“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, ఫిబ్రవరి 2016, సోమవారం

అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 2 (బాబా తల్లిదండ్రులు)

షరియార్ ముండేగర్  ఇరానీ
ఈ సందర్భంగా ఒక్కసారి మెహర్ బాబా తండ్రిగారైన షరియార్ ముండేగర్ ఇరానీ జాతకాన్నీ అందులోని గ్రహస్థితులనూ గమనిద్దాం. ఎందుకంటే, శారీరక మానసిక లక్షణాలు ఎలాగైతే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తాయో అలాగే జాతకంలోని గ్రహస్థితులూ యోగాలూ కూడా సంక్రమిస్తాయి.మూడు తరాల జాతకాలను గనుక పక్కపక్కన ఉంచుకుని గమనించే పనైతే, మూడు తరాల జాతకాలలోనూ యాస్ట్రో జెనెటిక్ లక్షణాలు ఒక ఆశ్చర్యకరమైన క్రమంలో ఒకరినుంచి ఇంకొకరికి బదిలీ అవుతూ తప్పకుండా మనకు దర్శనం ఇస్తాయి.ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం.జ్యోతిశ్శాస్త్ర పరిశోధనలో నేను బాగా ఇష్టపడే సబ్జెక్టు ఇదే.

ఈయన 21-3-1853 న ఇరాన్ లో యాజ్ద్ అనే నగరం దగ్గరలో జన్మించాడు. జనన సమయం తెలియదు.మెహర్ బాబా జాతకానికీ ఈయన జాతకానికీ గల స్థూలమైన పోలికలను గమనిద్దాం.


మెహర్ బాబా
ఇద్దరి జాతకాలలోనూ కొన్ని స్పష్టమైన పోలికలున్నాయి.

1.మెహర్ బాబా జాతకంలో లగ్నం నుంచి దశమంలో శనీశ్వరుడున్నాడు. షరియార్ జాతకంలో చంద్రుని నుంచి దశమంలో శనీశ్వరుడున్నాడు. దశమ శని అనేది వీరి జాతకాలలో గల కామన్ యోగం.లోకంతో వీరికి గల బలమైన కర్మానుబంధాన్ని ఈ యోగం సూచిస్తుంది.విద్యలో ఆలస్యాన్నీ ఆటంకాలనూ కూడా ఇదే యోగం సూచిస్తుంది. షరియార్ కు చదువు లేదు. మెహర్ బాబా మధ్యలోనే చదువు ఆపేశాడు.దేశాలు తిరగడాన్ని కూడా ఈ యోగం సూచిస్తుంది.ఇద్దరూ దేశాలు తిరిగారు.అయితే - షరియార్ బ్రతుకు తెరువు కోసం ఇరాన్ నుంచి ఇండియాకు వస్తే,మెహర్ బాబా ఒక గురువుగా దేశదేశాలు తిరిగాడు.ఇంకొక విచిత్రమేమంటే - ఇద్దరి జాతకాలలోనూ శనీశ్వరుడు చరరాశులలో ఉన్నప్పటికీ సమ సప్తకంలో ఉన్నాడు.షరియార్ జాతకంలో నీచలో ఉంటే, మెహర్ బాబా జాతకంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు.కానీ తండ్రి జాతకంలోని నీచదోషాన్ని సూచిస్తూ వక్రించి ఉన్నాడు.షరియార్ జాతకంలో నీచశని వల్ల చాలాకాలం వరకూ ఆయనకు స్థిరమైన వృత్తి లేకుండా పోయింది.కానీ నవాంశలో శని ఉచ్చస్థితిలో ఉన్నాడు. కనుక వివాహం తర్వాత ఆయనకు జీవితంలో స్థిరత్వం కలిగింది.మెహర్ బాబా జాతకంలో రాశిచక్రంలోని ఉచ్ఛశని వల్ల ఆయనకు లోకప్రసిద్ధమైన జీవిక సరాసరి కలిగింది.

