Human ignorance is incurable

21, డిసెంబర్ 2017, గురువారం

చెత్తదీక్షలు

ప్రస్తుతం అయ్యప్ప దీక్షల సీజన్ నడుస్తోంది కదా ! దానిమీద ఏదో ఒకటి వ్రాయకపోతే నాకూ, చదవకపోతే నా విమర్శకులకూ నిద్ర పట్టదు. నాకోసం కాకపోయినా, నా విమర్శకుల కోసమైనా వ్రాయక తప్పదని మొన్నో విమర్శక శిఖామణి కలలోకి వచ్చి మరీ మొరపెట్టుకున్నాడు.

'సరే వ్రాస్తాలే, ఏడవకు' అని చెప్పి అతన్ని కలలోనుంచి పంపేశాను.

ఏం వ్రాయాలా అని ఆలోచిస్తూ ఉండగా ఒక బ్లాక్యాట్ ఎదురొచ్చింది. అతను నా స్నేహితులలో ఒకడు. ప్రతేడాదీ దీక్షని ఈ పగటివేషం వేస్తూ  ఉంటాడు.

'ఒక్కసారన్నా మా దీక్ష తీసుకోవచ్చుగా?' డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చింది క్యాట్.

ఇలా అడగడం వెనుక ఏముంటుందో నాకు బాగా తెలుసు. 

'మనం ప్రతేడాదీ ఈ పనిలేని దీక్ష చేస్తున్నాం కదా. ఈయనేమో ఏ దీక్షా తీసుకోడు. ఏంటి ఇతని గొప్ప? ఇతన్ని కూడా మన రొచ్చులోకి ఎలాగైనా లాగాలి' అన్న దుగ్ధ తప్ప దీని వెనుక ఇంకేమీ ఉండదు.

నాన్ వెజ్ తినేవాళ్ళనూ, సారాయి త్రాగే వాళ్ళనూ గతంలో చాలామందిని చూచాను. వాటి జోలికి పోని వాళ్ళంటే వాళ్లకు ఒక రకమైన జెలసీ లోలోపల ఉంటుంది. ఏంటి వీళ్ళ గొప్ప? అని. అందుకని మనకు కూడా అవి అలవాటు చెయ్యాలని చూస్తూ ఉంటారు. దానికోసం నానా లాజిక్స్ చెబుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు నాకు చాలామంది గతంలో తగిలారు.

'నాన్ వెజ్ తిను. తింటే నీకు బలం వస్తుంది. ఆరోగ్యంగా ఉంటావు.' అనేవాడు మా ఫ్రెండ్ ఒకడు గతంలో.

'నేను బలంగానే ఉన్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను.' అని నేను చెప్పాను.

'అని నువ్వనుకుంటే సరిపోదు.' అన్నాడు.

'పోనీ ఒక పని చేద్దాం. నేను నాన్ వెజ్ అనేది ఇంతవరకూ తినలేదు. నువ్వు రోజూ తింటావు. మనిద్దరం ఫైట్ చేద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం. వస్తావా? ఇప్పుడే ! ఇక్కడే !' - అన్నాను ఒకడుగు వెనక్కు వేసి స్టాన్స్ తీసుకుంటూ.

'ఒద్దులే. వస్తా' అంటూ వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ టాపిక్ ఎత్తలేదు.

త్రాగడం గురించి కూడా నాకు క్లాసు తీసుకున్నవాళ్లు గతంలో ఉన్నారు.

'రోజూ ఒక పెగ్గు తీసుకుంటే లివర్ కు మంచిది. బ్లడ్ సర్కులేషన్ బాగుంటుంది' అన్నాడు ఇంకో ప్రెండ్ ఒకసారి.

'నా లివర్ ప్రస్తుతం బాగానే ఉంది. బ్లడ్ కూడా బాగానే పరిగెట్టుతోంది. అందుకోసం సారాయి త్రాగాల్సిన పని లేదు.' అన్నాను నేను.

'అలా కాదు. ఒక డాక్టర్ గా నేను చెబుతున్నాను. కొన్నాళ్ళు తీసుకుని చూడు. నీకే తెలుస్తుంది.' అన్నాడు.

'నీకు అంత తాగాలని ఉంటే, నన్ను తలచుకుని నా పెగ్గు కూడా నువ్వే త్రాగు. సరేగాని అయిదేళ్ళు మెడిసిన్ చదివి నువ్వు గ్రహించింది ఇదా?' అన్నాను.

అంతటితో అతనూ ఇంక రెట్టించలేదు.

