నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

యుగసిద్ధాంతం -3(పురాణాల దూరదృష్టి)















కనుక పై వివరణను బట్టి మానవ:పితృ:దైవకాలమానాల నిష్పత్తి =1:30:360 అన్న విషయం మనకు తెలుస్తున్నది.

ఇక్కడ ఒక సూక్ష్మ రహస్యం దాగున్నది.

దేవతల ఒక రోజు మానవుల ఒక సంవత్సరం.

అంటే ఒక రోజుకీ ఒక సంవత్సరానికీ అవినాభావ సంబంధం ఉన్నది.సృష్టిలో ఏవైనా రెండు విషయాల మధ్యన సామ్యం ఉన్నపుడే వాటికి అనుబంధం కుదురుతుంది.లేకుంటే అలా జరగకపోగా వాటిని పోల్చడం కూడా కుదరదు.

ఈ కోణంలో చూస్తే ఒక విచిత్రమైన విషయం అర్ధమౌతుంది.

రోజు అనేది ఒక miniature year.

సంవత్సరం అనేది ఒక enlarged day.

ఎలాగంటారా?

సంవత్సరంలో రెండు అయనాలున్నాయి.ఉత్తరాయణం.దక్షిణాయనం.

రోజులో రెండు భాగాలున్నాయి.పగలు రాత్రి.

అందుకే ఉత్తరాయనాన్ని దేవతల పగలు అంటారు.దక్షిణాయనాన్ని వారి రాత్రి అంటారు.

సంవత్సరంలో 12 మాసాలున్నాయి.ఒక్కొక్క మాసానికి రెండు పక్షాల చొప్పున 24 పక్షాలు(కణుపులు)న్నాయి.

రోజులో 24 గంటలున్నాయి.ఇవీ ఒక విధమైన కణుపులే(పక్షాలే)

సంవత్సరంలో 360 రోజులున్నాయి.

ఒక రోజులో భూమి 360 డిగ్రీల ఒక ఆత్మప్రదక్షిణాన్ని పూర్తిచేస్తుంది.

సంవత్సరంలో ఆరు ఋతువులున్నాయి.

ఒక్క రోజులో ఆరు భాగాలున్నాయి(ఒక్కొక్క భాగంలో 4 గంటలు నాలుగు యుగాలుగా ఆవృత్తి జరుగుతుంది)

ఒక సంవత్సరంలో సూర్యునికి నాలుగు సంధికాలాలున్నాయి.అవి మేష, కర్కాటక,తులా,మకరరాశులు.

ఒక్క రోజులో నాలుగు సంధికాలాలు వస్తాయి.ఉదయం,మధ్యాహ్నం, సాయంత్రం,అర్ధరాత్రి.

ఈ విధంగా చూస్తే రోజుకు సంవత్సరానికి ఎన్నో సామ్యాలున్నాయి.

ఏతావాతా 'రెండూ ఒకటే' అని కూడా చెప్పవచ్చు.

అందుకే రోజును సద్వినియోగం చేసుకోలేని వాని జీవితంలో ఏళ్ళకేళ్ళు వృధాగా గడచిపోతూనే ఉంటాయి.కొంతమంది నన్ను మెయిల్స్ లో అడుగుతూ ఉంటారు.మీరు ఇన్ని విద్యలలో ప్రావీణ్యం ఎలా సంపాదించారు? ఆ రహస్యం ఏమిటి? అని.

దానికి ఒకటే సమాధానం-రోజును సద్వినియోగం చేసుకోవడమే.

ప్రతిరోజూ పరిపూర్ణంగా జీవించడమే ఆ రహస్యం.

అందుకే జ్ఞానులైన యోగులు ఒక్క రోజులో ఒక సంవత్సరపు జీవితకాలాన్ని పూర్తి చేస్తారు.అలా చెయ్యగలరు గనుకనే వారి ఒక్క జీవితకాలంలో ఎన్నో జీవితాల కర్మను వారు క్షయం చేసుకోగలుగుతారు.అలా కాకపోతే అనేక జన్మల కర్మను ఒక్క జన్మలో వారు ఎలా పూర్తిచెయ్యగలరు?

