నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

యుగసిద్ధాంతం-6(స్వామి యుక్తేశ్వర్ గిరిగారి లెక్క తప్పిందా?ప్రస్తుతం నడుస్తున్నది త్రేతాయుగమా?)

ఈ పోస్ట్ లో ఇంకొన్ని విప్లవాత్మకములైన,అయినప్పటికీ,సత్యములైన భావాలను మీ ముందు ఉంచుతాను.ఏ విధమైన కల్మషమూ మనసులో పెట్టుకోకుండా నిర్మలమైన మనస్సుతో దీనిని చదివితే నేను వ్రాస్తున్నది నిజమే అని మీరే ఒప్పుకుంటారు.

The Holy Science అనే పుస్తకంలో శ్రీ యుక్తేశ్వర్ గిరిగారు వ్రాసిన విధంగా అయితే 11,500 BC లో మొదలైన ఒక 12,000 సంవత్సరాల అవరోహణ యుగం 500 AD లో ముగిసింది.అక్కడనుంచి మొదలైన ఆరోహణా కలియుగపు 1200 సంవత్సరాల కాలం 1700 AD తో ముగిసింది.కనుక ఆయన చెప్పిన ప్రకారం చూస్తే ప్రస్తుతం మనం ఆరోహణా ద్వాపరయుగంలో 314 వ సంవత్సరంలో ఉన్నాం.

కానీ,పరిశోధకులు చెబుతున్నట్లుగా కలియుగ ప్రారంభతేదీకీ స్వామి యుక్తేశ్వర్ గిరిగారి వాదానికీ పొత్తు కుదరదు.ఎలాగంటే,చాలామంది ప్రస్తుతం ఒప్పుకుంటున్న దానినిబట్టి కలియుగం అనేది 3102 BC లో మొదలైంది. డా||నరహరి ఆచార్ మొదలైన కొందరు పరిశోధకులు నిర్ధారించిన దానిని బట్టి మహాభారత యుద్ధం అనేది  3067 BC లో జరిగింది.ఆ తర్వాత 36 ఏళ్ళకు కృష్ణుడు దేహత్యాగం చేశాడు గనుక 3031 BC లో కలియుగం మొదలై ఉండాలి.కనుక వీరి వాదనను బట్టి అది 3031 BC లో మొదలైంది.స్థూలంగా చూస్తే కలియుగ ప్రారంభం 3000 BC ప్రాంతంలో అని అనుకోవచ్చు.కానీ స్వామి యుక్తెశ్వర్ గిరిగారి ప్రకారం కలియుగం అనేది 700 BC లో మొదలైంది.అప్పుడే అది 500 AD కి తన 1200 సంవత్సరాల అవరోహణా కాలాన్ని పూర్తి చెయ్యగలుగుతుంది.
  • జ్యోతిష్య,ఖగోళ పరిశోధనల ప్రకారం కలియుగం 3000 BC ప్రాంతంలో మొదలైంది.
  • కానీ, స్వామి యుక్తేశ్వర్ గిరి గారి లెక్క ప్రకారం అది 700 BC లో మొదలైంది.
మరి ఈ రకరకాలైన సంవత్సరాలలో అసలైన కలియుగం మొదలైనది ఎప్పుడు?

BC 3102 లోనా? లేక BC 3031 లోనా?లేక BC 700 లోనా?పోనీ ఏదో ఒకటిలే అనుకోవడానికి కుదరదు.ఎందుకంటే ఈ మూడూ పక్కపక్కన లేవు.మూటికీ ఒక ద్వాపర యుగానికి ఉన్నంత అంటే 2400 సంవత్సరాల తేడా ఉన్నది.

కనుక ఈ మూటిలో ఒకటి మాత్రమే సాధ్యమౌతుంది.

వీటిలో BC 3102 కి మాత్రమే కొంత ప్రామాణికత కనిపిస్తున్నది.ఎందుకంటే ఆ సమయానికి మాత్రమే మహాభారతంలో చెప్పబడిన ఖగోళపరిస్థితులు ఆకాశంలో ఉన్నాయి.700 BC కి ఈ ఆధారాలు లేవు.

కనుక స్వామి యుక్తేశ్వర్ గిరిగారి ఊహ తప్పని నిర్దారింప బడుతున్నది. ఈ సందర్భంగా ఆయన భావాలనూ లెక్కలనూ కొంచం లోతుగా పరిశీలిద్దాం.

అసలు 12000 సంవత్సరాల నిడివి గల వ్యావహారిక మానవయుగ ప్రారంభాన్ని BC 11500 గా ఆయన ఎలా తీసుకున్నారు? అనే సందేహం తలెత్తుతుంది.నవీన మంచుయుగం BC 12500 - BC 10500 మధ్యలో ఎప్పుడో ఒక సమయంలో అయిపోయిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.ఇది రెండు మూడు సంవత్సరాల సమయం కాదు.2000 సంవత్సరాల కాలవ్యవధి.అంటే ఒక కలియుగమూ లేదా దాదాపు ఒక ద్వాపరయుగమూ కూడా అయిపోయేటంత సమయం.

ఇదంతా ఆలోచిస్తే ఒక్క విషయం స్ఫురిస్తుంది.

