984 లో కుజ మహర్ధశ మొదలు కావడం తోనే ఇతనికి చెడుకాలం మొదలైంది. దీనికి కారణం కుజుడు అష్టమంలో శత్రుస్థానంలో పడిపోవడమే. రాశిచక్రంలో చూస్తే, లగ్నాధిపతిగా కుజుడు లాభంలో ఉన్నప్పటికీ, అది శత్రుక్షేత్రం కావడం, సింహంనుండి బాధకుడైన వక్ర శనియొక్క దృష్టికి లోనవ్వడం వల్ల ఆ దశ కలిసిరాలేదు.   ఆ సమయంలో క్రమేణా ఇతనికి సినిమాలు తగ్గిపోయాయి. అదే సమయంలో కుటుంబసమస్యలు కూడా ఎక్కువయ్యాయి.

1991 లో మొదలైన రాహుదశ ఇతన్ని నానా బాధలు పెట్టింది. కెరీర్ దెబ్బతినడం, కుటుంబసమస్యలు ఇతన్ని డిప్రెషన్ లో పడేశాయి. మందులు వాడుతూనే ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఇతని ఖర్మకాలి సత్యసాయికి భక్తుడయ్యాడు. ఇతని వింశాంశ చక్రాన్ని గమనిస్తే, సరియైన ఆధ్యాత్మిక మార్గం దొరకాలంటే కూడా జాతకంలో పుణ్యబలం ఉండాలని నేను ఎప్పుడూ చెబుతున్న విషయం ఎంత కరెక్టో తెలుస్తుంది.

ఇతని వింశాంశచక్రంలో చంద్రుడు నీచస్థితిలో ఉన్నాడు. బుధుడు వక్రించి నీచస్థితిలో ఉన్నాడు. అక్కడనుండి పంచమమైన కర్కాటకంలో ఐదుగ్రహాలు ఉన్నాయి. కనుక మతిభ్రమించడం, భ్రమలతో కూడిన ధ్యానాలు మొదలైనవి కనిపిస్తున్నాయి. కుజుని ఉచ్ఛత్వం కూడా మొండితనాన్ని, పిచ్చిని సూచిస్తున్నది. ఉఛ్చ కుజునికి, నీచ చంద్రునికి మధ్యలో చిక్కుకుపోయిన గురువు, తన సంస్థకు తానే బందీ అయిపోయిన సత్యసాయిబాబాను స్పష్టంగా సూచిస్తున్నాడు. ఈ కర్మసంబంధం వల్లనే ఇతను సత్యసాయికి భక్తుడయ్యాడు. కానీ ఆయన వల్ల ఇతనికేమీ మేలు జరుగకపోగా, దాడికి గురై, జైల్లో పెట్టబడ్డాడు. పిచ్చి ఇంకా ఎక్కువైపోయింది.

అదే సమయంలో ఫిబ్రవరి 16, 1996 న ఇతనికి ఏలినాటి శని మొదలైంది. ఆరోజునుంచీ ఇతని జీవితంలో నిజమైన కష్టాలు మొదలయ్యాయి. అదే సమయంలో గురుఛండాలదశ ఇతని జాతకంలో వచ్చింది. ఇక అలాంటి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో చెప్పనక్కరలేదు కదా?

ఈ సమయంలోనే ఇతని జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది.

అది 5, జూన్ 1996. ఇతని జాతకంలో రాహు-గురు-రాహుదశ నడుస్తున్నది. ఇది గురుఛండాలదశ. ఆ రోజున ఇతను పుట్టపర్తిలో ఉన్నాడు. అంతకుముందు కొన్ని రోజులనుంచీ అక్కడ ఉంటూ, ధ్యానంలో కాలం గడిపేవాడు. గంటలు గంటలు ధ్యానంలో ఉంటూ ఉండేవాడు. ఆ రోజున ధ్యానంలో అతనికేం అనిపించిందో తెలియదు. 

"సాయిబాబా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు, నేనాయనను ఎలాగైనా కలవాలి, ఆయనను కాపాడాలి" అంటూ లోపలికి పోబోయాడు. సెక్యూరిటీవాళ్ళు అడ్డుకున్నారు.

