Our Ashram - A beacon light to the world

20, అక్టోబర్ 2017, శుక్రవారం

జీసస్ క్రీస్ట్ జాతక విశ్లేషణ - 12

ఒకటినుంచీ పదకొండు పోస్టులవరకూ చేసిన ఈ విశ్లేషణను బట్టి మనకు కొన్ని విషయాలు అర్ధమౌతున్నాయి. అవేంటంటే -

1. Star of Bethlehem అనేది సింహరాశిలో ఏర్పడలేదు. ఒకవేళ ఏర్పడింది అనుకుంటే అప్పుడు వచ్చే జీసస్ జాతకంలో దైవత్వం లేదు. మొండితనంతో కూడిన ఒక సాధువు వంటి జాతకం మాత్రమే కనిపిస్తున్నది. నిజమైన క్రీస్తు జాతకంలో Star of Bethlehem లేనే లేదు.

2. జీసస్ తల్లి ఒక కన్య కావడానికి ఎక్కడా ఆస్కారం లేదు. ఇది తర్వాత తరాలలోని క్రైస్తవ మతబోధకులు అల్లిన అబద్దం మాత్రమేగాని ఇది నిజం కాదు. కన్యకు గర్భం రావడం అనేది ఏ తరంలోనూ జరిగే పని కాదు.

3. జోసెఫ్ తో పెళ్లి నిశ్చయం అయ్యాక మేరీ అతనితో కాకుండా వేరెవరితోనో గర్భవతి అయింది. ఈ విషయాన్ని జీసస్ శిష్యుడైన సెయింట్ థామస్ స్వయంగా వ్రాశాడు. ఆ "వేరెవరో" అనేది దేవుడు కాదు. అది ఒక మనిషి మాత్రమే. ఆ మనిషి ఎవరు అనే విషయం అప్పట్లో చాలామంది యూదుమత బోధకులకు తెలుసు. వారు వ్రాసిన పుస్తకాలను ఆధారాలను క్రైస్తవ మత బోధకులు తగలబెట్టి అబద్దాలను ప్రచారం చేస్తూ జనాన్ని నమ్మిస్తూ వచ్చారు. ఇదే అబద్దాన్ని ఇప్పుడు కూడా అందరూ నమ్ముతున్నారు. ఈ నమ్మకానికి కారణం - నమ్మకపోతే ఏ కీడు జరుగుతుందో, దేవుడు కోపిస్తాడేమో అన్న భయం తప్ప సత్యాన్వేషణా తృష్ణ మాత్రం కాదు. ఈ నమ్మకం నిజం కూడా కాదు. ఎందుకంటే సత్యస్వరూపుడైన దైవం సత్యాన్ని తెలుసుకున్నందువల్ల ఏమీ కోపించక పోగా ఇంకా సంతోషిస్తాడు.

4. ఈ నిజం జోసెఫ్ కూ తెలుసు. జీసస్ కూ తెలుసు. ఇది తెలియడం వల్లనే జీసస్ ఎప్పుడూ చాలా సీరియస్ గా ఉండేవాడు. అస్సలు నవ్వేవాడు కాదు. అంతేగాక ఇతరులు నవ్వుతూ సరదాగా ఉన్నా సహించేవాడు కాదు. వారిని తిట్టేవాడు. దీనికి కారణం తనలో ఉన్న గిల్ట్ మాత్రమే.

5. ఈ గిల్టీ ఫీలింగ్ వల్లనే ఒక విధమైన తిరుగుబాటు ధోరణి మొదలై, అందరితో వాదించడం, మొండిగా మాట్లాడటం, ఎదురుతిరగడం వంటి పోకడలు ఆయనలో చిన్నప్పుడే చోటు చేసుకున్నాయి. ఇలాంటి పిల్లల్లో ఇలాంటి పోకడలు వస్తాయని సైకాలజీ కూడా చెబుతున్నది.

