Human ignorance is incurable

27, డిసెంబర్ 2016, మంగళవారం

స్వామియే శరణమయ్యప్ప

(పక్కవాళ్ళని ఇబ్బంది పట్టకుండా, మౌనంగా తమ పూజ తాము చేసుకుంటూ, నిత్యజీవితంలో నిర్మలంగా ఉంటూ దీక్షలు చేసేవారిని ఉద్దేశించి ఈ పోస్ట్ వ్రాయబడలేదు. పటాటోపం కోసం, దీక్షలు అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడం కోసం, నలుగురిలో మెప్పుకోసం, పెద్ద మతాచారపరులలాగా పోజులు కొడుతూ,పెద్దగా మైకులు పెట్టి పక్కవాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ, నాటకాలాడే దొంగ దీక్షాపరులకే ఈ పోస్ట్ అంకితం)

తేే|| కొండ దేవత బట్టుక గుడులు గట్టి
దిక్కు మాలిన దీక్షల దిగుమతించి
నల్ల గుడ్డల మోసపు నాటకముల
బ్రదుకు తెరువుకు దీసిరి బల్లకట్టు


కం|| నలువది రోజుల దీక్షని
వలువలు నల్లనివి గట్టి వేషము వేయున్
మల దిగియున్ దిగక మునుపె
సలసలమను మందు బుడ్డి చక్కగ ఎత్తున్

ఆ|| మాల కొక్క రేటు మడిగుడ్డకో రేటు
తిండి కొక్క రేటు తస్స దియ్య
వ్యాను కొక్క రేటు; వెన్నంటి వచ్చేటి
గుడ్డి గురువు కొక్క గెస్టు రేటు

కం|| ఒంటిన్ హింసల బెట్టగ
కంటకములు దీరునంట కలయా నిజమా?
మంటల గాలక యున్నన్
ఒంటికి కర్మలు దొలగునె? ఓ యని అరవన్

శరీరాన్ని హింస పెట్టుకున్నంత మాత్రాన చేసిన పాపాలు ఎక్కడికీ పోవు. పుట్టమీద కొడితే పుట్టలోని పాము చస్తుందా? చావదని యోగి వేమన ఎప్పుడో చెప్పాడు.మన హిందూమతంలో కూడా ఇదే మాటను ఎంతోమంది గతంలో చెప్పారు.వినేవారేరి? అర్ధం చేసుకునేవారేరి?

ఆ|| శరణు శరణ మంచు అరవంగ నేమౌను
శరణు మనసులోన సాగవలయు
నోట యరచి నంత నీతిబద్ధత గల్గ
కాకులన్ని గావె కావ్యవిదులు ?

ఊరకే నోటితో శరణు శరణు అని అరిచినంత మాత్రాన ఏమీ జరగదు. ఆ 'శరణాగతి' అనేది మనసుకి పట్టాలి. నిత్యజీవితంలో ప్రతిక్షణం అది ప్రతిఫలించాలి.అప్పుడు నోటితో అరవాల్సిన పనీలేదు.లోకానికి ఫోజు కొట్టాల్సిన పనీ లేదు.ఊరకే అరచినంత మాత్రాన పవిత్రత వచ్చే పనైతే 'కావుకావు' మంటూ అరిచే కాకులన్నీ ఎప్పుడో దేవతలై కూచుని ఉండేవి.

ఆ|| తెలుగు నేలయందు దేవుళ్ళు కరవైరి
చేర దేవుడొచ్చె చెంగుమనుచు
గురువు స్వాములంచు గుదిబండ లందందు
పుట్టుకొచ్చిరంత పుట్ట బగుల

ఆ|| పనియు పాట లేని పారసైటులు జేరి
నల్ల దీక్షలనుచు నేల ఈని
శరణు ఘోష యంచు చిందులే వేయంగ
కంపరంబు గల్గె కాంచినంత

ఆ|| పిచ్చి పిచ్చి రూల్సు పుచ్చిపోయిన రూల్సు
అర్ధరాత్రి మీల్సు అరవ డాన్సు
భజన లంచు జేరి 'భౌ'వంచు బాడంగ
రోడ్డు కుక్కలరచె  రోదనముగ

