Everything is real, because the seer is real

28, సెప్టెంబర్ 2017, గురువారం

జీసస్ క్రీస్ట్ జాతక విశ్లేషణ - 2

17-6-02 BC నాడు గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి.

ప్రదేశం :-- బెత్లేహెం 35E12; 31N43; Time Zone +2.00 East of GMT. (ప్రస్తుతం పాలెస్టీన్ లో ఉన్నది)
సమయం:--23-40 Hours.

ఖగోళ సైంటిస్టులు చెబుతున్నట్లుగా సింహరాశిలో ఆ రోజున గురువు శుక్రుడు దాదాపుగా డిగ్రీ కంజక్షన్ లో ఉన్నమాట నిజమే. ఈ స్థితివల్ల సింహరాశిలో ఒక వినూత్నమైన వెలుగు కనిపించేమాట కూడా నిజమే. అయితే వారితో పాటుగా కేతువు కూడా అక్కడే ఉన్నాడు. అయితే, ఆరోజున బెత్లేహెంలో అర్ధరాత్రి సమయానికి మీనలగ్నం ఉదయిస్తున్నది. దానినుంచి సింహరాశి ఆరవది అవుతున్నది. ఆరవ ఇల్లు శుభసూచకం కాదు. కనుక three wise men చేత చాలా గొప్పగా చూడబడిన ఈ గ్రహస్థితి, త్రికస్థానాలలో ఒకటైన షష్ఠంలో పడటం చేత, నిజానికి అదంత గొప్ప యోగమేమీ కాదు.

పైగా, ఈ జాతక చక్రం ఒక అవతార పురుషుని జాతకాన్ని ప్రతిబింబించడం లేదు. ఎందుకంటే ఒక అవతార పురుషుని జాతకం ఎలా ఉంటుందో శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, శ్రీరామకృష్ణుల జాతకాలను బట్టి మనకు ఆ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసు. అవతార పురుషుని జాతకమంటే మాటలు కాదు. ముఖ్యమైన గ్రహాలన్నీ ఉచ్చస్థితులలో ఉండాలి. ఉత్తమమైన శుభలక్షణాలు ఆ చార్ట్ లో మనకు కొట్టొచ్చినట్లు కనపడాలి.దైవశక్తిని సూచించే ఉన్నతమైన యోగాలు దానిలో స్పష్టంగా కనిపించాలి. కానీ ఈ చార్ట్ లో అలాంటి లక్షణాలు ఏవీ లేవు (నవాంశలో గురువు, శనుల ఉచ్చస్థితి తప్ప). కానీ ఈ ఒక్క లక్షణం ఒక గొప్ప దైవాంశ సంభూతుని జాతకాన్ని చూపదు. మహా అయితే జీవితమంతా కష్టాలు పడిన ఒక భక్తుని జాతకాన్ని చూపుతుంది అంతే !

దారాకారకునిగా శనీశ్వరుడు సున్నా డిగ్రీలలో ఉంటూ వివాహం లేదని,ఒకవేళ ఉన్నా అది బాగా ఆలస్యం అవుతుందని సూచిస్తున్నాడు. జననం పౌర్ణమి దగ్గరలో అవడంతో వివాహం లేదనీ, ఒకవేళ ఉన్నా అదేమంత సుఖంగా ఉండదన్న సూచన ఉన్నది.

లగ్నాత్ పంచమం ప్రేమకు, శిష్యులకు, అనుచరులకు సూచిక. సప్తమాధిపతి అయిన బుధుడు ఆ స్థానంలో నవమాధిపతి అయిన కుజునితో కలసి ఉంటూ తన శిష్యురాలితో జరిగిన ప్రేమవివాహాన్ని సూచిస్తున్నాడు. అయితే కుజుని నీచస్థితి వల్ల ఇది అందరికీ సమ్మతం కాదని కూడా సూచన ఉన్నది.

