నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

5, అక్టోబర్ 2014, ఆదివారం

యుగసిధ్దాంతం-9(చివరిభాగం)

భారతీయ చింతన అనేది మనిషిని ఆధ్యాత్మికత వైపు సహజంగా తీసుకెళుతుంది.మన వేదాలలోగాని ఉపనిషత్తులలోగాని పురాణాలలోగాని ఉన్న గొప్ప మహత్యం అదే.వాటిలో ఎక్కడ మనం స్పృశించినా,ఉన్నతమైన సత్యాలను అవి చెబుతూ ఉంటాయి.జీవితంలో ఈరోజు ఉండి రేపు నశించిపోయే విషయాలను కూడా ధర్మబద్ధంగా నడిపిస్తూ,ఎప్పటికీ నిలిచి ఉండే శాశ్వతమైన దానిని చేరుకునే ప్రయత్నం చెయ్యమని అవి ప్రతిచోటా ఉద్బోధిస్తూ ఉంటాయి.వాటిలో మనకు కనిపించే ప్రతి భావమూ దీనినే ప్రబోధిస్తూ ఉంటుంది.అదే మన సనాతనధర్మం యొక్క మహత్యం.

యుగసిద్ధాంతం కూడా దీనికి అతీతం ఏమీ కాదు.అయితే,యుగసిద్ధాంతం వల్ల మనకు కొన్ని శాశ్వతమైన విషయాలు తెలుస్తాయి.

సృష్టికి ఆదీ లేదు అంతమూ లేదు.ఇది ఒక నిరంతర ప్రక్రియ.ఎన్ని కోట్ల సంవత్సరాలనుంచి ఇది ఇలా నడుస్తున్నదో మనం ఊహించలేము.ఇదొక నిరంతర వలయం.ఈ వలయంలో మనిషి పుట్టి పెరిగి చనిపోయి మళ్ళీ పుడుతూ ఉంటాడు.ఎంతవరకు? అంటే,ఈ వలయం నుంచి బయటపడేటంత వరకూ అని సమాధానం వస్తుంది.

సృష్టిలో సమస్తమూ వర్తులాకారంగా నడుస్తున్నది.అణువూ అలాగే ఉన్నది.మన సూర్యమండలమూ అలాగే ఉన్నది.మన నక్షత్ర మండలమూ అలాగే ఉన్నది.విశ్వమూ అలాగే ఉన్నది.ఇదొక చక్రభ్రమణం.

మహావిష్ణువు చేతిలో విష్ణుచక్రం ఉన్నట్లు మనం చూస్తాం.దాని అర్ధం ఏమంటే, చక్రాకారమైన ఈ సమస్తసృష్టీ ఆయన చేతివేలి కొనమీద నడుస్తున్నది. అంటే,తన చేతి వేలితో ఆయన ఈ సమస్త విశ్వాన్నీ నడిచేటట్లు చేస్తున్నాడు. తన సంకల్పమాత్రం చేత విశ్వాన్ని నడిపిస్తున్న మహాశక్తి ఏదైతే ఉన్నదో దానినే మనం మహావిష్ణువు అని అంటున్నాం.

మన వేదాంతంలో 'దేశం - కాలం' అని రెండు భావాలున్నాయి.దీనినే నవీన భౌతిక శాస్త్రజ్ఞులు 'Space-Time' అని అన్నారు.యుగసిద్ధాంతం వల్ల మనకు ఈ రెంటి యొక్క పరిధులు అర్ధమౌతాయి.