రోజును సంవత్సరంగా మార్చుకోగలిగే విద్యయే దీనివెనుక ఉన్న యోగరహస్యం.ఇది అత్యంత అర్హులైనవారికి మాత్రమే అందుతుంది.ఎవరికి పడితే వారికి ఈ రహస్యం చెప్పబడదు.విశ్వప్రణాళిక పైనే అంతరిక సాధన కూడా ఆధారపడి ఉన్నది.అణువు వలెనే విశ్వమూ నిర్మితమై ఉన్నది. సృష్టిలోని అతి సూక్ష్మమైనదీ అతి విశాలమైనదీ కూడా ఒకే ప్లాన్ మీద ఆధారపడి నిర్మించబడినాయి.

"యత్పిండే తత్ బ్రహ్మాండే"

"బయట ఏదున్నదో లోపలా అదే ఉన్నది.మనిషిలో(పిండాండం)లో ఏమున్నదో విశ్వం(బ్రహ్మాండం)లో కూడా అదే ఉంటుంది"- అన్నదే అంతరిక తంత్రసాధనలో అతిముఖ్యమైన సూత్రం.

శరీరంలో ఏది ఉన్నదో విశ్వంలో కూడా అదే ఉన్నది.అణువూ విశ్వమూ ఒకే మోడల్ తో నిర్మించబడ్డాయి.భూమి తన చుట్టూ తాను తిరగడానికీ అదే సమయంలో సూర్యుని చుట్టూ తిరగడానికీ అంతరిక సాధనకూ సంబంధాలు ఉన్నాయి.విశ్వ ప్రణాళిక బట్టే అంతరిక సాధన సాగుతుంది.

విశ్వం సనాతమైనది.అంటే ఎంతో పురాతనమైనదే గాక ఎప్పటికీ నిలిచి ఉండేది.అలాగే,సనాతనమైన విశ్వప్రణాళిక ఆధారంగా నిర్మితమైన భారతీయధర్మం లేదా హిందూమతం కూడా సనాతనమైనదే.అందుకనే దీనిని సనాతన ధర్మం అనే పేరుతో కూడా పిలుస్తాం.విశ్వంలాగే ఇది కూడా ఎప్పటికీ నిలిచి ఉంటుంది.మిగతా మతాలు అనేకం వస్తాయి.పోతాయి.కానీ సనాతనధర్మం మాత్రం ఎప్పటికీ ఉంటుంది.అలా నిలిచి ఉండటానికి కారణం ఏమంటే దీని పునాదులు విశ్వప్రణాళిక మీద ఆధారపడి ఉన్నాయి.అవి ఏ ఒక్క ప్రవక్త మీదో ఏ ఒక్క మహనీయుని బోధనల మీదో ఆధారపడినవి కావు.దైవధర్మం మీద ఆధారపడి ఉన్నవి.కనుక శాశ్వతంగా ఉంటాయి.

ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను.

పాశ్చాత్య జ్యోతిష్య విధానంలో primary progression అని ఒక విధానం ఉన్నది.అందులో జాతక చక్రంలోని ఒక డిగ్రీని జీవితంలోని ఒక సంవత్సరంతో పోలుస్తారు.ఒక్కరోజులో జననకాల సూర్యుడు ఒక డిగ్రీని దాటుతూ ప్రయాణిస్తూ ఉంటాడు.అలా జాతకంలోని ఒక్క రోజును జీవితంలోని ఒక సంవత్సరంతో పోల్చి ఫలితాలు ఊహించే పద్దతి పాశ్చాత్య జ్యోతిష్య విధానంలో ఉన్నది.అది మానవ దైవమాన విధానమే.

