Our Ashram - A beacon light to the world

4, అక్టోబర్ 2017, బుధవారం

జీసస్ క్రీస్ట్ జాతక విశ్లేషణ - 7

జ్యోతిష్యశాస్త్రం అనేది చాలా అద్భుతమైనది. చాలామంది అనుకునేటట్లు ఇది మూఢనమ్మకం ఏమాత్రం కాదు. దీనిని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే దీనిలోని లోతుపాతులు తెలుస్తాయి.

సామాన్యంగా ఈ శాస్త్రంలో రెండు అంశాలు కలగలిసి ఉంటాయి. ఒకటి - తర్కం (logic). అందుకే ఈ శాస్త్రం Astro ( of the Stars) - logy (logic) అనబడుతుంది. అంటే Logic of the Stars or heavenly bodies అని అర్ధమన్న మాట. రెండు - స్ఫురణ (Intuition). ఇవి రెండూ ఒకదానికొకటి పోషకాలుగా ఉన్నప్పుడు సత్యమనేది మనకు గోచరిస్తుంది.

ఇలా విశ్లేషణ చేసే క్రమంలో మనం ఎన్నో సిద్ధాంతాలను (hypothesis) నిర్మించుకుంటూ వాటిల్లో ఒక్కొక్కదానినీ శల్యపరీక్ష చేస్తూ ముందుకు సాగాలి. ఈ పరీక్షలకు నిలబడే వాటిని ఉంచాలి, కూలిపోయేవాటిని వదిలెయ్యాలి. ఈ క్రమం అంతా ఎలా ఉంటుందంటే ఒక గడ్డివామిలో సూదికోసం వెదికినట్లుగా ఉంటుంది.దీనికి చాలా ఓపిక కావాలి.

Part - 6 లో వ్రాసిన విశ్లేషణ అంతా చాలా సరళంగా చాలా బాగున్నట్లుగా చదివినవారికి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇంకో చిన్న లాజిక్ చెబుతాను. ఈ కోణంలో చూస్తే part -6 లాజిక్ మొత్తం కుప్పకూలిపోతుంది.

సింహరాశి అన్న కీలకం ఒకటి దొరికింది గనుక దాని ఆధారంగా మనం మిగతా సమీకరణాన్ని రాబట్టాలి. జనన సమయం తెలిస్తే లగ్నం రాబట్టడం తేలిక. అదొక పద్ధతి. ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ చెయ్యాలి. అంటే ప్రస్తుతం మనకు తెలిసిన మిగతా వివరాలను బట్టి జనన సమయాన్ని రాబట్టాలి.

ఇక్కడ కీలకమైన రెండు ఖగోళ అంశాలను పరిచయం చేస్తున్నాను.

ఒకటి - జీసస్ జననం అర్ధరాత్రి ప్రాంతంలో గనుక జరిగి ఉంటే, సూర్యుడు ఖచ్చితంగా ఆ చార్ట్ లో చతుర్ధం (పాతాళం) లో ఉండాలి. లేదా తృతీయంలో కూడా ఉండవచ్చు.

రెండు - సింహరాశిలో ఉన్న star of Bethlehem అనేది రాత్రిపూట ఆకాశంలో కనిపించాలి. పగటి పూట అది కనిపిస్తే three wise men దానిని చూడలేరు గనుక అది ఖచ్చితంగా రాత్రిపూట మాత్రమే ఆకాశంలో వెలుగుతూ కనిపించి ఉండాలి.

ఈ రెండు అంశాలనూ కలిపితే మనం వెదుకుతున్న విషయంలో స్పష్టత వస్తుంది. ఎలాగో చూద్దాం.

Star of Bethlehem అనేది రాత్రిపూట కనిపిస్తూ ఉండాలీ అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత సింహరాశి ఉదయించాలి. అంటే, వీరిద్దరూ ఒకరికొకరు సమసప్తకం (Opposition) లో ఉండాలి. అంటే సూర్యుడు కుంభరాశిలో రాహువుతో కలసి ఉండి ఉండాలి.  ఇది మన ప్రస్తుత జాతకంలో కోరదగిన ఆదర్శవంతమైన గ్రహస్థితి. అప్పుడు సూర్యుడు అస్తమిస్తూనే సింహరాశి ఉదయిస్తుంది. అంటే రాత్రంతా ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. అలా ఉండాలంటే, జీసస్ జననం జనవరి 21  - ఫిబ్రవరి 21 మధ్య అయి ఉండాలి. కానీ ఈ సమయం సరిగ్గా వణికించే చలికాలం మధ్యలో గనుక లూకా సువార్త ప్రకారం అది సాధ్యం కాదు.

