Our Ashram - A beacon light to the world

17, అక్టోబర్ 2017, మంగళవారం

జీసస్ క్రీస్ట్ జాతక విశ్లేషణ - 10

మనం ఇంతసేపూ ఒక కోణంలోనే పరిశోధన చేశాం. ఈ పద్దతిని ఇండక్టివ్ లాజిక్ అంటాం. అదేంటంటే - Star of Bethlehem, సింహరాశి, అర్ధరాత్రి, లూకా సువార్త, జీసస్ జీవితంలో దశలు, సంఘటనలు - ఈ సమాచారం ఆధారంగానే మనం ఇప్పటిదాకా చరిత్రను జల్లెడపడుతూ మనకు కావలసిన తేదీకోసం వెదికాం. ఇవన్నీ కూడా కొన్ని సిద్ధాంతాలు (postulates) మాత్రమే. ఇవి నిజం కావచ్చు. కాకపోవచ్చు. ఇప్పుడు దీనికి పూర్తి వ్యతిరేక కోణంలో పరిశోధన చేద్దాం. అంటే డిడక్టివ్ లాజిక్ ను ఇప్పుడు ఉపయోగించి చూద్దాం.

పైన అనుకున్న అంశాలన్నీ పక్కన పెట్టి, ఒక అవతార పురుషుని స్థాయి జాతకంలో ఉండవలసిన గ్రహస్థితులు BC 3 నుంచి BC 1 వరకూ ఎప్పుడున్నాయో గమనించి ఆ సమయానికి జీసస్ జీవితంలోని సంఘటనలు సరిపోతాయా లేదా చూద్దాం. ఎందుకంటే - ఈ కోణాన్ని కూడా చూడకుండా మనం ఒక నిర్ణయం చెయ్యకూడదు.

జ్యోతిశ్శాస్త్రం అనేది పూర్తిగా లాజిక్ మీద ఆధారపడి ఉన్న శాస్త్రమని ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను. కనుక లాజిక్ లో అన్ని కోణాలూ పరిశీలించకుండా మనం ఒక నిర్ధారణకు రావడం తప్పు అవుతుంది.

ఈ దృక్కోణంలో మళ్ళీ BC 3 నుంచి BC 1 వరకూ ఉన్న 36 నెలల గ్రహస్థితులను జల్లెడ పట్టగా ఏప్రియల్ నెల 03 BC లో మాత్రమే అలాంటి మహనీయుని జననాన్ని సూచించే స్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అదే నెలలో మాత్రమే గురువుతో బాటు, కుజుడు, శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నారు. చంద్రుడు నెలలో ఒకసారి ఎలాగూ ఉచ్చస్థితిలో ఉంటాడు. కనుక మన దృష్టి ఏప్రియల్ 03 BC మీదకు ప్రసరిస్తున్నది.

ఆ నెలలో శనిచంద్ర యోగాలున్న కొన్ని రోజులను గమనిద్దాం.


18-4-03 BC; Night 11.55 hours
Bethlehem, West Bank
ఈ నెలలో సంక్రాంతి 17 తేదీన వస్తున్నది. కనుక మొదటిగా 18-4-03 BC నాటి గ్రహస్థితులను గమనిద్దాం. ఆ రోజున గజకేసరి యోగం కూడా సప్తమంలో ఉన్నది. శుక్ల సప్తమి పుష్యమీ నక్షత్రం అయింది. ఇప్పుడు దశలను పరిశీలిద్దాం.  పన్నెండో ఏట బుధ - రాహు దశ నడిచింది. బుధుడు నవమాదిపతిగా రాహువు దూర దేశ సంచార కారకునిగా దూరదేశ యాత్ర చూచాయగా సరిపోతున్నది. ఆ తర్వాత నడిచిన బుధదశ మిగులు, మరియు కేతు దశ ఏడేళ్ళు అంతగా దూరదేశంలో ఆధ్యాత్మిక సాధనను సూచించడం లేదు. తర్వాత వచ్చిన శుక్ర - సూర్య దశలో స్వదేశానికి రావడం సూచన లేదు.ఆ తర్వాత వచ్చిన శుక్ర - కుజ - రవి దశలో శిలువ శిక్ష సూచన కూడా అంత బాగా సరిపోవడం లేదు. కనుక ఈ తేదీని తిరస్కరించడం జరిగింది.

ఆ తర్వాత ఇంకో తేదీని పరిశీలిద్దాం.