భూమి ఒక రోజులో ఆత్మపరిభ్రమణం చేసే సమయానికి సూర్యుడు రాశిచక్రంలో ఒక డిగ్రీ ముందుకు వెళ్ళిపోతాడు.దీనికి రాశిచక్రంలో నాలుగు నిముషాలు సమానం అవుతుంది.ఈ దూరం ఖగోళంలో ప్రయాణించడానికి భూమికి ఒక ఏడాది పడుతుంది.కనుక ఒక డిగ్రీ దూరం తనచుట్టూ తాను తిరగటం ఒక రోజు సూర్యుని చుటూ పరిభ్రమణంతో సమానం.జ్యోతిష్యపరంగా చూచినా కూడా ఒకరోజు అనేది ఒక సంవత్సరంతో సమానం అవుతుంది. వారికి తెలిసో తెలియకో మన పురాణాలలోని ఈ conversion formula నే పాశ్చాత్యులు వారి జ్యోతిష్య విధానంలో వాడుతున్నారు.

అయితే ఈనాడు సైన్స్ కు ఖగోళ పరంగా అర్ధమైన ఈ విషయం అన్ని వేల సంవత్సరాల నాటి మన పురాణాలలో ఎలా ఉన్నది?మనం అనాగరికులుగా భావించే పూర్వులకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? అన్నవే అసలు ప్రశ్నలు.

ఈనాడు ఎంతో కష్టం మీద సైన్స్ అర్ధం చేసుకుంటున్న విషయాలు మన పురాణాలలో ఎప్పుడో వర్ణింపబడి ఉండటం చూస్తే,మన మహర్షుల దర్శనశక్తికి మనం అప్రతిభులం అయిపోతాం. 

కనుక మన పురాణాలలో అనేక time scales పక్కపక్కనే వాడబడినాయి అన్నది అసలు విషయం.ఈ విషయం సరిగ్గా అర్ధమైతే మన పురాణాలలోని అనేక సందేహాలు దూదిపింజల్లా తేలిపోతాయి.

ఉదాహరణకు దశరధ మహారాజు  60,000 సంవత్సరాలు జీవించాడని అంటారు.

అంటే 60,000 రోజులని అర్ధం.దైవమానాన్ని మానవమానంలోకి మార్చాలంటే దానిని 360 తో తగ్గించాలి.

కనుక 60,000/360=167 సంవత్సరాల కాలం ఆయన జీవించాడని అర్ధం.10000 సంవత్సరాల క్రితం ఒక మహారాజైనవాడు అంతకాలం బ్రతకడం మామూలు విషయమే.అది వింతేమీ కాదు.మహారాజైనవాడు మంచి క్వాలిటీ తిండి తింటాడు. మంచి ఆరోగ్యకరమైన అలవాట్లతో ఉంటాడు.మంచి వైద్యం అందుబాటులో ఉంటుంది.కనుక 167 ఏళ్ళు బ్రతకడం అందులోనూ 10,000 సంవత్సరాల నాడు అలా జరగడం అసంభవం ఏమీ కాదు.ఇప్పుడున్నంత వాతావరణ కాలుష్యం అప్పుడు లేదు.మానవుని ఆకలీ, తిండిపుష్టీ, ఆయుష్షూ యుగాలతో బాటు క్రమేణా తగ్గుతూ వస్తున్నాయి.నేడుకూడా 100 ఏళ్ళు బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు.కనుక దశరధ మహారాజు 167 ఏళ్ళు బ్రతకడం వింత ఏమీ కాదు.

అలాగే శ్రీరాముడు 11,000 ఏళ్ళు రాజ్యం చేశాడని ఉన్నది.అంటే 11,000 రోజుల పాటు పరిపాలించాడని అర్ధం.దేవమానంలో చెప్పబడిన దీనిని మానవమానం లోకి మారిస్తే,

11000/360=31 మానవ సంవత్సరాలు అవుతుంది.ఒక మహారాజు 31 సంవత్సరాలు పాలించడం సంభవమే.ఇది అసంభవం ఏమీ కాదు.

