Human ignorance is incurable

12, డిసెంబర్ 2016, సోమవారం

వెర్రి తలలేస్తున్న సనాతన ధర్మం

మొన్నీ మధ్యన ఏదో పనిమీద నంబూర్ అనే ఊరికి వెళ్ళవలసి వచ్చింది.విజయవాడ నుంచి గుంటూరు వచ్చే దారిలో నంబూరు అనే బోర్డు చూడటమే గాని ఆ ఊళ్లోకి ఎప్పుడూ పోలేదు. దానికి కారణం మెయిన్ రోడ్డుకు రెండు మూడు కి.మీ లోపలకు ఈ ఊరు ఉండటమే.

ఊరు చాలా పెద్దది. ఏదో చిన్న పల్లెటూరులే అనుకున్న మాకు చాలా ఆశ్చర్యం కలిగింది.ఈ ఊర్లో అందరూ బాగా డబ్బున్న వారే అని మాటలమధ్యలో తెలిసింది.పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినా, మంచి నీటి వసతి ఉండటమూ, మంచి నేల కావడంతో  రైతుల దగ్గర బాగా డబ్బులున్నాయి.

నన్ను ఆశ్చర్య పరచిన అసలు విషయం అది కాదు.

ఊరినిండా మైకులు పెట్టి హోరుగా ఏదో ఎనౌన్స్ మెంట్ వస్తోంది. ఏంటా అని ఒక చెవి అటు పారేస్తే అర్ధమైంది ఏమంటే - ఆరోజు సాయంత్రం ఊరి శివాలయం దగ్గర రోడ్డుమీద రుద్రాభిషేకం ఉందిట. అభిషేకం ఆలయం లోపల కదా జరగవలసింది? రోడ్డు మీద ఏమిటా అని సందేహం వచ్చి శివాలయం బయటే కూచున ఉన్న ఒక బ్లాక్ క్యాట్ ని అడిగాము. అప్పుడు అసలు విషయం తెలిసింది.

ఆయనే ఈ మొత్తం కార్యక్రమానికి ఆర్గనైజర్ అని చెప్పాడు.

రోడ్డు మీద ఒక పెద్ద స్టేజి వేసి ఆ రోజు సాయంత్రం నాగ సాధువుల చేత అప్పటికప్ప్పుడు మట్టితో శివలింగం స్టేజిమీదే చేయించి దానికి అభిషేకాలు చేస్తారట.

'నాగ సాధువులు మీకెక్కడ దొరికారు? వాళ్ళు పూర్గిగా నగ్నంగా ఉంటారు.ఎక్కడో మానవసమాజానికి దూరంగా కొండలలో అడవులలో ఉంటారు.కుంభమేళాలో మాత్రమే వారు మనకు కనిపిస్తారు.ఆ తర్వాత ఎక్కడకు మాయమై పోతారో ఎవరికీ తెలియదు.వాళ్ళను మీరెక్కడ పట్టుకొచ్చారు?' - అని ఆయన్ను అడిగాను.

'వీళ్ళు నాగ సాధువులు కారు.వాళ్ళ శిష్యులు.వీళ్ళను కాపాలికులని అంటారు' అన్నాడు బ్లాకీ.

నాకు మతిపోయినంత పనైంది.

'కాపాలికులు,పాశుపతులు మొదలైన తెగలను ఆదిశంకరులు ఎప్పుడో ఓడించి ఆయా శైవమతశాఖలు పూర్తిగా పనికిరానివని ఎప్పుడో తేల్చేశారు. వీళ్ళంతా మళ్ళీ పుట్టగొడుగులలాగా ఎలా పుట్టుకొస్తున్నారు?' అని ఆశ్చర్యం వేసింది.

'కార్యక్రమం చాలా భారీ ఎత్తున చేస్తున్నారే? ఎంత ఖర్చౌతుంది?' పందిరిని చూస్తూ అడిగాను.