అసలు, ప్రతివాడూ ధ్యానం చెయ్యకూడదు. అందులోనూ, డిప్రెషన్, పిచ్చిధోరణి మొదలైనవి ఉన్నవాళ్ళు దానిజోలికి అస్సలు పోకూడదు. ఎందుకంటే, ధ్యానం వికటిస్తే, మామూలు మనిషికే పిచ్చెక్కుతుంది. ఇక పిచ్చోడికి ఏమౌతుంది? అందుకే, నేటి ఆశ్రమాలలో మామూలు మనుషులకంటే పిచ్చోళ్ళే మనకు ఎక్కువగా   కనిపిస్తారు.

మనమేమో వాళ్ళు పిచ్చోళ్ళని అనుకుంటాం. వాళ్ళేమో, చూసేవాళ్ళకే పిచ్చని అనుకుంటారు. ఈ పిచ్సిగోలలో, ఎవరికి పిచ్చో, ఎవరికి కాదో ఏ పిచ్చివాడు తేల్చాలి?

సరే, సాయంత్రం వరకూ ఏదోవిధంగా ఆగిన అతను, చీకటి పడుతున్న సమయంలో ఎవరిదో ట్రాక్టర్ మాట్లాడుకుని, ప్రహారీగోడ పక్కగా దానిని ఉంచి, దానిపైన ఒక నిచ్చెన వేసుకుని గోడ ఎక్కి ప్రశాంతినిలయంలోకి దూకబోయాడు. సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు. సత్యసాయిని చంపడానికి ఇతను ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అందరూ నమ్మేశారు. అతన్ని కొట్టారో లేదో మనకు తెలియదు.  అక్కడున్నదంతా పూనకపు మూర్ఖభక్తులే గనుక ఇతనిపైన దాడి  చేసే ఉంటారని మనం అనుకోవాలి.

ఇతన్ని అరెస్టు చేసి లోకల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తరువాత బెంగుళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇతని తండ్రి బాంబే నుండి వచ్చి, కొడుకును విడిపించుకుని, ఆస్పత్రిలో చేర్చడము, తర్వాత బాంబేకు తీసుకువెళ్లి అక్కడ బైకుల్లా లోని మసీనా ఆస్పత్రిలో చేర్చడము జరిగిపోయాయి.

అదే సమయంలో, అంటే 10 జూన్ 1996 న ఇతనికి రాహు - శనిదశ మొదలైంది. ఇది శపితదశ. ఇక అక్కడినుంచి అసలైన కష్టాలు మొదలయ్యాయి. 

ఇతను మసీనా ఆస్పత్రిలో ఉన్నపుడే, విషయం తెలిసిన మహేష్ భట్ వెళ్లి పలకరించి  వచ్చాడు. అప్పటికే బాగా పిచ్చిలో ఉన్న రాజ్ కిరణ్ తనతో పెద్దగా మాట్లాడలేదని ఆయనన్నాడు.

గురుఛండాలదశ, శపితదశ, ఏలినాటిశనులు కలసి ఈ విధంగా ఇతని జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయి.

మరింత మంచివైద్యం చేయించడం కోసం, అక్కడనుండి, ఇతని అన్నయ్య ఇతనిని అమెరికాకు తీసుకెళ్లాడు. అక్కడ న్యూయార్క్ సిటీలో ఉంటూ, పిచ్చికి వైద్యం తీసుకుంటూ ఉండేవాడు. కొన్నినెలల తర్వాత ఉన్నట్టుండి ఆ ఇంటినుండి ఎక్కడికో మాయమైపోయాడు. ఆ సమయంలో రాహు-శని-కేతుదశ నడిచింది. ఆ తరువాత ఇప్పటివరకూ ఇతనెక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అసలు బ్రతికున్నాడో లేదో కూడా తెలియదు.

సరిగ్గా ఇప్పుడు జ్యోతిశ్శాస్త్రం రంగప్రవేశం చేస్తున్నది !

ఇతని ఆయుష్షును లెక్కించి చూద్దాం.

ఆయుర్దాయవిధానాలు స్థూలంగా మూడున్నాయి. ఒకటి నైసర్గిక ఆయుర్దాయం, రెండు పిండాయుర్దాయం, మూడు అంశాయుర్దాయం. ఇవిగాక, జైమినిపద్ధతిలో మరొక విలక్షణమైన విధానం ఉన్నది. వీటిలో అంశాయువు, జైమినివిధానాలే చాలావరకు సరియైన ఫలితాలనిస్తాయని పండితులంటారు. అనుభవం కూడా ఇదే చెబుతోంది.