కం|| కుయ్యూ మొర్రో కేకల
కయ్యో యని లేచి పారె ఆ అయ్యప్పే
అయ్యా ఆపుడు భజనల
సయ్యాటల డాన్సులొద్దు చంపకుడంచున్

పటాటోపం లేకుండా కేరళలో మౌనంగా చేసుకునే ఈ దీక్షను ఆంధ్రాకు తెచ్చి పెద్ద రొచ్చు రొచ్చు చేసి,చూసేవాళ్ళకు ఈ దీక్షలంటేనే అసహ్యం పుట్టేలా భ్రష్టు పట్టించి 'మాస్ దీక్షలుగా' మార్చి పారేశారు తెలుగువాళ్ళు. ఆంధ్రాలో ఈ గోల చూసి అసలా అయ్యప్పే కొండదిగి పారిపోయాడేమో అని నా అనుమానం.

కం|| గడ్డము జేయరు సరిగా
అడ్డముగా పొట్ట బెంచి అరచుట యేలో?
నడ్డులు వంచరు పనిలో
హెడ్డులు ఎత్తుక దిరుగుచు హెచ్చులు బోదుర్

కం|| పనిలేని దీక్ష బట్టుక
మనజోలికి రాడు వీడు మంచిదె యనుచున్
వనితల్ డాన్సులు జేసిరి
పని ముగిసిన వెనుక వారి పని ఏమౌనో?

ఆ|| ఇంటిఖర్మ వదలె ఇక రెండు నెలలంచు
పీడ బోయెనంచు భార్య యనియె
రెండు నెలల మీద రెట్టింపు హింసంట
దాని దల్చుకోవె డామియాన

ఆ|| నల్ల గుడ్డవాడు నట్టేటిలో ముంచు
ఎర్ర గుడ్డవాడు బొర్ర బెంచు
పసుపు గుడ్డ వాడు పడద్రోయ జూచురా
తెల్లగుడ్డ వాడు వెల్ల వేయు

ఆ|| రంగుగుడ్డ కన్న భంగుబీల్చుట మేలు
పార్టు దీక్ష కన్న పడక మేలు
బొట్లు బెట్టినంత బ్రహ్మంబు నెరుగునా
పార్టులందు లేదు పరమదీక్ష

కం|| డ్రస్సుల రంగులు మారిన
కస్సుల బుస్సుల గరచెడి కాకలు దిగునా?
మిస్సవ నేలన్ సుఖముల్?
ఎస్సను విద్యన్ దెలియక ఎందుకు దీక్షల్?  

ఆ|| పార్టు టైము దీక్ష పగలంత పతిదీక్ష
రాత్రియైన యంత రిథము మారు
పాడు దీక్షలేల పతిత జీవనమేల?
ఫుల్లు టైము దీక్ష పుణ్యమిచ్చు

ఆ|| ఒక్క పూట దినుచు బక్క చిక్కుచుబోవ
ఏమి దక్కు నీకు? వెర్రి వాడ
బిచ్చ గాడు జూడ బ్రహ్మవేత్తాయెనా?
మాయ పనులు మాని మింగు బాగ

కం|| మండల దీక్షలు జేయుచు
మెండుగ మిగతా దినముల మెక్కిన దగునా?
కండువ వేసిన యంతనె
కొండొక యౌన్నత్య మెట్లు గుదురును గురుడా?

ఆ|| యియరు మొత్తమంత ఇష్టానుసారంబు
కొన్నినాళ్ళ దీక్ష కోతి దీక్ష
చెప్పులేయకున్న చిత్తంబు గుదురన్న
కోయలెల్ల శ్రేష్ఠగురులు గారె?

కం|| గురుస్వాముల నిజజీవిత
చిరునామా దెలిసినంత చీదర బుట్టున్
పర ధనమున్ పరదారను
పరపర మని మింగువీరు గురులెట్లైరో?