దేవమానాన్ని మానవమానం లోకి మార్చడమంటే 1:360 నిష్పత్తిని అర్ధం చేసుకోవడమే.

పురాణాలలోని వేలాది సంవత్సరాల కాలాన్ని 360 తో భాగిస్తే అది మానవమానం లోకి మారుతుంది.అప్పుడు మన సంవత్సరాలు వస్తాయి.

ఈ సింపుల్ రూల్ అర్ధం కాకపోతే,పురాణాలలోని లెక్కలన్నీ వింతవింతగా అనిపిస్తాయి.

ఉదాహరణకు--ఒక ఋషి 10,000 ఏళ్ళు తపస్సు చేశాడంటారు.అంటే 10,000 రోజులని అర్ధం.

దీనిని మానవమానం లోకి మార్చుకుంటే, 10000/360=28 ఏళ్ళు తపస్సు చేశాడని అర్ధం.

మానవులలో మహనీయులైనవారిని గురించి,దేవతాసములైనవారిని గురించీ,అంటే,మహారాజులు, మహాయోగులు మొదలైన వారిని గురించి చెప్పేటప్పుడు మన పురాణాలలో దేవమానం వాడి చెప్పారు.దానిని మనం మానవ సహజంగా అర్ధం చేసుకుంటే తంటా వస్తుంది.పురాణాలపైన అపనమ్మకం కలుగుతుంది.దానిని 360 తో తగ్గించి అర్ధం చేసుకోవాలి.

అలాగే దేవతలనూ దేవరుషులనూ గురించి చెప్పేటప్పుడు బ్రహ్మమానం వాడి వివరించారు.ఉదాహరణకు ఒక దేవర్షి లక్ష సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడని వ్రాసి ఉంటుంది.అంటే మన లెక్కలో లక్ష సంవత్సరాలని కాదు. దానిని బ్రహ్మమానమైన 1000 తో తగ్గించాలి.అంటే 100000/1000=100 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడని అర్ధం.నియమనిష్టలు పాటిస్తూ ఆహరదోషం లేకుండా ఉంటూ ప్రాణశక్తిని వృధా చేసుకోకుండా ఉంటే 100 ఏళ్ళు బ్రతకడమూ తపస్సులో ఉండటమూ కష్టమేమీ కాదు.

పురాణాలలో మానవమానమూ,పితృమానమూ,దైవమానమూ కలగలిపి వాడబడ్డాయి.కనుక ఈ గందరగోళం తలెత్తుతుంది.వ్యాసమహర్షి గానీ వాల్మీకి మహర్షి గానీ మనలాగా స్వార్ధ పరులు కారు.రామాయణం గానీ మహాభారతం గానీ 36 పురాణాలు గానీ వ్రాసినందువల్ల వాళ్ళకేమీ ఆర్ధిక ప్రయోజనాలు చేకూరలేదు.మనలాగా బిరుదులూ సన్మానాలూ ఆశించి వారు పుస్తకాలు వ్రాయలేదు.లేదా ఏదో రాయల్టీని ఆశించి వారు పుస్తకాలు వ్రాయలేదు. లోకానికి ధర్మాన్ని బోధించాలన్న మంచి ఉద్దేశ్యంతోనే వారు ఆ పని చేశారు. తప్పుడు లెక్కలు చూపించి మనల్ని మోసం చెయ్యడం వారి ఆలోచన కానే కాదు.వారు మనవంటి మామూలు మనుషులు కారు.ఇంద్రియనిగ్రహం కలిగిన మహర్షులని ముందుగా మనం గుర్తుంచుకోవాలి.