లగ్నారూఢమూ, చంద్రలగ్నమూ మకరం అయింది. అక్కడ నుంచి సప్తమంలో నవమాధిపతి అయిన బుధుడు నీచ కుజునితో కలసి ఉంటూ పరాయి మతాన్ని అధ్యయనం చేస్తాడని సూచిస్తున్నాడు. బహుశా ఇది ఈమధ్యన పరిశోధకులు భావిస్తున్నట్లుగా బౌద్ధం కావచ్చు. టిబెట్ లో ఈయన బౌద్ధాన్ని అధ్యయనం చేసినట్లు ఆధారాలున్నాయి. కానీ సప్తమంలో ఉన్న కుజ (లాభాదిపతిగా శిష్యులను, అనుచరులను సూచిస్తూ) బుధులు (నవమాధిపతిగా మతపరమైన సంబంధాన్ని సూచిస్తూ) తన శిష్యురాలైన మేరీ మేగ్దలీన్ ను ఈయన వివాహం చేసుకున్నాడని, కుజుని నీచస్థితి వల్ల ఇది ఆయన ఫాలోవర్స్ లోనే అందరికీ సమ్మతం కాలేదని కూడా చెబుతోంది.

కారకాంశా, సూర్యలగ్నమూ కలసి మిధునమే అయింది. ఇక్కడ నుంచి మూడింట ఉన్న శుభగ్రహాలైన శుక్రుడు గురువు కేతువు (సూర్యునికి ప్రతినిధి) వల్ల ఈయనది అల్పాయుష్షు కాదనీ అందరూ అనుకుంటున్నట్లుగా ఈయన 33 ఏట చనిపోలేదనీ చెబుతోంది. పరిశోధనలలో వెల్లడౌతున్న వాస్తవాలను బట్టి ఈ విషయాన్ని ప్రస్తుతం కోట్లాదిమంది నమ్ముతున్నారు. అదే విధంగా పంచమాధిపతి శుక్రుడు, సప్తమాధిపతి గురువు కలసి తృతీయంలో ఉంటూ తన శిష్యురాలినే తను వివాహం చేసుకున్నాడని మళ్ళీ మళ్ళీ సూచిస్తోంది.

ఇప్పుడు క్రాస్ చెక్ కోసం దశలను పరిశీలిద్దాం.

ఆరోజున ధనిష్టా నక్షత్రం అయింది. కనుక జనన సమయంలో కుజ మహాదశ నడుస్తూ ఉంటుంది. అందులోనూ కుజ - రాహు దశ ఆ సమయంలో నడిచింది. ఇది ఒక గొప్ప జాతకుని జన్మకు సూచన దశ కాదు.

అనుమాన నివృత్తి కోసం ఇంకా పరిశీలిద్దాం. జీసస్ జీవితంలో ఆయన 12 ఏళ్ళ వయసు నుంచి 30 ఏళ్ళ వయసు వరకూ దాదాపుగా 18 ఏళ్ళ పాటు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ఈ 18 ఏళ్ళను missing years అని అంటారు. దశల పరంగా ఈ ఘట్టం సరిపోతుందో లేదో చూద్దాం.

ఈ సమయంలో ఈ జాతకంలో రాహు దశ నడిచింది. రాహువు పన్నెండులో ఉన్నది గనుక ఉన్న ప్రదేశాన్ని వదలి దూరదేశానికి పోవడం కనిపిస్తున్నది. సరిగ్గా పన్నెండేళ్ళ వయసులో ఈ జాతకంలో రాహు - బుధ దశ నడిచింది. బుధుడు పంచమంలో ఉంటూ మతపరమైన అన్వేషణను సూచిస్తున్నాడు. కనుక ఆ అన్వేషణలో దూరదేశమైన ఇండియాకు వచ్చాడని మనం భావించవచ్చు. ఈ థియరీని చాలామంది క్రైస్తవులు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే, ఆధ్యాత్మికతను వెదుక్కుంటూ జీసస్ ఇండియాకు వచ్చాడంటే అది ఆయన్ను చులకన చేస్తుందని వారి భావన. కానీ పరిశోధకులు ఇది నిజమే అని నేడు నమ్ముతున్నారు. దానికి చాలా నిదర్శనాలున్నాయి. సరే, ఆ విషయం అలా ఉంచుదాం.

18 ఏళ్ళ తర్వాత, తన 30 వ ఏట తిరిగి తన స్వదేశానికి ఆయన వచ్చాడు. అప్పుడు ఆయనకు రాహుదశ అయిపోయి గురుదశ మొదలైంది. గురువులో శని అంతర్దశ జరుగుతున్నది. శని నాలుగో ఇంట్లో ఉంటూ స్వస్థలాన్ని సొంత ఇంటినీ సూచిస్తున్నాడు గనుక, ఆ సమయంలో ఒక గురువుగా తన దేశానికి తన ఇంటికి తాను తిరిగి వచ్చాడన్నది బాగానే ఉంది. కానీ తీవ్ర కర్మగ్రహాలైన గురువు-శని దశ మంచిది కాదు గనుక ఈయనకు స్వదేశానికి తిరిగి రావడం వల్ల మంచేమీ జరగదన్న సూచన కూడా సరిపోయింది.

