నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

17, సెప్టెంబర్ 2014, బుధవారం

యుగసిద్ధాంతం-5(మహాసంకల్పం-బ్రహ్మదేవుని ప్రస్తుత వయస్సు)

భగవద్గీతలో కూడా యుగముల గురించిన ప్రస్తావన వస్తుంది.

శ్లో||సహస్ర యుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదు:

రాత్రిం యుగసహస్రాంతాం తే అహోరాత్రా విదో జనా:

(భగవద్గీత 8:17)

వెయ్యి యుగములు బ్రహ్మకు ఒక పగలు.అంతే సమయం ఆయనకు ఒక రాత్రి.ఈ విషయం పగలూ రాత్రుల జ్ఞానం కలిగినవారికి తెలుసు-అని భగవద్గీత అంటుంది.


అయితే ఈ 'మహాయుగం' అనేమాట లోనే తేడాలున్నాయి.యుగముల లెక్కలలో రెండు వర్గాలున్నాయి.

ఒకటి సనాతనవర్గం.వీరు దైవయుగాలను లెక్కిస్తారు.అంటే మానవ మహాయుగం వేరు.దైవమహాయుగం వేరు అని వీరంటారు.రెండూ ఉన్నాయి గాని సృష్టి గణనానికి దైవయుగాలనే లెక్కించాలని వీరంటారు.

రెండు నవీనవర్గం.వీరు మానవయుగాలనే లెక్కించాలంటారు.దైవయుగం అనేది లేదని వీరి వాదన.

నవీనవర్గంలోకి బాలగంగాధరతిలక్ గారు,స్వామి యుక్తెశ్వర్ గిరిగారు,శ్రీ రామశర్మ ఆచార్యగారూ వస్తారు.వీరి లెక్కల ప్రకారం యుగం అనేది 12,000 సంవత్సరాలు మాత్రమే.దైవయుగం అనేది లేదు.అంటే దీనిని 360 తో హెచ్చించవలసిన పని లేదని వీరంటారు.అనేక పురాణ శ్లోకాలలో ఉన్న 'దైవ' అనే పదం ఉత్త విశేషణం మాత్రమేగాని అది దేవతల యుగాన్ని సూచించదని వీరి నమ్మకం.

రెండువర్గాల వారి వాదనల ప్రకారమూ లెక్కించి చూద్దాం.

మొదటి వర్గం వారి లెక్క

ఒక యుగప్రమాణం=12000 సంవత్సరాలు
అలాంటివి ఒక వెయ్యి అయితే బ్రహదేవుని ఒక దినం గనుక,
బ్రహ్మదేవుని ఒక పగలు=1,20,00,000
=1.2 కోట్ల సంవత్సరాలు

మనకు తెలిసిన విశ్వం వయస్సు 1375 కోట్ల సంవత్సరాలు.

మొన్నమొన్నటి వరకూ విశ్వం వయస్సు 2000 కోట్ల సంవత్సరాలని శాస్త్రజ్ఞులు అనుకున్నారు.కానీ ఇప్పుడు నవీన లెక్కల ప్రకారం 1375 కోట్ల సంవత్సరాలని అంటున్నారు.అది మళ్ళీ మారే అవకాశం ఉన్నది.

బ్రహ్మదేవుని ఒక పగలు అయిపోయిన తర్వాత రాత్రి వస్తుంది గనుక,రాత్రి సమయం ప్రళయం గనుక మనం లెక్కించలేము గనుకా మనకు తెలిసిన విశ్వం వయస్సు బ్రహ్మదేవుని పగటి ప్రమాణం లోపే ఉండాలి.అంటే ప్రస్తుతం ఇంకా పగలే జరుగుతూ ఉండాలి.అదే ప్రస్తుతం రాత్రి అయితే, ఈ లెక్కలు వెయ్యడానికి మనం ఎవ్వరమూ మిగిలి ఉండము.

ఈ లెక్క ప్రకారం బ్రహ్మదేవుని పగలు 1.2 కోట్ల సంవత్సరాలే.కనుక 1375 కోట్ల సంవత్సరాల కాలం దీనిలో ఇమడదు గనుక ఈ లెక్క తప్పు అని తేలుతున్నది.ఒకవేళ 1375 కోట్లు అనే సంఖ్య తప్పు అయినా + or - కొంత తేడా ఉంటుంది గాని మరీ 1 నుంచి 1375 అంత తేడా ఉండదు.

