Our Ashram - A beacon light to the world

2, అక్టోబర్ 2017, సోమవారం

జీసస్ క్రీస్ట్ జాతక విశ్లేషణ - 5

బైబిల్ దైవగ్రంధమనీ అందులో అంతా పరిశుద్ధమైన మాటలే ఉన్నాయనీ అనుకునేది నిజం కాదు. ఓల్డ్ టెస్టమెంట్ లో రాజుల చరిత్రలోగానీ ప్రవక్తల చరిత్రలోగానీ చూస్తే, అక్రమ సంబంధాలు, కామకేళీ విలాసాలు, అబద్దాలు, కుట్రలు,కుతంత్రాలు,మోసాలు ఎన్నెన్నో మనకు కనిపిస్తాయి. అలాగే న్యూ టెస్టమెంట్ లో కూడా, సెయింట్ పాల్, జీసస్ శిష్యులూ వ్రాసినవాటిల్లో చాలా అసంబద్ధమైన, నిరంకుశమైన విషయాలున్నాయి.ఇవన్నీ దేవుని మాటలే అని చెప్పడం అసంబద్ధం. బైబిల్లో దేవుని మాటలు అక్కడక్కడా ఉంటే ఉన్నాయేమో గాని అన్నీ అవే కావు.

ఇవి గాక 'దేవుడు లోకాన్ని ఆర్రోజులపాటు సృష్టించి ఏడో రోజునుంచీ రెస్టు తీసుకుంటున్నాడు.', 'భూమి బల్లపరుపుగా ఉంది' మొదలైన అనేకమైన నిరాధారపు వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. మధ్యయుగాలలో, సైన్సు పుట్టకముందు, వీటన్నిటినీ విదేశాలలోని ప్రజలు గొర్రెల్లా నమ్ముతూ వచ్చారు. ఇలాంటి బైబిల్ మాటల్ని నమ్మి, కోపర్నికస్, గెలీలియో వంటి సైంటిస్టులను క్రూరాతి క్రూరంగా శిక్షించారు అప్పటి క్రైస్తవులు. 

అమాయకుడైన జీసస్ ను సత్యాలు చెప్పినందుకు శిలువ వేసి యూదులు క్రూరంగా చంపారని గోల చేసే క్రైస్తవులు, మరి నిజాలు చెప్పినందుకు కోపర్నికస్ నూ, గెలీలియోనూ అంతకంటే దారుణంగా హింసించారు.ఇంకా ఎంతోమంది అమాయకులైన ఆడవాళ్ళను మంత్రగత్తెలని పేర్లు పెట్టి సజీవదహనం చేశారు. నేడు శాంతిమంత్రం జపిస్తున్న క్రైస్తవానికి చాలా క్రూరమైన ఘోరమైన ఘనచరిత్ర ఉన్నది. బైబిల్ గనుక క్షుణ్ణంగా చదివితే అందులో ఉన్న అబద్దాలకూ,అశ్లీలతలకూ,అక్రమాలకూ చదువుతున్న మనకే సిగ్గు కలుగుతుంది.

బైబిల్ అనేది దేవుని శాసనం ఏమీ కాదు. ఎందుకంటే ఈ రెండువేల సంవత్సరాలలో అది అనేకసార్లు ఎడిట్ చెయ్యబడుతూ వచ్చింది. అందులో ఉన్న అసభ్యమైన ఘట్టాలనూ, అబద్దాలనూ, తిట్ల భాషనూ అనేకమంది కమిటీలుగా ఏర్పడి కాలక్రమేణా సంస్కరిస్తూ వచ్చారు. దేవుని శాసనమే అయితే దానిని మనుషులు ఎలా ఎడిట్ చేస్తారు?

అలాంటి అబద్దాలలో ఇంకొకటి - three wise men అనేవాళ్ళు జీసస్ పుట్టినపుడు వచ్చి ఆయన్ను దర్శించారని చెప్పేమాట. అనేక క్రిస్మస్ పెయింటింగులలో కూడా ఇదే ఉంటుంది. కానీ ఇది నిజం కాదని మనకు కొద్దిగా ఆలోచిస్తే తెలిసిపోతుంది. అయితే దానికి కొంత జ్యోతిశ్శాస్త్ర పరిజ్ఞానమూ లాజిక్కూ కావాలి. మూర్ఖంగా నమ్మడం మానేసి కొంచం ఆలోచించాలి. అప్పుడు సత్యమేమిటో మనకు అర్ధమౌతుంది.