తర్వాత జరిగిన గురు-బుధ దశలో, బుధుడు పంచమంలో ఉన్నాడు గనుక మత ప్రచారం మొదలు పెట్టడం, ఒక గురువుగా చెలామణీ కావడం, గురువు యొక్క షష్ఠ స్థితివల్ల ఆ క్రమంలో శత్రువులను పెంచుకోవడం అన్నీ సరిపోయాయి.

ఇకపోతే ఈయనకు 33 ఏళ్ళ వయస్సులో శిలువ వెయ్యబడటం జరిగింది. అప్పుడు ఈ జాతకంలో గురు-కేతుదశ గాని గురు-శుక్రదశ గాని జరిగింది. ఈ ముగ్గురూ శత్రువులను, బాధలను, గొడవలను సూచించే ఆరో ఇంట్లో ఉన్నారు గనుక తన సొంత మనుషులైన యూదులతో గొడవ పడటమూ, వారిచేత శిలువ వెయ్యబడటమూ అంతా సరిపోయింది.

ఈ విధంగా దశలను బట్టి చూస్తే ఈ జాతకం సరిపోయినట్లుగా ఉన్నప్పటికీ, ఒక దైవాంశ సంభూతుని లక్షణాలు మాత్రం ఈ జాతకంలో లేవు. పైగా పంచమంలో పితృస్థానాదిపతి అయిన కుజుడు, మాతృస్థానాధిపతి అయిన బుధునితో కలసి నీచలో ఉండటం అంత మంచి సూచన కాదు. ఈ కాంబినేషన్ మీద నేనెక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ నిష్పక్షపాతమైన ఎనాలిసిస్ చేసేటప్పుడు మాట్లాడక తప్పదు.

జీసస్ జననం వెనుక ఒక రహస్యం దాగిఉన్నదని ఈ గ్రహయోగం చెబుతున్నది. అదేమంటే - Immaculate Conception అనేది ఒక భ్రమా, రెండు వేల సంవత్సరాలుగా క్రిస్టియన్ మతాధిపతులు లోకాన్ని మోసం చేస్తూ చెబుతున్న ఒక అబద్దమూ అని ఈ గ్రహ యోగం చెబుతోంది. నిజానికి స్త్రీపురుష సంయోగం లేకుండా ఒక శిశువు పుట్టడం అనేది ఎన్నటికీ జరిగే పని కాదు. ఒకవేళ టెస్ట్ ట్యూబ్ బేబీ ఎలా పుడుతోంది? అని ప్రశ్న వచ్చినా అందులో కూడా స్పెర్మ్ మరియు ఎగ్ కలవకుండా ఏ శిశువూ పుట్టదు.

పితృ స్థానాధిపతి అయిన కుజుడు నీచలో ఉంటూ, మాతృస్థానాధిపతి అయిన బుదునితో కలసి బుద్ధిస్థానంలో ఉండటం ఏం చెబుతుందంటే - జీసస్ తల్లిదండ్రులు ఇద్దరూ కలసి జీసస్ అసలు తండ్రి ఎవరు అన్న రహస్యాన్ని బుద్ధి పూర్వకంగా దాస్తున్నారని చెబుతోంది. నవీన కాలపు పరిశోధనలను బట్టి అప్పటి యూదుల హై ప్రీస్ట్ అయిన జకరియాస్ అనేవాడు గాని, లేదా "టైబీరియస్  జూలియస్ అబ్దేస్ పాంటెరా" అనే రోమన్ సైనికుడు గానీ జీసస్ నిజమైన తండ్రి అని అనేకమంది నేడు విదేశాలలో నమ్ముతున్నారు. ఈ థియరీకి ఆధారాలను ముందు పోస్ట్ లలో చూపిస్తాను.