పోనీ బ్రహ్మ తన జీవితకాలం మొదట్లో సృష్టి చేసినది ప్రస్తుత విశ్వాన్నే అనుకుంటే అప్పుడు 1375/2.4=572.91 అంటే 572 రోజులు ఆయన జీవితంలో ఇప్పటివరకూ గడచి ఇప్పుడు 573 రోజులో 2,18,40,000 సంవత్సరాల కాలం అయిపోయి ఉండాలి.పోనీ అలా అనుకుంటే కూడా 360 రోజులు ఒక సంవత్సరం గనుక ప్రస్తుతం 573 వ రోజుగా రెండో సంవత్సరమే జరుగుతూ ఉండాలి.

కానీ మనకు తెలిసిన ఇతర వివరాల ప్రకారం ఆయన జీవితంలో ప్రస్తుతం 50 ఏళ్ళు గడచి 51 వ ఏడు జరుగుతున్నది గనుక 50x2.4x360 cr=43,200 కోట్ల సంవత్సరాలు ఆయన జీవితంలో ఇప్పటికి గడచి ఉండాలి.

కనుక లెక్క సరిపోవడం లేదు.

దీనిలో ఇంకొక లొసుగు కూడా ఉన్నది.బ్రహ్మజీవిత కాలంలో ప్రతిరోజూ చీకటిపడిన తర్వాత మనకు ప్రళయం అవుతుంది.ఆ ప్రళయ సమయాన్ని మన లెక్కలు అందుకోలేవు.ఒక పగటి సమయాన్ని మాత్రమే మనం అందుకోగలం లెక్కించగలం.ఒక వేళ మొదటినుంచీ ప్రతిరోజూ అనేక ప్రళయాలను పొందుతూ వస్తున్న విశ్వపు వయస్సు 1375 కోట్ల సంవత్సరాలని మనం అనుకున్నప్పటికీ ఈ లెక్క సరిపోవడం లేదు. 

ఈ రెంటికీ లెక్క పొసగడం లేదు గనుక మొదటి వర్గం వారి లెక్క తప్పని తేలిపోతున్నది.

ఇక రెండవదైన సనాతన వర్గం వారి లెక్కను పరిశీలిద్దాం.

రెండవ వర్గం వారి లెక్క

వీరి లెక్కప్రకారం బ్రహ్మదేవుని జీవితకాలంలో ఒకరోజు=864 కోట్ల సంవత్సరాలు.

ఒక రోజు=864 కోట్లు
మరుసటి రోజు పగలు=432 కోట్లు
----------------------------------
మొత్తం =1296 కోట్ల సంవత్సరాలు

ఇది నేటి విశ్వపు వయస్సుకు దగ్గరదగ్గరగా వస్తున్నది.కానీ ఇది కూడా పూర్తిగా సరిపోవడం లేదు.ఎందుకంటే ప్రస్తుత విశ్వపు వయస్సు అయిన 1375 కోట్ల సంవత్సరాల కాలం రాత్రి సమయంలో పడుతున్నది.రాత్రిపూట ప్రళయం అవుతుంది.మనం ప్రస్తుతం ప్రళయంలో లేము.సృష్టిలోనే ఉన్నాము గనుక ఈ లెక్క కూడా సరికాదు.కానీ మొదటివర్గం కంటే చాలా దగ్గరగా వచ్చింది.

విశ్వపు నేటి లెక్క అయిన 1375 కోట్ల సంవత్సరాలు కూడా సరియైన లెక్క అని చెప్పలేము.ఎందుకంటే మొన్నటివరకూ విశ్వం వయస్సు రెండువేల కోట్ల సంవత్సరాలని చెప్పిన శాస్త్రవేత్తలు ఈ మధ్యన దానిని మార్చి అది 1375 కోట్లు మాత్రమే అంటున్నారు.ఈ సంఖ్య ఇంకా కొంచం క్రిందకు దిగి 1200 లోపలకు వస్తే అప్పుడు సనాతనవాదుల లెక్కతో కరెక్ట్ గా సరిపోతుంది.

కనుక సనాతనవాదుల ఉద్దేశ్యం అయిన దైవయుగం=360xమానవయుగం అనే లెక్క మాత్రమే సరియైనది అని తెలుస్తున్నది. 

కనుక యుక్తేశ్వర్ గిరిగారు కూడా లెక్కలలో పొరపాటు పడ్డారని చెప్పక తప్పదు.

బ్రహ్మదేవుని ప్రస్తుత వయస్సు

ఇప్పుడు మనకు తెలిసిన లెక్కల ప్రకారం బ్రహ్మదేవుని వయస్సు ఎంతో గమనిద్దాం.

బ్రహ్మదేవుని ఒక రోజులో 14 మంది మనువులు పుట్టి గతిస్తారు.