AD 1700 తర్వాతనే సైన్స్ ఆవిష్కరణలు బాగా ప్రారంభమయ్యాయి. విద్యుత్తూ,అయస్కాంత శక్తీ,పారిశ్రామిక విప్లవమూ ఇవన్నీ ఆ తర్వాతే మొదలయ్యాయి.కనుక అప్పటికి ఒక యుగం అయిపోయి ఇంకొక యుగం మొదలయి ఉంటుందన్న ఊహతో ఆ సమయానికి సరిపెట్టడానికి ఆయన BC 11500 ని యుగచక్రప్రారంభంగా తీసుకుని ఉండవచ్చు.ఈ విషయాన్ని ఆయన తన పుస్తకం ముందుమాటలో స్పష్టంగానే వివరించాడు.

కానీ ఈ లెక్కలు 3102 BC ని కలియుగ ప్రారంభంగా నిర్ధారిస్తున్న ఖగోళపరమైన జ్యోతిష్య పరమైన లెక్కలతో సరిపోవడం లేదు.

ఒకవేళ 3102 BC అనేది కలియుగ ప్రారంభ సంవత్సరం అనుకుంటే,దానిని వ్యావహారిక యుగసంవత్సరాలతో కొలిస్తే,

అప్పుడు 3102 BC-2400(1200 అవరోహణా కలియుగం+1200 ఆరోహణా కలియుగం)=700 BC కి 2400 సంవత్సరాల ఆరోహణా ద్వాపరయుగం మొదలై ఉండాలి.అది 1700 AD తో అయిపోయి ఉండాలి.

అలాంటప్పుడు 1700 AD నుంచి ఆరోహణా త్రేతాయుగం మొదలై ఉండాలి.

అంటే మనం ఇప్పుడు 2014AD లో,314 త్రేతాయుగంలో ఉన్నామన్నమాట.

పోనీ కలియుగం 3031 BC లో మొదలైందన్న రెండో వాదనను స్వీకరిస్తే అప్పుడు AD 1800 నుంచీ ఆరోహణా త్రేతాయుగం మొదలై ఉండాలి.

అలా చూస్తే ఇప్పుడు మనం 214 త్రేతాయుగంలో ఉన్నామన్నమాట.అంటే ఒక నూరు సంవత్సరాల అటూ ఇటూగా మనం ప్రస్తుతం వ్యావహారిక(మానవ) త్రేతాయుగంలో ఉన్నామన్న విషయం తార్కికంగా తెలుస్తుంది.

అంటే,మహాసంకల్పం ప్రకారం ప్రస్తుతం విశ్వంలో కలియుగం నడుస్తున్నప్పటికీ,వ్యావహారిక యుగాలలెక్కలలో మాత్రం త్రేతాయుగం నడుస్తున్నదా?

నా లెక్కలను బట్టి అవుననే అంటాను.

అయితే,దీనిని బట్టి నవీన మంచుయుగం లెక్కలు కూడా మారిపోతాయి.

ఎలా?

3102 BC కలియుగ ప్రారంభం గనుక 1900 BC తో అది అయిపోయి ఉండాలి.అంటే అంతకు ముందు 12000 సంవత్సరాల క్రితం 13900 BC లో నవీన మంచుయుగం మొదలై ఉండాలి.కనుక యుక్తేశ్వర్ గిరిగారు అనుకున్నట్లు యుగచక్రం 11500 BC లో కాకుండా 13900 BC లో మొదలై ఉండాలి.

లేదా కలియుగ ప్రారంభ సంవత్సరం BC 3031 అనుకుంటే,అప్పుడు యుగచక్రం 13800 BC లో మొదలై ఉండాలి.మంచు యుగం కూడా అప్పుడే అయిపోయి ఉండాలి.

ఇప్పుడు మన ఊహాశక్తికీ స్ఫురణశక్తికీ  పదును పెడదాం.

పైన అనుకున్నట్లుగా,ఆరోహణా ద్వాపరయుగం అనేది 700 BC నుంచి 1700 AD వరకూ 2400 సంవత్సరాల కాలం పాటు జరిగితే  ఆ సమయంలో ద్వాపరయుగంలో రావలసిన కృష్ణుని అవతారం మళ్ళీ వచ్చి ఉండాలి. అయితే అలాంటి అవతారం ఆ సమయంలో వచ్చిందా? అని ఆలోచిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి.

ప్రతీ వ్యవహారిక ద్వాపరయుగంలోనూ కృష్ణుని అవతారం రాదు.ప్రతి వ్యవహారిక త్రేతాయుగంలోనూ శ్రీరాముని అవతారం రాదు.ఆ అవతారాలు దైవయుగాల లెక్కలలో వచ్చే ద్వాపర,త్రేతాయుగాలలో మాత్రమే వస్తాయి. వ్యావహారిక యుగాలలో అవి రావు.

కానీ అలాంటి పోకడలే ఉన్న మహాపురుషుల లేదా దైవాంశ సంభూతుల జననం ఆయా వ్యావహారిక యుగాలలో కూడా జరుగుతుంది.

ఈ లెక్కన చూస్తే ఈ వ్యావహారిక ద్వాపరయుగపు కాలంలో 700 BC-1700 AD మధ్యలో జీసస్ క్రీస్ట్ జననం జరిగింది.

