“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, ఫిబ్రవరి 2022, బుధవారం

శ్రీమద్రామానుజాచార్యుల వారి జాతక విశ్లేషణ - 5

చంద్రలగ్నం నుంచి శని నవమాధిపతిగా సప్తమ కేంద్రంలో ఎదురుగా ఉన్నాడు. తరువాత షష్ఠంలోకి అంటే శత్రుస్థానంలోకి వస్తున్నాడు. కనుక గురువుతో విభేదాలు గోచరిస్తున్నాయి. పైగా, కొన్ని వందల జాతకాలలో ఋజువైన ఇంకొక సూత్రం ఉన్నది. ఏమిటది?

కర్కాటకలగ్నం గాని, మకరలగ్నం గాని అయితే, వారికి గురువులతో విభేదాలు ఉంటాయి. ఒకవేళ ఆయా జాతకులకు ఆధ్యాత్మిక చింతన లేకపోతే, చదువుకునే రోజులలో ఉపాధ్యాయులతో విభేదాలు వస్తాయి. లేదా, కుటుంబంలోని పెద్దవాళ్ళతో గొడవలుంటాయి. ఎందుకంటే, నవమస్థానం ఈ అన్నింటినీ సూచిస్తుంది. ఇలా ఈ రెండు లగ్నాలకే ఎందుకు జరుగుతుంది?

ఎందుకంటే, ఈ రెండు లగ్నాలకూ షష్ఠాధిపతి, నవమాధిపతి ఒకరే అవుతారు. అంటే, పెద్దవాళ్ళతో, గురువులతో శత్రుత్వం వచ్చే అవకాశం ఈ రెండు లగ్నాలకు బలంగా ఉంటుంది. ఆచార్యులవారి లగ్నం కూడా కర్కాటకం కావడం గమనించండి.

అదే విధంగా, ఒక్క సింహలగ్నానికే షష్ఠ, సప్తమ అధిపత్యాలు శనికి వస్తాయి. కనుక సింహలగ్నజాతకులలో చాలామందికి జీవితభాగస్వామితో విభేదాలుంటాయి. ఇలాంటి తిరుగులేని సూత్రాలు జ్యోతిష్యశాస్త్రంలో చాలా ఉన్నాయి. వీటిని వందలాది జాతకాలలో నేను గమనించాను.

మన కథలోకి తిరిగి వద్దాం.

రామానుజుల యొక్క ద్వైతమార్గపు పోకడలు యాదవప్రకాశునికి సహజంగానే నచ్చకుండా తయారయ్యాయి. నానాటికీ పెరిగిపోతున్న రామానుజుల ప్రభావం ఆయనకు కంటగింపుగా మారింది. ఇదే విధంగా వదిలేస్తే, ముందుముందు రామానుజుడు ఒక సిద్ధాంతకర్త అయ్యే ప్రమాదం ఆయనకు కనిపించింది. అందుకని రామానుజుడిని చంపేద్దామని నిర్ణయించాడు. దానికోసం, 'కాశీయాత్ర' అనే ఒక యాత్రను సంకల్పించాడు. మధ్యలో ఏదో ఒక అడవిలో రామానుజుడిని చంపేసి గుట్టుచప్పుడు కాకుండా వెనక్కు వద్దామని పధకం రచించాడు.

బహుశా ఈ సంఘటన, గురు/రాహుదశలో 1039-1042 మధ్యలో జరిగి ఉండవచ్చు. ఇది దశాఛిద్రసమయం కనుక ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం బాగా ఉన్న దశాసమయం. పైగా ఆ సంవత్సరాలలో శని, కన్యా తులా రాశులలో సంచరించాడు. ఇవి ఆచార్యులవారికి చంద్రలగ్న, లగ్నాలనుండి అర్ధాష్టమశని గోచారాలౌతున్నాయి. కనుక ఈ సంఘటనలు జరిగి ఉంటాయి.

అతిప్రాచీన కాలం నుంచీ కాశీ, కంచి నగరాలు పాండిత్యానికి కేంద్రాలుగా, ఆధ్యాత్మికతకు పట్టుకొమ్మలుగా విలసిల్లుతూ వచ్చాయి. బుద్ధుని కంటే ముందు నుంచీ ఈ ప్రాభవం ఈ రెండు ప్రాంతాలకూ ఉన్నది. కనుక ఉత్తరాదివారు కంచి, రామేశ్వరం ప్రాంతాలను సందర్శించడముదక్షిణాదివారు కాశీయాత్రను చేయడము జరుగుతూ ఉండేది. ఆ విధంగానే ఈ కాశీయాత్రను కూడా అనుకున్నారు.