2.తండ్రీకొడుకుల జాతకాలలోని ఇంకొక కామన్ యోగం ఏమంటే - గురు కేతువుల సంబంధం.షరియార్ జాతకంలో గురువు కేతువు కలసి డిగ్రీ సంయోగంలో ధనుస్సులో ఉన్నారు.అందుకని ఆయనకు చిన్నతనంలోనే ఉన్నతమైన ఆశయాలూ,భగవంతుని కొరకు అన్వేషణా మొదలైన లక్షణాలు కలిగాయి.అంతేగాక మరణానికీ మరణానంతర జీవితానికీ శవాలూ శ్మశానాలూ తదితర కార్యక్రమాలకు కేతువే సూచకుడు.అందుకని షరియార్ చిన్నప్పుడు ఇరాన్ లో జోరాష్ట్రియన్ల శవసంస్కార శ్మశానానికి (టవర్ ఆఫ్ సైలెన్స్) కాపలాదారుగా ఉన్నాడు.గురువూ(మతపరమైన), కేతువూ (శవాగారం) కలసి ఎలాంటి వృత్తిని ఆయనకు ఇచ్చారో చూస్తే జాతకం ఎంత ఖచ్చితంగా జరుగుతుందో అని ఆశ్చర్యం కలుగుతుంది.

ఇక మెహర్ బాబా జాతకాన్ని చూస్తే - గురువూ కేతువూ కోణ దృష్టిలో ఒకరినొకరు వీక్షిస్తూ ఉన్నారు.అంటే తండ్రి జాతకంలో వీరిద్దరి మధ్యా ఉన్న డిగ్రీ యుతిసంబంధం ఇక్కడ సంపూర్ణదృష్టి సంబంధంగా రూపాంతరం చెందింది.కానీ ఆ సంబంధం తండ్రిజాతకం  నుంచి కుమారుని జాతకానికి కొనసాగుతూనే ఉన్నది.ఇంకా చెప్పాలంటే - మెహర్ బాబా జాతకంలో ఈ సంబంధం ఇంకా రిఫైన్ అయింది.కనుక ఆయనకు ఆధ్యాత్మికంగా సిద్ధి కలిగింది.దాదాపు ఇరవై ఏళ్ళు పిచ్చివాడిలా దేశమంతా తిరిగి  తపనపడినా షరియార్ కు సిద్ధి కలుగలేదు.కానీ మెహర్ బాబాకు మాత్రం పెద్దగా శ్రమపడకుండానే,హజ్రత్ బాబాజాన్ అనుగ్రహంతో సునాయాసంగా సిద్ధి కలిగింది.షరియార్ జాతకంలో గురు అనుగ్రహం లేదు.ఎందుకంటే అక్కడ గురువును కేతువు మింగేశాడు.కానీ మెహర్ బాబా జాతకంలో అలా కాదు. అక్కడ ఇద్దరూ పరస్పర దృష్టిలో ఉన్నారు.పైగా షరియార్ జాతకంలో కేతువు గురువునే సూచిస్తూ డబల్ గురు ఎఫెక్ట్ ను ఇచ్చాడు.కానీ మెహర్ బాబా జాతకంలో అదే కేతువు ఉచ్ఛబుదుడిని సూచిస్తున్నాడు.కనుక ఈయనకు గురు అనుగ్రహం సంపూర్ణంగా కలిగింది.

3. ఇంకొక ముఖ్యమైన కామన్ యోగం - బుధుని నీచస్థితి.ఇది కూడా ఇద్దరి జాతకాలలోనూ ఉన్నది.బుధుడు దాదాపు నెలరోజులు ఒక రాశిలో సంచరిస్తాడు.షరియార్ 1853 మార్చిలో జన్మించాడు.మెహర్ బాబా 1894 ఫిబ్రవరిలో జన్మించాడు.కానీ బుధుడు ఆయా సంవత్సరాలలో అదే మీనరాశిలో ఉండటాన్ని ఇద్దరి జాతకాలలోనూ గమనించవచ్చు. తండ్రీ కొడుకుల మధ్యన 41 ఏళ్ళ తేడా ఉన్నప్పటికీ బుధుడు ఖచ్చితంగా అదే స్థానంలో ఇద్దరి జాతకంలోనూ ఉండటం చూస్తే ఏమనిపిస్తుంది?