క్రీస్ట్ జీవితానికీ కృష్ణుని జీవితానికీ చాలా పోలికలున్నాయి.

చాలామంది ప్రాశ్చాత్యులే ఈ విషయాన్ని గమనించి ఆశ్చర్యపోయారు.కొంతమంది ఎంతదూరం వెళ్ళారంటే అసలు క్రీస్ట్ అనేవాడు పుట్టనే లేదు.కృష్ణుని జీవితాన్నే క్రైస్తవులు కాపీ కొట్టారు అని వ్రాసేటంత వరకూ వెళ్ళారు.ఈ పనిని మనవాళ్ళు చెయ్యలేదు.పాశ్చాత్య రచయితల లోనే ఈ వర్గం వారు చాలామంది ఉన్నారు.

ఇప్పుడు క్రీస్తు కీ కృష్ణునికీ ఉన్న పోలికలు గమనిద్దాం.

  • Christ అనే పదానికీ Chrishna అనే పదానికీ సామ్యం ఉన్నది.
  • కృష్ణ జననసమయంలో అనేక మహిమలు జరిగాయి.క్రీస్ట్ జనన సమయంలో కూడా అనేక మహిమలు జరిగాయి.
  • కృష్ణుడు పుట్టిన సమయంలో ఆయన్ను చంపాలని కంస మహారాజు ప్రయత్నించాడు.చాలామంది పిల్లలను చంపించాడు కూడా.ఎందుకంటే ఆ పిల్లవాని చేతిలో తనకు చావున్నదని జ్యోతిష్కులు చెప్పడం వల్ల.
  • అలాగే క్రీస్ట్ పుట్టిన సమయంలో హీరోడ్ అనే రాజు అతన్ని చంపాలని ప్రయత్నించాడు.ఆ సమయంలో పుట్టిన పిల్లలను అనేకమందిని చంపించాడు కూడా.అతనికి కూడా ఈ విషయం జ్యోతిష్కులే చెప్పారు.
  • అయితే,కొంతవరకే ఈ సామ్యాలున్నాయి.పూర్తిగా లేవు.ఉదాహరణకు కృష్ణుడు కంసున్ని సంహరించాడు.కానీ క్రీస్తు హీరోడ్ ను చంపలేదు.అయితే కృష్ణుడూ క్రీస్తూ ఇద్దరూ కొంతకాలం పాటు అజ్ఞాతంలో బ్రతికారు.
  • కృష్ణుడూ క్రీస్తూ తమతమ జీవితాలలో ఎన్నో మహిమలు చేశారు. ఎందరికో జ్ఞానబోధ చేశారు.
  • కృష్ణుడు అనాకారి అయిన కుబ్జను ఉద్ధరించి అపురూప సౌందర్యవతిగా మార్చాడు.వేశ్య అంటూ లోకమంతా అసహ్యించుకుంటున్న మగ్దలేన్ మేరీని క్రీస్తు చేరదీసి ఆదరించాడు.
  • కృష్ణునకు గోపికలతో రాసలీల జరిగింది.అలాగే క్రీస్ట్ కూ మాగ్డలీన్ మేరీ తో పెళ్ళయిందనీ ఆమె అతని అనుచరురాలూ భక్తురాలూ మాత్రమే గాక ప్రియురాలు కూడా అనీ నమ్మే ఒక వర్గం ఇప్పటికీ ఉన్నది.కాశ్మీర్లో నివసించిన క్రీస్ట్ ఆమెతో సంసారం జరిపాడనీ వారికి పుట్టిన సంతానమే ఫ్రాన్స్ రాచరిక కుటుంబమనీ నమ్ముతూ అనేక పుస్తకాలూ పరిశోధనలూ సినిమాలూ కూడా వచ్చాయి.
  • కృష్ణుడు తన కాలికి తగిలిన ఒక బోయవాని బాణం దెబ్బకు మరణించాడు.క్రీస్ట్ కూడా తన కాళ్ళకూ చేతులకూ కొట్టబడిన మేకుల దెబ్బలకు మరణించాడు.బాణం దెబ్బా మేకు దెబ్బా దగ్గర దగ్గరగా ఒకరకంగానే ఉంటాయి.
కృష్ణుడే క్రీస్తు అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు.కానీ వీరి ఇద్దరి జీవితాలలో పోలికలు ఉన్నాయని చెప్పడంవరకే నా ఉద్దేశ్యం.పైగా మన లెక్కలలో తేలుతున్న వ్యావహారిక ద్వాపరయుగపు సమయంలోనే క్రీస్ట్ జననం జరిగింది.

కనుక మన లెక్కలలో తేలిన వ్యావహారిక ద్వాపర యుగంలో కృష్ణుని అవతారం రాలేదు గాని,కృష్ణునితో కొన్ని పోలికలున్న క్రీస్ట్ జననం జరిగింది.

ఇక పోతే 1700 AD లేదా 1800 AD తర్వాత మన లెక్క ప్రకారం త్రేతాయుగం మొదలైంది.అప్పుడు త్రేతాయుగం గనుక శ్రీరాముని అవతారం వచ్చి ఉండాలి.అది ఎక్కడుంది?

చదువరులకు దిగ్భ్రాంతి కల్గించే విషయం ఇప్పుడు చెబుతాను.