బృందమంతా బయలుదేరింది. అప్పట్లో కాలినడకే కదా ! కొండలు, నదులు, అడవులు దాటుకుంటూ ప్రయాణిస్తున్నారు. వింధ్యపర్వత (నేటి మధ్యప్రదేశ్) ప్రాంతాలకు చేరుకున్నారు. ఆ దట్టమైన అడవులలో రామానుజులను చంపెయ్యమని తనకు నమ్మకస్తులైన శిష్యులకు పురమాయించారు యాదవప్రకాశుడు. ఈ సంభాషణను చాటుగా వినిన రామానుజుల తమ్ముడు గోవిందభట్టు, సమాచారాన్ని అన్నగారికి చెప్పేశాడు.  వెంటనే అక్కడనుంచి తప్పించుకున్న రామానుజులు దక్షిణదిక్కుగా కీకారణ్యంలో నడక ప్రారంభించారు. ఆయనకోసం వెదికిన మిగతా శిష్యులకు జాదా జవాబూ దొరకకపోవడంతో ఏ పులో ఆయన్ను తినేసి ఉంటుందని భావించి, బృందమంతా కాశీ వైపు సాగిపోయింది.

ఆ విధంగా దారీ తెన్నూ లేని కారడవిలో ఒకరోజంతా నడిచిన రామానుజులు ఆకలిదప్పులతో సొమ్మసిల్లి, నారాయణస్మరణ చేస్తూ  ఒక చెట్టు క్రింద  నిద్రపోయారు. నిద్రపోయారని అనడం కంటే, సొమ్మసిల్లి పడిపోయారని అనడం సబబుగా ఉంటుంది. మర్నాడు బాగా పొద్దెక్కిన తర్వాత ఆయన లేచారు. విచిత్రంగా, రాత్రంతా అడవిలో చెట్టుక్రింద పడి ఉన్నప్పటికీ, ఏ అడవిమృగమూ ఆయన జోలికి రాలేదు. మళ్ళీ దక్షిణదిక్కుగా నడక ప్రారంభించారు. కాసేపటికి ఒక కోయ వేటగాడు, అతని భార్యా ఈయనను కలుసుకున్నారు. వివరాలు తెలుసుకుని, 'మేము పక్షులను వేటాడి జీవిస్తాము. ఆ పాపాన్ని కడుక్కునేందుకు  రామేశ్వరయాత్ర చేస్తున్నాము. మాకు దారి తెలుసు, మాతో రమ్మ'ని చెప్పి , రామానుజులతో ప్రయాణం సాగించారు. ఆ విధంగా రాత్రి వరకూ నడచిన వారు, మళ్ళీ ఒక చెట్టు క్రింద, మంట రాజేసి, అక్కడ నిద్రించారు. తెల్లవారిన తర్వాత, కోయవనిత దాహమని అడుగగా, దగ్గరలోనే ఉన్న ఒక బావిలోకి నీళ్లకోసం రామానుజులు దిగారు. మూడు సార్లు  నీటిని తెచ్చి ఇచ్చినా ఇంకా దాహం తీరలేదని ఆ కోయవనిత చెబుతూ వచ్చింది. నాలుగోసారి  బావిలోకి దిగి నీటిని తెచ్చిన రామానుజులకు ఆ కోయ దంపతులు కనిపించలేదు. 

అర్ధాంతరంగా ఈ అడవిలో తనను వదిలేసి వీళ్ళు ఎక్కడకు పోయారా అని  చుట్టూ చూచిన రామానుజులకు అడవి దగ్గరలోనే ఒక నగరం, ఒక పెద్ద ఆలయ గోపురం కనిపించాయి. అటువైపు నడచిన ఆయన, అక్కడి ప్రజలను అడిగి అది కాంచీపురమని గ్రహించి నిర్ఘాంతపోయారు. ఒక్కరోజులో మధ్యప్రదేశ్ నుండి తమిళనాడుకు కాలినడకన చేరుకోవడమా? ఈ విషయమై ఆలోచించిన ఆయనకు, ఆ కోయదంపతులు తన ఆరాధ్యదేవతలైన లక్ష్మీనారాయణులే అని అర్ధమైంది. లేదా పార్వతీ పరమేశ్వరులు కూడా అయి ఉండవచ్చు. కానీ వారు విష్ణుభక్తులు గనుక ఆ విధంగా భావించి ఉండవచ్చు. ఎవరైతే నేమి? భగవంతుడే ఆ రూపాలలో ఆయన్ను ఆదుకున్నాడు.

