Human ignorance is incurable

14, డిసెంబర్ 2015, సోమవారం

మెట్లపూజ

'మెట్ల పూజ చేస్తున్నాం చూడ్డానికి రారాదూ?' అడిగాడు అయ్యప్ప దీక్ష తీసుకున్న మిత్రుడొకడు.

ప్రతి ఏడాదీ ఈ టైములో ఇదొక ప్రహసనం జరుగుతుంది కదా. ప్రతిసారీ నా మిత్రులలో ఎవడో ఒకడు నన్ను ఈ విషయంలో అనవసరంగా కదిలించుకుని కడిగించుకుంటూ ఉంటాడు.

'దొరికాడమ్మా ఆడుకోడానికి' అనుకుని, విషయం అర్ధమైనా ఏమీ తెలీనట్లు ' మెట్లపూజా అదేంటి?' అడిగాను.

'మాకు పద్దెనిమిది మెట్లుంటాయి.వాటికి పూజ చేస్తాము.' అన్నాడు.

'అదేంటి దేవుణ్ణి వదిలేసి మెట్లను పూజిస్తారా? ' అమాయకంగా ప్రశ్నించాను.

'దేవుడి దగ్గరకి మనల్ని తీసుకెళ్ళే మెట్లు అవి అందుకని వాటిని పూజిస్తాము' చెప్పాడు.

'మనకు ప్రతి ఇంట్లోనూ పూజా మందిరం  ఉంటుంది.దేవుడూ ఉంటాడు కదా? మరి మన ఇంటి మెట్లకు మనమే పూజ చేసుకోవచ్చు కదా?' అడిగాను.

ఎగాదిగా చూచాడు.

'అలా కుదరదు' అన్నాడు.

'ఎందుకు కుదరదు? నువ్వు చెప్పిన లాజిక్కేగా?' అడిగాను.

'ఇల్లూ గుడీ ఒక్కటే ఎలా అవుతాయి?' అన్నాడు.

'ఇల్లూ గుడీ ఒక్కటి కానప్పుడు మీరు రోడ్డు పక్కన మురిక్కాలవ ఒడ్డున వేసిన పందిరి గుడి ఎలా అవుతుంది?అక్కడ చేసే పూజ పూజ ఎలా అవుతుంది?' ప్రశ్నించాను.

దానికి సమాధానం చెప్పకుండా - 'ఈ పద్దెనిమిది మెట్లూ ఎక్కితే దైవదర్శనం అవుతుంది. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క మెట్టు చొప్పున 18 ఏళ్ళలో 18 మెట్లూ పూర్తీ అవుతాయి.' అన్నాడు.

'ఈలోపల నీ జీవితమే పూర్తవుతుంది' అని లోలోపల అనుకుని -- 'మా బాబాయి ఒకాయన గత 36 ఏళ్ళనుంచీ ఈ దీక్ష చేస్తున్నాడు.ఆయనకు రెండుసార్లు ఈ మెట్లెక్కడం పూర్తయింది.ఆయనకే దైవమూ ఇంతవరకూ దర్శనం ఇవ్వలేదు.అంతేకాదు నాకు కేరళలో చాలామంది మిత్రులున్నారు.వాళ్ళు స్వతహాగా ప్రతి ఏడాదీ ఈ దీక్ష చేస్తారు.మరి వాళ్ళకే దేవుడూ దర్శనం ఇవ్వలేదు.ఎందుకు ఇలాంటి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు మీరు?' అడిగాను.

'అయితే దీనివల్ల ఏ ఉపయోగమూ లేదంటావా?' అడిగాడు.

'ఉంది.మిమ్మల్ని మీరు హింసించుకోవడం,పక్కవాళ్ళని హింసించడం ఒక్కటే ఆ ఉపయోగం. అవితప్ప వేరే ఉపయోగం ఏమీ లేదు. ఈ రెండూ పెద్ద మానసిక రోగాలు.నిజానికి మీక్కావలసింది దీక్షలు కావు, మీకు అర్జెంటుగా సైకియాట్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి.ఈ దీక్షలవల్ల ఏ దేవుడూ కనిపించడు.ఒకవేళ కనిపించినా మీరే వాడిని చావగొట్టి చెవులు మూస్తారు.ఎందుకంటే మీక్కావలసింది దేవుడు కాదు.మీ స్వార్ధపూరితమైన కోరికలు తీరడమే మీక్కావాలి.అందుకు ఇదొక మార్గమని మీరనుకుంటున్నారు.'దైవదర్శనం' అనేది దానికొక ముసుగు. అంతే.' అన్నాను సూటిగా.