ఆ|| ఉదయ మందు లేచి వాకింగు కేబోవ
నల్ల డ్రస్సు వాడు కళ్ళ ముందు
కాన వచ్చినంత ఖర్మలే మొదలౌను
నల్లడ్రస్సు కన్న పిల్లి మేలు

ఆ||నల్ల పిల్లి యొకటి నల్లడ్రస్సొక్కటి
ఎదురు వచ్చినంత ఎంచి ఎంచి
పిల్లి వైపు జూడు నల్లవానిన్ వీడు
నల్లడ్రస్సు కన్న పిల్లి మేలు

ఆ|| సివికు సెన్సు లేక చీదరల్ బుట్టించు
పిచ్చి కేకలేసి పెనుగు లాడి
వెర్రి డాన్సు జేయ విజ్ఞాన మొదవునా?
ఎంత పతనమాయె వేదభూమి?

ఆ|| బ్లాకు క్యాటు యొకటి పొద్దు పొద్దున లేచి
బయటి కేగ మరొక బ్లాకు క్యాటు
మనిషి లాగ వచ్చె; మన క్యాటు జచ్చెరా
క్యాటు మేలు బ్లాకు క్యాటు కన్న
  
కం|| నమ్మకుమీ నల్ల దొరల
నమ్మకుమీ దీక్షలిచ్చు నాటక గురులన్
నమ్మకు నలభై రోజుల
దిమ్మరి సోమరి తనముల దీక్షల నెపుడున్

ఆ|| నీతి లేని బ్రతుకు నిండారగా బ్రతికి
నల్ల డ్రస్సు వేయ నాణ్యమౌనె?
పతిత యొకటి పెద్ద పట్టుచీరన్ గట్ట
సాధ్వి యౌనె? తృష్ణ జావకున్న? 

ఆ|| హిందు మతము జూడ హీనస్థితికి జారె
పిచ్చి దీక్షలెల్ల పెరిగి పోయె
అసలు ధర్మ మెల్ల అప్పుడే అణగారె
వెర్రి పప్పలైరి ఉర్వి జనులు

ఆ|| పాత దేవుడన్న పాడైన దొరగారు
పాత భార్య యన్న పాడు గంప
కొత్త దేవుడన్న కోతికొమ్మచ్చిరా
కొత్త భార్య యన్న కొబ్బరాకు

పాత దేవుళ్ళు పనికిరాని దేవుళ్ళు.కొత్త దేవుడంటే మోజెక్కువ. పాతభార్య పాడు పిశాచంలా కనిపిస్తుంది.కొత్త భార్యేమో కొబ్బరి ముక్కలా ఉంటుంది. కొత్తొక వింత పాతొక రోత కదా !!

ఆ|| కొత్త పాతలేల కోణంగి పనులేల?
ఒక్కడైన విభుని వదలుటేల?
తాత తండ్రులెల్ల దద్దమ్మ లౌదురా?
వారి దైవమెట్లు వెడలి పోయె?

కొత్త కొత్త దేవుళ్ళ కోసం పాత దేవుళ్ళను పారవెయ్యడం మంచిదేనా? అసలు దేవుళ్ళు ఇంతమంది ఉన్నారా? దేవుడు ఒకడే అని వేదం చెప్పడం లేదా?అలాంటప్పుడు రోజుకొక్క దేవుడిని మార్చడం అవసరమా? మనకు తెలిసినమాత్రం మన తాతతండ్రులకు తెలియదా? వారు పూజించిన దేవుళ్ళను మనం వదలి కొత్తవాళ్ళ వెంట పరుగెత్తాలా?

తే|| తెలుగు వారల దేవులు తరలి పోవ
ఇతర రాష్ట్రపు దేవులు ఇళ్ళ లోకి
వచ్చి చేరిరి ఎంతయు వింతగాను
ఎంత మూర్ఖము? జూడగ నెంత వెర్రి?