సరిగ్గా 1836 AD లో శ్రీరామకృష్ణుని జననం జరిగింది.పూర్వయుగాలలో రాముడూ కృష్ణుడూ తానే అని ఆయన ఎన్నోసార్లు తన అంతరంగ భక్తులతో చెప్పడమే గాక దానికి అనేక నిదర్శనాపూర్వకములైన దర్శనాలు వారికి అనుగ్రహించి ఉన్నారు.స్వయానా వివేకానందస్వామితో ఈ మాటను ఆయన అన్నారు.

ఆయన జాతక చక్రాన్ని గనుక మనం గమనిస్తే ఒక దైవావతారానికి ఉండవలసిన శక్తివంతములైన లక్షణాలు ఆ జాతకంలో ఉండటం జ్యోతిశ్శాస్త్రం ఏ కొద్దిగా తెలిసిన ఎవరికైనా స్ఫురిస్తుంది.

తన చివరిదశలో శ్రీరామక్రిష్ణులు టెర్మినల్ కేన్సర్ తో చాలా బాధపడుతూ ఉన్నారు.ఆ సమయంలో నరేంద్రుడు ఒకరోజున ఆయన మంచం దగ్గర కూర్చుని ఈ విధంగా తనలో తాను అనుకున్నాడు.

'తాను దైవం యొక్క అవతారాన్నని గురుదేవులు చాలాసార్లు మాతో అన్నారు.తాను పడుతున్న ఈ బాధ అంతా లోకపు పాపాన్ని తన శరీరం మీదకు ఆవహింప చేసుకున్నందుకే అని కూడా ఆయన చాలాసార్లు చెప్పి ఉన్నారు.కానీ భయంకరమైన బాధను అనుభవిస్తున్న ఈ సమయంలో కూడా ఆయన అదే మాటను అంటే అప్పుడు మాత్రమే నేను ఆ విషయాన్ని నమ్ముతాను.'

భగవంతుడైనా సరే మన కళ్ళ ఎదురుగా ఒక దేహంతో వచ్చి మనలాగే తింటూ తిరుగుతూ రోగాలతో రొష్టులతో బాధపడుతూ ఉంటె ఆయనను మనం నమ్మలేం కదా?మాయాప్రభావం చాలా గట్టిది.నరేంద్రుడు సామాన్య మానవుడు కాదు.కారణజన్ముడు.కానీ ఆయనను కూడా మాయ ఒదిలిపెట్టలేదు.

స్వయంగా శ్రీరామకృష్ణుని స్పర్శతో నరేంద్రుడు సమాధిస్థితి అంటే ఏమిటో చవిచూచాడు.అయినా సరే,ఆయనొక మహాపురుషుడని అనుకున్నాడు గాని అవతారం అని ఆయనకూడా చాలాకాలం నమ్మలేకపోయాడంటే భగవంతుని యోగమాయా ప్రభావం ఎంత గట్టిదో అర్ధం చేసుకోవచ్చు.

"మమ మాయా దురత్యయా(నా మాయను దాటడం అంత సులభం కాదు)" అని స్వయానా భగవంతుడే గీతలో చెప్పినాడు.

మహనీయుడైన నరేంద్రుడినే మాయ అలా కప్పితే ఇక మూర్ఖులూ అహంకార పూరితులూ అయిన మామూలు మనుషులను వదులుతుందా?అలాంటి మూర్ఖులు ఏం చేస్తారో భగవంతుడే స్వయంగా గీతలో చెప్పినాడు.

శ్లో||అవజానన్తి మాం మూఢాం మానుషీం తనుమాశ్రితాం
పరం భావమజానన్తో మమ భూత మహేశ్వరం

"నేను మానవదేహంలో అవతరించినపుడు మూర్ఖులైన మానవులు నన్ను అర్ధం చేసుకోలేక ఎగతాళి చేస్తారు.కానీ సమస్త జీవులకూ ప్రభువునైన భగవంతుడను నేను అన్న విషయం వారు ఎరుగలేరు."

(భగవద్గీత 9:11)

నరేంద్రుని మనస్సులో ఈ ఆలోచన మెదిలీ మెదలక ముందే శ్రీరామకృష్ణులు స్పష్టంగా ఇలా అన్నారు.

'మునుపు ఎవరు రాముడో ఎవరు కృష్ణుడో అతడే ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాడు.అయితే అది నీ వేదాంతపు కోణంలో కాదు.'

'వేదాంతపు కోణంలో'- అనే మాటకు అర్ధం ఏమంటే,వేదాంతం చెప్పేటట్లు "జీవో బ్రహ్మేతి నాపర:" అనే మాట ప్రకారం ప్రతి జీవుడూ బ్రహ్మమే గనుక నేనూ బ్రహ్మమునే అనే భావంలో కాదు.వేదాంతభావానికి భిన్నంగా- "నేను సత్యమైన దైవావతారాన్నే" అని అత్యంత స్పష్టంగా నిర్దుష్టంగా ఆయన వివేకానందునికి చెప్పినారు.

