Our Ashram - A beacon light to the world

7, అక్టోబర్ 2017, శనివారం

జీసస్ క్రీస్ట్ జాతక విశ్లేషణ - 8

సెప్టెంబర్ 03  BC నుంచి మన పరిశీలన మొదలుపెడదాం.అప్పుడు సూర్యుడు తులారాశిలో ఉంటాడు. అంటే, సూర్యాస్తమయ సమయానికి (17.30కి) మేషరాశి ఉదయిస్తుంది. అక్కడనుంచి సింహరాశి ఉదయించాలంటే 8 గంటలు పడుతుంది. అంటే, రాత్రి 1.30 నుంచి 3.30 లోపు సింహరాశి ఉదయిస్తూ ఉంటుంది. ఆ సమయానికి అర్ధరాత్రి గతిస్తుంది, ఇంకొక రెండు గంటలలో సూర్యోదయం అవుతుంది. గనుక ఇది జీసస్ జనన మాసం అయ్యే అవకాశం లేదు.కనుక జీసస్ జననం అక్టోబర్ లో జరిగిందని అనుకోవచ్చు.

అక్టోబర్ నెలను గమనిద్దాం.

బెత్లేహెంలో ఈ నెలలో సూర్యాస్తమయం దాదాపుగా సాయంత్రం 5 గంటలకు అవుతుంది. ఆ సమయానికి అక్కడ వృషభరాశి ఉదయిస్తూ ఉంటుంది. అంటే సింహరాశి ఉదయించే సమయం 6 గంటల తర్వాత, అంటే రాత్రి 11 నుంచి 1 గంట లోపుగా ఉంటుంది. ఇది సరిగ్గా అర్ధరాత్రి సమయం గనుక ఈ నెలలో జీసస్ జననం జరిగి ఉండాలి. అప్పటికి చలి ఇంకా ముదిరి ఉండదు గనుక లూకా సువార్త కూడా సరిపోతుంది.

ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన ఆధ్యాత్మిక గ్రహయోగాన్ని పరిచయం చేస్తున్నాను. అదే శనిచంద్రయోగం. ఒక వ్యక్తి నిజమైన యోగిగా, లేదా ఒక నిజమైన సాధకుడుగా, లేదా సిద్దుడుగా రూపొందాలంటే అతని జాతకంలో శనిచంద్రులకు పంచవిధ సంబంధాలలో ఏదో ఒకటి ఉండి తీరాలి. దీనికి ఒక కారణం ఉన్నది. ఆ కారణం ఏమిటో చెప్పబోయే ముందుగా, సమయం వచ్చింది గనుక పంచవిధ సంబంధాలంటే ఏమిటో క్లుప్తంగా ఇక్కడ పరిచయం చేస్తున్నాను.

పంచవిధ సంబంధాలు (Five types of planetary relations)
------------------------------------------------------------------------
1. కేంద్రస్థితి -- గ్రహాలు ఒకదానికొకటి కేంద్రస్థితిలో ఉండటం.
2. కోణస్థితి -- గ్రహాలు ఒకదానికొకటి కోణస్థితిలో ఉండటం. 
3. యుతి -- రెండు గ్రహాలు కలిసి ఒకే రాశిలో ఉండటం (ఈ యుతి అనేది మళ్ళీ, ఆ గ్రహాల మధ్య ఉన్న దూరాన్ని బట్టి రకరకాలైన ఫలితాలనిస్తుంది)
4. దృష్టి -- రెండు గ్రహాల మధ్యన దృష్టి ఉండటం (ఈ దృష్టులు మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కదాని ఫలితం ఒక్కో విధంగా ఉంటుంది)
5. పరివర్తన -- గ్రహాలు ఒకరి ఇంటిలో మరొకరు, లేదా ఒకరి నక్షత్రాలలో మరొకరు ఉండటం.వీటి ఫలితాలు ఆయా రాశులను ఆయా నక్షత్రాలను బట్టి రకరకాలుగా ఉంటాయి.

ఒక జాతకంలో ఆధ్యాత్మిక యోగం ఉండాలంటే శని చంద్రుల మధ్యన ఈ పంచవిధ సంబంధాలలో ఏదో ఒకటి తప్పకుండా ఉండాలి.

నవగ్రహాలలో అన్ని గ్రహాలూ ఆధ్యాత్మికతను ఇస్తాయి. అయితే, ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైన ఆధ్యాత్మికతను ఇస్తాయి. వీరిలో శనీశ్వరుడు, కేతువు ఇచ్చే ఆధ్యాత్మికత మాత్రం నిజమైన సిద్ధిని కలిగిస్తుంది. ప్రస్తుతం కేతువును పక్కన పెట్టి శనీశ్వరుని గూర్చి మాట్లాడుకుందాం.

శనీశ్వరుడు ఆధ్యాత్మికతను ఇస్తున్న జాతకులు తమ జీవితంలో 'బాధ' అంటే ఏమిటో రుచి చూచి ఉంటారు. అది ఆకలి బాధ కావచ్చు, పేదరికం కావచ్చు, అయినవారి నుంచి వియోగం కావచ్చు, నమ్మినవారి చేతిలో ద్రోహం కావచ్చు, ఇంకా ఎన్నో రకాలైన బాధలు కావచ్చు. కానీ 'బాధ' అంటే ఏమిటో వారికి బాగా తెలిసి ఉంటుంది. ఆ బాధలోనుంచే వారి ఆధ్యాత్మిక వృక్షం పుట్టుకొస్తుంది. అందుకే అది నిజమైన మధుర ఫలాలను కాస్తుంది.