కోయవనిత దాహమంటూ మళ్ళీ మళ్ళీ విసిగించినప్పటికీ, విసుక్కోకుండా మళ్ళీ మళ్ళీ బావిలోకి దిగి నీటిని తెచ్చి ఇవ్వడం ద్వారా రామానుజులు నారాయణుని కరుణకు పాత్రులయ్యారు. అది ఆయనకు పరీక్ష. ఆ పరీక్షలో ఆయన నెగ్గారు. స్వయంగా తానూ రెండురోజులనుంచీ ఆకలిదప్పులతో ఉన్నప్పటికీ, ఒక్క మాట కూడా మాట్లాడకుండా, వారికోసం ఆ విధంగా కష్టపడటం ఆయనను భగవంతుడు పెట్టిన పరీక్షలో  ఉత్తీర్ణుని చేసింది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడే మనం ఓర్పుతో ఉండాలి. విశ్వాసంతో ఉండాలి. మనం బాధపడుతూ కూడా ఆర్తులకు సహాయం చేయాలి. అప్పుడే దైవం మనల్ని మెచ్చుతుంది. మన కష్టాలను తొలగిస్తుంది.

అంతా బాగా ఉన్నపుడు మన జేబులో ఉన్న పదిరూపాయలను దానం చేస్తున్నట్టు అందరూ చూచేలాగా విసిరెయ్యడం  చాలామంది చేస్తారు. అది అసలైన దానం కాదు. నీవు కష్టంలో ఉన్నపుడు కూడా, విసుక్కోకుండా, దైవం పట్ల విశ్వాసాన్ని కోల్పోకుండా, కష్టంలో ఉన్న ఇతరులకు నీవు సాయం చేస్తే అదీ గొప్ప. అప్పుడే నీ కర్మ తగ్గుతుంది. అప్పుడే దైవం నిన్ను కరుణిస్తుంది. రామానుజుల జీవితంలో జరిగిన ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఇదే  !

తరువాత కొన్నాళ్ళకు కాశీబృందం కూడా ఇంటికి చేరింది. కాశీలో ఉండగా గోవిందభట్టుకు గంగానదిలో ఒక శివలింగం దొరికింది. దానితో శివభక్తునిగా మారిన ఆయన, తిరుగుప్రయాణంలో కాళహస్తిలో ఉండిపోయాడు. ఇంటిదగ్గర క్షేమంగా కనిపించిన రామానుజులను చూచిన యాదవప్రకాశుడు కిమ్మనకుండా ఉండిపోయాడు. రామానుజులు కూడా మనసులో ఏమీ పెట్టుకోకుండా గురువును యధావిధిగా గౌరవించసాగారు. మరలా గురుకులవాసం మొదలైంది.

ఈ ఒక్క సంఘటన చాలు, రామానుజుల వారి మనస్సు ఎంత దైవత్వంతో నిండి ఉండేదో ఋజువు చెయ్యడానికి ! చీటికీ మాటికీ మనసులో కక్షలు కార్పణ్యాలు పెట్టుకుని ఏళ్లకేళ్లు లోపల్లోపల క్రుళ్ళిపోయే నేటి మానవులు, తనను చంపాలని చూచిన గురువును క్షమించి, ఏమీ జరుగనట్లు మళ్ళీ ఆయనకు సేవలు చేసిన రామానుజుల వారిని ప్రాతఃస్మరణీయులుగా స్మరించవలసిందే కదా ! అప్పుడైనా వారి పాపాలు కొంచెం తగ్గుతాయేమో !

