నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

24, సెప్టెంబర్ 2014, బుధవారం

యుగసిద్ధాంతం-8 (జీవ పరిణామం-అంతరిక కాలసామ్యాలు)

దశావతారాలు - డార్విన్ సిద్ధాంతం
దశావతారాలను డార్విన్ సిద్ధాంతానికి అతుకు పెడుతూ వివరించాలని చాలామంది ప్రయత్నించారు.కానీ ఈ ప్రయత్నం కొంతవరకే సఫలం అయింది.

ఎందుకంటే చేపగా మొదలైన జీవపరిణామం కృష్ణావతారంతో పరిపూర్ణ మానవునిగా రూపుదిద్దుకుని అక్కడితో అంతం అవుతుంది.ఆ తర్వాత బుద్ధ కల్కి అవతారాల ప్రయోజనం ఇకలేదు.

జీవ పరిణామంలో అత్యున్నత ఘట్టం కృష్ణావతారం.దానిని మించిన పరిపూర్ణ అవతారం లేదు.ఆ తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని త్యజించి అడవులకు వెళ్లి తపస్సు చేసే బుద్ధావతారం అవసరం లేదు.ఏ అడవికీ పోకుండానే ఉన్న చోట ఉంటూనే జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూనే అంతా సాధించవచ్చనీ అత్యున్నత దివ్యత్వాన్ని పొందవచ్చనీ కృష్ణావతారం నిరూపించింది.ఆ తర్వాత బుద్ధ కల్కి అవతారాల ప్రయోజనం ఏమీ లేదు.కనుక నిజం చెప్పాలంటే పరిణామక్రమం కృష్ణావతారంతో అంతమయింది.

ఏకకణజీవిగా నీటిలో మొదలైన జీవం-- చేపగా రూపాంతరం చెంది,నీటిలోనూ నేలమీదా బ్రతికే తాబేలుగా మారి,అనేక పరిణామాలు చెందుతూ అనేక రూపాలు పొందుతూ చివరకు భూమి మీద బ్రతికే సూకరం మొదలైన జీవులుగా రూపాంతరం చెంది,అక్కడితో ఆగకుండా సగం జంతువూ సగం మానవుడూ అయిన నృసింహంగా మారి అక్కడనుంచి మానవుడిగా మారి వేదజ్ఞానాన్ని పొందిన వామనుడిగా,ధర్మరక్షణ కోసం హింసకు వెనుదియ్యని పౌరుషావతారం అయిన పరశురాముడిగా,ఆ తర్వాత ధర్మస్వరూపుడైన రామునిగా,ఆపైన ధర్మాధర్మాలకు అతీతుడైన దివ్యచైతన్య స్వరూపునిగా కృష్ణావతారంతో--పరిణామక్రియలో పరిపూర్ణమౌతుంది.ఈ వివరణను ఇప్పటికే చాలామంది ఇచ్చారు.

నేను దీనికి సమాంతరమైన ఇంకొక వివరణను ఇస్తాను.ఇది మానసికమైన విషయాలకూ మానవుని మనస్సులో చెలరేగే అరిషడ్వర్గాలకూ సంబంధించిన వివరణ.

దశావతారాలు-అరిషడ్వర్గాలు

వేదాలను దొంగిలించి దాక్కున్న ఒక రాక్షసుడిని సంహరించి వేదజ్ఞానాన్ని ఉద్ధరించడం మత్స్యావతార ప్రయోజనం. అంటే అనంతమైన వేద జ్ఞానరాశిని ఎవరికీ అందకుండా ఒకచోట బంధించి ఉంచాలన్న లోభితనాన్ని తొలగించడమే ఈ అవతార ప్రయోజనం.ఇక్కడ లోభాన్ని అంతం చెయ్యడం మనకు కనిపిస్తుంది.జ్ఞానసంపదను మొత్తాన్నీ తానొక్కడే అనుభవించాలన్న లోభాన్ని దైవం అంతం చేసింది.