తప్పుడు లెక్కలు చెప్పడమే వారి ఉద్దేశ్యం అయితే,శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసం చేసాడు అని ఎందుకు వ్రాస్తారు?14000 ఏళ్ళు వనవాసం చేశాడు అని వ్రాసి ఉండేవారు కదా.అలా చెయ్యలేదంటే దానివెనుక ఒక కోడ్ భాష ఉన్నదని అర్ధం చేసుకోవాలి.కొన్ని సార్లు మామూలు సంవత్సరాలూ కొన్ని సార్లు వేల సంవత్సరాలూ వాడారంటే దాని వెనుక ఉన్న సూక్ష్మాన్ని మనం గ్రహించాలి.ప్రతిదాన్నీ తప్పు దృష్టితో చూడటమూ తప్పుగా అర్ధం చేసుకుని అదేదో గొప్ప తెలివి అన్నట్లు లెక్చర్లు ఇవ్వడమూ గొప్ప కాదు.అది మన అల్పత్వ ప్రదర్శనమే అవుతుంది.

ఒక మహారాజు రాజ్యం చెయ్యడమూ,ఒక ఋషి తపస్సు చెయ్యడమూ,లేదా ఇద్దరు గొప్పయోధులు యుద్ధం చెయ్యడమూ,లేదా దేవతలూ రాక్షసులూ యుద్ధం చెయ్యడమూ - ఇలాంటి సన్నివేశాలలోనే వేల సంవత్సరాల దైవమానం వాడబడింది.మిగతా మామూలు సన్నివేశాలైన వనవాసం చెయ్యడం మొదలైన మామూలు పనులకు మానవమానమే వాడబడింది.ఈ విషయాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవాలి.

పురాణాలు ఒక్క మానవుల చరిత్రలే కాదు.అవి మానవులు, నాగులు, యక్షులు,గంధర్వులు,పితృదేవతలు,దేవతలు ఇలా అనేకానేక స్థాయిలలో ఉండే జీవుల సమిష్టి చరిత్రలు.మన పురాణాలలో వీరందరి జీవితగాధలూ కధలూ ఒకే వేదిక మీద మనకు కన్పిస్తూ ఉంటాయి.కనుక వేర్వేరు time frames లో ఉండే జీవులను ఒకే కధలో ఇమడ్చాలంటే వారివారి time frames ను ఒక conversion formula వాడి అందరినీ ఒకచోటికి తేవాలి.అలా చెయ్యడానికే ఈ పద్ధతిని వ్యాసమహర్షి ఉపయోగించాడు.అందుకే మానవ, పితృ,దైవమానాలు రకరకాల ఘట్టాలలో వాడబడినట్లు మన పురాణాలలో మనకు కనిపిస్తుంది.

ఈ రహస్యాన్ని అర్ధం చేసుకుంటే వ్యాసమహర్షి మీద మనకున్న గౌరవమూ భక్తీ ఎన్నో రెట్లు ఇనుమడిస్తాయి.

ఇప్పుడు కొంతమందికి మళ్ళీ అనుమానాలు రావచ్చు.

అసలు ఇన్ని యుగాలూ ఇన్ని సంవత్సరాలూ ఎందుకు? చక్కగా మనకు తెలిసిన ఒక ఎల్లయ్యనో పుల్లయ్యనో ప్రమాణంగా తీసుకుని అక్కడనుంచీ ఒక తేదీ అనుకుని అక్కడనుంచి కిందకు కాలాన్ని లెక్కపెట్టుకుంటే ఏ బాధా ఉండదు కదా అని.

ఇది ఏ మాత్రమూ 'ఈస్తటిక్ సెన్స్' లేని నేలబారు చవకబారు మనుషుల వాదన.

అలా ఎవరు బడితే వారు ఒక్కొక్క మనిషిని అనుసరిస్తూ ఒక్కొక్క శకాన్ని అనుసరించినందువల్లనే కాలగణనంలో అసలైన సమస్యలు వచ్చి పడ్డాయి.