ఇదిలా ఉండగా, కాంచీపురం రాజకుమార్తెకు ఒక బ్రహ్మరాక్షసి ఆవహించింది. ఎంతమంది మంత్రగాళ్ళు ప్రయత్నించినా అది వారిని త్రిప్పికొడుతున్నది. యాదవప్రకాశులవారు రంగంలోకి దిగారు. ఆ రాక్షసి ఆయనకూ లొంగలేదు. ఆయన తన మంత్రతంత్రాలను ప్రయోగిస్తుండగా ఆ రాక్షసి ఇలా చెప్పింది, 'యాదవా ! నీ శక్తులు నాముందు పనిచేయవు. నన్ను ఎదుర్కొనే పవిత్రత నీలో లేదు. పవిత్రుడైన నీ శిష్యుడు ఎవరినైతే నీవు చంపాలని చూచావో, ఆ రామానుజుని రమ్మను. అప్పుడే ఈ అమ్మాయిని వదలి వెళ్ళిపోతాను'.

రామానుజుల వారు రప్పించబడ్డారు. ఆయనకే మంత్రతంత్రాలూ తెలియవు. అప్పుడా రాక్షసి ఇలా చెప్పింది, 'ఓ లక్ష్మణాచార్యా ! పవిత్రములైన నీ పాదాలను నా శిరస్సుపైన పెట్టు.  అప్పుడు నాకు మోక్షం లభిస్తుంది. నేనీ అమ్మాయిని విడచి వెళ్ళిపోతాను'.

రామానుజులు ఇలా ప్రశ్నించారు, 'నీవు నిజంగా ఈ అమ్మాయిని విడచిపెట్టినట్లు మాకు రుజువును చూపు'.

దానికా రాక్షసి ఇలా చెప్పింది, ' సరే. చూపిస్తాను. నేనీ అమ్మాయిని విడచిపెట్టినందుకు గుర్తుగా ఆ ఎత్తైన చెట్టు చిటారు కొమ్మను విరచి క్రిందపడేస్తాను. అదే గుర్తు'.

సరేనని, రామానుజులు తన రెండు పాదాలనూ ఆ రాజకుమార్తె తలపైన ఉంచారు. వెంటనే, రాజకుమార్తె పెద్దగా కేక పెట్టి మూర్ఛపోయింది. రాజభవనం ఎదురుగా ఉన్న పెద్ద చెట్టు యొక్క చిటారుకొమ్మ ఫెళ్ళుమంటూ విరిగి క్రిందపడింది. మంత్రతంత్రాలు చేయలేని పనిని పవిత్రమైన హృదయమూ, శుద్ధమైన భక్తీ, కల్మషం లేని జీవితమూ చేశాయి. మూర్ఛనుంచి తేరుకున్న రాజకుమార్తె మామూలు మనిషయ్యింది.

భగవంతుడు భక్తికి ప్రసన్నుడౌతాడు. ఆయనకు మంత్రాలు అక్కర్లేదు. శుద్ధమైన హృదయం కావాలి, నిష్కల్మషమైన జీవితం కావాలి. ఆర్తితో ఆవేదనతో పిలిచే పిలుపు కావాలి. అవి ఉన్నచోటకు ఆయన పరుగెత్తుకుంటూ వస్తాడు. భక్తుల జీవితాలలో ఇది లెక్కలేనన్ని సార్లు నిరూపితమైంది.

దీనిని వ్రాస్తూ ఉండగా ఈ పద్యం ఆశువుగా నాలో ఉద్భవించింది.

|| మనసు శుద్ధమైన మంత్రతంత్రములేల?

తలపు చాలు తనదు తగవు దీర్ప

తలపు తోడ బ్రహ్మ తగసృష్టి జేయడా?

శుద్ధహృదయ మతని చూరు గాదె !

శుద్ధమైన హృదయం లేనివారికి మంత్రతంత్రాల అవసరం ఉంటుంది. అది ఉన్నపుడు వాటి అవసరం లేదు. శుద్ధమైన హృదయం ఉన్నవారికి సంకల్పంతోనే పనులు జరుగుతాయి. బ్రహ్మదేవుడు శుద్ధమైన సంకల్పంతోనే కదా ఈ విశాలసృష్టిని నిర్మించాడు? ఆయనకే రకమైన మంత్రాల అవసరం పడింది? శుద్ధమైన హృదయంలో భగవంతుడు తప్పక నివాసం ఉంటాడు.

'భక్తుని హృదయమే భగవంతుని నివాసస్థలం' అని శ్రీరామకృష్ణులు తరచుగా అనేవారు. 