మన ప్రస్తుత సబ్జెక్ట్ ఇది కాకపోయినా, సందర్భం వచ్చింది గనుక, ఈ ఒక్క విషయాన్ని మాత్రం కొంచంగా వివరిస్తాను. ఎందుకంటే ఈ సంఘటనను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇందులోనుంచే మనకు, జీసస్ జననతేదీకి సూచన కనిపిస్తుంది గాబట్టి.

Three wise men అనేవాళ్ళు సరాసరి వచ్చి జీసస్ ను కలవలేదు. వాళ్ళు ముందుగా హీరోడ్ అనే ఆ దేశపు రాజును కలిశారు. అలా కలిసి - ' మీ దేశంలో ఒక మహానుభావుడు, యూదులకు రాజూ పుట్టాడని మాకు కొన్ని ఖగోళ సంకేతాలను బట్టి అర్ధమైంది. ఆయన్ను వెదుక్కుంటూ మేము వచ్చాము. మీ గ్రంధాలను బట్టి, ఏ ప్రాంతంలో అలాంటి రాజు పుట్టే అవకాశం ఉన్నదో చెప్పండి.' అని ఆయన్ను అడిగారు.

ఎవరు బడితే వాళ్ళోచ్చి ఏదేదో చెబితే నమ్మడానికి ఆ రోజుల్లోని రోమన్ రాజులు అంత అమాయకులేమీ కారు. ఆయన వాళ్ళను తన దగ్గర కొన్నిరోజులు ఉంచుకుని, ఏ ఖగోళ సూచనలు వాళ్లకు కన్పించాయి? దేన్ని బట్టి వాళ్లీ నిర్ధారణకు వచ్చారు? మొదలైన విషయాలనీ క్షుణ్ణంగా వాళ్ళను అడిగి తెలుసుకుని, తన దగ్గర ఉన్న యూదుల మతగురువులతో ఈ విషయాలను చర్చించి - 'బెత్లేహెం' అనే గ్రామంలో అలాంటి మనిషి పుట్టే సూచన ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్నది గనుక ఆ గ్రామానికి వెళ్లి వాకబు చెయ్యండి. అలాంటి అబ్బాయి గనుక మీకు కనిపిస్తే, మళ్ళీ వచ్చి నాకు చెప్పండి.నేనుకూడా అతన్ని దర్శించుకుంటాను.' అని వారికి చెప్పి పంపిస్తాడు.

వాళ్ళు సరేనని బెత్లేహెం వైపు బయలుదేరితే, ఆకాశంలో వారికి కనిపించిన ఆ నక్షత్రం వారి ముందుగా ఆకాశంలో నడుస్తూ దారి చూపించిందనీ, అది సరిగ్గా బెత్లేహెం మీదకు వచ్చి ఆగిపోయిందనీ బైబిల్లో వ్రాసి ఉంది. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఏ నక్షత్రమూ అలా మనిషి మాదిరిగా నడుస్తూ మనకు దారి చూపించదు. అలా చూపించే పనైతే three wise men అనేవాళ్ళు హీరోడ్ ను కలవాల్సిన పనే లేదు.

"ఆ పిల్లవాడు మీ రాజ్యంలో ఎక్కడ పుట్టడానికి అవకాశం ఉన్నది?" అని రాజుగారిని అడగాల్సిన పనే లేదు. సరాసరి నక్షత్రం చూపిస్తున్న దారిలో నడిచి ఆ ఊరికి డైరెక్టుగా వెళ్లిపోవచ్చు. కానీ అలా జరగలేదు. 'బెత్లేహెం అనే ఊరిలో వెదకండి' అని రాజు వారితో చెప్పాక మాత్రమే, ఆ నక్షత్రం దారి చూపిస్తూ వారితో నడిచిందని వ్రాయబడి ఉండటం ఎంత అసంబద్ధమో కొద్దిగా ఆలోచన ఉన్న ఎవరికైనా అర్ధమై పోతుంది.

వాళ్ళు అలా రాజుని కలిసి ఇదంతా చెప్పబట్టే, ఆ ఊరిలోని పిల్లల్ని అందరినీ చంపమని హీరోడ్ ఆజ్ఞాపించాడు. ఎందుకంటే - తిరిగి వస్తామని చెప్పిన three wise men తిరిగి రాకుండా వేరే దారిలో వాళ్ళ  దేశానికి వెళ్ళిపోయారు. కనుక రాజుకు సమాచారం అందలేదు. ఆ పిల్లవాడు ఎవరో తెలిసే అవకాశం రాజుకు లేదు గాబట్టి, రెండేళ్ళ లోపు పిల్లల్ని అందరినీ చంపమని హీరోడ్ ఆజ్ఞ ఇచ్చాడు.