కనుక పెళ్ళికి ముందే మేరీ గర్భవతిగా ఉన్నదన్నది నిజమై ఉండవచ్చు. ఈ సంగతి జోసెఫ్ కు తెలిసినా, ఈ కారణం చేత మేరీని వెళ్ళగోడితే, ఆనాటి న్యాయం ప్రకారం ఆమెను రాళ్ళతో కొట్టి చంపేస్తారు గనుక, ఆమెను కాపాడటం కోసం, తానే జీసస్ తండ్రినని కొంతకాలం నటించాడని నేడు సైంటిఫిక్ గా ఆలోచించే విదేశీయులు అనేకులు నమ్ముతున్నారు.

దీనికి సపోర్ట్ గా వారు బైబుల్ నుంచీ, టాల్మద్ నుంచీ ఆధారాలు చూపుతున్నారు. సర్వోన్నతుడూ, నీతిమంతుడూ అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్త్రీని, అందులోనూ మరొక వ్యక్తి భార్యను, సెక్సువల్ గా పాల్పడే పనిని ఎన్నటికీ చెయ్యడనీ, కనుక మేరీ గర్భవతి అయినది ఒక మనిషితోనే గాని దేవునితో కాదనీ యూదులు ఈనాటికీ వాదిస్తారు. అందుకే యూదులు ఈనాటికీ ఓల్డ్ టెస్టమెంట్ నే నమ్ముతారు గాని న్యూ టెస్టమెంట్ ను నమ్మరు.

ఈ కారణం చేతనే, జీసస్ పుట్టిన తర్వాతగానీ, శిలువ వెయ్యబదిన ఘట్టంలో గానీ, మదర్ మేరీ మాత్రమే ఎక్కువగా ఈయనతో కనిపిస్తుంది గాని, తండ్రి జోసెఫ్ ఏమయ్యాడో కనిపించడు. జీసస్ కధలోనుంచి జోసెఫ్ సడన్ గా మాయమై పోతాడు. ఒకసారి మేరీ రాళ్ళతో కొట్టించుకునే శిక్షనుంచి తప్పించుకున్నది, తాను ఆమెను రక్షించాను అన్న నమ్మకం కలిగాక, జోసెఫ్ వీరినుంచి దూరమై ఉంటాడు. లేదా వీరిని దూరం పెట్టి ఉంటాడు.

బహుశా ఈ విషయం జీసస్ కు కూడా తెలుసు. అందుకనే తాను పెద్దయ్యాక, యూదులు ఒకామెను తీసుకొచ్చి -'ఈమె పరపురుషులతో సంబంధాలు కలిగి ఉన్నది. మోషే చెప్పిన మన న్యాయశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి' అని చెప్పినపుడు - 'వద్దు. అలా చెయ్యద్దు. మీరందరూ నీతిమంతులా? మీలో ఈ తప్పును చెయ్యని వాళ్ళు ముందుకొచ్చి ఆమెమీద మొదటి రాయిని వెయ్యండి.' అని వారితో వాదించి ఆమెను కాపాడతాడు. వాళ్ళు నిజంగా నీతిమంతులు కాకపోయినా కనీస మనస్సాక్షి ఉన్న మనుషులు గనుక తలలు వంచుకుని వెళ్ళిపోతారు.

మగవాడూ ఆడదీ కలసి సెక్స్ ని ఎంజాయ్ చేసినప్పుడు, శిక్ష అనేది ఒక్క ఆడదానికే ఎందుకు పడాలి? అన్న మానవత్వ భావన జీసస్ కు ఉండి ఉండవచ్చు, అదీగాక, రాళ్ళతో కొట్టి భయంకరంగా చంపాల్సినంత తప్పుగా అది ఆయనకు తోచి ఉండకపోవచ్చు. మోషే న్యాయశాస్త్రాన్ని గనుక నిజంగా అమలు చెయ్యవలసి వస్తే నేడు ప్రపంచంలో ఎవరూ బ్రతికి ఉండరు మరి !! ఎందుకంటే మానసికంగా చేసినా శరీరంతో చేసినా తప్పు తప్పే గనుక (అది నిజంగా తప్పే గనుక అయితే) అందరూ ఒకరినొకరు రాళ్ళతో కొట్టుకుని చావాల్సి వస్తుంది !!

కనుక మానవ బలహీనతలను ఎరిగిన పెద్దమనస్సుతో జీసస్ అలా మోషే ధర్మశాస్త్రాన్ని కూడా పక్కన పెట్టించి ఆమెను కాపాడాడు. దీనికి కారణం, ఇలాంటి సందర్భాలలో స్త్రీలపైన ఆయనకున్న సింపతీ కారణం అయ్యి ఉండవచ్చనేది లాజికల్ గా ఆలోచించే ఎవరైనా ఒప్పుకుంటారు. మత ప్రచారకులు అల్లే కట్టు కధలను పక్కన పెట్టి ప్రాక్టికల్ గా ఆలోచించే ప్రతివారికీ ఈ సింపుల్ పాయింట్ చాలా తేలికగా అర్ధమౌతుంది.