పాండవుల కాలంవరకూ(3000 BC) ఏ శకాలూ లేవు.అప్పటివరకూ అందరూ మహాసంకల్పాన్నే అనుసరించారు.ఎప్పుడైతే ధర్మరాజు పట్టాభిషేకం చేసుకున్న సంవత్సరం నుంచీ 'ధర్మరాజ శకం' మొదలైందో అదే కాలగణనంలో పతనానికి నాంది అయింది.కలిప్రభావం అప్పటికే మొదలైనందువల్ల విశ్వసూచికలనూ విశ్వగణనాన్నీ వదలివేసి మానవ శకాలను లెక్కించడం మొదలుపెట్టడం జరిగింది.అది కలిప్రభావ సూచన.

ఆ తర్వాత శాలివాహన శకం అనీ,విక్రమార్క శకం అనీ రకరకాల శకాలు మనకు వచ్చాయి.ఒక్కొక్క పెద్ద చక్రవర్తి చరిత్రలో తలెత్తిన ప్రతిసారీ ఆయన పేరుతో ఒక్కొక్క శకం తయారైంది.అయితే అవన్నీ కావాలని ఎవరో చేసిన తప్పులు కావు.లౌకిక ప్రయోజనాలకోసం,లావాదేవీలలో వ్యవహారోపయోగం కోసం ఆయాకాలాలలో పెట్టుకున్న కొలతలు మాత్రమే.

ఇప్పుడు మన లౌకిక సౌకర్యం కోసం క్రీస్తుశకం అనేదాన్ని అంతర్జాతీయ ప్రమాణంగా వాడుతున్నాం.అలా అన్నమాట.

కానీ మహాభారత కాలంకంటే ప్రాచీనులు ఈ విధంగా వ్యక్తుల ఆధారంగా కాలాన్ని లెక్కించలేదు.ఎవరు రాజ్యం చేసినా చెయ్యకపోయినా వారు మహాసంకల్పాన్నే ఆధారంగా తీసుకున్నారు.

ఉదాహరణకు,పాండవుల కాలానికి ఎంతో ముందు జరిగిన శ్రీరామచరిత్రలో కూడా 'శ్రీరామశకం' లేదు.అవతారపురుషులు వచ్చినపుడే మనం 'శకాన్ని' లెక్కించలేదు.ఎందుకంటే,ఎంతటి అవతారమైనా మానవదేహం ధరించి వచ్చినపుడు కొంతకాలానికి కనుమరుగు కాకతప్పదు.కనుక అనంతమైన కాలగణనంలో దానిని లెక్కించకూడదన్న స్పృహ ప్రాచీనులకు ఉండేది.

నశించిపోయే మానవులను ఆధారంగా చేసుకుని వారు అనంతమైన కాలాన్ని లెక్కించలేదు.అలా చెయ్యడం అసంభవం అన్న విషయాన్ని వారు గ్రహించారు.

భూమీ విశ్వమూ ఇప్పటివి కావన్న సంగతి వారికి తెలుసు.ఎలా తెలుసు?అంటే జవాబు చెప్పలేం.మనకు అందని ఏవో విధానాలు వారికి ఉన్నాయి.అవి అతీంద్రియ విధానాలు కావచ్చు.కాని వాటికి కూడా భౌతికపరమైన ఆధారాలు ఉన్నాయన్న సంగతీ,భౌతిక కొలమానాలను వాడి కాలాన్ని లెక్కించవచ్చన్న సంగతినీ వారు గ్రహించారు.

ప్రాచీనమైన భూమినీ విశ్వాన్నీ కొలవాలంటే,నూరేళ్ళలో నశించిపోయే ఏ మనిషినీ ప్రమాణంగా తీసుకోకూడదన్న సంగతిని గ్రహించిన ప్రాచీన ఋషులు, మనిషి కంటే ఎన్నో వేల లక్షల కోట్ల ఏళ్ళు నిలిచి ఉండే గ్రహాలనూ నక్షత్రాల గమనాన్నీ ఆధారంగా చేసుకుని కాలాన్ని కొలిచారు.