అయితే శ్రీ రామకృష్ణుని జీవితానికీ శ్రీరాముని జీవితానికీ సామ్యాలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం.
  • శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసం చేసాడు.
  • శ్రీరామకృష్ణులు 14 ఏళ్ళు పంచవటి అనే అడవిలో ఉంటూ లోకంతో సంబంధంలేని మహోన్నత దివ్యస్థితులలో సాధన గావించారు.
  • దశరధుని ప్రార్ధనల ఫలితంగా యాగఫలితంగా శ్రీ మహావిష్ణువు ఆయనకు కుమారునిగా జన్మించాడు.
  • శ్రీరామకృష్ణుని తండ్రి అయిన ఖుదీరాం చటోపాధ్యాయ యొక్క అత్యంత నియమనిష్టలతో కూడిన ఋజువర్తనాపూరిత తపోమయ జీవితపు ఫలంగా ఆయన కలలో గయాక్షేత్రాధిదేవతా గదాధరుడూ అయిన మహావిష్ణువు దర్శనం ఇచ్చి 'నీ కుమారునిగా నేను జన్మిస్తున్నాను' అని చెప్పాడు.అందుకే తన కుమారునికి "గదాధరుడని" ఖుదీరాం నామకరణం గావించాడు.శ్రీ రామకృష్ణుని అసలుపేరు "గదాధర్".
  • ఇంకొక సమయంలో శ్రీరామచంద్రుడు ఆయన కలలో కనిపించి- "నేను నీ ఇంటికి వస్తున్నాను" అని పలికి మాయమౌతాడు.వారి కులదైవం కూడా రఘురాముడే.రఘువీర సాలగ్రామం వారి ఇంటిలో తరతరాలుగా ఉండేది.దానిని వారు ప్రతిరోజూ నిష్టగా పూజించేవారు.
  • రావణుని బాధతో తల్లడిల్లి పోతున్న లోకాన్ని రక్షించడానికి శ్రీరాముడు అవతరించాడు.
  • ఆధ్యాత్మిక చీకటిలో మగ్గిపోతున్న లోకాన్ని ఉద్ధరించి దానికి దైవత్వపు వెలుగును ఇవ్వడానికి శ్రీరామకృష్ణుని అవతారం వచ్చింది.అందుకే మనం గనుక గమనిస్తే శ్రీకృష్ణుని తర్వాత సాగిన దాదాపు 5000 ఏండ్ల అజ్ఞానపు చీకటిని పోగొడుతూ వచ్చిన అవతారం శ్రీరామకృష్ణులదే.
  • ఆయన అవతరించిన తర్వాత ఈ రెండువందల సంవత్సరాలలో ఎంతమంది మహనీయులు పుట్టుకొచ్చారో వారు మరి ఇన్ని వేల ఏండ్లుగా ఎందుకు పుట్టలేదో,ఉన్నట్టుండి గత రెండువందల ఏళ్ళుగా మాత్రమే ప్రపంచంలో ఇంత ఆధ్యాత్మిక చైతన్యం ఉన్నట్టుండి ఎందుకు కనిపిస్తున్నదో జాగ్రత్తగా గమనిస్తే శ్రీ రామకృష్ణుల అవతారతత్త్వం ఏమిటో దాని ప్రభావం ఏమిటో అర్ధమౌతుంది.
  • రామభక్తుడైన ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంకకు పోయి సీతమ్మ జాడను కనుగొనిన కారణంగా ఈనాటికీ మనదేశంలోని గ్రామగ్రామానా పూజలందుకుంటూ ఉన్నాడు.
  • శ్రీరామకృష్ణుని ప్రియశిష్యుడైన వివేకానందస్వామి సముద్రాన్ని దాటి విదేశాలకు పోయి అక్కడ భారతీయ సనాతనధర్మం యొక్క దివ్యవాణిని వినిపించి ప్రపంచపు కళ్ళు తెరిపించి మనం మరచిపోయిన మన అసలైన ధర్మాన్ని మన కళ్ళ ఎదుట నిలిపినందుకు ఈనాటికీ ఆయన్ను మనం ప్రాతస్మరణీయునిగా గౌరవిస్తున్నాం.
  • అంతేకాదు వివేకానందస్వామిలో శివాంశ ఉన్నదని శ్రీరామకృష్ణులు తరచూ అనేవారు.ఆంజనేయుడూ శివాంశసంభూతుడే అని మన నమ్మకం కదా.
  • ధర్మస్థాపన కోసం శ్రీరాముని అవతారం వచ్చింది.
  • "స్థాపకాయచ ధర్మస్య" అన్న మాటతో శ్రీరామకృష్ణస్తోత్రాన్ని వివేకానందులు ప్రారంభించారు."సర్వధర్మ స్థాపకత్వం సర్వధర్మ స్వరూపక:" అని స్వామి అభేదానంద రచించిన శ్రీరామకృష్ణస్తోత్రం ఆయన్ను స్తుతిస్తుంది.
  • శ్రీరాముని అవతారం వచ్చినపుడు ఆయా దేవతలూ ఆయుధాలూ ఆయనతో దిగివచ్చారు.