మనం నివసించే భూమి, సూర్యుని చుట్టూ తిరుగుతున్న అనేక గ్రహాలతో కూడిన సౌరమండలంలో ఒక భాగం.ఈ సౌరమండలం మళ్ళీ పాలపుంత అనబడే నక్షత్ర మండలంలో ఒక ధూళి కణం లాంటిది.ఆ పాలపుంత వంటి లెక్కలేనన్ని నక్షత్ర మండలాలు ఈ విశ్వంలో ఉన్నాయి.మన సూర్యుని వంటి కోటానుకోట్ల నక్షత్రాలు ఈ విశ్వంలో ఉన్నాయి.ఇలాంటి విశ్వాలు కూడా ఇంకా ఎన్నున్నాయో మనం ఊహించలేము.ఎందుకంటే మన విశ్వాన్ని (Universe) దాటి దాని అవతల ఏముందో చూచే పరిజ్ఞానం మనకు ఇంకా రాలేదు.కనుక సృష్టిలో ఇంకా విశ్వాలు(Universes)ఉన్నాయో లేవో ప్రస్తుతానికి మన సైన్స్ కు తెలియదు.ఉండవచ్చు అని అనుకుంటున్నది.

కానీ మన విశ్వంలాంటి అనేక ఇతర విశ్వాలు సృష్టిలో ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి.అవే,దేవతలు మొదలైన ఉన్నత జీవులు నివసించే అనేక ఇతర లోకాలు.

మనకు తెలిసిన విశాలవిశ్వంలో మనం నివశించే భూమి ఒక ధూళికణం అంత చిన్నది.ఆ భూమిమీద నివసించే కోటానుకోట్ల జీవరాశులలో మనిషి ఒకడు.కనుక ఎల్లలు లేని విశ్వంలో అల్పుడైన మనిషి పాత్ర ఎంత?ఒక్క క్షణం పాటు ఈ విశ్వదర్శనాన్ని గావిస్తే మన అల్పత్వం ఏమిటో అర్ధమౌతుంది. మనిషి అహంకారం అనేది ఒకే ఒక్క క్షణంలో బుడగలా పేలిపోతుంది.

ఇకపోతే కాలం సంగతి చూద్దాం.

భూమి పుట్టి ఇప్పటికి 454 కోట్ల సంవత్సరాలైందని శాస్త్రవేత్తలు అంటున్నారు.మనకు తెలిసిన విశ్వం పుట్టి ఇప్పటికి 1375 కోట్ల సంవత్సరాలైందని అంటున్నారు.ఇలాంటి విశ్వాలు ఇంకా ఎన్నున్నాయో మనకు ఇంకా తెలీదు.వాటిలో మనకంటే వయసులో పెద్దవీ ఉండవచ్చు చిన్నవీ ఉండవచ్చు.ప్రస్తుతపు మన విశ్వమే ఇప్పటికి ఎన్నిసార్లు ఇలా పుట్టి పెరిగి నశించిందో మనకు తెలియదు.

కోటానుకోట్ల సంవత్సరాలతో నిండి అనంతంగా నడుస్తున్న ఈ కాలంలో మహా అయితే ఒక నూరు సంవత్సరాలు బ్రతికే మనిషి ఎంత? అన్న విషయాన్ని ధ్యానించినా సరే,మనిషి అహంకారం వెంటనే మాయమైపోతుంది.

ఈ అనంతమైన కాలాన్ని మనం భగవత్స్వరూపంగా చూస్తున్నాం.ఆ కాలమే ధర్మస్వరూపం.అది నిరపేక్షం సాపేక్షం అని రెండు రకాలు.నిరపేక్షం అనేది ఇంద్రియాలకు అతీతమైనట్టిది.దానిని పరిమితమైన శక్తిగల ఇంద్రియాలతో మనం ఊహించలేము.

దానికి దగ్గరగా చెప్పగలిగిన ఉదాహరణ ఏమంటే-"అనంత విశాల శూన్యం".

కాలాన్ని కొలవాలంటే ఒక reference point అనేది ఉండాలి.దేశాన్ని కొలవాలన్నా ఒక reference కావాలి.అందుకే ఈ రెండూ సాపేక్షాలని(relative to some reference point) ఐన్ స్టీన్ అన్నాడు.

మనకు తెలిసిన కాలం భూమికీ సూర్యునికీ సంబంధించినది.భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యడం వల్ల కాలం ఏర్పడుతున్నది.తన చుట్టూ తాను తిరగడం వల్ల రోజు ఏర్పడుతున్నది.సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఋతువులూ సంవత్సరమూ ఏర్పడుతున్నవి.