ప్రపంచంలోని సంపదను మొత్తం దోచుకోవాలన్న దురాశా ఆత్రమూ మనకు సముద్రమధన ఘట్టంలో కనిపిస్తాయి.ఈ కార్యానికి మళ్ళీ భగవంతుడే సహాయం చేసినట్లు కనిపిస్తుంది.అంటే ఒకటిగా ఉన్న సృష్టి అనేక విధాలుగా పరిణామం చెంది జీవులకోసం పంచబడటానికి మళ్ళీ భగవంతుని శక్తియే తోడ్పాటు నందించింది.సృష్టి నడవడానికి ఇది అవసరమైన ప్రక్రియ.అంత మాత్రాన ఎవరుబడితే వారు అన్నీ దోచుకొమ్మని కాదు.

మళ్ళీ అర్హత లేని రాక్షసులు అమృతాన్ని స్వాహా చెయ్యాలని ప్రయత్నిస్తే విష్ణువే మోహినీ రూపంలో దానిని అర్హులైన దేవతలకు మాత్రమే పంచినట్లు మనం చూస్తాం.అసలు నన్నడిగితే దశావతారాలలో మోహినీ అవతారాన్ని చేర్చాలి అంటాను.గర్వంతో మదించిన అజ్ఞానులకు మోహం రూపంలో ఆవరిస్తూ సత్యాన్ని అందకుండా చేస్తున్నది కూడా భగవంతుడే అని ఈ గాధ స్పష్టం చేస్తున్నది.కామక్రోధాది అరిషడ్వర్గాలు కూడా భగవత్స్వరూపాలే అన్న తంత్రభావనకు మూలాలు ఇక్కడ ఉన్నాయని నా ఉద్దేశ్యం.

భూమి మొత్తాన్నీ స్వాహా చెయ్యాలన్న స్వార్ధాన్ని అంతం చెయ్యడం వరాహావతారంలో కనిపిస్తుంది.అంటే ఇది అసూయనూ స్వార్దాన్నీ అంతం చేసే ప్రక్రియ.ఇక్కడ భౌతికమైన సంపదను ఇంకెవరికీ దక్కకుండా తానొక్కడే దోచుకోవాలన్న స్వార్ధాన్ని దైవం అంతం గావించింది.

భగవత్తత్వాన్ని అందుకోవాలని ప్రయత్నం చేసే భక్తునికి ఎదురయ్యే భయంకర ఆటంకాలనూ ఆపదలనూ తొలగించి అతడిని అనుక్షణమూ రక్షించే దివ్యశక్తి మనకు నృశింహావతారంలో కనిపిస్తుంది.క్రోధము, మోహము,మదముల బారినుంచి సాధకుని రక్షించే భగవత్శక్తి మనకు ఇక్కడ దర్శనమిస్తుంది.

వేదజ్ఞానం తప్ప ఇంకేమీ ఆధారం లేని ఒక వటువు ఆ జ్ఞానసహాయంతో మాయను అతిక్రమించి విశ్వరూపం ధరించి సమస్త విశ్వాన్నీ తానే నిండి ఉన్నట్లుగా 'అహం బ్రహ్మాస్మి' అన్న అనుభవాన్ని పొందిన అద్భుతమైన స్థితి వామనావతారంలో కనిపిస్తుంది.వేదజ్ఞానం యొక్క పరిపూర్ణ మహత్త్వం ఇక్కడ మనకు గోచరిస్తుంది.మాయను అతిక్రమించి విశ్వరూపాన్ని పొందిన వేదజ్ఞానపు మహత్తరమైన శక్తి ఇక్కడ మనకు కనిపిస్తుంది.

గర్వంతోనూ అహంకారంతోనూ నిండి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న పరిపాలకులను ఏకైకవీరునిగా తపశ్శక్తితో కూడిన తన సాహసంతో నిర్మూలించి మళ్ళీ ధర్మస్థాపన గావించిన అద్భుతమైన శక్తిస్వరూపం పరశురామావతారంలో మనకు గోచరిస్తుంది.ఇది గర్వాన్నీ అహంకారాన్నీ మదాన్నీ నిర్మూలించే భగవత్శక్తి.