'ఈ దీక్షలే లేకుంటే మన హిందువులు చాలామంది క్రైస్తవమతం పుచ్చుకుని ఉండేవారు.అలా జరగకుండా అయ్యప్ప కాపాడుతున్నాడు.' అన్నాడు.

'అదే నిజమైతే, అయ్యప్ప ఉన్న కేరళలోనే క్రైస్తవమతం మనకంటే ఎక్కువగా ఎందుకుంది?నీ లెక్క ప్రకారం అక్కడందరూ హిందువులే ఉండాలికదా.మరి వాస్తవం అలా లేదేం?' అడిగాను.

జవాబు లేదు.

'నే చెబుతాను విను.తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్లు ఉంటుంది?అలా మారే ఆలోచన ఉన్నవాళ్ళు ఈరోజు కాకపోతే రేపు మారతారు.అయినా ఇలాంటి వాళ్ళవల్ల హిందూమతం బలపడుతుందని అనుకోవడం నీ భ్రమ. ఇలాంటి చవకబారు దీక్షలను నమ్ముకుని హిందూమతంలో ఉండటం కంటే క్రైస్తవం లోకి మారడమే మేలు.జనాభా లెక్కలవల్ల హిందూమతానికి బలం రాదు.నాకు క్రైస్తవమూ ఇస్లాముల గురించి బాగానే అవగాహన ఉన్నది. పక్కమనిషిని హింస పెట్టె ఇలాంటి దీక్షల కంటే మౌనంగా ప్రార్ధన చేసుకునే క్రైస్తవం నా దృష్టిలో చాలా ఉన్నతమైనది.నువ్వు దానిలోకి మారడమే మేలు.' అన్నాను.

'ఇంతకీ వస్తాననో రాననో చెప్పచ్చుగా ఇంత సోది ఎందుకు?' అడిగాడు.

'ఇంత సోది చెప్పినా నీకు ఎక్కలేదంటే దానర్ధం ఆ సోది ఇంకా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉన్నదనేగా?' అన్నాను.

'ఇంతకీ వస్తావా రావా?' అడిగాడు.

'రాను. అసలైన దైవారాధన ఏమిటో మీకే తెలియదు.ఇక నాకేం నేర్పిస్తారు?అక్కడకొచ్చి నేనేం చూడాలి?మీ వికృతకేకలూ కుప్పిగంతులూ చూట్టానికి ఎంత అసహ్యంగా ఉంటాయో నాకు బాగా తెలుసు.నిజమైన దైవారాధన ఏమిటో మీకు తెలియదు.అది తెలియనంతవరకూ మీరు ఈ మెట్లపూజలూ చెట్లపూజలూ చేసుకుంటూ జీవితాంతం అఘోరించక తప్పదు.చేసుకుంటే చేసుకోండి.మధ్యలో నాలాంటి వాళ్ళనెందుకు లాగడం?మీలో చాలామంది నిత్యజీవితంలో ఎలాంటి నీతీ పాటించరని నాకు తెలుసు.అలాంటి జీవితాలు గడుపుతున్న మీరు ఎన్ని మెట్లను పూజించినా మీకు చివరకు ఒరిగేది పెద్ద బండిసున్నానే.ఈ విషయం ముందు సరిగ్గా అర్ధం చేసుకోండి.' అన్నాను.

అతను కోపంగా చూచి వెళ్లిపోయాడు.

నాకు నవ్వుతో బాటు జాలీ కలిగింది.