రాజును కలవకుండా తిరిగి వెనక్కు వెళ్ళిపొమ్మని ఆ three wise men కు పరిశుద్దాత్మో లేదా ఎవడో దేవదూతో చెప్పాడని ఇంకో కట్టుకధ బైబిల్లో అల్లబడి ఉంది. వాళ్లకు అలా దర్శనాలు కలిగి సరాసరి దేవుడినుంచి వాళ్లకు సూచనలు వచ్చే పనైతే, అసలు వాళ్ళు రాజును కలవడం ఎందుకు? ఈ కధంతా ఆయనకు చెప్పి అనుమానం కలిగించి అంతమంది పిల్లల చావులకు కారకులవ్వడం ఎందుకు? సరాసరి ఆ పరిశుద్దాత్మనో, ఆ గాబ్రియేల్ నో అడిగి జీసస్ ఉన్న ఇంటి అడ్రస్ తెలుసుకుని, సరాసరి అక్కడికే రహస్యంగా వెళ్లిపోవచ్చు కదా? కానీ ఇలా జరగలేదు గనుక నక్షత్రం ఆకాశంలో వీరి ముందుగా నడుస్తూ దారిచూపడం అనేది శుద్ధ కట్టుకధ అని స్పష్టంగా తెలుస్తున్నది.

ఇక్కడ ఇంకో మెలిక ఉన్నది.

Three wise men అనేవాళ్ళు వచ్చిన రాత్రే జీసస్ పుట్టి ఉంటే, రెండేళ్ళ లోపు వయసున్న పిల్లల్ని అందరినీ చంపమని హీరోడ్ ఎందుకు ఆజ్ఞాపిస్తాడు? అన్న పాయింట్ ని కొంచం ఆలోచించండి.

అంటే, జీసస్ పుట్టి అప్పటికే దాదాపు రెండేళ్లైంది. ఆయన పుట్టినప్పుడు ఉన్న ఖగోళ సూచనలను గమనిస్తూ ఉన్న three wise men ఈజిప్టు నుంచో, పర్షియా నుంచో వెదుక్కుంటూ ఆ దేశానికి వెళ్ళేసరికి ఒకటిన్నరేళ్ళో రెండేళ్ళో పట్టింది. "మేము ఆకాశాన్ని రెండేళ్ళ నుంచీ గమనిస్తున్నాము. ఈ సూచనలు మాకు కనిపిస్తున్నాయి" - అని వాళ్ళు చెప్పబట్టే రెండేళ్ళ లోపు వయసు పిల్లల్ని అందరినీ చంపమని హీరోడ్ ఆజ్ఞ ఇచ్చాడు.

కనుక సరిగ్గా జీసస్ పుట్టే సమయానికి three wise men వచ్చి అటెండెన్స్ వేయించుకున్నారు - అని చెప్పడం అబద్దం అవుతుంది. కనుక నేటి క్రిస్మన్ చిత్రాలలో - జీసస్ పుట్టినపుడు ఆయన చుట్టూ గొర్రెల కాపరులూ, ముగ్గురు జ్ఞానులూ ఉండి ఆయనకు నమస్కారం పెడుతూ ఉండటం అంటూ మనకు కనిపించేది అబద్దం అని స్పష్టంగా తెలుస్తున్నది. ఈ ముగ్గురు జ్యోతిష్కులు జీసస్ ను దర్శించేసరికి ఆయనకు దాదాపు ఒకటిన్నరా రెండేళ్ళ వయస్సు ఉన్నది అనేది నిజం.

అసలీ సోదంతా ఎందుకు చెబుతున్నారు? అని మీకు సందేహం రావచ్చు. కారణం ఉంది. కారణం లేకుండా ఇదంతా మీకు చెప్పడం లేదు. జీసస్ జననతేదీని రాబట్టడానికి ఇది చాలా ముఖ్యమైన లాజిక్ కనుకా, దీనిని ఇప్పటిదాకా ఎవ్వరూ ఈ కోణంలో చూడలేదు గనుకా నేను చెబుతున్నాను.