జైమినిపద్ధతి ప్రకారం చూడగా,

లగ్నాధిపతి+అష్టమాధిపతి, లగ్నము+చంద్రలగ్నము, లగ్నము+హోరాలగ్నము ఈ మూడు జతలూ చర, స్థిర, ద్విస్వభావరాశులలో ఉండేదాన్ని బట్టి ఆ జాతకుడు పూర్ణాయుష్కుడా (99-66 మధ్య), మధ్యాయుష్కుడా (66-33 మధ్య), అల్పాయుష్కుడా (33-8 మధ్య) అనేది  తెలుస్తుంది.  

లగ్నాధిపతి, అష్టమాధిపతి ఇద్దరూ కుజుడే అయ్యాడు. ఇతడు స్థిరరాశిలో ఉన్నాడు గనుక పూర్ణాయువైంది. లగ్న, చంద్రులిద్దరూ మేషంలోనే ఉన్నారు, అది చరరాశి గనుక మళ్ళీ పూర్ణాయువైంది. లగ్నమైన మేషం చరరాశి, హోరాలగ్నమైన మిధునం ద్విస్వభావరాశి గనుక అల్పాయువైంది. రెండు పూర్ణాయువులు, ఒకటి అల్పాయువు వచ్చింది గనుక సరాసరిగా మధ్యాయువౌతుంది. అంటే 33 - 66 ఏళ్ల మధ్యలో ఇతను మరణిస్తాడు.  

అంశాయుర్దాయ విధానాన్ని బట్టి లెక్కించగా ఇతనికి  47 ఏళ్ల ఆయుష్షు వస్తున్నది.  ఇతను పుట్టింది 1949 లో గనుక 47 కలిపితే 1996 అవుతుంది. సరిగ్గా ఇదే సంవత్సరంలో పుట్టపర్తి సంఘటన, బెంగుళూరు జైలు, బాంబే పిచ్చాసుపత్రి, అమెరికా వెళ్లడం ఇవన్నీ జరిగాయని ఇతని జీవితం చెబుతోంది. కనుక, అమెరికా వెళ్లిన కొద్దినెలలకు ఇతను ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత, ఏదో ఒక దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పవలసి వస్తున్నది. 

పోనీ 66 వరకూ ఇతని ఆయుష్షు ఉందేమో అని పరిశీలించగా, మార్చి 1999 తో రాహు-శనిదశ అయిపోయింది. రాహు-బుధదశ 1999-2001 మధ్యలో నడిచింది. బుధుని వక్రత్వం వల్ల, ఆర్గలదోషాలవల్ల ఆ సమయంలో పిచ్చి బాగా ముదిరి ఉండాలి. వెంటనే వచ్చిన రాహు-కేతుదశ 2001-2002 మధ్యలో నడిచింది. అప్పుడుగాని, ఆ తరువాత వచ్చిన రాహు-శుక్ర దశ (2002-2005) లో గాని, ఎక్కువలో ఎక్కువగా ఇతను చనిపోయి ఉండాలి. ఏమంటే, శుక్రుడు ఈ లగ్నానికి మారకుడు.

ఇప్పుడు ప్రశ్నవిధానాన్ని ఉపయోగించి చూద్దాం.

ఈ ప్రశ్నజాతకం నిన్న ఉదయం 9 గంటలకు వేసినది. లగ్నాధిపతి చంద్రుడు 9 వ భావంలో, రాహుకుజులతో ఆర్గళానికి లోనై, మారకుడైన శనితో కలసి ఉంటూ, ఈ జాతకుడు దూరదేశంలో ఒక దుర్ఘటనలో మరణించాడని చెబుతున్నాడు. 