అపరిమితమైన కామంతో నిండి,కనిపించిన అందరినీ చెరబట్టి,ధన,బల,తపో గర్వాలతో లోకాన్ని హింసించే దుష్టత్వాన్ని ఏకాకిగా ఎదుర్కొని అంతం చేసే మహోజ్జ్వలమైన ధర్మస్వరూపం మనకు రామావతారంలో దర్శనమిస్తుంది. కామాన్నీ,క్రోధాన్నీ,మోహాన్నీ,మదాన్నీ,మాత్సర్యాన్నీ అన్నింటినీ ఈ శక్తి నిర్మూలించగలదు.

బలరామ కృష్ణావతారాలలో అయితే,దేనినీ త్యజించకుండా,దేనినీ వదలకుండా,అన్నింటినీ అనుభవిస్తూ కూడా అత్యున్నతమైన దివ్యత్వాన్ని నిత్యజీవితంలో అనుక్షణమూ నిరూపించి చూపించిన మహోన్నతమైన దివ్యశక్తి మనకు కనిపిస్తుంది.అరిషడ్వర్గాలను శత్రువులుగా భావించి నిర్మూలించడం కాకుండా వాటిని తనకు అనువుగా మార్చుకుని దివ్యమైన శక్తులుగా మార్చగల అతీతమైన భగవత్శక్తి కృష్ణావతారంలో మనకు గోచరిస్తుంది.

ఈ విధంగా యుగచక్ర భ్రమణంలో ఆయా సందర్భాలలో తలెత్తే అధర్మపు ఛాయలను అంతం చేసి మళ్ళీ ధర్మాన్ని స్థాపించే విధంగా ఆయా అవతారాలు వచ్చినట్లు మనం చూడవచ్చు.

ఇదే విషయాన్ని నేను గత పోస్ట్ లలో వివరించాను.ఆ క్రమంలో యుక్తేశ్వర్ గిరిగారి యుగ సిద్దాంతాన్ని కొంచం మార్చవలసి వచ్చింది.

స్వామి యుక్తేశ్వర్ గిరి గారిని నేను చిన్నబుచ్చడం లేదు

స్వామి యుక్తేశ్వర్ గిరిగారు పొరపాటు పడ్డారని నేను వ్రాసినందుకు ఆయన అనుయాయులు కొందరు బాధపడినట్లుగా నా దృష్టికి వచ్చింది.ఇందులో నేను ఆయనను చిన్నబుచ్చినది ఏమీ లేదు.మీరు బాధపడవలసిన అవసరమూ లేదు.

యుగసిద్దాంతాన్ని సవరించే ఆయన ప్రయత్నాన్ని నేను ఇంకా ఫైన్ ట్యూన్ చేశాను.అంతేగాని ఆయన్ను నేనేమీ తక్కువ చెయ్యలేదు.నా ఈ ప్రయత్నం చూచి ఆయన ఇంకా సంతోషపడతాడే గాని బాధపడడు.ఆయన శిష్యులు చెయ్యని పనిని నేను చేశాను.దానివల్ల ఆయనకేమీ కోపం రాదు.ఎందుకంటే మహనీయులైన వారికి మనలాగా ఈగో సమస్యలు ఉండవు.సత్యం వెలుగులోకి రావడమే వారు వాంచిస్తారుగాని మనలాగా క్షుద్రములైన ఫీలింగ్స్ పెట్టుకుని బాధపడరు.

మన సాంప్రదాయాలూ మన స్కూళ్ళూ మన యోగశాఖలూ మన మతాలూ దైవసాన్నిధ్యంలో సత్యసామ్రాజ్యంలో ఏమీ పనిచెయ్యవు.అక్కడ ఈ శాఖలు ఏవీ ఉండవు.ఈ మతాలూ ఉండవు.కనుక ఆయనకేదో తక్కువ జరిగింది అన్న బాధను ఆయన అనుచరులు వదలిపెట్టండి.ఆయన ప్రయత్నానికి ఇంకా పరిపూర్ణ న్యాయం జరిగిందన్న విషయం గ్రహించండి.

ఆయన తీసుకున్న ప్రాధమిక సూత్రాలలో కూడా (Fundamental concepts) ఇంకా కొన్ని లోపాలున్నాయి.వాటిలో ఒకదానిని ఇప్పుడు స్పృశిస్తాను.