రెండేళ్ళపాటు అదేపనిగా ఖగోళంలో నిలిచి ఉండే ఘట్టాలు కొన్నున్నాయి. వాటిలో ఒకటి రాహుకేతువుల స్థితి. ఇది ఒకటిన్నర సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటుంది. కనుకనే దీనిని ఆ ముగ్గురు జ్యోతిష్కులు లెక్కిస్తూ గమనిస్తూ వచ్చారు. అంటే - రాహువు కుంభంలోనూ, కేతువు సింహంలోనూ ఉన్నప్పటి స్థితిలో, సింహరాశిలో గురువూ శుక్రుడూ కూడా ఉన్న నెలలో star of Bethlehem ఏర్పడినప్పుడు జీసస్ జననం జరిగి ఉండాలన్న స్ఫురణ ఈ లాజిక్ ను బట్టి మనకు కలుగుతున్నది.

రాశిచక్రాన్ని చుట్టి రావడానికి రాహుకేతువులకు 18 ఏళ్ళు పడితే, గురువుకు 12 ఏళ్ళు, శనీశ్వరునికి 30 ఏళ్ళూ పడుతుంది. వీళ్ళు ముగ్గురూ మనకు కావలసిన ఒక position (ప్రస్తుతం మనం అనుకుంటున్న star of Bethlehem ను సూచించే position) లోకి రావాలంటే అక్షరాలా 2,160 సంవత్సరాలు పడుతుంది. ఈ star అనేది ఒక perfect shape లో కనిపించాలంటే గ్రహాల declination అనే ఒక అంశాన్ని బట్టి ఇంకా ఎన్నో వేల ఏళ్ళకు గాని ఈ గ్రహస్థితి ఆకాశంలో మళ్ళీ ఇంకోసారి కనిపించదు. బహుశా ఈ గ్రహస్థితి అనేది క్రీ.పూ. 4 నుంచి 2 లోపు ఆకాశంలో ఏర్పడి ఉండాలి. కనుక ఆయా గ్రహాల పరిస్థితులను మనం simulation ద్వారా చూస్తే జీసస్ జనన తేదీ దొరకవచ్చు అనేది ఇప్పుడు మనకు అర్ధమౌతున్నది.

ఈ మొత్తం విశ్లేషణలో, రాహుకేతువుల స్థితి ఎందుకు ఇంత ముఖ్యమైనది? పన్నెండు రాశులలోనూ, సింహరాశికే ఎందుకు ఇంత ప్రాముఖ్యత? అంటే, సింహరాశి అనేది ఇజ్రాఎల్ దేశానికీ, డేవిడ్ వంశానికీ సూచిక. The Lion of Judah అనేది యూదులకు ఒక సింబల్. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ చూడండి.

https://en.wikipedia.org/wiki/Lion_of_Judah


సింహరాశి అనేది  యూదులకూ కింగ్ డేవిడ్ వంశానికీ సింబల్ కనుకనే సింహరాశిలో, రాజరిక నక్షత్రమైన రెగులస్ (మఖా) దగ్గరలో ఈ గ్రహస్థితులు ఏర్పడినప్పుడు, వారికి స్వాతంత్రాన్ని తెచ్చే ఒక రాజు జననం జరిగిందని ఆ ముగ్గురు జ్ఞానులూ భావించారు. ఎందుకంటే వారికి జ్యోతిష్యశాస్త్రం తెలుసు గనుక. అప్పటికి ఇంకా,జ్యోతిష్కులను సైతాన్ భక్తులుగా భావించే క్రైస్తవ దుష్ట సాంప్రదాయం అక్కడ వేళ్ళూనుకోలేదు.కనుకనే ఆ ముగ్గురు జ్యోతిష్కులను  హీరోద్ అంతగా గౌరవించి వారి మాటను అంతగా నమ్మాడు.

అదీగాక, 'రెగులస్ (మఖా)' అనే నక్షత్రానికి అధిపతి కేతువే. కనుక రాహుకేతువులు కూడా సింహరాశిని చూస్తూ ఉండటం (అంటే రాహువు కుంభంలోనూ కేతువు సింహంలోనూ ఉండటం) అనే గ్రహయోగం చాలా సమంజసంగా ఉంటుంది.

రాహుకేతువులు సింహరాశిలో గనుక ఎప్పుడున్నారని గమనిస్తే -  9-1-03 BC నుండి 28-6-02 BC వరకూ ఏడాదిన్నర పాటు వారక్కడ ఉన్నట్లు కనిపిస్తున్నారు. కనుక జీసస్ జననసమయం ఈ ఒకటిన్నర సంవత్సరం మధ్యలోనే జరిగి ఉండాలని మనకు అర్ధమౌతున్నది.

ఈ పాయింట్ మీకు అర్ధమయ్యేలా చెయ్యడం కోసమే ఈ సోదంతా మీకు చెప్పడం జరిగింది.

(ఇంకా ఉంది)