అసలు విషయం ఏమంటే - 'వీడి గొప్పేంటి? మనం పాడైపోయిన వాళ్ళమూ, ఇతనేమో పెద్ద పవిత్రుడూనా? వీడిని కూడా చెడగొట్టి మన స్థాయికి దిగజారిస్తే, అప్పుడు చక్కగా వీడినీ వీడి కులాన్నీ ఎగతాళి చెయ్యొచ్చు.' అన్న దరిద్రపు ఊహే వీళ్ళచేత అలా మాట్లాడిస్తుంది. అంతేగాని మన మంచికోరి వాళ్ళలా మాట్లాడరు. ఇలాంటి వాళ్ళను గతంలో చాలామందిని నేను చూచాను.

అయ్యప్ప దీక్ష కూడా ఇలాంటిదే ! అది చేసినంత మాత్రాన ఆధ్యాత్మిక ఔన్నత్యమేదీ ఒక్కసారిగా ఒరిగి ఒళ్లో పడదు. చెయ్యనంత మాత్రాన ఆధ్యాత్మికంగా లోటూ ఉండదు.

"మనం నానా పనికిమాలిన నియమాలు పాటిస్తూ ఉంటే, వీడేమో ఏ నియమాలూ పాటించడు. పైగా మనకంటే ఉల్లాసంగా ఆనందంగా ఉంటున్నాడు. ఏంటి దీని వెనుక రహస్యం? ఎలాగైనా వీడిని కూడా మన స్థాయికి దిగజార్చాలి" - అన్న కుళ్ళు బుద్దే వీరిచేత అలా మాట్లాడిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రెండ్ కళ్ళలోకి చూస్తే అతని ఉద్దేశ్యం కూడా అదేనని నాకనిపించింది.

ఇతనికి కొంత వెరైటీగా జవాబు చెప్పాలని అనుకున్నా.

'చూడమ్మా ! నువ్వు నిజంగా ఏ దీక్ష అయినా చేస్తే, ఒక రెండు వారాలు చాలు. అంతకంటే నువ్వు నానా హింసా పడనక్కర్లేదు. ఈ విషయం తెలుసా నీకు?' అడిగాను.

'అలా అని నాకెవరూ చెప్పలేదు. ముఖ్యంగా మా గురుస్వామి అసలే చెప్పలేదు.' అన్నాడు.

'వాడి బొంద. వాడొక లోఫర్ గాడు. వాడికే తెలీదు. నీకేం చెప్పగలడు?' అన్నాను.

'అదేంటి అలాగంటావు? ఆయన గత ముప్పై ఏళ్ళనుంచీ శబరిమలకు వెళుతున్నాడు.' అన్నాడు కోపంగా.

నవ్వొచ్చింది.

'అంత మాత్రాన వాడొక జ్ఞాని అయిపోతాడా? మీ అజ్ఞానం బాగానే ఉందిలేగాని ఒక విషయం చెప్పు. నువ్వు టెంత్ క్లాసు ఒక్కసారే పాసయ్యావా? లేక ముప్పైసార్లు వ్రాశావా?' అడిగాను.

'అదేంటి మళ్ళీ అలాగంటావు? ఒక్క అటెంప్ట్ లోనే పాసయ్యాను. అప్పట్లో నాకు ఫస్ట్ క్లాస్ కూడా వచ్చింది. ' అన్నాడు గర్వంగా.

'మరి మీ దీక్ష కూడా ఒకసారి చేస్తే సరిపోదా? జీవితాంతం చెయ్యాలా? టెన్త్ పరీక్ష కూడా జీవితాంతం వ్రాస్తూ హైస్కూల్లోనే ఉండకపోయావా? కాలేజీకి ఎందుకొచ్చావ్?' అడిగాను.

'అదేం లాజిక్?' అన్నాడు.

'అవును. ఒక్కసారి పరీక్ష సరిగ్గా వ్రాసి పాసైతే మళ్ళీ మళ్ళీ పరీక్ష ఎందుకు వ్రాయడం? అలాగే, ఒక్కసారి సరిగ్గా దీక్ష చేస్తే, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెయ్యడం?' అన్నాను.

'దానికీ దీనికీ సంబంధం ఏముంది?' అన్నాడు మూర్ఖంగా.

'మరి దేనికీ దేనికీ సంబంధం ఉందో నువ్వే చెప్పు. పోనీ నన్ను చెప్పమంటావా? మీ గురుస్వామికి ఇదే బజార్లో ఉన్న శ్రీలక్ష్మి అనే ఆమెతో సంబంధం ఉందా లేదా? ఈ విషయం అందరికీ తెలుసులే? ఈ సంబంధం గురించి ఏమంటావ్?' అడిగాను.

'ఆయన సంబంధాల గురించి ఇప్పుడెందుకు లే?' అన్నాడు.

'పోనీ నీ సంబంధాల గురించి చెప్పమంటావా?' అన్నా నవ్వుతూ.