మన దేశంలోని అన్ని రాష్ట్రాలలోకీ - తెలుగురాష్ట్రాలకు - అందులోనూ ముఖ్యంగా ఆంధ్రాకి ఉన్నంత దరిద్రం ఇంకే రాష్ట్రానికీ లేదు.అన్ని దేశాల అన్ని రాష్ట్రాల దేవుళ్ళనూ మనం తలుపులు తీసి బార్లా ఆహ్వానిస్తాం.మన ఇళ్ళలో ఎప్పటినుంచో ఉన్నవారిని మాత్రం బజార్లో పారేస్తాం.ఇదే తెలుగువాడికున్న వెర్రి. ఒక్క తెలుగువాడు తప్ప ఇంకే రాష్ట్రం వాడూ ఇలా చెయ్యడు.

ఆ|| ఇంటి దైవమింక ఇంకొల్లు పాలాయె
ఇతర దైవమేమొ ఇంటికొచ్చె
అచ్చ తెనుగు మరచి అరవమ్ములో పాడ
మల్లయాళ మింక మోగిపోయె

మనకు భాష లేనట్లు అరవంలోనూ మలయాళం లోనూ భజనలు చేస్తూ మన తెలుగును మనమే చంపుకుంటున్నాం. ఎంత దరిద్రమో మనది?

ఆ|| భాష లేదు మనకు భావశుద్ధియు లేదు
దైవమేది లేదు దిక్కు లేదు
సినిమ దీసినంత సిగ్గులేకుండగా
తెలివిలేక బారు తెలుగుజాతి

మనకు భాషాభిమానం లేదు. భావశుద్ధి లేదు. మనకు దేవుళ్ళూ లేరు. ఎవరు ఏ సినిమా తీస్తే వాడే మన దేవుడు.నేను తమాషాకి చెప్పడం లేదు. స్టాటిస్టిక్స్ తో సహా నిరూపిస్తా...

1960 లో 'శ్రీ వెంకటేశ్వర మహాత్యం' అన్న సినిమా వచ్చాకనే తిరుపతికి జనం పోలో మంటూ పరిగెత్తడం మొదలైంది. అంతకుముందు తిరుపతికి ఇంత ఆదాయం లేదు.ఈ విషయం టీటీడీ రికార్డులే నిరూపిస్తున్నాయ్.ఈ సినిమాలో ఘంటసాల పాడిన పాటలు జనాన్ని ఐదుదశాబ్దాలుగా మెస్మరైజ్ చేసి పారేశాయి.జనాన్ని తిరుపతి కొండకు పరిగెత్తించాయ్.

తెలుగువారి ఈ వెర్రి చూచి, 1977 లో అనుకుంటా "స్వామి అయ్యప్ప మహాత్యం" అని ఒక సినిమా వచ్చింది.అందులో జేసుదాస్ పాడిన మంచి పాటలున్నాయి.అవి ఇప్పటికీ ఆపాత మధురాలే.ముఖ్యంగా 'శబరిమలను స్వర్ణచంద్రోదయం' అనే పాట చాలా బాగుంటుంది.ఇక అక్కడ నుంచి మనకు వెర్రి మొదలైంది.ఆంధ్రావాళ్ళు దీక్షలంటూ తండోపతండాలుగా శబరిమల పోవడం అప్పుడే మొదలైంది.తిరుపతికి వచ్చే ఆదాయం 'ట్రావెన్కోర్ దేవస్వోం బోర్డ్' కి మళ్లడంకూడా అప్పుడే మొదలైంది.

తిరుపతికి వస్తున్న ఆదాయం చూసి కేరళ ప్రభుత్వమే ఈ సినిమా తీయించి ఆంధ్రాలోకి వదిలిందని ఒక పుకారు కూడా ఉంది.అది పుకారో నిజమో తెలియదు గాని ఆ సినిమా తీసిన వారి ఉద్దేశ్యం మాత్రం బ్రహ్మాండంగా నెరవేరింది. అప్పటిదాకా శుభ్రంగా ఉన్న పంపానదీ తీరమంతా తెలుగువాళ్ళ పెంటలతో నిండి పోయింది.