ఎన్నేళ్ళ తేడా ఉన్నప్పటికీ గ్రహయోగాలు ఏమాత్రం మారవని అర్ధమౌతుంది. ఈ ప్రపంచాన్నీ మానవజీవితాలనూ ఒక అతీతమైన శక్తి నడిపిస్తున్నదని అర్ధమౌతుంది.మన జీవితాలు మనకు అర్ధం కాని ఒక ప్లాన్ ప్రకారం నడుస్తున్నాయని అర్ధమౌతుంది.ఆ అవగాహన నుంచి, ఆ ప్లాన్ ఏమిటో అర్ధం చేసుకోవాలనే తపన మొదలౌతుంది.ఆ తపనే మనల్ని మానవ జీవితపు అంతిమ గమ్యం వైపు అడుగులు వేయిస్తుంది.

జ్యోతిశ్శాస్త్ర అధ్యయనం వల్ల కలిగే అసలైన ఫలితం ఇదే.

4.రాహుకేతువుల స్థానాలను గమనిద్దాం.షరియార్ జాతకంలో రాహుకేతువులు ఉచ్చస్థానాలలో ఉన్నారు.జీవితంలో సక్సెస్ కు ఈ యోగం చాలా అవసరం.వీరి అనుగ్రహం లేకుంటే జీవితంలో సక్సెస్ అనేది రాదు.కాలసర్పయోగం ఉన్న జాతకాలలో సక్సెస్ అనేది లేటు అవడానికి కారణం రాహుకేతువుల అనుగ్రహం లేకపోవడమే.

ఇకపోతే మెహర్ బాబా జాతకంలో రాహుకేతువులు నవాంశలో నీచస్థితిలో ఉన్నారు.నవాంశ వైవాహిక జీవితాన్ని సూచిస్తుంది.కనుక ఆయనకు వివాహజీవితం లేకుండా పోయింది.

5.ఇద్దరి జాతకాలలో గురువు యొక్క స్థితిని గమనిద్దాం.షరియార్ జాతకంలో నవాంశలో శనియొక్క నీచక్షేత్రంలో గురువు ఉన్నాడు.దీనివల్ల కలిగే అనేక ఫలితాలలో ఒకటి ఏమిటంటే - గురువు పుత్రకారకుడు గనుక - లోకంతోనూ లోకవాసుల కర్మలతోనూ గట్టి సంబంధం కలిగిన ఒక సంతానం ఈయనకు ఉంటుంది.అంటే లోకుల నీచకర్మలను ఆ సంతానం మొయ్యవలసి వస్తుంది. అటువంటి ఋణానుబంధం ఆ జీవికి ఉంటుంది అని అర్ధం.

ఇక మెహర్ బాబా జాతకంలో అయితే నవాంశలో గురువు తనయొక్క నీచస్థితిలోనే ఉన్నాడు.గురువు యొక్క నీచస్థితి వల్ల అనేక ఫలితాలు కలుగుతాయి.ఒకటి - ఆ జాతకులకు ఏదో ఒక జన్మలో గురుదోషం ఉంటుంది.లేదా వారు సంప్రదాయబద్ధమైన గురువులు కాలేరు.లేదా వారి పరంపరను కొనసాగించేందుకు ఒక వ్యవస్థ వారికి ఉండదు.అంటే - వారి పరంపర వారితోనే అంతం అవుతుంది.ఆ తర్వాత సంస్థ మాత్రమే ఉంటుంది గాని ఆధ్యాత్మిక వారసులంటూ వారికి ఉండరు.లోకులకు కనిపిస్తూ లోకులను నడిపించే ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక విధానమూ వారికి ఉండదు. వీటిల్లో కొన్నింటిని మెహర్ బాబా జీవితంలో మనం గమనించవచ్చు.