'ఏభై వేలు అవుతుంది. ఇంకా పెద్దగా చేస్తే రెండు మూడు లక్షలు కూడా అవుతుంది.కానీ కార్యక్రమం అంతా ఒక్క గంట మాత్రమె ఉంటుంది.వాళ్ళు టైంను చాలా ఖచ్చితంగా పాటిస్తారు.' - అన్నాడు.

'అంత టైం పాటించడానికి వాళ్లకు వేరే పనీపాటా ఏముంది గనక? అయినా అంత ఖర్చుకు ఏముంది ఇక్కడ? మహా అయితే స్టేజి డెకరేషన్ అవుతుందేమో?' అంతేకదా?' - అన్నాను.

'అబ్బే అలా కాదు స్వామీ. బిందెలకు బిందెలు పళ్ళరసాలు,తేనె, కొబ్బరినీళ్ళు,పాలు,పెరుగు,నెయ్యి, గంధం,పసుపు ఇంకా చాలా సుగంధ ద్రవ్యాలు వాడతారు. ఆ బిందెలతో శివలింగానికి అభిషేకం చేస్తారు. చాలా క్వాలిటీ ద్రవ్యాలు వాడతారు.అందుకని అంత ఖర్చు అవుతుంది.వాళ్ళు ఏమీ డబ్బులు తీసుకోరు.వస్తువులకే ఖర్చంతా'  - అన్నాడు.

'ఒక్క గంటలో అలా బిందెలు బిందెలు తేనే, పళ్ళరసాలూ వగైరాలన్నీ స్టేజీమీది మట్టిలింగానికి దొర్లించేసి చేతులు దులిపేసుకుని వాళ్ళు వెళ్లిపోతారన్న మాట. అంటే ఈ ఏభై వేలూ జస్ట్ ఒక్క గంటలో మురిక్కాలవ పాలు !! అంతేనా?' అడిగాను నవ్వుతూ.

ఆయనకు కోపం వచ్చేసింది.

'అదేంటి స్వామీ అలాగంటారు? శివుడికి అభిషేకం. అలా అనకండి.అసలు ఆ కాపాలిక స్వామి ఎంత నిష్టగా చేస్తాడో తెలుసా?' అన్నాడు.

'ఎంత నిష్టగా చేస్తాడేంటి?' అడిగాను అమాయకంగా.

'లింగానికి బిందెలు బిందెలు అలా దొర్లిస్తూ ఉన్నప్పుడు ఒక్క క్షణం అందించే బిందె ఆలస్యం అయినా ఆయనకు ఉగ్రం వచ్చేస్తుంది.ఒకసారి బిందెలు అందించే అసిస్టెంట్ స్వామి ఒక్క క్షణం ఆలస్యం చేసాడని, చేతులో ఉన్న బిందెను అతని మీదకు విసరికొట్టాడా కాపాలికస్వామి. ఆ అసిస్టెంట్ పోయి జనంలో పడ్డాడు.'-అన్నాడు భక్తిగా కళ్ళు మూసుకుని ఊగిపోతూ.

'ఓరి నీ భక్తి పాడుగాను. దాన్ని నిష్ఠ అంటారా? అంత కోపం ఉన్నవాడు వాడు స్వామేంటిరా? ఆ అసిస్టెంట్ ప్లేస్ లో నేనుంటేనా, ఒక్క తన్నుకు ఆ కాపాలిక స్వామి పోయి జనంలో పడేవాడు."- అనుకున్నా లోలోపల.

'చాలా బాగుంటుంది స్వామీ సాయంత్రం వరకూ ఉండి చూడండి.' అన్నాడు బ్లాక్ క్యాట్ భక్తిలో గుడ్లు తేలేస్తూ.

'లేదండి.నాకు వేరే పనుంది. కుదరదు.' అన్నాను సీరియస్ గా.

'హు!! గొప్ప అవకాశం మిస్  అవుతున్నావు.' అన్నట్లు నావైపు జాలిగా చూచాడు బ్లాక్ క్యాట్.

నేనది పట్టించుకోకుండా బయల్దేరి వచ్చేశాను.ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయాను.