ఆ కాలగణనం నుంచి పుట్టినవే మన పురాణాల లోని లెక్కలు.ఈ లెక్కలను చదివి ఒకనాడు ఎగతాళి చేసిన పాశ్చాత్యులే ఈనాడు ముక్కున వేలేసుకుని 'హిందువుల లెక్కలు నిజాలే కావచ్చు' అంటున్నారు.ప్రపంచంలోని ఏ జాతీ ఏ సంస్కృతీ విశ్వపు వయస్సును సరిగ్గా "ఇంత ఉండచ్చు" అంటూ చెప్పలేకపోయింది.ఒక్క భారతదేశపు పురాణాలే నేటి సైన్స్ చెబుతున్న లెక్కలకు దగ్గరగా ఉన్నాయి అంటే మన మహర్షుల దూరదృష్టి ఎలాంటిదో ఆలోచించవచ్చు.

ఉదాహరణకు:--

బైబుల్ ప్రకారం మానవ సృష్టి జరిగినది BC 4000 లో.మొన్న మొన్నటి దాకా ఇది నిజమని నమ్మిన పాశ్చాత్యులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల ఇది అబద్దం అని నిరూపించే పురావస్తు ఆధారాలు దొరుకుతుంటే ఏమీ చెప్పలేక మౌనం వహిస్తున్నారు.

ఎక్కడదాకానో ఎందుకు?మన ఆంద్రప్రదేశ్ లోని రాయలసీమలో కర్నూలు జిల్లాలోని 'రంగాపురం' పరిసర ప్రాంతాలలో ఉన్న గుహలలోనూ 'రాక్షసి గుళ్ళు' అనబడే సమాధుల వంటి కట్టడాలలోనూ దొరికిన ప్రాచీన పురావస్తు ఆధారాలను బట్టి 'లక్ష' సంవత్సరాల క్రితమే అక్కడ మానవుడు ఉన్నాడు అని తిరుగులేని రుజువులు లభిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రుజువులు అన్ని ఖండాలలోనూ దేశాలలోనూ దొరుకుతున్నాయి.BC 10,000 నాటికే దక్షిణ భారతీయులు దక్షిణ అమెరికాలో కాలనీలు స్థాపించారన్న సంగతిని అక్కడ మాటమాటకీ బయట పడుతున్న శిధిలాలూ శిల్పాలూ,మెక్సికోలో తవ్వకాలలో దొరుకుతున్న శివలింగాలూ,వినాయకుడూ,ఇంద్రుడూ,బ్రహ్మదేవుడూ మొదలైన దేవతల ప్రతిమలూ ఈరోజున నిరూపిస్తున్నాయి.మాయన్ నాగరికత అదే.ఆయననే మనం 'మయుడు' అన్నాం.

అప్పటిలోనే మయుని సంతతి వారు దక్షిణ అమెరికాలో పెద్దపెద్ద భవనాలూ కట్టడాలూ పిరమిడ్లూ కట్టడంలో సిద్ధహస్తులు.సివిల్ ఇంజనీరింగ్ లో నిపుణులు.అందుకే ధర్మరాజు హస్తినాపురంలోని తన రాజభవనాన్ని కట్టించుకోవాలన్నా, శ్రీకృష్ణుడు తన ద్వారకా నగరాన్ని నిర్మించుకోవాలన్నా దక్షిణ అమెరికాలో అప్పటికే సెటిల్ అయి ఉన్న 'మయుని' సహాయం తీసుకున్నారు.ఇది మహాభారతంలో రికార్డ్ కాబడిన విషయమే.చిత్ర విచిత్రాలతో నిర్మించబడిన 'మయసభ' అనేది దక్షిణ అమెరికాలో అప్పటికే సెటిల్ అయి ఉన్న మన మయుడు కట్టినదే.

కనుక బైబుల్ లో ఉన్నట్లు - సృష్టి జరిగింది BC 4000 లో - అనే విషయం అబద్దం అని తేలిపోతున్నది.అయితే,వారు కూడా కావాలని అబద్దం చెప్పలేదని నేనంటాను.