6. ఇద్దరికీ ఆత్మకారకుడు కుజుడే కావడం గమనార్హం.పైగా ఇద్దరికీ వింశాంశ కుండలిలో కుజుడు మిథునం లోనే ఉండటం చూడవచ్చు.

7. షరియార్ చంద్రరాశి కర్కాటకం అయింది.అక్కడనుంచి సప్తమం అయిన మకరం రెండవ సంతానానికి సూచిక.ఈయనకు మెహర్ బాబా రెండవ సంతానమే గాక, మెహర్ బాబా పుట్టినది కూడా మకరలగ్నంలోనే అనే విషయం గమనిస్తే జ్యోతిశ్శాస్త్రం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు.అంటే తల్లిదండ్రుల జాతకాల నుంచి, పుట్టబోయే పిల్లల జాతకాలు అంచనా వెయ్యడమే గాక, ఆయా పిల్లలు ఏయే లగ్నాలలో ఏయే రాశులలో ఏయే నక్షత్రాలలో పుట్టడానికి అవకాశం ఉంటుందో కూడా ఈ శాస్త్రం ద్వారా గ్రహించవచ్చు. ఆశ్చర్యంగా లేదూ?

ఇంకా ఆశ్చర్యం కలిగించే ఇంకొన్ని విషయాలు చూద్దాం.

8. షరియార్ పుట్టినది సోమవారం పుష్యమీ నక్షత్రంలో.అంటే చంద్రశనులకు సంబంధం ఉన్నది.ఇదొక ఆధ్యాత్మిక సంకేతం.ఆధ్యాత్మిక జిజ్ఞాసాపరుల జాతకాలలో శనిచంద్రులకు పంచవిధ సంబంధాలలో ఏదో ఒక ఖచ్చితమైన సంబంధం ఉంటుందని ఎన్నోసార్లు గతంలో వ్రాసి ఉన్నాను.

తండ్రి జాతకంలో వారమూ నక్షత్ర స్థాయులలో శని చంద్రులకున్న  ఈ సంబంధమే మెహర్ బాబా జాతకంలో సరాసరి తులారాశిలో శనిచంద్రుల యుతిగా మారింది.అంటే తండ్రి జాతకంలో బలహీనంగా ఉన్న యోగం కుమారుని జాతకంలో అతిబలంగా మారింది.కనుకనే తండ్రి సాధించలేని దానిని మెహర్ బాబా చిన్న వయసులోనే చేరుకోగలిగాడు. మెహర్ బాబా పుట్టినది కూడా శనివారమే అని గమనించాలి.

ఈ విధంగా తండ్రీ కొడుకుల జాతకాలలో అనేక కామన్ యోగాలూ గ్రహస్తితులూ మనం గమనించవచ్చు.

తల్లి జాతకంతో ఈయనకున్న యోగసంబంధాలను ఇప్పుడు గమనిద్దాం.

బాబా తల్లిగారైన షిరీన్ ఇరానీ 1878 లో బాంబే లో జన్మించినట్లు వివరాలు లభిస్తున్నాయి గాని ఇంతకంటే సరియైన జననవివరాలు దొరకడం లేదు. ఇరాన్లోని జోరాష్టర్ మతస్థులను ముస్లిములు నానా చిత్రహింసలు పెట్టి మతహింసకు గురిచేసేవారు.ఆ హింసను తప్పించుకోడానికి అప్పట్లో అనేకమంది ఫార్సీలు ఇరాన్ వదలి పెట్టి పారిపోయి కట్టుబట్టలతో ఇండియాకు వచ్చేశారు.నిజానికి 14 శతాబ్దం నుంచే ఈ హింసాకాండ ఇరాన్లో సాగుతున్నది.ఇస్లాంలోకి మారడం ఇష్టం లేని అనేకమంది ఫార్సీలు అప్పటినుంచే గుంపులు గుంపులుగా పారిపోయి బాంబే వచ్చేసి అక్కడే ఏవేవో చిన్నచిన్న వ్యాపారాలూ పనులూ చేసుకుంటూ బ్రతుకు సాగించేవారు. ఇస్లాంకు సహనం అనేది లేదనీ అది ఎక్కడుంటే అక్కడ ఇతర మతాలను బ్రతకనివ్వదన్నది చరిత్ర చెబుతున్న నగ్నసత్యం.ఇస్లాం అంటే శాంతి అని చెప్పేది మాటలవరకే. చేతలలో మాత్రం అంతా హింసే.