1978 లో 'కరుణామయుడు' అని విజయచందర్ తీసిన సినిమా రిలీజైంది.ఆ తరువాత తెలుగువాళ్ళు క్రైస్తవం లోకి మారడం ఒక తుఫాన్ లా మొదలైంది. అప్పటినుంచే ఆంధ్రాలో కన్వర్షన్స్ ఊపందుకున్నాయ్.

ఆ తర్వాత షిరిడీ సాయిబాబా మీద సినిమాలొచ్చాయి. ఇంకేముంది?పోలో మంటూ తెలుగువాళ్ళు శిరిడీకి పరిగెత్తడం ప్రారంభం !!

ఇంకా నయం !! ఎవరూ "మారిలిన్ మన్రో" అని సినిమా తియ్యలేదు. సంతోషం !!

కం|| ఇదియా హిందూ ధర్మము?
ఇది ఏ కలగూర గంప? ఇది ఏ మతమౌ?
అదియో ఇదియో తెలియని
పెదకాకర మొక్క వోలె ఫెళ్ళున బెరిగెన్

హిందూధర్మం అంటే ఇదా? అసలైన హిందూమతం ఏం చెప్పిందో అది ప్రస్తుతం ఎక్కడుందో ఎవరికైనా తెలుసా అసలు? ఎవరు ఏది చేస్తే అది హిందూధర్మం అయిపోతుందా?

కం|| కలియందున పెనుమాయల
పలుదీక్షల్ బుట్టునన్న పరగురు బోధన్
పలుమారులు దలచి తలచి
విలువల నడువుము బ్రతుకున వేరొకటేలా?

కలియుగంలో ఊరికి పదిమంది గురువులూ, ఇరవై రకాల మతాలూ పుట్టగొడుగుల లాగా పుట్టుకొస్తాయని పెద్దలు ఏనాడో చెప్పారు.వ్యాసమహర్షి వ్రాసిన భవిష్య మహాపురాణం గాని,బ్రహ్మవైవర్త పురాణం గాని,లేదా బ్రహ్మంగారి కాలజ్ఞానం గాని చదవండి. నేను చెబుతున్నది నిజమో కాదో తెలుస్తుంది.

ప్రస్తుతం జరుగుతున్నది అంతా ముందే వ్రాయబడి ఉంది. సమాజంలో కొత్త కొత్త దేవుళ్ళు కొత్త కొత్త దీక్షలు ఇవన్నీ వస్తున్నాయి గాని మనిషిలో నీతి మాత్రం ఎక్కడా పెరగడం లేదు.అది రోజురోజుకీ దిగజారిపోతున్నది.మతం కూడా నేడు వ్యాపారవస్తువుగా మారింది.ప్రతివాడూ ఒక గుడి కట్టడం, అక్కడ పనీపాటా లేని సోమరిపోతులు కూచుని పూజలంటూ జనాన్ని మభ్యపెడుతూ బ్రతకడం.అక్కడ ఒక రెలిజియస్ మాఫియా తయారు కావడం తప్ప ఇంకేమీ జరగడం లేదు.పాపులర్ మతం అంతా మోసమే !!

అసలు నిత్యజీవితంలో నీతిగా ఉంటే ఏ దీక్షలూ అవసరం లేదు. జీవితంలో రంగులు మార్చేవాడే,బట్టల రంగులు కూడా మారుస్తాడు.ఎప్పుడూ మనస్సులో శుద్ధంగా,జీవితంలో నిర్మలంగా ఉండేవాడికి ఏ దీక్షా అవసరం లేదు.వాడు దేవుడి దగ్గరకు పోనవసరం లేదు.దేవుడే వాడి దగ్గరకు వెతుక్కుంటూ వస్తాడు.

ఇంతమంది ఇన్ని దీక్షలు చేస్తున్నారు కదా మరి మన సొసైటీలో ఇంత నల్లడబ్బు ఎలా వచ్చింది? అందరూ నీతిమంతులైతే అందరూ మహాభక్తులైతే ఈ నల్లధనం గోల ఏమిటి?

అందరూ శ్రీవైష్ణవులే కానీ బుట్టలోని చేపలు మాత్రం మాయం !!

అంతేగా ???