10500 BC ప్రాంతంలో నవీన మంచుయుగం అయిపోయింది.ఆ తర్వాత క్రమంగా యూరప్ ప్రాంతాలలో మానవుని సంచారం మొదలైంది.అప్పటి కాలంలో వారికి తెలిసిన మొదటి మానవుడిని వారు 'ఆడం' అనుకున్నారు.అదే సృష్టికి మొదలనుకున్నారు.కానీ అది సృష్టికి మొదలూ కాదు.ఆ 'ఆడం' అనేవాడు సృష్టిలో మొదటి మనిషీ కాడు.

అది "వారికి తెలిసిన సృష్టి"కి మొదలు మాత్రమే.

అప్పటికే భూమి పుట్టి కొన్నివందల కోట్ల సంవత్సరాలు అయిపోయాయి. అప్పటికే మానవుడు భూమ్మీద నివసించడం మొదలై కొన్నికోట్ల సంవత్సరాలు అయిపోయాయి.అప్పటికే యుగాలు ఎన్నో అయిపోయాయి. అవి వారి ఊహకు అందవు.

కనుక వారు చూచిన దగ్గరనుంచే సృష్టి మొదలైనదని వారనుకున్నారు.

'యాపిల్ పండు' తింటేనే ఏదో ఘోరం జరిగిపోతుందనీ దేవుడు శపిస్తాడనీ అనుకుంటూ అనుక్షణం భయపడుతూ ఉండే అనాగరిక స్థితిలో వారి సృష్టి మొదలైంది.వారికి తెలిసినదే నిజం అని వారనుకున్నారు.కానీ మన పురాణాలు చదివితే అసలు సత్యం ఏమిటో వారికి తెలుస్తుంది.వారనుకున్న 'సృష్టి మొదలు' సమయానికి అసలైన సృష్టి మొదలై కోటానుకోట్ల సంవత్సరాలు గతించాయి.

భూమీ సముద్రమూ ఆకాశమూ అబద్దాలు చెప్పవు.పురావస్తు ఆధారాలు అబద్దాలు చెప్పవు.ఇన్నాళ్ళూ రాముడూ కృష్ణుడూ అబద్దాలని క్రైస్తవ మిషనరీలు దొంగ ప్రచారాలు చేశారు.ఇప్పుడు సముద్రంలో కనిపిస్తున్న 'ద్వారకానగరం' కృష్ణుడు నిజమే అని ఋజువు చేస్తున్నది.కనుక మనం మరచిపోయినా భూమీ సముద్రమూ ఆకాశమూ సత్యమేమిటో మనకు నిదర్శనాలను చూపిస్తున్నాయి.పంచభూతాలే సత్యాన్ని నిరూపిస్తున్నాయి.

మన పురాణాలలో కనిపిస్తున్న కోటానుకోట్ల యుగాల లెక్కలు నిజాలే కావచ్చని నేటి పాశ్చాత్య శాస్త్రవేత్తలే అంటున్నారు.అలా అనకపోతే వారికి గత్యంతరం లేదు.ఎందుకంటే సైన్స్ చూపిస్తున్న నిదర్శనాలు మన పురాణాలలోని లెక్కలకు అతి దగ్గరగా ఉంటూ వారిని నివ్వెరపరుస్తున్నాయి.

కారల్ సేగన్ అనే శాస్త్రవేత్త ఇలా అంటున్నాడు.

"The Hindu religion is the only one of the world's great faiths dedicated to the idea that the Cosmos itself undergoes an immense, indeed an infinite, number of deaths and rebirths. It is the only religion in which the time scales correspond, to those of modern scientific cosmology. Its cycles run from our ordinary day and night to a day and night of Brahma, 8.64 billion years long. Longer than the age of the Earth or the Sun and about half the time since the Big Bang. And there are much longer time scales still."

(ఇంకా ఉన్నది)