6. Inferiority complex ఉన్నవారిలో అనవసరమైన superior behavior ఉంటుందనేది సైకాలజీ చెబుతున్న సత్యం. ఈ ఫీలింగ్ ఆయనలో ఉన్నది గనుకనే, తనను తాను ఒక స్పెషల్ వ్యక్తిగా నిరూపించుకోవడం కోసం, తన guilt ను అధిగమించడం కోసం, స్వదేశాన్ని వదలి ఈజిప్ట్, ఇండియా, టిబెట్ మొదలైన దేశాలలో సంచరించి 18 ఏళ్ళు అక్కడ ఉండి హిందూ మతాన్ని, బౌద్ధమతాన్ని అధ్యయనం చేసి, తనవాళ్ళకు గుణపాఠం చెప్పాలన్న కసితో తిరిగి తన దేశానికి వచ్చాడు.

7. వచ్చిన తర్వాత, చిన్నప్పటి నుంచీ తన వారిమీద ఉన్న కోపంతో, వారి మతమైన యూదుమతాన్ని విమర్శించడం దానికి కొత్త అర్ధాలు చెప్పడం మొదలుపెట్టి అందరితో శత్రుత్వం తెచ్చుకున్నాడు. అదెంత వరకూ వచ్చిందంటే, 'ఇతనిలో ఏ తప్పూ నాకు కనిపించడం లేదు' అని చెప్పి అప్పటి రాజప్రతినిధి అయిన పాంటియాస్ పైలేట్ ఈయన్ను విడచి పెట్టినా కూడా, 'లేదు ఇతన్ని చంపాల్సిందే. ఆపని మీరు చెయ్యకపోతే మా మతగ్రందాల ప్రకారం మేమే ఆ పని చేస్తాం' అని యూదులు తీర్మానించి రాజుకు కూడా ఎదురుతిరిగి ఆయన్ను సిలువ వేసే వరకూ పరిస్థితిని ముదరబెట్టుకున్నాడు.

8. సిలువ వేసినంత మాత్రాన ఎవరూ చనిపోరు. స్పృహ తప్పి పడిపోయిన జీసస్ ను బట్టలు చుట్టి ఒక గుహలో ఉంచగా, ఆయన శిష్యులు సొరంగ మార్గంలో ఆయన్ను తప్పించి, Essene తెగ ప్రజల ద్వారా ఆయనకు వైద్యం చేయించి తిరిగి స్పృహ తెప్పించారు. ఆ తర్వాత ఆయన అక్కడనుంచి తప్పించుకుని తనను ఆదరించి అసలైన ఆధ్యాత్మికతను నేర్పిన ఇండియాకు తన తల్లి మేరీ, తన శిష్యురాలు/ ప్రియురాలైన మేరీ మేగ్డలీన్, తన ఇద్దరు శిష్యులతో వచ్చి కాశ్మీర్లో ఎన్నో ఏళ్ళు నివసించి అక్కడే చనిపోయాడు.

తన భావాలను ప్రచారం చెయ్యడానికి సెయింట్ థామస్ ను మద్రాస్ కు పంపాడు. తామస్ మద్రాస్ లోనే ఉంటూ అక్కడ హిందూదేవతలను విమర్శిస్తూ చంపబడ్డాడు. ఇతను తన గురువైన క్రీస్తులాగానే ఒక తిరుగుబాటుదారుడిలాగా ప్రవర్తించి చావువరకూ తెచ్చుకున్నాడు.

జీససేమో యూదులు అనుసరిస్తున్న యూదుమతాన్ని మార్చాలని ఒక తీవ్రవాదిలాగా ప్రయత్నించి చావును కొని తెచ్చుకున్నాడు. సెయింట్ థామస్ ఏమో, తమిళనాడులో హిందుత్వాన్ని తిడుతూ ప్రచారం చెయ్యబోయి చంపబడ్డాడు. ఈ క్రమంలో గురుశిష్యులిద్దరూ ఒకే దారిలో నడిచారు. 'ఇండియాలో నీ ప్రచారం చెయ్యవద్దు' అని సెయింట్ పాల్ కు హోలీ ఘోస్ట్ (దేవుడు) స్పష్టంగా చెప్పినట్లు బైబిల్లో వ్రాసి ఉంది. ఎందుకంటే, అక్కడ ప్రచారం చెయ్యడానికి కొత్తగా ఏమీ లేదు.ప్రపంచం నేర్చుకున్నదంతా ఇండియానుంచే నేర్చుకుంది.ఇక మళ్ళీ ఇండియాలో ప్రచారం ఎందుకు? కనుకనే 'ఇండియాలో నీ ప్రచారం చెయ్యవద్దు' అని పరిశుద్ధాత్మ  క్లియర్ గా బైబిల్లో చెప్పింది. కానీ పరిశుద్ధాత్మ మాటను కూడా లెక్కచెయ్యకుండా డబ్బుకోసం ఇండియాలో క్రైస్తవాన్ని ప్రచారం చేస్తూ అమాయకులను మతం మారుస్తున్నారు క్రైస్తవులు.