ప్రశ్నదశ గురు రాహు బుధదశ వచ్చింది. ఇది గురుదోషంవల్ల మతిభ్రమించడాన్ని సూచిస్తుంది. ఉచ్చగురువు 9 వ అధిపతిగా దూరదేశాన్ని, 6 వ అధిపతిగా తీవ్రమైన గురుదోషాన్ని సూచిస్తున్నాడు. బాధకుడైన శుక్రునితో కలసి ఉన్నాడు. ఇది భార్యతో గొడవలను సూచిస్తున్నది. కుటుంబస్థానంలోని కేతువు కుటుంబసభ్యులతో వియోగాన్ని సూచిస్తున్నాడు. ప్రశ్నజాతకం కాలగ్రస్తయోగంలో చిక్కుకుని ఉంటూ, తీవ్రమైన గతకర్మను సూచిస్తున్నది.

కనుక, రాహు-బుధ దశలో (1999-2001) ఇతను చనిపోయి ఉండాలి.

కనుక, రిషికపూర్ చెప్పినది, దీప్తి నావల్ చెప్పినది రెండూ కరెక్ట్ కావు. సోమీ అలీ వంటి కొందరు, రాజ్ కిరణ్ కోసం ఈనాటికీ వెదుకుతూ ఉండటం వృధాప్రయాస అని, ఇతను చనిపోయి చాలాకాలమైనదని నేను చెబుతున్నాను.

అమెరికా అన్నికోణాలలోనూ అంతమంచి దేశమేమీ కాదు. మొన్నటికి మొన్న మాయమైన నాన్సీ గుత్రీనే ఇంతవరకూ ఏమైందో అమెరికా పోలీసులే  పట్టుకోలేకపోయారు. ఇక దేశంగాని దేశంలో, అదికూడా 30 ఏళ్ల క్రితం తప్పిపోయిన మనిషిని ఇండియానుండి ఎవరు పట్టుకోగలుగుతారు? అది జరిగే పని కాదు.

అతను మంచివాడే కావచ్చు. వేసిన పాత్రలు కూడా మంచిపాత్రలే కావచ్చు. అతనిని ఎరిగిన మనుషులు అతన్నింకా మర్చిపోలేకపోతూ ఉండవచ్చు కూడా. కానీ కర్మను ఎవరూ తప్పించలేరు. ఇప్పటి మంచితనానికీ, గతకర్మకూ సంబంధం లేదు. అతనిని వెదకడం అనవసరం !

ఇది జ్యోతిషశాస్త్రపు తీర్పు !

డబ్బు చేతిలో ఉండి సుఖంగా కాలం గడుస్తూ ఉంటే అంతా బాగానే ఉందని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. దశ మారిందంటే ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. జాతకం సరిగ్గా లేకపోతే జీవితం మొత్తం తల్లక్రిందులు కావడానికి ఒక్క రోజు చాలు.

అందుకే, ఈరోజు మన చేతిలో డబ్బు ఉందని విర్రవీగటం ఎప్పుడూ కరెక్ట్ కాదు.ఎందుకంటే రేపు ఏమౌతుందో ఎవరికీ తెలియదు.విధి వక్రిస్తే, మన విర్రవీగుడు మొత్తం మాయం కావడానికి ఒక్క క్షణం చాలు.

పెద్దవయసులో ఏ విధమైన కష్టమూ లేకుండా మనల్ని చక్కగా చూచుకునేవారు ఉండటమే అసలైన అదృష్టం.వయసులో ఉన్నపుడూ చేతిలో డబ్బు ఉన్నపుడూ అందరూ వెంటబడతారు ప్రేమలు కురిపిస్తారు. అది నిజం కాదు పెద్ద భ్రమ.వయసు మళ్ళి, చేతిలో డబ్బు లేనప్పుడే మేమున్నామని మనల్ని చూచుకునేవారు ఉండాలి. అదే అసలైన వరం.

వయసులో ఉన్నపుడు ఎన్ని సుఖాలు అనుభవించినా, చివరకు పెద్దవయసులో పడ్డప్పుడు ఎవరూ తోడులేని దిక్కులేని జీవితం గడపడం కంటే దుర్భరం ఇంకోటి ఉండదు మరి.

పెద్ద స్టార్ గా ఒక వెలుగు వెలిగి వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న అదృష్టవంతులకు ఇలాంటి దుస్థితి పట్టడం, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియని గతి పట్టడం, ఖర్మ కాకపోతే ఇంకేమిటి మరి?

2017 లో వ్రాసిన ఈ జాతకవిశ్లేషణ మొదటిభాగాన్ని ఇక్కడ చూడండి.