అలా కాకపోతే, సూర్యుడు అస్తమించిన కొన్ని గంటలకు సింహరాశి ఆకాశంలో ఉదయించాలి. అలాంటప్పుడు కుంభరాశి వెనుక ఉన్న మకర, ధను,వృశ్చిక,తులా రాశులలో సూర్యుడు ఉండాలి. లేదా, సూర్యుడు అస్తమించక ముందే సింహరాశి ఆకాశంలో ఉండి, చీకటి పడ్డాక వెలుగుతూ కనిపించాలి. అంటే, కుంభరాశికి ముందున్న మీన, మేష, వృషభ, మిధున రాశులలో సూర్యుడు ఉండి ఉండాలి. కనుక మొత్తం మీద సూర్యుడు తులారాశి నుంచి మిథునరాశిలోపు ఉండాలి. అప్పుడు, మొదటి నెలలలో ఏ తెల్లవారు జాముకో సింహరాశి ఉదయిస్తూ, క్రమేణా నెలలు గడిచే కొద్దీ, సూర్యాస్తమయ సమయానికే ఆకాశంలో ఉదయించి కనిపిస్తూ ఉంటుంది. ఇంకో మాటల్లో చెప్పాలంటే, అది రాత్రంతా ఉండకుండా, కొద్దిసేపు మాత్రమే ఆకాశంలో కనిపిస్తుంది. అంటే, ఎలా చూచినా, ఇటువంటి గ్రహస్థితి మనకు కావాలంటే అది తులారాశి (సెప్టెంబర్ 21) నుంచి మిధునరాశి (ఏప్రిల్ 21) లోపు మాత్రమే అవుతుంది.

కానీ ఈ లెక్కలో ఇప్పుడే అసలైన పెద్ద చిక్కొచ్చి పడుతుంది. అదేంటంటే - ఈ నెలలలోనే సరిగ్గా చలికాలం అనేది ఉంటుంది. అదీగాక, ఈ నెలలలో ఎప్పుడు చూచినా శుక్రుడు సింహరాశిలో ఉండడు. ఎందుకంటే శుక్రుడు, సూర్యునికి కొంచం అటూ ఇటూగానే ఎప్పుడూ ఉంటాడు గనుక. కాబట్టి star of Bethlehem అనేదానిని శుక్రుడు లేకుండా ఉత్త గురువుతోనే సరిపెట్టుకోవలసి వస్తుంది.అప్పుడు Part-6 లో మనం ఊహించిన లాజిక్ అంతా కుప్పకూలిపోతుంది. అలాంటప్పుడు, శుక్రుడు సింహరాశిలో లేడు గనుక, దానికి బాగా దగ్గరలో ఉన్న కన్యారాశిలో ఉన్నట్లు అనుకోవాల్సి వస్తుంది. అలా అయితే ఆ నెల సెప్టెంబర్ అవుతుంది. కానీ అప్పుడు శుక్రుడు నీచస్థితిలోకి వచ్చేస్తాడు. లేదా అక్టోబర్ అనుకోవలసి వస్తుంది. చలికాలం అప్పుడప్పుడే మొదలౌతూ ఉంటుంది గనుక, ఈ పరిస్థితితో లూకా సువార్త దాదాపుగా సరిపోతుంది.

కాబట్టి, సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో, అంటే చలికాలం మొదట్లోగానీ లేదా మార్చ్ ఏప్రిల్ నెలలలో అంటే, వేసవి కాలం మొదట్లోగానీ జీసస్ జననం జరిగి ఉండాలని ఈ లాజిక్ చెబుతుంది.

ఒకవేళ శుక్రుడు గనుక సింహరాశిలోనే ఉండాలి అప్పుడు గానీ star of Bethlehem ఏర్పడదు అనుకుంటే, ఆ ఏర్పడిన star రాత్రిపూట కనపడదు. ఎందుకంటే ఆ దగ్గరలోనే సూర్యుడూ ఉంటాడు, శుక్రుడూ సింహరాశీ సూర్యునితోనే ఉదయించి సూర్యునితోనే అస్తమిస్తాయి. అంటే రాత్రిళ్ళు సింహరాశి ఆకాశంలో కనిపించదు. దానిలోనే ఉన్న star of Bethlehem కూడా కనిపించదు. ఇకపోతే, పగటిపూట సూర్యుని వెలుగులో అది ఆకాశంలో కనిపించడం సాధ్యం కాదు. ఈ పరిస్థితిలో, three wise men కు అది రాత్రిపూట ఆకాశంలో వెలుగుతూ ఎలా కనిపిస్తుంది?

కనుక శుక్రుడిని ప్రస్తుతానికి ఒదిలేసి - గురువుగారు ఒక్కరే సింహరాశిలో ఉన్న ఏడాది కాలంలో, సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ లోపుగా జీసస్ జననకాలం కోసం మనం వెదకవలసి ఉంటుంది. దీనిలో కూడా మళ్ళీ చలికాలపు నెలలను వదిలేసి మన వెదుకులాటను కొనసాగించవలసి ఉంటుంది.

ఈ చిన్న లాజిక్కుతో కధ మళ్ళీ మొదటికొచ్చిందన్నమాట !!

(ఇంకా ఉంది)