12000 సంవత్సరాలలో ఒక సగం యుగచక్రమూ ఇంకొక 12000 సంవత్సరాలలో ఇంకొక సగం యుగచక్రమూ జరిగి మొత్తం 24000 సంవత్సరాలలో ఒక పూర్ణమైన యుగచక్రభ్రమణం పూర్తి అవుతుందని ఆయన ఊహించారు.

కానీ వాస్తవం అలా లేదు.

విషువు యొక్క తిర్యక్చలన గతి (rate of precession of exinoxes) ఏడాదికి 50 సెకండ్లని నేడు మనకు తెలుసు.అలాంటప్పుడు మొత్తం రాశి చక్రాన్ని చుట్టిరావడానికి అయనానికి ఎంత సమయం పడుతుంది?

రాశి చక్రానికి 360 డిగ్రీలు.

ఒక డిగ్రీకి 60 నిముషాలు.

ఒక నిముషానికి 60 సెకండ్లు.

కనుక 360x60x60 సెకండ్ల రాశిచక్ర పరిభ్రమణానికి ఎంత సమయం పడుతుంది?

=360x60x60/50

=25,920 సంవత్సరాలు పడుతుంది.

అంటే గ్రహాలతో కూడిన రాశిచక్రం ఒక పూర్తి పరిభ్రమణాన్ని విశ్వంలో చెయ్యడానికి 25,920 సంవత్సరాలు పడుతుంది.

కానీ స్వామి యుక్తేశ్వర్ గారు దీనిని 24,000 గా తీసుకున్నారు.ఇక్కడ ఒక పెద్ద తప్పు దొర్లింది.1920 సంవత్సరాల తేడా వచ్చింది.ఇలా తీసుకోవడానికి ఆయన మనుస్మృతిని ప్రమాణంగా తీసుకున్నారు.మనుస్మృతి మాత్రమే కాదు.భారత భాగవతాది అనేక పురాణాలలో కూడా ఇది 24000 గానే వ్రాయబడింది.కనుక ఆయన తీసుకున్నది సరియైనదే.మరి వాస్తవం దీనిని భిన్నంగా ఉన్నది కదా.దీనిని సరిదిద్దడం ఎలా?

ఎలాగంటే,విశ్వాంతరాళంలో విషువు యొక్క చలనగతి స్థిరంగా లేదు.అది కూడా కాలగతిలో మారుతూ ఉంటుంది.ఇంకొక విధంగా చెప్పాలంటే విషుచలన గతి సరళరేఖలో లేదు.అది ఒక హైపర్ బోలా వలె ఉంటుంది.ఒక గడియారపు లోలకం మాదిరిగా రెండువైపులా ఒక పరిధిని అందుకొని మళ్ళీ క్రిందకు వస్తూ ఉంటుంది.రెండువైపులా ఉన్న ఈ పరిధుల సరాసరి మాత్రమే 24000 గా ఉంటుంది.కనుక మన గ్రంధాలలో చెప్పబడినది సరాసరి మాత్రమే.స్వామి యుక్తేశ్వర్ గారు కూడా దీనినే స్వీకరించారు.కోట్ల సంవత్సరాల కాలగమనంలో దీనివల్ల వచ్చే దోషభేదం చాలా స్వల్పంగా లెక్కించలేనంత అల్పంగా ఉంటుంది.కనుక దానిని  24000 గా చక్కగా తీసుకోవచ్చు.

దీనివల్ల ఇంకొక విషయం కూడా అర్ధమౌతున్నది.

యుగచక్ర పరిభ్రమణం 24000 సంవత్సరాలుగా ఉండాలంటే, విషుచలన గతి ఎంత ఉండాలి?

=360x60x60/x=24000
x=360x60x60/24000
=54 సెకండ్లు

సూర్యసిద్ధాంతంలో కూడా అయనచలన గతి 54 సెకండ్లు గానే చెప్పబడింది. ఇది ప్రస్తుతం 50.33 సెకండ్లుగా ఉన్నది.కనుక వెనక్కు లెక్కిస్తూ,దీని విలువ 54 సెకండ్లు ఎప్పుడైతే ఉన్నదో ఆ సమయంలో ఈ లెక్కలన్నీ వెయ్యబడినట్లుగా మనం నిర్ధారించవచ్చు.లేదా సిద్ధాంత కర్తలు అయనచలన సరాసరిగా 54 ను తీసుకుని ఉంటారనీ అనుకోవచ్చు.