మనం గనుక భూమిని వదలి శూన్యంలోకి పోతే అప్పుడు మనకు భూమికి చెందిన కాలం వర్తించదు.అప్పుడు మనవరకూ కాలం లేనట్లే లెక్క.అసలు సౌరకుటుంబాన్నే వదలి ఇంకా దూరంగా ఉన్న శూన్యంలోకి పోతే అప్పుడు మనకు కాలం అనేది లేదు.నిరపేక్ష కాలం అనేది ఎలా ఉంటుందో ఊహించాలంటే, అనంత నిరవధిక శూన్యంలో మనం నిలిచి ఉన్న స్థితిని ఊహించుకుంటే అదేమిటో కొంచం అర్ధమౌతుంది.

ఇకపోతే సాపేక్షకాలం అనేది మనకు తెలిసినది.భూమిమీద నడచే కాలమే సాపేక్ష కాలం.కాలం ధర్మస్వరూపం గనుక,సాపేక్షమైన కాలానికి (ధర్మానికి) వృద్దీ క్షీణతా ఉంటాయి గాబట్టి మనం కాలాన్ని నాలుగు యుగాలుగా విభజించాం.ఒక్కొక్క యుగంలో ఉన్న ధర్మపుస్థితిని బట్టి వాటికి కృత,త్రేతా,ద్వాపర,కలి అంటూ ఒక క్రమం ఇచ్చుకుంటూ వచ్చాం.

ఈ యుగాల రూపంలో అనంతమైన కాలం నిరంతరమూ పరిభ్రమిస్తూ ఉంటుంది.దీనికి అంతు లేదు.ఈ అనంత కాలవ్యవధితో పోలిస్తే మనిషి జీవితకాలం అల్పాతిఅల్పం గనుక అతని జీవితం ముగిసిన తదుపరి ఈ కాలచక్రంలోనుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు.కానీ అతని ఆశలూ సంస్కారాలూ చావవు గనుక వాటిని తీర్చుకోవడానికి మళ్ళీ ఈ కాలచక్రంలోకి వస్తూ ఉంటాడు.అంటే ఇంకొక శరీరాన్ని తీసుకుని ఇంకొక జన్మ ఎత్తుతాడు.తాను గత జన్మలో చేసుకున్న కర్మవల్ల తరువాత జన్మ కలుగుతుంది.ఈ విధంగా జన్మలు ఎత్తుతూ, కర్మానుసారం సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు.ఎప్పటిదాకా? అంటే,తానెవరో తనకు తెలిసి,తనను పట్టి ఉంచుతున్న మాయను అధిగమించేవరకూ ఇలా జన్మిస్తూనే ఉంటాడు.

ఒక్కసారి మాయను అధిగమించిన తర్వాత,తానెవరో తాను తెలుసుకున్న తర్వాత,ఈ "దేశ-కాల" చక్రాన్ని దాటి వెళ్ళిపోతాడు.అప్పుడు అతను దేనికీ బద్ధుడు కాడు.స్వేచ్చాజీవిగా ఉంటాడు.కావాలనుకుంటే జన్మిస్తాడు. వద్దనుకుంటే వెళ్ళిపోతాడు.

ఇతని స్థితినే నేను "శ్రీవిద్య"లో "గుణాతీత జీవన్ముక్తస్థితి" అన్న అధ్యాయంలో వర్ణించాను.

శ్రీచక్రాన్ని గనుక మనం చూస్తే,అది కూడా ఒక విశ్వపు నమూనా వలె గోచరిస్తుంది.అది ఒక miniature universe అని శ్రీవిద్య పోస్ట్ లలో నేను గతంలో వ్రాసి ఉన్నాను.
  