హిందూమతం మొదట్నించీ ఇంతే. దానిలో అతితక్కువ స్థాయినుంచీ అత్యున్నతమైన స్థాయివరకూ మెట్లున్నాయి. కానీ హిందువులలో ఎక్కువశాతం మంది మాత్రం మొదటి మెట్టు మీదే ఎల్లకాలమూ ఉండటానికి ఇష్టపడతారు. వాళ్ళ మతంలో ఉన్న ఉన్నతమైన మెట్లేమిటో వారికే తెలియదు. వాటిని ఎలా ఎక్కాలో తెలియదు.ఈ క్రమంలో ఎవరేది చెబితే అదే నిజమని భ్రమించి ఆ దారిలో పోతూ ఉంటారు.సత్యాన్ని ఎవరైనా వివరించినా వాళ్లకు ఎక్కదు నచ్చదు. వారు పాటిస్తున్న హేతురహిత ఆచారాలనే అత్యున్నతమైన మతంగా వాళ్ళు భావిస్తుంటారు.

2500 ఏళ్ళ క్రితమే గౌతమబుద్ధుడు హిందూమతాన్ని సంస్కరించాలని ప్రయత్నించాడు.కానీ గెలవలేక పోయాడు.ఆ తర్వాత ఆది శంకరాచార్యులవారు ఆ పనిని చెయ్యాలని ప్రయత్నించారు.కానీ ఆయనవల్లా కాలేదు.ఆ తర్వాత ఎందఱో ప్రవక్తలు ఉద్భవించి వాళ్ళ వంతుగా వాళ్ళూ ప్రయత్నించారు.వాళ్ళ వల్లా కాలేదు.నవీన కాలంలో శ్రీరామకృష్ణులు ఉద్భవించారు.వివేకానందస్వామి ఎంతో ప్రయత్నించాడు.కానీ వారివల్ల కూడా కాలేదు. ఈనాటికీ హిందువులలో మెజారిటీ మనుషులకు వారి మతం గురించి వారికి సరియైన అవగాహన లేదు.కనుకనే ఇలాంటి పిచ్చిపనులు చేస్తుంటారు.హిందూమతపు ప్రజలు అధికశాతం దట్టమైన చీకటితో కూడిన అజ్ఞానంలో ఉన్నారనడంలో సందేహం లేదు.అయితే  మిగతా మతాలు ఏదో గొప్పగా ఏమీ లేవు.అవీ ఇంతకంటే అధ్వాన్నంగానే ఉన్నాయి.

కోరికలతో కూడిన దీక్షలు పనికిమాలిన పనులని 2000 సంవత్సరాల క్రితమే అశోక చక్రవర్తి తన 13వ శిలాశాసనంలో చెక్కించాడు.నిజమైన దీక్ష అంటే ఏమిటో కూడా ఆయన దానిలోనే వివరించాడు.కానీ ఈనాటికీ మనకు తెలివి రావడం లేదు.కోరికలు తీరడమే ధ్యేయంగా పెట్టుకుని చేసే దీక్షలూ నోములూ వ్రతాలూ చాలా తక్కువ తరగతికి చెందిన ఆచారాలుగా బుద్ధుడు గుర్తించి వాటిని ఈసడించాడు.అలాంటి వాటిని పాటించవద్దని ఆయన మొత్తుకుని మరీ చెప్పాడు. ఎవరు వింటారు? ఈ సమాజంలో ఎవరికి వారు తాము చేస్తున్నది సరియైనదే అన్న భ్రమలో ఉండటం తప్ప అసలైన సత్యాన్ని సూటిగా చెబితే అర్ధంచేసుకునేవారూ ఆచరించేవారూ ఎవరున్నారు?ఎవరిని చూచినా స్వార్ధపూజలేగాని నిస్వార్ధకర్మ చేసేవాళ్ళు ఎక్కడున్నారు?

ఈ మెట్లపూజలూ చెట్లపూజలూ చెయ్యడానికి తగలేసే డబ్బుతోనూ, అందరూ కలసి పిక్నిక్ లాగా శబరిమల వెళ్లి వచ్చే డబ్బుతోనూ,కనీసం సాటిమనిషి ఆకలి తీర్చవచ్చుకదా? లేదా నిజంగా బాధల్లో ఉన్న సాటి మనిషికి సాయం చెయ్యవచ్చు కదా? ఆపని మాత్రం చెయ్యరు.పైగా పక్కవాడిని చక్కగా దోపిడీ చేస్తుంటారు.ఏడాదికొకసారి ఈ దీక్షలు మాత్రం తప్పకుండా చేస్తుంటారు. బహుశా తాము చేసే పాపాలు ఇలా పరిహారం అవుతాయని వాళ్ళ ఊహేమో?చెయ్యాల్సిన పాపాలన్నీ చక్కగా చేసేసి వారానికొకసారి కన్ ఫెషన్ చేసుకుని పవిత్రులమయ్యామని భ్రమించే క్రైస్తవులకూ,ఏడాదికొకసారి ఈ తంతు చేసే దీక్షాధారులకూ తేడా ఏముంది?దొందూ దొందే.