22-4-03 BC Night 11.55 hours
Bethlehem, West Bank
ఇక్కడ ఉన్నది 22-4-03 BC నాటి అర్ధరాత్రి గ్రహస్థితి. ఆ రోజు ఉత్తరానక్షత్రం శుక్లదశమి అయింది. ఇందులో కుజుడు, గురువు, శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నారు. నవాంశలో రాహుకేతువులు ఉచ్చస్థితిలో ఉన్నారు. అయితే, వృషభం నాలుగోపాదంలో ఉండటం వల్ల శని నవాంశలో నీచలో ఉన్నాడు. సామాన్యజనంతో జీసస్ కున్న సంబంధం వల్ల, కష్టాలతో కూడిన జీవితం వల్ల, శనీశ్వరుని నీచత్వం సరిపోతున్నది. కానీ, గురువుగారు సింహరాశిలో లేనందువల్ల Star of Bethlehem అక్కడ ఏర్పడదు. అయితే ఇది లేకపోయినా పరవాలేదని మనం అనుకున్నాం గనుక ఈ పాయింట్ ను లెక్కించనవసరం లేదు.

ఇప్పుడు దశలను పరిశీలిద్దాం.

పన్నెండేళ్ళ వయస్సులో ఈ జాతకంలో చంద్ర - శుక్ర దశ నడిచింది.చంద్రుడు సప్తమాధిపతిగా నవమంలో ఉంటూ ఆధ్యాత్మిక విద్యకోసం దూరదేశ ప్రయాణాన్ని సూచిస్తున్నాడు. తర్వాత వచ్చిన ఏడేళ్ళ కుజదశలో కుజుని ఉచ్చస్తితిని బట్టి ఇండియాలో నివసించి ఆత్మవిద్యను సాధన చేసినట్లు సరిపోతున్నది. తర్వాత రాహుదశలోని పదకొండు ఏళ్ళు కుంభరాశిలోని రాహువు వల్ల టిబెట్, నేపాల్ పరిసర ప్రాంతాల్లోని 'హెమిస్' బౌద్ధమఠంలో ఉండి బౌద్ధాన్ని అధ్యయనం చేసిన సూచన సరిపోతున్నది. ఆ తర్వాత రాహు-బుధ-రాహువులో గాని రాహు-బుధ-గురువులో గాని 30 ఏళ్ళ వయసులో తిరిగి తన దేశానికి వెళ్లి అక్కడ జాన్ ద బాప్టిస్ట్ చేతిలో బాప్టిజం పొందిన సూచనలు కూడా సరిపోతున్నాయి. ఎందుకంటే రాహువు కుటుంబ స్థానంలో ఉంటూ తన కుటుంబం దగ్గరకు తను చేరుకోవడం సూచిస్తున్నాడు. బుధుడు నవమాధిపతిగా సుఖస్తానంలో ఉంటూ తిరిగి తన స్వదేశానికి చేరడం సూచిస్తున్నాడు. పోనీ గురు విదశ అనుకున్నా కూడా, గురువు సప్తమంలో ఉచ్చస్థితిలో ఉంటూ లగ్నాన్ని చూస్తున్నాడు. కనుక సరిపోతున్నది.

33 ఏళ్ళ వయసులో శిలువ వెయ్యబడిన సంఘటన సమయంలో రాహు-శుక్ర-రాహుదశ నడిచింది. రాహువు మారక స్థానంలో ఉన్నాడు. శుక్రుడు షష్టాధిపతి అయిన బుధుని నక్షత్రంలో ఉచ్చస్థితిలో ఉంటూ మతపరమైన గొడవలను సూచిస్తున్నాడు. కనుక శిలువశిక్ష కూడా చూచాయగా సరిపోతున్నది. ఆరూఢలగ్నమైన కన్యనుంచి కూడా రాహువు యొక్క ఆరవ భావస్థితి, శుక్రుని సప్తమ మారకభావ స్థితులు శిలువ శిక్షతో సరిపోతున్నాయి.

ఇది ఏప్రిల్ మాసం గనుక చలి తగ్గిపోయి ఉండటం వల్ల కాపరులు రాత్రిళ్ళు ఆరుబయట ఉంటూ గొర్రెలకు కాపలా కాయడం సంభవమే. దీన్ని బట్టి లూకా సువార్తలో వ్రాయబడిన విషయం నిజమే కావచ్చు.