ఎవరి జీవితంలోనైతే బాధ అనేది లేదో, ఎవరికైతే బాధలు తెలియవో వారిది నిజమైన ఆధ్యాత్మికత కాదు. అది ఉత్త డొల్ల ఆధ్యాత్మికత మాత్రమే.అలాంటి ఉత్త ఉపన్యాసక ఆధ్యాత్మికులు లోకంలో వేలాది మంది ఉంటారు. కానీ మానవ జీవితంలోని బాధలను లోతుగా రుచిచూచినవారికి కలిగే ఆధ్యాత్మిక సిద్ది ఇలాంటివారికి కలగదు.

ఒక వ్యక్తి బాధలు పడాలంటే, ఆ జాతకంలో శనీశ్వరునికి ప్రధాన పాత్ర ఉండాలి. మన:కారకుడైన చంద్రునితో ఆయనకు సంబంధం ఉండాలి. అప్పుడే, మానసిక సంఘర్షణ, లోతైన చింతన, ఇతరుల బాధలను తన బాధలుగా భావించే స్వభావం, ఇతరుల బాధలకు స్పందించే గుణం, ఏకాంతం అంటే ఇష్టం, ఇతరులకోసం తన సుఖాలను త్యాగం చేసే గుణం, వైరాగ్యం ఇలాంటి ఉదాత్తమైన లక్షణాలు ఆ వ్యక్తికి కలుగుతాయి. లేకపోతే కలుగవు.

కనుక ఈ అక్టోబర్ నెలలో, ఇలాంటి శనిచంద్ర యోగాలున్న రోజులను ముందుగా మనం గమనిద్దాం.


ఆ నెలలో సంక్రాతి అనేది 21 తేదీన జరుగుతున్నది. మొదటగా అక్టోబర్ 22 - 03 BC తేదీని చూస్తే, ఆరోజున రాత్రి 11.53 కి బెత్త్లేహెంలో గ్రహస్థితి ఇలా ఉన్నది.

లగ్నంలో గురుకేతువులు నిలిచి ఉండి ఆధ్యాత్మిక యోగాన్నిస్తున్నారు. మనకు కావలసిన శనిచంద్ర సంయోగం ఉన్నది. చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. కానీ ఈ యోగం తల్లికి ఉన్న మనోవేదనను సూచిస్తున్నది కూడా. నాలుగింట ఉన్న సూర్యుడు తండ్రి పరిస్థితి కూడా లౌకికంగా అంత గొప్పగా ఏమీ లేదని సూచిస్తున్నాడు. సప్తమంలో ఉన్న రాహుకుజులు దూరదేశంలో ఆధ్యాత్మిక విద్యను అభ్యసించడం, శత్రువుల చేతిలో బాధలు పడటం సూచిస్తున్నారు. వక్రి అయిన శనీశ్వరుడు నవమంలో నీచస్థితిలోకి పోతూ అనేక బాధలతో కూడిన ఆధ్యాత్మిక జీవితాన్ని సూచిస్తున్నాడు.ఈ రకంగా గ్రహయోగాలు బాగా సరిపోయాయి. ఇప్పుడు దశలు గమనిద్దాం.

12 ఏళ్ళ వయసులో కుజ - చంద్ర దశ జరిగింది. కుజుడు సప్తమంలో, చంద్రుడు ద్వాదశాధిపతిగా సప్తమాధిపతి అయిన శనీశ్వరునితో కలసి దశమంలో ఉండటం, తన దేశాన్ని వదలి ఒక  దూరదేశానికి ప్రయాణాన్ని సూచిస్తున్నది.

ఆ తర్వాత మొదలైన 18 ఏళ్ళ రాహుదశ జీసస్ జీవితంలోని 18 missing years ను స్పష్టంగా సూచిస్తున్నది. రాహువు సప్తమంలో ఉంటూ, ఈ లగ్నానికి యోగకారకుడూ నవమాదిపతిగా ఆధ్యాత్మికతను ఇచ్చే కుజునితో కలసి ఉండటం వల్ల ఆ సమయంలో దూరదేశాలలో (ఇండియాలో) నివసిస్తూ ఆధ్యాత్మిక విద్యను సాధన చేసినట్లు సూచన ఉన్నది.

30 ఏళ్ళ వయసులో రాహు-కుజ దశలో కుజుని చతుర్దాదిపత్యం వల్ల తిరిగి స్వదేశానికి వచ్చినట్లు సూచనా, అదే సమయంలో కుజుని నవమాధిపత్యం వల్ల John the Baptist చేతిలో స్వదేశంలో ఉపదేశం తీసుకున్నట్లు కనిపిస్తున్నది.

33 ఏళ్ళ వయసులో, శిలువ వెయ్యబడిన రోజులలో ఒకటైన రోజుగా సర్ ఐజాక్ న్యూటన్ రాబట్టిన 7-4-30 AD శుక్రవారం రోజున, సరిగ్గా గురు-గురు-రాహు-శని-శని దశ నడిచింది. గురుచండాల యోగమూ, శపిత యోగమూ కలసి నమ్మిన వారి ద్రోహంతో కూడిన శిలువ శిక్షను సూచిస్తున్నాయి.

కనుక ఈ జాతకం జీసస్ జాతకంతో సరిపోతున్నది. పైగా ఈ జాతక చక్రంలో గ్రహాలను కలుపుతూ రెండు గీతలు గీస్తే సరిగ్గా శిలువ గుర్తు వస్తుంది. విదేశాలలో గీచే వృత్తాకార చార్ట్ అయితే ఈ శిలువ గుర్తు చాలా స్పష్టంగా కన్పిస్తుంది. కానీ, అప్పుడే ఒక నిర్దారణకు రాకూడదు. సందేహ నివారణకు ఇంకా కొన్ని తేదీలు పరిశీలిద్దాం.

(ఇంకా ఉంది)