అదలా ఉంచితే,ముస్లిం దాడుల నుంచి ఇరాన్ వదలి పారిపోయే క్రమంలో ఇండియాకు వచ్చిన అనేక ఫార్సీ కుటుంబాలలో షిరీన్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు.అలా పారిపోయి వచ్చే సమయంలో షిరీన్ తన తల్లి గర్భంలో ఉన్నది.వారు ఇండియాకు వచ్చాక బాంబేలో ఆమె జన్మించింది. 

తన భర్త కంటే ఈమె 25 ఏళ్ళు చిన్నది.అసలు వీరిద్దరి వివాహం ఎలా జరిగిందో ఒక విచిత్రమైన కధ ప్రచారంలో ఉన్నది.

షరియార్ కూడా ముస్లిములు పెట్టె హింసలు భరించలేక 1874 లో ఇరాన్ నుంచి పారిపోయి ఇండియాకు వలస వచ్చాడు. అప్పటికి ఆయనకు 21 ఏళ్ళు.ఆ సమయానికి షిరీన్ ఇంకా పుట్టనే లేదు.అప్పటికి షిరీన్ తల్లిదండ్రులు ఇంకా ఇరాన్ లోనే ఉన్నారు.ఆ తర్వాత నాలుగేళ్ళకు వాళ్ళు బాంబేకు పారిపోయి వచ్చాక ఆమె పుట్టింది.అప్పటికి షరియార్ కు 25 ఏళ్ళు.

షరియార్ కు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.దైవచింతనలో ఉంటూ కాలం గడపడమే ఆయనకు ఇష్టం.కానీ ఆయన చెల్లెలు ఈయనకు ఎలాగైనా పెళ్లి చెయ్యాలని భావిస్తూ అన్నతో పోరుతూ ఉండేది.ఈయనేమో ఏళ్ళకేళ్ళు ఏటో వెళ్ళిపోయి బైరాగిలా తిరుగుతూ మళ్ళీ కొన్నేళ్ళకు ఇంటికి చేరుతూ ఉండేవాడు.ఒకసారి అలా ఇంటికి వచ్చినపుడు ఆయనకు 30 ఏళ్ళు ఉన్నాయి.

'ముప్పై ఏళ్ళు వచ్చాయి.ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళు ఇలా బైరాగిలా తిరుగుతావు?'- అని చెల్లెలు అన్నగారితో దెబ్బలాట వేసుకుంది.

ఈ మాటలు వినీ వినీ ఆయనకు విసుగు పుట్టి కిటికీలోనుంచి బయటకు చూశాడు.అప్పుడే ఒక అయిదేళ్ళ చిన్నపిల్ల వీధిలో ఆడుకుంటూ కనిపించింది.ఆమే షిరీన్.ఆమెను చూపిస్తూ షరియార్ ఇలా అన్నాడు.

'సరే.నువ్వు ఇంతగా పోరు పెడుతున్నావు కదా.అదుగో ఆ చిన్నపిల్లను చేసుకుంటాను.ఆమెను తప్ప ఇంకెవరినీ చేసుకోను.సరేనా? ఇక నీ గోల ఆపు.'