  • శ్రీరామకృష్ణుని అవతరణం జరిగినప్పుడు దివ్యలోకాలలో ఉండే మహనీయులు ఆయనతో దిగి వచ్చారు.వివేకానందస్వామి సప్తఋషులలో ఒకరని రామకృష్ణులు చెప్పినారు.
  • అలాగే ఆయన జీవితలీలలో ఉన్నట్టి మిగతావారు కూడా దైవాంశ సంభూతులే.
  • ఉదాహరణకు,శ్రీరామకృష్ణుని ప్రత్యక్షశిష్యులలో ఒకరైన స్వామి విజ్ఞానానంద పూర్వజన్మలో జాంబవంతుడు.మంచి ఒడ్డూపొడుగూ ఉన్న యువకుడైన విజ్ఞానానందస్వామితో మధ్యవయస్సులో బలహీనంగా ఉన్న శ్రీరామకృష్ణులు ఒకనాడు సరదాగా కుస్తీపట్టి సునాయాసంగా ఆయన్ను గోడకు అణచిపట్టి ఓడించారు.
  • "గురుదేవా.మీరెందుకు నాతో కుస్తీ పట్టాలని అనుకుంటున్నారు?" అని అడిగిన విజ్ఞానానందస్వామితో ఆయన ఇలా అన్నారు."ఇది మొదటిసారి కాదు.ఇంతకు ముందు కూడా ఒక సందర్భంలో నీతో నేను కుస్తీ పట్టాను.అది నీవు మరచిపోయావు."
  • విజ్ఞానానందస్వామి ఆజన్మ బ్రహ్మచారి.కానీ తన కుటుంబాన్ని(అంటే తల్లినీ,చెల్లెళ్ళనూ,తమ్ముళ్ళనూ) పోషించి వారిని ఒక దారికి తేవడానికి ఆయన నూరు సంవత్సరాల క్రితమే సివిల్ ఇంజనీరింగ్ చదివి ప్రభుత్వంలో చీఫ్ ఇంజనీరుగా పనిచేశారు.తన లౌకిక బాధ్యతలను నిర్వర్తిస్తూ గురుదేవుల ఉపదేశం ప్రకారం బ్రహ్మచర్యమూ అంతరిక సాధనతో కూడిన జీవితాన్ని ఆయన గడిపారు.తన బాధ్యతలు తీరిన తర్వాత సన్యాసం స్వీకరించారు.
  • లంకకు వారధి నిర్మిస్తున్న సమయంలో జాంబవంతుడు కూడా ఆ పనిని దగ్గరుండి పర్యవేక్షించాడు.బేలూర్ మఠంలో ప్రస్తుతం ఉన్న శ్రీరామకృష్ణుని బృహత్తర దేవాలయాన్ని డిజైన్ చేసి దగ్గరుండి దానిని కట్టించినది విజ్ఞానానంద స్వామియే.ఈ రకంగా పూర్వజన్మ సంస్కారాలు తరువాతి జన్మలలో కూడా జీవులను నడిపిస్తాయి.
  • బాలకృష్ణుని నిత్యదర్శనాన్ని తనయొక్క చర్మచక్షువులతో పొందిన 'గోపాలేర్ మా' యశోదాదేవి అంశతో జన్మించిన మహనీయురాలు.ఆమె శ్రీరామకృష్ణుని అంతరంగ భక్తులలో ఒకరు.శ్రీరామకృష్ణుని చూస్తూనే ఆమెకు సమాధిస్థితి కలిగేది.ఆయనకు తన చేతితో ప్రేమగా స్వీట్లు తినిపించేది.శ్రీరామకృష్ణుని జీవితం చదివితే ఈ విషయాలన్నీ తెలుస్తాయి.
  • శారదామాత 1920 ప్రాంతంలో దక్షిణదేశయాత్రకు వచ్చారు.ఆ సమయంలో రామేశ్వరంలోని శివలింగాన్ని చూచినప్పుడు ఆనంద సమాధిస్థితి(blissful trance)లో ఉన్న అమ్మ ఇలా అనడం పక్కన ఉన్నవారు విని రికార్డ్ చేసి ఉంచారు.
"అప్పట్లో నేను ప్రతిష్టించిన శివలింగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉన్నది"
  • రామేశ్వర శివలింగాన్ని ప్రతిష్టించినది సీతారాములే అన్నది జగద్విదితం.
  • శ్రీరామకృష్ణులు దివ్య సమాధిస్థితులలో ఉన్నపుడు కొన్నిసార్లు ఇలా అనేవారు-"నా ధనుస్సూ బాణాలూ ఎక్కడ?వాటిని తెచ్చి ఇవ్వండి".
  • ఒకసారి సమాధిస్థితిలో ఉన్నపుడు ఆయన ఇలా అనడం పక్కనే ఉన్న వివేకానందాది శిష్యులు విన్నారు-"ఒక సందర్భంలో నేను పద్నాలుగేళ్ళ పాటు అడవిలో నివసించాను".
ఈ విధంగా శ్రీరాముని జీవితానికీ శ్రీరామకృష్ణుని జీవితానికీ చాలా పోలికలున్నాయి.గతంలో "శ్రీరాముడను తానే" అని ఆయన ఎన్నోసార్లు తన అంతరంగిక భక్తులకు చెప్పినారు.ఊరకే చెప్పడమే గాక దానికి రుజువులుగా అనేక దివ్యదర్శనాలను తన అంతరంగిక భక్తులకు ఇచ్చారు.