పంచమంలో లగ్నాధిపతి శని ఉంటూ ఆధ్యాత్మికతను సూచిస్తున్నాడు. కానీ ఆయనతో బాటు అష్టమాధిపతి అయిన సూర్యుడు కూడా ఉండటం వల్ల తన శిష్యుల చేతిలోనే తనకు ప్రమాదం ఉందన్న సూచన కూడా సరిపోయింది.    

ఈ జాతకంలో గ్రహాలు చాలావరకు (ఒక్క శనీశ్వరుడు తప్ప) మంచి స్థితులలో ఉంటూ ఒక మహనీయుని జననాన్ని సూచిస్తున్నాయి. కనుక ఇది జీసస్ జాతకం అయి ఉండవచ్చని భావిద్దాం.


23-4-03 BC Night 11.55 hours
Bethlehem - West Bank
దాదాపుగా ఇదే గ్రహస్థితి మరుసటి రోజైన 23-4-03 BC శుక్ల ఏకాదశి రోజుకూడా ఉన్నది. కానీ ఆసమయంలో హస్తా నక్షత్రం - 3 పాదం అయినందున దశలు మారిపోతాయి. ఈ రోజును కూడా పరిశీలిద్దాం. పన్నెండేళ్ళ వయస్సులో ఈ జాతకానికి కుజ - చంద్ర దశ జరిగింది. కుజుడు బాధకునిగా లగ్నంలో ఉచ్చ స్థితిలో ఉంటూ బాధాకరమైన జీవితాన్ని సూచిస్తున్నాడు. చంద్రుడు నవమంలో ఉంటూ దూరదేశ ప్రయాణాన్ని సూచిస్తున్నాడు.కనుక ఇండియాకు బయలు దేరడం సరిపోయింది. ఆ తర్వాత వెంటనే మొదలైన 18 సంవత్సరాల రాహుదశ ఈయన జీవితంలోని missing years ను సరిగ్గా సూచిస్తున్నది. 30 ఏళ్ళ వయసులో జరిగిన రాహు- కుజ దశలో ఈయన తిరిగి స్వదేశానికి రావడం కూడా సరిపోతున్నది. ఆ తర్వాత మొదలైన గురు మహర్దశలో గురు అంతరంలో జాన్ ద బాప్టిస్ట్ దగ్గర ఉపదేశం పొందటం, అలాగే గురు-గురు- రాహు దశలో 7-4-30 AD రోజున న్యూటన్ లెక్కించిన తేదీ నాడు శిలువ శిక్షకు గురవ్వడం సరిపోతున్నది. గురు - రాహు సంబంధంతో గురుచండాల యోగం కలిగి, తన వారి చేతిలోనే మోసానికి గురై అన్యాయంగా శిక్షకు పాత్రుడైనట్లు సూచన ఉన్నది.

ఈ రెండు తేదీలలో గమనిస్తే - 22 కంటే 23 వ తేదీ జీసస్ జీవిత విశేషాలతో దశల పరంగా కరెక్ట్ గా సరిపోతున్నది. ఎందుకంటే మహనీయుల జననం సామాన్యంగా జరిగే ఏకాదశి కావడం ఒకటి. దశలు సరిగ్గా సరిపోవడం - ముఖ్యంగా 18 missing years సరిగ్గా రాహుదశతో సరిపోతూ సంచార జీవితాన్ని కరెక్ట్ గా సూచిస్తున్నందున 23-4-03 BC ని జీసస్ జనన తేదీగా లెక్కించవచ్చు.

కానీ ఈ పద్దతితో కొన్ని ఇబ్బందులున్నాయి. గురువుగారు సింహరాశిలో లేడు గనుక Star of Bethlehem సింహరాశిలో ఏర్పడదు. అలాంటప్పుడు, ఇంకేదో ప్రత్యేక నక్షత్రం అనేది అక్కడ కనిపించి ఉండవచ్చని భావించాలి. కానీ అలాంటి ప్రత్యేక నక్షత్రం అంటూ ఏదీ ఆ ఏళ్ళలో ఆకాశంలో కనిపించినట్లు ఖగోళ రుజువులు లేవు.

కానీ - ఒక మహనీయుడైన వ్యక్తి జననం ఈ సమయంలో జరిగే అవకాశం తప్పకుండా ఉన్నందువల్ల, ఇది జీసస్ జననతేదీ అని భావించవచ్చు. ఇప్పుడు అదే నెలలో మరికొన్ని రోజులను గమనిద్దాం.

(ఇంకా ఉంది)