ఆయన చెల్లెలు కూడా తక్కువదేమీ కాదు.వెంటనే వీధిలోకి వెళ్ళిన ఆమె ఆ చిన్నపిల్ల ఇంటికి వెళ్లి ఆ తల్లిదండ్రులను కలసి తన సోదరునితో ఆ చిన్నపిల్లకు నిశ్చితార్ధం చేసుకుని మరీ తిరిగి వచ్చింది.బిత్తరపోయిన షరియార్ ఇంకేమీ మాట్లాడలేక పోయాడు.ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ అమ్మాయికి 14 ఏళ్ళు వచ్చిన తర్వాత తనకు 39 ఏళ్ళ వయస్సులో షిరీన్ ను పెళ్ళిచేసుకున్నాడు.షరియార్ ఎంత సత్యవంతుడో ఈ సంఘటనతో మనం గ్రహించవచ్చు.పెళ్లి అయింది కదా, ఇక సంసార బాధ్యతలు మొయ్యాలి కదా, అందుకని బైరాగిలా దేశాలు పట్టుకుని తిరగడం మానేసి ఒకరి ఇంటిలో తోటమాలిగా పనికి కుదిరాడు.ఆ తర్వాత ఒక టీ షాప్ ప్రారంభించాడు.అలా క్రమేణా జీవితంలో స్థిరపడిపోయాడు.

కాలక్రమంలో వీరికి 9 మంది సంతానం కలిగారు.ఇందులో ఏడుగురు అబ్బాయిలు.ఇద్దరు అమ్మాయిలు. ఈ సంతానంలో మెహర్ బాబా రెండవ వాడు.

ఇప్పుడు తల్లిగారి జాతకంతో బాబా జాతకాన్ని పోల్చి పరిశీలిద్దాం.


షిరీన్ ఇరానీ - 1878
'షిరీన్ మా' జాతకవివరాలు లేవు. ఒక్క సంవత్సరమే దొరుకుతున్నది గనుక ఆ సంవత్సరంలో ఉన్న ముఖ్యగ్రహాలైన గురువు శని రాహుకేతువుల స్థితులను మాత్రమే చూడటానికి వీలౌతుంది.

1878 నాటి ఈ కుండలిని గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు అర్ధమౌతాయి.ఇందులో గురువు నీచస్థితిలో ఉన్నాడు.మెహర్ బాబా జాతకంలో కూడా గురువు నవాంశలో నీచస్థితిలో ఉన్నాడు.అంటే ఈ యోగం ఈయనకు తల్లిగారి వైపునుంచి వచ్చిందన్న మాట.అంటే - తల్లిగారి వైపునుంచి వీరికి గురుదోషం ఉన్నది.ఆ దోషాన్ని తీర్చుకోవడానికే మెహర్ బాబా ఒక గురువుగా లోకుల కర్మల బాధలను మోయవలసి వచ్చింది. ఇంకొక విషయం ఏమంటే - శనీశ్వరుడు మీనరాశి నాలుగో పాదంలో వక్రస్తితిలో ఉంటూ నవాంశలోకి వచ్చేసరికి తులారాశిలో ఉంటూ ఉచ్చస్తితిలోకి ప్రవెశిస్తున్నాడు.మెహర్ బాబా జాతకంలో రాశి చక్రంలో శనీశ్వరుడు తులారాశిలోనే ఉచ్చస్థితిలో వక్రించి ఉండటం గమనించవచ్చు. అచ్చు గుద్దినట్లుగా ఈ ఉచ్చవక్రశని యోగం తల్లిగారి నుంచి ఈయనకు బదిలీ అయ్యింది.

అంటే - ఆధ్యాత్మిక చింతన అనేదీ,పెళ్లి చేసుకోకుండా దైవచింతనలో ఉండిపోవడం అనేదీ తండ్రిగారి నుంచి వస్తే, గురుదోషమూ,లోకంతో గురుసంబంధమైన కర్మబంధమూ తల్లిగారి వైపునుంచి ఈయనకు సంక్రమించాయి.అందుకే ఈయన వివాహం జోలికి పోకుండా దైవచిన్తనలో ఉండిపోయి ఒక మహాగురువుగా లోకప్రసిద్ధిని పొందాడు.ఈ విధంగా తల్లిదండ్రులనుంచి ఆయా లక్షణాలు పిల్లలకు సంక్రమిస్తూ ఉంటాయి.