కనుక 1700/1800 AD లో మొదలైన త్రేతాయుగంలో శ్రీరాముని అవతారం రాలేదు గాని,ఆయన జీవితంతో సామ్యం ఉన్న ఇంకొక భగవదవతారం శ్రీరామకృష్ణుని రూపంలో వచ్చింది.


కనుక 1800 AD ప్రాంతంలో మొదలై ఆ తర్వాత 3600 సంవత్సరాల పాటు సాగే వ్యావహారిక త్రేతాయుగంలో ప్రస్తుతం మనం ఉన్నామని నేనంటున్నాను.

స్వామి యుక్తేశ్వర్ గిరిగారు యుగాల లెక్కలను సరిదిద్దటానికి ఒక మంచి ప్రయత్నం చేశారు.కానీ "ప్రమాదో ధీమతామపి" అన్నట్లుగా ఆయన లెక్కలలో కూడా పొరపాటు దొర్లింది.

అదేమిటో,ఆ తప్పు ఎలా దొర్లిందో పైన వివరించాను.అర్ధం చేసుకున్నవారు ధన్యులు.

నా వాదనకు ఇంకొక ఋజువును ఇప్పుడు చూపిస్తాను.

కృతయుగంలో ప్రత్యేకమైన భగవంతుని అవతారాలు లేవు.ఉండవు కూడా.ఎందుకంటే సత్యమూ ధర్మమూ నాలుగు పాదాలతో పరిపూర్ణంగా నడుస్తున్న స్థితిలో ఇతరములైన ప్రత్యేక అవతారాల అవసరం ఉండదు.

చేపగా,తాబేలుగా,సూకరంగా,నరసింహంగా ఇలా ప్రకృతిలో ఉండే జీవుల రూపంలోనే కృతయుగపు కాలంలో భగవంతుడు కనిపించాడు. త్రేతాయుగంలో మాత్రమే మానవ ఆకారంలో ఉన్న అవతారాలు వచ్చాయి. వామనావతారం దానిలో ప్రధమమైనది.అంటే కృతయుగంలో ప్రకృతినీ దానిలోని జీవులనూ దైవంగా భావించే విశాలదృక్పధం ఆ యుగంలోని మానవులకు ఉంటుంది.అక్కడ ప్రత్యేకమైన దైవాలూ మానవ ఆకారంలో ఉన్న అవతారాలూ ఉండవు.ప్రవక్తలూ మహాపురుషులూ అసలే ఉండరు.ఎందుకంటే ఆ యుగపు మానవులకు అలాంటి అవసరం ఉండదు. సరాసరి ప్రకృతిలోనే దైవాన్ని దర్శించగలిగే ప్రజ్ఞ వారిలో ఉంటుంది.

మన లెక్కప్రకారం ప్రస్తుతం 1800 AD నుంచి మొదలైన త్రేతాయుగం 200 సంవత్సరాలు మాత్రమే గడచింది.అంటే,ఇంకా 3400 సంవత్సరాల కాలం గడిచాక అప్పుడు 4800 సంవత్సరాల నిడివిగల కృతయుగం మొదలౌతుంది.మనం ప్రస్తుతం 12000 సంవత్సరాల వ్యావహారిక ఆరోహణా యుగచక్రంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి.

ఇప్పుడు ఊహించండి.

గత రెండువందల ఏళ్ళుగా చరిత్రను పరిశీలిస్తే,ఇప్పటికే దైవం గురించి మానవుని దృక్పధంలో ఎంతో మార్పు వచ్చినట్లు మనకు తెలుస్తుంది.

"మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని కొట్టుకునే ఆటవిక సంస్కృతి క్రమేణా తగ్గుతూ వచ్చి,అన్ని దేశాలలోనూ అన్ని సంస్కృతుల లోనూ మహాపురుషుల జననం జరిగింది.అన్నిచోట్లా అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ ఆయా ప్రజలకు తగినట్లుగా దైవాన్ని చేరుకునే మతాలూ మార్గాలూ ఉపదేశింపబడ్డాయి"- అనిన ఒక విధమైన విశాలదృక్పధం నేటి మానవులకు మెల్లిగా అలవడుతూ ఉండటాన్ని మనం గమనించవచ్చు.

ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే,మానవుని ఆలోచనలోనూ ఒకరినొకరు అర్ధంచేసుకునే పద్ధతిలోనూ ఇంకా 3400 సంవత్సరాల తర్వాత ఇంకెంత మార్పు రాబోతున్నది?

ఆలోచించండి.

అప్పటికి- "దైవం అంటే వేరే ఎక్కడో లేదు ప్రకృతే దైవం,జీవులలోనే దైవం ఉన్నాడు,ఈ సృష్టిలోని సమస్తంలోనూ దైవం నిండి ఉన్నాడు వేరే ఎక్కడో వెతకవలసిన అవసరం లేదన్న" మహోన్నత భావన తప్పకుండా ఈ భూమిపైన అప్పటికి ఉండే మానవులకు కలుగుతుంది.ఉత్త భావన కలగడమే కాదు,దానికి సరిపోయే సైంటిఫిక్ పరిజ్ఞానం కూడా అప్పటికి కనుగొనబడుతుంది.అప్పటికి ఉండే సైన్స్ ను ఇప్పుడున్న మనం కనీసం ఊహించను కూడా ఊహించలేం.అంతటి విప్లవాత్మకములైన మార్పులు సైన్స్ రంగంలో ఇంకొక 3400 ఏళ్ళలో కలుగబోతున్నాయి.