ఈ దీక్షలు చేసేవారిలో ఎక్కువమంది దొంగవ్యాపారులూ అవినీతిపరులైన ఉద్యోగులూ, నిత్యజీవితంలో ఎటువంటి నీతి నియమాలూ పాటించని కాంట్రాక్టర్లూ, డబ్బుకోసం ఎలాంటి పనైనా చేసేవాళ్ళే ఉంటారు.వీళ్ళలో చాలామందికి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉండదు.మనిషిలో ఉన్నతమైన పరివర్తన తీసుకురాని ఇలాంటి పనికిమాలిన దీక్షలవల్ల ఉపయోగం ఏముంది? వీళ్ళ కోరికలు అప్పనంగా తీర్చడానికి దేవుడనేవాడు లంచాలు మరిగిన ప్రభుత్వ ఉద్యోగి కాడుగా?

ఈ దీక్షలన్నీ శుద్ధ ఆత్మవంచనలే.

మన ఇండియాలో చాలక ప్రస్తుతం ఈ జాడ్యాన్ని అమెరికాకు కూడా పాకించారట.అక్కడ కూడా ఇప్పుడు ఈ దీక్షలు మొదలయ్యాయని కొందరు మిత్రులు చెబుతున్నారు.కులసంఘాలు పెట్టి మన కులగజ్జిని అమెరికాకు కూడా ఎగుమతి చేసిన మనవాళ్ళు ఇప్పుడు ఆధ్యాత్మిక గజ్జిని కూడా అమెరికాకు అంటిస్తున్నారన్నమాట.అసత్యం ప్రయాణించినంత వేగంగా సత్యం ప్రయాణించలేదుగా? ఇది సహజమే.

వీళ్ళని సంస్కరించాలని ప్రయత్నించడమే అసలు పెద్ద పొరపాటేమో? సమాజంలో అధికశాతం ప్రజలు అసత్యపు చాయలోనే బ్రతకడం ప్రకృతి నియమమేమో? ఉన్నతమైన సత్యాలు అందరికోసం కాదేమో? అవి అతి కొద్దిమంది కోసమేనేమో?

గులకరాళ్ళూ కంకరరాళ్ళూ ఎక్కడబడితే అక్కడే దొరుకుతాయి.నిజమైన వజ్రాలు ఎక్కడో ఒకచోట మాత్రమె ఉంటాయి.వజ్రాలను పొందటం కోసం చేసే ప్రయత్నంలో ఉన్న కష్టాన్ని పడలేనివాళ్ళు,గులకరాళ్ళనే వజ్రాలుగా భ్రమిస్తూ మాయతో కూడిన జీవితాలను వెళ్ళబుచ్చక తప్పదు. ప్రకృతి నియమాలలో ఇదొక తిరుగులేని నియమం. వజ్రాలను ఎదురుగా పెట్టుకుని కూడా కంకరరాళ్ళకోసం పరుగులు తీసేవారిని ఎవరు మాత్రం బాగుచెయ్యగలరు? వీళ్ళ ఖర్మ ఇంతే.

ఇలాంటి మనుషులు ఎప్పటికైనా సరే మాయను ఎలా అధిగమించగలుగుతారు?సత్యాన్ని ఎప్పటికి తెలుసుకోగలుగుతారు? అసంభవం కదూ?? ఆధ్యాత్మిక ప్రపంచంలో దైవం ఏర్పరచిన మెట్లను అందుకోలేనివాళ్ళు వాళ్ళు కట్టుకున్న మెట్లకు పూజ చేసుకుంటూ ఉండిపోవడంలో విచిత్రం ఏముంది?