మైలాపూర్ లోని Santhome లో సెయింట్ థామస్ నిర్మించిన చర్చి ఇంకా ఉంది. దీని క్రిందనే ఇతని అస్థికలు ఉన్నాయి. అతను నివసించిన కొండనే ఈనాడు చెన్నైలో "సెయింట్ థామస్ మౌంట్" అంటున్నారు. కాశ్మీర్లోని పహల్ గావ్ లో ఉన్న జీసస్ సమాధిని ఎందఱో విదేశీయులు వచ్చి ఈనాటికీ దర్శిస్తున్నారు. దీనికి అనేక రుజువులు సాక్ష్యాలు చరిత్రలో ఉన్నాయి. చదవండి.

9. క్రైస్తవాన్ని పూర్తిగా వక్రీకరించిన సెయింట్ పాల్, క్రీస్తు సిద్ధాంతాలను పూర్తిగా పక్కన పెట్టి, తనవైన కొత్త సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. దేవుడు కాని జీసస్ ను దేవుడుగా ప్రచారం చెయ్యడం మొదలుపెట్టింది ఇతనే. ఈనాడు ప్రపంచం నమ్మి అనుసరిస్తున్న మతం నిజానికి సెయింట్ పాల్ మతం గాని క్రీస్తుమతం కాదు. బైబిల్ ను బాగా చదివితే ఈ విషయం స్పష్టంగా అర్ధమౌతుంది.

10. అందరు మహనీయుల లాగే జీసస్ లో కూడా దైవత్వం ఉన్నమాట నిజమే. కానీ ఈనాటి క్రైస్తవులు చెబుతున్నట్లు - ఆయనొక్కడే దైవకుమారుడు మాత్రం కానే కాడు. దీనికి బైబిల్లోనే అనేక రుజువులున్నాయి. ఇలాంటి దైవకుమారులు భారతదేశంలో ప్రతితరంలోనూ వేలాదిమంది పుట్టారు. ఇప్పటికీ పుడుతున్నారు. దైవకుమారులే కాదు, సరాసరి 'దైవమే' ఇక్కడ అనేక అవతారాలు దాల్చాడు. ఎందుకంటే భారతదేశం పవిత్రభూమి కాబట్టి. ఈ దేశంలో ఏ మహనీయుడినీ శిలువ వెయ్యలేదు రాళ్ళతో కొట్టి చంపలేదు గాబట్టి.

11. క్రీస్తును నమ్మితే రక్షింపబడతారన్నది కూడా అబద్దమే. ఇది కూడా సెయింట్ పాల్ కల్పనే గాని నిజం కాదు. ఒకరిని నమ్మినంత మాత్రాన 'రక్షణ' ఏనాటికీ ఎవరికీ కలుగదు. అసలు 'రక్షణ' అనేదే ఒక బూటకపు మాట. సృష్టి నియమాలు అర్ధంగాని వాళ్ళు సృష్టించిన అబద్ధం ఇది.

జ్ఞానం, మోక్షం అనేవి అసలైన కాన్సెప్ట్ లు అంతేగాని 'రక్షణ' కాదు. ఇవి ఒకరిని నమ్మి మతం మారినంత మాత్రాన రావు. జీవితాన్ని పశుత్వంలోనుంచి దైవత్వం లోకి ఉద్ధరించుకుంటేనే ఇవి సాధ్యమౌతాయి. వీటికోసం ఒకరిని రక్షకుడుగా నమ్మవలసిన అవసరం లేదు.