మన్వంతరం-71+  సంవత్సరాలు-యోగసమన్వయాలు

ఇప్పుడు మన్వంతరాల లెక్కను కొంచం చూద్దాం.

ఒక ఏడాదిలో 50 సెకండ్లు అయనచలనం ఉంటుంది.

72 ఏళ్ళలో ఎంత అవుతుంది?

72x50=3600 సెకండ్లు ఉంటుంది.

=రాశి చక్రంలో ఒక డిగ్రీ

కనుక రాశిచక్రంలో ఒక డిగ్రీ భాగాన్ని అయనచలనం దాటే సమయాన్ని ఒక మన్వంతరం అని అన్నారు.బ్రహ్మదేవుని ఒక పగటి సమయంలో 14 గురు మనువులు ఉంటారని చెప్పారు.అధికభాగాన్ని లెక్కలోకి తీసుకుంటే 15 అనుకోవచ్చు.అంటే రాశి చక్రంలో 15 డిగ్రీల కాలం బ్రహ్మదేవుని ఒక పగలు అన్నమాట.ఇది ఒక హోరతో సమానం.కనుక బ్రహ్మదేవుని ఒక పగలూ రాత్రీ కలసిన దినం 30 డిగ్రీలున్న ఒక రాశితో సమానం.అలాంటి 360 దినములు అంటే రాశిచక్రం 30 సార్లు పరిభ్రమణం గావిస్తే అది ఆయనకు ఒక సంవత్సరంతో సమానం అవుతుంది.3000 సార్లు పరిభ్రమణం జరిగితే అది బ్రహ్మదేవుని జీవిత కాలం అవుతుంది(మానవ ప్రమాణంలో).

15 డిగ్రీలు రాశిచక్రం తిరగడానికి 60 నిముషాలు అంటే ఒక గంట పడుతుంది.కనుక బ్రహ్మదేవుని ఒక పగలు మన ఒక గంట సమయంతో సామ్యానికి వస్తున్నది.

రాశిచక్రం మొత్తానికీ దీనిని అన్వయించి చూద్దాం.

అప్పుడు 360/15=24 అవుతుంది.అంటే రాశిచక్రంలో 24 డిగ్రీల కాలం ఒక మన్వంతరం అన్నమాట.అందుకే రోజులో కూడా 24 గంటలు వస్తాయి.ఇదే దినానికీ సంవత్సరానికీ గల సామ్యం.ఈ సామ్యాన్ని ఇంతకుముందు కూడా ప్రస్తావించాను.

రాశిచక్రాన్ని 24 భాగాలు చేసే ఒక అంశచక్రం మనకు ఉన్నది.దానినే చతుర్విమ్శాంశ అంటాము.పరాశరులు చెప్పిన "విద్యాయాం వేదబాహ్వంశే" అన్న సూత్రాన్ని బట్టి ఇది విద్యను సూచిస్తుందని మన భావన.ఈ విద్య లౌకికం కావచ్చు ఆధ్యాత్మికం కూడా కావచ్చు.ఒకని జాతకంలో చతుర్వింశాంశ చక్రాన్ని చూచి ఆ జాతకుని లౌకిక ఆధ్యాత్మిక విద్యను మనం అర్ధం చేసుకోవచ్చు.

అలాగే పంచదశాంశను లెక్కిస్తే అది ఒక మన్వంతరాన్ని సూచించాలి.కానీ పంచదశాంశ గణనం షోడశ వర్గాలలో లేదు.పరిశోధించి చూడాలి. 

ఇకపోతే బ్రహ్మదేవుని ఒక పగలుకూ మన ఒక పగటి కాలానికీ సామ్యం ఉన్నది గనుక మన ఒక పగటి కాలమైన 12 గంటలను 15 భాగాలు చెయ్యగా మనకూ ఒక మన్వంతరం రావాలి.