నిన్న - మా ఇంటి దగ్గర రోడ్డు మీద ఏదో భారీ ఎత్తున పందిరి వేస్తుంటే, ఏంటా అని వాకబు చేశాను. పక్కనే ఉన్న గుళ్ళో ఇదే కార్యక్రమం పెట్టారని తెలిసింది. యధావిధిగా రోడ్డు మీద స్టేజి కట్టి అట్టహాసంగా డ్రమ్ములు బిందెలు అన్నీ పేర్చి మైకులు పెట్టి చాలా హోరుతో ఇదే కార్యక్రమం చేస్తున్నారని తెలిసింది.

అదృష్టవశాత్తూ నేను మేట్నీకి అట్నించటే ఫస్ట్ షోకీ పోయాను గనుక బ్రతికిపోయాను. లేకపోతే ఈ డబ్బా కార్యక్రమం చూడవలసిన ఖర్మ నాకూ పట్టి ఉండేది.దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత అయ్యప్ప పుణ్యమా అని ఈ గోల తప్పించుకోవడానికి ఒకేరోజున రెండు సినిమాలు చూచాను.

బిందెల కొద్దీ తేనే, పళ్ళ రసాలూ, కొబ్బరి నీళ్ళూ,పాలూ పెరుగూ నెయ్యీ ఇంకా ఏవేవో కలిపి రోడ్డుమీద మట్టి లింగానికి అభిషేకం చేసారట కాపాలికులు. ఈ భక్తులేమో పూనకాలు తెచ్చుకుని ఊగిపోయారట.ఈ లిక్విడ్స్ అన్నీ చక్కగా రోడ్డు పక్కన మురిక్కాలవలో కలసి పోయాయిట.ఆ తర్వాత ఆ శివలింగాన్ని కూడా తొక్కేసి రోడ్డు పక్కన మట్టిలో ఆ మట్టిని కలిపేశారట. ఒక్క గంటలో యాభై వేల రూపాయల విలువైన పదార్ధాలన్నీ కాలవలో కలసి పోయాయి.

ఈ విషయమంతా మా నైబర్ ఒకాయన చెబితే నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు.

ఒక పక్కన తినడానికి తిండి లేక ఎంతో మంది చచ్చిపోతున్నారు.వీళ్లేమో భక్తి పేరుతో వేలూ లక్షలూ మురిక్కాలవకు పోస్తున్నారు. ఆ తిండి పదార్ధాలు ఏ ఆస్పత్రికో లేదా ఏ అనాధ శరణాలయానికో ఇస్తే బాగుంటుంది కదా? ఊరకే కాలవకు పోస్తే ఏమొస్తుంది?

రోడ్లమీద మురిక్కాలవల పక్కన ఇలాంటి కార్యక్రమాలు చెయ్యమని ఏ వేదం చెప్పిందో ఎంత ఆలోచించినా నాకు గుర్తు రాలేదు.ఈ మధ్యన మెమొరీ తగ్గిందా అని కొంచం అనుమానం కూడా వచ్చింది నాకు.

పైగా దీనికి హిందూమతం అని ఒక ముసుగు !!

ఇందులో హిందూమతం ఎక్కడుందో నాకైతే అర్ధం కావడం లేదు.

సాటి మనిషి ఆకలితో చచ్చిపోతుంటే, తేనే పళ్ళరసాలూ మురిక్కాలవకు పొయ్యమని ఏ సనాతన ధర్మం ఎక్కడ చెప్పింది? ఒకవేళ చెబితే మాత్రం, కామన్ సెన్స్ కు విరుద్ధంగా మానవత్వానికి విరుద్ధంగా ఉన్న అలాంటి ధర్మాన్ని అసలెందుకు పాటించాలి? ఎక్కడో ఏదో వ్రాస్తే మనం గుడ్డిగా చేసెయ్యడమేనా? మనకు కామన్ సెన్స్ అక్కర్లేదా?