12.  హిందూమతం (సనాతన ధర్మం) అనేది క్రీస్తుకు ముందు అనేకవేల సంవత్సరాల నుంచీ ఉన్నది. ఇంకా ముందుకు కూడా ఉంటుంది. దానిలో ఎందఱో క్రీస్తులు జన్మించారు. ఇప్పటికీ జన్మిస్తున్నారు. కనుక హిందువైనవాడు క్రైస్తవంలోకి మారవలసిన పని లేదు. అలా మారినందువల్ల వారికి కొత్తగా ఒరిగేది కూడా ఏమీ ఉండదు. అలా ఒరుగుతుందని ఎవరైనా ప్రచారం చేస్తుంటే అది అబద్దం మాత్రమే. హిందూమతంలో లేనిది ప్రపంచంలోని ఏ మతంలోనూ లేదు. ఇందులో ఉన్నన్ని సౌకర్యాలూ సౌలభ్యాలూ ఇంకే మతంలోనూ లేవు. ఉండవు కూడా.

13. క్రీస్తు చెప్పిన నిజమైన బోధనలు వేరు. నేడు క్రైస్తవం చెబుతున్న బోధనలు పూర్తిగా వేరు. నేటి క్రైస్తవం అంతా ఒక మాయ బిజినెస్ మాత్రమే. కులద్వేషాన్ని ఎక్కించి, డబ్బు ఎర చూపి, సైతాన్ అనీ, నరకం అనీ భయపెట్టి, వారికి పనికొచ్చే కొన్ని బైబిల్ పడికట్టు పదాలతో అజ్ఞానులను అమాయకులను బ్రెయిన్ వాష్ చేస్తున్న క్రైస్తవ మతబోధకులే నిజమైన 'సైతాన్ వారసులు'. తమ మాతృభూమికీ, తల్లిలాంటి సొంత మతానికీ వాళ్ళు తీరని ద్రోహం చేస్తూ పాపం మూట గట్టుకుంటున్నారు. ఈ విషయం వాళ్లకు తెలియడం లేదు.

14. నిజమైన హిందువు క్రీస్తును తప్పకుండా గౌరవిస్తాడు. అంతెందుకు? ప్రతి మహనీయుడినీ గౌరవించమనే హిందూమతం చెబుతుంది. కానీ దానికోసం క్రైస్తవం లోకి మారవలసిన పనీ లేదు. తల్లిలాంటి మన హిందూ మతాన్ని తిట్టవలసిన పనీ లేదు. అలా చెయ్యడమే నిజమైన దైవద్రోహం అవుతుంది.

15. మనుషుల పాపాల కోసం క్రీస్తు చనిపోలేదు. ఇది పచ్చి అబద్దం. ఇదంతా సెయింట్ పాల్ అల్లిన కట్టు కధ. యూదు సమాజంలో ఉంటూ వారికి వ్యతిరేకమైన, ఇండియాలో తను నేర్చుకున్న సనాతనధర్మపు (హిందూమతపు) భావాలను బలవంతంగా ప్రచారం చేస్తూ, వాళ్ళను సరిదిద్దుదామని, యెహోవా మతపు మూర్ఖమైన నమ్మకాల నుంచీ, ఆచారాలనుంచీ వారిని బయటకు తెద్దామని బలవంతంగా ప్రయత్నించడం వల్లే, యూదు మతాధికారులతో శత్రుత్వం పెంచుకుని, ఆయన శిలువ వెయ్యబడ్డాడు. అంతేగాని ఈ సంఘటనకు - 'మనందరి పాపాల కోసం ఆయన శిక్షకు గురయ్యాడు' అని చెప్పడం వాస్తవ వక్రీకరణ మాత్రమే. ఈ వక్రీకరణను మొదలుపెట్టింది సెయింట్ పాల్. ఆ తర్వాత పోషిస్తూ వస్తున్నది చర్చ్. అంతేగాని ఇది నిజం కాదు. రెండువేల సంవత్సరాలుగా ఒక అబద్దాన్ని మళ్ళీమళ్ళీ చెప్పినంత మాత్రాన అది నిజం కాలేదు.

16. తన జీవితంలోని చేదు వాస్తవాలను జీర్ణించుకోలేక, లోకం మీద కసితో, అప్పటిదాకా యూదులు అనుసరిస్తున్న యెహోవా మతాన్ని (Old Testament) మారుద్దామని ప్రయత్నిస్తూ తననొక క్రొత్త మహాప్రవక్తగా ప్రకటించుకోవడమూ,ఆ క్రమంలో మతాధికారులకూ,రాజుకూ కోపాలు తెప్పించి చావువరకూ తెచ్చుకోవడమే  జీసస్ చేసిన తప్పు.