దిన మన్వంతరం=12x60 నిముషములు/15
=48 నిముషములు

ఇది రెండు ఘడియల(ఒక ముహూర్త) కాలం.అంటే రెండు 24 నిముషాలు కలసిన కాలవ్యవధి.

అంటే ఒక రోజులో రెండు ఘడియల(ముహూర్త)కాలమే మన్వంతరం అన్నమాట. చూచారా విశ్వగణనానికీ మన మానవ గణనానికీ ఎలా సామ్యాలున్నాయో?

ఇక్కడ ఒక చిన్న రహస్యం చెబుతాను.

ధ్యానాభ్యాసం చేసేవారికి ఇది అనుభవంలో ఉంటుంది.

సామాన్య మానవుడు అలుపు లేకుండా ధ్యానం చెయ్యగల సమయం ఖచ్చితంగా 48 నిమిషాల కాలమే.సాధారణంగా ధ్యానపు ఒక సెషన్ ముగించి సమయాన్ని చూస్తే ఖచ్చితంగా 45 నుంచి 50 నిముషాల మధ్యలోపే ఉంటుంది.కావాలంటే గమనించండి.

అంతేకాదు మీరు ఏదైనా పనిని,ఉదాహరణకు ఆఫీస్ లో ఒక పనిని, ఏకధాటిగా చేస్తూ పోతే 48 నిముషాల తర్వాత మీకు కొంత రెస్ట్ అవసరం అనిపిస్తుంది.ఎందుకంటే సామాన్య మానవుని మెదడు ఈ సమయం తర్వాత కొంత రిలాక్సేషన్ కోరుకుంటుంది.దీనిని కూడా గమనించండి.ఎందుకంటే మెదడులో రెండు సగ భాగాలుంటాయి.ఒక్కొక్క భాగమూ రోజులో ఉన్న 24 గంటలకు సూచికగా 24 నిముషాలు మాత్రమే ధ్యానంలో ఉండగలదు.అలా మెదడులోని రెండు భాగాలూ కలసి 48 నిముషాలు మాత్రమే అలుపు లేకుండా ధ్యానంలో ఉండగలదు.

అంటే సామాన్య మానవుడు ఒక మన్వంతరం పాటు మాత్రమే ధ్యానం చెయ్యగలడు.దానిని దాటి ఇంకొక 48 నిముషాల పాటు చెయ్యగలిగితే ఒక మన్వంతరాన్ని దాటి ఇంకొక మన్వంతరంలో అడుగుపెట్టే శక్తి వస్తుంది. అప్పుడే సాధకుడు సూక్ష్మలోకాలను దర్శించగలుగుతాడు.సూక్ష్మ విషయాలను గ్రహించగలుగుతాడు.అలా చెయ్యాలంటే కనీసం 2x48=96 నిముషాల పాటు ఏకధాటిగా ధ్యానం చేసే శక్తి ఉండాలి.ఇది ధ్యానాభ్యాసంలో మినిమం స్థాయి.అక్కడ నుంచి ఒక్కొక్క మన్వంతరాన్ని దాటుతూ వెళ్ళగలిగితే అప్పుడు విశ్వంలోని ఇంకాఇంకా అతీతములైన విషయాలను గ్రహించే సామర్ధ్యం అతనికి కలుగుతుంది.అంటే 48 నిముషాలను ఒక యూనిట్ గా తీసుకుని ధ్యాన సమయాన్ని పెంచుతూ పోవాలి.

అంతరిక సాధనలో ఇదొక చిన్న రహస్యం.ఇలాంటి రహస్యాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి.కానీ వాటిని ఊరకే బహిర్గతం చెయ్యడం వల్ల ఉపయోగం లేదు.అర్హులకు సాధనాక్రమంలో అన్నీ అవే అర్ధమౌతాయి.ఒక చిన్న విషయాన్ని మాత్రమే ఇక్కడ సూచించాను.

ఈ విధంగా సూర్యచలనానికీ,గ్రహచలనానికీ,అయనచలనానికీ, యుగాలకూ, విశ్వభ్రమణానికీ,అంతరికసాధనకూ అవినాభావ సంబంధాలున్నాయి.

ఇంతవరకు అర్ధమైతే చాలు.

(ఇంకా ఉన్నది)