దాన్నలా ఉంచితే, ఈ సంఘటనకూడా గురు/రాహుదశలోనే జరిగింది. ఎందుకంటే, రాహువు రాక్షసుని సూచిస్తాడు. ఉచ్చరాహువేమో, రాక్షనులలో కూడా భయంకరుడైన బ్రహ్మరాక్షసుని సూచిస్తాడు. గజకేసరీయోగంలో ఉన్న గురువు మంత్రశక్తికి, శుద్ధమైన దైవశక్తికి సూచకుడు. కనుక ఆచార్యులవారి దైవత్వం ముందు బ్రహ్మరాక్షసి తలవంచింది.

యాదవప్రకాశుడు ఖిన్నుడైనాడు. రామానుజుల కీర్తి అంతటా వ్యాపించసాగింది. విద్యాభ్యాసం కొనసాగుతోంది.  మళ్ళీ అవే అభిప్రాయభేదాలు. అవే వాదోపవాదాలు సాగుతున్నాయి. ఈసారి మరొక్క సంఘటన జరిగింది.

వేదంలో, 'సర్వం ఖల్విదం బ్రహ్మ, నేహ నానాస్తి కించన' అనే మంత్రం ఉన్నది. ఇది ఛాందోగ్యోపనిషత్తులోనిది. ఈ మంత్రానికి అర్ధాన్ని చెబుతూ యాదవప్రకాశుడు ఇలా అన్నాడు.

'ఈ అంతా బ్రహ్మమే. అది లేనిది ఏదీ లేదు'. జీవాత్మా, సృష్టీ, పరమాత్మా అంతా ఒక్కటే అనే ఈ భాష్యం యధావిధిగా అద్వైతవేదాంతార్ధ ప్రతిపాదితమై ఉన్నది. కానీ రామానుజులు దీనిని ఒప్పుకోలేదు. ఆయనిలా అన్నారు.

'అసలైన అర్ధం అది కాదు. ప్రపంచంలో ఎవరూ లేరు. ఉన్నదంతా అదే అనడం సరికాదు.  అన్నీ దానిలోనుంచి పుట్టి, దానిలోనే పెరిగి, మళ్ళీ దానిలోనే కలుస్తాయన్నది ఈ మంత్రం యొక్క అసలైన అర్ధం.  అదే విధంగా, 'నేహ నానాస్తి కించన' అంటే, 'ఇక్కడేమీ లేదు. ఉన్నదంతా అదే' అని కాదు. ఎందుకంటే సృష్టిలో విభిన్నత్వం కంటికి కనిపిస్తున్నది. ఈ రకరకాలైన సృష్టిజాలాన్నంతా ఒకటిగా కలిపి అదే ఉంచుతున్నదని ఆ మాటకు అర్ధం. కనుక ఒక కోణంలో చూస్తే భిన్నత్వం ఉన్నది, మరొక కోణంలో చూస్తే, అన్నింటికీ అనుస్యూతంగా బ్రహ్మమే ఉన్నది'.

రామానుజులు చెప్పినది ద్వైతసామ్ప్రదాయానుసారి యైన అర్ధం. అప్పటికి విశిష్టాద్వైతం లేదు. కానీ, వారు చెప్పినది ఆ భావమే.

ఇక ప్రతిరోజూ ఈ గొడవ తనవల్ల కాదని గ్రహించిన యాదవప్రకాశుడు, గురుకులాన్ని వదలి వెళ్లిపొమ్మని, తనవద్దకు రావద్దని రామానుజులను ఆదేశించాడు. 'సరే' నని చెప్పిన రామానుజులవారు సెలవు తీసుకుని యాదవప్రకాశుని గురుకులం నుండి బయటకు వచ్చేశారు.

అప్పటికి సరిగ్గా, గురుదశ పూర్తయింది. గురువులో రాహువు పోతూపోతూ, గురువుతో తెగతెంపులు చేసి పోయింది. గురువులో రాహువు పాతజీవితానికి తెరదించి, క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టిస్తుంది. ఆచార్యులకూ అదే జరిగింది. అప్పటికి రామానుజులకు 24 ఏళ్ళు నడుస్తున్నాయి. 19 ఏళ్ల శనిమహర్దశ వారి జీవితంలో మొదలైంది.

(ఇంకా ఉంది)