ఆంధ్రాలోకి అయ్యప్పా, సాయిబాబా అడుగు పెట్టిననాటి నుంచే సనాతనధర్మానికి అధోగతి మొదలైందనేది నా వ్యక్తిగత దృఢవిశ్వాసం.జనాలలో ఇలాంటి పిచ్చి చేష్టలు కూడా అప్పటినుంచే ఎక్కువయ్యాయి.సాయిబాబా ఒక ముస్లిం సెయింట్,అయ్యప్ప ఒక ట్రైబల్ ప్రిన్స్.వీళ్ళిద్దరినీ హిందూమతంలోకి ఇండక్ట్ చేసుకుని గుళ్ళుకట్టి పూజిస్తున్నారు.ఇది చాలా పొరపాటు.అయితే ఈ విషయం సో కాల్డ్ భక్తులకు ఏమాత్రం అర్ధం కావడం లేదు.ఈ క్రమంలో హిందూ మతాన్ని ఒక చేపల మార్కెట్ లా మార్చేస్తున్నారు.

మానవత్వం లేని మతం ఎందుకు? ఎందుకు చేస్తున్నామో తెలియని పిచ్చి తంతులు అసలెందుకు? ప్రతిదానికీ ఒక కధ అల్లేసి, త్రిమూర్తులతోనో, దత్తాత్రేయునితోనో,లేకపోతే ఇంకెవరితోనో ఆ కధకు ముడి పెట్టేసి, ఆ కధను లీగలైజ్ చేసేసి గుళ్ళు కట్టేసి వ్యాపారం చేసుకోవడమే హిందూమతమా?? అసలైన హిందూమతం ఎక్కడుందో అదెలా ఉంటుందో ఎవరికైనా తెలుసా అసలిప్పుడు??

అసలు హిందూమతం ఏం చెప్పిందో తెలుసుకుని దానిని ఆచరించడం కరెక్టా?? లేక మనం ఏది చేస్తే అదే హిందూమతం అనుకుంటూ అజ్ఞానంలో అహంకారంలో బ్రతకడం కరెక్టా??

సాటిమనిషిలో శివుణ్ణి చూడమని వివేకానందస్వామి అన్నారు.ఆ పనిని చెయ్యగలిగితే ఈ పిచ్చిగోలలూ ఉండవు.ఈ కుళ్ళు బ్రతుకులూ ఉండవు.ఈ అవినీతీ ఉండదు.మతం పేరుతో ఇంత బ్లాక్ మనీ సర్కులేషనూ ఉండదు.ప్రముఖ దేవాలయాల బోర్డు మెంబర్లు ఒక్కొక్కరూ ఎంతెంత అవినీతి రాక్షసులో, భక్తుల వేషాలలో ఉన్న గుంటనక్కలో కనిపిస్తూనే ఉందిగా?? అవినీతి బంగారాన్ని గోడలలో దాచుకోమనీ, ఇంట్లో ఎక్కడ చూచినా డబ్బు సంచులు దాచుకోమనీ, పైకి భక్తుల వేషాలు వెయ్యమనీ ఏ సనాతన ధర్మం చెప్పిందో మరి? 

"కాదేదీ కవిత కనర్హం" అని శ్రీశ్రీ అన్నట్లు "కాదేదీ అవినీతి కనర్హం" అని మనం అనుకోవాలేమో? ఈ డబ్బంతా ఎవరి దగ్గరో వసూలు చెయ్యడం !! అందులో చాలాభాగం నొక్కెయ్యడం ఇదీ వీళ్ళు చేసేపని !! మనిషిని దోచుకోడానికి పెట్టుబడి లేని వ్యాపారమంటే మతాన్ని మించినది ఇక ఏదీ లేదేమో? "మతం మత్తు మందు" అని మార్క్స్ అన్న దాంట్లో చాలా నిజం ఉందని నాకనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు.

నవీనయుగంలో కూడా మనల్ని చీకటిలోకి తీసుకెళుతున్న ఇలాంటి చీకటి తంతులు అవసరమా?మతం పేరుతో ఇంత అవినీతి అవసరమా?సనాతనధర్మం పేరిట ఇలాంటి వెర్రి వేషాలు అవసరమా? పైగా వీటికి దీక్షలనీ నిష్ఠలనీ పేర్లు అవసరమా?

ఆలోచించండి.