'కనీసం ఈ నలభై రోజులన్నా శుద్ధంగా ఉంటున్నాం కదా?' అన్నాడు.

'అవునా? లోపల ఉగ్గబట్టుకుని ఈ నలభై రోజుల టార్చర్ ఎప్పుడైపోతుందా అని ఎదురుచూస్తూ మీ దీక్ష చేస్తున్నారు. నాకు తెలీదనుకోకు. నలభై రోజులు శుద్ధంగా ఉంటున్నాం అంటే మిగతా రోజులన్నీ అశుద్ధంగా బ్రతుకుతున్నాం అని నువ్వే ఒప్పుకుంటున్నావ్ కదా? ఆ మిగిలిన రోజులు కూడా నీతిగా ఉండమని నేను చెబుతున్నాను. నీకీ రొష్టంతా లేకుండా నేనొక సలహా చెప్తా విను. ఈ పసలేని దీక్షలు ఆపు. నేనిచ్చే దీక్ష తీసుకో. ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి.' అన్నాను.

'ఏంటది?' అడిగాడు అనుమానంగా.

'ఏమీ లేదు. పీరియడ్ నలభై రోజులే. కాకుంటే డ్రస్ కోడ్ వేరు. మీరు నల్ల డ్రస్సు వేస్తారు కదా. ఇక్కడ అది కూడా విప్పేసి ఉత్త గోచీతో ఉండాలి. రోడ్డు మీద తిరిగినా, ఆఫీసుకు వెళ్ళినా, ఏం చేసినా గోచీతోనే చెయ్యాలి. ఈ డిసిప్లినంతా గురుస్వామిగా ప్రొమోషన్ రానంతవరకే. అదొచ్చాక గోచీ కూడా తీసేసి హాయిగా తిరగొచ్చు. ఏమంటావ్?' అడిగా సీరియస్ గా.

'నీకు మరీ జోకులెక్కువయ్యాయి' అన్నాడు.

'అవున్లే నీ చేత కాకపోతే జోగ్గానే ఉంటుంది. ఇంకా విను. బ్రేక్ ఫాస్ట్ కి చికెన్ సూప్, మధ్యాన్నం మటన్ బిరియానీ, రాత్రికి చేపలు గానీ రొయ్యల వేపుడు గానీ తినాలి. ప్రతి శనివారం అడవిపంది మాంసం ప్రత్యేకంగా చేయించుకుని తినాలి. అది దొరకకపోతే కోతిమాంసం అయినా పరవాలేదు. పంది త్వరగా దొరకదేమో గాని కోతైతే అడివిలో ఏ చెట్టుమీదైనా ఈజీగా కనిపిస్తుంది. పడుకోబోయే ముందు మాత్రం ఖచ్చితంగా ఒక ఫుల్ బాటిల్ కొట్టి పడుకోవాలి.' అన్నాను.

వాడికి పిచ్చి కోపం వచ్చింది. నావైపు చాలా తీవ్రంగా చూస్తున్నాడు.

'ఎందుకంత కోపం? మీరు మామూలుగా చేసే పనులేగా ఇవన్నీ. దీక్షా సమయంలో ఇంకా రెగ్యులర్ గా చెయ్యాలి. అంతే. కాకుంటే డ్రస్ కోడ్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఇంకో కన్సెషన్. మీమీ గరల్ ఫ్రెండ్స్ ని దూరంగా ఉంచాల్సిన పనేమీ లేదు. మీ ఓపిక, వాళ్ళ ఓపిక. ఇంతకంటే ఎక్కువగా వివరించమని నన్ను ఇబ్బంది పెట్టకు.' అన్నా నవ్వుతూ.

'దీనిని దీక్ష అంటారా?' అన్నాడు ఎగతాళిగా.

'ఏం? మీరు చేస్తున్న 'self torture' ను దీక్ష అన్నప్పుడు దీనిని ఎందుకనగూడదు? 'దీక్ష' అనేది మనం పెట్టుకున్న పేరేగా? దీనికీ దీక్ష అనే పెట్టుకుందాం? తప్పేముంది? పైగా అవన్నీ మీరు రోజూ చేసే పనులేగా? కొత్తవి చెయ్యమని నేనేం చెప్పడం లేదు.' అన్నాను.

'నీకర్ధం కాదులే మా సంగతి' అన్నాడు కోపంగా.

'మీరు చేస్తున్నది మీకే అర్ధం కావడం లేదు ఇక మీ సంగతి నాకేం అర్ధం అవుతుందిలేగాని, మీ తిప్పలేవో మీరు పడండి. నాజోలికి రాకండి.' అని చెప్పాను.

అతను కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు.

ఆ ప్రహసనం అంతటితో ముగిసింది.

కధ కంచికి మనం ఇంటికి !