బహుశా ఇలా వాదించేటప్పుడు జీసస్ కు మనస్సులో పెళ్ళికి ముందటి తన తల్లి మేరీ మెదిలి ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్లుగా అలాంటి నేరాలలో (అదసలు నేరమే గనుక అయితే !) మోషే ధర్మశాస్త్రం ఆ శిక్షనే చెబుతోంది. జీసస్ కూడా అప్పటికి యూదుడే గాబట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు చెప్పినదాన్ని ఆమోదించాలి. కానీ అలా చెయ్యలేదు. దానికి కారణం తన జన్మరహస్యాన్ని తానూ ఎరిగి ఉండటమే కావచ్చు.

పంచమంలో ఉన్న ఈ గ్రహయోగం ఇదంతా చెబుతూ, ఇంకేం చెబుతున్నదో చూద్దాం. పంచమం అనేది శిష్యులను కూడా సూచిస్తుంది గనుక - జీసస్ శిష్యులు కూడా అబద్దాలు చెబుతారనీ, చరిత్రను వక్రీకరించి, లోకానికి అబద్దాలు చెప్పి మోసం చేస్తారనీ ఈ గ్రహయోగం చెబుతున్నది. ఎందుకంటే కుజుడూ+బుదుడూ కలిస్తే అది అబద్దాలు చెప్పే గట్టి హిపోక్రటిక్ యోగం అవుతుంది. పైగా నీచ కుజునివల్ల ఒక అబద్దాన్ని మొండిగా వెయ్యిసార్లు రిపీట్ చేసి నిజమని చెప్పి నమ్మించే ఒక మైండ్ సెట్ ను జీసస్ శిష్యులలో ఈ యోగం సూచిస్తుంది.

అందుకే - స్త్రీపురుషులు కలవకుండా పిల్లలు పుట్టరు అని అందరికీ తెలిసినా - Immaculate Conception అనే అబద్దాన్ని నిజంగా భ్రమింపజేస్తూ రెండువేల సంవత్సరాల నుంచీ లోకం మీద బలవంతంగా రుద్ది ప్రచారం చేస్తూ నమ్మిస్తూ వస్తున్నారు.

కనుక ఈవెంట్స్ పరంగా ఈ జాతకం జీసస్ జీవితంలో సరిపోతూ ఉన్నప్పటికీ, ఏకైక దేవుని కుమారునిగా, ఏకైక లోకరక్షకునిగా జీసస్ ను క్రైస్తవులు కొనియాడుతున్న స్థాయితో మాత్రం ఈ జాతకం సరిపోవడం లేదు.

ఈ క్రమంలో రెండు విషయాలు స్పష్టం అవుతున్నాయి.

ఒకటి - జీసస్ నిజంగా క్రైస్తవులు చెబుతూ ఉన్నంత దైవాంశసంభూతుడే అయితే ఈ జాతకం జీసస్ ది కాదు.

రెండు - సైంటిస్ట్ లు చెబుతున్నట్లుగా, బైబుల్లో చెప్పబడినట్లుగా, ఈ తేదీన star of Bethlehem ను సూచించే నక్షత్రస్థితి గనుక ఆకాశంలో ఉండటమూ, అది సింహరాశిలో గురుశుక్రుల స్థితే కావడమూ నిజమే అయితే, లోకం నమ్ముతున్నంత దైవత్వం జీసస్ లో లేదు. ఎందుకంటే ఈ జాతకం ఒక మామూలు భక్తుని జాతకాన్ని సూచిస్తున్నది గాని క్రైస్తవం నమ్మేంత గొప్ప స్థాయిలో, దేవుని ఏకైక కుమారుని జాతకస్థాయిలో లేదు.

ఈ జాతకం ప్రకారం, ఈ రెండు ఆల్టర్నేటివ్స్ లో ఏదో ఒక భావన మాత్రమే నిజం అవుతుంది గాని రెండూ నిజం కావడానికి మాత్రం ఆస్కారం లేదు.

(ఇంకా ఉంది)