వారి వివరాలు ఏమిటంటే-
  • స్వాయంభువ మనువు
  • స్వారోచిష మనువు
  • ఉత్తమ మనువు
  • తామస మనువు
  • రైవత మనువు
  • చాక్షుష మనువు
  • వైవస్వత మనువు
  • సావర్ణి మనువు
  • దక్ష సావర్ణి మనువు
  • బ్రహ్మ సావర్ణి మనువు
  • ధర్మసావర్ణి మనువు
  • రుద్ర సావర్ణి మనువు
  • దేవ సావర్ణి మనువు
  • ఇంద్ర సావర్ణి మనువు
ఏడవ మనువు 71 దివ్యయుగాలలో 27 దివ్యయుగాలు గతించి 28 వ దివ్యయుగం ప్రస్తుతం నడుస్తున్నది.

ఇక్కడ మహాసంకల్పాన్ని కొంచం గమనిద్దాం.సంకల్పం అనేది సృష్టి మొదలు నుంచి మొదలై,ప్రధమంగా కాలస్మరణమూ తరువాత దేశ స్మరణమూ ఆ తర్వాత గోత్రఋషుల స్మరణమూ ఆ తరువాత తనపేరు చెప్పి ఆ తర్వాత చెయ్యబోతున్న కర్మస్మరణం ఉంటుంది.

అంటే-
  • కాలస్మరణం
  • దేశ స్మరణం
  • గోత్రస్మరణం
  • కర్మస్మరణం
వీటితో కూడినదే మహాసంకల్పం.

శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య = శ్రీమహావిష్ణువు ఆజ్ఞతో నడచుచున్న

అద్యబ్రహ్మణ:=బ్రహ్మదేవుని

ద్వితీయ పరార్ధే=రెండవ సగభాగంలో

శ్వేత వరాహకల్పే=శ్వేతవరాహ కల్పంలో

వైవస్వత మన్వంతరే=వైవస్వతుడనే మనువు యొక్క కాలంలో

కలియుగే ప్రధమే పాదే=కలియుగపు ప్రధమపాదంలో

ఇక్కడ కొందరు వ్యావహారిక శకాలను స్మరిస్తారు.

ఇంతవరకూ కాలస్మరణం.ఇక్కడనుంచి దేశస్మరణం జరుగుతుంది.

భరతవర్షే భరతఖండే మేరో:---దిగ్భాగే....అంటూ సాగిసాగి చివరకు తామున్న ఇంటివరకూ సంకల్పంలో వస్తుంది.

ఆ తర్వాత తమ గోత్రనామాదులను స్మరించి,తాను ఏమి చెయ్యబోతున్నాడో ఆ కర్మను స్మరించి సంకల్పపూర్వకంగా నీటిని తాకి ఆ కర్మసంబంధిత మంత్రములను చదవుతూ ఆ కర్మను చెయ్యడం జరుగుతుంది.

ఇందులోని కాలగణన భాగంలోని మాటల లెక్కను గమనిద్దాం

A) బ్రహ్మదేవుని 50 ఏండ్లు=50x360x864 కోట్ల సంవత్సరాలు
=1,55,52,000 కోట్ల సం.

B) మొదటిదైన శ్వేతవరాహ కల్పంలో ఆరుగురు మనువులు గతించారు.
=6x71x43,20,000(ఒక మహాయుగం నిడివి)
=1,84,03,20,000 సం.

C) ఏడవవాడైన వైవస్వత మనువు కాలంలోని 71 మహాయుగాలలో 27 గడిచాయి.

=27x43,20,000=11,66,40,000

D) 28 వ మహాయుగంలో కలియుగం మొదటిపాదంలో ప్రస్తుతం మనం ఉన్నాం.

=కృతయుగం 1728000
=త్రేతాయుగం 1296000
=ద్వాపరయుగం 864000
---------------------------
=                   38,88,000

కనుక బ్రహ్మదేవుని ప్రస్తుత వయస్సు = A+B+C+D

అంటే 1,55,52,195,69,60,000.4 సంవత్సరాలు గడచి ఆ తర్వాత 1,72,800 సంవత్సరాలలోపు కాలంలో మనం ప్రస్తుతం ఉన్నాం.

దీనిని సులభంగా చెప్పాలంటే,

2000 దైవయుగాలు(బ్రహ్మదేవుని ఒకరోజు)x360x50+6 మన్వంతరాల కాలం+ఏడో మన్వంతరం లోని కృత,త్రేతా,ద్వాపర యుగాలు గడచి కలియుగం మొదటిపాదం జరుగుతున్న సమయంలో మనం ప్రస్తుతం ఉన్నామన్నమాట.

(ఇంకా ఉన్నది)