శ్రీచక్రంలో దేశము (space) మరియు కాలము (time) అనేవి అంతర్భాగాలుగా ఉన్నాయి.వాటిని అధిగమించినప్పటికీ వాటికి ఆధారంగా నిలిచి ఉన్న 'బిందువు' అనేది శ్రీచక్రానికి ఆధారంగా మధ్యలో ఉంటుంది.దానినే విశ్వాధారమైన,విశ్వస్వరూపమైన శివశక్తి స్వరూపంగా మనం దర్శిస్తాం.

ఆ బిందువు చుట్టూ ఉన్న వలయం నిరంతరం పరిభ్రమిస్తూ ఉన్న విశ్వం.ఆ విశ్వభ్రమణంలో,కర్మవలయంలో చిక్కుకుని మాయామోహాలకు బానిసగా మారి విలపిస్తూ,మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ,జీవనయాత్ర సాగిస్తున్న జీవి,ఆ బంధాలను అధిగమించి,స్వస్వరూప జ్ఞానాన్ని పొంది,తనకు ఆధారమైనట్టి బిందువులో ప్రవేశించడమే ముక్తి లేదా మోక్షం అని అంటున్నాం.

దేనినుంచి ముక్తి? దేనినుంచి మోక్షం? అంటే,మనలను పట్టి ఉంచుతున్న బంధాలనుంచి,మనలను కప్పిన మాయామోహాలనుంచి,మనలను ఆవహించిన గర్వాహంకారాలనుంచి,మన అజ్ఞానం నుంచి ముక్తి.

ఒక్క మాటలో చెప్పాలంటే,'నేను-నాది'అనుకుంటున్న సమస్తం నుంచీ ముక్తి. ఈ నేను నాదిలలో,నేను అన్నదే దేశం(space),నాది అన్నదే కాలం(time).కనుక నేను నాది అన్న భావాలనుంచి విముక్తుడు కాగలిగితే మానవుడు దేశకాలాలకు అతీతమైన భూమికలో అడుగు పెట్టగలుగుతాడు. అప్పుడే అతను మోక్షాన్ని పొందగలుగుతాడు.

మాయామోహాలకూ,అహంకార మమకారాలకూ,రాగద్వేషాలకూ  అతీతమైన స్థాయిని అందుకొని నిరవచ్చిన్నమైన నిరతిశయమైన ఆనందానుభవాన్ని అతడు తనలో తానే పొందగలుగుతాడు.

ఇదే శ్రీవిద్యాతంత్రపు పరమసిద్ధి.

ఈ స్థితిని పొందినవాడు యుగాతీతుడౌతాడు.కాలాతీతుడౌతాడు. ప్రపంచాతీతుడౌతాడు.సమస్త బంధాలకూ అతీతుడౌతాడు.దానినే "జీవన్ముక్త స్థితి" అని మన మతంలో పిలుస్తాము.అటువంటి స్థితిని పొందిన వ్యక్తులనే మహనీయులని,జీవన్ముక్తులనీ,సిద్ధపురుషులనీ అంటూ వారిని అమితంగా మనం గౌరవిస్తాము.భగవంతుని తర్వాత స్థానాన్ని వారికిస్తాము.

అటువంటి స్థితిని పొందటమే మన భారతీయ జీవన పరమార్ధం.దీనిని పొందే మార్గములనే మన వేదములు గానీ,ఉపనిషత్తులు గానీ,పురాణములు గానీ చెబుతున్నవి.

వాటిని సరిగా అర్ధం చేసుకుని, అనుసరించి, అవి చూపిస్తున్న గమ్యాన్ని చేరుకునేవారు ధన్యులు.మిగతావారు ఈ దేశ కాల రూపమైన జనన మరణ చక్రంలో,కర్మవలయంలో చిక్కి,పునరపి జననం పునరపి మరణం అన్నట్లు పశు పక్షి జంతు మానవ రూపాలలో అనేక జన్మలలో పుడుతూ చస్తూ ఈ నిరంతర కాలచక్ర వలయంలో పరిభ్రమిస్తూ ఉండక తప్పదు.

(సంపూర్ణం)