ఆ తర్వాత రాబోయే 4800 ఏళ్ళపాటు ఉండే ఆరోహణా కృతయుగంలో దేవతలే ఈ భూమిమీద తిరిగే రోజులు వస్తాయి.కృతయుగంలో దేవతలూ ఇతరలోకాలలో ఉండే మహనీయులూ ఈ భూమిమీద తిరిగారని మన పురాణాలు చెబుతున్నాయి.అంటే ఇతర గ్రహాలలో గేలక్సీలలో ఉన్న జీవులు ముందు ముందు ఇంకొక 5000-6000 సంవత్సరాలలో మన భూమిమీదకు వచ్చి తిరుగబోతున్నారు.మనం కూడా చంద్రుడూ అంగారకుడూ మొదలైన ఇంకా ఇతర గ్రహాలకూ,ఇతర గెలాక్సీలకూ కూడా వెళ్లి అక్కడ ఉండే జీవులతో స్నేహం చెయ్యబోతున్నాం.ఇవన్నీ కృతయుగం అనబడే రాబోయే 3400 సంవత్సరాల నుంచి 8200 సంవత్సరాల లోపు ఖచ్చితంగా జరుగుతాయి.

అంటే,కృతయుగపు లక్షణాలైన అతీతశక్తులూ,తలచుకున్న క్షణంలో ఏదైనా పొందగలగడమూ,సద్యోగర్భాలూ,దూరలోక గమనమూ,ఇతర లోకాలలో ఉన్న జీవులతో సంబంధాలూ,వారు వచ్చి మన భూమిమీద సంచరించడమూ అప్పటికి భూమిమీద నిత్యకృత్యాలు అవుతాయి.కనుకనే అది కృతయుగం అవుతుంది.

కనుక ప్రస్తుతం జరుగుతున్నది వ్యావహారిక త్రేతాయుగమే అని నేనంటున్నాను.

ఇదంతా చదివిన తర్వాత ప్రస్తుతం నడుస్తున్నది త్రేతాయుగమే అని నేననే మాటలో నిజం ఉన్నదని ఒప్పుకోవాలనే మీకూ అనిపిస్తున్నది కదూ?

కానీ అలా ఒప్పుకోడానికి ఏదో అడ్డు వస్తున్నట్లుగా కూడా అనిపిస్తుంది.అలా అడ్డు వచ్చే ఆలోచన చాలా బలహీనమైనది.చిన్నచిన్న సవరణలు కొన్ని మీ ఆలోచనలలో చేస్తే ఈ అడ్డు వెంటనే తొలగి పోతుంది.

ఆ సవరణలు ఏమంటే-

1) సృష్టిలో రెండుయుగాలు ఏకకాలంలో నడుస్తూ ఉన్నాయన్న విషయం మొదటగా గుర్తించాలి.అవి Macro మరియు Micro యుగాలు.

2) Macro స్థాయిలో ప్రస్తుతం కలియుగం మొదటి పాదమే నడుస్తున్నది.ఇది మహాసంకల్పానుసారం,దైవయుగప్రమాణం అయిన 43,20,000 సంవత్సరాల దైవయుగాన్నీ,మన్వంతరాలనూ,కల్పాన్నీ,బ్రహ్మదేవుని జీవితకాలాన్నీ అనుసరిస్తుంది.ఈ లెక్కలన్నీ ముందు పోస్టులలో వివరించాను.

3) రెండవదైన Micro యుగాల స్థాయిలో ప్రస్తుతం వ్యావహారిక యుగాల 12,000 యుగప్రమాణపు లెక్కప్రకారం ఆరోహణా త్రేతాయుగం నడుస్తున్నది.

4) ఇలా నడవడానికి ఏమీ అభ్యంతరం ఉండనవసరం లేదు.ఎందుకంటే, జ్యోతిష్యజ్ఞానం కొద్దిగా తెలిసినవారికి దశలు వాటిలోని అంతర్దశల వలె ఈ మేక్రో మరియు మైక్రో యుగాలు ఉంటాయన్న విషయం తేలికగా అర్ధమౌతుంది.

5) కనుక నిత్యసంకల్పంలో "కలియుగే ప్రధమే పాదే" అని చెప్పిన తర్వాత "వ్యావహారిక యుగచక్రే త్రేతాయుగే" అని చెబుతూ అక్కడనుంచి ఇప్పుడు నడుస్తున్న 214 సంవత్సరాన్ని"ద్విశతాధిక చతుర్దశ సంవత్సరే" అని చెప్పుకుంటే చక్కగా సరిపోతుంది.

6) ఈ గొడవంతా ఎందుకని అనుకునేవారు "కలియుగే ప్రధమే పాదే" తోనే ఆపి దైవయుగపూర్వకమైన సాంప్రదాయ సంకల్పాన్ని అనుసరిస్తే అది మరీ మంచిది.

విషయం అంతా ఇప్పుడు చక్కగా అర్ధమైంది కదూ.

(ఇంకా ఉన్నది)