ఆచరణాత్మకం కాని ఈ మొండిపద్ధతే ఆయనకు ముప్పు కొని తెచ్చింది. అయితే, ఆ తర్వాతి కాలంలో దీనిని తెలివిగా క్యాష్ చేసుకున్న సెయింట్ పాలూ, ఆ తర్వాతి చర్చి అధికారులూ, జీసస్ ను అడ్డు పెట్టుకుని, మనీ పవర్ ఉపయోగించి, క్రైస్తవాన్ని ఒక ప్రపంచవ్యాప్తమైన వ్యాపారంగా ప్రోమోట్ చెయ్యడంలో విజయం సాధించారు. ఈ వ్యాపారంలో అమాయకులు అజ్ఞానులు సమిధలై మతాలు మారుతున్నారు.

17. క్రైస్తవమూ ఇస్లామూ చెప్పే శాశ్వత నరకమూ శాశ్వత స్వర్గమూ అనేవి అబద్ధాలు. అవి తెలిసీ తెలియని మాటలు. సృష్టిలో శాశ్వతం ఏదీ లేదు. అలాగే స్వర్గమూ నరకమూ కూడా శాశ్వతాలు కావు. కానీ ఈ అబద్ధాలను చెబుతూ రెండువేల ఏళ్ళుగా క్రైస్తవమూ, 1400 ఏళ్ళుగా ఇస్లామూ లోకాన్ని వంచిస్తూ మోసం చేస్తున్నాయి. ఇది సత్యం.

18. అలాగే క్రీస్తు రెండవ రాకడ అనేది కూడా అబద్దమే. తమ జీవితకాలంలోనే క్రీస్తు తిరిగి వస్తాడని క్రీస్తు శిష్యులూ (Apostles), సెయింట్ పాలూ నమ్మారు. అందరికీ బోధించారు. ఎదురుచూచారు. కానీ వారందరూ చనిపోయారు. క్రీస్తు రాలేదు. ఈ రెండువేల సంవత్సరాలుగా ప్రతితరంలోనూ ఇదే అబద్దాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ లోకాన్ని మోసం చేస్తున్నారు క్రైస్తవ మతాధిపతులు. కానీ క్రీస్తు వస్తున్న జాడా జవాబూ ఎక్కడా కనిపించడం లేదు. ఇంకొక రెండు వేల ఏళ్ళు గడిచినా ఆయన రాడు. అది జరిగే పని కాదు. ఎందుకంటే బైబిల్లోని అనేక అబద్దాల లాగా ఇది కూడా అబద్దమే కాబట్టి.

19. క్రైస్తవులు ప్రచారం చేసే అంతిమతీర్పు అనేది కూడా అబద్దమే. ఏదో ఒక రోజున అంతిమతీర్పు జరుగుతుందనీ, అప్పటివరకూ బ్రతికున్న, చనిపోయిన మనుషులను అందరినీ - క్రీస్తును నమ్మినవారు, క్రీస్తును నమ్మనివారు అనే రెండు వర్గాలుగా విడదీసి మొదటి వర్గాన్ని స్వర్గానికీ, రెండవ వర్గాన్ని నరకానికీ దేవుడు పంపుతాడనీ నమ్మడం అవివేకం. ఇది కూడా సత్యం కాదు. 

సృష్టిలో మనం చేసిన మంచి పనులకు గానీ చెడు పనులకు గానీ ఎక్కడికక్కడే తీర్పు వస్తూ ఉంటుంది. శిక్షలు పడుతూ ఉంటాయి. ఇది సనాతనధర్మం చెప్పే కర్మసూత్రం. ఇది సత్యం. అంతేగాని తెలివితక్కువ సెమిటిక్ మతాలు చెప్పే "అంతిమ తీర్పు" అనేది అబద్దం. తర్కవిరుద్ధం కూడా.

బైబిల్ ను క్షుణ్ణంగా చదివితే, హిందూధర్మాన్ని సక్రమంగా అర్ధం చేసుకుంటే, చరిత్రలోని వాస్తవాలను నిస్పక్షపాతంగా గమనిస్తే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. జ్యోతిష్యశాస్త్రం కూడా ఇవే విషయాలను ధృవీకరిస్తోంది.

(అయిపోయింది)