నేనెప్పుడూ నా శిష్యులతో ఒక విషయం చెబుతాను.

"నువ్వెవరో తెలుసుకోవాలంటే ముందు ఒక పని చెయ్యి.బయట ప్రపంచంలో ఒక పరిస్థితి ఎదురైనప్పుడు దానికి నీ రియాక్షన్ ఎలా ఉందో గమనించుకో.అప్పుడు నీకు ఒక విషయం అర్ధమౌతుంది.ఎప్పుడైనా సరే, నీ రియాక్షన్ రెండు విధాలుగా ఉంటుంది.ఆ పరిస్థితిలో మీ నాన్నగారు ఉంటె ఎలా ప్రవర్తిస్తారో అదే విధంగా నువ్వూ ప్రవర్తిస్తావు.లేదా మీ అమ్మగారికి ఆ పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అదే విధంగా నువ్వు ప్రవర్తిస్తావు.ఈ రెండు విధాలుగా నీవు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు అక్కడ నువ్వు లేవు. అక్కడ ఉన్నది మీ నాన్నగారో మీ అమ్మగారో మాత్రమే. వాళ్ళిద్దరూ ఉన్నంతసేపూ నువ్వు లేవు. వారిలా ప్రవర్తించినంత సేపూ నిన్ను నువ్వు తెలుసుకోలేవు. వారికంటే విభిన్నంగా నువ్వు నీలా ప్రవర్తిస్తేనే నువ్వేమిటో నీకు అర్ధమౌతుంది.అప్పుడే నిన్ను నువ్వు తెలుసుకునే మార్గంలో మొదటి అడుగును నువ్వు వెయ్యగలుగుతావు.ఈ సూక్ష్మ పరిశీలన లేనంతవరకూ నీకు ఆత్మసాక్షాత్కారం ఎన్నటికీ కలుగదు."

ఈ విధంగా మన తల్లిదండ్రులు మనలోనే మనతోనే నివాసం ఉంటూ ఉంటారు.వారెవరో మనమెవరో వారికీ మనకూ గల సంబంధం ఏమిటో తెలుసుకోవడమే ఆధ్యాత్మిక సాధనలో మొదటిమెట్టు.చాలామందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే ఇవి ఆధ్యాత్మికమార్గంలో రహస్యమైన సాధనా క్రమాలు.పుస్తకాలలో లభించేవి కావు.

ప్రస్తుతానికి ఆ టాపిక్ అలా ఉంచుదాం.

మెహర్ బాబాకు తన తల్లిగారితో ఉన్న కర్మసంబంధం ఎంత గట్టిదంటే ఆమె తన 65 వ ఏట సరిగ్గా మెహర్ బాబా 49 వ జన్మదినమైన 25-2-1943 నాడు కన్నుమూసింది.

జాతకాల తులనాత్మక పరిశీలన వల్ల జెనెటిక్ లక్షణాలు ఎలా ఒక తరం నుంచి ఇంకొక తరానికి సరఫరా అవుతాయో అర్ధమౌతోంది కదా?జ్యోతిశ్శాస్త్రం ఇలాంటి అద్భుతమైన అవగాహనలను మనకు అందిస్తుంది.ఇంకా పరిశీలిస్తే వీరి వంశంలో ఇంకా వెనక్కు వెళ్ళవచ్చు.అసలీ ఆధ్యాత్మిక మూలాలు ఎక్కడనుంచి వస్తున్నాయో కూడా తెలుసుకోవచ్చు. దానికి నాడీజ్యోతిష్య శాస్త్రనియమాలను అనుసరించాలి.

ఈ విషయాలను ప్రస్తుతానికి అలా వదిలేసి మనం మెహర్ బాబా జీవితంలో ముందుకు వెళదాం.

(ఇంకా ఉంది)